లేజిగురు పులకలెత్తెను
రాజతగిరి శివయు – శివల
రమ్యనటన ది
వ్యాజానందప్రకటన
నీ జగతికి తెలుప వచ్చెనే
‘మధు’ విలకున్! 1
రంజిల్లె కవుల గుండెలు
కెంజిగురాకు లగుచు
రసగీతిక లల్లన్
సంజయె శాశ్వతమేమో!
మంజరులకు నిలయమయ్యె
మహి నెల్లెడలన్! 2
రాగాంకితమైన మదికి
త్యాగమ్మే తప్ప వేరు
ధర్మము కలదే?
పూగుత్తులు రసికజనుల
రాగార్తిని దీర్ప రసప
రాయణలయ్యెన్! 3
పూవులకును భ్రమరాలకు
నేవో దివ్యానుభూతు!
లెవ రెరుగరొకో!!
తావియు – షట్పదరాగము
భావికి ఫలరూప మీయ
వర్ధిలె నేమో!? 4
క్షణములొ? ఘడియలొ? జీవిత!,
మణువంతైనను ముఖాన
నరయము పూలం
దణకువయెతప్ప శోకము!,
వణకెడు నరు జుచి “వలదు!
వల!!” దను నవిగో!! 5
మృదుహాసము, తేనె వలపు,
చిదిమిన పాల్గారు ముగ్ధ
శృంగారమ్మన్,
వదలని దానవిభూతియు
పదిలము లని జీవితాన
పలుకు విరు లవే!! 6
“ఇచ్చినది తనకు – దాచిన
మ్రుచ్చులకే!” యన్న మాట
మోమాటము లే
కచ్చపు ప్రియభాషణముల
నిచ్చలు తెల్పుటకె ధాత
నిన్ననిపెనొకో!? 7
తేనియవలె తీయనయిన
వాణి తెలుగటంచు జగతి
బహువిధములుగా
జ్ఞాన”మయూఖ”ల జిమ్ముచు
మౌనముతో తెలుపు పూలు
మధుమాసమునన్! 8
తెలగాణ తేటదనమును
సులలితవదనా! “మయూఖ”
సురుచు లెగయగా
గలగల నవ్వుచు, పిలుచుచు
నిల జనులకు నడత నేర్ప
నెంతువె గురువై! 9
అందముల జిందు మాసమ!
విందొనరించెదవు శివుని
ప్రేమకు రూపై –
కందొవకె కాదు…. మదికిని!;
సందేహమె? జనుల కీవె
సద్గురు వనగా!? 10
మధుమాసం (పద్యకవిత)
previous post