బాట

by Jhostna Tattiraju

బాట ……
ఇది నున్నని నల్లని తారుబాట
చూస్తున్నకొద్దీ చూడాలనిపించే బాట
ఏవేవో తలపులను రేకెత్తించే బాట
ఎన్నెన్నో మలుపులు తిరిగే బాట

ఎందరినో గమ్యానికి చేర్చే బాట
గమ్యమే ఎరుగని బాట
జీవనగమనంలో నేస్తమైన బాట
జీవితమే గమనమైన బాట

వేకువ వెలుగురేకలు విచ్చుకునే వేళ
ప్రభాత పవనపు స్పర్శకి తలలూపే చెట్లతో
పక్షుల కిలకిలలు,గుడిగంటల సవ్వడితో
ఆహ్లాదకరమైన అందమైన బాట

పాఠశాలలకు వెళ్లే పిల్లల పరుగులతో
ఆఫీసులకు వెళ్ళే ఉద్యోగుల హడావిడితో
వాహనాల రణగొణధ్వనులతో ట్రాఫిక్ తో
చీకాకుపెట్టే చిందరవందర సిటీబాట

మిట్టమధ్యాహ్నపు వేళ
మండిపడే సూర్యుడి ప్రతాపంతో
వేడెక్కి ఊదరగొట్టి
ఉస్సురుస్సురనిపించే బాట

సూర్యాస్తమయాన గూటికి చేరే
పక్షుల్లాంటి పిల్లాపాపలతో,
ఉద్యోగులతో ఉక్కిరిబిక్కిరై
అలసిసొలసే బాట

సాయంకాలపు చల్లని వేళ
బేకరీలు చాట్ బండార్ లను
చేరిన జనంతో సందడి చేసే బాట
పానీపూరీ తినే కుర్రకారుతో
హుషారెత్తించే నగరపు బాట

రాత్రి కాంతుల్లో విందువినోదాలు పంచే
రెస్టారెంట్లు,సినిమాహాళ్ళతో చిత్రమైన బాట
అర్ధరాతిరి సద్దు సేయక నిద్దరోయే వేళ
అనాధలకు ఆశ్రయమిచ్చే అమ్మ ఈ బాట

మండే వేసవి వడగాడ్పులకు వేసారి,
చిరుజల్లుకు మురిసి,జడివానకు తడిసి,
గజగజ వణికించే శీతగాలులకు బిగిసి,
వసంతంలో రంగురంగుల పూలతో విరిసి
మెత్తటి తివాచీలు పరిచి, స్నేహహస్తం చాచి
పిలుస్తోంది ఈ బాట, చిక్కటి అనుభవాల ఊట!

ఎన్నినాళ్ళుగా ఏయే దృశ్యాలను కన్నదో,
ఎన్ని ఏళ్ళుగా ఏయే కథలను విన్నదో
ఎందరెందరిని ఎక్కడెక్కడికి చేర్చిందో
ఎవ్వరికీ చెప్పనిది,ఎల్లలే ఎరుగనిది ఈ బాట

ఉదయపు బాల్యాన్ని, మధ్యాహ్నపు యవ్వనాన్ని ,
సాయంకాలపు వృద్ధాప్యాన్ని చవి చూస్తూ
అనుభూతులను నెమరు వేసుకుంటూ
జీవనగమనానికి భాష్యంగా నిలిచింది ఈ బాట !

మలుపు మలుపుకీ మజిలీ చేయిస్తూ,
క్షణం క్షణం,తరం తరం, నిరంతరం
తరగని పయనానికి లక్ష్యమైనది ఈ బాట!!
గడిచే కాలానికి సాక్ష్యమైనది ఈ బాట!!!

You may also like

Leave a Comment