( మే నెల మయూఖ పత్రిక సంపాదకీయం)
డాక్టర్ కొండపల్లి నీహారిణి , మయూఖ పత్రిక సంపాదకులు
జాతి మొత్తం ఏకతాటి మీద నడవాలి అనుకోవడం వెనుక ఆంతర్యం ఏముంటుందంటే, ప్రజల సుఖశాంతుల ప్రయోజనాలకే. ప్రయోజనాలు అంటే తెలియని వాళ్ళు ఎవరు? తెల్లవారుజామున నిద్రలేచినప్పటి నుంచి మళ్లీ రాత్రి నిద్రపోయే వరకు…., మనిషి పుట్టుక నుంచి చావు వరకు అడుగడుగునా క్షణక్షణాన మనుషులు లాభాపేక్ష తోనే జీవిస్తుంటారు. మంచి తిండి, మంచి బట్ట, మంచి ఇల్లు వంటి కోరికలు ఏవీ లేని వాళ్ళు చాలా చాలా అరుదుగా ఉంటారు.వాళ్లని సర్వ సంగ పరి త్యాగులు అంటాం.వీళ్ళు మహానుభావులు. అతి తక్కువ శాతం లో ఇటువంటి వ్యక్తులు ఉంటారు.
సాధారణంగా ఆచరణ యోగ్యాలేవి,ఆచరణ యోగ్యం కానివేవి అనే తర్క సహితమైన ఆలోచనలు లేనివాళ్లే ఎక్కువగా ఉంటారు. కానీ కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా… అనుకోకుండానే చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు.ఇందులో పరిశుభ్రత అనే విషయాన్ని తీసుకుంటే, మంచినీళ్లు త్రాగడం అనే ఒక్క విషయాన్ని ఉదాహరించవచ్చు. ఆదిమానవుని నుండైనా మనుషులు స్వచ్ఛమైన నీరు…. ఏదైతే తాగడానికి అనువైనదో ఆ నీళ్లనే త్రాగారు. అదే పరంపరను పాటిస్తున్నారు ఇప్పటికీ ….ఈ ఆధునిక మానవులు.అంటే, తమ క్షేమానికి,తమ ఆరోగ్యానికి పెద్ద పీట వేసి ,కార్యరంగంలో అడుగులు వేస్తారు మనుషులు అని నిక్కచ్చిగా చెప్పవచ్చు.
దాహమైనప్పుడే బావిని తవ్వుకోవద్దన్న నిజాన్ని గ్రహించే అన్నేసి నిర్మాణాలను మంచి నీళ్ళ కోసం కట్టుకున్నారు ఆధునికులు. దీనితోనే యోగ్యమైనవేవి, అయోగ్యమైనవి ఏవి అని వివేచనతోనే మనుగడ సాగిస్తారు అన్నది తెలుస్తుంది. ఆచరణ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది దీంట్లోనే సామాజిక ప్రయోజనం కలసిపోయి ఉంటుంది ఈ మంచినీటి విషయాన్నే మానవ స్వధర్మానికి,సధర్మానికీ అన్వయించుకున్నప్పుడు….” స్వధర్మే నిధనఃశ్రేయమ్, పర ధర్మోభయావః” అని మంచి మాట పుట్టుకు వచ్చింది. ఈ వాక్యం జీవిత సత్యం. ఈ వాక్యం అనల్పమైన వాక్యం. ఇందులోంచి “శ్రేయస్సు”అనే ఒక్క పదం చాలు! మనుషులకు ఇంతకన్నా కావాల్సింది ఏమున్నది అనడానికి !!అందుకే ఏదో దేశాన్ని చూసో, ఏవో సౌకర్యాలను ఆశించో, సంపదలను చూసో మనకు మనం ఆపాదించుకోవడమైనా… మనంగా కోరుకోవడమైనా….అన్నిచోట్ల సాధ్యం కాకపోవచ్చు. దేశకాల పరిస్థితుల్లో మనం ఎక్కడున్నాం అని యోచించి నిర్ణయించుకోవాలి, కోరుకోవాలి, ఆశపడాలి.
ప్రయోజనాలలో శిశువులకు ఒక రకమైనవి, వృద్ధులకు ఒక రకమైనవి, యువకులకు ఒక రకమైనవి,మధ్య వయస్కులకు ఒక రకమైనవి రకరకాల ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించినవి,విద్యకు సంబంధించినవి, వైద్యానికి సంబంధించినవి,సామాజిక అంశాలకు సంబంధించినవి బ్రతుకుతెరువుకు సంబంధించినవి ప్రయోజనాలు వేరువేరుగా ఉంటాయి. నడక, నడత, తిండి,చదువు, ఉద్యోగం, పదవి విరమణ, ఇన్సూరెన్స్ లు వంటివి కానీ అన్నింటికన్నా రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
జీవమున్నప్పుడు శరీరానికి, మరణం తరువాత శవానికి …. ఈ వ్యవస్థలో ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంటారు, పరిచయాలు పెంచుకుంటుంటారు.
వీటిలో మంచి చెడులను చెప్పేవాళ్ళు, uses and losses ఏమిటో చెప్పేవాళ్ళు ఉండాలి. శరీరంలోని కణజాలాల లాగా,ఉప కళా కణజాలాల లాగా,శరీరంలోని భాగాల లాగా, భాగాలు పనిచేసే తీరు లాగా మానవ ప్రయోజనాలు ఉండాలి. ఏది సరైనది ఏది సరైనది కాదు అనే విచక్షణ ఉంటే అన్నీ సవ్యంగా నడుస్తాయి.
మానవ పరిణామ క్రమంలో వచ్చిందే కాకుండా….బుద్ధి పరిణామ క్రమం కూడా పెరగాలి. భాష, భావం సరిగ్గా ఉంటే నాలుగు కాలాలపాటు నలుగురితో సరిగ్గా ఉండగలరు. వీటితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇంతకన్నా కావాల్సింది ఏమున్నది?సరళ రేఖ లా,సాలీడు గూడులా, పరమత సహనం లా ,పాదరసం లా పరిమితమైన అపరిమితమైన ప్రయోజనాలు ఉంటాయి. సహజమైన ఎంపిక, సత్య మైన ఎంపిక నిలబెడుతుంది, నిలబడుతుంది.
ఇవే బ్రతుకు ప్రయోజనాలు!!