Kondapally Neeharini
రాజకీయాలు అత్యంత విలువైనవి. దేశ ఆర్థిక, స్వాతంత్ర్య, సామాజిక విలువలను పరిరక్షించుకోవడానికి, మనదైన పార్లమెంటరీ విధానం ఏర్పరచుకున్న దేశం మనది. ఒక ఇంటికి కుటుంబ పెద్ద రక్షణ ఎలాగో, ఒక పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు ఎలాగో, ఒక కళాశాలకు ఒక విశ్వవిద్యాలయానికి ప్రముఖులు ఎలాగో అట్లా దేశ పాలన విధానానికి ప్రధానమంత్రి అవసరం. ప్రధాని ఎవరు అని చర్చించుకోవడానికి ప్రజలు తప్పకుండా ముందుంటారు. అట్లాగే వాళ్ళ వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రులను నిర్ణయించుకోవడానికి కూడా ప్రజలు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తుంటారు.
ప్రజలు తెలియని తనంతో ఉంటారనుకోవడం ఒక భ్రమ. వాళ్ళ పరిశీలన అనుభవం చాలా గొప్పది. దీనికి ఉదాహరణగా ఆనాటి స్వాతంత్ర్య పోరాటాలను కూడా తీసుకోవచ్చు. అప్పటినుంచి
తెలుసు వాళ్ళకి రాజకీయాలు ఎలా ఉంటాయని! ఇవన్నీ అనుభవాలు నేర్పిన పాఠాలు! ప్రజలను, ప్రత్యేకంగా యువతరాన్ని ఎప్పుడు విస్మరించవద్దు. యువతరం భావి భారత పౌరులు, కాబోయే నేతలు . ఎందరో తెలివైన వారే ఉంటారు కాబట్టి యువత గొప్ప పరిశీలనతో ఓట్లు వేస్తారు. ఇవాళ ఓటును వినియోగించుకునేప్పుడు వాళ్ళకన్నా ముందు తరం పెద్దలను ప్రభుత్వాలు ఎలా చూస్తున్నాయి? రైతుల కోసం ఏ సహకారం అందిస్తోంది? బడుగు బలహీన వర్గాల కోసం ఏ ఏ పథకాలను వేసి ఎట్ల నిర్వహణ చేస్తుంది? స్త్రీ ఉన్నతికి గవర్నమెంట్ ఎలాంటి రూపకల్పన లు చేస్తున్నది అనేవి యువకులు చూడరు అనుకోవడం కూడా ఒక పెద్ద భ్రమనే. ఇవన్నీ ఈరోజు ఎన్నికల ద్వారా బహిర్గతమయ్యాయి. ఎంత ఆధునిక సాంకేతిక శాస్త్రీయ విధానాలు వచ్చి యాంత్రిక జీవనాన్ని తీసుకువస్తున్నా కూడా యువత ఇవి ఏవి బయట విషయాలు పట్టించుకోవడం లేదు అని అనుకోకూడదు.
ప్రజలు కూడా అంతే .. వస్తున్న సాంకేతిక సౌకర్యాలనుండి చాలానే లబ్ది పొందుతున్నారు
.ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్ అనే ఒక మంత్రం… అరచేతిలో వైకుంఠం లాగా. ఈ సెల్‌ఫోన్ అనేది ఇక్కడ ఒక యంత్రం కాదు ఒక మంత్రం వచ్చినప్పటి నుండి ప్రజలు చాలా తెలివిగా అయ్యారు. ఇవన్నీ మనకు సాక్షులు. జరుగుతున్న ఇదే చెప్తోంది ఇప్పుడు .
జాతి మత కుల వివక్షలను ఎన్ని తీసుకువచ్చినా అసలు సిసలైన మానవీయ కోణం అనేది కూడా ఒకటి ఉంటుంది అని ఎవరూ మరవకూడదు. పరాజయాన్ని పొందిన రాజకీయ నాయకులు బాధతో రకరకాల అభిప్రాయాలను వ్యక్త పరుస్తారు. అవన్నీ సత్యాలు కావు. అలా అని మొత్తం అసత్యాలు కావు. అలాగే విజయపథంలో దూసుకుపోతున్న రథసారథులు కూడా అంతే వాళ్ళ పార్టీ శ్రేణుల్లో ఎటువంటి ధైర్యాన్ని ఉసిగొల్పాలో అటువంటి మాటలను మాట్లాడడానికి ఏమాత్రం వెనుకాడరు. ఎక్కడైనా నిజాలు అబద్ధాలు రెండు బహు పాత్రలు వహిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా భారత దేశ రాజకీయ సామాజిక చరిత్రలో తప్పకుండా మార్పులను తీసుకువస్తాయి. ఈ మార్పుల ఫలితమే ఈరోజు ఎన్నికలు.
ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి ఓడిపోవడానికి కారణం వాళ్ళ అసమర్థతనే! ఎన్నికల ముందు ప్రచార హోరులో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే! ఇవన్నీ గమనించిన ప్రజలే కదా ఓట్లు వేసేది? అందుకే హామీలు ఇచ్చే ముందు శక్తి సామర్థ్యాలను ఒకటికి పది సార్లు చర్చించుకుని ఆలోచించుకుని గట్టి నిర్ణయం తీసుకొని బయటపెట్టాలి. అంతేకానీ గత పార్టీలు చేసిన దానికి మరికొంత జోడిస్తే మాకు గొప్పతనం వస్తుంది అని చెప్పి ఆ మాటలను తీర్చలేకపోతే మరోసారి వచ్చే ఎన్నికల్లో పర్యవసానం ఇలాగే ఉంటుంది. ఇది ఏ పార్టీ వాళ్ళకైనా… ఇప్పుడు గెలిచిన వాళ్లకైనా… భవిష్యత్తు అంతే! ఇదే సత్యం !! పారదర్శకత ఉండాలి పరిపాలనలో…. పట్టుదలతో సాధించాలి… ప్రజలకు చేరువగా ఉండాలి. ఇవి మూడు ముఖ్యమైన విషయాలు. ప్రజలు కొత్త రాజకీయవేత్తలను కోరుకుంటున్నారు అని స్పష్టమైనది ఈసారి .
ప్రసార మాధ్యమాలు ఎక్కువైన ఈ నేపథ్యంలో వెంట వెంట సమాచారాలను అందిస్తున్న ఈ పరిస్థితుల్లో పదేళ్ల పిల్లవాడికి కూడా రాజకీయాలు
అర్థమవుతున్నవి.
అయితే మంచి లేదా? రాజకీయ నాయకులందరూ చెడుబుద్ధి తోనే ఉన్నారా? లేదు లేదు..
కులమత రాజకీయాలను సృష్టించి బలపరిచి భయంకర రూపం దాల్చేలా చేసి ఈ రాజకీయాలు ఏ మార్గాలను అనుసరిస్తున్నాయో అర్థం కావడం లేదు
దేశం ఎటు పోతుందో అని వేద చెందుతున్నారు పాతతరం వాళ్ళు.
జెన్ జీ తరం ఆవేశపూరిత రాజకీయాలను ప్రేరేపిస్తూ ఆన్లైన్ లో అరాచకాలను సృష్టిస్తున్న ఈ వైనం నిజమైన దేశభక్తులకు హృదయ వేదనం కలిగిస్తున్నది.
విచిత్రం ఏంటంటే ప్రపంచంలోని అన్ని దేశాలు ఆయా దేశాల బాగు కోసం పాటుపడుతున్నారు. ఎక్కడో ఒకచోట వ్యతిరేకులు ఉంటారు. వాళ్ల ను అధిగమిస్తూ ముందుకు పోతున్నారు. కానీ,మనదేశంలో ఈ పరిస్థితులు లేవు .వీటికి భిన్నంగా ఉన్నాయి. దేశం పురోభివృద్ధిని సాధించటం మాట అటు ఉంచి ఉన్న తీరున ఉంటు సుభిక్షంగ ఉండడమే కావాలి.
యువతరం రాజకీయాల లో చురుకుగా
పాల్గొనాలంటే ప్రపంచ రాజకీయాల పై అవగాహన ఉండాలి. చరిత్ర ను చదవాలి. సర్వమత సౌభ్రాతృత్వ భావనలు అర్థం కావాలి దీనికి మనదేశ పు పూర్వ రాజకీయాల పట్ల అవగాహన అవసరం. ఆ రీతిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. మన కళ్ళతో ప్రపంచాన్ని చూడాలి ప్రపంచం కళ్ళతో మన దేశాన్ని చూడాలి అప్పుడే యువతరం దేశ రాజకీయాలపై బట్టలు ఇస్తుంది ఈ భవిష్యత్తులో రాజకీయ నాయకులుగా ఎదిగే శక్తిగా తయారవుతారు.
ఎలక్షన్ విధి విధానాలు తెలుసుకొని కళాశాల చదువుల నుండి విశ్వవిద్యాలయాల వరకూ, పౌరుల హక్కుల పైనే కాదు బాధ్యత ఎంత అనేదీ తెలియాలి. పార్లమెంట్, లోక్ సభ సభ్యులకు ఉన్న విధులేమిటో ఎలా నిర్వహిస్తున్నారో తెలుసుకోవాలి. పొలిటికల్ పార్టీల ఆవిర్భావాలు ఆచరణలు సంపూర్ణంగా తెలుసుకొని ఉండాలి. అప్పుడే కలలు కన్నా సాధించుకోగలరు సాధించుకోవాలన్న తపనతో కలలను కలగలరు , కలలను తీర్చుకొనగలరు. ఎన్నికలు యవతను ఎన్నికలలో కనమంటూ అంటుంటే వ్యక్తిత్వ వికాసానికి సమిష్టి
వికాసాని కి వారధులుగా యంగర్ జనరేషన్ ఉండాలి.
___***___
అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
వాస్తవ జగత్తులోంచి చూస్తే సత్యాసత్యాల బ్రతుకుచిత్రం కనిపిస్తుంది. భావాలను తొక్కి పట్టి ఆలోచనలకు ముసుగులేసి వంకర బుద్ధితో చూస్తే పచ్చ కామెర్ల సామెత గుర్తొచ్చేలా ఉంటుంది పరిస్థితి. అస్తిత్వం అంటే ఏంటి మనదైన ఉనికిని చెప్పడం, existence గుర్తించడం అంటాం. ఒక వ్యక్తి ఉన్నారా లేదా అనే భావన కూడా లేకుండా ప్రవర్తిస్తారే అటువంటి ప్రజెన్స్ కు ప్రాముఖ్యత లేకుండా చూస్తున్నారు అంటే అస్తిత్వాన్ని దెబ్బ కొడుతున్నారు అని అర్థం. నమ్మకం అనేది ఎంతో ప్రాధాన్యత కలిగిన విషయం అటువంటిదే Presence అనేది. ఉన్నామా లేమా? అనే ఊహా నే ఎంతో బాధాకరం అనిపిస్తుంది. సజీవత అనే మాట ఎంతో విలువైనది. ‘Existence’ is the state of being alive or being real అంటాం. ఈ being అనేది survival గురించే కాదు ఆత్మాభిమానం ఆత్మగౌరవం వంటి వాటిని కలుపుకుని ఉన్న భావన. విధానపరమైన అలసత్వంతో కూడిన విషయాలు కొన్ని, లోతైన నిజాలు వాస్తవ పరిస్థితిని కప్పిపుచ్చని విషయాలు, సమస్య మూల విషయమైనటువంటి ప్రధాన కారణాలు ఒక్కో సంఘటన వెనుక ఉన్న నిజమైన విశేషాలు అన్ని అసలు సంగతి ఏంటో చెప్పేవి. ఈ అస్తిత్వ పోరాటాల వెనుక ఉన్న ఉద్దేశాలు కూడా ఇవన్నీటిని తెలుసుకోవడం కొరకు వెల్లడి చేయడం కొరకు వచ్చినవే.
ఇందులో భాగమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిర్భావం. మానవ హక్కులు అనే మాటనే మనుషులందరికీ ప్రాప్తించవలసిన తప్పనిసరి అవసరాలు. ఇందులో స్త్రీలు లేకపోవడం అంటే అది అసంపూర్ణమే కదా. మనుషులు అన్నప్పుడు స్త్రీలు రారా? వస్తారు. రావాలి. ఇలా గుర్తించక నిర్లక్ష్యానికి గురవడంతోనే ఆనాడు క్లారా జెట్కిన్ అనే మహిళా కార్యకర్త జర్మన్ రాజకీయ పార్టీలలో సోషల్ డెమోక్రటిక్ ఓట్లు వేయడం లో మహిళలకు సమాన ఉపాధి హక్కులతో ముందుకు రావాలని పిలుపునివ్వడంతో మద్దతు లభించింది. అది మార్చి 1914 ప్రాంతం. ఆరోజు ఆదివారం ఎనిమిదవ తారీకు . మహిళలు కార్మికులుగా, తల్లులుగా, పౌరులుగా వాళ్ళ విధులను సంపూర్ణంగా నెరవేరుస్తారు, రాష్ట్ర పరిపాలన భాగంలో మునిసిపాలిటీ వంటి వాటిల్లో తమ పన్నులను చెల్లిస్తారు, సహజ మానవ హక్కుల విషయంలో దృఢమైన ఉద్దేశంతో ఉంటారు అని నిర్ణయించి మార్చ్ 8 ని మహిళా దినోత్సవం గా ప్రకటించారు. 1918 వరకు దాదాపు ఓ ఐదేళ్ల పోరాటాల తర్వాత రిపబ్లిక్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు మహిళలు. 1909, 10 లలో New York City లో జరిగిన “Working Women Day” కూడా వీళ్ళకు స్ఫూర్తిదాయకమైంది. 1917 లో రష్యాలో మహిళలు హక్కుల కోసం పోరాడారు. ప్రధానంగా ఇది ఓటు హక్కు నుంచి జీవన హక్కుల వరకు కొనసాగింది. అందుకే మార్చ్ 8 ని మహిళా దినోత్సవం గా జరుపుకుంటారు. జాతి, భాష, సాంస్కృతిక , రాజకీయ, ఆర్థిక ప్రతిపాదనలతో సంబంధం లేకుండా మహిళలు సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ రోజును చెప్తాం. ఈ క్రమంలో మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి స్వయం పాలన దేశం గా న్యూజిలాండ్ గణుతికెక్కింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అభివృద్ధి చెంది మహిళలకు ఒక కొత్త ప్రపంచ కోణాన్ని చూపించింది.
“ Give us women’s suffrage women’s day 8 to March 1914 until now prejudice and reactionary attitude have defined full Civic rights to women who has workers, mothers and citizens….. In this no pause for rest no respite is allowed” అని ఏనాడైతే నిర్ణయించారో ఆనాటి నుండి ప్రపంచ దేశాలలోని స్త్రీలంతా ఆర్థికంగా ఎవరైతే నిలదొక్కుకున్నారో వాళ్లంతా ‘టాక్స్’ లను ‘పే’ చేస్తూ హక్కులను వినియోగించుకుంటున్నారు. వీటికన్నా ముందు మనం మరువకూడని విషయం –
1977 లో ఐక్యరాజ్యసమితి మహిళా సమావేశాలు బలోపేతం చేయడం వలన మహిళల హక్కులు వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం కోసం మద్దతు పెరిగింది. అంటే అధికారికంగా గుర్తించింది అని అర్థం. Organizations all over the world learned about it. దీనిపైన ఒక framework తయారైంది. Social, economic, cultural and political achievements of women అనేది International women’s day March 8th ను Global celebrations గా నిర్వహిస్తున్నారు. ఈ కోణంలో చూసినా action for accelerating gender priority అనేది ప్రపంచవ్యాప్తంగా అర్థం అయ్యింది.
రాజకీయాలలో,పరి పాలనలో, పాలనాధికారాల నిర్ణయాలలో మహిళలు ఎందుకు ఉండవద్దు? ఇల్లు సంసారం చక్కదిద్దే స్త్రీలు, పురుషునికి వ్యవసాయ రంగంలో అనాదిగా సేవ చేస్తూ వస్తున్న స్త్రీ లు. వాళ్లని పాలన రంగంలో ఎందుకు గుర్తించలేదు అంటే పురుషాధిపత్య లోకంలో స్త్రీలు అణచివేయబడ్డారు అనేది స్పష్టం గా కనిపిస్తున్నది. దీన్ని ఖండిస్తూ ఎన్నో ఉద్యమాలు జరిగాయి. చివరికి సాధించారు. ఇలా ప్రారంభమైన ఇంటర్నేషనల్ వుమెన్స్ రైట్స్ డే నుండి మనుషులంతా నేర్చుకోవాల్సిన అంశాలెన్నో ఉన్నాయి.
మానవ జీవితానికి అవసరమైన సంస్కృతి పరిరక్షణలో మొదటి స్థానంలో ఉండేదే మహిళలు. కుటుంబ నిర్మాణంలో అత్యంత కీలకమైన పాత్ర వహిస్తారు . బహుముఖీనమైన ప్రతిభ కలిగిన స్త్రీలు పాలనాధికారులను ఎన్నిక చేసే హక్కును లేకుండా ఉండడం అనేది ఎంతో విచారించాల్సినటువంటి విషయం. దీంట్లో నుంచి పోరాటాలు ఉద్యమాలు అది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపబడి మహిళల కోసం ప్రత్యేకమైన ఒక రోజును ఏర్పరిచేలా సాధించారు. ఇంటిని చక్కదిద్దే నిర్వాహకురాలు, ఆర్థిక వ్యవహారాలను సవరించే ప్రతిభామూర్తులు, దైనందిన అవసరాలను తమకున్నటువంటి వనరులలో, బడ్జెట్లో సరిపోయే ప్లాన్ ప్రకారం ఇంటి నిర్వహణ చేసే స్త్రీల సమర్థత పాలనాధికారులలోని వాళ్లను ఎంపిక చేసుకునే విషయంలో కనిపించదు.
“First teacher is Mother” అనేది నిర్వివాదాంశ . పిల్లల పెంపకం నుంచి మొదలుకుంటే కుటుంబావసరాలు సమకూర్చే అన్ని దశలలో స్త్రీ ల contribution చాలా ఉంటుంది. అందుకే ఆమెను Morel Contributor గా, Economic Contributior గా చెప్తారు. అందుకే మన తెలుగు వాళ్ళు ” ఇంటికి దీపం ఇల్లాలు” అన్నారు. పుట్టింటిలో మకుటం లేని మహారాణిగా చూసిన వాళ్లు మెట్టినింటిలో కూడా చూడబడాలి. కానీ చూడరు ఇక్కడే వచ్చింది సమస్య . అందుకే స్త్రీలు తమ సామ్రాజ్యాన్ని తామే సృష్టించుకుంటున్నారు నిర్మించుకుంటున్నారు పాలించుకుంటున్నారు ఈ పరిణామాలకు కారణం పురుషాహంకారమే!
ఎడారుల్లో Chestnut – bellied Sandgrouse అనే ” సాండ్ గ్రౌస్ పక్షి” పక్షి ఒకటి ఉంటుంది. ఈ పక్షి ని కుటుంబ జీవన ప్రయాణంలో స్త్రీ కిఉదాహరణగా చెప్పుకోవచ్చు. చూడ్డానికి పావురం లాగా కాస్త పెద్ద సైజులో ఉంటుందీ పక్షి. అన్ని పక్షులకు ఈ పక్షికి తేడా ఏంటంటే ఎడారిలో నీళ్ళు చాలా తక్కువ ప్రాంతాలలో ఉంటాయి కాబట్టి అది గుడ్లు పెట్టి పిల్లల్ని కన్న తర్వాత ఆ పిల్లల పెంపకం విషయంలో ఎంతో దూరానికి వెళ్లి, నీళ్లు ఎక్కడ ఉంటే అక్కడ ఆ నీళ్లలో మునిగి ఆ నీళ్లను తీసుకొస్తుంది, పిల్లలకు దాహం తీరుస్తుంది. ఇది ఎలా సాధ్యమంటే ఆశ్చర్యకరంగానే కనిపిస్తుంది. నీళ్లలో మునిగినప్పుడు ఆ పక్షి రెక్కల క్రింద నీళ్లను పిలుచుకునే విధానంగా ఉన్న తన శరీర బూరును నీళ్ళతో నింపుకొని అవి తెచ్చి పిల్లలకు ఇస్తుంది ఈ ” ఇసుక పావురం” . ఈ విధంగా పిల్లల్ని కన్న తల్లులు పాలిచ్చి పెంచడం నుంచి మొదలుకుంటే ఆహారాన్ని సిద్ధం చేసి తినిపించడం మొదలుకుంటే వాళ్ళ ఆరోగ్య అనరోగ్య విషయాలను దగ్గర నుండి శ్రద్ధగా చూస్తూ వీటన్నింటిని మించిన ప్రేమను పంచిస్తూ పెంచుతుందే… ఈ ఒక్కటి చాలు స్త్రీల ఔన్నత్యాన్ని గుర్తించడానికి ! ఇంత ఓపిక , సహనం కన్నతల్లి అనే విశ్వాసం వంటి సుగుణాలు ఉన్నటువంటి స్త్రీలను సమాజం లో సరైన పద్ధతిలో చూడకపోవడం వల్లనే వాళ్లలోనూ కొందరు అన్యాయాలు, అక్రమాలు చేయడానికి అలవాటు పడ్డారు. ఈ అలవాటు వెనక ఉన్న కారణం అస్తిత్వ రాహిత్య జీవితాన్ని గడపలేకనే అనేది నిర్వివాదాంశం.
విద్యావంతుల విషయంలోనే ఇంత జాప్యం జరిగింది అంటే ఇక poor , rural area ల వాళ్ళ సంగతి ఎంత దారుణం గా ఉంటుందో ఆలోచించవచ్చు. విద్యావంతులకు , ఆర్థిక స్తోమత ఉన్న వాళ్లకు చాలావరకు హక్కులు అందుతున్నాయి కానీ ఆదివాసులకు పల్లెటూరి వాళ్లకి ఇంకా చేరువలో లేవు. ఈ విషయంపై ఇంకా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అందరికీ న్యాయం జరిగే దిశగా IWD అంటే… International Women’s Day March 8th ఒక వేదిక అయింది. చాలా వరకు ఆస్తి హక్కు కలిగి ఉంటున్నారు, విద్యను పొందే హక్కును అనుభవిస్తున్నారు కానీ ‘సమాన వేతనం ‘ విషయంలో ఇంకా ఏమంత ప్రోగ్రెస్ ను చూడటం లేదు. ఇదే కదా అత్యున్నతమైన ప్రామాణికమైన హక్కు? సమాన వేతనం ఇవ్వాలి అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ మహిళల హక్కుల కోసం ఎంతో శ్రమిస్తున్నది.
Civil awareness Day, Women and Girls Day, Anti- sexism Day and Anti- Discrimination Day అంటూ పిలుపునిస్తూ జరిగిన Worldwide పోరాటాల ఫలితంగా ఈరోజు మహిళ ధైర్యంగా నిలబడగలుగుతున్నది. వీటిలో జెండర్ ఈక్వాలిటీ రీప్రొడక్టివ్ రైట్స్ వైలెన్స్ అండ్ అబ్యూజ్ ఆన్ ఉమెన్ వంటివన్నీ లేబర్ మూమెంట్స్ గా గుర్తిస్తూ 20th century లో వచ్చిన ప్రభంజనాలు ఎన్ని ఉన్నా అసలు సిసలుగా మనసులలో ఉన్న మాలిన్యాలు తొలగిపోకుంటే పైపై మార్పులు మాత్రమే కనిపిస్తాయి గానీ స్వచ్ఛమైన మార్పులు జరగవు.
వ్యక్తిగత వృద్ధి ని ప్రోత్సహించడం వృత్తిపరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం వంటివి స్త్రీల కెరియర్ పురోగతిపై దృష్టి సారించడానికి కారణాలవుతాయి. మహిళ సంఘాలు, సహకార సంస్థలు చేస్తున్న కృషికి మద్దతు ఉండాలి. పూర్వం నుంచి పాతుకుపోయిన విశ్వాసాలను తుడిచి వేయగలిగి చైతన్యవంతమైన స్పృహతో ఉంటే తప్ప ఇవి సాధ్యం కాదు. జీవితాలకు కథానాయకులుగా ఉండాలే కానీ బాధితులుగా ఉండకూడదు. భౌతికంగా, మానసికంగా, సామాజికంగా రాజకీయంగా పరస్పర కోణాలను అనుసంధానపరుస్తూ మహిళా సాధికారత కోసం సమస్త మానవజాతి కృషి చేయాలి. ఇలా ఫిజికల్ ,సోషల్, మెంటల్, పొలిటికల్ కోణాలలో మహిళల సాధికారత ఉండాలి, రోజువారీ కార్యకలాపాలలో మహిళల స్వయం ప్రతిపత్తి ఉండాలి. సామాజిక అసమానతల సమస్యల విషయాలపై దృష్టి సారించాలి. ఆఫీసులలో జెండర్ డిస్క్రిమినేషన్… లింగ అసమానతలను పోగొట్టాలి. ఉద్యోగాలలో స్వీయ నియంత్రణ నే కాదు, పరిస్థితులను నియంత్రణను చేయగలిగే శక్తివంతులైన మహిళలను గుర్తించి తగిన విధంగా ప్రోత్సహించాలి… మహిళా సాధికారత దిశలో అడుగులు పడితే తప్పక ఐ.డబ్ల్యు.డి ఆశయం నెరవేరుతుంది.
పాషాణ హృదయాలలో తిష్ట వేసుకుని ఉన్న జెండర్ డిస్క్రిమినేషన్ అనేది తొలగిపోనంతవరకు పాలన విధానంలో ఎన్ని మార్పులు వచ్చినా లాభం లేదు. ప్రాథమికంగా – మానసికంగా, ఆర్థికంగా , కుటుంబ పరంగా, వృత్తిపరంగా, శారీరకంగా, సామాజికంగా నే కాకుండా ఆధ్యాత్మికపరంగా కూడా అన్ని రంగాలలో ఎంతో ప్రావీణ్యం ఉన్నా, ఎంతో ప్రామాణికమైన స్థిరమైన న్యాయమైన ప్రతిభావ్యుత్పత్తభ్యాసాలు వాళ్ళ లో ఉన్నా మహిళలను చిన్నచూపు చూసే పురుష ప్రపంచం ఉన్నంతవరకు భావితరాల బంగారు సౌధాన్ని నిర్మించలేం.
ఇక మన దేశంలో అంటారా? పూర్వం స్త్రీ లే సర్వాధికారాలతో ఉండేదనీ, శక్తి సమన్విత అని అనేవాళ్ళనీ ఎన్నో ఋజువులు ఉన్నాయి. అందుకే దేవతగా పూజిస్తారు. గౌరవిస్తారు అని తెలుసు. ప్రపంచంలో ఏ దేశంలో స్త్రీలు పాలనాధికారంలో లేని కాలంలోనే మనదేశంలో స్త్రీలు మహారాణులుగా వెలుగుందిన చరిత్ర ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ కాలమాన పరిస్థితుల్లో వచ్చిన మార్పులు, సామాజిక చైతన్య రహితమైన జీవనపు అలవాట్లు మనుషుల్ని మార్చి వేశాయి, పరిస్థితుల్ని మార్చి వేశాయి. అందుకే పునర్ ఆలోచన, పునర్ మూల్యాంకనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి.
ప్రస్తుత కాలంలో ఈ గ్లోబల్ ప్రపంచంలో ” గివ్ టు గెయిన్” అనే ఆలోచన కనిపిస్తున్నది. వృద్ధి అని ప్రయోజనాలనీ ఆలోచిస్తున్నప్పుడు స్త్రీ సాధికారతను పెట్టుబడులు పెట్టాల్సిన విషయంగా చెప్పడం చాలా తప్పు. లాభనష్టాల బేరీజులు వేయడానికి ఇదేమి బిజినెస్ కాదు. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలే అయినా కానీ… ప్రేమ, ఆప్యాయత, సమానత్వ ధోరణి ఇవి సమిష్టి భావనతో పని చేసినప్పుడే మానవసంఘం లో సుభిక్షమైన సమాజం పునర్నిర్మాణమవుతుంది. స్వతంత్ర మహిళను అని చెప్పుకోవడం ఒక్కటే గొప్ప కాదు… స్వచ్ఛమైన మహిళను అని కూడా చెప్పగలగాలి. శక్తివంతమైన మహిళను అని ధృవీకరించుడొక్కటే కాదు శాంతికి చిరునామాను అని ప్రకటించుకోనే స్థాయిలో కూడా ఉండాలి. జీవితమనే ఆట స్థలంలో గెలుపు ఓటములు సహజం అనుకున్నప్పుడే సాధించిన విజయానికి అర్హత పొందినట్టు. ఎంపిక ఎంతో ప్రాధాన్యత వహిస్తుంది జీవితంలో మనం ఏం కావాలనుకుంటుంన్నామో అనేది చాలా ముఖ్యం. స్త్రీలు తమలోని అంతర్గత శక్తులను మేలుకొలుపుకుంటూ సామాజిక దృక్పథం తో మంచి దిశ లో పయనించేలా అనేక శక్తులను ప్రోది చేస్తూ, ప్రదర్శిస్తూ ముందుకు పోవాలి. పురుష ద్వేషాల్ని పెంచుకోకూడదు. అప్పుడే సమ సమాజం ఏర్పడుతుంది. ఈ వ్యతిరేకత ఎందుకు వచ్చిందో అని ఆలోచిస్తే, తాను అనుభవించిన చిన్నచూపే తన కూతురు కూడా అనుభవిస్తుందేమోనన్న భయంతో మిస్సోజైని అంటే తమ జెండర్ పట్ల ద్వేషం కానీ లేదా లోతైన అపనమ్మకం గాని ఉంటే ఎట్లా అనే బాధతో వాళ్లు పిల్లలను కనడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఇళ్లల్లో ఆడవాళ్ళ అభిప్రాయాలని తోసిపుచ్చుతుంటారు. ఏదైనా భావోద్వేగాన్ని ప్రదర్శిస్తే దాన్ని ఎగతాళి చేస్తుంటారు. సానుభూతి అనే విషయంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తారు. స్త్రీలలో సహజంగా ఉన్న బలహీనతను అభివర్ణించిమరీ వేలెత్తి చూపుతారు. ఇటువంటి సూక్ష్మమైన ప్రవర్తనలు చూసీ చూసీ ఉన్న బ్రతుకులు కదా! ఇవన్నీ తెలిసిన, ప్రస్తుత కాలంలో అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి కూడా నిరాకరించే పరిస్థితులొచ్చాయి .దీనికి కారణం ఆ కుటుంబంలో ఉన్న పురుషులైన తండ్రి, మామ,అన్న ,భర్త వంటి పురుషులేనా? అంటే… అవును అనే సమాధానమే ఇవ్వాల్సి వస్తుంది. స్త్రీలైన అత్త,తల్లి , ఆడపడుచు ,తోటి కోడలు వంటి పాత్రలలోని ఆడవాళ్లు ప్రదర్శించడం లేదా? అంటే, ప్రదర్శిస్తున్నారు. కానీ, వీళ్ళ పైన ప్రభావం ఎవరిది? అంటే , ఎన్నో ఏళ్లుగా దశాబ్దాలుగా…. శతాబ్దాలుగా.. స్త్రీలపై రుద్దబడిన… బలవంతంగా రుద్దబడిన ఆచారాలు, సంస్కృతీ వ్యవహార శైలులు, అని చెప్పక తప్పదు.
స్టీరియో టైపింగ్ జెండర్ డిస్క్రిమినేషన్స్ అంటే లింగపరమైన వ్యత్యాసాలు ఇళ్లల్లో మూస పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. ఇవి అన్ని తగ్గాలి. అత్యాచారాలు చేస్తున్నారు, లైంగిక దాడి, లైంగిక వేధింపులు చేస్తున్నారు అశ్లీలతతో స్త్రీని చూపిస్తున్నారు, ఇవి పోవాలి. దీనికి ప్రజల చైతన్యం చాలా ముఖ్యమైంది. లాభనష్టాలు అని చెప్పడానికి ఇదేమైనా వ్యాపారమా? ఇది జీవితం! ఇవన్నీ ప్రజలు తప్పకుండా గమనిస్తారు. సాధారణ ప్రజలు మరీను…
ఇవన్నీ ఒక్కసారిగా ఆ మటుమాయమైపోయి స్వచ్ఛమైన ప్రఫుల్లమైన జీవితం స్త్రీలకు వస్తుందంటారా? రాదు ! కొంత సమయమైనా అవసరం ! ఓపికగా కొన్ని తరాలు ఈ మార్పు లను అనుభవిస్తే, కనీసం భవిష్యత్తు తరాలలో అమ్మాయిలకి భద్రత, జీవితం పట్ల ప్రేమానురక్తులు కలుగుతాయేమో….అప్పుడైనా సమ సమాజ స్థాపన జరుగుతుందేమో.. అనే ఆశావహ దృక్పథంతో మనమంతా ఆలోచించి అడుగులు ముందుకు వేయాలి అప్పుడే మహిళా దినోత్సవాల ఉద్దేశ్యం నెరవేరుతుంది.
(మయూఖ 2026 జనవరి పత్రిక ఎడిటోరియల్)
మీరు స్మార్ట్ ఫోన్ తో ఉన్నారా? మీరు స్మార్ట్ టీవీ దగ్గర ఉండి మాట్లాడుతున్నారా? అయితే ఒకింత జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలనే కాదు మీ మనస్సు నూ పసిగట్టే శక్తి మిమ్మల్ని లోబరుచుకునే టెక్నాలజీ మీ చుట్టూ తిరుగుతుంది అని తెలుకోవాలి. రోజులు ఎంత మారిపోయాయి! కోవిడ్ వచ్చిపోయినప్పటినుండి అంతులేని వింతలే అన్నింటా!!
ఈ గడ్డు కాలం లో ఆత్మవిమర్శ ఎంతో అవసరం. ఆత్మావలోకనం ఎంతో అవసరం. కొత్త సంవత్సరం 2026 లోకి అడుగుపెట్టాం. క్యాలెండర్ మన జీవితాలను శాసిస్తోంది. తప్పదు. ఈ జీవన సమరం లో తేదీలు అస్త్ర శస్త్రాలయ్యాయి. పర్వాలేదు. కానీ ప్రపంచంలో ఏ దేశ వాసులైనా వాళ్ళ వాళ్ళ సంప్రదాయాలు, ఆచారాలు, అలవాట్లు పాటిస్తున్నారు. మనలాగే! తప్పులేదు. అయితే మనమేమో తెలుగు వాళ్లం , కొత్త సంవత్సరాన్ని వసంత ఋతువు, చైత్రమాసం లో కొత్త చిగురులెత్తే ప్రకృతి లా నవ వసంతోత్సవం చేసుకుంటుంటాం. నిత్య వ్యవహారంలో ఇంగ్లీష్ తప్పదు. వాళ్ళ పద్ధతులూ తప్పవు. మంచిదే .. నడిపిద్దాం… కానీ మనదైన సనాతన ధర్మాన్ని అనుసరించి ఆచార వ్యవహారాలు మానుకోకుండా ఆచరించాలి. మరి జనవరి నెలతో నూతన సంవత్సర ప్రారంభం. తెలుగు వాళ్ళు ముక్కోటి ఏకాదశి తో పండుగలు ఇంగ్లీష్ కొత్త ఏడాదిలో వచ్చిందనీ , తర్వాత వెనువెంటనే సంక్రాంతి పండగ వస్తుందనీ సంబరపడుతూనే మార్చ్ నెలలో వచ్చే ఉగాది పండుగ కోసం ఎదురు చూస్తుంటారు . ఇక అది మొదలు నక్షత్రాలు, తిథులను అనుసరించి ఎన్నో పండుగలు చేసుకుంటుంటాం. వాటి సంపూర్ణ వివరణ లోకి పోకుండా కొన్ని ముఖ్యమైన విషయాలు స్పృశించుంచుకుందాం.
ప్రతి సంవత్సరం కూడా రెండు ఆయనలుగా విభజించి ఆ రెంటిని కలిపే జీవన స్రవంతి సంక్రాంతి . ప్రముఖంగా ఈ సంక్రాంతి ఉత్సవాన్ని జరుపుకోవడానికి కారణమేమిటంటే, సకల జీవరాశులకి ఆధారభూతుడైన సూర్యుడు తన దిశను ఈరోజు మార్చుకోవడమే ప్రధాన
కారణం. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించడం తన దిశని పూర్వముఖుడై సకల జీవనానికి సకల జీవరాశులకు చైతన్య స్ఫూర్తిని కలిగించడమే … దక్షిణాయనంలో అంటే దాదాపు జులై 7 నుంచి జనవరి 14 వరకు కొంతవరకు వీటికి దగ్గరగా ఉంటుంది.ఇది ఉత్తరాయణం ప్రారంభంలోనే ఉంటుంది . అది చైతన్య స్థితిని పొందుతుంది. అందుకే ఈ తేదీ లు కూడా మారకుండా సూర్యుని పయనాన్ని అంటే రోజులుగా విభజించే పరిస్థితిని మార్చకుండా ఉంటుంది. దీనికి మన సనాతనంలో చెప్పింది ఏంటంటే ఒక పండుగ జరుపుకోవడం కన్నా ఒక చైతన్యాన్ని ముఖ్యంగా ఒక నూతనమైన ప్రణాళికతో మనిషి ముందుకు సాగాలని దీన్ని పచ్చ పచ్చని పండుగ గా, ఒక మైలురాయిగా మార్చారు. అందుకే పంటలు రావడం .. కొత్త పంట రావడం తర్వాత శీతాకాలం ఉండడంవల్ల రెండు ముఖ్యమైన పంటలను వేసుకోవాలి, పండించినవి మనం తీసుకోవాలని చెప్పారు.
ఒకటి నువ్వుల పంట. నువ్వు లు మన శరీర ఉష్ణోగ్రతకు దోహదపడేది. ఇంకొకటి బెల్లం అంటే మధురం. తీయదనం కోరుకోవడం, గళం విప్పారేందుకు సాయపడ్తుంది. మనిషి తన నూతన ఆవిష్కరణలకు ఇలా రెండు విధాలుగా ఉపయోగపడే పదార్థాలు తినాలి. ఒకటి వాతావరణానికి అనుకూలమైనవి అవి నువ్వులు ఇంకొకటి మనం మాట్లాడే మాట మధురమైనదిగా అందరిని అలరించే విధంగా ఉండాలని సంకల్పంతో నువ్వులు బెల్లంతో కలిపిన పదార్థాలను ఈరోజు తినాలని నియమించారు.
ఈ పండుగ పూర్తిగా సూర్యుని భ్రమణం ఆధారంగానే ఉంటుంది.అయితే ఏ మతంలోనైనా సూర్యుని తప్పనిసరిగా మన జీవనానికి ప్రకృతికి కేంద్ర బిందువుగా భావిస్తారు. సాధనకోసం సనాతనంలో అయితే సూర్యదేవుడు సూర్యారాధన జరుపుతారు. సూర్యుడు ఆరోగ్యం ఇవ్వడం అనేది ఒక కర్మకాండ కాదు అది ఒక చేతనత్వానికి మనం ఇచ్చే గౌరవం. అందుకే ఆరోగ్యం స్నానం చేసి సూర్యారాధన చేయడం మతాలకతీతం ఎందుకంటే సూర్యుడే మనందరికీ అవసరమైన శక్తినిచ్చే కారకుడు. నిజంగా, చెప్పాలంటే ప్రకృతి మూల దేవత అందులో సూర్యుడు ఆది దేవత అదే ఈ పండగ ప్రత్యేకత.
ఈ పండుగ కోసం కొన్ని నియమాలను పెట్టారు.
శయనం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉన్న కాలాన్ని చాతుర్మాస దీక్ష ను చేయమన్నారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి ని శయన ఏకాదశి అంటారు. భగవంతుడు యోగ నిద్రలోఉంటాడని నమ్ముతారు. ఇలాంటివి మరిన్ని…
త్రికాల సంధ్యలలో సంధ్యవార్చుకోమని ఎందుకు పెట్టారు అంటే
ఈ పండుగని ప్రకృతితో అన్వయించడంలో మన రుతు సంక్రమణం, రుతుభేదాలు కూడా అన్వయించారని చెప్పవచ్చు. కారణం
శ్రావణమాసం తో వర్షాలు తర్వాత శరత్ కాలంలో ఉండే వాతావరణం ప్రతి మనిషి ఎక్కువగా బయట తిరిగేందుకు అనుకూలంగా ఉండవు కాబట్టి ఈ కాలంలో నాలుగు మాసాలు పూర్తిగా ఒక దీక్షతో ఉండాలని పెద్దలు చెబుతారు దాన్నే చాతుర్మాస్య దీక్షగా గుర్తించారు. అంటే ప్రతివారు చేసుకునే నిత్య కర్మలు అంటే సంధ్యావందనము అనేది సూర్యుణ్ణి కొలిచే ఒక ప్రక్రియ దానికి నియమం త్రికాల సంధ్యా అని అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేసుకోవాలన్నారు. కారణం ఉదయించే సూర్యుడిని చూడడం మధ్యాహ్నపు సూర్యుణ్ణి ఆరాధించడం అస్తమించే సూర్యుడిని ప్రార్థించడం తిరిగి ఉదయించమని అంటే మనిషి తన చేతనాస్థితిని ఈ రకంగా ప్రకృతికి అన్వయించుకోవడం ఇది పూర్తిగా దక్షిణాయంలోనే ఉంటుంది అంటే భగవంతుడు యోగనిద్రలో ఉన్నప్పుడు ఈ విధులను తప్పనిసరిగా ఒకే ప్రదేశంలో ఉండి, అంటే ఇంట్లో ఉండి లేక ఒక ప్రదేశాన్ని నియమించుకొని అక్కడ ఉండి చేసుకోవాలి. అయితే ఉత్తరాయణంలో ఈ నియమం లేదు.అంటే చెప్పబడలేదు. కారణం ఇటువంటి ప్రకృతి సంబంధమైన ఇబ్బందులు ఉత్తరాయణంలో ఉండవు. కాబట్టి అయితే చేతనాస్థితిని పొందడం ముఖ్యంగా కొత్త ఆలోచనలతో ప్రణాళికలతో మనిషి ఈరోజు ప్రారంభించేసుకోవడం అనేది సూచించబడింది దీన్నే ఇయర్ ప్లాన్ అని న్యూ ఇయర్ ప్లాన్ అని కొత్త సంవత్సరంలో కొత్త ప్రణాళికలు వేసుకోవాలని చెబుతుంటారు.
మన పల్లెటూర్లలో దీన్ని కొత్త లు తినడం కొత్తలు పెట్టుకోవడం అని కూడా ఒక సంప్రదాయంగా చేస్తారు.ముఖ్యంగా కొత్తగా పండిన పంట ఈరోజు తప్పనిసరిగా అంటే కొత్త బియ్యం తో వండుకోవడం అనేది ఆచారం.
మనం అనాదిగా జరుపుకునే పండుగలు ఉగాది, సంక్రాంతి ఇవి విశ్వవ్యాప్తంగా జరుపుకునే పండుగలను చెప్పవచ్చు. కారణం ఇవి రెండూ ప్రకృతి పండుగ లు. సంక్రాంతి సంక్రమణం ఆధారంగా అంటే మకర రాశిలో సూర్యుని ప్రవేశాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు. అందుకే ప్రతి సంవత్సరం కూడా జనవరి 14 రోజు మాత్రమే వస్తుంది దాని ఈ పండుగని మనం ఏ నక్షత్రం ఆధారంగా చేసుకో ము అలాగే ఏ తిథి కూడా చూడాల్సిన అవసరం లేదు. ఇదేవిధంగా ఉగాది కూడా ఏ దేవతను ఆరాధించే నియమాన్ని సనాతనంగా చెప్పలేదు. ఈ పండుగకు కేంద్ర బిందువు కాలుడు మాత్రమే. కాలుడు అంటే కలకాలం అని అర్థం. చైత్రమాసం, వసంత ఋతు ప్రాముఖ్యత . దీన్నే విశ్వవ్యాప్తంగా కూడా వాడుకలో వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో పండగ జరుపుకుంటున్నారు.
మనం మాసాలను తీసుకున్నా,ఋతువులను తీసుకున్నా అయనాలను తీసుకున్నా ఇదే ప్రకారమైన ఆధారమని చెప్పుకోవచ్చు.మనిషి మనుగడకు ప్రకృతి అనుసంధానం చేసేవే పండుగ లు. వీటిని ఆచారం గా చెప్తూ alert చేయడం, జ్ఞానం కలిగించడం, పద్ధతైన బ్రతుకును అనుభవించడానికే నియమాలు ఏర్పాటు చేసారు. మంచి అలవాట్లు అలవర్చడం వంటి ఉద్దేశ్యాలున్నాయి. పూర్వీకులు నిర్ణయించిన సూర్య చంద్ర గమనాల లెక్కల్లో మార్పు లేదు. ఇప్పటివరకు తేడా రాలేదు. వీటి లక్షణాల ఆధారంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని నేర్పారు.ఇదే సనాతన ధర్మం.
ఏ దేశానికి ఆ దేశ కాలమాన పరిస్థితులకు తగినట్టుగా, భౌగోళిక ప్రాధాన్యత తో ఎండా వాన చలి తీవ్రత లకు తగినట్టుగా, నేల తీరు కూ, పండే పంటలకూ అనుకూలంగా చెప్పారు. చలికాలం తెల్లవారుజామున లేచి స్నానం చేయడం మంచిది. ఆ సమయంలో బావినీళ్లు వెచ్చగా ఉంటాయి . స్నానం వల్ల బద్ధకం పోతుంది, చురుకుగా ఉంటారు. చైతన్య వంతంగా ఆలోచిస్తారు ఇదే భావి జీవితానికి చక్కని మార్గం సుగమం చేస్తుంది.బుద్ధి వికసిస్తుంది . ఇలాంటివి చాలా పండుగ ల ఉద్దేశ్యం.ఈ చలనశీలత కోసమైనా ఎవరైనా వాళ్ళ పెద్దలు చెప్పే సనాతన సంప్రదాయం పాటించి ధర్మనిరతితో ఉంటారు. వీటివల్ల అంతా మంచే! చెడు లేదు!!
_____****____
( 2025 నవంబర్ మయూఖ పత్రిక సంపాదకీయం)
– డాక్టర్ కొండపల్లి నీహారిణి, మయూఖ పత్రిక ఎడిటర్
కొత్త బంగారులోకం, నా బంగారు కొండా, బంగారమసొంటి గుణం, ఆ ముచ్చట్లు వివరంగా చెప్తే నీ బంగారమేం పోయింది, బంగారం వంటి జీవితం తాగి తాగి నాశనం చేసుకున్నారు – ఇటువంటి మాటలు ఎందుకు వచ్చాయి? ఆ వివరాల్లోకి వెళ్తే…
బంగారం అనే లోహం అన్ని లోహాలలో చాలా చాలా విలువైన లోహం. ఒక భారమైన మూలకం. ఎక్కువ స్థితిస్థాపక గుణం కలిగి ఉండే ఖనిజం. బంగారం కాఠిన్యత ను పరిగణలోకి తీసుకుంటారు.
Au అనే చిహ్నంతో శాస్త్రీయంగా పిలువబడే బంగారం ఒక విలువైన లోహం. శాస్త్ర ఆవర్తన పట్టికలో 11వ సమూహానికి చెందిన మూలకం. బ్యాటింగ్ లో Aurun అంటారు కాబట్టి Au అనే పేరుతో రసాయనికంగా పిలిచే ఈ లోహం మూలవర్తన లోహం. ఈ లోహం మెత్తగా ఉంటుంది ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది.
ఆమ్లాలకు విడిపోయి ఏ చర్యకు గురికానటువంటి కరగనటువంటి బంగారం కాబట్టే ఇంత విలువ.
అయితే ఇటువంటి విలువైన ఈ బంగారం అనే లోహం పాదరసంలో హైడ్రోక్లోరిక్ నైట్రిక్ ఆమ్లాలతో కలిపిన ఆక్వా రెజియా అనే ద్రవంలో కరుగుతుంది. బంగారం, పాదరసం కలిసిన ధాతు మిశ్రమాన్ని సిద్ధం చేస్తారు. మేలిమి బంగారం అంటే పసుపు పచ్చని వర్ణంతో ఎక్కువ సాంద్రతతో ఉండే మెత్తని లోహం. ఇది అత్యంత విలువైన లోహాల లో ఒకటి.
ఇతర ఆమ్లాల చర్యలకు రసాయనిక మార్పుచెందని లోహం కాబట్టే బంగారం అంటే ఇంత మోజు కలగడానికి కారణమేమో. ఒక హౌస్ బంగారం నుండి దాదాపు 50 మైళ్ల పొడవైన తీగను తయారు చేయవచ్చు రేకుగా సాగదీయవచ్చు , కడ్డీల రూపంలో, బిస్కెట్ల రూపంలో నిలువ చేయవచ్చు. సాధారణంగా బంగారాన్ని karats , కారెట్స్ లలో తూకం వేస్తారు. బంగారం స్వచ్ఛత అనేది ఎలా ఉంది తెలుసుకోవాలంటే ఫైన్నెస్
fineness ఎంత ఉంది తెలుసుకోవాలని చూడడానికి ఉపయోగిస్తారు. గ్రాములు, కిలోలు కారెట్ల కొలతల్లో చెబుతారు. చాలావరకు 24 కారెట్ ఉంది అంటే అది కల్తీ లేని బంగారమని అర్థం. కాని, దీనితో ఆభరణాలు తయారు చేయడం కష్టం. అందుకే ఎటు అంటే అటు మలిగి, గట్టిగా ఉండడానికి బంగారానికి రాగి గాని వెండి గాని ఏదైనా లోహాన్ని ఓ 2 భాగాలు కలిపి 22 కారెట్ల కు సిద్ధం చేసి వస్తువులు తయారు చేస్తారు. భౌతిక శాస్త్రవేత్తల అభిప్రాయాల నేల పొరలలో తక్కువ ప్రమాణంలో నిక్షిప్తమై ఉండే బంగారు నిధులు ముఖ్యంగా ప్రధమ శ్రేణి ద్వితీయ శ్రేణి నిలువలుగా చెబుతారు. భూమి లో ఉండే ‘ మాగ్మా ‘ లో బంగారం ఉంటుందని ద్రవ రూపంలో ఉన్న బంగారం అవక్షేప శిలలలో నిలుస్తుందని , రాతి పొరలలోను చేరి ఉంటుందని చెప్పడం చూస్తాం.
ఈ మెత్తటి లోహంలో వేరే లోహాలను కలిపి దృఢంగా చేసి వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
పూర్వకాలం నుండి బంగారాన్ని వాడుకలో కి తెచ్చుకున్నారు ప్రజలు. శిలాజాలను తవ్వి బంగారాన్ని నిల్వ చేసుకునే వాళ్ళు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వస్తు మారక ద్రవ్యంగా కూడా ఉపయోగించేవాళ్ళు. ముఖ్యంగా వ్యాపారానికే కాకుండా రాజవంశీయులు వాళ్ళ సింహాసనాలను, అలంకరణ వస్తువులను ఎంతో శ్రద్ధగా నిలువ చేసుకునేవాళ్ళు. రాజుల రాణుల సమాధులపై రాజ వంశీయుల సమాధులపై బంగారాన్ని అలంకరణగా పెట్టే అలవాటు ఉన్నవాళ్లంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రముఖంగా ఈజిప్టులోని పురాతన దేవాలయాలలో బంగారాన్ని విరివిగా వాడే వారట.
ఈజిప్ట్ లోని నైలునది ప్రాంతంలో, నోబియన్ ఎడారి ప్రాంతంలో, రెడ్ సి అంటే ఎర్ర సముద్రం ప్రాంతంలో గనులు బాగా ఉన్నట్టు చెబుతారు. ఏమన్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా ప్రాంతాలలో బంగారు గనులను త్రవ్వి న చరిత్ర ఉన్నది. ఇకపోతే అమెరికా, కెనడా, రష్యా, జర్మనీ, స్విజర్లాండ్ జపాన్, ఫ్రాన్స్, ,ఆస్ట్రేలియా, చైనా, భారతదేశం, నెదర్లాండ్స్ వంటి దేశాలలో బంగారు నిల్వలు చాలా ఉన్నాయి . అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాలు ఇవి. ప్రపంచంలో అత్యధిక నిల్వలు ఉన్నాయనే పేరు తెచ్చుకోవడానికి పోటీలుపడి టన్నులు టన్నులుగా నిలువ చేసి పెడతారు.
దేశాల ముఖ్య వ్యాపార లావాదేవీలు ప్రముఖ దేశాల మధ్య జరిగినప్పుడు బంగారం నిలువల ప్రస్తావన వస్తుంది. బంగారం ధర వ్యాపారాలను శాసిస్తుంది. సెన్సెక్స్ లెక్కలు అధికమయ్యాయా? పడిపోయాయా? అనే చర్చల ద్వారా పసిడి ధరలు పెంచాల్సిందే.
అత్యధిక బంగారు నిల్వలు ఉన్న అమెరికా దేశస్తులు ఒంటి మీద నగలుగా ఎక్కువ ధరించరు. అక్కడ 18 క్యారెట్స్ బంగారాన్నే నగలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కాస్త చూడటానికి తెల్ల తెల్లగా కనిపిస్తాయి నగలు.
అయితే బంగారు జీవితం అంటే బాగా బంగారు ఆభరణాలు ధరించడం కాదు. వాళ్ల జీవితం పసిడి కాంతులతో కళకళలాడుతుంది అంటే అందరూ బంగారం తో అలంకరించుకోవడం, ఇంట్లో అంతా బంగారు వస్తువులతో నింపడం కాదు.
ఆరోగ్యకరమైన , సంస్కారవంతమైన జీవితం ఉంటే బంగారు బతుకు అంటారు. బంగారం అంటే పసిడి అనీ కనకము అని కదా అర్థాలు. ” కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్ట శుభ లగ్నమునన్” మనకో పద్యం కూడా ఉన్నది కదూ..
” పసిడికి తావి అబ్బినట్టు ” అనేది ఓ సామెత. తావి అంటే సువాసన. అతనికి గానీ ఆమెకు గాని చక్కని అందం తో పాటు మంచి గుణాలు ఉంటే ఈ సామెత ను ఉపయోగిస్తాం. ” కల్ల పసిడికి కాంతి మెండు” అంటే, False gold is very bright అదే… All is not gold that glitters అంటారు . కల్ల పయిడికి గరుకులు మెండు False gold is very rough అని , కూడా ఓ సామెత ఉన్నది. సామెత లు ఎందుకు ఆమెతలు అంటారో ఇలాంటివి చదివితే తెలుస్తుంది. ఇవి అసలు బంగారు జీవితానికి వ్యాఖ్యానాలు. పసిడి మనసులు అంటాం. సాధారణంగా చిన్నారులను చూస్తే!!! కదా! ఏ సంఘర్షణ లు లేకుండా ఏ కుళ్ళు కుతంత్రాలు తెలియని పిల్లలు కాబట్టి.
ఇక ప్రస్తుతానికి వస్తే, ఎవరు ప్రమాదపు అంచుల్లో ఉన్నారు? ఎందుకు ? ఈ ప్రశ్న లు చాలా విలువైనవి. బంగారంలా విలువైనవి. బంగారం కన్నా విలువైనవి.
బంగారం ధర బాగా పెరగడం వల్ల దొంగతనాలు దోపిడీ లు ఎక్కువయ్యాయి. ముందు ఇంతగా దొంగిలించేవాళ్ళు కాదు. కానీ,
ఇప్పుడు ఎక్కడ చూసినా బంగారు నగల వ్యాపార ప్రకటన లకు సంబంధించిన ఫోటో లు పెట్టడం వల్ల సమాజానికి చేరువవడంతో అందరు ఆకర్షితులవుతున్నారు . అంత షో చేయడం, ప్రాపగాండా చేసుకోవడం . ఇవన్నీ అవసరమా? అసలే నేరప్రవృత్తి బాగా పెచ్చుమీరుతున్న రోజులు ఇవి. అసలే ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పులు, ప్రపంచీకరణ ప్రభావం సగటు జీవుల బ్రతుకు లను అతలాకుతలం చేస్తున్నాయి. దారిద్ర్యం రేఖ కు మరీ దిగువనున్న సామాన్యులు ఉన్నారు. ఎటునుంచి ఎటు మారుతారో తెలియదు. ప్రమాదం అంచుల్లో ఉన్నది సమస్త మానవ జాతి. అందుకే తస్మాత్ జాగ్రత్త!!
_____*****_____
సెప్టెంబర్ మయూఖ పత్రిక ఎడిటోరియల్
గుడ్డి దీపం కింద కూర్చొని చదువుకున్నాను అని చదివిన జీవిత చరిత్రలు నిజంగానే గొప్ప ప్రభావం చూపాయి ఆనాడు. తర్వాత స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుకున్నాను అని వచ్చిన మోనోగ్రాఫ్స్ కూడా అంతే ప్రభావం చూపాయి. ఆ గుడ్డి దీపానికి ఈ స్ట్రీట్ లైట్ కు మధ్యన అంతరం ఏంటో తెలియనివాళ్ళం కాదు. వీధి దీపాలు ఇంటి వెలుగు దీపాలైన తర్వాత శాస్త్ర విజ్ఞానాలు అభివృద్ధి చెందాయి. సాంకేతిక విజ్ఞాన విశేషాలు విస్తరించాయి. ప్రపంచవ్యాప్తంగా ఫోన్లు, సర్వర్లు, డొమైన్లు ఇవే వింటున్నాం. రకరకాల కంప్యూటర్లు, టాబ్లెట్లు వంటివే కంటున్నాం. నవీన పరికరాల ఎన్నో ఉపయోగిస్తూ నెట్వర్క్ అనుసంధానంతో కమ్యూనికేషన్ చేయడమనేది చాలా సహజమైపోయింది.
ఏ కాలానికి అనుగుణంగా ఆ కాలంలో ఆలోచనలో మార్పులు వచ్చాయి. విజ్ఞానం వికాస దశలో ఉన్నది. చంద్ర మండలాన్ని శాసించే స్థాయికి వెళ్లారు. ఊహించని సాంకేతిక పరిణామాలు ప్రపంచం మొత్తం శాసిస్తూ ఉన్న సమయంలో ఇంటర్నెట్ ప్రాముఖ్యత చాలా పెరిగిపోయింది. తెలుగులో దీన్ని అంతర్జాలం అని అంటున్నాం. అంతర్జాలం అంటే చాలా విస్తృత అర్థమే ఉన్నది. విమానాలు ఆకాశంలో ప్రయాణం చేసి, వివిధ ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. వీటికి మన కంటికి కనిపించని రహదారులు వేసి ఉంటాయంటున్నారు . నేల మీద వాహనాలు వెళ్లడానికి ఉన్న దారుల ఎట్లా ఉన్నాయో అట్లాగే విమానాలు వెళ్లడానికి కూడా దారులు ఉన్నాయన్నట్టు! ఇవి చేపలు పట్టడానికి ఉపయోగించే వల ఎలా ఉంటుందో అలా విస్తరించి ఉంటాయి. అలాగే ఈ సాంకేతిక పరికరాలు ఉపయోగించడానికి వాడుతున్న అంతర్జాల వలలూ ఉంటాయి. ఒక ప్రధాన నగరం నుంచి జిల్లాలకు జిల్లాల నుంచి గ్రామాలకు గ్రామాలలో కూడా వీధుల్లోకి దారులు ఉంటాయి, బాటలు ఉంటాయి. మళ్లీ వీధుల్లో కూడా ఒక ఇంటికి ఒక ఇంటికి వెళ్లడానికి కాస్తంత చిన్న దారి ఉంటుంది. అలాగే సాంకేతిక దారులు కూడా ఉంటాయి.
అవిగనుక కంటికే కనిపిస్తే, మన కళ్ళతో చూస్తే, బహుశా అల్లిబిల్లిగా అల్లుకున్న ఇనుప తెరలాగా ఉంటుందేమో! ఈ శాటిలైట్ మాయాజాలం తెచ్చింది ఎవరు మనిషి విజ్ఞాన జిజ్ఞాసనే కదా!
ముసలి వాళ్ళ నుండి చిన్న పాపాయిల వరకు ఫోన్ వాడకానికి అలవాటైన ఈ కాలాన్ని సమీక్షించుకోవాలంటే సమగ్ర విశ్లేషణ చేసుకోవాలంటే టెక్నాలజీ సంబంధిత విషయాలు ఎలా తెలియాలో మనుషుల లోభాలూ, ప్రలోభాల విపరీతాలు తెలియాలి. మనిషి వ్యాపార వస్తువైన వైనమూ తెలియాలి.
కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇప్పుడు ఎంతో ముఖ్యమై ప్రపంచాన్నే పరిపాలిస్తున్నది. కోట్ల మందిని అనుసంధానం చేయడానికి కోట్ల కంప్యూటర్లను వాడుతున్నారు. శాటిలైట్ లకి రకరకాల మిషన్లను అమర్చి సర్వర్లు కంప్యూటర్లు వంటి సాఫ్ట్వేర్ పరికరాలతో ప్రోగ్రామ్స్ ను అందజేస్తూ టెక్నాలజీ గుప్పట్లోకి మనిషి వెళ్ళిపోయి చాలా ఏళ్లవుతోంది.ట్రాన్స్మిషన్స్ తో కంట్రోల్ చేస్తూ ఏ సాంకేతికతకు ఎటువంటి నియమాలు ఉన్నవో ఆ నియమాలను అనుసరిస్తూ అనుసంధానం చేసే విధానాన్ని ఇంటర్నెట్ విధానం అంటాం. ఫోన్ లుచేయడం ఈమెయిల్ చేయడం చాటింగ్ చేయడం రకరకాల వీడియో కాన్ఫరెన్స్ చేయడంతో సంభాషించడము, ముఖ్య సందేశాలను పంపించడం జరుగుతున్నది. అన్ని రకాల వ్యాపార లావాదేవీలకు నెట్వర్క్ ఈ ఇంటర్నెట్. ప్రతి ఇంటర్నెట్ కు సంబంధించిన విజ్ఞానానికి ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ఇవన్నీ నియంత్రణలోనే ఉంటాయి. ఎక్కడైతే ఎప్పుడైతే వేరే మార్గాల్లోకి వెళ్తున్నాయో అది పసిగట్టగలిగే నేర్పు కూడా ఈ ఇంటర్నెట్ వాడుకంలో ఉంది. కాబట్టి ఇంటర్నెట్ లేకుండా మనిషికి జీవనం లేదు అనే సత్యాన్ని గ్రహించి ఎప్పటికప్పుడు నిఘా కళ్ళతో చూస్తూ కంట్రోల్ చేయవలసిన అవసరం కాస్త ఇప్పుడు అగత్యమై కూర్చున్నది. భద్రతా విభాగాలు ఎక్కువ చేసి, ఎక్కడెక్కడ అయితే చెడు ప్రవేశిస్తున్నదో అక్కడ ప్రత్యక్షమై అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్టు ఏజెన్సీ ద్వారా రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. దీన్నే, ఈ సంస్థనే ARPA అంటున్నారు. ఈ ‘ ఆర్పా ‘ నడపడానికి సరిపోయిన నిధులను ఏర్పరచి ప్రపంచాన్ని కాపాడుకోవాలి. మనవైన ఆనందాలకూ మనవైన దుఃఖాలకూ తోడూనీడైనప్పుడు హృదయ రహస్య కుహరం లోకీ ప్రవేశించి నప్పడూ సంరక్షణ పథకాలు తప్పనిసరవవూ? అవుతాయి. ఈ అడిక్షన్ కంట్రోల్ చేయడం ఎవరితరం కావడం లేదు.
ప్రభుత్వ సేవలకైనా అంటే బిల్లు లు కట్టడం బట్వాడా చేయడం, ప్రైవేట్ విధానాలలో గాని షాపింగ్ చేసే దాంట్లోనూ బ్యాంకింగ్ విధానాలలోను ఆన్లైన్ సేవలు ఊరూరా అందుకున్నాయి. మీడియా అనే పదం సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి నోటు వినిపిస్తున్న మాట. మానవ సంఘానికి దశ దిశ ఇంటర్నెట్టే జీవం అయిపోయి కూర్చుంది. ఎప్పుడో దాదాపు 70 దశాబ్దాల క్రిందనే నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నెట్వర్క్ ఇంటర్నెట్ మాతృక మొదలైంది. అప్పటినుంచి కొన్ని దేశాలలో కొన్ని పట్టణాలకే పరిమితమైన ఈ సౌలభ్యం భూమి ధృవ ప్రాంతాలకు కూడా చేరుకున్నది పల్లె పల్లెను ఏకం చేసింది.
అసలు ఈ ఇంటర్నెట్ కి వరల్డ్ వైడ్ వెబ్ కు మధ్యన సూక్ష్మ అంతరం ఉన్నది. కానీ సాధారణంగా ఒకటే పదాన్ని వాడుతూ ఉంటారు.
ఒకప్పుడు ఫోన్ వాడకం కేవలం సమాచారం తెలుసుకోవడానికి ఒకరినొకరు పలకరించుకోవడంతో సరిపోయేది. అటువంటి ఫోన్ అనే పరికరంలోకి మొత్తం సాంకేతికత చేరిపోయి ఇంటర్నెట్ పైననే జీవితాలు ఆధారపడిపోయేలా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పైననే బ్రతుకులు గడిచేలా శాసించిన పరిస్థితులు ఇవి. నువ్వెక్కడుంటే అక్కడ నేను … నువ్వెక్కడికెళ్తే అక్కడికి నేను … అంటూ మన వెనుకే వస్తూ మనవెంటే వస్తూ వాకిట్లోనుండి వెళ్ళిన వైర్లు ఇంట్లోకి వచ్చాయి. వరండా లోగిలి దాటి, హాల్ ను అలంకరించి ఆనందాలు పంచే, నయనానందాలూ పెంచే టీ వి గా మారింది. ఈ రూం ఆ రూం అని లేకుండా గుండె గదిలోకి , సమస్త జన జ్ఞానం లోకి, మనుషుల మనసుల్లోకి చేరింది ఇంటర్నెట్!!
ఇక ఇంటర్నెట్ ఆధారం తో ప్రపంచం గుప్పిట్లో కి వచ్చే అల్ట్రా మాడర్న్ టెక్నాలజీ కి చిరునామా ‘ ఫోన్ యంత్రం’ అయ్యాక పరిణామాలు చాలా విస్తృత మయ్యాయి. నయనాలూ హస్తాలూ మెదడు వారధులై, సారధులై నయా జమానానే నడిపిస్తున్నాయి. ఈ అంతర్వలయానికి చిక్కని ఈ వరల్డ్ వైడ్ వెబ్ మాయాజాలం లో పడని మనిషులే లేరనేంతగా అయిపోయాం. ఆలోచనా ధారలన్నీ వెబ్ సైట్ లో చేరిపోవడం, ముఖం పత్రాలు ముఖ్యమైపోవడం ఇది ప్రస్తుత జీవన చిత్రం. ఇట్లా సాంకేతిక చుక్కలను పేర్చుకుంటూ పోతున్న మనిషి బ్రతుకులో కన్నీటి చుక్క లనూ కొనుక్కుని మనవైన డొమైన్స్ లలో నిక్షిప్తం చేసుకోవాల్సిన పరిస్థితులు ఇవి. ఇక ఇంటి చిరునామా లెందుకు? అంతర్జాల విలాసం ఇస్తున్నాం!
ఇంటర్నెట్ ఎప్పుడు సౌకర్యం కాదు అవసరం అయింది. ఈ అవసరాలలో లాభాలు ఉన్నాయి నష్టాలున్నాయి.
క్షణాలలో లెక్కలు కట్టి జవాబులు చెప్పగలిగిన గణితశాస్త్రం మన గుప్పిట్లో ఉండేది. అద్వితీయమైన ధారణా శక్తితో మెదడునే కంప్యూటర్లలా ఉపయోగించేవాళ్ళు. దత్తాంశాలను ,డేటాలకూ ఇప్పుడంతా గణన యంత్రాలే వాడుతున్నారు! అంతటి జ్ఞాపక శక్తిని హరించి వేస్తున్నది అంతర్జాలం. అనవసరమైన విషయాలను చూస్తూ, అమూల్యమైన సమయం వృధా చేయడం, లేత హృదయాలపై ముదురు నీడలు పడవేస్తూ ఎంత నష్టం చేస్తుందో తెలియని సమాజం కాదు ఇది. అన్ని సమాచారాలనూ నిక్షేపించగలిగే విద్యుత్ ఉపకరణమైన కంప్యూటర్ల ఉపయోగాలు ఎక్కువై కరెంట్ ఉత్పత్తి భారాలు విపరీతంగా పడుతున్నాయి. ఇవన్నీ ఎవరు మానిటరింగ్ చేస్తున్నారు? ఇదీ ఆలోచించాల్సిన విషయమే. ఇక అన్నింటినీ మించినవి ఇంటర్నెట్ మోసాలు! బాంక్ లో దాచుకున్న డబ్బు ఎప్పుడు ఎవరు ఎలా హాక్ చేసి కాజేస్తారో తెలియని కష్టాలు వచ్చిపడ్డాయి.సైబర్ నేరగాళ్లు ఎక్కువయ్యారు. అన్నీ ఫోన్ కు లింక్ చేయడం వల్ల పెద్ద కష్టమైపోతున్నది. పదిమంది ఉద్యోగులు చేసే పనిని ఒకరిద్దరి తో కానిచ్చేస్తూ నిరుద్యోగులనూ బాధపెడుతున్న వైనమూ తెలుసు.ఏవైనా ‘పెరుగుట విరుగుట కొరకే !’అనే మాటను ఎప్పుడైనా నమ్మాల్సిందే.
Internet తో లాభాలు లేవా?ఉన్నాయి. ప్రపంచ జ్ఞానం పెరిగింది. హాస్పిటల్లో చేర్చాలనుకునేవాళ్ళకు , ఆరోగ్యం ఎలాఉన్నదో తెలుసుకోవాలన్నా, చేర్పించాలన్నా ఇంట్లోనుండే పేరు నమోదుసుకోవచ్చు. ఒకటా రెండా? ఇలాంటివి చాలానే ఉన్నాయి. ముఖ్యంగా వివిధ భాషల్లో వెబ్సైట్ నిర్మించారు అందులో మన తెలుగు భాష కూడా ఉన్నది. Positive thoughts మంచిది కాబట్టి, మన మాతృభాష లో అంతర్జాల మనుగడ సాగిస్తూ, పురోగతిని సాధిద్దాం! హృదయాలను రచించుకుందాం! అంతరంగాలను పంచుకుందాం!!
_____****___
ఎక్కాల్సిన శిఖరాల
దాటాల్సిన లోయల
జీవిత గుణాలకు గణాంకాల
గుట్టు నేర్పే గురువులే మాకాదర్శం
భాష భాగ్యాన్ని
శాస్త్ర జ్ఞానాన్ని
సమయ పాలననీ గుప్పిట బట్టే
తెలివి నేర్పిన గురువులే మాకాదర్శం
గురువులంటే మా ఉపాధ్యాయులు
గురువులంటే మా ఊహల వారధులు
దేశభక్తి ని రంగరించి
క్షేమ సమాజ సూత్రాలని నేర్పించి
అభ్యుదయ దృక్పథాన్ని అలవర్చే
నిస్వార్థ సేవలను అందిచే గురువులే మాకాదర్శం
ఆటపాటల పోటీలు క్రీడా వినోదాలు
ప్రపంచ విజ్ఞాన ప్రయోగాల పాఠాలు
ప్రశ్నల పరీక్షలు ఫలితాల నిరీక్షణ లూ
చీకటి వెలుగుల సమవర్తన నేర్పే గురువులే మాకాదర్శం
అవనీ అమ్మ ఒక రీతైతే
నింగీ నాన్న ఒక తీరైతే
విశ్వ మానవతా రూపమయ్యే
అమ్మానాన్నగ మిన్నగ చూసే గురువులే మాకాదర్శం
పరాన్న జీవులవ్వద్దంటూ
పరులమేలును కోరాలంటూ
చదువుల విలువలు వినిపించే
పోటీ ప్రపంచపు విస్ఫోటనమయ్యే గురువులే మాకాదర్శం
కులాలు మతాలు ఎన్నున్నా
మానవత్వం మాకు సమ్మతమైతే
సామరస్య సంస్కారం మా మతమైతే
ఎత్తిన జెండా లో ఎదిగిన వర్ణ వికాసం
విద్యార్థులే అంటారు
వేకువ ఉదయం మాదంటారు
ఎలుగెత్తి చాటిన విద్వత్తు మాకేనంటారు
జగతి జవసత్వాలు మేమంటారు
ప్రగతి దారులు మేమే వేయాలంటారు
నాటిన విత్తులు మొలకెత్తి
పెరిగిన వృక్షాలు బడిపిల్లలేనంటారు
అందాల్సిన ఫలాలు భవితవ్యానిదేనంటారు
శిక్షణ ఇచ్చినా శిక్ష వేసినా
ఎంతోఎదిగేలాచేసే ఇంతటి గురువులే మాకాదర్శం
చిగురించే ఆశలకు నవ పల్లవులం
చదువుల వన వసంతం విరిసేలా
నలుగురు మెచ్చే నడవడి మాదైతే
నీతి నిజాయితీ ఉండాలనే మా గురువులే మాకాదర్శం!
గురువు అంటే గగనమంత గౌరవం
గురువు అంటే సముద్రమంత ఆదర్శం
చంద్రునిగా వెలుగొందించే సూర్యులే గురువులు
సూర్య తేజంగా చూపించే చంద్రులే గురువులు
గురువంటే మా ఉపాధ్యాయులు !
గురువంటే మా ఊహల వారధులు!!
మము నడిపించిన గురువుకు వచసా స్మరామి !
మము గెలిపించిన గురువుకు శిరసా నమామి!!
___*****____
– డాక్టర్ కొండపల్లి నీహారిణి,
మయూఖ ఎడిటర్ ( జూలై మయూఖ పత్రిక సంపాదకీయం) _____________
కవిత్వం రాస్తున్నారా? వ్యాసరచన చేస్తున్నారా? పుస్తకాలు ముద్రించుకుంటున్నారా? వేసుకోండి. వేసుకోవాలి. లేకుంటే ఎలా? లేకుంటే మనవైన భావనలు అక్షరాలలో తొంగి చూస్తూ వెక్కిరించవూ! పుస్తక రూపంలో కి తెచ్చుకోకుంటె, నన్ను అలా వదేలేస్తావా … పట్టించుకోవూ అని సాహిత్యం దిగాలుగా అడుగుతున్నట్టే అనిపిస్తుంది కదూ! ఈ భావనలు, ఈ ఎదురుచూపులు,ఈ ఆవేదనలు భవిష్యత్తులో కోకొల్లలు గా చరిత్ర రికార్డు చేసి పెట్టే రోజులు రానున్నవి. తస్మాత్ జాగ్రత్త! మాతృభాష తెలుగు కోసం పరితపిస్తున్న వాళ్ళ ఆరాటం వెనక ఏముంటుందో ఒకసారి పరిశీలిద్దాం.
భాష నా భవ బంధనం
భాష నా భావ బంధురం
యాసా బాసా నా రెండు కన్నులు
నా రెండు చేతులు రెండు కాళ్ళు!
ఒక్క గుండె కు పద గుంఫన ఫలాలు
ఒక్కో అడుగుకు నవ చేతన బలగాలు!!
ఇది కవులందరి హృదయ శ్వాస హృదయ ఘోష. కాదంటారా? మరెలా రాబోయే కాలంలో ” తెలుగు చచ్చిపోతుంది” అంటే వింటూ ఊరుకుందామా?
ప్రాచీన సాహిత్య చరిత్ర అంతా బాగా వంట పట్టించుకున్న పండితుల కాలం నుండి, భావ కవిత్వం అభ్యుదయ కవిత్వం అలవాటైన ఆధునిక కాలం వరకు తెలుగు భాషకు ప్రమాదం ఉంచుకొస్తుంది అన్న ఊహ కూడా ఎవ్వరూ చేయలేదు . బహుశా ఆ నాటి క్షీణ యుగంలో ఏ ఆదరణలేక బీరిపోయి పండిత కవులు భావించి ఉంటారు, ఊహించే ఉంటారు. కానీ, కవిత్వం వచన కవిత్వంగా ఉదృతంగా ప్రవహించినప్పుడు, కథలు వ్యాసాలు పరిశోధనలు పుస్తకాలుగా గ్రంథాలుగా వెల్లివిరిసినప్పుడు ఎవరూ ఊహించి ఉండరు. పూర్వకవుల కవిత్వ ప్రాశస్త్యాన్ని వివరిస్తూ విశ్లేషించిన కవులు ఉండేవాళ్లు. తర్వాత కాలంలో ఆధునిక సాహిత్య వికాసానికి తోడ్పడిన సాహిత్య విమర్శకులు ఉండేవారు. వాళ్లు కవిత పండితులు. వాళ్ళు చెప్పిన వాక్య సొబగులను తలకెత్తుకొని పుస్తకాలుగా విరిసిన సాహిత్యాభిలాషులకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించాయి. ఈ యజ్ఞం లో మనమందరము ఉన్నాము కాబట్టి, మనమందరము చదివాము, మనమందరము రాసాము కాబట్టి. మరి ఇప్పుడు ? గుట్టలు గుట్టలుగా పుస్తకాలు పేరుకొని పోతాయి కానీ రేపటి రోజు ల్లో చదివే వారు ఉండరు అనే బాధ.
ఇప్పుడున్న పరిస్థితుల్లో పరనింద ఆత్మ స్తుతి పొంగిపొర్లుతూ పక్క వాళ్ళ కవిత్వాన్ని పట్టించుకోని దుస్థితి వస్తుందని ఎవ్వరంటే ఎవ్వరు ఊహించి ఉండరు.
అరచేతిలో భూతల స్వర్గం ఇమిడిన వింతపోకడల కాలంలో కవిత్వం పలుచబడి , పోటీ తత్వం, భజన పరత్వం అలవడి, అభినందనల కోసం అవార్డుల కోసం అర్రులు చాస్తూ మేధావులను ఆలోచనలో పడేస్తున్నదీ చూస్తున్నాం. సరే ఏదో ఒకటి అక్షరాలనయితే కుమ్మరిస్తున్నారు కదా అని సరిపెట్టుకోవాలా అక్షరాలలో సత్తువ తగ్గిందని బాధపడాలా అర్థంగాని స్థితి.
కవిత్వ సంపద కొరవడితే కొరవడింది గాని భావాలయితే బాగానే ఉన్నాయి. ఏదో విధంగా తెలుగు వెలుగుతున్నదని మిన్నకుంటున్న దుస్థితి.
విరసి తెలుగు భాషకు ఏదో తెగులు పుట్టుకొస్తున్నది అని మాత్రం సమస్త జనావళికి అర్థం అయిపోతున్నది.
ఇక అర్థం కావలసిన సమస్య ఏంటంటే, ఇంతమంది కవులు, రచయితలు, సాహిత్య విమర్శకులు, సినీ జగత్తులో విహరిస్తున్న పాటల తేజోవిలాసమూ, పది రోజులకో పత్రిక పుట్టుకొస్తున్న పత్రికా రంగమూ తెలుసుకోవాల్సిన విషయం సావధానంగా చర్చించుకోవాలి. ఇవన్నీ ఎక్కువ కాలం మన్నికగా నిలవాలంటే తెలుగు భాష అనేది బ్రతికి ఉండాలి కదా!
రేపు మన సాహిత్యాన్ని తలకెత్తుకునే వాళ్ళు ఎవరు? తలకెత్తుకోకుండా సరే బతికించే వాళ్ళు ఎవరు? ఇంగ్లీష్ నేర్చుకోవద్దని ఇంగ్లీషులో చదువుకొని డిగ్రీలు సంపాదించి ఉద్యోగాల్లో డబ్బులు గడించొద్దని ఎవ్వరు
అనడం లేదు, కోరుకోవడం లేదు. తప్పదు కాలానుగుణంగా ఆధునిక విజ్ఞానం వెల్లి విరుస్తున్న ఈ నేపథ్యంలో శాస్త్ర సాంకేతిక విద్యను అభ్యసించడానికి ఇంగ్లీష్ లో చదవాలి, పట్టాలు పొందాలి, పరుగులు పెట్టాలి. ఏమి వద్దనడం లేదు కానీ ఇంత కష్టమైనటువంటి చదువును చదవగల విద్యార్థులకు తనదైన మాతృభాషలో ఒక తరగతి కి ఒక తెలుగు పీరియడ్ ఉంటే చదవలేరు అనే ఆలోచన ఎందుకు వస్తున్నది? అబ్బో కష్టం తెలుగు చదివి మార్కులు తెచ్చుకోవడం అని ఎందుకు అంటున్నారు? పిల్లలు అవలీలగా చదవగలరు చిన్నప్పటినుంచి ఒక క్లాసులో ఒక సబ్జెక్టు గా తెలుగును నేర్చుకుంటే!
ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన సాగుతూ, కేజీ నుండి పీజీ వరకు ఒక విషయం(సబ్జెక్టు) తెలుగు భాష వాళ్ళ వాళ్ళ తరగతి స్థాయిని అనుసరిస్తూ పెంచుతూ పోతుంటే తెలుగు భాష నేర్చుకుంటారు. కనుమరుగు కాదు. ఇలా భాష నేర్చుకునే వాళ్ళు ఎవరెవరికి ఏ ఏ ప్రక్రియపై ఆసక్తి ఉంటే వాళ్ళు ఆ ప్రక్రియలో ఉన్నటువంటి తెలుగు సాహిత్యాన్ని చదివి భవిష్యత్తులో కవులుగా, రచయితలుగా, సాహిత్య విమర్శకులుగా, పాటల రచయితలుగా ఎదుగుతారు. తెలుగు భాష బోధన లో ఉన్న ఉపాధ్యాయులకు అధ్యాపకులకు ఉద్యోగాలు పోవు. రాబోయే కాలంలో కొత్త వాళ్లకు ఈ ఉద్యోగాలు వస్తాయి. అసలు భాష నే కనుమరుగైతే ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి?
జానపద సాహిత్యాన్ని పుస్తక రూపంలోకి తీసుకువచ్చిన తర్వాత కదా వెలుగులోకి వచ్చింది. వాళ్లదైన సొంత తెలుగు తీయదనమంతా జనపదుల పాటల్లో కథల్లో దాగి ఉన్నది మొత్తం గుత్తంగా గ్రంథరూపంలో తెచ్చారు కాబట్టే పట్టణంలో మనకు చేరింది.ఆధునిక మాధ్యమాలైన టి.వి., సినిమా, యూట్యూబ్ లలోకి వచ్చిన తర్వాతే ప్రపంచానికి అందింది. అందుతున్నది. ఇందుకోసమైనా తెలుగు రావాలి కదా!
ఇప్పుడు అసలే అత్యంత ఆధునికమైన ఏ. ఐ. వచ్చింది. ఈ కృత్రిమ విజ్ఞానం ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ వల్ల తెలుగు బ్రతుకుతున్నది అని అనుకుందామా తెలుగును సమూలంగా నాశనం చేయడానికి ఇది ఒక కారకం అవ్వబోతుంది అని అనుకుందామా అర్థం కాని స్థితిలో ఉన్నాం. ఇలా వచ్చిన తెలుగు నైనా చదవగలిగే శక్తి మునుముందు మన పిల్లలకు ఉంటుందా అనేదే ఒక పెద్ద ప్రశ్న!
ఆ రోజుల్లో మనము మన తర్వాతి రెండు మూడు తరం వాళ్లమంతా ఇప్పటివరకు తెలుగు భాషలో ఇంతో అంతో పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నాం కాబట్టే ఇప్పుడు రచనలు చేయగలుగుతున్నాం. ఇది ఎన్నటికీ మరవద్దు!
తెలుగు ప్రాంతంలో ఉన్న ఒక డాక్టర్ కి పేషెంట్స్ అందరూ ఇంగ్లీష్ వాళ్లే, ఇంగ్లీష్ అర్థం అయ్యే వాళ్లే వస్తారా? చదివిన శాస్త్ర విజ్ఞానమంతా ఇంగ్లీషులోనే ఉండవచ్చు, మెడిసిన్స్ ఇవ్వవచ్చు, ఆపరేషన్స్ చేయవచ్చు కానీ రోగి బంధుమిత్రులతో , అయిన వాళ్లతో దగ్గర వాళ్లతో అనునయించి మాట్లాడడానికి వాళ్లదైన భాష తెలుగులో నాలుగు మాటలు మాట్లాడి అనునయిస్తే ఆ భయం పోతుంది , కొంత ఊరట చెందుతారు. ఒక లాయర్ వాదోపవాదనలు అయిపోయిన తర్వాత గెలుపు ఓటముల సందర్భంలో తెలుగు వాళ్లతో తెలుగులో మాట్లాడితే తొందరగా అర్థం అవుతుంది, బాగుంటుంది కదా! ఒక పోలీసు, ఒక బ్యాంకు ఎంప్లాయ్, వ్యాపారస్తులు, విద్యావేత్తలు అందరూ ఎవ్వరైనా తెలుగు ప్రాంతంలో ఉన్నంతవరకు తెలుగులో మాట్లాడితే తెలుగు ప్రజలు ఆనందిస్తారు. ఈ సాన్నిహిత్యానికి వారధి తెలుగు వాళ్ళకి తెలుగు భాష నే! ఇదే విషయం సాహిత్యానికి కూడా వర్తిస్తుంది. ఇది సత్య దూరం కాదు!!
“విద్య యశస్సు ,భోగ కరి, విద్య గురుండు విదేశీ బంధుడు…” కదా! “చదవని వాడజ్ఞుండు..” కదా! మరి…”తేనె జుంటియల తెలుగు …” మన పిల్లలకు రావద్దా? రావాలి! ఎట్లా? మనోవికాసానికి చైతన్యానికి మనదైన మాతృ భాష వచ్చుండాలి కదా! మరి ఏం చేద్దాం ఎట్లా??
ఇప్పుడు కవులకు రచయితలకు ఇది ఒక పెద్ద సవాల్ గా పరిణమించింది. మరి ఏం చేద్దాం? ఏదో కొంత కృషి చేయవలసిందే! ఏవో కొన్ని కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిందే!! ఇళ్లల్లో కొడుకు లు కూతుళ్లు తెలుగు పుస్తకాన్ని పట్టుకోవడం లేదు మనం రాసిన మన కవితల పుస్తకాలు మన రచనలు ఒక్క పేజీ కూడా చదవలేరు. ఈ దుస్థితి దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఉన్నది. ఈ సమస్యని ఎదుర్కోవాలంటే కొంత సమయం మనంది కావాలి కొంత సహనాన్ని వెచ్చించాలి.ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, ఓపిక తెచ్చుకుని తెలుగును చదివే లాగా నచ్చ చెప్పాలి. బ్రతిమిలాడి తెలుగును వినేలాగా తెలుగు చూసేలాగా ప్రయత్నించాలి.
అయితే ఇలా ఎంత చేసినా బడిలోంచి వచ్చే తెలివితేటలు వేరు! ఒక్క కొడుకునో ఒక్క కూతురునో కూర్చోపెట్టి పాఠం చెప్పుకోలేని, తెలుగు ను నేర్పించలేని చదువును 50 మంది విద్యార్థులకు ఒక్క టీచర్ అవలీలగా నేర్పగలరు. ఈ క్రమశిక్షణ, ఈ భయమూ బడి వాతావరణం లో ఉంటుంది. కాబట్టి, ఈ నిజాన్ని అందరూ ఒప్పుకొని పాఠశాల చదువులో తెలుగు ఒక సబ్జెక్టుగా తప్పకుండా ఉండేలా ఉద్యమం చేయాలని కంకణం కట్టుకొని కవులందరూ బయలుదేరాలి. పోరాటాలతో స్వాతంత్ర్యాన్ని సాధించుకున్న రక్తం మనలో ప్రవహిస్తున్నది. మన తాత ముత్తాతల పౌరుషం మనకు తప్పకుండా స్ఫూర్తినిస్తుంది. ఇది నిజం కాదంటారా?
నాకు తెలుసు, నాకు తెలుసు అంటూ కాంతం నోరు నొక్కేసినప్పుడల్లా ఏదో తెలియని విజయగర్వం తలెత్తుత్తుండేది. కానీ ఇప్పుడు తెలుస్తున్నది. నాకు ఏమీ తెలియదని. ఒంటిచేత్తో సంసారాన్ని లాగుకొస్తున్నాననే అనుకున్నానుగానీ సగం భారం నాకు తెలియకుండా తానూ మోస్తుందనుకోలేదు. ఇదంత అబద్ధమైపోతే బావుండు. ఈ వారం రోజుల నరకయాతన చాలు. ‘నేను’ అంటే ఏమనుకున్నావు?’ అని కళ్ళెగరేస్తూ కాలరెగిరేస్తూంటే, తిరిగి తిరిగి చూసే కాంతం నాకు కావాలి. ఈత నేర్చిన చేపపిల్ల అన్నప్పుడల్లా ముసిముసిగా నవ్వుకుంటూ పనిలో నిమగ్నమయ్యే నా కాంతం కావాలి. నా కాంతం నాకు కావాలి’’ ఈతి బాధలంటే ఏందోయ్ ఇవ్వే కదా…!’ అని నేన్నప్పుడల్లా సమయస్ఫూర్తిగా సర్దిచెప్పేనా కాంతం కావాలి కాంతం కావాలి. ఇంతకన్నా ఈతిబాధే ముంటుంది. కాంతంలేని బతుకొద్దు, కాంతం కావాలి కాంతమే కావాలి.
* * *
దుర్గయ్యకు, ఒక్కగానొక్క బిడ్డ కమలమణి. రాధమ్మ తల్లి పేరునూ, దుర్గయ్య తల్లి పేరునూ ఇద్దరిదీ పేర్లూ వచ్చేలా పెట్టుకున్న పేరు.
సింగారగ్రామం పట్టణానికి దగ్గరలో ఉన్నది కాబట్టి కమలమణి చదువుకు ఆటంకం లేకుండా డిగ్రీవరకు పూర్తి చేసుకున్నది. తన బిడ్డకు మంచి సంబంధం చూసి పెళ్ళి చెయ్యాలని ఎన్నడు పోని ఊళ్ళకు పోయి, ఎప్పుడు కలవని మనుషులనూ కలిసి, వెతికి వెతికి సుధాకర్‌ను దొరకబట్టాడు. అందగాడు, యోగ్యుడు, ఆస్తిపరుడు, అయినవాడు. ఇంకేం?
‘‘తల్లీ! నీకు ఆ అబ్బాయి నచ్చాడమ్మా.’’
‘‘ఏం నాన్నా ఎందుకు ఆ అనుమానం వచ్చింది?’’ ముసిముసి నవ్వులతో కమల సమాధానం. ‘‘ఆ ఏం లేదు, ఎప్పుడూ గలగలా మాట్లాడేదానివి, నిన్నటి నుండి ఎట్లాగో అదోలా ఉన్నావు అని…’’ తండ్రి మాటలకు కళ్ళ నీళ్ళు తిరిగిన కమల ‘‘ఆయన నచ్చిండన్న సంతోషం కన్నా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది గదా అనే భయం పట్టుకున్నది నాన్నా’’ అన్నది.
ఆ మాటలకు దుర్గయ్య ఒక్కసారి తనను తాను నమ్మలేకపోయాడు. ఒక విధమైన ఆశ్చర్యము, ఒక విధమైన ఒణుకు కలిగింది. ఆడపిల్లలు అమ్మా నాన్నల దగ్గర ఎంతో ఇష్టంగా, ఎంతో ఆనందంగా గడుపుతారు. పెళ్ళి చేసుకొని మరొకరితో జీవితం పంచుకోవాలని ఉన్నా తెలియని సంకెళ్ళవో పడబోతున్నాయని భయపడ్తారు. కాని తల్లిదండ్రులకు చెప్పరు, తెలియనివ్వరు. ఇవన్నీ తెలిసిన తండ్రే దుర్గయ్య. కమలను కన్నీళ్ళను పలకరిస్తూ ‘‘తప్పదు కదా బిడ్డా….’’ గాద్గిక స్వరం. ఒక ఇక్కడ ఉండలేక వెళ్లిపోయాడు.
* * *
పెంకుటింటి ముందు పెండ చాన్పి పచ్చగా మెరిసిపోతున్నది. వాకిలంతా తెల్లని ముగ్గులు నవ్వుతున్నయి. ఆ చిన్న ఇంటికే ప్రహరీగోడ పొందికగా ఉన్నది. దానికి ద్వారతోరణంగా మామిడాకులు సాదరంగా ఆహ్వానిస్తున్నవి. పందిరి గుంజలకు బంతిపూల దండలు వేళాడుతూ అందరిని పలకరిస్తున్నట్లున్నవి. పైనుండి కొబ్బరి మట్టలూ, పెండ్లి మంటపానికి కట్టిన అరిటాకులు ఆకుపచ్చదనంతో పోటీపడ్తున్నవి. పండ్లూ ఫలహారాలు తింటూ పిల్లలు అటు ఇటూ పరుగులు దీస్తున్నారు. ఇంటిముందు చావిడిలో అందరు కూర్చోడానికి చాపలు వేసి ఉ్ననవి. అటు ఇటు ఎండదగులకుండా తడకలు కట్టున్నవి. ఇంటి గోడలపైన ప్రహరీ గోడలమీదా వేసిన బొమ్మలు, జరగబోయే పెండ్లి తాలూకు సంబరాల్ని తెలుపుత్నువి. తెల్ల సున్నం గోడకు, ఎర్రని జాజుపట్టీల రేఖా చిత్రాలు, గీతలబొమ్మలు భలే అమాయకత్వపు అందాలతో ఆకర్షిస్తున్నవి. అయ్యగారు మంత్రాలు చదువుతుంటే కొందరు పెద్దోళ్ళు చూస్తున్నారు. గణపతి పూజకాగానే ‘‘పెండ్లి పిల్లను తీసుకురావాలే’’ అని అయ్యగారు అనగానే సన్నాయి మేళం గట్టిగా వాయిస్తున్నరు. ‘‘బంగారు బొమ్మ రావేమే పందిట్ల పెండ్లి జరిగేనే….’’ కదా! ఎంత ఆశ్చర్యం. పెండ్లి కూతురు అనగానే సిగ్గుల మొగ్గయిపోయి, ఏదో కొత్త కళతో చెప్పనలవి కాని అందంతో ఉంటారు వధూవరులు. ‘‘మాంగల్యం తంతునా….’’ మనోవాక్కాయ కర్మేణా ఒకరికొకరు ఒదిగి ఉండే అద్భుత జీవన ఘట్టానికి నాంది పెళ్ళి. దుర్గయ్య, రాధమ్మలు కన్యాదానం చేయడం తమకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నారు. పెళ్ళికి వచ్చిన పెద్దలు జిలకరబెల్లం పెట్టుకున్న ఆ జంటపై అక్షతలు వేస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. తరువాత జరుపబోయే తలంబ్రాల తంతు కోసం ఆత్రంగా చూస్తున్నారు, ఎక్కడో ఆడుతున్న పిల్లలూ బిలబిలమంటూ వచ్చి చేరిపోయారు మంటపం దగ్గర. అయ్యవారు చెప్పినట్టు ఒద్దికగా తలంబ్రాలు పోసుకున్న జంటనే ఇక పోటీపడి తలంబ్రాలు పోసుకోవడం అందరికీ ఓ సరదా. అప్పటివరకూ ఉన్న ఉద్వేగపూరిత, భయపూరిత వాతావరణం మొత్తం ఈ తంతుతో చల్లబడి, ప్రశాంతత తెస్తుంది.
పెళ్ళి భోజనాల కోసం మగపెళ్ళి వారిని పిలవడానికి చేతిలో కుంకుమ కాయ పట్టుకోని పోయినారు, పెండ్లి పిల్ల తల్లి రాధమ్మ, ఆమె వెనుక దుర్గయ్య. అక్కడ ఏడుపు వినిపిస్తున్నది, ఆడపడుచు సత్య చుట్టు బంధువులు చేరి బుజ్జగిస్తున్నారు. విషయం తెలుసుకోగా, ఆడబిడ్డ కట్నం ఇప్పుడు ఇయ్యకుంటే పెళ్ళి ఇంట్లోంచి తినకుండా పోతనంటున్నడు మా ఆయన అని! మాట ముచ్చట్లల్లో మాట్లాడుకున్న కట్నం నేను ఇచ్చేశానే అన్నాడు దుర్గయ్య. వియ్యంకుడు దగ్గరికొచ్చి, అనుకోని అవసరం బడి ఆ డబ్బులు వాడుకున్న, పంట ఇంటికొచ్చిన తర్వాత బిడ్డకు అల్లునికి పిలిచి కట్నం బెడ్దామనుకున్నాం అన్నాడు. ఇంత కష్టపడి ఇంత జేసినాక ఆడపిల్ల ఏడ్చుకుంటు పోవడమేందని ఆలోచించుకొని, దుర్గయ్యనే ఇస్తానన్నాడు. కొద్దిసేపటికి సర్దుబాటు చేస్తేగానీ అందరూ ఆనందంగా భోజనాలు చేయలేదు. అప్పుడే తెలిసింది కమలమణికి, మోయాల్సిన బాధ్యత ఉంటుంది చాలానే అని!
* * *
రామాపురంలో ఊరు పెద్దదే, లింగయ్య కుటుంబమూ పెద్దదే. ఉన్న కొద్ది పంట చేన్లతోపాటు, చేసుకునే బడిపంతులు ఉద్యోగంతో ఎట్లాగో అట్లా నెట్టుకొస్తున్నాడు. ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు. భార్య చనిపోయేవరకే ఇద్దరాడపిల్లల పెండ్లిళ్ళు చేసిండు. పెద్ద కొడుకు సుధాకర్ పెండ్లి హడావిడి తగ్గింది. పదిమందిల పరువు కాపాడిన దుర్గయ్యను తలుచుకుంటుంటేనే కోడలు కమలమలమణి ఛాయగిలాసతో లోపలికొచ్చింది.
చేతికున్న గోరింటాకు ఇంకా పోలేదు. కొత్త పెండ్లి పిల్ల అప్పుడే ఇంటి పని చేస్తున్నది అనుకుంటూ ‘‘ఏం సంగతులు కమలమ్మా! చిన్నబోయి ఉన్నవు, అమ్మ నాయన యాదికొస్తున్నారా ఏంది?’’ అన్నాడు కోడలితో లింగయ్య.
‘‘అయ్యో అదేం లేదు మామయ్యా!….’’ అని అక్కడే ఆగిన కోడలుతో ‘ఏందమ్మా ఏదో చెప్పబోయినవ్, మళ్ళీ ఆగిపోయినవ్, ఏందో చెప్పు’’ అన్నడు.
‘‘నేను బడిలో ఉద్యోగం కోసం పోదామనుకుంటున్న మామ… మీకు చెప్పినాంక దరఖాస్తు బెట్టుకొమ్మన్నడు ఆయన’’ అని ఆగింది. ‘‘ఉద్యోగం జేస్తవా?’’ ఆశ్చర్యంగా అంటున్న మామగారి నుండి మరిన్ని మాటలు ఆశించకుండా.
‘‘మీ కొడుకు సంపాదన సరిపోదనిగాదు, మనకున్నవి తక్కువనిగాదు గాని ఇంత చదువుకున్న ఉట్టిగానే ఇంట్ల కూచోబుద్దయిత లేదు, టీచర్ జాబ్ అయితే మంచిగుంటదని….’’ ధైర్యంగా అన్నది కమల.
‘‘సరే! మావోడు సరేనన్నాడా? ఇంటెడు చాకిరి చేసుకోనిపోయి మళ్ల బళ్ళె చెయ్యాల్నంటె కష్టంగాదా?’’ తన అనుమానాన్ని వ్యక్తపరుస్తూ
‘‘ఏంగాదు మామయ్య, ఈ కాలంల అందరు చేస్తున్నరు గదా… ఏదో ఓటిచేసుకొని, కష్టపడదాం’’ అన్నది ధైర్యంగా.
ఆమెలోని పట్టుదల చూసి సరే అన్నడు లింగయ్య. సంబరపడిపోతూ భర్త సుధాకర్ దగ్గరికి ఉరికింది కమలమణి.
* * *
కుండపోత వాన కురుస్తున్నది. రోడ్లన్నీ జలమయమైపోయినవి. సందు సందులకు చేరుతున్న ఇళ్ళ చూర్లనీళ్ళన్నీ పల్లం కోసం పరుగులు తీస్తున్నవి. ఆకాశానికి భూమికి నీటి వంతెన ఏర్పడ్డట్టు ఎడతెగని వాన. ఇంట్లో నిండు చూలాలి ప్రసవ వేదన. ‘‘అమ్మా! అమ్మా నొప్పి! నొప్పి!’’ అరుపులు మేఘగర్జనల్లో కలిసిపోతున్నవి.
కమలమణి ఆ గడపలో కాలుబెట్టినప్పటి నుండి ఆమె చేతులమీదుగా ఇది రెండో కాన్పు! పెద్దాడ బిడ్డ మల్చూరు కాన్పు, ఇప్పుడు చిన్నాడి బిడ్డ తొల్చూరు కాన్పు. వానను సైతం లెక్కచేయక భర్త సాయంతో ఎడ్ల బండిలో చిన్నాడ బిడ్డ నెక్కించుకొని సర్కారు దవాఖానకు తీసుకొనిపోవడం, పెద్దాపరేషన్ చేయించడం, ఇంటికి తీసుకొచ్చి బాలింతకు సేవలు చేయడం, చంటిపిల్లవాణ్ణి సాకడం, ఆమెను అత్తగారింటికి పంపేదనుక కన్నతల్లిలాగా కమలనే చేసింది. తనకోవైపు వేవిళ్ళు, అన్నం సయించకున్నా, చేతగాకపోయినా పంటి బిగువున భరిస్తూ అన్ని పనులు చేసింది. కాలం దెచ్చే సంబురాలు ఆ ఇంటిలో విరిసినవి.
దుర్గయ్య, రాధమ్మలు వచ్చి తొలి కాన్పుకు తల్లిగారింట్లో జరగాలని కమలను తీసుకుపోవడంతోగాని ఆమెకు విశ్రాంతి దొరకలేదు. చదువులకని పట్నంల ఉన్న మరిది మధ్య మధ్య వీళ్ళింటికి వచ్చిపోతూ అన్న సుధాకర్‌కు ఎప్పటికప్పుడు ఇక్కడి ముచ్చట్లు చేరవేస్తుండేది. సుఖప్రసవం అయ్యి, బిడ్డను చూసుకునే దాక ఆమె మనసంతా, అత్తగారింటి మీదికే పొయ్యేది. ఇట్లా ఇరువై ఒక్కటి అయ్యిందో లేదో నెలలోపే అత్తగారింటికి వెళ్ళిపోయింది. బ్రతిమిలాడితేగాని అన్నం తినని తమ గార్వాల బిడ్డేనా అని కమలలో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయేవారు.
* * *
టీచర్ ఉద్యోగం అంటే ఒకప్పుడు ‘‘బతకలేనోళ్లు బడిపంతుళ్ళు’’ కాని ఇప్పుడు బతకనేర్చినోళ్ళు బడి పంతుళ్ళు’’. సమాజ పోకడలతో తానూ జతకడుతూ చదువు చెప్పడం, అందరినీ మెప్పించడం అంత సులువు కాదు. అయినా ఏ మాత్రం బెదరక ఏ మాత్రం ‘పని’ మానక పనులు చేస్తూ చేస్తూ ‘తనకు ముగ్గురు సంతానమయిన తర్వాత కమల ఉద్యోగం వదిలేసింది. ఆమె ఆ నిర్ణయాన్ని ముందు భర్తకే చెప్పింది.
ముసలివాడైన మామ మంచాన బడడం, ఆడబిడ్డలిద్దరి బాధ్యతలు చూడడం, ఒకరి తరువాత మరొకరు ముగ్గురు పిల్లలవ్వడం, ఒచ్చిపోయే ఇల్లు, ఇక తన వల్లగాదని మానేసిన ఉద్యోగాన్ని తృణప్రాయంగా భావించింది కమల. ఈ మధ్యలో మరిది చదువు పూర్తయ్యి, ఉద్యోగం చేస్తుండడంతో ఆయనకూ పెండ్లి చేసే బాధ్యత అన్నా వదినలదే అయ్యింది. ఉన్న పొలంలో ఏదో కొంత పంట పండినా, చెల్కలన్నీ అమ్మేసి పంచుకున్నారు అన్నదమ్ములిద్దరు. గవర్నమెంటు ఉద్యోగం, మధ్య మధ్య ట్రాన్స్ఫర్లు సుధాకర్కూ కష్టమైపోతుండేది. ఎక్కడ ఉద్యోగముంటే అక్కడ చిన్న ఇల్లు కిరాయికి తీసుకొని ఒక్కడే ఒండుకుంటూ ఉండేవాడు. శని, ఆదివారాలు ఒచ్చిపోతూ ఉండేవాడు. పెళ్ళయ్యి రాగానే కమల తమ పెరట్లో నాటిన మందార చెట్టు ఇప్పుడు పెరిగిపెద్దయ్యింది. ఏం మారతాయి? శరీరంలో సత్తువ తగ్గడం, ఎముకలు కుంగడం తప్ప. ఎప్పుడూ ఖాళీగా ఉండడం, నింపాదిగా తినడం, హాయిగా పడుకోవడమే తెలియని కమలమణి తలలో వెండి తీగలు మెరిసేవరకు యంత్రంలా చేస్తూనే ఉండేది.
మామగారు లింగయ్య కాలం చేయడంతో ఇంట్లో ఏదో శూన్యం నిండుకున్నట్లు అనిపించినా తన పిల్లలతో వెలితిని పూడ్చుకునేది.
‘‘అమ్మా! ఇదేందే నాకు ఇంత తక్కువ మార్కులొచ్చినవి. ఛీ! ఇజ్జత్ మొత్తం బోయిందే’’ అని దుఃఖించే పెద్ద కొడుకును ఎట్లా ఓదార్చిందో, పెరిగిన రూపురేఖల ప్రభావం మీద పడి ఇబ్బంది పెట్టకుండా కన్న బిడ్డనూ చూసుకున్నది. కాలప్రవాహానికి తట్టుకునేలా చిన్న కొడుకు చదువువరకు ట్యూషన్లూ పెట్టించి మరీ చదివించేది.
ఊళ్ళో అమ్మా నాయనలు పెద్ద వయస్సోళ్ళై పోయినారన్న బాధ. వాళ్ళకెవ్వరూ చూసుకునే వోళ్ళే లేరన్న బాధ. ఒక్కగానొక్క బిడ్డను నేను గాకుంటే మరెవ్వరౌతారని వాళ్ళ విషయాలూ పట్టించుకునే కమలకు ఎక్కడ అడ్డురాలేదు భర్త సుధాకర్. అదొక్కటే ఆమెకు చేయూత. మధ్య మధ్య కన్నవారింటికి వెళ్ళిరావడం, ఇక్కడ అక్కడ ఓ మూడుతరాల వారధిగా కమల నిలబడిరది.
* * *
‘‘మణెమ్మా ఓ మణెమ్మా… ఏం జేస్తున్నవూ? రాజత్త పిలుస్తునే ఉన్నది.
‘‘ఒస్తున్నా’’
‘‘రా ఇట్లా కూర్చో…’’
‘‘ఏందత్తమ్మా ఏమాయె అంత అదురు? దా ఇట్లా కూర్చో అని గద్దెపీట చూపిస్తుంటే, రాజత్త ఒచ్చి కూర్చున్నది.
‘‘గా నడిమింటి పుల్లయ్య లేడూ….’’
‘‘ఆఁ…. ఏమైంది!’’ ‘‘వాళ్ళింట్ల దొంగలు పడ్డరంట.’’ అన్నది గట్టిగా. ‘‘అయ్యో పాపం! ఏం బోయినయి ఏంది?’’ ఆత్రుత.
‘‘దుకుణంలా నగదు ఎత్తుకుపోయిన్రట’’ అన్నది రాజత్త.
‘‘అయ్యో పాపం! కమల, ఆమె ముచ్చట్లు పెట్టుకున్నరు.
కమల, కన్నతల్లి తల్లిగారివైపు వాళ్ళంతా మణి, మణెమ్మ అని పిలిచేది. ఆమె అమ్మ చెల్లెలు, చిన్నాయన బిడ్డ. రాజవ్వది అదే ఊరు. ఊరు కూరికే కమల దగ్గరి కొచ్చిపోవుడు ‘ఊరి ముచ్చట్లు చెప్పిపోవుడు ఆమె కలవాటు. తండ్రివైపు బంధువులు కమల అంటే తల్లి వైపువాళ్ళు. మణెమ్మ అనేది. రాజవ్వ వరసకు చిన్నమ్మగావాలె. కాని ఆమెను వాళ్ళ చిన్న మామకు ఇచ్చినందుకు, ఆ వరస కన్నా ఈ వరసే ముఖ్యమని అత్త అనమనేవోళ్ళు, అందుకే రాజత్త అనడమే అలవాటయ్యింది కమలమణికి.
ఒడ్లెండ బోయించుడు, చింతపండు గింజలు గొట్టుడు, కారం దంపించుడు, పసుపు పట్టించుడు, పిండి గిర్నీకి బియ్యం పంపుడు, కందులు ఇసిరించుడు. ఒక్కటా రెండా, నలుగు రొచ్చిపోయే ఇల్లు అన్నీ ఉండొద్దా అని భర్తతోని వాదించే కమల ఏడాదికి సరిపడే గ్రాసాన్ని సిద్ధం చేసుకునేది.
‘‘పెద్దోనికి ఉద్యోగం రావాలె, చిన్నోనికి కాలేజీల సీటు రావాలె, పిల్ల చదువులో మంచిగున్నది. పై చదువులు చదివిస్తుంటేనే మంచి సంబంధం వస్తది… ఏమంటవ్’’ కమల ఎప్పుడు భర్తతో చెప్పే మాటలు. దీపావళి పండుగకు పటాకులు కాల్చినంత సంబరంగ చెప్పే మాటలు. బాధ్యత అనేది బరువుగాకుంటే బావుంటుంది. కష్టంలోనూ ఇష్టం చూసుకుంటే బావుంటుంది.
* * *
‘ఆయాసం ఒస్తుంది, ఒక్కటే గుండెల్ల నొప్పొస్తున్నది’’ అని అంటూనే పడిపోయిన కమలమణి హాస్పటల్ ఐసీయూలో నిస్తేజంగా ఉన్నది. వెయ్యి తుఫాన్లు ఒక్కసారే కూల్చినట్లు, అగాధంలోకి విసిరేసినట్టు అంతా చీకటిమయం అంతా దుఃఖమయం. ముసలి తల్లిదండ్రులు కంటి మంటికి ధారగా రోధిస్తూనే ఉన్నరు. ముగ్గురు పిల్లలు అచేతనులయిపోయినారు. వారి దుఃఖం ఎవ్వరు తీర్చలేనివి అయ్యింది.
సుధాకర్‌కు బ్రతుకంతా అంధకారబంధురమైపోయింది. కాంతి ఎగిరిపోయింది.
‘‘ఇంకో ఏడాదిలో రిటైర్ అయిపోతాను. కమల చెప్పిన లిస్ట్లేమో చాలా ఉన్నాయి రా తమ్మీ’’ అని మొన్ననే నాతో అన్నవ్ గదా అన్నా ఇంతలోనే ఒదినమ్మ ఇట్లా అయిపోయిందేందే’’ అని సుధాకర్ తమ్ముడు కన్నీళ్ళు కారుస్తున్నడు. బంధువులంత ఒక్కొక్కరు సుధాకర్‌ను పలకరిస్తూం ఉన్నరు. ఆడబిడ్డలిద్దరూ ఆగకుండా ఏడుస్తూనే ఉన్నారు.
* * *
‘‘ఏయ్ ఇగో! నిన్నే!’’
‘‘ఏంది, ఎహే! ఎవరన్న జూస్తరు.’’
‘‘ఏం కాదు! మనం మొగుడుపెళ్లాలం. ఎవ్వరేమనుకోరుగాని, నీకు ఓ మాట చెప్పాలి ఇక్కడ కూర్చో’’.
‘‘ఊఁ…’’
‘‘మా ఇంట్లో ఇంతమంది ఉన్నరు. అందరు నిన్ను పిలిచే పేరులోని నేను నిన్ను పిలువను. నీకో పేరు పెట్టుకుంటా.’’
‘‘అబ్బో! ఎందుకో?’’
‘‘నా జీవితంలో నువ్వు ఓ కొత్త వెలుగువువు కావాలె. దారి దీపంగావాలె.’’
‘‘అంటే?’’… ముసి ముసి నవ్వులతో కమల ఓరగ చూసింది.
‘‘కాంతం’’ అని పిలుస్తాను. కాంతి అంటే వెలుగు, దీపం ఇచ్చే వెలుగు’’ అంటున్న సుధాకర్‌ను ఆశ్చర్యంగా చూస్తూ ‘‘అబ్బో! నాకు నవ్వొస్తుంది. ఎవ్వరు లేనప్పుడు అట్ల పిలువుగాని, అందరి ముందట అట్ల ‘కాంతం’ అని పిలువకు సరేనా’’ అన్న కమల మాటలకు సరే నన్న ఈ ముప్ఫై ఏళ్ళ జీవితంలో ఎవ్వరికీ తెలియని పేరు ‘కాంతం’ ఇప్పుడు దూరమైపోయింది. ఒంటరిగా ఈ సంసారాన్ని ఎట్లా నడపాలి? నేనెట్ల బ్రతకాలి?
సంసారాన్ని ఎట్లా నడపాలి? నేనెట్ల బ్రతకాలి!
కాంతం కావాలి. నాకు కాంతమే కావాలి. కష్టాల్లో కష్టంగా, ఇష్టాల్లో ఇష్టంగా ఇన్నాళ్ళు ‘తను’ మొత్తం ‘నాది’గా అయ్యి ఇంటిని దిద్దుకొచ్చిన నా కాంతం కావాలి. ఉన్నప్పుడు తెలువదు విలువ, లేనప్పుడే తెలుస్తది. వారం రోజులు హాస్పటల్లో ఉంటే తను బాగయి ఒస్తుందనే నమ్మకంతో కష్టంగా గడిపినం. అమాయకంగా చూస్తున్న పిల్లలు. వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ బాధ్యతలు అయ్యో! ఎంత పనయ్యింది. ఆ గుండెనొప్పి ఏదో నా కన్న రాకపాయె… సుధాకర్ హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు. ఏడుస్తూనే ఉన్నాడు. దుఃఖ సంద్రం ప్రక్కన నిగ్రహం లేకుండా ఏడుస్తూనే ఉన్నాడు.
మార్చ్ మయూఖ పత్రిక సంపాదకీయం
- డాక్టర్ కొండపల్లి నీహారిణి, మయూఖ ఎడిటర్
మనిషి యాంత్రిక జీవితంలో కొత్తగా ఆర్టిఫిషల్ సంతోషాలు అలుముకున్న నేపథ్యం సంతృప్తి పరుస్తున్నాయా? మరోపక్క ఉమ్మడి కుటుంబాలు ఎంతవరకు మనుగడ కొనసాగుతున్నాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా! ప్రతి జీవితం ఆశల సౌధమే…అయితే అర్భాటాలకు పెద్ద పీటలు ఎవరు వేస్తున్నారు! ఇది ఆలోచించాల్సిన విషయం. అన్నీ కలిసిన ” మిక్సర్ ప్యాకెట్ ” జీవితం అయినప్పటికీ , ఉండాల్సిన రుచి అనే ఆత్మీయతను కోల్పోయిన బంధాలు అనుబంధాలలో పొందుతున్న అనుభూతులెంత? వీటిలోతాత్కాలిక ఆనందానికి ఆ బాటలు ఎవరికి వారు వేసుకున్నవే అనటంలో ఎటువంటి సందేహం లేదు.
కలసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు.
అమ్మ, నాన్న, భార్య భర్త, కొడుకులు, కూతుర్లు, పిల్లలు , వాళ్ళ కు కలిగే సంతానం తో వచ్చే సంబంధాల పిలులుపు, అత్త మామ , చిన్నమ్మ పెద్దమ్మ అమ్మమ్మ చిన్నాన్న, పెద్ద నాన, తాత వంటి మాటలు ఒక ధైర్యాన్ని , ఒక అనుబంధాన్నీ తెప్పించే మాటలు . వీటి విలువను తర్వాత తరాలకు అందించటానికి పునాదులు ఇప్పుడే వేస్తేనే భవిష్యత్తు ఉంటుంది.
కుటుంబ వ్యవస్థను ప్రతిబింబించే సంకేతాన్ని తెలియజేయడానికి, ప్రేమానుబంధాల కుటుంబాలను నిర్మించడం. యాంత్రిక జీవితంలో అంటే ప్రస్తుతం కుటుంబాలలో ప్రేమ, ఆత్మీయతలు కరువైపోయిన కారణంగా… అనేక కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే అతి చిన్న విషయాలైన ఒక వ్యక్తి ఒకరికి చరవాణిలో పంపిన మెసేజ్ ని చూడకపోతే , లేదంటే చూడటం సమయం ఎక్కువైపోయినా, ఆలస్యమైనా ఒక అభిప్రాయానికి వెంటనే సదరు వ్యక్తిపై సాధారణంగా ఏర్పరచుకుంటున్నారు. చిన్న చిన్న అపార్థాలతో కుటుంబాలు చీలిపోతున్నాయి. సాంకేతిక సౌకర్యాల వల్ల ప్రపంచం అభివృద్ది చెందుతున్న క్రమంలో ఈ మార్పు కుటుంబాలపై ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ మార్పును వారు ఎలా స్వీకరిస్తారనేది వారిపైనే ఆధారపడి ఉంటుంది.రోజూ వచ్చే సమస్యలు, అవి తీర్చుకునే అవసరాల వల్ల వాటి మీద వారికున్న అవగాహన పెంచుకోవడం వలన, కుటుంబాలపై అవగాహన మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుత కాలంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న విషయాన్ని గుర్తించి, ఆవశ్యకతను తెలియజేయడం కోసం అందరం కృషి చేయాల్సిన కర్తవ్యం ఉంది. కష్టాలు వచ్చినప్పుడు, సుఖ సంతోషాలు కలిగినప్పుడు కచ్చితంగా కుటుంబంతోనే చెర్చించుకుంటాం. అదే కుటుంబమే లేని రోజు మన బాధలు, మన సంతోషాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అన్నీ ఉన్నా, ఏమీ లేని వారిగా మిగిలిపోవాలి. అంటే ఏకాకి జీవితాన్ని ఏర్పరుచుకొనే పరిస్థితులు రాకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయాలి. అన్ని జీవులలో మనిషి యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ కుటుంబం అంటే సంతోషం, బాధ, దుఃఖం, ప్రేమ, అనుబంధాలు, ఆత్మీయతలు ఇలా ఎన్నో ప్రేమానురాగాలు అన్ని కలిసి ఒకే చోట ఉండేదే కుటుంబం. అన్నీ కలిస్తేనే జీవితమని కొత్త తరానికి అర్థం చేయించాలి.
ఇప్పుడు ఒక్కో ఇంట్లోనూ ఎంతమంది కలిసి ఉంటున్నారు? పోనీ.. మనం ఉంటున్న ఊరిలో ఎక్కడన్నా కుటుంబం అని చెప్పుకుంటున్న ఇంట్లో అయినా మొత్తం ఎంతమంది కలసి నివాసం ఉంటున్నారు? మహా అయితే, నలుగురు ఐదుగురు ఉంటున్నారేమో! ఓ పది పన్నెండు మంది కుటుంబసభ్యులు ఎక్కడన్నా ఒక చోట కలిసి ఉన్నట్టు చెప్పగల వాళ్ళ ను మనం కూడా చూసే ఉంటాం. అంతకు మించి కలిసి జీవిస్తున్నవారిని చూసిన గుర్తు మీకుందా? అంటే ఈ ప్రశ్నకు లేదు అనే సమాధానమే చెప్తాం. ఒకసారి మనం గమనిస్తే ఈ ప్రశ్నను చాలా ఆలోచించాల్సి వస్తుంది. ఒక ఆశ్చర్యకరమైన విషయం వింటే ఒకే ఇంటిలో 38 మంది కలిసి నివసిస్తున్నారు అంటే ఎవరైనా నమ్ముతారా? అదీ కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న పరిస్థితుల్లో కూడా…అవును అటువంటి కుటుంబం ఒకటి ఉంది. ఎక్కడంటే.. ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ దగ్గరలో. ఒక కుటుంబంలోని పురుషులు బయట వ్యాపారాలు..ఉద్యోగాలు చేస్తారు. స్త్రీలంతా ఇంటి బాధ్యతలు చూసుకుంటారు. ఇది నిజంగా ఒక ఆశ్చర్యంగా ఉన్న విషయమని చెప్పవచ్చు.
కలసి ఉంటె కలదు సుఖం అని ఈరోజుల్లో కూడా ఒకే ఇంటిలో కలిసి జీవిస్తున్న ఆ పెద్ద కుటుంబం గురించి కొన్ని విశేషాలు పొందే పదే గుర్తుకు చేసుకోవాలి. సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలకు ఇవే నిదర్శనం. కుటుంబాలకు సంబంధించిన సమస్యలపై చర్చ చేయడం, బయటపడే మార్గం చూపడం చేయాలి. వీటిపై అవగాహన పెంచడం , కుటుంబాలను ప్రభావితం చేసేందుకు చాలా కోణాలలో పనిచేయడం మనందరి బాధ్యత.
” కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం – దేశాన్ని కాపాడుకుందాం”
