Home వ్యాసాలు కవిత్వాస్వాదన – ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

కవిత్వాస్వాదన – ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni

గులాబీల మల్లారెడ్డి తేది 26 – 01 – 1952 రోజున తురకవాని కుంట పోతారం (జె) గ్రామం, అక్కన్నపేట మండలం,సిద్దిపేట జిల్లాలో జన్మించారు.తల్లిదండ్రులు భూదేవి,లింగారెడ్డి.తండ్రి లింగారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని నైజాం పోలీసుల వల్ల చిత్రహింసలు ఎదుర్కొన్నాడు.వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే వాడు. తాత మల్ దాదా.నాయనమ్మ ఎల్లవ్వ.తాత మల్ దాదా స్వాతంత్ర్య పోరాట యోధుడు,మొదటి బోల్షివిక్,మొదటి సెక్యులరిస్ట్ కూడా.మల్లారెడ్డి విద్యాభ్యాసం తురకవానికుంట,గుడాటి పల్లె,రామవరం నంగునూరు మండల కేంద్రం, హుస్నాబాద్ జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో పి.యు.సి. చదివాడు.మల్లారెడ్డి డిగ్రీ విద్యను ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్దిపేటలో చదివాడు. మల్లారెడ్డి న్యాయవిద్యను ఎల్.ఎల్.బి ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాదులో చదివాడు. మల్లారెడ్డి 1978 సంవత్సరంలో న్యాయవాదిగా బార్ కౌన్సిల్ ఆఫ్ హైదరాబాదులో ఎన్ రోల్ చేసుకున్నాడు.మల్లారెడ్డి కరీంనగర్ బార్ అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకొని 1978 సంవత్సరం నుండి న్యాయవాదిగా కొనసాగుచున్నాడు. మల్లారెడ్డి 1979 సంవత్సరం నుండి 1988 సంవత్సరం వరకు పోతారం (జె) గ్రామానికి సర్పంచ్ గా విధులు నిర్వహించి చక్కటి పేరు తెచ్చుకున్నాడు.మల్లారెడ్డి విద్యార్థిగా సిద్దిపేట డిగ్రీ కళాశాలలో చదువుతున్నప్పుడే గులాబీ పక్షపత్రికను నడిపాడు.1991 సంవత్సరంలో రైతు భారతం పక్షపత్రికను ప్రారంభించి ఐదు సంవత్సరాలు నడిపినాడు.మల్లారెడ్డి రాసిన కవితలు,కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి.

మల్లారెడ్డి వెలువరించిన పుస్తకాల వివరాలు:

1) పల్లె పొలిమేరల్లోకి కవితా సంపుటి – 1984.

2) జర్నలిస్టు కథల సంపుటి – 1986.

3) వకాలత్  వజ్రాయుధం

  కోర్టు రణ భూమిలో వెయ్యి యుద్ధాలు వెయ్యి

  విజయాలు – 2014.

4) జనమేవ జయతే కవితా సంపుటి – 2014.

5)మల్ దాదా చారిత్రక నవల -2016.

6) నా లక్ష్యం నా గమ్యం కవితా సంపుటి -2016.

7) ఎద్దు ఎవుసం సురుకుల వైద్యం కవితా సంపుటి

   – 2019.

8) ప్రకృతి ప్రియురాలు – మానవత కవితా సంపుటి

  2020.

9) ఐదు తరాలు కథా సంపుటి – 2021.

10) ప్రేమ పవనాలు – మానవతా సౌరభాలు. (సాంఘిక నవల) (క్యాంపస్ లో సరిగమలు) – 2022.

మల్లా రెడ్డి రచించిన మల్ దాదా నవలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం అందుకున్నారు.

గుబాళించిన గులాబీల మల్లారెడ్డి కవిత్వం.  

గులాబీల మల్లారెడ్డి పల్లె పొలిమేరల్లోకి కవిత. 

సుప్రభాతం ఆగుతుందా ? కవిత.

నడవడి కవిత. 

సత్యము స్వప్నము కవిత.

ఎవరన్నారు కవిత.

జంపాల ప్రసాద్ కవిత.

ఎంత హాయి కవిత.

నిజం కవిత.

గది –హృది కవిత.

ఖైది సంకల్పం కవిత.

164 (c r p c) STATEMENT (స్టేటు మెంట్) కవిత.

చేదు మాత్ర కవిత.

నిశ్శబ్ద నిరాకార ఛాయ చిత్రాలు కవిత.

 ప్రముఖ కవి,జర్నలిస్ట్,సీనియర్ న్యాయవాది,గులాబీల మల్లా రెడ్డి కలం నుండి జాలువారిన పల్లె పొలిమేరల్లోకి కవితా సంపుటిలోని పల్లె పొలిమేరల్లోకి కవిత పై విశ్లేషణా వ్యాసం.

నాగలి పట్టి దుక్కి దున్ని బక్క చిక్కిన రైతన్నలు ఇది భారతదేశంలోని సగటు గ్రామీణ రైతు జీవిత చిత్రం.దేశంలోని 70 శాతం మంది ప్రజలు వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నారు.హలికుడైన రైతు మట్టిని నమ్ముకుని మడి చెక్కను దున్ని సేద్యం చేస్తున్నాడు.కాలం ఉంటేనే పంటలు. వర్షాధారంతో సాగుబడి అవుతున్న భూములు.వరుణుడి కరుణ లేక వర్షాలు పడక పంటలు పండవు.వరుణ దేవుని కరుణ కొరకు కప్పతల్లి ఆటలు ఆడుతారు.శ్రమను నమ్ముకున్న రైతు నాగలి పట్టి దుక్కి దున్నుతాడు.రైతు మడిలో పశువుల పేడ ఎరువుగా వాడతాడు.రైతు పొలం మడి చెక్క తయారు కావడానికి ఎన్నో సార్లు దున్నుతాడు.పొలం మడి తయారు కాగానే వరి నాట్లు వేస్తాడు.పచ్చ పచ్చని పైరు తయారై పొలం వరి గొలుసులు వేస్తే చూసి ఆనందిస్తాడు.రైతు ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసికొని కష్టపడతాడు.రైతు అహర్నిశలు పొలాలు,చేనులు,చెల్కల్లో శ్రమిస్తాడు.ఈ దేశంలో కష్ట పడే వాళ్ళు ఎవరు? అంటే రైతులు అని ఠక్కున చెప్పవచ్చు.రైతు చేస్తున్న శ్రమకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉందా? లేదు అని చెప్పవచ్చు.రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమిస్తున్నది రైతు.లాభాలు దండుకుంటున్నది దళారులు.ఈ వ్యవస్థలో తరాలుగా మార్పు లేదు.నిజంగా భారత దేశంలో రైతుల దుస్థితిని కళ్ళకు కట్టినట్లు చిత్రించారు ఈ కవితలో మల్లారెడ్డి.”నా వాళ్లంతా/నాగళ్ళకు సిలువ వేయబడి/ తరతరాలుగా/ నెత్తురుని/నెత్తురు  కంటే అమూల్యమైన చెమటని/ సమాజం కోసం దారపోస్తున్నప్పుడు.” మనకు తెలిసిన బైబిల్ కథ ఏ నేరం చేయని మంచి కోసం పాటుపడిన ఏసుక్రీస్తు ప్రవక్తను సిలువ వేసి పొట్టన పెట్టుకున్న వైనం. భారతదేశంలోని రైతులు నాగళ్ళకి సిలువ వేయబడి తరతరాలుగా నెత్తురుని నెత్తురు కంటే అమూల్యమైన చెమటని సమాజం కోసం ధార పోస్తున్నారు.ఈ కవిత 1984 సంవత్సరంలో పల్లె పొలిమేరల్లోకి  కవితా సంపుటిలోని మొదటి కవిత.కవి మల్లారెడ్డి 40 సంవత్సరాల కింద పల్లె పొలిమేరల్లోకి కవిత రాసాడు.ఈ కవిత రైతులు ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక సమస్యలకు అద్దం పట్టినట్టుగా ఉంది.మల్లారెడ్డి తుర్కవానికుంట గ్రామంలో రైతు బిడ్డగా జన్మించాడు.తాత మల్ దాదా,తండ్రి లింగారెడ్డి,తల్లి భూదేవి,వ్యవసాయం చేసి జీవనం సాగించే వారు.మల్లా రెడ్డి నాన్న లింగారెడ్డి,తల్లి భూదేవితో కలిసి వ్యవసాయ పనుల్లో పాల్గొన్నాడు.“నేనొక్కడిని స్వార్థంతో/ క్యాంపస్ పొలిమేరల్లో/ నగర ఉద్యానవనాల్లో/ శాసనసభల్లో/సాంస్కృతిక సమావేశాల్లో/ కోర్టు దర్బారుల్లో.” విద్యార్థుల జీవిత ధ్యేయం చదువు. విద్యార్థుల సంకల్పం నెరవేరాలంటే యూనివర్సిటీ క్యాంపస్ లో చేరి ఉన్నత విద్య అభ్యసించాలి.యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు భావి జీవితంలో ఉపాధ్యాయులుగా,వైద్యులుగా,ఇంజనీర్లుగా, న్యాయవాదులుగా,తాసిల్దారులుగా,వ్యవసాయ అధికారులుగా,బ్యాంకు ఉద్యోగులుగా,రక్షణ,పోలీసు,పోస్ట్ ఆఫీస్,వివిధ ఉద్యోగాలలో చేరుతారు.వివిధ రకాల వృత్తులు చేపడుతారు.విద్యార్థులు క్యాంపస్ పొలిమేరల్లో చక్కగా చదువుకొని విద్యను అభ్యసిస్తారు.విద్యార్థులు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం సాగిస్తారు.రాజకీయ పార్టీల నాయకులు నగర ఉద్యానవనాల్లో చేరి పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు.ప్రజలు ఎన్నుకున్న శాసన సభ్యులు సమాజ వికాసం కొరకు పని చేయడం లేదు.పాలకులు తమ ప్రయోజనాలు నెరవేర్చుకొనుట కొరకు పని చేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న పాలకులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. పాలకులు ప్రజాసంక్షేమం కొరకు ఉపయోగించాల్సిన నిధులు దుర్వినియోగం చేస్తున్న తీరు ఆవేదన కలిగిస్తుంది.ప్రజా ప్రతినిధులు కోట్ల రూపాయల నిధులు దండుకుంటున్న వైనాన్ని ప్రశ్నించే నేతలు కరువు అయ్యారు.నిస్వార్థ నాయకుడు,ప్రముఖ పార్లమెంటేరియన్ తరిమెల నాగిరెడ్డి పార్లమెంట్ అసెంబ్లీలు బాతకాని షాపులు అని పేర్కొన్నారు.తరిమెల నాగిరెడ్డి తాకట్టులో భారతదేశం అనే గొప్ప గ్రంథం రచించారు.ఈనాడు జరుగుతున్న సాంస్కృతిక సమావేశాలు,సమాజ అభ్యున్నతిని కాంక్షించడం లేదు.ఏదో మొక్కుబడిగా కాలక్షేపం కొరకు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.కోర్టు దర్బారుల్లో న్యాయం జరగడం లేదు.బ్రిటిష్ కాలంలో తయారు చేసిన చట్టాలు ఇంకా అమలులో ఉన్నాయి.చట్టంలోని లొసుగుల వల్ల నేరస్తులు తప్పించుకు తిరుగుతున్నారు.నేరస్తుల నేర నిరూపణ కావడం లేదు.దీనికి తోడు పోలీసులు నేరస్తుల కొమ్ము కాస్తున్నారు. ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలు ప్రవేశ పెట్టక పోవడం వల్ల కోర్టులో కేసులు వీగిపోతున్నాయి.పోలీసులు, ప్రాసిక్యూటర్లు,జడ్జీలకు కూడా అవినీతి చీడ తగిలింది.జడ్జీలు ఆమ్యామ్యాలు అందుకొని తీర్పులు తారుమారు చేసి న్యాయాన్ని నిలువునా పాతేస్తున్న తీరు మనం చూస్తూనే ఉన్నాం.“పుచ్చు విత్తనాల్లాంటి వాగ్దానాలతో”.కవి మల్లా రెడ్డి  వాగ్దానాలను పుచ్చు విత్తనాలతో పోలుస్తున్నాడు.పుచ్చు విత్తనాలు మొలకెత్తవు.నిజంగానే కొన్ని సీడ్స్ కంపెనీలు పుచ్చు విత్తనాలు మంచి విత్తనాలు అని నమ్మించి రైతులను మోసం చేస్తున్నారు.అమాయకమైన రైతులు పుచ్చు విత్తనాలు కొని మోసపోతున్నారు.రాజకీయ నాయకులు గెలుపు కోసం శుష్కమైన వాగ్దానాలు చేస్తారు.ఓట్ల కొరకు ఓటర్లకు గాలం వేస్తారు.అమాయక ఓటర్లకు సారా తాగిస్తున్నారు. తినిపిస్తున్నారు.డబ్బులు పంచుతున్నారు.ప్రలోభాలకు గురి చేసి ఓట్లను కొల్లగొడుతున్నారు.అవినీతిపరులైన రాజకీయ నాయకుల వాగ్దానాలకు లొంగితే ఐదు సంవత్సరాలు మోసపోవడం ఖాయం అని కవి మల్లా రెడ్డి చెబుతున్నాడు.. “చెదలు పట్టిన చేతులతో/ శవం లాంటి మనిషిలా బతకలేను/ అందుకే/పల్లె పొలిమేరల్లోకి వెళుతున్నాను/ నన్నక్కడే నా వాళ్ళతో/నాగళ్ళకి సిలువ వేసినా సరే/కంకర కొడుతున్న వాళ్లతో/కాంక్రీట్ చేసినా సరే/అక్కడే కోయిలనై/ఇష్టమొచ్చిన కొత్త గానం చేస్తాను.” చెదలు పట్టిన చేతులతో వెళుతున్నాను అని అంటున్నారు.చేతులు ఎక్కడన్నా చెదలు పడతాయా? చేతులు చెదలు పడవని మన అందరికి తెలుసు.కవి మల్లారెడ్డి భావన చక్కగా ఉంది.వేమన ఏమన్నాడు.పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా అన్నాడు.శవంలాంటి మనిషిలా బతకలేను. మనిషి చనిపోతే శవం అంటారుశవాన్ని కొందరు ఖననం చేస్తారు.శవాన్ని కొందరు దహనం చేస్తారు.ఇన్నాళ్లు బతికిన మనిషి ఏదో ఒక రోజు జీవితాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే.ఆ శవాన్ని ఎవ్వరు ఇంటి ముందు ఎక్కువ సేపు ఉంచరు.తొందర తొందరగా పాడె కట్టి డప్పులతో శవాన్ని తరలిస్తారు. చనిపోయిన మనిషి అంత్యక్రియల వేడుకల్లో కుటుంబ సభ్యులు,స్నేహితులు,బంధువులు అందరు పాల్గొంటారు. శవంలాంటి మనిషిలా బతకలేను.శవం ఎక్కడైనా బతుకుతుందా?శవం ఎప్పుడు బతకదు.జీవం లేని శవం వలె బతకను.అందుకే పల్లె పొలిమేరల్లోకి వెళుతున్నాను.కల్లా కపటమెరుగని పసిపిల్లల్లాంటి పల్లె జనులైన రైతులతో కలిసి పోతాను.నన్నక్కడ నా వాళ్ళతో నాగళ్ళకి సిలువ వేసినా సరే.ఈ దేశంలో రైతు నాగళ్ళకి సిలువ వేసినప్పటికి దుక్కి దున్నడం మానలేదు.అనాదిగా రైతు వ్యవసాయం చేస్తు జీవనం సాగిస్తున్నాడు.రైతు పండించిన పంటతో జనానికి తిండి పెడుతున్నాడు.కంకర కొడుతున్న వాళ్లతో కాంక్రీట్ చేసినా సరే. వడ్డెరలు గుట్టలు తొలిచి కంకర రాళ్లు తయారు చేస్తారు.కంకర రాళ్లతో ఇల్లు నిర్మాణం చేస్తారు.కంకర రాళ్లు లేకుండా పునాదులే ఉండవు.పునాదులు లేకుంటే ఇండ్లు ఉండవు.రోడ్లు కూడా కంకర రాళ్లతో వేస్తారు.కంకర కొడుతూ జీవనం సాగిస్తున్న వడ్డెర వాళ్ళ శ్రమని స్వేదాన్ని గుర్తుచేస్తున్నాడు.కొండలు పగలేసినం బండలనే పిండినం శ్రమ ఎవడిదిరో సిరి ఎవడిదిరో చెరబండ రాజు కవిత గుర్తుకొస్తుంది.గ్రానైట్ కంపెనీలు వచ్చి గుట్టలు మాయమవుతున్నాయి.ప్రకృతి ప్రసాదించిన వరాలు గుట్టలు.గుట్టలు లేకుంటే పల్లె సోయగం మారిపోతుంది. గుట్టలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం గుట్టల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.వసంత మాసం రాగానే కోయిల కూస్తుంది.కోయిల కుహు కుహు రాగాలు వింటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.ప్రకృతికి పర్యాయపదంలా ఉన్న పల్లెలో కోయిలనై ఇష్టం వచ్చిన కొత్త గానం చేస్తాను అని కవి చెప్పిన తీరు చక్కగా ఉంది.భావితరానికి పల్లె పొలిమేరల్లోకి కవిత స్ఫూర్తిని అందిస్తుంది.స్వార్థం పరమార్థంగా బతుకుతున్న పాలకుల తీరును చూసి దిగులు కలుగుతుంది.ఈ దేశంలో రైతు మాత్రమే స్వేదం చిందించి అందరి ఆకలిని తీరుస్తున్నాడు.కవి మల్లారెడ్డి చక్కటి కవిత అందించినందుకు అభినందిస్తున్నాను.రైతే రాజు,జై కిసాన్,అన్నదాత సుఖీభవ అనే నినాదాలు వెలవెలబోతున్నాయి.స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆమృతోత్సవాలు జరుపుకుంటున్నాము. అయినప్పటికి రైతు జీవితంలో ఎలాంటి మార్పు లేదు.రైతు జీవితంలో ఎలాంటి మార్పు రాదు అనే తీరుగా పాలకులు వ్యవహరిస్తున్నారు.ఈ దేశంలోని రైతులు ఆత్మహత్యలు లేని వారై ఉండాలి.రైతుల జీవితాల్లో వెలుగులు విరజిమ్మాలని కోరుకుందాం.కవి మల్లా రెడ్డి ఆశావాది.రైతు శ్రేయస్సు కోసం అహరహం కాంక్షించే వ్యక్తి అని కవితలోని భావాలు తెలియ జేస్తున్నాయి.కవి మల్లారెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

ప్రముఖ కవి,జర్నలిస్ట్,సీనియర్ న్యాయవాది, గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన పల్లె పొలిమేరల్లోకి కవితా సంపుటిలోని సుప్రభాతం ఆగుతుందా? కవిత పై విశ్లేషణా వ్యాసం.సుప్రభాతం ఆగుతుందా ?కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.కవి మల్లారెడ్డి ఈ కవితను 1984 సంవత్సరంలో రాసాడు. దాదాపుగా 40 ఏళ్లు అవుతుంది.ఆనాటి కాలమాన పరిస్థితులు సామాజిక స్థితిగతులకు అద్దం పడుతుంది.కవిత ఇప్పుడే రాసినట్టుగా అనిపిస్తుంది.ఈనాటికి సమాజంలో మారని సామాజిక సమస్యలు,కొరకరాని కొయ్యలుగా తయారయ్యాయి.సుప్రభాతం అంటే తెలుగులో శుభోదయం. ఆంగ్లంలో గుడ్ మార్నింగ్ అని అర్థం. ఇవ్వాళ ఉదయాన్నే లేచి ఎంత మంది శుభోదయం, గుడ్ మార్నింగ్ చెపుతున్నారు. ఉదయాన్నే ఎంత మంది నిద్ర లేస్తున్నారు.రాత్రి తొందరగా నిద్రపోతే ఉదయాన్నే కోడి కూసే వేళకు లేవగలుగుతారు.Early to bed early to rise makes the man healthy,wealthy and wise.అని ఆంగ్లంలో సూక్తి ఉంది.ఈనాటి పెద్దలు,పిల్లలు గుడ్లగూబల్లా రాత్రంతా మెలకువతోనే ఉంటే ఉదయాన్నే నిద్ర లేవడం సాధ్యం కాదు గదా.వాడ వాడలా వెలిసిన మన దేవాలయాలు ఉదయాన తెరుచుకోవడం లేదు.ఉదయాన్నే గుడిలో వెంకటేశ్వర సుప్రభాతం,విష్ణు సహస్రనామాలు వినిపించడం లేదు.భక్తులు బారెడు పొద్దెక్కిన తరువాత లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాదికాలు పూర్తి చేసుకుని గుడికి చేరి పూజలు చేస్తారు.పూజారులు,భక్తులు వచ్చే వేళకు వచ్చి గుడి తలుపులు తెరుస్తారు.పూజారులు దేవుని పూజ చేసి  భక్తులకు హారతి ఇస్తారు.మన శాస్త్రాలు,పూజా విధానాలు మనిషిని సన్మార్గం పై పయనించడానికి తోడ్పడడం లేదు.ఏదో మొక్కుబడి కొరకు పూజలు పునస్కారాలు జపం వగైరా చేస్తున్నారు.చిత్తం ఏమో శివుని మీద మనసు ఏమో గుడి బయట విడిచి వచ్చిన చెప్పుల మీద ఉంటుంది.శివుని శరణాగతి ఎలా దొరుకుతుంది?మనకు  పొద్దున్నే తెలిసిన వారు ఇరుగు పొరుగు వారు కనిపిస్తే ఆప్యాయంగా పలకరించాలి.కవి మల్లారెడ్డి కవితకు సుప్రభాతం ఆగుతుందా ? అని  పేరు పెట్టాడు.సుప్రభాతం ఏనాడు ఆగదు.ఆగిన సందర్భాలు లేవు. రోజుకు 24 గంటల సమయం.కాలచక్రం గిర్రున తిరుగుతుంటుంది.ప్రభాత వేళ సముద్రం చెంతకు చేరి మనం వీక్షిస్తే ఎంతో గమ్మత్తుగా హాయిగా ఉంటుంది.అలలు తీరానికి చేరాలని తహతహలాడుతుంటాయి.అలలు సవ్వడి యొక్క అనుభూతి మాటల్లో వర్ణించలేం.మనసుకు చెప్పలేనంత  ఆహ్లాదంగా అనిపిస్తుంది.”నేను నా మిత్రులంతా/                                         
అర్ధరాత్రి పెంకుటింట్లో”.ఆ కాలంలో నేను నా మిత్రులం అందరం కలిసి స్నేహంగా ఉండేవాళ్ళం.ఈ రోజుల్లో ఎవరైనా అర్ధరాత్రి పెంకుటింట్లో మిత్రులతో కలుస్తున్నారా? లేదు అని చెప్పవచ్చు.నాడు అర్ధరాత్రి పెంకుటింట్లో మిత్రులం అంతా కలుసుకునే వాళ్ళం అంటే విస్మయం కలిగించవచ్చు.ఈ కాలం పిల్లలకు పెంకుటిల్లు ఉంది అనే సంగతి తెలువదు.మన పెంకుటిల్లు మన సంస్కృతికి అద్దం పడుతుంది.భావి తరాలకు పెంకుటిల్లు ఉందనే సంగతి సుప్రభాతం ఆగుతుందా? కవిత చదివితే,మనకు గుర్తుకు వస్తుంది.ఒకప్పుడు 50 ఏళ్ల కింద ఎటు చూసినా అన్ని పెంకుటిండ్లు మనకు దర్శనమిచ్చేవి.పల్లెల్లో ఒకరో ఇద్దరో ధనవంతులు ఉండే వారు.ధనవంతులు కట్టుకున్న పెద్ద పెద్ద లోగిళ్ళతో పెద్ద భవంతులు కనువిందు చేసేలా,రాజ భవనాలను తలపించేలా ఉండేవి.పల్లెల్లో స్తోమతను బట్టి చిన్నవి పెద్దవి పెంకుటిండ్లు ఉండేవి.మంచి గాలి,వెలుతురు వచ్చేటట్లు విశాలంగా ఇల్లు కట్టుకునే వారు.ప్రతి ఇంటి ముందు పందిరి,చెట్లు చేమలు,పెరడు మరియు పశువుల కొరకు ప్రత్యేకంగా దొడ్డి ఉండేది.కష్టం చేసి ఇష్టంగా కట్టుకున్న పెంకుటిల్లు యజమానులు ఇష్ట దైవమైన పరమాత్మను చేరుకున్నారు.తండ్రులు కట్టిన పెంకుటిల్లలో కుమారులు మాత్రం నివసించడం లేదు.ఆనాటి ఆ పాత ఇంటిలో నివసించడం నామోషీగా భావిస్తున్నారు.అలనాటి పెంకుటింటిలో ఎవ్వరు ఉండటం లేదు.పల్లెల్లో ఉన్న పెంకుటిండ్లు అన్ని ఆలనా పాలన లేక శిథిలమై కూలి మట్టిలో కలుస్తున్నాయి.ఇప్పటి వారు కొత్త కొత్తగా బిల్డింగులు రోడ్డుకు ఇరుపక్కల కట్టుకుంటున్నారు. కొత్త పల్లె రోడ్డును చేరింది.పాత పల్లె శిథిలావస్థకు చేరి ఒట్టిపోయిన గోవులా ఎవరు పట్టించుకోని ఈ విధంగా అలానే ఉండి పోయింది.”చిందర వందరగా పడి ఉన్న/ సమస్యల పుస్తకాల మధ్యన కూర్చుండి మాట్లాడుకునేది/నేడావరించిన చిమ్మ చీకట్లను గూర్చి /లక్షల మిలియన్ జీవుల కళ్ళలోని ధైన్యం గూర్చి/  లేదా/రేపటి మహా సుప్రభాతం గూర్చి”. ఇవ్వాళ పల్లెలో పట్నంలో స్నేహితులు ఒక్కచోట కూర్చుండి ఏం చేస్తుంటారు. కాలక్షేపానికి ఉబుసుపోక కబుర్లు చెబుతూ గడుపుతుంటారు. పేకాట ఆడుతారు.తింటారు.తాగుతారు.సమయాన్ని ఖూనీ చేసి ఎంజాయ్ చేస్తుంటారు.షికారుకు వెళతారు..కొందరు ఉదయం పూట వాకింగ్ చేస్తుంటారు.వాకింగ్ లో కూడా పనికి రాని చెత్త కబుర్లతో పకపకలు వికవికలు చేస్తుంటారు.ఎవరి కొంపలు ముంచుదాం‌.తిందాం.తాగుదాం.అసూయ అనే రోగంతో రగిలి పోతుంటారు.తప్పుడు కేసులు పెడతారు.తప్పుడు సాక్ష్యాలు తయారు చేస్తారు.తప్పుడు పనుల్లోనే తేలియాడుతుంటారు. ప్రయోజనకరమైన పనుల గురించి ఆలోచించరు.వాకింగ్ చేస్తున్న వాళ్లు సరైన శ్వాస తీసుకోవాలి.పీల్చేగాలి,వదిలే గాలి సమంగా ఉండాలి.అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు. మౌనంగా ఉండాలి.తోటి వారిని ఆప్యాయతగా పలకరించాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.ఇవి ఎవరైనా పాటిస్తున్నారా? లేదు అని చెప్పవచ్చు.పేదరికం ఒక శాపంగా మారింది.అసమానతలు బీద,గొప్ప తేడాలు పెచ్చు పెరిగి పోయాయి.కరువు కాటకాలతో పంటలు సరిగా పండడం లేదు.రైతులు తీవ్రమైన నిరాశా నిస్పృహలకు గురి అయి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.పూర్వం రైతుల ఆత్మహత్యలు ఏనాడు కని విని ఎరుగం.రైతుల ఆత్మహత్యలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.అయినప్పటికీ రైతులు వ్యవసాయం పట్ల నమ్మకంతో పంటలు పండిస్తున్నారు.పడరాని పాట్లు పడుతున్నారు.చాలామంది రైతు కూలీలు ఊళ్లో చేసేందుకు పని లేక ఉన్న ఊర్లో బతుకు గడవక వలసలు పోతున్నారు.ప్రాణంగా పెంచుకున్న పశువులకు మేత లేక వాటి గోస చూడలేక అంగడిలో అమ్ముకుంటున్నారు.పశువులు అంగడి నుండి కబేలాకు తరలి పోతున్నాయి.బతుకు తెరువుకు వలస ఒకటే మార్గం అయింది.పెద్దవాళ్లు ఇంటి పట్టునే ఉండి కలో గంజి తాగి బతుకుతున్నారు.పెద్దవాళ్లు తమ సంతానంతో పట్టణానికి వెళ్ల లేరు.పెద్దవాళ్లు తమ సంతానం తమ వద్ద లేకుండా పల్లెల్లో ఉండలేరు.అయినప్పటికీ ఏదో జీవితాన్ని పల్లె పట్ల ఉన్న గాఢమైన అభిమానంతో రోజులు నెట్టుకు వస్తున్నారు. పల్లెలో ఎటు చూసినా ఆవరించిన చీకటి బతుకులు.లక్షల మిలియన్ జీవుల కళ్ళలోని  ధైన్యం గూర్చి ఆలోచించే కవులు, కళాకారులు మాత్రమే ఉన్నారు.సంపద ఉన్నవాడి అబ్బ సొత్తు కాదు.సంపదను అందరూ సమానంగా పంచుకు తినాలి అని కమ్యూనిజం చెప్తోంది.కమ్యూనిజం మూల బీజాలు భారతదేశంలో ఉన్నాయి.లెనిన్ నాయకత్వంలో సోవియట్ రష్యా అభివృద్ధి పథంలో సాగింది.లెనిన్ మరణం తర్వాత స్టాలిన్ నాయకత్వంలో రష్యాను మరింత బలోపేతం చేసి అభివృద్ధి పథంలో నడిపించాడు.సోవియట్ రష్యా దేశం యొక్క స్ఫూర్తిని అందుకొని మన తెలంగాణలోని కమ్యూనిస్టు నాయకులు నిజాంకు వ్యతిరేకంగా సాయుధపోరాటం సాగించారు.1946 నుండి 1951 వరకు సాయుధ పోరాటం కొనసాగింది.తెలంగాణ సాయుధ పోరాటంలో 4,000 మంది వీరులు అమరులయ్యారు.బ్రిటిష్ వారు కమ్యూనిస్టు పార్టీ పై నిషేధం విధించారు.కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అనుచిత నిర్ణయాల వల్ల సాయుధ పోరాటం ఆపివేయబడింది.సాయుధ పోరాటం విజయం సాధిస్తున్న దశలో కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరగకుండా జాతీయ ప్రజాతంత్ర విప్లవం రాకుండా కాంగ్రెస్ అభివృద్ధి నిరోధక శక్తులు అడ్డుకున్నాయి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా అమృతోత్సవాలు జరుపుకుంటున్నాము.ఇప్పటికీ ప్రజల కనీస అవసరాలు తీర లేదు.కూడు,గూడు,గుడ్డ,విద్య అందరికీ అందడం లేదు.ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదు. సామాన్యుడి జీవితం ఎండమావిలా తయారైంది.ఆరుగాలం కష్టం చేసిన ప్రజలు అర్థాకలితో మలమలమాడుతున్నారు. వ్యవసాయక విప్లవం రాలేదు.దున్నేవాడికి భూమి లేదు.పేదలు మరింత పేదలుగా మారారు.రైతులు,రైతుకూలీలు తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నారు.పల్లెల్లో మరియు పట్టణాల్లో నిరుద్యోగం పెరిగిపోయింది.ఎటు చూసినా వైరుధ్యాలు. పాలకులు ప్రజలను వంచన చేస్తూ పబ్బం గడుపుతున్నారు.రేపటి మహా సుప్రభాతం గురించి ఆలోచించే కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలు, భావజాలం, మన దేశం మూలాల్లో పరివ్యాప్తమై ఉంది.కవులు,కళాకారులు ఎల్లెడలా సమాజాన్ని చైతన్యం చేస్తూ జాగృతపరుస్తున్నారు.  ప్రజలు తమ హక్కుల కోసం చైతన్యంతో పోరాడుతున్నారు. సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉంది.సంపన్నులు పేదల రక్తాన్ని జలగల్లా తాగుతున్నారు.సంపన్నులు కోట్ల కొద్ది ధనాన్ని స్విస్ బ్యాంకుల్లో కూడ బెడుతున్నారు.“మీ ఆస్తుల్ని కొల్లగొట్టాలని కాదు”.పేదల ఆస్తుల్ని కొల్లగొట్టింది ఎవరు?ధనికులు,అవిద్య, అజ్ఞానం, అమాయకత్వం, ఆసరా చేసుకుని పేద ప్రజలకు అప్పులు ఇచ్చి వడ్డీల కింద వారి శ్రమను దోచుకుంటున్నారు. పేదలు సంవత్సరాల తరబడి ధనికుల ఇళ్ళ ముందు కావలి కుక్కల్లా కాపలా ఉండి ఊడిగం చేసిన తీరని అప్పులు తీరడం లేదు.పేదలకు ఉన్న కొద్దిపాటి భూమిని అప్పుల కింద జమ కట్టుకొని ఆస్తుల్ని జప్తు చేస్తున్న వైనం ఇంకా కొనసాగుతూనే ఉంది .పేదల ఆస్తులు కొల్ల గొట్టింది ధనికులేనన్నది సత్యం.పేదల అవసరాలను అసరాగా చేసుకుని అప్పులు ఇచ్చేవారు.ధనికులు ఏం చేసినా చెల్లుబాటు అయ్యేది.పేదలు బాధలను కన్నీటి మాటున దాచుకునేవారు. ధనికులు పేదల ఇళ్లకు నిప్పు పెట్టేవారు.“రక్తపాతం సృష్టించాలని అంతకంటె కాదు”.రక్తపాతం సృష్టించాలని పేదలు ఎన్నడు భావించలేదు. ధనికులు చేస్తున్న దుర్మార్గం అన్యాయం అని ఎదురు తిరిగితే నక్సలైట్ అని చెప్పి పోలీసుల చేత ఒళ్ళు హునం అయ్యేలా దారుణంగా హింసింప జేసేవారు.పోలీసులు ఎన్ కౌంటర్  పేరిట అమాయక పేద జనాలను చంపుతున్నారు.రక్తపాతం సృష్టించేది.పేదల గృహాలు దహనం చేసేది ధనికులే.ధనికులు చెప్పిన మాట వినకపోతే రక్తపాతం సృష్టిస్తారు.ధనవంతులు పదవులు పొంది కోట్ల కొద్ది సొమ్మును,తరతరాలు తిన్నా తరగని ఆస్తులు కూడ బెట్టారు. పేదలు పదవులు పొందిన దాఖలాలు ఉండవు.పేదలు పదవిలో ఉన్నా నామ్ కే వాస్తే.అధికారం దర్పం చలాయించేది ధనిక మహారాజులే.ధనికులు ఎలక్షన్లలో గెలవడానికి ఎన్ని జిత్తుల మారి పనులనైనా చేస్తారు.ధనికులు ఎన్నికలు అయ్యే వరకు ప్రజలతో వినయంగా ఉంటారు.ధనికులు పేద ప్రజలకు బాగా తినిపిస్తారు,తాగిస్తారు.ధనికులు పేద ప్రజలను మాయలో ముంచేస్తారు.ధనికులు పేద ప్రజలను ఆ దొరకే ఓట్లు వేస్తాం అనేటట్లు చేస్తారు.పేదల ఓట్లతో గెలిచిన దొర పదవులు అందుకుంటాడు.పేదలు ఎక్కడైనా పదవులు పొందారా ? పేదలు పదవులు పొందడం అనేది కల్ల మాట.పేదలు ధనికులు వద్ద పనిచేస్తూ పేదలుగానే మిగిలిపోతారు. “వాటిపై ఆశ ఉంటే” .పదవుల పై ఆశ ఉంటే మేము ఎన్నికల్లో పచ్చి అబద్ధాలు చెప్పే వాళ్ళమే.ఎన్నికల్లో పచ్చి అబద్ధాలు చెబుతున్నది ఎవరు? రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు చేస్తున్నది ఏమిటి? రాజకీయ నాయకులు అబద్ధాలతోనే రోజును ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులు అబద్దాలతోనే జీవితం గడిపేస్తారు. రాజకీయ నాయకులు మాటల మాంత్రికులు.రాజకీయ నాయకులు మాయల మరాఠీలు.రాజకీయ నాయకులు ఏ పని చేయరు.రాజకీయ నాయకులు వాగ్దానాలు మాత్రమే చేస్తారు. రాజకీయ నాయకులు ప్రజలకు చేసేది ఏమీ ఉండదు.రాజకీయ నాయకులు ప్రజలను మభ్య పెట్టడంలో నిష్ణాతులు అని చెప్పవచ్చు. ”మోసం దగా చేయ రాక కాదు”.పేద ప్రజలను మోసం దగా చేస్తున్నది ఎవరు?రాజకీయ నాయకులు పేద   ప్రజలను మోసం దగా చేసి ఎలక్షన్లలో గెలుస్తున్నారు.పేద ప్రజలపై రాజకీయ నాయకులు చేస్తున్న మోసం,దగా ఎన్నాళ్ళు ఉంటుంది?పేద ప్రజలు అజ్ఞానం,అవిద్యలో ఉన్నంతకాలం రాజకీయ నాయకులు దగా చేసి మోసగిస్తారు. ”మనస్సును చంపుకోలేక,రాజకీయ నాయకులకు మనస్సు అనేది లేదు.  రాజకీయ నాయకులు మాయకులోనై వంచనకు పాల్పడుతున్నారు.సజ్జనులు నిర్మలమైన మనసుతో ధర్మం, న్యాయం,నీతితో వ్యవహరిస్తారు.సజ్జనుల వ్యవహారంలో లోపం ఉండదు.సజ్జనులు ప్రజా సంక్షేమం కొరకే జీవిస్తారు.ఇప్పుడున్న వ్యవస్థలో మానవత్వం విలువల గురించి మాట్లాడితే వాటి వలువలు ఒలుస్తున్న బడా బాబుల  తీరు చూస్తే జుగుప్స కలిగిస్తుంది.”మానవతని హత్య చేయ లేక”.మానవతని హత్య చేస్తున్నది ఎవరు?మానవతని హత్య చేస్తున్నది రాజకీయ నాయకులు అని చెప్పవచ్చు.రాజకీయ నాయకులు ఎప్పుడూ ద్రోహబుద్ధి,ద్రోహచింతనతో గడుపుతు పేద ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు.మనస్సును చంపుకొని ఘోరాలు నేరాలు చేసి అందలాలేక్కుతూ అధికార పీఠాన్ని రాజకీయ నాయకులు అధిరోహిస్తున్నారు.పేద ప్రజలు మాత్రం మనసును చంపుకొని జీవచ్చవంలా బతుకు గడుపుతున్నారు.”ఈ తపన/ఈ తపస్సు/ఈ యజ్ఞం/ఇది మా నేరమని, కుట్రని/ /మా కలాలకు చేతులకు సంకెళ్లు వేస్తే/రానున్న సుప్రభాతం సుప్రభాతం ఆగుతుందా?”.భారతదేశంలో నివసిస్తున్న కవులు, కళాకారులు,తపనతో సమాజం యొక్క అభివృద్ధి కొరకు ఇతోధికంగా పాటు పడుతున్నారు.కవులు,కళాకారులు తమ జీవితాలను తపనతో పోరుబాటలో కొనసాగిస్తున్నారు.కవులు, కళాకారులు తమ దారిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా నమ్మిన లక్ష్యం కోసం న్యాయమైన బాటను విడవడం లేదు.పూర్వ కాలంలో మునులు దేవుడు ప్రత్యక్షం కావాలని తపస్సు చేసే వారు.వారు చేస్తున్న తపస్సుకు మెచ్చి దేవుడు ప్రత్యక్షమై వారి కోరిక నెరవేర్చేవాడు.కాని ఈనాడు కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల సరైన అవగాహనతో ప్రజా యుద్ధం చేస్తూ ప్రజల కొరకే జీవితాలను అంకితం చేసిన నిస్వార్థ నాయకులు తరిమెల నాగిరెడ్డి,దేవులపల్లి వెంకటేశ్వరరావు,పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి లాంటి ఎందరో మహనీయులు సమాజం కోసం పాటుపడ్డారు.యజ్ఞం చేస్తే వాతావరణం పరిశుద్ధం అవుతుందని వేదం చెబుతుంది.రామాయణ కాలంలో ప్రతి ఇంట హోమం చేసేవారు.శుభకార్యాల ముందు హోమం చేస్తారు. హోమంలో సమిధలను ఆహుతి ఇస్తారు. కవులు, కళాకారులు  సమిధల్లా ఆహుతి అయిన చరిత్ర మనకు ఉంది.కవులు, కళాకారులకు జోహార్లు చెప్పాలి.గద్దరు రాసిన పాటలు ప్రజా కోటికి శిరోధార్యం అయ్యాయి.గద్దర్ పాటల్లో ప్రజా జీవితం తొంగి చూస్తుంది.తెలంగాణ కొరకు తపనతో తపస్సుతో ఉద్యమాలు చేశారు.1200 మంది విద్యార్థులు అమరులు అయ్యారు. ధూంధాం పేరిట పల్లె పల్లెనా ప్రజలను చైతన్యం చేస్తూ కవులు, కళాకారులు ప్రదర్శనలను ఇచ్చారు.కళాకారులు,గాయకులు గజ్జె కట్టి పాడితే హృదయాల లోతుల్లోకి పాట చొచ్చుకు పోతుంది.కవులు ప్రజల కోసం తమ కలాలు ఎక్కుపెట్టి రాస్తున్నారు.పీడిత ప్రజల పక్షాన తమ హక్కుల కోసం పోరాడుతున్నారు.ప్రజా కళాకారులు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు,వాళ్ల హక్కులను తెలియజేస్తూ గజ్జె కట్టి గళాల నెత్తి పాడుతున్నారు.ప్రదర్శనలు ఇస్తున్నారు.ప్రజాక్షేమం కాంక్షించి పాటల ద్వారా కళారూపాల ద్వారా ప్రదర్శన చేస్తున్న కవులు, కళాకారులు ప్రజలను కర్తవ్యం వైపుగా సాగేటట్లు చేస్తున్నారు. ప్రజల కోసం పాటు పడుతున్న కవులు,కళాకారులది కుట్రని మా కలాలకు చేతులకు సంకెళ్లు వేస్తే రానున్న సుప్రభాతం ఆగుతుందా? సుప్రభాతం ఏనాడు ఆగదు.ఉదయించిన సూర్యుడు అస్తమించక మానడు.మళ్లీ సూర్యుడు ఉదయిస్తాడు.సుప్రభాతం కొనసాగుతుంది.వేనవేల సూర్య కిరణాలై అక్షర కళాకారులు చేస్తున్న ప్రదర్శనలు దీక్షలు ఎన్నడు ఆగవు.రానున్న సుప్రభాతం ఆగదు అని కవి మల్లారెడ్డి ఘంటాపదంగా చెబుతున్నాడు.కవి మల్లారెడ్డి ఆశావాది,తన కలాన్ని పదునుపెట్టి ప్రజాపక్షం వైపున నిలిచి తన రచనల ద్వారా ప్రజలను మేల్కొల్పుతున్నాడు.చక్కటి కవితను అందించిన కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను.కవి మల్లారెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని,సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడాలని మనసారా కోరుకుంటున్నాను.

ప్రముఖ కవి,జర్నలిస్టు,సీనియర్ న్యాయవాది,గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన పల్లె పొలిమేరల్లోకి కవితా సంపుటిలోని నడవడి కవిత పై విశ్లేషణా వ్యాసం.నడవడి కవితను ఆసక్తితో చదివాను.నాలో ఆలోచనలు రేకెత్తించింది. నడవడి గల వ్యక్తులను మంచివాళ్లు అంటారు.నడవడి గల వాళ్లు పద్ధతి ప్రకారం నడుచుకుంటారు.నడవడి గల వాళ్లలో రీతి రివాజు వారి సొంతం అని చెప్పవచ్చు.ఇతిహాసం తిరగేస్తే మనకు మర్యాదా పురుషోత్తముడైన శ్రీ రామచంద్రుడు మన కళ్ళ కెదురుగా ప్రత్యక్షమవుతాడు.మాటమీద నిలబడే వ్యక్తిని మనం ఎక్కడైనా చూసామా?తండ్రి అయిన దశరథ మహారాజు మాటను మన్నించి రాముడు 14 ఏళ్ళు వనవాసం చేశాడు. రామాయణంలో మహర్షి వాల్మీకి శ్రీరాముడిని ధీరోదాత్తుడైన వ్యక్తిగా తీర్చిదిద్దాడు.ఏ భాషలో కూడా ఇంత  గొప్ప కావ్యం రాయబడ లేదు.శ్రీరాముడిని మంచి నడవడి కల వాడు అని లోకమంతా భావిస్తుంది.ఈ కాలంలో మంచి నడవడి కల  వాళ్లలో ప్రపంచమంతా శ్లాఘిస్తున్న మహాత్మా గాంధీ ఒకడు. మంచి నడవడి లేని వాళ్లను చూసి లోకమంతా అసహ్యించుకుంటుంది.నడవడి లేని వాళ్లను గురించి చెప్పాలంటే రజాకార్లు మరియు దోపిడీలు దొంగతనాలు చేసే పిండారీలను చెప్పవచ్చు.రజాకార్లు చేసిన అకృత్యపు నీచమైన పనుల వల్ల నిజాం రాజుకు చెడ్డపేరు వచ్చింది.నిజాం రాజ్యం సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ నేతృత్వంలో జరిగిన సైనిక తిరుగుబాటుకు నిలువెల్లా కూలిపోయింది.సెప్టెంబర్ 17న ప్రతి ఏటా తెలంగాణ విమోచన దినం జరుపుకుంటున్నాం.మా నిజాం రాజు  తరతరాల బూజు అని మహాకవి దాశరథి కలం నుండి వెలువడింది.పిండారీలు మొత్తం గ్రామాన్ని దోచుకునే వారు. అత్యాచారాలు చేసే వారు.అడ్డు వచ్చిన వాళ్లను చంపేసే వారు.అందుకే పిండారీ నా కొడుకులు అనే సామెత వెలిసింది.పిండారీల దారుణ దురంతాలను దేశమంతా ఎదుర్కొంది.”పోలీసు మిత్రులారా !/ మీలో కొన్ని ఆటవిక మృగాలు/ప్రవేశించాయని తెలిసాక వ్రాస్తున్నాను ఈ లేఖ”.       
.తప్పు చేసిన వాళ్లను గౌరవించే సంస్కారం భారతీయుల్లో అనాదిగా వేదకాలం నుంచి ఉంది.అటువంటి భావ జాలాన్ని నర నరాల్లో పుణికి పుచ్చుకున్న కవి మల్లారెడ్డి వృత్తిరీత్యా సీనియర్ న్యాయవాది,ప్రవృత్తిరీత్యా కవి,పోలీసు మిత్రులారా అని సంబోధించడం వారి యొక్క తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న సంస్కారాన్ని తెలుపుతుంది.పోలీసుల్లో కొందరు ఆటవిక మృగాలు ప్రవేశించటం ఏమిటి?వింటుంటే చాలా చిత్రంగా ఉంది. వన్యప్రాణులైన పులులు,సింహాలు,చిరుతలు మొదలైన మృగాలు అడవుల్లో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి.అవి ఆకలి అయినప్పుడు మాత్రమే జంతువులను వేటాడి చంపి తింటాయి.ఈనాటి నవ నాగరిక నవీన మానవులు తమ స్వార్థం కోసం విస్తారంగా అడవులను నరికి వేయడం మూలంగా  క్రూర మృగాలైన సింహాలు,పులులు,చిరుతలు,జనావాసాల్లోకి చొరబడి దిక్కు తోచక దారి దొరకక చెట్లు చేమలతో కళ కళలాడుతున్న పోలిస్ ఠాణాల్లోకి చేరినయా ఏమిటి? క్రూర మృగాలు కనుక అటవీ శాఖ అధికారులను పిలిచి పులులు,సింహాలు, చిరుతలను పోలీసు ఠాణా బోనులో బంధించారా? అటవీశాఖ వాళ్లు పోలీసు ఠాణాల్లో బంధించిన క్రూర మృగాల సంగతి మర్చిపోయినట్లున్నారు.అటవీ శాఖ అధికారులు పోలీస్ స్టేషన్లో బంధించిన క్రూర మృగాలను అడవుల్లో విడిచిపెట్టాలి.అటవీ శాఖ అధికారులు అలసత్వం నిర్లక్ష్యం వల్ల అవినీతికి పాల్పడుతూ‌‌ ఉండడం వల్ల అడవులు అంతరించి పోతున్నాయి. కాని ఆటవిక మృగాలను దగ్గరగా చూసిన పోలీసులు ఆటవిక మృగాల్లాగే మనుషులను వేటాడుతున్నారు.”మీ లోనూ కొందరున్నారు/మా బోటి మనుష్యులు- / మామూలు వాళ్ళు/ దేనికి ఎదురు తిరగని వాళ్ళు/అందులో సందేహం లేదు”. కవి మల్లారెడ్డి లేఖలో  పోలీసుల్లో కొందరు మంచి వాళ్లు ఉన్నారని ఒప్పుకుంటున్నాడు.కొందరు మానవతామూర్తులు పోలీసు శాఖలో ఉండడం వల్ల పోలీసుల ప్రతిష్ట ఇనుమడించింది.”సిగ్గు పడుతున్నాను నేను/ దేవుడనే వాడుంటే/మిమ్మల్ని మనుష్యులుగా పుట్టించినందుకు”.       
కవి మల్లా రెడ్డి ఆవేదన చెందుతూ రాసిన లేఖలోని చరణాలను తడిమితే  దేవుడు మిమ్మల్ని మనుష్యులుగా ఎలా పుట్టిస్తాడు? అయితే గియితే మిమ్మల్ని మృగాలుగా పుట్టించాలి.కానీ మీరు పోలీస్ శాఖలో చేరి మనుష్యులను బతికుండగానే చిదిమేస్తున్నారు.అంతకంటే మరి సిగ్గుపడుతున్నాను.మనుషులే కానీ మిమ్మల్ని ఉద్యోగాల్లో ఎలా నియమించారని ప్రశ్నిస్తున్నాడు.పోలీసులను నియామకం చేసేటప్పుడు వాళ్ళ మూలాలేమిటి?వాళ్లు నేర చరిత్ర కలిగినవారా?ఏమి ఆశించి పోలీస్ శాఖలో ఉపాధి కొరకు వస్తున్నారు?వాళ్లు మంచి నడవడి కలిగిన మనుషులేనా?  కాదా?వాళ్లలో మానవత్వం ఏ కోశానా అయిన ఉందా? నీతి,నిజాయితీ,ధర్మం,ప్రేమ,సమాజంలో జీవిస్తున్న సాటి మనుషుల పట్ల సానుభూతి ఉందా?వారిలో  మంచి మనిషి లక్షణాలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చారా? ఇట్లాంటి వాళ్లను పోలీసులుగా నియమించడం మానవత్వానికి అవమానం కాదా? అనర్హులైన ఆటవిక మృగాలను నియమిస్తే ఎన్ని అనర్థాలు ఘోరాలు జరుగుతాయో మనం రోజు చూస్తూనే ఉన్నాం. ”ప్రత్యక్షంగా చూసాను”. కవి మల్లారెడ్డి  పంచేంద్రియాల సాక్షిగా కళ్ళతో చూసి లేఖలో వివరిస్తున్నాడు.”రుధిరోద్గారి వరదల్లో/చెర్లు గండ్లు పడినవి/కాలువలు గతులు తప్పినవి/ వంపులు మిట్టలయినవి/పంట పొలాలు ఇసుక దిబ్బలైనవి/ కాని అది ప్రకృతి బీభత్సం”.మన తెలుగు సంవత్సరాది రుధిరోద్గారి 1983 సంవత్సరంలో వచ్చింది.ఆ నాటి వరదలు తుపానుల తాకిడికి మన కరీంనగర్ జిల్లానే కాదు.ఆంధ్ర రాష్ట్రమంతా అట్టుడికి పోయింది.చెరువులన్నీ గండ్లు పడినాయి. పంట పొలాలు ఇసుకదిబ్బలైనవి. కానీ అది ప్రకృతి వల్ల కలిగిన విలయం.ఎవరు కాదనలేని కని విని ఎరుగని సత్యం అది ఆ వరదల వల్ల రైతన్నలు తీవ్ర ఉత్పాతాన్ని ఎదుర్కొన్నారు. ”ఏమిటో, ఇక్కడ చూస్తున్నానీ విపరీతం/మనుష్యుల రక్తనాళాలు తెగిపడుచున్నవి/కండరాలు కీమాగా కొట్ట బడుచున్నవి/ ఎముకలు నుజుగా నుజ్జుగా మారుచున్నవి/ఒళ్ళు  బొగ్గు రాళ్ల బీడుగా మారుతుంది/మనిషే బతికున్న శవంగా మారాడని వార్త.”చనిపోయిన మనిషిని శవం అంటారు .బతికున్న మనిషి శవంగా ఎలా మారుతాడు? సమాజ హితం కోసం పోరాడే వ్యక్తులను హింసించి ప్రాణాలు తీసే హక్కు ఏ రాజ్యాంగం కల్పించింది.జీవించే స్వేచ్ఛను హరించి వేసే పోలీసులపై కేసులు బుక్ చేయాలి.అట్లాంటి పోలీసులను ఉద్యోగాల నుంచి తొలగించాలి.దుర్మార్గులైన పోలీసులను కొనసాగించాలా? లేదా? అని ప్రభుత్వాలు పునరాలోచించాలి. సమాజ రక్షణ కొరకు ఎంచుకోబడ్డ పోలీసులు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తూ మొత్తం భారత జాతికే తీరని అవమానం కలిగిస్తున్నారు.ఇది 1983లో జరిగిన సంఘటనగా తోస్తోంది. ఇప్పటికీ పోలీస్ వ్యవస్థలో విధి నిర్వహణలో అలసత్వం క్రూరత్వం మర్రిచెట్టు వేళ్ళలా పాతుకుపోయి విధ్వంసం కొనసాగుతోంది.జీవించే హక్కును కాల రాయడం నేరంగా పరిగణించాలి.”అయితె నేమి ఆ కామ్రేడు నడవడి /భావి తరాల వాళ్ళకి రహదారి/మరి పోలీసుల నడవడి/యమ  దూతల ఒరవడిలో” సమాజంలో పేదరికం,నిరుద్యోగం, అసమానతలు కొనసాగుతున్నాయి.పేదలు నిరుపేదలుగా మారుతున్నారు.నిరుద్యోగం పెచ్చు పెరిగి పోతుంది.ధనికులు కోట్లకు పడగ లెత్తుతున్నారు. అత్యాచారాలు, అరాచకాలు, దోపిడీల గురించి ప్రశ్నించినందుకు పోరాటం చేస్తున్నందుకు కక్షతో దొరలు వారి తాబేదారులు పోలీసులకు అప్పగిస్తున్నారు. పోలీసులు పోరాట వీరులను చిత్రవధ చేసి చంపుతున్నారు. సమాజం కోసం పాటు పడుతున్న ఆ కామ్రేడ్ నడవడి భావి తరాలకి రహదారి.పోలీసుల నడవడి యమదూతల ఒరవడి. యమదూతలు తప్పు చేసిన వాళ్లను తీసుకుపోయి యమధర్మరాజు ముందు ప్రవేశపెడతారు.అప్పుడు యమ ధర్మరాజు ఇతడు చేసిన నేరం ఏమిటి? అని అడుగుతాడు. తప్పు చేసిన వాళ్లను సలసల కాగే నూనెలో వేస్తారు.కానీ మంచి కోసం,మంచి సమాజం కోసం పోరాడే వాళ్లకు స్వర్గం చూపించాలి.తప్పులు చేయని వాళ్లకు పోలీసులు నరకం చూపించడం ఏ శిక్షా స్మృతిలో ఉంది?పోలీసులు పరిశీలన చేసుకోవాలి.ఆత్మశోధన లేని బతుకు అది ఏమి బతుకు ? పోలీసు మిత్రులు సరియైన నడవడిలోకి మారేందుకు ఈ కవిత ఒక గుణపాఠంగా ఉంటుందని భావిస్తున్నాను.పోలీసుల నైతిక శిక్షణ పాఠ్యాంశాల్లో నడవడి కవితను కూడా చేర్చాలి.కవులు, కళాకారులు,ప్రజలను సరియైన నడవడికల వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు రచనల ద్వారా కళారూపాల ద్వారా అశేషమైన కృషి చేస్తున్నారు.చక్కటి కవితను అందించిన కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను.కవి మల్లారెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.                               ‌‌             

ప్రముఖ కవి,జర్నలిస్ట్,సీనియర్ న్యాయవాది,గులాబీల మల్లా రెడ్డి కలం నుండి జాలువారిన పల్లె పొలి మేరల్లోకి కవితా సంపుటినిలోని సత్యము స్వప్నము కవిత పై విశ్లేషణా వ్యాసం.                                                                                                                                                                  సత్యము స్వప్నము కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.సత్యం అంటే నిజమగు మాట.ఆంగ్లంలో Truth అని అర్థం.మహాత్మా గాంధీ చిన్నతనంలో సత్యహరిశ్చంద్రుడు నాటకం చూసి సత్యం కోసం సత్య హరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు? కుమారుడు లోహితాస్యుడు పాము కుట్టి చని పోయాడు.సత్యం కొరకు తన భార్య చంద్రమతిని కాటికాపరికి అమ్మేశాడు. గాంధీగారు సత్య హరిశ్చంద్రుని నుంచి ప్రేరణ పొంది ఆ మహనీయుని అడుగు జాడల్లోనే నడవాలని నిర్ణయించుకున్నాడు.జీవితమంతా అదే సత్య పథంలో నడిచాడు.మహాత్మా గాంధీ వ్రాసిన సత్యశోధన పుస్తకంలో కూడా రాసుకున్నాడు.సత్యం అహింసలే ఆయుధంగా మన దేశానికి స్వాతంత్ర్యం సాధించాడు.స్వామి దయానందుడు సత్యం కొరకే చిన్నతనంలోనే ఇంటి నుండి పారిపోయి వేద విజ్ఞానం ఆర్జించి వేదాల ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ సత్యార్థ ప్రకాశిక గ్రంథం రచించాడు.

అన్ని మతాల ఖండన చేశాడు.సత్యం కొరకు పాటుపడ్డాడు.మల్లారెడ్డి తన తల్లి భూదేవి,తండ్రి లింగారెడ్డి,తాత మల్ దాదా నుండి పుణికి పుచ్చుకున్న సంస్కారంతో సత్యమైన బాటలో నడుస్తున్నాడు. సత్యము స్వప్నము కవిత మనకు అందించిన నిధి అని చెప్పవచ్చు.స్వప్నము అంటే కల అని అర్థం.మల్లారెడ్డి కవిత శీర్షిక  పేరు సత్యము స్వప్నము ఏమిటి? అని  మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.మనలో ఆలోచనలు రేకెత్తించవచ్చు.మనం గురు పూర్ణిమ జరుపు కుంటున్నాం.గురువు అంటే ఎవరు? అజ్ఞానం నుండి అంధకారం నుండి వెలుగులోకి తీసుకు వచ్చే వాడని అర్థం.ఆ రోజుల్లో  శ్రీకృష్ణ భగవానుడు గురువు సాందీపని వద్ద విద్య నేర్చుకున్నాడు అని మనం చదువుకున్నాము.శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి యుద్ధ రంగంలో కలిగిన విషాదానికి భగవద్గీతలోని 700 శ్లోకాలు చెప్పి జ్ఞానోదయం చేశాడు.ప్రతి ఇంట శ్రీకృష్ణ గురువు ప్రబోధమైన భగవద్గీత ఉంటుంది.మనిషి ఎలా జీవించాలి? మనిషి ఎలా మనుగడ సాగించాలి?  మానవుడు మాధవుడిగా ఎలా మారాలో భగవద్గీత  తెలియజేస్తుంది.మహాత్మా గాంధీకి ఏ సందేహం కలిగిన భగవద్గీతను చదివేవాడని తన ఆత్మ కథలో రాసుకున్నాడు. భగవద్గీతలో సత్యం ఉంది కనుకనే అన్ని మతాల వాళ్ళు ఒప్పుకుంటున్నారు.విద్యా హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది.రాజ్యాంగంలో రాసిన రాతలు అమలు కావడం లేదు.అందరికీ ఆరోగ్యం,అందరికీ విద్య కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది.కాని పాలకుల  చేతగానితనం వల్ల విద్యా హక్కు ఆరోగ్యం హక్కు నినాదాలుగా మిగిలిపోయాయి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం.అందరికీ విద్య అందరికీ ఆరోగ్యం రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా అమలుకు నోచుకోవడం లేదు.మన పాలకుల దమననీతికి ఇది అద్దం పడుతుంది.చదువుల నేపథ్యంలో విద్య ఈరోజు వ్యాపారంగా తయారైంది.విద్య ప్రైవేట్ పరం చేయడం వల్ల విద్యాసంస్థలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పడి లాభాలు దండుకుంటు న్నారు. ఒకప్పుడు గవర్నమెంట్ బడులు ఉండేవి.నాణ్యమైన విద్యను అందించేవి.ఆ కాలపు టీచర్లు నిస్వార్ధంగా విద్యాబోధనే ధ్యేయంగా విద్యార్థులను పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే వారు.ఈనాటి ఉపాధ్యాయుల వల్ల ప్రభుత్వ పాఠశాలల రూపు మారిపోయింది.ప్రభుత్వ పాఠశాలలు మూసి వేసే దశకు చేరాయి.ఈనాటి ఉపాధ్యాయులకు అంకిత భావం లేదు.విధిని మరిచి సవాలక్ష వ్యాపారాలు చేస్తూ రాజకీయ నాయకులకు అండగా ఉంటున్నారు. చదువుల నేపథ్యంలో అబ్బాయిలు, అమ్మాయిలు కూడా హాస్టల్లో ఉండి చదువును కొనసాగిస్తున్నారు.40 ఏళ్ల కిందట ఇద్దరు,ముగ్గురు స్నేహితులు కలిసి గది అద్దెకు తీసుకొని వంట చేసుకుని కాలేజీకి వెళ్లి చదువును కొనసాగించే వారు.అప్పుడు హాస్టళ్లు ఉండేవి కావు.నేటి కాలంలో పట్టణాలలో గదుల అద్దెలు విపరీతంగా పెరిగాయి.బ్యాచిలర్స్ కు ఎవరు గదులు అద్దెకు ఇవ్వరు. పట్టణంలో గల్లీ గల్లీకి బాయ్స్ హాస్టళ్లు,బాలికల హాస్టళ్లు పుట్ట గొడుగుల్లా వెలిశాయి.నెలకు కొంత డబ్బులిస్తే వాళ్లే భోజనం వండి పెడతారు,వసతి కల్పిస్తారు.చిన్న గదులు మరియు పెద్ద గదులు విశాలంగా ఉన్నప్పటికీ విద్యార్థులతో కిక్కిరిసి ఉంటాయి.హాస్టల్  నిర్వాహకులు వేళకు భోజనము,టీ,టిఫిన్, స్నాక్స్ ఇస్తారు.విద్యార్థులు పొద్దున లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి,టిఫిన్ చేసి కాలేజీకి వెళ్తారు.విద్యార్థులు మధ్యాహ్నం వేళ హాస్టల్ కు వచ్చి అన్నం తింటారు.విద్యార్థులు హాస్టల్ నుండి కాలేజీకి వెళతారు.విద్యార్థులు కాలేజీ నుండి సాయంత్రం పూట హాస్టల్ కి వస్తారు.హాస్టల్ లో విద్యార్థులు టీ,స్నాక్స్ తీసుకుంటారు.విద్యార్థులు హాస్టల్ లో చదువుకుంటారు,హోంవర్క్ చేసుకుంటారు.విద్యార్థులు హాస్టల్ లో రాత్రి పూట భోజనం చేసి పడుకునే వరకు చదువు కుంటారు. తిండి మంచిగా ఉన్నా లేకున్నా హాస్టల్ లో ఉన్న విద్యార్థులు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటారు. హాస్టల్ వాతావరణానికి అడ్జస్ట్ అయిపోతారు.హాస్టల్ లో పిల్లలు ఇది కావాలి,అది కావాలి అని గొంతెమ్మ కోరికలతో హాస్టల్ యాజమాన్యాన్ని సతాయించరు.ఇంటి వద్ద ఉన్న అమ్మా, నాన్నలను డబ్బుల కొరకు ఎలాంటి  ఇబ్బంది పెట్టరు. హాస్టల్ లో ఉన్న విద్యార్థుల లక్ష్యం చదువు.అదే ధ్యేయంతో విద్యార్థులు చదువును కొనసాగిస్తారు. విద్యార్థులు చదువు పూర్తి అయితే ఏదైనా ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో కుటుంబానికి ఆసరాగా ఉంటుందని శ్రద్దాశక్తులతో చదువుతున్నారు.కొందరు పిల్లలు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ హాస్టల్లో ఉండి చదువుకుంటు తీరిక సమయాల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. హాస్టల్ కు కట్టే డబ్బులు వాళ్లే సంపాదించుకుంటున్నారు. తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా చదువుకుంటూ జీవనం సాగిస్తున్నారు.తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం గానే ఉంటున్నది.కొందరి తల్లిదండ్రులు వ్యవసాయం,కూలీ పనులు చేస్తున్నారు.అయినప్పటికీ వ్యవసాయంలో,కూలీ పనుల్లో ఏమీ మిగలడం లేదు.కొందరు తల్లిదండ్రులు మార్కెట్ లో కూరగాయలు,పండ్లు అమ్ముతున్నారు.కొందరు తల్లిదండ్రులు పాల వ్యాపారం చేస్తున్నారు.అయినప్పటికీ ఏమీ మిగలడం లేదు.ఎంత పని చేసినా కుటుంబానికి సరిపోయే ఆదాయం ఉండడం లేదు. పిల్లల భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రులు బాగా శ్రద్ధ చూపుతున్నారు.మా బతుకులు ఇలా కడతేరాయి.మా పిల్లలు బాగా చదువుకోవాలి.మా పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదైనా పని చేసుకుని బతకాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పినట్లే నడుచుకుంటున్నారు మరియు బుద్ధిగా మెదులుతున్నారు.కుటుంబం కోసం పిల్లలు త్యాగాలు చేస్తున్నారు.కుటుంబానికి అండగా ఉంటున్నారు. 
“అర్ధరాత్రి హాస్టల్ గదిలో…… మగత నిద్రలో … చైతన్యం శరీరానికి జడత్వం కప్పు కొన్నప్పుడు “కలల సౌదములో …. కళ్యాణ మందిరం                            “సిగ్గుల దొంతర లో … శిల్పాల్లాంటి  కన్నెలు”..
హాస్టల్ గదిలో ఉన్న విద్యార్థులు కూడా కలలు కంటారు.కలలు ఎప్పుడు పడితే అప్పుడు రావు.మగత నిద్రలో కలలు వస్తాయి. చైతన్యం జాగృతమై నిద్ర లేవగానే కలలు మాయమవుతాయి. అర్ధరాత్రి హాస్టల్ గదిలో మగత నిద్రలో చైతన్యం శరీరానికి జడత్వం కమ్ముకున్నప్పుడు కలలు వస్తాయి.కలలు అందరు కంటారు.కలలు నిజం చేసుకునేవాళ్లు కొందరు మాత్రమే ఉంటారు.కలలోని విషయాలు ఆచరణ ద్వారా నిజాయితీగా సాధించుకునేవారు కొందరు అని మాత్రమే చెప్పవచ్చు. తెలంగాణ కొరకు తొలి దశలో 369 మంది విద్యార్థులు అమరులయ్యారు.మలి దశలో తెలంగాణ కొరకు 1200 మంది విద్యార్థులు అమరులయ్యారు.అమర వీరుల బలిదానాల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.అమరవీరులు లేకున్నా వాళ్లు కన్న కలను తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసి చూపించారు. అమరవీరులు నిజాయితీగా కల కన్నారు.అమరవీరులు తెలంగాణ రాష్ట్రం కలను నిజం చేసిన నిజమైన వీరులు త్యాగధనులు.తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రాణాలు త్యాగం చేసిన అమర వీరులకు నా జోహార్లు అర్పిస్తున్నాను. అమరవీరులు తెలంగాణ చరితలో చెరిగిపోని శిలాక్షరాలు. అమరవీరుల తెలంగాణ త్యాగం కల ఎప్పటికీ గుర్తుంటుంది. విద్యార్థులు కంటున్న కలల గురించి చెబుతున్నారు.   “కలల సౌదంలో… కళ్యాణ మందిరం”. విద్యార్థులు కంటున్న      కలల సౌధం ఉంది.అందులో కళ్యాణ మందిరం ఉంది అని మనకు తెలియజేస్తున్నాడు.పెళ్లంటే నూరేళ్ల పంట అది పండాలి అని కవి రాసిన సినిమా పాట ప్రతి పెళ్లిలో వింటాం.పెళ్లంటే ఎంత హంగామా.ఇప్పుడు లక్షల రూపాయలు కళ్యాణ మందిరాలకు చెల్లిస్తున్నారు.ఆడంబరాల కోసం తల్లిదండ్రులు పెళ్లిలో అనవసరంగా వృధా ఖర్చులు చేయడం వల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయి.పెళ్లిలో అంత ఖర్చు  చేయడం అవసరమా?ఆడపిల్ల తల్లిదండ్రులకు ఆడంబరాల పేరిట ఎంత ఖర్చు చేసినప్పటికీ అమ్మాయిల కాపురాలు బాగున్నాయా? అంటే అది కూడా లేదు.అదనపు వరకట్నం కోసం అత్త,మామ,ఆడబిడ్డలు,భర్త,మరదలు కలిసి కొత్త కోడలును వేధించి చంపేస్తున్నారు.వర కట్నం దురాచారం ఈ దేశంలో ఆడపిల్లల పాలిట శాపంగా మారింది.కట్నం తీసుకుని కోడలును చక్కగా చూడక కాటికి పంపిస్తున్న వైనం మనం ఎరిగినదే.ఆడపిల్లల తల్లిదండ్రులను తీరని క్షోభకు గురిచేస్తున్నారు.     “సిగ్గుల దొంతరలో …  శిల్పాల్లాంటి కన్నెలు.”  పదహారేళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు  కోటి దండాలు శత కోటి దండాలు మరో చరిత్ర సినిమా పాట గుర్తుకు వస్తే తన్మయత్వంలోకి వెళ్లి పోతాం.ప్రాయంలో ఉన్నప్పుడు ఆడపిల్లలు మనోహరంగా కనిపిస్తారు.ఆడపిల్లలు సిగ్గులు ఒలక పోస్తారు. సిగ్గుతో ఉన్నప్పుడు ఆడపిల్లలు ఎంతో అందంగా కనిపిస్తారు.అజంతా,ఎల్లోరా శిల్పాల వన్నెలు చూస్తే ఎంత అందంగా ఉన్నాయో తెలుస్తాయి.చిత్రకారుడు గీసిన చిత్రాన్ని చూస్తే అక్కడ మనిషి చిత్రంలో ఉన్నట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.అట్టి చిత్రకారుని ప్రతిభకు సెల్యూట్ చేయాలి అనిపిస్తుంది.అజంతా,ఎల్లోరా,శిల్పాలను కళాత్మకంగా తీర్చిదిద్దిన శిల్పులను అభినందించాలి. “అరవిచ్చిన  గులాబీలు … పరిమళించే మల్లెలు.”    అర విచ్చిన గులాబీలు ఎంతో అందంగా ఉంటాయి. అమ్మాయిలను అరవిచ్చిన గులాబీలతో పోలుస్తున్నాడు. పరిమళించే మల్లెలు సువాసనలు వెదజల్లుతాయి.మల్లెపూల వాసన మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.అమ్మాయిలు పరిమళించే మల్లెపువ్వుల్లా ఉంటారు.మల్లెపూలు తెల్లగా తేటగా ఉంటాయి.మల్లెపూలు సిగలో ధరిస్తారు.సిగలోని మల్లెపూలు మత్తును కలిగిస్తాయి. ప్రేమ మైకంలో దించుతాయి. ”చాయకొచ్చిన చామంతులు … పూబంతులు.” పచ్చదనం పసుపు రంగులో చామంతులు ఎంతో అందంగా ఉంటాయి.  చాయ కొచ్చిన చామంతుల్లా ఉన్న అమ్మాయిలను చూస్తే మైమరిచిపోతాం.బంతిపూలను చూసి పూబంతులు అమ్మాయిలు అంటున్నాడు.ముద్ద బంతి పూవులో మూగ కళ్ళ ఊసులో ఎనక జన్మ భాషలు ఎందరికి తెలుసులే.ఘంటసాల గానం చేసిన పాట మనం రోజు వింటాం.ముద్దబంతి పూలు ముగ్ధ మనోహరం గా ఉంటాయి. “వన్నె వన్నెల సన్నజాజులు రంగులేని గడ్డి పూలు.” వన్నె వన్నెల సన్న జాజి పువ్వుల్లా అమ్మాయిలు అందంగా ఉంటారు. రంగులేని గడ్డి పూవుల్లా అమ్మాయిలు సొగసుతో కనిపిస్తారు.”సోకు లేని గరిక పూలు …. వేయి రేకుల కలువ పూలు”.సోకు లేని గరిక పూల వలె ఉన్న అమ్మాయిలు కూడా అందం చిందిస్తున్నారు.వేయి రేకుల  కలువ పూవుల వలె అమ్మాయిలు విలక్షణమైన అందంతో కనిపిస్తున్నారు.”వికసించే మందారాలు …విప్పారే సింధూరాలు.” మందార పూలు ఎన్నో రకాలు ఉన్నాయి.   అందులో వికసించే మందారాల అందం చెప్పనలవి కాదు. వికసించే మందార పూల వలె అమ్మాయిలు సొగసుతో అలరిస్తున్నారు.అమ్మాయిలు శోభను చేకూర్చుతున్నారు. సింధూర పూలు చూడ చక్కగా ఉంటాయి.విప్పారే సింధూరాలు మనోహరంగా ఉంటాయి.విప్పారే సింధూర పూలవలె చూడచక్కగా అమ్మాయిలు సొగసుతో  కనిపిస్తున్నారు.    
“దోసిల్లలో కట్నాలు…… వేయి మొదలు కోటి వరకు” సమాజంలో వరకట్నం దురాచారం ఎంతగా పేరుకుపోయిందో చెప్తున్నాడు.40 ఏళ్ల కిందనే కవిత వ్రాసి మనకు అందించాడు. దోసిల్లలో కట్నాలు వేయి మొదలు కోటి వరకు.ఆ కాలంలో కూడా కట్నం ఉంది అని మనకు తెలియజేస్తున్నాడు.వరకట్నం దురాచారం వల్ల ఎంత మంది ఆడపిల్లల జీవితాలు బలి అయిపోతున్నాయో మనం పేపర్లలో చదువుతున్నాం.న్యూస్  చానళ్ళ లో చూస్తున్నాం. ఇన్నేళ్లయినా వరకట్నపు దురాచారపు వికృతపు నీలి నీడలు ఇంకా ఈనాటికీ కొనసాగుతున్నాయి.ఆ రోజుల్లో వేయి రూపాయల కట్నం ఉంటే ఈనాడు లక్షల రూపాయల కట్నం నుండి కోట్ల రూపాయలకు ఎగబాకి వరకట్న వ్యాపారం సజావుగా సాగుతుంది. “నన్ను కొంటున్న అంగడి అంగడి బేరాలు.”వారానికి ఒక రోజు జరిగే సంతలోకి పశువు     లను తీసుకువచ్చి అమ్ముతారు.పశువులన్నీ అంగట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి.అమ్మే వాళ్ళతో కొనే వాళ్ళతో అంగడి రద్దీగా ఉంటుంది.అంగట్లో పశువులను అమ్మే దళారులు ఉంటారు.దళారులు పశువుల ధర చెబుతారు.పశువుల్లో ఎవరికి నచ్చిన పశువును వారు ఎన్నుకుంటారు.ఒకే పశువును కావాలన్న వాళ్లు ఎక్కువగా ఉంటే సవాలు వేస్తారు.   “నాకోసం సవాలేస్తున్న నినాదాలు”. వారానికి ఒక రోజు జరుగుతున్న సంతలో సరుకులు,పశువులు, అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి.సంతలో దళారీ రేటును ప్రకటించి సవాలు ఒకటో సారి రెండోసారి మూడోసారి అని అంటాడు. ఎవరి సవాలు నెగ్గితే వారికి ఆ పశువు దక్కుతుంది. “విసిరేస్తున్న నూలు పగ్గాలు.’సంత జరిగే రోజున సవాలు వేసి నెగ్గిన వాళ్ళు పశువుపై నూలు పగ్గం వేసి డబ్బులు కట్టి పశువును సొంతం చేసుకుని వెళ్ళిపోతారు.”సిగ్గేసి మనిషిని అన్నాను”.సంతలో జరిగిన దానిని చూసి సిగ్గేసి మనిషిని  అన్నాడు. సంతలో పశువులను అమ్మినట్లు మనుషులను కూడా అమ్ముతున్నారా?నిజమే మనుషులను పశువుల వలె వరకట్నం సంతలో అమ్ముతున్నారు.అమ్మాయిలు డబ్బులు ఇచ్చి సంతలో మనిషిని కొంటున్నారు.ఇదెక్కడి చోద్యం? అని ఆశ్చర్యం కలుగుతుంది.అమ్మాయిలు సంతలో మనిషిని కొనడం అతడు చూసినాడు.అతడు ఆమెను చూసి సిగ్గేసి మనిషిని అన్నాడు. మనిషికి పశువుకు తేడా లేదు అని సినిమా పాట ఉంది.ఇవాళ అది నిజం చేసి చూపిస్తున్నారు.సమాజం ఎటు పయనిస్తుంది? నాగరికత నుండి అనాగరికత దిశకు వెళుతుంది.రోజు రోజుకు దారుణ దృశ్యాలు కంటున్నాం. వింటున్నాం.ఇది మన దేశానికి పట్టిన అరిష్టం అని చెప్పకనే చెబుతున్నది.వరకట్నం తీసుకుంటున్న మగ మనిషిలో మార్పు రావాలి.
“వాట్ ఆర్ యూ?…..నో…నో..
 “హి…హి…హి… చడి చప్పుడు లేని శబ్దాలతో    
పువ్వులు నవ్వులు రువ్వినవి.”   
ఓ మనిషి నీవు ఏం చేస్తున్నావు? అని ఆమె ప్రశ్నించింది.అంగట్లో అమ్ముడయ్యే పశువు అయిపోయావా.  కాదు…కాదు..అంగట్లో అమ్ముడయ్యే పశువులాంటి నిన్ను చూసి   హి..హి…హి….. చడి చప్పుడు లేని శబ్దాలతో,పువ్వు లాంటి నాజుకైనా ఈనాటి నవీన యువతి ఆత్మవిశ్వాసంతో నవ్వులతో సమాధానం చెప్పింది. “కొంటెగా హేళన చేసింది”. నీవు సంతలో    పశువు అయి పోయావని అతనిని చూసి ఆమె కొంటెగా హేళన చేసింది.ఆమె అతడిని కొంటెగా హేళన చేయడంలో న్యాయం ఉంది.”మెస్కులైన్,సుపీరియారిటీ నీలో లేదన్నది.”    నీలో మగ జాతి ఆధిక్యపు లక్షణాలు ఏకోశాన లేవు. నీవు మగాడివే కాదు.మగాడిలా ప్రవర్తించడం లేదు.మగాడివి అయితే కట్నం ఎందుకు తీసుకుంటావు అని ప్రశ్నించింది?పక్షులు చూడు ఆడ మగ జంటగా అనురాగంతో ఒకే గూటి పక్షులై కలిసి మెలిసి ఉంటాయి.పశువులు కూడా ఆడ మగ జంతువులు కూడా జంటగా ఎప్పుడూ కలిసి మెలిసి తిరుగుతాయి.పక్షులను పశువులను చూసి నేర్చుకో. ధన మదంతో నీలో ప్రేమరాహిత్యం ఏర్పడింది. ప్రేమతో మెలిగే పక్షుల్లా,జంతువుల్లా మెలగడం నేర్చుకో.ఇదేనా నీవు నేర్చుకున్న చదువు సంస్కారం అని ప్రశ్నించింది? ” నన్ను అసలే వరించమన్నవి.” ప్రకృతి పురుషుడు వీరిద్దరిని జంట అంటారు.ప్రకృతి పురుషుడు కలిసిమెలిసి ఉంటేనే సృష్టి. ప్రకృతి పురుషుడులోని అన్యోన్యతను దూరం చేసి అంగట్లో సరుకై అమ్ముడుపోతున్నావు.నీలో జంటగా కలిసి ఉండాల్సిన లక్షణాలను కోల్పోయి ప్రేమ మాధుర్యమును మరిచిపోయి వరకట్నం తీసుకొని అంగట్లో సరుకై పశువులా అమ్ముడైపోతున్నావు. అందుకే నిన్ను వరించమన్నది.  “భోజరాజు ముందరి విక్రమార్కుడి కన్నెల్లా ఎగిసిపోయినవి ఒక్కొక్కటి.    “ఆర్కుడి కోసం విక్రమార్కుడి కోసం.”   చెట్టుమీదనున్న బేతాళుడు శవాన్ని భుజాన వేసుకుని వెళ్తున్నాడు.పువ్వు లాంటి అమ్మాయిలు వరకట్నం కోసం కలియుగంలో పడుతున్న ఇక్కట్లు చూసి విక్రమార్కుని ప్రశ్నించాడు.పువ్వు లాంటి అమ్మాయిలకు సరైన సమాధానం చెప్పాలి.లేకుంటే నీ తల రెండు ముక్కలైపోతుంది.జంటగా ఉండాల్సిన జంటలు అనురాగంతో ఆప్యాయతతో కలిసిమెలిసి ఉండాలి.వరకట్నం దురాచారం వద్దు. అబ్బాయిలు మీరు అంగట్లో సరుకు కావద్దు.ప్రేమ పక్షుల్లా ప్రేమ జంతువుల్లా ప్రకృతి పురుషుడిలా అనురాగంతో కలిసి మెలిసి ఉండాలి అని సమాధానం చెప్పాడు.సరైన సమాధానం చూసి చెట్టు మీద బేతాళుడు విక్రమార్కుడికి కృతజ్ఞతలు తెలిపాడు.మల్లారెడ్డి సత్యము స్వప్నము కవితలోని అద్భుతమైన భావాలు పాఠకుల హృదయాలను పరవశింపజేస్తాయి.అయినప్పటికీ సమాజంలో మార్పు లేదు.వరకట్నం దురాచారానికి అతివలు ఆహుతి అవుతున్న సంగతి మనం రోజు చూస్తూనే ఉన్నాం.స్వప్నంలో కూడా సత్యమునే  చెప్పిన తీరు చక్కగా ఉంది.సుకుమారమైన లేలేత పూచిన పువ్వులైన అమ్మాయిల ద్వారా కర్తవ్యము తెలియ చేసిన తీరు అద్భుతంగా ఉంది.పువ్వులు కూడా నవ్వగలవని కొంటెగా హేళన చేయగలవని సత్యము స్వప్నము కవిత ద్వారా తెలుసుకున్నాము.కవి మల్లారెడ్డి వరకట్నం వ్యతిరేకించే వారని అభ్యుదయ భావాలు పుణికి పుచ్చుకున్న వారని సత్యము స్వప్నము కవిత ద్వారా తెలుస్తున్నది.కవి మల్లారెడ్డి సమాజం హితం కోరి కవితా వ్యవసాయం చేస్తున్నాడు.వరకట్నం అనే సాంఘిక దురాచారం వల్ల ఎంతో మంది ఆడపిల్లలు బలి అవుతున్న సంగతికి చక్కటి పరిష్కార మార్గం అందించాడు. స్వప్నంలో కూడా సత్యాన్ని ఆవిష్కరించడం చక్కగా ఉంది.కవి మల్లారెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

ప్రముఖ కవి,జర్నలిస్ట్,సీనియర్ న్యాయవాది,గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన పల్లె పొలిమేరల్లోకి కవితా సంపుటిలోని జంపాల ప్రసాద్ కవిత పై విశ్లేషణా వ్యాసం.ప్రగతి శీల విద్యార్థి సంఘం ఉద్యమనేత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ నిజామాబాద్ జిల్లా బోధన్ తాలూకా ఎత్తోండ గ్రామంలో జంపాల నాగేశ్వరరావు,కొసరాజు రాజ్యలక్ష్మి దంపతులకు1951 సంవత్సరంలో జన్మించాడు.తండ్రి నాగేశ్వర రావు స్వగ్రామం గుంటూరు జిల్లా దుగ్గిరాల,తల్లి రాజ్యలక్ష్మి స్వగ్రామం గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి. జంపాల చంద్ర శేఖర్ ప్రసాద్ 1968 సంవత్సరంలో ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ విద్యలో ప్రవేశం పొందినాడు.అనతి కాలంలోనే అభివృద్ధి నిరోధక శక్తులపై పిడికిలి బిగించి సింహ స్వప్నంగా మారాడు.జార్జిరెడ్డి మరణానంతరం ఉద్యమ పతాకాన్ని భుజానికి ఎత్తుకున్న జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ప్రగతిశీల భావజాలానికి కేంద్ర బిందువు అయ్యాడు.ప్రసాద్ జార్జి రెడ్డి అడుగు జాడల్లో నడిచిన వాడు.జార్జిరెడ్డి పి,డి,యస్,యు. విద్యార్థి సంస్థను స్థాపించాడు.విద్యార్థుల హక్కుల కోసం అహ రహం శ్రమించిన వాడు.యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు అన్నయ్యలా మెదిలిన నిస్వార్థ జీవి.ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసించాడు.ఎల్ల వేళలా సమాజ సంక్షేమం గురించి పాటుపడిన వ్యక్తి.కొన్ని అసాంఘిక స్వార్థపర శక్తులు ఆయన సిద్ధాంతాలు నచ్చక ఉస్మానియా యూనివర్సిటీ కాంపౌండ్ లోనే  మట్టుపెట్టారు.విద్యార్థి లోకమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.జార్జి రెడ్డిని అంతం చేసిన ఆయన స్థాపించిన విద్యార్థి సంస్థ అంతం కాలేదు.ఒక వీరుడు మరణిస్తే వేల కొలది వీరులు ప్రభవిస్తారు.స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారికి ఎదురు తిరిగి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజును మట్టు పెట్టారు. అయినప్పటికీ భారతదేశ ప్రజల్లో రగులుతున్న స్వాతంత్రోద్యమ కాంక్షను మాత్రం మట్టుపెట్ట లేకపోయారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో దేశమంతా ఎదురు తిరిగి బ్రిటిష్ వారి పై పోరాటం కొనసాగించింది.బ్రిటిష్ వారు తోకముడిచి పారిపోయారు.జార్జిరెడ్డి అందించిన స్ఫూర్తితో వేల లక్షల మంది వీరులు తయారయ్యారు.జంపాల ప్రసాద్ జార్జిరెడ్డి అడుగు జాడల్లో నడిచిన వాడు.జార్జిరెడ్డి అందించిన స్ఫూర్తిని, ఆయన ఆశయాలను,ఆయన సిద్ధాంతాలను,విలువలను,అలాగే కొనసాగిస్తూ వచ్చాడు.ప్రసాద్ ప్రగతిశీల విద్యార్థి సంఘం ఉద్యమానికి ఊపిరిగా నిలిచాడు.ప్రసాద్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులను అందరిని రాష్ట్రవ్యాప్తంగా ఏకం చేసి పోరుబాట కొనసాగించాడు. ప్రసాద్ విద్యార్థి లోకానికి ఒక వెలుగుగా నిలిచాడు.1975 సంవత్సరంలో భారత దేశంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్రజాస్వామిక ఎమర్జెన్సీని జూన్ 26, 1975 నుండి మార్చ్ 1977 వరకు విధించింది.ఎమర్జెన్సీని చీకటి రోజులు అంటారు. ఎమర్జెన్సీలో ప్రభుత్వం పాశవికంగా పౌరుల ప్రాథమిక  హక్కులను పూర్తిగా హరించింది.1970 దశాబ్దం నుంచి 1975 నవంబర్ 5న తుది శ్వాస విడిచే దాక విప్లవ భావ వ్యాప్తికై మనస్ఫూర్తితో పనిచేసిన దీక్షా దక్షుడు ప్రసాద్.1975 నవంబర్ 3 న విప్లవ నేత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నీలం రామచంద్రయ్యతో సహా విజయవాడలో పోలీసులకు పట్టుబడి చిత్రహింసలకు గురయ్యాడు.నవంబర్ 5 న ఖమ్మం జిల్లా ఇల్లందు తాలూకా చీకటిగండ్ల అడవుల్లో నీలం రామచంద్రయ్యతో పాటు జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ను కాల్చి చంపారు. పోలీసులు ఎన్కౌంటర్ పేరిట కట్టు కథలను సృష్టించారు.1975 సంవత్సరంలో ఖమ్మం జిల్లా ఇల్లందు మండలంలో పోలీసులు అమానుషంగా జంపాల ప్రసాదును చెట్టుకు కట్టి ఎన్కౌంటర్ పేరిట చంపేశారు. “నేస్తం/క్యాంపస్ విద్యార్థి వైన నీవు/కొత్త ఆర్థిక విధానాలు చూపినందుకు/శాస్త్రీయ విద్యా విధానం కావాలన్నందుకు/నిన్ను నక్సలైటని/ నిస్సహాయంగా /చెట్టుకు కట్టి/బందూకు గురిపెట్టినపుడు/ కొండల గుండెలు జాలువారినవి/ కన్నీటి జాలు వారినవి/ చెట్ల కొమ్మలు –ఆకులు/కత్తులై లేద్దామని/పిట్టలతో పిచ్చుకలతో ముచ్చట్లాడినవి/నీ గుండె చీల్చిన తుపాకీ గుండు/జీవము లేని బొగ్గుగా మారింది/నీ రక్తం మోదుగు పూలై వనమంతా పూసింది” అని కవి మల్లారెడ్డి ఆవేదనతో ప్రసాద్ పై కవితను రాశారు. జంపాల ప్రసాద్ ను నేస్తంగా సంబోధిస్తున్నాడు.చెలిమికి మారుపేరు స్నేహం.ఆపతి సంపతిలో ఆదుకునేవాడు స్నేహితుడు.అశేష విద్యార్థి లోకానికి ఆశాదీపం ప్రసాద్.ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థిగా ఎదిగిన నిన్ను చూసి కన్న తల్లిదండ్రులే కాదు,నీవు పుట్టిన పల్లె,నేల కూడ పునీతమైంది.ప్రసాద్ తనతో చదువుకున్న స్నేహితులు, విద్యార్థులందరికీ మార్గదర్శిగా నిలిచాడు.ప్రసాద్ విద్యార్థులు, రైతులు,రైతు కూలీలు సకల జనావళి ఎదుర్కొంటున్న సమస్యలకు మూలాలను కనుక్కున్నాడు.ప్రసాద్ నూతన ఆర్థిక విధానం,శాస్త్రీయ విద్యా విధానం కావాలన్నాడు.ప్రసాద్ మూఢ సంస్కృతిని ఎదిరించాడు.పురోగమించిన ప్రసాద్ ను నక్సలైట్ అని ముద్ర వేసి నిస్సహాయంగా చెట్టుకు కట్టి బందూకు గురి పెట్టినప్పుడు కొండల గుండెలు కన్నీటితో జాలువారినవి. శిఖరంలా ఎదిగిన ప్రసాద్ ను చూసి కొండల గుండెలు కరిగి దుఃఖంతో కన్నీటి జలపాతాలై ప్రవహించినవి.ప్రసాద్ వీరుని హత్య చేస్తుంటే చూసి ప్రకృతిలో భాగాలైన చెట్లు కొమ్మలు ఆకులు కత్తులై లేద్దామని పిట్టలతో పిచ్చుకలతో ముచ్చట్లాడినవి.నోరు లేని పక్షులు ముచ్చటించాయని చదువుతుంటే ఒళ్లంతా బాధతో వణుకుతుంది.ప్రసాద్ గుండెను చీల్చిన తుపాకీ గుండు కూడా చలించి జీవం లేని బొగ్గుగా మారింది. ప్రసాద్ రక్తంతో తడిసిన నేల మోదుగు పూలై వనమంతా పూసింది.”నీ ఆశయాల చిగుళ్ళతో/ వనానికే వసంతం వచ్చింది”.జంపాల ప్రసాద్ అందించిన ఆశయాల చిగుళ్ళైన నూతన ఆర్థిక విధానం,మూఢ సంస్కృతి పై పురోగమించిన తీరు,శాస్త్రీయ విద్యా విధానం కావాలని అతను నాటిన ఆలోచనలు ఇవ్వాళ అందరికీ శిరోధార్యం అయ్యాయి. ప్రసాద్ నీవు అందించిన ఆశయాల చిగురులు తొడిగిన వసంతం వల్ల కొత్త శోభ వచ్చింది అని కవి మల్లారెడ్డి చెప్పిన తీరు చక్కగా ఉంది.”నిన్ను నక్సలైటన్న/నీవే ఎందరికో టార్చ్ లైటని వింటున్న.”/నక్సల్ బరి ఉద్యమం బెంగాల్లో మొదలైంది.చార్ మజుందార్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. దేశమంతా నక్సల్ బరి ఉద్యమం విస్తరించింది.కమ్యూనిజాన్ని నమ్ముకున్న వాళ్ళని నక్సలైట్ అని పిలిచారు.నక్సలైట్లు, విప్లవకారులుగా ప్రసిద్ధి పొందారు.నక్సలైట్లు ప్రజా సంక్షేమం కొరకు పాటుపడుతున్నారు.ప్రసాద్ సమాజం కోసం పోరాడిన వాడు.ప్రసాద్ సమాజం అభివృద్ధిని కాంక్షించినవాడు.ప్రసాద్ సమాజం వెలుగు కొరకు నూతన ఆర్థిక విధానాలు,శాస్త్రీయ విద్యా విధానం కావాలని ప్రజలను మమేకం చేసి ఉద్యమాన్ని నడిపించినాడు.ప్రసాద్ లక్ష్యాన్ని చూసి ఓర్వలేని అప్రజాస్వామిక శక్తులు ఎన్కౌంటర్ పేరిట పాశవికంగా మట్టు పెట్టాయి.ఈ దేశంలో రాజ్య హింస కొనసాగుతుందని చెప్పటానికి ప్రసాద్ హత్య సాక్ష్యంగా నిలుస్తుంది.ప్రసాద్ నీవు చూపించిన అడుగుజాడల్లో అందరు పయనిస్తున్నారు.ప్రసాద్ నీవు అందించిన మార్గం అందరికీ వెలుగునిచ్చే టార్చ్ లైట్ అని వింటున్నాను.ఎమర్జెన్సీలో కవి మల్లారెడ్డి కొంత కాలం జైల్లో ఉన్నాడు.చీకటి రోజులైన ఎమర్జెన్సీకి సాక్ష్యంగా జంపాల ప్రసాద్ ఎన్కౌంటర్ నిలుస్తుంది.వీరుడైన జంపాల ప్రసాద్ గురించి చక్కటి కవితను అందించినందుకు కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను. కవి మల్లారెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

ప్రముఖ కవి,జర్నలిస్ట్,సీనియర్ న్యాయవాది,గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన పల్లె పొలిమేరల్లోకి కవితా సంపుటిలోని ఎంత హాయి కవిత పై విశ్లేషణా వ్యాసం.ఎంత హాయి కవిత పేరు వినగానే మనకు ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి ఘంటసాల గళం నుండి పాడిన పాట గుర్తుకు వస్తుంది.పాట వినగానే ఒళ్లంతా తన్మయత్వంలోకి చేరుతుంది. మనకు ఆ పాటను మళ్లీ మళ్లీ  వినాలనిపిస్తుంది.ఎంత హాయి సినిమా పాట వినగానే మనస్సు ఆనందంతో కేరింతలు వేస్తుంది. మనకు ఎద నిండా ఎన్ని బాధలు ఉన్నా ఎంత హాయి పాట వినగానే క్షణంలో మన  బాధలన్నింటిని మరిచిపోతాం. అనారోగ్యంతో హాస్పిటల్ కి వెళ్ళితే డాక్టర్ పరీక్షలు చేసి మీకు ఏ జబ్బు లేదు.మీరు బేషుగ్గా ఆరోగ్యంగా ఉన్నారు.మీరు కొంత సమయం మ్యూజిక్ థెరఫీ చేయాలి.మీరు అపాత మధురమైన అలనాటి వీనుల విందైన మంచి పాటలు వినమని చెబుతున్నారు.పాటకు పల్లవి ప్రాణం.పాటకు అమేయమైన శక్తి ఉంది.పాటల ఉయ్యాలలో చేరి ఊగితే మనసును తెలియని లోకంలోకి తీసుకుపోతుంది.పాట మనలను ఆకాశ తరంగాల్లో ఊగిస్తుంది.తెలంగాణ పల్లెల్లో నివసించే అమాయక పల్లె జనాలు ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛతకు ప్రతిరూపాలు అని చెప్పవచ్చు.ప్రకృతి ఒడిలో పెరిగిన జానపదులు వారి దైనందిన జీవితాల్లో నిత్యం నిర్వర్తించే కర్షక కార్మిక వృత్తులన్నీ కథా వస్తువులే.కార్మిక,కర్షక గేయాలు,తుమ్మెద పదాలు,స్త్రీల పాటలు అంతా దేశీయ సాహిత్యం.“నేను పాడాను నాటి రాత్రి ఒంటరిగా/ ఓ అమాయకపు అద్భుతపు పాట/మా పేట దొర దొమ్మి ఆటల గూర్చి/అంతే/తెల్లారి కల్లా/ సంకెళ్లతో పోలీసులు”.తెలంగాణలో దొరలు చేసిన దొమ్మి ఆటల గూర్చి అమాయకుడైన యువకుడు పాట పాడినందుకు తెల్లారేసరికల్లా సంకెళ్ళతో పోలీసులు వచ్చి అరెస్టు చేసినట్లుగా తోస్తుంది.
తెలంగాణ పల్లెల్లో జనాలు స్వేచ్ఛగా తమ గళాలు విప్పి పాటలు పాడుకొనటానికి వీలు లేదు.ప్రభుత్వాల అనుమతితో పోలీసుల రాజ్య హింస ఎలా జరుగుతుందో మల్లారెడ్డి కవిత చదివితే తెలుస్తుంది.జననాట్యమండలి కళాకారులు పాడిన పాటలతో పల్లెలు మారు మ్రోగేవి.జననాట్యమండలి నుండి ఎదిగిన గద్దర్ గొప్ప కళాకారుడుగా ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు.గద్దర్ ప్రజల జీవితాన్ని కాచి వడబోసినట్లు బతుకు పాటలు రాశాడు.పాట ప్రజా కళారూపం.పొలాల్లో కలుపుతీస్తూ నాట్లు వేస్తూ జానపదులు ఎంతో హాయిగా పాటలు పాడుతారు.పల్లె జనాలు పొద్దున్నుండి సాయంత్రం వరకు వంచిన నడుం ఎత్తకుండా పనులు చేసుకుంటారు.పనుల్లో అలసట అనేది తెలియకుండా ఉండటం కొరకు పల్లె జనాలు పాటల లోకంలో విహరిస్తారు. మనకు స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15 రోజున అర్ధరాత్రి వచ్చింది.కాని మన తెలంగాణ ప్రాంతం నిజాం రాజు నిరంకుశ పాలనలో కొనసాగింది.నిజాం రాజు కింద పని చేసే రజాకార్లు వారి తొత్తులైన దొరల,దోపిడీలు,దౌర్జన్యాలు,అత్యాచారాలు, అరాచకాలు,వెట్టి చాకిరి,కుల వివక్ష తీవ్రంగా కొనసాగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో 4,000 మంది యువకులు అమరులయ్యారు.చాలామంది ప్రజలు ఉరి తీయబడ్డారు. చాలామంది ప్రజలు తీవ్రమైన చిత్రహింసల పాలయ్యారు.ఆడ కూతుర్ల మాన,ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది.సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న సాహసోపేతమైన చర్య సైనిక తిరుగుబాటు వల్ల సెప్టెంబర్ 17,1948 నాడు నిజాం రాజు లొంగి పోయాడు.అయినప్పటికీ గ్రామాల్లో దొరల దౌర్జన్యాలు,వెట్టి చాకిరి,కుల వివక్ష అలాగే కొనసాగుతూ వచ్చింది.పొట్టి శ్రీరాములు అమరులు అయిన తర్వాత 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.పాటలు పాడుకునే స్వేచ్ఛ లేని తెలంగాణ సమాజం గురించి మనం ఈ కవిత చదవగానే అర్థం అవుతుంది.తెలంగాణలో ఒక గ్రామంలో జరిగిన సంఘటనగా తోస్తుంది.తెలంగాణలో పల్లెలన్నీ దొరల మరియు వారి తాబేదారుల ఏలుబడిలో కొనసాగాయి.దొరల దౌర్జన్యాలకు,అమానుషాలకు అంతు లేకుండా పోయింది.ఇది పల్లెల్లో జరుగుతున్న మామూలు విషయాలుగా చెప్పవచ్చు. భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు హరించే ప్రభుత్వాలు ఉన్నంతకాలం ఇలాంటి రాజ్య హింసను తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్నారు.దొరలకు తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు.పోలీసులు డబ్బులకు కక్కుర్తి పడడం ఇప్పటికీ విచ్చలవిడిగా కొనసాగుతుంది.పోలీసులకు విశేషమైన అధికారాలు.పోలీసులు ఏం చేస్తే అదే వేదంగా వాదంగా సాగుతోంది.స్టేషన్ హౌస్ ఆఫీసర్ తప్పు చేస్తే మందలించే వ్యవస్థ లేదు.స్టేషన్ హౌస్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్ కు రాజు.స్టేషన్ హౌస్ ఆఫీసర్ తన ఇలాఖాలో ఏం చేసినా చెల్లుతుంది.స్టేషన్ హౌస్ ఆఫీసర్ గురించి ఎవరికి ఫిర్యాదు చేసినా చర్య తీసుకోరు. బాధితుడి రోదనలు అరణ్య రోదనలు అవుతున్నాయి.కోర్టుకు వెళ్లిన కోర్టులో న్యాయమూర్తులు లంచం తీసుకొని నేరస్తునికి అనుకూలంగా తీర్పులు ఇస్తున్నారు.చట్టంలోని లొసుగులను తమకు అనుకూలంగా వాడుకుంటు న్నారు. ప్రజలు తమ హక్కుల గురించి ఎవరిని అడగాలి?కనిపించని ఆ దేవుడికి మొర పెట్టుకోవాలా? సమాధానం దొరకని ప్రశ్నలు ప్రజలను వేధిస్తున్నాయి.ప్రజలను కన్నబిడ్డల్లా చూడాల్సిన పోలీసులు ఆమ్యామ్యాలకు లొంగి తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వాన్ని పాలిస్తున్న పాలకులు శుష్క వాగ్దానాలతో ఐదు సంవత్సరాలు ప్రజలను భ్రమల్లో తేలియాడ జేస్తున్నారు. “మోకాళ్లు – రోకళ్లు పోటీ పడినవి నెల్లాళ్ళు/కళ్ళు –నీళ్ళింకిన సంద్రాలైనవి/ ఒళ్ళు – సహారా ఎడారి అయింది”.పోలీస్ స్టేషన్లో దొర ఏం చెప్తే అది జరిగి తీరుతుంది.దొర దగ్గర పోలీసులు లంచం తీసుకున్నారు.బ్రిటిష్ కాలం నాటి థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఇప్పటికీ అనుసరిస్తూ ఏ నేరం చేయని అమాయకుడిని పోలీస్ స్టేషన్లో ఉంచి మోకాళ్ళకు రోకలి ఎక్కించి అమానుషంగా హింసించారు.పోలీసులు అమాయకుడిని నెల రోజులు హింసించడం తప్పు.ఏ రాజ్యాంగం ద్వారా పోలీసులకు అమాయకులను హింసించే హక్కు కల్పించింది.అమాయకుడిని శిక్షించే హక్కు పోలీసులకు ఎక్కడిది?.పోలీసుల హింస వల్ల అమాయకుని ఒళ్ళు సహారా ఎడారి అయింది.అమాయకునిపై పోలీసుల హింస తలచుకుంటేనే గుండెలు అవిసిపోతున్నాయి. వాళ్ళు“నిజం కక్కిస్తానన్న పోలీసు/అబద్ధం కేసు పెట్టాడు” .పోలీసులు బాధితుడు వద్ద లంచం తీసుకుని కేసు రిజిస్టర్ చేస్తారు.పోలీసులు విచారణ పేరిట నేరస్తుని వద్ద ఎక్కువగా లంచం డబ్బులు తీసుకుంటున్నారు.పోలీసులు అమాయక బాధితుని కేసును తప్పుడు కేసు అని క్లోజ్ చేస్తున్నారు. అమాయకుడు నేను పెట్టిన కేసు ఎందుకు కేసు క్లోజ్ చేశారు అని పోలీసులను అడిగితే పోలీసులు బాధితున్ని ఏం చేస్తావో? చేసుకో,పో, బయటకు వెళ్ళు అని గెంటేస్తున్నారు.అమాయక బాధితుడు కోర్టుకు వెళ్తున్నాడు.కోర్టులో కూడా కొందరు న్యాయమూర్తులు లంచం తీసుకొని అమాయక బాధితుని ఫిర్యాదును కొట్టివేస్తున్నారు.న్యాయమూర్తులు అవినీతికి పాల్పడడం ఆవేదనగా ఉంది.న్యాయమూర్తులు న్యాయదేవతకు కళ్ళు లేవని అన్యాయపు తీర్పులు రాస్తున్నారు.న్యాయదేవత మమ్మల్ని ఏమీ చేయలేదని న్యాయమూర్తులు అవినీతికి పాల్పడుతున్నారు.న్యాయమూర్తులు అవినీతికి పాల్పడడం తీవ్రమైన ఆవేదన కలిగిస్తుంది.“ఇప్పుడు రోజు పాడుతున్నాను/ అదే పాట/జైల్లో – రైల్లో/ బస్సుల్లో/ కోర్టు హాల్లో/వందల దొరల ముందు/వేల పోలీసుల ముందు/జనం ముందు/జడ్జీల ముందు/ఎంత హాయి”.తెలంగాణలో పోలీసులు ధనవంతులైన ఆసాములకు దాసులుగా పనిచేస్తున్నారు.ఈ వ్యవస్థ మారాలి. ప్రశ్నించే గొంతులను తప్పుడు కేసులతో వేధిస్తూ కొందరి ప్రాణాలను తీస్తున్నారు.రాజ్యాంగం కల్పించిన హక్కులను మనం పోరాటాలు చేసి పరిరక్షించుకోవాలి.ప్రజలు తమ హక్కుల కోసం పోరాటాలు చేయాలి.ఈ వ్యవస్థ బాగు కోసం దొర దొమ్మి ఆటలను గూర్చి పాట పాడినందుకు యువకుడు ఎన్నో శిక్షలు ఎదుర్కొన్నాడు.అయినప్పటికీ ఇప్పుడు ఆ యువకుడు పాట పాడుతున్నాడు.జనం ముందు, జడ్జీల ముందు,ఎంత హాయి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.ఎంత హాయి కవిత 1984 సంవత్సరంలో జరిగిన సంఘటనలకు సాక్షీ భూతంగా నిలుస్తుంది.రక్షించాల్సిన పోలీసులు రక్కసులయి అమాయకుడిని హింసల పాలు చేసి,తప్పుడు కేసులు పెట్టి జైల్లోకి తోస్తున్నారు.పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసే హక్కును ఏ రాజ్యాంగం కల్పించింది? నిజాయితీగా పనిచేసేవాళ్లను పోలీసులుగా విధుల్లోకి తీసుకోవాలి.జడ్జీలను కూడా నిజాయితీపరులను ఎంపిక చేయాలి.పోలీసులు,జడ్జీలు చేస్తున్న అవినీతిని అరికట్టాలి.అవినీతిని అరికట్టడం జరిగే పనేనా?అని అనుకోకూడదు.అవినీతిని అరికట్టడం జరిగి తీరుతుంది.మంచికి పునాది పడుతుంది.ఎంత హాయి పాట మనోరంజకంగా వినబడుతుంది.చక్కటి కవిత రాసిన కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను.కవి మల్లారెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

ప్రముఖ కవి,జర్నలిస్ట్,సీనియర్ న్యాయవాది,గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన పల్లె పొలిమేరల్లోకి కవితా సంపుటిలోని నిజం కవిత పై విశ్లేషణా వ్యాసం.నిజం అనగా సత్యం.ఆంగ్లం లో Truth అని అర్థం.నిజం అనేది నిజాయితీ, త్యాగం వలె మనం పాటించవలసిన సంగతిగా చెప్పవచ్చు. సత్యం వద అంటే సత్యమునే చెప్పుము.సత్యం పలకడం వల్ల తాత్కాలికమైన కష్టాలు ఎదురైనా చివరికి విజయం మాత్రం తథ్యం అని చెప్పవచ్చు.నిజం పలకడానికి మనిషికి ధైర్యం కావాలి.పొద్దున్నే పాలు అమ్మే వ్యక్తి పాల ప్యాకెట్ తో ఇంటి ముందు ప్రత్యక్షమవుతాడు.సైకిల్ మీద పాల క్యాన్ వేసుకుని ఇంటింటికి తిరిగి పాలు పోసిన రోజులు పోయినవి. సైకిల్ మీద పాల క్యాను వేసుకుని పాలు అమ్ముదామని వీధుల వెంట తిరిగినప్పటికీ పాలను ఎవ్వరు కొనడం లేదు అని వాపోతున్నాడు.ఇదేమి చిత్రమో? క్యాన్ లో పాలు ఇంటింటికి తిరిగి అమ్మే వ్యక్తికి జనాల సంగతి ఏమీ అర్థం కావడం లేదు. విచిత్రంగా జనాలలో ఎంత మార్పు వచ్చింది అని ఆశ్చర్యపోతున్నాడు.అందరు జనాలు పాల ప్యాకెట్లకు అలవాటు పడి కొనుగోలు చేస్తున్నారు. కొందరు పాల ప్యాకెట్లు తీసుక వచ్చి ఇంటింటికి తిరిగి అమ్ముతున్నారు.పాల ప్యాకెట్ రాగానే పాలు కాగ బెట్టి టీ తయారు చేయడం ఇంటికి దీపం అయిన ఇల్లాలుకు ఆనవాయితీగా మారింది.ఉదయం లేచిన తర్వాత టీ తాగుతూ దినపత్రిక చదివే అలవాటు చాలా మందికి ఉంది.పొద్దున్నే పేపర్ చదవడానికి ఇరుగు పొరుగు వారు రావడం పరిపాటిగా చెప్పవచ్చు.పొద్దున్నే ఇంటి ముందు వాకిట్లో కూర్చుండి జనాలు ఆ రోజు దినపత్రిక చదువుతూ పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేస్తారు.జనాలు ఉబుసుపోక ముచ్చట్లతో పాటు కుటుంబం గురించి,గ్రామం గురించి,దేశం గురించి,పార్టీల గురించి,దేశంలో పెరిగిపోతున్న అవినీతి గురించి,ఆకాశానికి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల గురించి, చర్చలు, వాదోపవాదాలు చేస్తారు.దినపత్రిక చదవడం అయిపోయిన తర్వాత చుట్టుపక్కల ఇళ్లలోని జనాలు అన్ని విషయాలు అక్కడే వదిలేసి ఏం చక్కా ఎవరి ఇంటికి వారు భేషుగ్గా వెళ్ళిపోతారు.జనాలు దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలకు పరిష్కార మార్గం కొరకు ఆసక్తి చూపడం లేదు. ప్రజలు ఎదుర్కోవలసిన సమస్యలను గాలికి వదిలేస్తున్నారు. సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే కదలిక  లేకుండా ఉంటున్నాయి.జనం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ఎందుకో ఎవరూ దృష్టి పెట్టడం లేదు అనేది వాస్తవం.మనం జీవిస్తున్న సమాజంలో ఆ రోజటి నాడు పేపర్ చూడకున్నా పాల ప్యాకెట్ అమ్మే అబ్బాయి రాకున్నా ఇంటి యజమానిలో కలిగిన మార్పులు చూస్తే వింతగా తోస్తుంది.అతడు కాలు గాలిన పిల్లిలా ఇంట్లోనే తిరుగుతూ అటు ఇటు తొంగి చూస్తూ దిక్కు తోచక వీధిలో పచార్లు చేయడం విచిత్రంగా వుంటుంది.ఇప్పుడు వ్యక్తులు టీ తాగకుండా ఉండగలరు.కానీ పేపర్ చదవకుండా ఉండ లేని స్థితికి చేరుకున్నారు.ఇవ్వాళ ఎవరైనా పొద్దున లేవగానే టీ తాగుతూ ఒక పార్టీ వాళ్లు ఎదురు పార్టీ వాళ్ళని దుమ్మెత్తి పోయడం చూస్తూనే ఉన్నాం.అధికార పార్టీ వాళ్లు అది చేస్తాం ఇది చేస్తాం అని గుప్పించే వాగ్దానపు వార్తలు ప్రజలను కలవరపెడతాయి. ఆత్మహత్యలు,హత్యలు,దొంగతనాలు,దోపిడీలు,ఊరి గొడవలు,సవాలక్ష సమస్యలకు సంబంధించిన వార్తలు పేపర్లలో రోజు వస్తుంటాయి.ప్రపంచంలో ఏం జరిగింది? పేపర్ చదవడం ద్వారా ప్రపంచంలో జరిగే విషయాలతో పాటు అన్ని విషయాలు మన కళ్ళ ముందు  ప్రత్యక్షమవుతాయి.పల్లె,మండలం,జిల్లా ,పట్టణం,అన్ని ప్రదేశాలకు సంబంధించిన వార్తలు అందిస్తున్నారు.కవి మల్లారెడ్డి నిజం కవితలోని చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.గొప్ప అనుభూతులను సొంతం  చేసుకుందాం.”ఇది దిన పత్రిక మొదటి పేజిలో/ డబ్బా కట్టిన వార్త/ అక్కపల్లిలో/నక్సలైటు వర్గాల మధ్య ఘర్షణ.” దినపత్రికలో అనేక రకాల వార్తలు వస్తున్నాయి.దినపత్రిక ఎడిషన్ లో వివిధ రకాల వార్తలు ఉంటాయి.దినపత్రికలో అనేక రకాలైన వార్తలతో పాటు కొన్ని సంచలన వార్తలు కూడా ఉంటాయి.ఆ రోజు జరిగిన ముఖ్యమైన సంచలనం సృష్టించిన వార్తను దినపత్రిక మొదటి పేజీలో ప్రచురించబడింది అని తోస్తుంది.ఇది ఆ రోజు అక్కపల్లి గ్రామంలో జరిగిన సంచలన వార్తగా చెప్పవచ్చు.అందుకే  దినపత్రిక మొదటి పేజీలో డబ్బా కట్టిన వార్తగా వచ్చింది.అక్కపల్లి గ్రామంలో నక్సలైట్ వర్గాల మధ్య ఘర్షణకు సంబంధించిన వార్తను ఇది ఆ రోజు దినపత్రిక మొదటి పేజీలో వచ్చింది అని కవి మల్లారెడ్డి కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.అక్కపల్లి గ్రామంలో పేద రైతు కూలీలు అత్యధికంగా నివసిస్తున్నారు.గ్రామంలో రైతులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధరలు ప్రభుత్వాలు కల్పించడం లేదు. అందువల్ల రైతులు తమ పొలాల్లో పనిచేసే కూలీలకు న్యాయమైన కూలీ చెల్లించడం లేదు.గ్రామంలోని కూలీలు తీవ్రమైన పేదరికంలో మగ్గుతున్నారు.పేదరికంలో ఉన్న కూలీల పిల్లలకు చదువులేదు,సరైన కూడు,గూడు,గుడ్డ లేదు.హీనమైన స్థితిలో జీవితాలను గడుపుతున్న పేదలకు అండగా నక్సలైట్లు ఉంటున్నారు. అన్నలు గ్రామీణ పేదల సంఘం ఏర్పాటు చేసి పేద వారికి రాత్రి పూట చదువును అందిస్తున్నారు.చీకటిలో బతుకు గడుపుతున్న గ్రామీణ పేదలకు పేదరికంకు గల కారణాలు తెలుపుతున్నారు.అన్నలు పేద ప్రజలకు వారు ఎదు ర్కొంటున్న సమస్యల గురించి సరైన అవగాహన కల్పిస్తున్నారు.ఎందుకు గ్రామాలు సమస్యలకు నెలవుగా ఉంటు న్నాయి? ఎందుకు  ప్రజలు తీవ్రమైన పేదరికంలో బతుకు గడుపుతున్నారు? గ్రామాల్లో భూస్వాముల దోపిడీ ఎందుకు నిరాటంకంగా కొనసాగుతూ ఉంది?.భూస్వాములు పేదల శ్రమను దోపిడీ చేస్తున్నారు.భూస్వాములు చేస్తున్న శ్రమ దోపిడికి వ్యతిరేకంగా గ్రామీణ పేదల సంఘం తరఫున నిలిచి తమ హక్కుల కోసం పోరాడుతున్నారు.ప్రజలు తమ హక్కుల కోసం ప్రభుత్వంను నిలదీస్తూ ఉద్యమాల బాటలో సాగుతున్నారు. అన్నలు గ్రామాల్లోకి వచ్చిన తర్వాత పేదలపై తాము చేస్తున్న దోపిడీకి ఆటంకం ఎదురైంది అని భావించి భూస్వాములు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. భూస్వాములకు అండగా పోలీసులు నిలుస్తున్నారు.పోలీసులు నక్సలైట్ అన్నల గురించి ఆచూకీ కొరకు ఆరా తీస్తూ గ్రామస్తులందరిని తీవ్రంగా కొడుతూ హింసిస్తున్నారు.వాళ్ళు”పోలీసులు మొదట విప్లవకారుల కోసం వచ్చారు/నాకు పార్టీలతో సంబంధం లేదు/ నేను కమ్యూనిస్టును కాను/అందుకే వాళ్లను లక్ష్య పెట్టలేదు.” అక్క పల్లి గ్రామంలోకి పోలీసులు విప్లవకారుల కోసం వచ్చారు.పోలీసులు గ్రామంలోని ఇల్లిల్లు తిరిగి అన్నల కోసం వెతికారు.పోలీసులు గ్రామం అంతా తిరిగినప్పటికీ అన్నలు ఎవరు కనిపించలేదు. అన్నల కొరకు వెతుకుతుండగా ఒక ఇంటిలో 20 సంవత్సరాల వయసున్న యువకుడు పోలీసులకు కనిపించాడు.అతనికి ఏ పార్టీలతో సంబంధం లేదు.అతను కమ్యూనిస్టు పార్టీకి చెందిన సభ్యుడు కాదు.అందుకే తమ గ్రామమునకు పోలీసులు వచ్చినప్పటికీ అతను వారిని గురించి పట్టించుకోలేదు అని నిజాయితీగా తెలియజేస్తున్నాడు.”తరువాత వాళ్ళు రైతు సంఘ నాయకుల కోసం వచ్చారు/నేనెలాగు సంఘ సభ్యుడుని కాదు/కావున లక్ష్య పెట్ట లేదు”. పోలీసులు అక్కపల్లి గ్రామంలోకి  రైతు సంఘం నాయకుల కోసం వచ్చారు. పోలీసులు రైతు సంఘం నాయకుల కోసం గ్రామంలోని వారి ఇండ్లల్లో వెతికారు.గ్రామంలో రైతు సంఘ నాయకులు ఎవరూ కనిపించలేదు.పోలీసులకు రైతు సంఘం నాయకుల జాడ దొరకలేదు.పోలీసులు రైతు సంఘం నాయకుల కోసం వెతుకుతుండగా అక్కపల్లి గ్రామంలో పోలీసులకు యువకుడు కనిపించాడు.పోలీసులు ఆ యువకుడిని ప్రశ్నించారు.అక్కపల్లి గ్రామంలోని ఆ యువకుడు తన గురించి చెబుతున్నాడు.నేను రైతు సంఘం యొక్క సభ్యుడిని కాదు.మా గ్రామంలో పోలీసులు వచ్చినప్పటికీ నేను వారిని గురించి పట్టించుకోలేదు అనే నిజం తెలియజేస్తున్నాడు. ”అప్పుడు వాళ్లు లోగడ ఆశ్రయమిచ్చి తిండి పెట్టిన వాళ్ల కోసం వచ్చారు/నా పైన ఆ దాఖలాలేవి లేవు/అందుకే నేను లక్ష్య పెట్టలేదు”అక్కపల్లి గ్రామంలోకి వచ్చిన పోలీసులు అన్నలకు ఆశ్రయమిచ్చిన తిండి పెట్టిన వాళ్ల కోసం వచ్చారు. పోలీసులు అన్నలకు ఆశ్రయమిచ్చి తిండి పెట్టిన వాళ్ళ కొరకు ఇండ్లల్లో వెతికారు.అన్నలకు ఆశ్రయమిచ్చిన తిండి పెట్టిన వారి జాడ దొరకలేదు.వారు ఎవరు కనిపించ లేదు.అక్కపల్లి గ్రామంలోని ఆ యువకుడు చెబుతున్నాడు.నేను అన్నలకు ఎలాంటి ఆశ్రయం ఇవ్వలేదు. ఎన్నడు వారికి తిండి పెట్టలేదు అని పోలీసులకు చెప్పాడు. అన్నలకు ఆశ్రయం ఇచ్చినట్టుగా తిండి పెట్టినట్టుగా నా పై గ్రామంలో ఏ ఆధారాలు ఎవరు చూపించ లేదు.అందుకే నేను పోలీసులు అక్కపల్లి గ్రామమునకు వచ్చినప్పటికీ నేను వారిని గురించి పట్టించుకోలేదు.”తర్వాత జామీనుదార్ల కోసం వచ్చారు/ నేను ఏ కేసులో ఏ నక్సలైట్ నాయకుడికి జామీనుపడలేదు/ అందుకే/ సంబంధం లేదన్నాను.”అక్కపల్లి గ్రామమునకు పోలీసులు అన్నలకు జామీను ఇచ్చిన జామీనుదార్ల కోసం వచ్చారు.పోలీసులు జామీనుదారుల ఇండ్లల్లో తిరిగి వెతికారు. జామీనుదారుల ఆచూకీ లభించ లేదు. పోలీసులు ఆ యువకుడిని జామీనుదారుల గురించి వివరాలు అడిగారు.ఆ యువకుడు నేను ఏ కేసులో ఏ నక్సలైట్ నాయకుడికి జామీను పడ లేదు అని జవాబు ఇచ్చాడు.అందుకే నాకు జామీను విషయంలో సంబంధం లేదు అని నిక్కచ్చిగా చెప్పాడు.”ఇవాళ్ళ పోలీసులు అరెస్టు చేశారు నన్ను/ ఎందుకో తెలుసా?/ నేను అక్కపల్లిలో పుట్టినందుకు/ అక్కపల్లిలో ఇరవై సంవత్సరాల నుండి  పెరిగినందుకు/ స్వేచ్ఛగా గాడుపు పీల్చినందుకు/దొరల మాట విననందుకు.”  అక్కపల్లి గ్రామంలోని యువకుడు నేను ఈ పల్లెలో పుట్టినందుకు 20 సంవత్సరాల నుండి ఈ పల్లెలో పెరిగినందుకు నన్ను పోలీసులు అకారణంగా అరెస్టు చేశారు.అక్కపల్లి గ్రామంలో నేను స్వేచ్ఛగా గాలి పీల్చినందుకు నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.అక్క పల్లి గ్రామంలో నేను దొరల మాట విననందుకు పోలీసులు నన్ను అరెస్టు చేశారు అనే నిజాన్ని యువకుడు చెబుతున్నాడు.ఈ కవిత పేరు నిజం అమాయకుడైన యువకుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు.జైలు నుండి విడుదల అయి కన్నీళ్లతో చెప్పిన కథను కవి మల్లారెడ్డి కవితగా రాసారు.దొరలు ఏమైన చేస్తారు. దొరలు పోలీసులను లంచాలతో తమ వైపు తిప్పు కుంటారు. దొరలు తమ మాట వినని అమాయకులను కేసులలో ఇరికించి జైలు పాలు చేస్తారు.ఆ యువకుడు నిజమైన విప్లవకారుడు ఆవునా? కాదా? అని పరిశీలించాల్సిన పోలీసులు ఒక్క క్షణం ఆలోచిస్తే బాగుండేది.కానీ చివరకు పోలీసులు ఏ నేరం చేయని అమాయకుడైన యువకుడిని బలి చేశారు.ఆ యువకుడి అశ్రుధారలు కవితా బిందు వులుగా మల్లారెడ్డి కలం నుండి నిజం కవితగా రూపు దిద్దుకున్నాయి.చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు రాక్షసత్వం ప్రదర్శిస్తూ అమాయకులను పట్టుకొని జైలు పాలు చేస్తున్నారు.బ్రిటిష్ కాలం నుండి వచ్చిన పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలి.నిజాయితీపరులను పోలీసులుగా ఎంపిక చేయాలి.ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేసి సమ సమాజంను స్థాపించాలి.నిజం కవిత సమాజానికి స్ఫూర్తిని అందిస్తుంది.కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను.కవి మల్లా రెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

ప్రముఖ కవి,జర్నలిస్ట్,సీనియర్ న్యాయవాది,గులాబీల మల్లారెడ్డి పల్లె పొలిమేరల్లోకి కవితా సంపుటిలోని గది –హృది కవిత పై విశ్లేషణా వ్యాసం.కవి తనలో కలిగిన భావాలను స్పందనలను కవితల రూపంలో వెల్లడిస్తున్నాడు.కవిత్వం సమాజంలో జరుగుతున్న సంఘటనలను ఆవిష్కరిస్తుంది.కవి మల్లారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ లా గ్రాడ్యుయేట్. ఉస్మానియా యూనివర్సిటీ లా హాస్టల్లో ఉండి విద్యాభ్యాసం కొనసాగించాడు.మల్లారెడ్డి సమాజ అభ్యుదయం కాంక్షించి రచనలు చేస్తున్నాడు.మల్లారెడ్డి విద్యార్థిగా చదువుకునే రోజుల్లో విద్యార్థి ఉద్యమాల్లో స్వయంగా పాల్గొన్నాడు.మల్లారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ గదిలో ఉండి న్యాయ విద్యను అభ్యసించాడు.మల్లారెడ్డి హాస్టల్  గదులకు హృదయాలు ఉంటాయని తెలియజేస్తున్నాడు.ఆ కాలంలో మన తెలంగాణ ప్రాంతంలో ఉస్మానియా యూనివర్సిటీ మరియు కాకతీయ యూనివర్సిటీ,రెండే రెండు యూనివర్సిటీలు ఉండేవి.జిల్లాకు ఒక డిగ్రీ కాలేజ్ ఉండేది.అందరు విద్యార్థులు చదువుకోవడానికి కాలేజీలో సీట్లు దొరికేవి కావు.పీజీ చేయడానికి రెండే యూనివర్సిటీలు.చదువుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ చదువుకునే అవకాశం అందరి విద్యార్థులకు దక్కేది కాదు. పేదరికం మరియు చదివిన చదువులకు ఉద్యోగాలు లేక చాలామంది విద్యార్థులు చదువులకు స్వస్తి చెప్పి పల్లెల్లోనే వ్యవసాయం చేసుకునేవారు.కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (జె) తుర్కవానికుంట మారుమూల గ్రామంలో పుట్టిన మల్లారెడ్డి ఉన్నత చదువులకై ఉస్మానియా యూనివర్సిటీ వెళ్లి సీటు సాధించి హాస్టల్ లో ఉండి లా విద్యాభ్యాసం పూర్తి చేశాడు.ఉస్మానియా యూనివర్సిటీ గడప తొక్కిన వారు ఆ కాలంలో చాలా అరుదని చెప్పవచ్చు. తుర్కవానికుంట గ్రామంలోని మల్లారెడ్డి మరియు రాజిరెడ్డి అనే ఇద్దరు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో విద్య నభ్యసించారని మనం గర్వంగా చెప్పవచ్చు. గది –హృది కవిత హాస్టల్ గదులకు అద్దం పడుతుంది.ఒక యువ విద్యార్థిలో కలిగిన సంఘర్షణలను కవితలో చిత్రించిన తీరు అద్భుతంగా ఉంది.”అది హాస్టల్ గది”.ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు హాస్టల్ గదులను కేటాయిస్తారు.ఆ రోజుల్లో విద్యార్థులు విద్యార్జనే  ధ్యేయంగా తమ చదువును రేయింబవళ్లు కష్టపడి కొనసాగించే వారు.మల్లా రెడ్డి విద్యార్థులు చదువుకునే హాస్టల్ గదులు ఎలా ఉంటాయో చక్కగా వివరించారు.”నాలో గదిలాంటి హృది/ మాసిన బిస్తరు/ చుట్టూర చిత్తు కాగితాలు / చిరిగిన చాప చింపు/గుడ్డిగా వెల్గుతున్న బల్బు/ గదినిండా దోమల సమ్మె/ రక్తానికి బదులుగా/ రక్తనాళాలలో సాంబారు/ ప్రవహింప చేస్తున్నాడని దోమల రోధ’.కవి మల్లారెడ్డి చదువుకునే సంకల్పంతో ఉన్న విద్యార్థుల గదులకు హృదయాలు ఉంటాయని కూడా చెబుతున్నాడు. హాస్టల్ గదిలో విద్యార్థుల హృదయాలు చేసే గుండె చప్పుళ్ళను రికార్డు చేసినట్టుగా తోస్తోంది. చదువుకునే విద్యార్థుల గదుల్లో ఏముంటాయి? మాసిన బిస్తర్లు ఉంటాయి.విద్యార్థులు కాలేజీకి వెళ్లి ప్రొఫెసర్ చెప్పేది శ్రద్ధగా వింటారు.నోట్స్ రాసుకుంటారు. కాలేజీ అయిపోగానే మళ్లీ గదికి వచ్చి చదివిన విషయాలను కాగితాలపై రాసుకుంటారు.గదిలో కాగితాలన్నీ చిందరవందరగా పేరుకు పోయి ఉంటాయి.గడ్డి మేసిన ఆవు తర్వాత తీరిగ్గా  నెమరు వేస్తుంది.అలాగే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రాసిన కాగితాలను చదివి మనస్సులో  నిక్షిప్తం చేసుకుంటారు. ప్రొఫెసర్ చెప్పిన నోట్స్ కాగితాలు గదుల్లో గుట్టలుగా పేర్చ బడి ఉంటాయి.అందుకే హాస్టల్ గది అంతటా చిత్తు కాగితాలతో నిండి ఉంటుంది.ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ లోని అన్ని గదులు దాదాపుగా ఇలానే ఉంటాయని చెప్పుకోవచ్చు. విద్యార్థులు చదువుకోవాలన్న దీక్షతో పోటీపడి చదువుతారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువులు ఒక  యజ్ఞంలా కొనసాగుతున్నాయి. విద్యార్థులు చిరిగిన చాపలో కూర్చుంటారు.హాస్టల్ గదిలో గుడ్డి బల్బు అలా వెలుగుతూనే ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలో చదువును  విద్యార్థులు నిరాటంకంగా కొనసాగిస్తారు.విశాలంగా పచ్చని చెట్లతో కళకళలాడుతూ ప్రకృతికి ప్రతిబింబంగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో దోమలు కూడా విస్తారంగా ఉన్నాయి.గది నిండా దోమలు సమ్మె చేస్తున్నాయి.విద్యార్థులు గదిలో ఉన్నంత కాలం వారిని దోమలు వెన్నంటి ఉంటాయి. హాస్టల్లో వేడి వేడి సాంబారు తింటారు.కాబట్టి విద్యార్థుల రక్తనాళాల్లో సాంబారు ప్రవహింప చేస్తున్నారని దోమలు సమ్మె చేస్తున్నవి.నిజమే ఆ గదుల్లో దోమలు అంతటా వ్యాపించి ఉంటాయి.సమ్మె చేసే దోమలకు విద్యార్థులు భయ పడరు. విద్యార్థులు చదువుల యజ్ఞమును నిర్విఘ్నంగా దీక్షగా కొనసాగిస్తారు.“అది నా గదిలోని వాస్తవిక గాధ”.అది నా గదిలో జరుగుతున్న వాస్తవిక గాథ అని నిజాయితీగా ఒప్పుకుంటున్నాడు.”మరి హృది” విద్యార్థుల హృదయం గురించి వారిలో చెలరేగుతున్న హృదయాలోచనలను ఆవిష్కరిస్తున్నాడు.“ఇదిగో అణగారిన ఆశలు/ జీవితం  ముళ్ళబాట / ఆరిపోతున్న దీపం లాంటి కోరిక” తల్లిదండ్రులు తమ కుమారులు చక్కగా చదువుకోవాలని కోరుకుంటారు. పిల్లలు కూడా అలాగే అమ్మా నాన్నల కలలు నిజం చేయాలనే సాధనలో ఉంటారు.ఉద్యోగం సంపాదించాలి. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి.తను పెళ్లి చేసుకునే అమ్మాయి అందంగా ఉండాలి.కోట్ల ఆస్తిని కట్నంగా తీసుకోవాలి అని చాలా మందికి ఇలాంటి గొంతెమ్మ కోరికలు,ఎదలో గొప్ప ఆశలు కూడా ఉంటాయి.కొందరు విద్యార్థులు వర్తమానంలో జీవిస్తారు.కొందరు విద్యార్థులు వెలుగుతున్న దీపంలా ఉంటారు.కొందరు విద్యార్థులు సమాజం గురించి ఆలోచిస్తారు.కొందరు విద్యార్థులు సామాజిక బాధ్యతను గుర్తెరిగి నడుచుకుంటారు.కొందరు విద్యార్థులు సమాజంలో ధనికులు,పేదలు అనే రెండు వర్గాలు ఎందుకు ఉన్నాయి? అని ఆలోచిస్తారు.ధనికులు పేదలపై చలాయించే ఆధిపత్యం,వివక్ష చూపడం,మనసును కలచివేసే విషయాలపై అవగాహనతో పోరు బాటన సాగుతారు. మనుషులంతా ఒకటే కదా మరి పేద గొప్ప తేడాలెందుకు? అందరిలో ప్రవహించే రక్తం ఒకటే కదా.కుల మతాల పేరిట కొనసాగుతున్న వివక్ష ఏమిటి? అగ్ర వర్ణాలు చేస్తున్న దోపిడీలు దౌర్జన్యాలకు అంతం లేదా? పేదలు ఆరుగాలం కష్ట పడి పని చేస్తున్న కడుపు నిండా తిండి ఎందుకు దొరకదు.పేదలు పస్తులతో ఎందుకు జీవితం గడుపుతున్నారు. తరతరాలుగా పేదరికంతో ఎందుకు మగ్గుతున్నారు.పేదలు చదువు సంధ్య లేక అనాగరికులుగా వెట్టిచాకిరి చేయడం ఏమిటి? పేదలపై జరుగుతున్న దోపిడీకి చరమగీతం పాడాలని సంకల్పం కొందరిలో ఉంటాయి.” ఆ గది/ ఈ హృదికి ప్రతిబింబం/ఈ హృది/ ఆ గదిని/ కూల్చి రేపటి సౌభాగ్యం కోసం/  చెట్ల నీడల్లోకి/కొండ గుహల్లోకి/బాధలు లేని బంజరు భూముల్లోకి/ సూర్యుడి కిరణాలపై పయనిస్తా/ అమృత లోకాల కోసం బాణం సంధిస్తా.” విద్యార్థి ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్న రోజులవి. కొందరు విద్యార్థులు చదువు పూర్తి కాగానే ఒక లక్ష్యంతో సమాజాన్ని పట్టి పీడిస్తున్న అసమానతలకు చరమ గీతం  పాడేందుకు కంకణం కట్టుకున్నారు.విద్యార్థులు ప్రభంజనంలా ఉద్యమాల్లోకి దూకారు.సమాజంలో చైతన్యం తీసుకురావాలి అనే సంకల్పంతో అడవులు కొండల బాటలు పట్టారు.కొందరు విద్యార్థులు తమ జీవితాలను ఉద్యమాలకు అంకితం చేశారు. కొందరు విద్యార్థులు భరతమాత ముద్దు బిడ్డలై ప్రజా పోరాటాల్లోకి చేరి ప్రజలను మమేకం చేసే దిశగా ఎదిగారు. ప్రజలకు రాత్రిపూట చదువు నేర్పించినారు.నిరక్షరాస్యత నిర్మూలన,కూలీల రేట్ల పెంపు,వెట్టి చాకిరి నిర్మూలనతో పాటు ప్రజలను సంఘటిత పరిచారు.ప్రజల హక్కులు ఏమిటో తెలియజేసి పోరాటం చేస్తేనే హక్కులు సాధిస్తాం.పోరాటం లేకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండి పోతాం. ప్రజలకు కూడా తమ సంక్షేమం గురించి పాటుపడుతున్న కార్యకర్తల పట్ల నమ్మకం పెరిగింది. ప్రజలు ఐక్యం అవ్వడం వలన ఉద్యమాలకు ఊపు వచ్చింది.ప్రజలలో వచ్చిన చైతన్యం చూసి పల్లెలో తమ అధికారం సాగదని దొరలు గ్రామాలు విడిచి పారిపోయినారు. దొరలు పట్టణంలో నివాసం ఏర్పాటు చేసుకుని జీవించసాగారు.ఆ యువకులు సూర్యుడి కిరణాలపై పయనిస్తారని అమృత లోకాల కోసం బాణం సంధిస్తారనే కవి భావన అద్భుతంగా ఉంది.సమ సమాజం కోసం పాటుపడేవాళ్లు సూర్యుడి కిరణాలపై పయనిస్తారు.అమృత లోకాలను స్వర్గమంటారు.స్వర్గంలో పాపులకు చోటు లేదు.ప్రజల కోసం అహరహం పాటుపడుతున్న ఆ యువకులను అమృత లోకాలు అక్కున చేర్చుకుంటాయనే కవి భావన చక్కగా ఉంది.చక్కని కవితను అందించిన కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను.కవి మల్లారెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను. 

ప్రముఖ కవి,జర్నలిస్ట్,సీనియర్ న్యాయవాది,గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన పల్లె పొలిమేరల్లోకి  కవితా సంపుటిలోని ఖైది సంకల్పం కవిత పై విశ్లేషణా వ్యాసం. నేరస్తులు అంటే సమాజంలో చెడు అభిప్రాయం ఉంది. నేరాలు,ఘోరాలు,హత్యలు,అత్యాచారాలు,దోపిడీలు, దొంగతనాలు,దొమ్మీలు,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వాళ్లను బంధించి జైలుకు పంపిస్తారు.నేరస్తులు నేరాలు చేయడమే వృత్తిగా ఏర్పరచుకుంటారు.కరుడుగట్టిన నేరస్తులు నేర సామ్రాజ్యం స్థాపించి నేరాలకు పాల్పడుతుంటారు. అటువంటి నేరస్తుల ఆట కట్టించేందుకు పోలీసులు,చట్టాలు, న్యాయస్థానాలు ఉన్నాయి.న్యాయ స్థానంలో నేర నిరూపణ కాగానే నేరస్తులను జైలుకు పంపిస్తారు.జైల్లో ఉన్న నేరస్తులను ఖైదీలు అంటారు.న్యాయస్థానం నేరస్తులను జైలుకు పంపించడం వారికి సరియైన శిక్షగానే భావించ వచ్చు.ఒక ఆశయం కోసం స్వరాజ్య సాధనే లక్ష్యంగా స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాడి అల్లూరి సీతారామరాజు అమరులయ్యాడు. బ్రిటిష్ వాళ్ళతో స్వరాజ్యం కోసం పోరాడుతూ చాలామంది యువకులు పట్టుబడి జైలు పాలయ్యారు.స్వాతంత్ర్యం సాధించాలన్న లక్ష్యం సంకల్పం వాళ్లలో కనిపించేది.దేశం కోసం పోరాడిన వాళ్లను రాజకీయ ఖైదీలు ఉంటారు.భగత్ సింగ్, రాజగురు,సుఖదేవ్ పార్లమెంట్లో బాంబులు వేసి పట్టుబడ్డారు. తప్పించుకునే అవకాశం ఉన్నా పారిపోలేదు.బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్, రాజగురు,సుఖదేవ్ లాంటి గొప్ప వీరులను ఉరి తీసింది.అశేష భారత ప్రజానీకం దృష్టిలో భగత్ సింగ్,రాజగురు, సుఖదేవ్ అమరవీరులుగా నిలిచారు.భారత దేశ చరిత్రలో ఆ ముగ్గురికి విశేషమైన స్థానం ఉంది.ప్రతి సంవత్సరం ఆ విప్లవ వీరులకు నివాళులర్పిస్తారు.వీరు భరతమాత గుండెల్లో కల కాలం గుర్తుండి పోయే వీరులు.కవి మల్లారెడ్డి జైల్లో ఉన్న ఖైది సంకల్పాన్ని మొక్కవోని ధైర్యాన్ని కవిత్వీకరించారు.కవితను కొత్త పుంతలు తొక్కించారు.ఖైదీలు ఎక్కడ ఉంటారు? అని ప్రశ్నిస్తే జైలులో అని ఠక్కున సమాధానం వస్తుంది.కటకటాల్లో ఖైదీ అంటే ఎవరు? జైల్లో ఉన్న ఖైది.జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైది ఏం చేస్తుంటాడు? జైల్లో  ఖైదీ కటకటాల్లో బందీగా ఉంటాడు.జైలులో ఉన్న ఖైది కళ్ళలో చిరు నవ్వులు ఉంటాయా?జైలులో ఉన్న ఖైది చూపుల్లో చిరు దివ్వెలు ఉంటాయా? జైలులో ఉన్న ఖైది ముఖారవిందంలో  తరగని సంకల్పం ఉంటుందా?కవి మల్లారెడ్డి ఖైది కళ్ళల్లో మెరుస్తున్న చిరునవ్వులు చూశారు.జైలులో ఉన్న ఖైదితో మాట్లాడుతూ చిరునవ్వులు పూయించారు.జైలులో ఉన్న ఖైది చూపుల్లో చిరుదివ్వెలు చూశారు.జైలులో ఉన్న ఖైది ముఖారవిందంలో తరగని సంకల్పాన్ని చెదిరిపోని దీక్షను చూశారు.ఒక లక్ష్యం కోసం,ఒక ఆశయం కోసం,ఒక ఆదర్శం కోసం, మొక్కవోని దీక్షతో పనిచేసిన భగత్ సింగ్,రాజగురు, సుఖదేవ్ లలో మంచి లక్షణాలను మనం చూశాం.భారత దేశ స్వాతంత్ర్యం కాంక్షించి ఎందరో వీరులు అమరులయ్యారు. ఆనాటి ఆ వీరుల త్యాగాల ఫలితం మనం సాధించుకున్న స్వరాజ్యం.ప్రత్యేక తెలంగాణ కోసం తొలి దశ ఉద్యమంలో 1969 సంవత్సరంలో 369 మంది యువకులు బలి అయ్యారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేశారు.ఆ వీరుల త్యాగ ధనుల ఫలితమే మనం అనుభవిస్తున్న బంగారు తెలంగాణ.ప్రత్యేక తెలంగాణ కొరకు ఆ వీరులు బలి అయి తెలంగాణ పువ్వులు పూయించారు.2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం  ఏర్పడింది.తెలంగాణ కొరకు ఎందరో యువకులు జైలు పాలయ్యారు.తన రక్తాన్ని ఇచ్చి నవమాసాలు కడుపులో మోసిన తల్లి తన కొడుకును జైలులో చూడవలసి రావడం దిగులు కలిగిస్తుంది.జైలులో తన కొడుకును చూసిన తల్లికి కళ్ళ నుండి కన్నీళ్లు జాలువారినాయి. విద్యాబుద్ధులు నేర్పించి పెంచిన కొడుకు పై తల్లికి అపారమైన ప్రేమ అభిమానాలు ఉంటాయి. ”నువ్వేం చేసావు నాన్న?/ ఎవరికోసం చనిపోతావు ?/అర క్షణం మౌనం… .జైలులో ఉన్న కొడుకుతో అమ్మ అలా అడగింది.అమ్మ ఎవరు? అమ్మ ప్రత్యక్ష దైవం.అమ్మ పరమాత్మ స్వరూపం. అమ్మ కొడుకు పై ఉన్న ప్రేమతో అలా అడగడం సహజం అనిపిస్తుంది.“ఎక్కడో మారుమూల/గుండె కొండల్లో ప్రతిధ్వనులు”.మనుషులకు గుండెలు ఉంటాయి.మనుషులు మాట్లాడితే ధ్వనులు వినిపిస్తాయి.మారు మూల కొండల్లో మనిషి మాట్లాడితే ధ్వనులు,ప్రతిధ్వనులుగా వినిపిస్తాయి.కొండలకు కూడా గుండెలు ఉంటాయని వాటికి ప్రతిధ్వనులు ఉంటాయని కవి మల్లారెడ్డి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది. “ప్రజల కోసం/ వ్యవస్థ మార్పు కోసం/సమస్త జనావళి సుఖ సంతోషాల కోసం”.ప్రజల కోసం ఆ యువకుడు మారు మూల కొండల్లో కోనల్లో నివసిస్తూ అహరహం శ్రమ పడుతున్నాడు.వ్యవస్థ మార్పు కోసం సమస్త జనావళి సుఖ సంతోషాల కోసం పోరు బాట పట్టిన యువకుడిని బంధించి జైల్లో వేశారు.”మరుక్షణమే/ అమాయకపు అమ్మ కోసం బదులు”. జైలులో ఉన్న ఆ యువకుడు అమ్మను ఓదార్చడం కోసం అమ్మతో మాట్లాడుతూ ధైర్యం నూరి పోస్తున్నాడు.“అమ్మా పక్కింటి చిన్నాన్న ఎలా ఉన్నాడు”. జైలులో ఉన్న ఆ యువకుడు అమ్మతో మాట్లాడుతూ మన పక్కింటిలో  గల చిన్నాన్న ఎలా ఉన్నాడు? అని ప్రశ్నించాడు.అమ్మ జవాబు ఇస్తూ చిన్నాన్న కలరాతో చనిపోయాడు అని చెప్పింది.“నాన్నగారి స్నేహితుడు అప్పారావు…? ఎలా ఉన్నాడు అని అమ్మను ప్రశ్నించాడు. అమ్మ జవాబు ఇచ్చింది. “ఇద్దరాడ పిల్లల పెళ్లిళ్లు చేయలేక/మనో వ్యాధితో మంచం పట్టాడు/ రేపో మాపో రోజులు లెక్కబెట్టుతున్నాడు”.అమ్మ జవాబు విని ఆ యువకుడు “అందరు అంతేనమ్మా/ఏదో ఒక రోజు పోవాల్సిందే”. అని సమాధానం ఇచ్చాడు.జాతస్య హి ధృవో మృత్యు :  భగవద్గీతలో ఉంది శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ప్రబోధిస్తున్నాడు.పుట్టిన వారికి మరణము తప్పదు మనం ఈ భూమి మీదకు వచ్చింది.ఏదో ఒక రోజు మళ్ళీ మనం తిరిగి వెళ్లి పోవాడానికే పుట్టడం గిట్టడం ఇది ఒక అనివార్య కార్యక్రమం. దీన్ని ఎవరు ఆపలేరు.ఇది ఒక జీవన చక్రం.ఇది ఒక జీవిత ప్రయాణం అని తాత్వికంగా అమ్మకు ప్రబోధిస్తున్నాడు. “కాని/మా కలలు నిజాలు అవుతాయి/అప్పుడే కటకటాలుండవు/కన్నీళ్లు ఉండవు”.అని ఆ యువకుడు అమ్మకు తెలియజేస్తున్నాడు.ఏ సంకల్ప సాధన కోసం మేము పోరాడుతున్నామో మా కలలు నిజాలు అవుతాయి. మేం విజయం సాధించిన తర్వాత అప్పుడు కటకటాల జైళ్లుండవు.ఎవరి కళ్ళలో కన్నీళ్లుండవు.అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు కాదు,సంతోషంతో ఆనంద భాష్పాలు ఉబికి వచ్చాయి.
“ఖైది కళ్ళలో/ తిరుగుబాటు బావుటా రెపరెపలాడింది”.జైలులో ఉన్న ఖైది కళ్ళలో తిరుగుబాటు జెండా ఎగురవేసినట్లు కనిపించింది.ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్యంలో ప్రజలకు సుఖ శాంతులు లభించడం లేదు. ఈనాటికీ దోపిడీ విధానం కొనసాగుతుంది.పాలక వర్గాలు చేస్తున్న దోపిడిని అరికట్టడం కొరకు యువకులు మార్పు కోసం పోరాడుతున్నారు.ఈ దేశంలో నివసిస్తున్న తల్లులు ప్రజల జీవితాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న తమ పిల్లలను జైలులో ఖైదిలుగా చూస్తున్నారు.ఈ వ్యవస్థ మారాలని కాంక్షించే వాళ్లలో కవి మల్లారెడ్డి ఒకరు.అతడు రాసిన ఖైది సంకల్పం కవిత సమాజానికి ఒక ప్రేరణగా నిలుస్తుంది.ఖైది సంకల్పం కవిత దిక్సూచిగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. మంచి కవితను రాసిన కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను.కవి మల్లా రెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని  మనసారా కోరుకుంటున్నాను.

ప్రముఖ కవి,జర్నలిస్ట్,సీనియర్ న్యాయవాది, గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన”పల్లె పొలి మేరల్లోకి” కవితా సంపుటిలోని 164 (c r p c ) STATEMENT.( స్టేట్ మెంట్) కవిత పై విశ్లేషణా వ్యాసం.క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టం,1973, తెలుగులో నేర విచారణ చట్టం,1973.ఏమి చెబుతుంది.?పోలీసులు వారి బాధ్యతలను,న్యాయస్థానాల చర్యలను,నేరారోపణ చేయబడిన వారి హక్కులను,ఇతర విషయాలను నేర విచారణ చట్టం తెలియజేస్తుంది.నేరం చేసిన వారిని ఖైదు చేసి,కాపలాలో ఉంచి,తగిన నేరారోపణ చేసి, న్యాయ స్థానం సమక్షానికి హాజరు పరిచి,విచారణ తర్వాత, నేరానికి తగిన శిక్షను న్యాయస్థానం విధిస్తున్నది.నేరం సమాచారం అందగానే, దర్యాప్తుని ప్రారంభించి పోలీసు వారు చర్య తీసుకుంటారు.నేరస్థుని పట్టుకోవడం నుంచి అతన్ని విచారణకు లోబరచడం వరకు చర్య తీసుకోవాల్సి ఉన్నది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 164 (c r p c)  STATEMENT (స్టేట్మెంట్)ఏం చెప్తుంది.అంగీకారాన్ని వాంగ్ములాల నమోదు చేయుట గురించి తెలుపుతోంది.వాంగ్మూలాల నమోదు,ఎవరు నమోదు చేస్తారు?పోలీసులు వాంగ్మూలం నమోదు చేస్తారు.చీమలు పుట్టలు పెడతాయి.చీమల పుట్టల్లో పాములు చేరతాయి.పల్లెల్లో చేనులు,చెల్కల్లో పుట్టలు ఉంటాయి.పుట్టల్లో పాములు ఉంటాయని జనాలు దూర దూరంగా వెడతారు. పాములను నాగదేవతగా నాగుల పంచమి రోజున పూజిస్తారు. పాములు బయటకు వస్తే బడిత పూజ చేసి చంపేస్తారు.పాము కోరల్లో విషం ఉంటుందని పాము కుడితే చనిపోతారని జనం నమ్మిక.ఎర్ర చీమలు,నల్ల చీమలు,పసుపు చీమలు,అని చాలా రకాల చీమలు ఉన్నాయి.All ants are social and live in colonies.చీమలు బాగా కష్టిస్తాయని శ్రమజీవులు అని అంటుంటారు.వేసవిలో చీమలు తమ కొరకు ఆహారాన్ని సేకరిస్తాయి.చీమల ఆహారం విత్తనాలు.చీమలు మనుష్యులకు ఎంతో సహాయం చేస్తాయి.నెపోలియన్ చక్రవర్తి ప్రపంచ సామ్రాజ్యాధిపత్యం సంపాదించాలన్న కాంక్షతో ఎన్నో యుద్ధాలు చేశాడు.కొన్ని యుద్ధాలు గెలిచాడు.కొన్నింట్లో  పరాజయం పాలయ్యాడు.నెపోలియన్ చక్రవర్తి యుద్ధం చేసి అలసిపోయి ఒక కొండ గుహలో దాగి విశ్రాంతి తీసుకుంటున్నాడు.ఆ కొండ గుహలో చీమను చూశాడట. ఎన్నిసార్లు విఫలమైనా చీమ తన ప్రయాణాన్ని అలాగే కొనసాగిస్తుంది.నెపోలియన్ చీమను ఆదర్శంగా తీసుకొని రాజ్య కాంక్ష అయిన యుద్ధాలను కొనసాగిస్తూ ప్రపంచ విజేతగా నిలిచాడని చరిత్ర వల్ల మనకు తెలుస్తున్నది.కవి మల్లారెడ్డి 164 (c r p c) STATEMENT ( స్టేట్ మెంట్) కవిత ద్వారా సమాజానికీ హిత బోధ చేస్తున్నాడు.చీమల్లాగా జీవిస్తున్న 90% జనాలకు ఈ కవిత ఒక స్ఫూర్తిని ఒక వెలుగును ప్రసాదిస్తుంది.”చీమలు పెట్టిన పుట్టలు చీమలకే చెందాలని/ పాములు దూరితే పడగలు కోయండని/చిట్టి చిట్టి చీమలకు కర్తవ్యాన్ని నిర్దేశిస్తాను”.చీమలను ఉదాహరణగా తీసుకొని చీమల్లాంటి కోట్లాది జనాలకు పాములు దూరితె పడగలు కోయండని కర్తవ్యాన్ని తెలియజేస్తున్నాడు.ఎంత బలవంతమైన సర్పమైన సరే ఐక్యంగా కలిసి పోరాడిన చలి చీమల ధాటికి ఆగలేదని చీమలకు విజయం కలుగుతుందనే జీవన సత్యాన్ని నూరి పోస్తాను అని అంటున్నాడు.బలవంతమైన సర్పం చలి చీమల చేతికి చిక్కి చావదె సుమతి అని.సుమతి శతక కారుడు బద్దెన చెప్పినట్లు మనం చదువుకున్నాం.”అనంత జీవరాశిలో/
పది శాతం లేని పాముల మాట నమ్మితే/ పాలకవర్గం పాములకే  పావులుగా మారితే/ నా కలాన్ని లాగేస్తే/ నా గళాన్ని నొక్కేస్తే/ఊపిరాడేంత వరకు/ పిడికిలితో పోరాడుతాను/కత్తి లేకున్నా సరే ప్రాణమైన విడుస్తాను”.సృష్టిలో అనంతమైన జీవరాసులు ఉన్నాయనే సంగతి మనందరికీ తెలుసు.ప్రతి జీవికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.మానవుడు రెండు తెగలుగా విడిపోయాడు. 1) ధనికులు 2)  పేదలు.10 శాతం ఉన్న ధనికులు, 90 శాతం ఉన్న పేదలపై అధికారం చెలాయిస్తున్నారు.10 శాతం లేని ధనిక పాముల మాట చలామణి అవుతోంది.పాలకవర్గం కూడా ధనిక పాముల మాటకే పావులుగా మారుతున్నది. 90 శాతం కంటే ఎక్కువ ఉన్న పేదల పక్షాన పోరాడే కలాలు గళాలు ఉన్నాయి.“నా కలాన్ని లాగిస్తే/నా గళాన్ని నొక్కిస్తే/ఊపిరాడేంత  వరకు/పిడికిలితో పోరాడుతాను”.సామాజిక దృక్పథంతో కవులు రచయితలు పేదల పక్షాన రచనలు చేస్తున్నారు.ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు గళాలను విప్పుతున్నారు.“కత్తి లేకున్నా సరే/ ప్రాణమైన విడుస్తాను”.అని ప్రతిన పూని పొరుబాట సాగిస్తున్న వీరులు ఉన్నారు.ఎందరో వీరులు ప్రాణాలు పణంగా పెట్టి పోరు సలుపుతున్నారు.ప్రజా పోరాటాలు ఉధృతంగా సాగుతున్నాయి. తమ హక్కుల కోసం అణగారిన వర్గాల్లో చైతన్యం మొదలైంది.
“కాని/నిరాశా వాదాన్ని/కర్మ సిద్ధాంతాన్ని/మర్మ సిద్ధాంతాన్ని/ మాయా సిద్ధాంతాన్ని/నా చుట్టూర పడి ఉన్న/చీమలకు మాత్రం చస్తే చెప్పను.” చీమలను మాత్రం సరైన దారిలో నడిపిస్తానని ప్రతిన చేసి చెప్తున్నాడు.90 శాతం ఉన్న చీమల్లాంటి జనాలు పేదరికం,అవిద్య,నిరుద్యోగం,అసమానతలు,కుల వివక్ష ఎదుర్కొంటున్నారు.పౌరుల హక్కుల కోసం పోరాడుతున్న కలాలను గళాలను చంపుతున్నారు.అయినప్పటికీ 90 శాతం ఉన్న చీమల్లాంటి ప్రజలకు నిరాశా వాదాన్ని,కర్మ సిద్ధాంతాన్ని, మర్మ సిద్ధాంతాన్ని,నా చుట్టూర పడి ఉన్న వాళ్లకు చస్తే చెప్పను. చీమలను ఉదాహరణగా చెబుతూ 90 శాతం ప్రజలకు హామీ ఇస్తున్నాడు.కవి మల్లారెడ్డి మానవులంతా ఒక్కటేనని ధనిక,పేద తేడాలు ఎందుకని సమానత్వంతో అందరూ క్షేమంగా ఉండాలని  కాంక్షించే వారిలో ఒకరని 164( c r p c) STATEMENT ( స్టేట్ మెంట్) కవిత చదివితె తెలుస్తుంది.ప్రజాస్వామ్య దేశంలో మనం  నివసిస్తున్నాం.ప్రజల కొరకు ప్రజల చేత  పాలింపబడే దేశమని గొప్పలుగా  చెప్పుకుంటున్నాం.ప్రజాస్వామ్యం అపహస్యం  పాలయింది.మునుగోడు ఎలక్షన్లు అవి ఎలక్షన్లే కావని ప్రజలు డబ్బుకు అమ్ముడుపోయారనే సంగతి లోకమంతా ఎరిగిందే. అక్కడ ఏ పార్టీ గెలిచిన అది గెలుపు కాదని బలుపు అని ప్రజలంతా ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు.ఇంకా సమాజంలో అసమానతలు,వివక్ష  కొనసాగుతుంది.  అసమానతలు వివక్ష రూపుమాపడానికి ప్రజాస్వామ్యవాదులైన కవులు,రచయితలు, ఉద్యమకారులు,కళాకారులు,తమ జీవితాలను అంకితం చేస్తున్నారు.హక్కుల కోసం పోరాడే వాళ్లను అంతం చేస్తున్నప్పటికి.ప్రజా పోరాటాలు నిరంతరం కొనసాగుతునే ఉన్నాయి.ప్రజలకు స్ఫూర్తిని చైతన్యాన్ని కలిగించే కవితను అందించినందుకు కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను. కవి మల్లారెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

ప్రముఖ కవి,జర్నలిస్ట్, సీనియర్ న్యాయవాది, గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన “పల్లె పొలిమేరల్లోకి” కవితా సంపుటిలోని “చేదు మాత్ర” కవిత పై విశ్లేషణా వ్యాసం.చేదు మాత్ర ఎవరికి ఇస్తారు?అనారోగ్యంతో బాధపడుతున్న వారికి రోగం నయం కావడానికి డాక్టర్ చేదు మాత్ర ఇస్తాడు. ఆయుర్వేదం,యునాని,హోమియోపతిలలో వ్యాధులు నయం కావడానికి మూలికలతోని  మందులు తయారు చేస్తారు.ప్రకృతి ప్రసాదించిన చెట్ల నుండి మందులు తయారు చేయడం ఏమిటి? చిత్రంగా అనిపించవచ్చు.చేదు మాత్ర ఏమిటి? చేదు మాత్ర వేసుకుంటే రోగం తొందరగా నయమవుతుందని రోగులకు అపారమైన విశ్వాసము.చేదు మాత్ర ఇవ్వడానికి మల్లారెడ్డి మెడిసిన్ చదివిన డాక్టర్ కాదు.వృత్తి రీత్యా సీనియర్ న్యాయవాది,ప్రవృత్తి రీత్యా కవి.ఇందులో ఏదో మతలబు ఉంది. చేదు మాత్ర కవితను ఆసక్తితో చదివాను.నాకు చాలా నచ్చింది. మా పల్లె గొల్ల ఎల్లయ్య గొర్ల కాసుకుని జీవించే వాడు.జీవాలను పెంచుతూ వాటిని పొద్దుగాల నుండి చీకటి పడే వరకు మేపుతూ రాత్రి కాగానే గొర్ల మందకు కంచె వేసి జీవాల మధ్యనే జీవించే అమాయక జీవి. జీవాలను మేపుతూ వాటికి దాహం వేస్తే చెరువుల  వద్ద నీటిని తాపే వాడు.ఇంటి నుండి సద్ది మూట తెచ్చి ఇస్తే స్నానం చేసి అక్కడే ముద్ద మింగి జీవాలతో జీవంగా బతికిన వాడు.అక్షరం పోకడ రాని వాడు.ఎల్లయ్య తల్లిదండ్రులు కూడ జీవాల పెంపకంతోనే జీవితం గడిపారు. ఎల్లయ్యకు చదువు అంటె అదెట్లుంటదో అతనికి తెలువదు. ఎల్లయ్య కూడ తల్లిదండ్రులు ఎలా జీవాలతో మెదిలారో తను కూడ అలా జీవాలతో గడుపుతూ చదువు సంధ్య జోలికి పోలేదు.జీవాలతోనే జీవనాన్ని కొన సాగించాడు.ఊర్లో బడి ఉన్నప్పటికీ తోటి పిల్లల్లా చదువుకోవాలనే ఆలోచన లేని వాడు. ఇరుగు పొరుగు పిల్లలు బడికి పోయి చదువుతుంటే వాళ్ళ లాగా చదవాలని అనుకోలేదు.నలుగురి దగ్గరికి వెళ్లి మాట్లాడలేని వాడు.ఎల్లయ్య గొర్రెలు ఎన్ని కాస్తున్నాడో తెలియని వాడు.గొర్రెల గుర్తులే ఆనవాలుగా ఏలుకునేటోడు కరీంనగర్ జిల్లాలో పుట్టాడు కానీ కరీంనగర్ ని కన్నాగురం అనెటోడు.karal Marx అనటానికి నోరు తిరగని వాడు.”ఏదో అన్యాయం జరిగి/వాడిలో అవేశం పెరిగి/ ఎవడి రక్తం వాడికే చెందాలి/ఎవడి చెమట వాడే పొందాలి/మధ్యలో దొర ఎవ్వడు?/వాని పోక డేంది? /పటేలు ఎవ్వడు?/వాని పటాటోపం ఏంది/అన్నంత మాత్రాన/నక్సలైట్ ఎలా అవుతాడు/వాడి దగ్గర బాంబు లెందుకుంటాయి/ కేసు పెట్టిన నాడు/ఒక్క పోలీసులకే మెదడు లేదనుకున్నాను/నేడు తీరా శిక్ష పడ్డాక/జడ్జిలలో పోలీసు తమ్ముళ్లు ఉన్నారని/నన్ను నేను సముదాయించుకున్నాను.”ఈ కవితను వ్రాసిన సీనియర్ న్యాయవాది మల్లారెడ్డి మా పల్లె గొల్ల ఎల్లయ్యకు సంబంధించిన కేసును వాదించినాడు.గొర్లు కాచే వాళ్ళు పోలీసు అధికారులకి పండుగల పేరిట జీవాలు ఇనాంగా ఇవ్వాలి.దొరలకి,పటేండ్లకి పెండ్లిండ్లకి మరియు పేరంటాలకు జీవాలు ఇనాం ఇవ్వాలి.ఎల్లయ్యకు దొరలపై,పటేండ్లపై,మరియు పోలీసులపై వానికి కక్ష ఎందుకు ఉంటుంది.ఎల్లయ్య జీవాలను కాస్తూ వృత్తి జీవితాన్ని గడుపుతున్నాడు.ఎల్లయ్య దగ్గర బాంబులు ఎందుకు ఉంటాయి.అమాయకుడు ఎల్లయ్య మీద కేసు బనాయించడం, దొరలు పటేండ్ల  ప్రోద్బలంతో జరిగినట్లుగా తోస్తుంది.నక్సలైట్లను ఎదుర్కోలేక అమాయకుడైన ఎల్లయ్య మీద కేసు బనాయించారు.సాక్ష్యాధారాలు పరిశీలించి జడ్జి అమాయకుడికి  శిక్ష వేయడం ఎంతవరకు సబబు? అమాయకుని మీద కేసు పెట్టిన పోలీసులకే మెదడు లేదనుకున్నాను.కాని తీరా శిక్ష పడ్డాక జడ్జిలలో కూడ పోలీసు తమ్ముళ్లే ఉన్నారని నన్ను నేను సముదాయించుకున్నాను అని వ్రాసిన కవిత చేదు మాత్రగా ఉంది.ఆనాటి  వైద్యులు ధన్వంతరి వారసులు ధరణిలోని దేవతలు ఇచ్చిన చేదు మాత్ర రోగాన్ని నయం చేస్తుంది.అమాయకుడైన  గొల్ల ఎల్లయ్యకు వేసిన శిక్ష చేదు మాత్ర. జడ్జిలలో పోలీస్ తమ్ముళ్లే ఉన్నారు అనడం మల్లారెడ్డి సంస్కారాన్ని తెలియజేస్తుంది.చాలా మంది జడ్జిలు కింది నుండి పై దాకా అన్యాయపు తీర్పులు ఇస్తూ అమాయకుల ఉసురు పోసుకుంటున్న తీరును చేదు మాత్ర కవిత ద్వారా వెల్లడి చేశారు.మనసున్న మనుషులు గా చేదు మాత్రను ఇచ్చి రోగాలను నయం చేసే ఆనాటి వైద్యుల వలె మసలు కోవాలి.ఈనాటి వైద్యులు శవాలను అడ్డు బెట్టుకొని డబ్బులు దండుకుంటున్న  తీరును గర్హించాలి.చేదు మాత్ర కవితను పోలీసులు మరియు జడ్జిలు చదవాలి.మంచి కవిత చదివితే సమాజం కొరకు మంచి చేయాలన్న ఆలోచన కలుగుతుంది.పోలీసులు మరియు జడ్జిలలో పరివర్తన రావాలని సమాజ సంక్షేమం కోసమే పాటు పడాలని కోరుకుంటున్నాను. మంచి కవితను రాసిన కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను.కవి మల్లా రెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

ప్రముఖ కవి,జర్నలిస్ట్,సీనియర్ న్యాయవాది,గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన”పల్లె పొలిమేరల్లోకి “కవితా సంపుటి లోని “నిశ్శబ్ద నిరాకార ఛాయ చిత్రాలు”కవిత పై విశ్లేషణా వ్యాసం.కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది.కవి మల్లారెడ్డి కవితా చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారిద్దాం.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకుందాం.”మానవతా శిఖరాలని/ అధిరోహించాలని జిగీషీతో/ తపనతో/ఎన్నెన్నో కలలు – అంతర్యంలో  అలలు/ దారిలో ఎన్ని ఆటంకాలు -అవరోధాలు”.కవి మల్లారెడ్డి కవితా పంక్తులు ఎంతో మంచి భావనలను కలిగి ఉన్నాయి.తన కలం ద్వారా సృజన శక్తికి పదును పెట్టాడు.ఇవ్వాళటి సంక్షుభిత సమాజంలో అసలు మానవత్వం ఉందా? అని ప్రశ్నించుకోవలసిన అవసరం వచ్చింది.మానవత్వం ఎక్కడో మూలన చేరి మరుగున పడిన మాణిక్యం వలె దాగి ఉందా? అనే సందేహాం మనలో పొడ చూపుతుంది.ఎవరైనా వ్యక్తి మానవత్వం గురించి మాట్లాడితే పాత కాలం నాటి వ్యక్తి అని వింతగా చూస్తారు.గాంధీ అంటే ఎవరు? అని ప్రశ్నించే రోజులు మనకు ముందు ముందు ఎదురవుతాయి.ఈ కాలం పిల్లలకు గాంధీ అంటే జాతి పిత అని కూడా తెలియదు.మనం మన కరెన్సీ నోట్ల పై గాంధీ బొమ్మ ముద్రించి ఉంటుంది.ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 న గాంధీ జయంతిని జరుపుకుంటున్నాం.అయినప్పటికీ గాంధీ ఎవరు అంటూ మనల్ని నిలదీస్తారు.ఈనాటి తరాన్ని మనం నిందించాల్సిన అవసరం లేదు.రోజులు మారాయి. ఆనాటి నేతలు త్యాగ పురుషుల నడకలు సత్యం పునాదుల మీద సాగేవి.వాళ్ళ ఆలోచనలు ఆచరణలు సమాజ సంక్షేమం దిశగా సాగేవి. అలాంటి నేత అన్నా హజారే ఉన్నారు.ఈనాడు మనుషుల్లో విశాల దృక్పథం కొరవడింది.ఆయినప్పటికీ మల్లారెడ్డి తన కవితల ద్వారా మానవతా భావనలు ప్రేరేపించేలా మనల అందరిని మన చుట్టు ఉన్న సమాజాన్ని మంచితనం తరగల పై నడయాడేలా చేస్తున్నారు.ఇవ్వాళ ఉన్న వ్యవస్థలో మానవతను గురించి ఆలోచించడం చాలా బాధగా ఉంటుంది.రోజు మనం  ఎక్కడ చూసినా అమానవీయ సంఘటనలు మన కళ్ళ ముందు కదలాడుతాయి.మన దేశంలోనే కాదు.అగ్రరాజ్యం అయిన అమెరికాలో కూడా జాత్యహంకారపు విద్వేషపు నీలి నీడలు ఇంకా తొలగిపోలేదు.నల్ల జాతికి చెందిన అబ్రహం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నికైనప్పటికీ నల్లజాతి ప్రజల పై శ్వేత జాతీయుల దౌష్ట్యం ఇంకా కొనసాగుతోంది.తెల్ల జాతికి చెందిన అమెరికన్ పోలీస్ అధికారి నల్లజాతికి చెందిన జార్జి ప్లాయిడ్ మెడ పై బూటు కాలుతో తొక్కి ఎనిమిదిన్నర నిమిషాల పాటు చిత్ర హింస చేసి చంపాడు.జార్జి ప్లాయిడ్ మరణం పై  విచారం చెంది నల్ల జాతి ప్రజలు అంతా ఐక్యమై అమెరికా ప్రెసిడెంట్  భవనం పై దాడి చేశారు.అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ బంకర్ లోకి వెళ్ళి దాక్కున్నాడు.ప్రజాస్వామ్య దేశం అయిన అమెరికాలో జరుగుతున్న  ఈ అరాచకాలు  మానవతకు మచ్చలు కావా? మానవత అంటే ఏమిటి?అని ప్రశ్నించే రోజులు రానున్నాయా ? అనిపిస్తుంది.అలాంటి ప్రశ్నలు మనకు అడుగడుగునా ఎదురవుతాయి.కవి మల్లారెడ్డి ఈ కవితను 40 ఏళ్ల కింద రాశాడు.మానవతా శిఖరాలను అధిరోహించిన వారు ఎవరు?బుద్ధ భగవానుడు,ఏసుక్రీస్తు,మహమ్మద్ ప్రవక్త,స్వామి దయానంద సరస్వతిలాంటి ఎందరో మహనీయులు ఆ కోవకు చెందిన వారు.పేరుకు మాత్రమే ప్రజాస్వామ్య దేశం.ప్రజాస్వామ్య దేశంలో కూడా అస్థిరత వల్ల సమాజంలో కల్లోలం చెలరేగి ఆందోళన కలిగిస్తున్నది.ఈనాటి సమాజంలో కొందరు మానవతావాదులు మానవతా శిఖరాలను అధిరోహించాలనే జిగీషీతో తపనతో కృషి చేస్తున్నారు.“ఎన్నెన్నో కలలు- /ఆంతర్యంలో  అలలు/దారిలో ఎన్ని ఆటంకాలు-అవరోధాలు’. కలలు అందరికీ ఉంటాయి.కాని ఆ కలలను సాకారం చేసుకునే వారు కొందరే ఉంటారు.తెలంగాణ సాధన కొరకు తొలిదశలో 369 మంది అమరులైన వీరులు,మలి దశలో అమరులైన 1200 మంది వీరులను మానవతామూర్తులు అని పేర్కొనవచ్చు. “ఆంతర్యంలో అలలు”.ప్రతి మనిషి అంతర్యంలో దేవుడు ఉంటాడు అంటారు.అందుకే జీవుడు దేవుడు అన్నారు.ప్రతి మనిషిలో మనసులో చెలరేగే ఆలోచనలు రెండు రకాలు అని చెప్పవచ్చు.ప్రతి మనిషిలో కనిపించే మనసు అతని ముఖంలో ప్రస్ఫుటంగా ప్రతిపలిస్తూ ఉంటుంది.ప్రతి మనిషిలో కనిపించని మనసులోని ఆలోచనలు అతనిలో అంతర్యామి రూపంలో దాగి ఉంటాయి.కనిపించే మనసు,కనిపించని మనసులోని భావనలు యదార్థమైనవి.నోటితో మంచి పలుకుతూ నొసటితో వెక్కిరించే వారు ఎక్కువ ఉన్న సమాజంలో జీవిస్తున్నాం.నోటితో నొసటితో కూడా యథార్థాన్ని వెల్లడించే సౌశీల్యత ఎందరికి ఉంటుంది? అలాంటి సౌశీల్యత ఉన్నవాళ్లే మానవతామూర్తులు అని చెప్పవచ్చు.జయశంకర్ సార్ తెలంగాణ జాతిపిత అని భావించడంలో సందేహం లేదు.సముద్రంలో అలలు ఏం చేస్తుంటాయి?గులక రాయి వేస్తే అలలు అక్కడే ఆగిపోవు. అలలు తీరాన్ని చేరాలనే తపనతో తహతహలాడుతూ ఉంటాయి.”దారిలో ఎన్ని ఆటంకాలు -/అవరోధాలు”.తెలంగాణ కోసం 56 ఏళ్ళు ఎదురుచూడాల్సి వచ్చింది.ఎంతో మంది  పిట్టల్లా రాలిపోయారు.తెలంగాణ కల సాకారమైంది.తెలంగాణ ప్రాంత అస్తిత్వం కొరకు పోరాటం చేయాల్సి వచ్చింది.ఆ పోరాటంలో తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి జూన్ 2, 2014 చరిత్రలో ఒక మైలురాయి.తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది.ఔనన్నా  కాదన్నా ఇది నిజం. “భూగోళాన్ని బంతిగా ఆడుకోవాలని/ రాజకీయ ఆటగాళ్ళు/పాచికలతోనే గెలిచింది.’మనకు తెలిసిన మహాభారత గాధను కవి మల్లారెడ్డి గుర్తు చేస్తున్నాడు.మహా భారతం చరిత్రలో నిలిచి పోయింది.అది మనం ఎప్పటికీ మరిచిపోని గాధ.దుర్యోధనుడు ధర్మ యుద్ధం ద్వారా పాండవులను గెలువలేమని తెలుసుకొని శకుని ద్వారా మాయా ద్యూతం ఆడించి పాండవులను అడవుల పాలు చేశాడు.కాని తర్వాత 12 ఏళ్లు వనవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్న తర్వాత పాండవులకు వారి రాజ్యం వారికి అప్పగించాలి.కాని దుర్యోధనుడు రాజ్యం పాండవులకు అప్పగించ లేదు.దుర్యోధనుడు యుద్ధమునకు పురికొల్పాడు. ఆనాటి ధర్మయుద్ధంలో పాండవులు గెలిచారు.కౌరవులు ఓడిపోయారు.ధర్మం గెలిచింది.అధర్మం ఓడిపోయింది.ఈనాటి కలియుగంలో రాజకీయ ఆటగాళ్లు భూగోళాన్ని బంతిలా ఆడుకోవాలని పాచికలతోనే గెలిచింది అనే విషయాన్ని మనందరికీ  విశదం చేస్తున్నాడు. “నువ్వా? నేనా? చూసుకుందామనే/కుటిల కుతంత్ర శాంతి కాముకులు”.ఈనాటి సమాజంలో రాజకీయం వికృత రూపం దాల్చింది.ఊసరవెల్లి రాజకీయాలతో అధికారం పొందడానికి ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు.ప్రజలను వాగ్దానాల ఎరలు వేసి  దోపిడీ చేస్తున్నారు.ప్రజల కొరకు సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశామని చెబుతూ కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు.కుట్రలతో,కుతంత్రాలతో,రాజకీయ నాయకులు అధికారాలను చేజిక్కించుకొని శాంతికాముకుల పై చేస్తున్న దోపిడీని కవి మల్లారెడ్డి తన కవిత ద్వారా తీవ్రంగా ఎండగడుతున్నాడు.”పైస కోసం కళ  -కళ కోసం కళ కాదనే/సినీ చిత్రాలు – ఆడ నవలల కుప్పలు”..కళలు ఎన్ని అంటే అవి అరువది నాలుగు అని ఎరిగినదే.కవి మల్లారెడ్డి చెప్పినట్లు పైస కోసం కళ తయారయింది.కళను పైస నడిపిస్తుంది.పైస లేని కళకు గుర్తింపు లేదు.సృజన చేసిన కవికి రాణింపు లేదు.ఎంత గొప్పగా రాసినా ఏదో మతలబు ఉంటేనే అది ప్రింట్ అవుతుంది.లేకుంటే ఆ కవికి గుర్తింపు లేదు.కళలు మానవ మనుగడకు దోహదం చేశాయి.కళల పట్ల కళాకారుల పట్ల చిన్నచూపు ఇప్పటికీ కొనసాగుతోంది.కళ కోసం కళ కాదనే సినీ చిత్రాలు మనం చూస్తూనే ఉన్నాం.సినీ జగత్తు ఊహ లోకాల్లో విహరింపజేస్తూ ప్రజలను మాయలో పడవేస్తుంది.ఆ మాయలోనే,మత్తులోనే జనాలు మూడు గంటలు సినిమాను చూస్తూ ఆనందించడం మనం చూస్తూనే ఉన్నాం.నిజ జీవితానికి సినిమాకు తేడా ఉంది.అయినప్పటికీ జనాలు ఆ మాయలో మత్తులో పడి మునిగి తేలుతున్నారు.40 ఏళ్ల కింద ఆడ నవలలు కుప్పలు తెప్పలుగా వస్తుండేవి.ఏ పత్రిక తిరిగేసిన ఆడవాళ్ళ నవలలే ఉండేవి.మగవాళ్ళు రాసిన నవలలు కనిపించేవి కావు.మగవాళ్ళు నవలలు రాసినప్పటికీ ఆడవాళ్ళ పేరు మీద రాస్తేనే పత్రికల్లో ప్రచురింపబడుతుండేవి.ఆ నవలలలో వాస్తవిక జీవిత చిత్రణ ఎక్కడ వెతికినా కనిపించేది కాదు.ఏవో ఊహలు కాల్పనిక జీవితాన్ని చిత్రించేవి. సమాజానికి ఆ నవలల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండేది కాదు.”దమ్మారే దమ్ శ్రుతులు – /జుగుప్స నింపుతున్న మతులు”.సినిమాల్లో చూపిస్తున్న దమ్మారే దమ్ శ్రుతులు ఎగురడాలు,దుముకడాలు,అవాస్తవ స్థితికి అద్దంపడుతున్నాయి.తల్లి,తండ్రి,కొడుకు,కూతురు ఆ సినిమా నృత్యాలు కుటుంబంతో కలిసిమెలిసి చూడాల్సిన విధంగా ఉండటం లేదు.సినిమాలు చూస్తే సినిమాల్లో డ్యాన్సులు నిజంగానే జుగుప్స కలిగిస్తున్నాయి.ఏం సినిమా చూసామనే నైరాశ్యం మనల్ని ఆవహిస్తుంది.”ఏదో బలమైన అన్వేషణ/నా నర నరాల్లో పొంగినప్పుడు/ స్వాప్నిక జగత్తు ధరిత్రిని/ నా పద్యాలలో పదాలలో ఆవిష్కరిస్తూ”. కవి మల్లారెడ్డి  ఉబుసు పోక కొరకు కలం పట్టిన వ్యక్తి కాదు.సమాజంను సామ్యవాదం దిశగా నడిపించాలని కాంక్ష గల వ్యక్తి.స్వప్నలోక ప్రపంచంలో భూమండలమంతా వ్యాపించి ఉన్న ధరిత్రి భూమాతను పద్యాలలో పదాలలో ఆవిష్కరించడం సామాన్యమైన విషయం కాదు. గొప్ప గొప్ప ఆవిష్కరణలు ఊరకనే జరగవు.థామస్ అల్వా ఎడిషన్ మనం ఉపయో గించే బల్బును తయారు చేయడానికి 999 సార్లు ప్రయత్నించాడట.అయినప్పటికి నిరాశ చెందక వెయ్యో సారి బల్బును కనిపెట్టాడు.మహానుభావుల ఆవిష్కరణలు అలాగే ఉంటాయి.ఆపిల్ పండు నెత్తి మీద పడగానే భూమికి గురు త్వాకర్షణ శక్తి ఉందని నిరూపించాడు న్యూటన్ మహాశయుడు.”నా అంతర్యం చెలిమె నుండి/ జాలువారుతున్న ప్రతి కళా బిందువు/ఒక రసరాగ ఝరి అనంత సౌరభాల విరి”.సృజన చేసే కళ అందరికీ అబ్బదు.సృజన కారులని కవులు అంటారు.నా మనస్సు లోపల నుండి దూసుకు వచ్చే కవిత్వం చెలిమెలోని ఊటలాగా జాలు వారుతున్న ప్రతి కళాబిందువు నవరసాలతో కూడిన రాగాలను ఆలపిస్తున్న జలపాతం.నేను రాస్తున్న కవిత్వం అనంతమైన సువాసనలు వెదజల్లుతున్న పూల తోటలోని పువ్వు అని కవి మల్లారెడ్డి  వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.”ఈ నిరాకార ఛాయ చిత్రాలలో/ఒక శిశువు నడవాలని/తొలి అడుగు వేయాలని తపిస్తున్నాడు/ఈ చీకటి వెలుతురు జయించి/నూతన వసంతోదయ పరంపర కోసం తొలి అడుగు”.నిజానికి మనకు కనిపించని వినిపించని ఎన్నెన్నో సంఘటనలు నిశ్శబ్దంగా నిరాకారంగా కనుల ముందు కనిపిస్తూ ఉంటాయి.అలాంటి సంఘటనలు ఎన్నింటినో తీసుకొని చివరకు మానవతనే ముఖ్యమని మానవత కోసమే ప్రతి శిశువు (మనిషి) నడవాలని చీకటి జీవితాలను జయించి నూతన వసంతోదయ పరంపర కోసం తొలి అడుగు వేయాలని కవి మల్లారెడ్డి చాలా బలమైన భావాలతో కవితను రాసినట్టు మనకు గోచరిస్తుంది.ఈ కవితలో వాడిన పదజాలం కవితా సంపుటి పల్లె పొలిమేరల్లోకి కవితలన్నింటిలో తలమానికంగా ఉంది.కవి మల్లారెడ్డి నిశ్శబ్ద నిరాకార ఛాయ చిత్రాలు కవిత మొత్తం కవితా సంపుటిని అజరామరం చేసింది.కవి మల్లారెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

You may also like

Leave a Comment