అవును
నాది మట్టి బుర్రే
ఇదిగో మది నిండా హరిత స్వప్నాలే!
ఏడాదికో ఆకు
నేల రాలుతున్నా
చిగురు వేయటం మానలే!
గాయ పరిచిన వాడు
వచ్చి పంచన చేరినా
వింజామరం ఊపటం ఆపలే!
ఏడాది పొడుగునా
ఎన్ని ఆటుపోట్లొచ్చినా
ధైర్యం ఏ మాత్రం సడలలే!
రాయి విసిరిన వానికీ
ఫలమే ఇచ్చాను గాని
ఎన్నడూ పగబట్టలే!
అవసరానికి దేశ భక్తిని
ఎన్నడూ నినాదం చేయలే
ఈ దేశం నాకేమిచ్చిందనీ అడగలే!
ఎక్కడ నిలబడ్డా
ఊక దంపుడు మాటలు విసరలే
ఏ కాలుష్యం దరి చేరనీయలే!
అవును
నాది మట్టి బుర్రే
ప్రతి అడుగు వెలుతురు కలనే!!
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి