Home వ్యాసాలు బహుముఖ ప్రజ్ఞాశాలి :శ్రీమతి పాకాల యశోదారెడ్డి

బహుముఖ ప్రజ్ఞాశాలి :శ్రీమతి పాకాల యశోదారెడ్డి

by Radhika Suri

ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు ,వక్త, వ్యాసకర్త, అధ్యాపకురాలు ,బహుభాషా కోవిదరాలు ఐన శ్రీమతి పాకాల యశోద రెడ్డి గారు తెలంగాణ ముద్దుబిడ్డ .ఈమె ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ‘బిజినేపల్లి’ గ్రామం, నాగర్ కర్నూల్ లో ఆగస్టు 8 1929న జన్మించారు .తల్లిదండ్రులు సరస్వతమ్మ ,కాశిరెడ్డి గార్లు. మూడవ తరగతి వరకు మహబూబ్ నగర్ లో చదివి తదనంతరం ‘రాజబహదూర్ వెంకటరామిరెడ్డి ‘గారి ప్రోత్సాహంతో నారాయణగూడ లోని ‘బాలికోన్నత పాఠశాల’లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు, సంస్కృత భాషల్లో స్నాతకోత్తరపట్టా పొందారు. 1976లో” అలీఘర్ విశ్వవిద్యాలయం’ నుండి డి.లిట్.అందుకున్నారు.హిందీ, ఉర్దూ ,కన్నడ భాషలతో పాటు జర్మన్ భాషలో కూడా ప్రవీణురాలు.
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులు శ్రీ పాకాల తిరుమలరెడ్డి గారిని ప్రేమ వివాహం చేసుకున్నారు. రెడ్డిగారు గీసిన ఎన్నో చిత్రాలకు ఆమే స్ఫూర్తి ప్రదాత .స్వతహాగా కళాపిపాసి ఐన ఈమె ‘ఇత్తడి విగ్రహాల’ సేకరణ చేసేవారు. భర్త చిత్రకళా ప్రదర్శనలో చురుకుగా పాల్గొని విజయవంతం అయ్యేలా చూసేవారు. రెడ్డి గారితో ప్రదర్శనల కోసం పలు దేశాలు పర్యటించిన సందర్భంలో ‘భారతీయ చిత్రకళ’ అనే గ్రంథాన్ని రచించారు.

యశోద గారు తన 12వ ఏట నుండే రచనలు చేయడం ప్రారంభించారు. అచ్చమైన తెలంగాణ మాండలికంలో కథలు రాసిన తొలి తరం రచయిత్రి .ఈమె రచనలు కల్పితాలు కావు. అవి అనుభవ సారాలు .తెలంగాణ జీవన విధానం ,సంస్కృతి- సంప్రదాయాలు ,ఆచార- వ్యవహారాలు ,సామెతలు సందర్భానుసారంగా తమ రచనల్లో నిక్షిప్తం చేసేవారు .బాల్యంలో ఈమెను ‘ఎచ్చమ్మ ‘అని పిలిచేవారట .ఆ పేరుతోనే ‘ఎచ్చమ్మ కథలు ‘రాశారు .యశోద గారు వందకు పైగా కథలల్లినా 63 మాత్రమే పుస్తక రూపం సంతరించుకున్నాయి. మూడు కథా సంపుటాల్లో ‘మా ఊరి ముచ్చట్లు’ (1973 )సంపుటిలో 1920 – 40 మధ్యకాలంనాటి తెలంగాణ గ్రామీణ జీవన విధానం కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ‘ఎచ్చమ్మ కథలు'( 1999 )లో 1950- 70 నాటి తెలంగాణ సంస్కృతిని ప్రస్ఫుటంగా దర్శింప జేశారు .’ధర్మశాల'( 2000) సంపుటిలో 1980 – 90 మధ్యకాలం నాటి తెలంగాణ సమాజపు పరిస్థితులు చక్కగా వివరించారు. ఒక రకంగా తెలంగాణ సమాజపు నూతన శకానికి ‘దర్పణం’గా దీన్ని పేర్కొనవచ్చు. ఈ మూడు సంపుటాల్లో తెలంగాణ భాష, మాండలికం ,సంస్కృతి ,సామాజిక అంశాలను చక్కగా వివరించారు. ‘మా ఊరి ముచ్చట్లు ‘,’ఎచ్చమ్మ కథలు ‘పాలమూరు మాండలికంలోను, ‘ధర్మశాల’వ్యావహారిక తెలుగులో రాశారు.
మాండలిక భాష పరిరక్షణే ధ్యేయంగా ఆమె రాసిన పరిశోధక వ్యాసాలు భారతి, జాగృతి ,మూసీలాంటి ఎన్నో పత్రికల్లో ప్రచురితమయ్యాయి. మంచి వక్తయైన ఈమె ప్రాచీన తెలుగు సాహిత్యంపై చేసిన ప్రసంగాలతో పండితుల ప్రశంసలు అందుకున్నారు .తన మాండలిక యాసతో సభికులను ఆకట్టుకునేవారు .’ఆకాశవాణి’లో తెలంగాణ మాండలికంలో ప్రసంగించిన తొలి రచయితగా పేరుపొందారు .’ఆకాశవాణి’లో ‘పండుగలు – పబ్బాలు ‘,’జరఇను కోవే తల్లీ’ , ‘ఎచ్చమ్మ ముచ్చట్లు’ ఇలా పలు శీర్షికల పేరిట 200 పైగా ప్రసంగాలు ప్రసారమయ్యాయి.
194 9- 50 ప్రాంతంలో” దక్కన్ రేడియో’లో మాండలిక భాషలో కథలు ,సంభాషణలు, పిల్లల నాటికలు మొదట ప్రారంభించిన ఘనత వహించారు. బాల సాహితీవేత్త ఐన ఈమె ‘బుచ్చయ్య పెబ్బె ‘నాటికను పిల్లలకోసం రచించారు.
యశోద గారు కవయిత్రిగా ఉగాదికి – ఉయ్యాల, భావిక అనే రెండు సంపుటాలు స్వయంగా వెలువరించారు. ఇంకా ద్విపద వాఙ్మయం, ప్రబంధ వాఙ్మయం, భాగవతసుధ రచించారు. సంయుక్తంగా వెలువరించిన మరొక రెండు రచనలు. 1.కావ్యానుశీలనం (డాక్టర్.కులశేఖర్ రావు గారితో కలిసి) 2.చిరుగజ్జెలు (ఆల్వార్ స్వామి ,సి.నారాయణరెడ్డి గార్లతో కలిసి)
వీరు పారిజాతాపహరణం, ఉత్తర హరివంశం ,తెలుగు సామెతలు, ఆంధ్ర క్రియా స్వరూప మణిదీపిక మొదలైన పుస్తకాలకు సంపాదకత్వం వహించి విలువైన పీఠికలు రాసి వెలువరించారు. అనువాదకురాలైన ఈమె’ హిందీ కవయిత్రులు’ గ్రంథాన్ని అనువదించారు.
యశోద గారి అభిప్రాయం: భాషలో నానుడిగాని ,సామెత గానీ, జాతీయం గాని అలవోకగా పుట్టదు. ఆయా ప్రాంతాల వారి అనుభవాల సారం నుండి ఉద్భవించినవి ఇవి. ‘నుడికారాలు ‘భాషకు ‘జీవనాడి’ అని ఆమె పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ,లలిత కళా అకాడమీ, సంగీతా అకాడమీ లలో సభ్యురాలిగా పనిచేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్, జానపద కళా సాహిత్య సంస్థలతో కూడా అనుబంధము ఉండేది .
నిక్కచ్చి మాట తీరు, నిర్విరామ కృషి ,తెలంగాణ భాషపై పట్టు, మాండలికం పై అవ్యాజమైన మమకారంతో
శైలిలో హృద్యంగా రాసి మాండలికాన్ని ‘సజీవ శిల్పం’గా మలిచి తెలంగాణా భాషా సొబగుల్ని తన విశిష్ట రచనావ్యాసంగాల ద్వారా విశ్వవ్యాప్తం చేసి అలసి ,ఆ భారతీదేవి పాదాల చెంత అక్టోబర్ 7 ,2007న ప్రశాంత నిద్రలోకి జారుకున్న ఈ అవిశ్రాంత బహుముఖ ప్రజ్ఞాశాలికి అందించే ‘అక్షర నివాళి’యే ఏ నిజమైన శ్రద్ధాంజలి.

You may also like

Leave a Comment