Home వ్యాసాలు మధురా విజయము

మధురా విజయము

గంగాదేవి ప్రతిభా వైచిత్రి

తెలుగువారి సాహితీ సంపద చాలా గొప్పది. పురాణాలు, ఇతిహాసాలు, శతకాలు వంటిఎన్నో ప్రక్రియలతో నిండి ఉంటుంది.
తెలంగాణా చరిత్రలో కాకతీయుల పరిపాలనాకాలం ఎంతో వైభవంగా సాగి పేరు పొందింది.
ఓరుగల్లును రాజధానిగా చేసుకొని ఈ ప్రాంతాన్ని దాదాపు 200 సంవత్సరాలు పాలించి చరిత్రకే తలమానికంగా నిలిచారు కాకతీయులు.

స్త్రీలకు విద్య నిషేధం అన్నప్పుడు కూడా స్త్రీలు చక్కని సాహిత్యాన్ని సృష్టించారని పరబ్రహ్మ శాస్త్రి గారు ‘కాకతీయచరిత్ర‘ లో చెప్పారు. కాకతీయ వంశస్థులలో ఎందరో మహిళా రచయిత్రులున్నారని వారిలో కామసాని రాసిన చంపకమాల ఉత్పలమాల పద్యాలు గొప్పగా ఉన్నాయనీ, మిర్యాల వంశాల విశేషాలు రాసిందని చెప్పారు.
ఈవంశానికి చెందిన మహిళనే కుప్పాంబిక తొలి తెలుగు కవయిత్రని ఒద్దిరాజు రాఘవ రంగారావు గారు ఒక చారిత్రక వ్యాసంలో రాశారు.
అలాగే కాకతీయ వంశంలో ఎందరో ఎన్నోరంగాలలో నేర్పరులైన మహిళలు ఉన్నారు. వారే కామసాని, ఎరుకసాని, అయితసాని మొదలైన వారు.
సాని అంటే సంగీతంలో నిష్ణాతురాలని అర్థం.
స నుండి ని వరకు సంపూర్ణ సంగీత పాండిత్యాన్ని సాధించిన గంధర్వాంగన వంటి ప్రతిభ కలవారికి ‘సాని ‘అని బిరుదు ఇచ్చేవారు. ఆనాటి మహిళలు ఎంతో కష్టపడి ‘సాని ‘బిరుదును సాధించి దాన్ని గొప్పగా గౌరవంగా భావించేవారు. ఈ ‘సాని ‘బిరుదు కల వారంతా సమాజ నిర్మాణంలో వారు ఎంతో తోడ్పాటు అందించారు. వారంతా మేధావినులు కాబట్టే ఎన్నో రచనలు చేశారు. అభినందించే విషయం ఏమిటంటే అంతఃపురంలో నివసించే రాణీ వాసపు స్త్రీలు బయట ప్రపంచంలో కాలు పెట్టకుండా రచనలు చేయడం కష్టమే.. ఎలా చేయగలిగారో! ఎంతటి ఊహా శాలిత్యమో కదా! ఎందుకంటే స్త్రీలు ప్రబంధాలో, రుక్కులో, రాసిన వారు ఉన్నారు…. వారిగురించి విన్నాము.. కానీ చరిత్ర రాయడం కష్టతరమే కావ్యాలైతే ఊహించి కల్పనలు చేసి,రాయవచ్చు. కానీ చరిత్ర ను ఆధారాలతో రాయాల్సి ఉంటుంది. అటువంటి నైపుణ్యం ఉన్న గంగాదేవి అసమాన్యురాలు. ఈ రచయిత్రి వల్ల కాకతీయుల పాలన రాజ్య విస్తీర్ణం వలననే మహిళల ఖ్యాతి విస్తరణ జరిగింది. లేకపోతే ఇవాళ గంగాదేవి గురించి మాట్లాడుకోలేకపోదుము.
పురుషులే కాకుండా స్త్రీలు కూడా గొప్ప కవులు అవుతారు!కావచ్చు ! ప్రతిభ ఆధారంగా వారి వారి ప్రజ్ఞ పాటవాలను విచారించాలి కానీ లింగ వివక్షత చూపకూడదు కదా!
‘మధురా విజయం ‘లేక ‘విక్రమ పరాజయ చరితం ‘ అనే కావ్యాన్ని మహిళా కవయిత్రి శ్రీమతి గంగాదేవి గారు రచించినట్లు మధుర విజయంలోని మొదటి, రెండవ సర్గలో తెలిపారు. ఈ కావ్యంలో 39– 42 సర్గలలో ఈ విషయం స్పష్టంగా రాయబడింది.

తతోయధావత్ కృతిచేల సంస్క్రియో
నరేంద్ర సూను స్వత ఏవ లబ్దివాన్
కలాసు శశ్వత్ సకలాసు కౌశలం
గురూపదేశస్త్యపదేశ తామగాత్ ॥

భావం:–అనంతరం (తన సోదరులతో దినదినాభివృద్ధి చెందిన) రాజకుమారుడు కంపరాజు యధావిధిగా చూడాకర్మ, ఉపనయనాది సంస్కారములు ముగించుకొని సకల కళల యందు నైపుణ్యం సంపాదించుకొని,గురువు దగ్గరకు శిక్షణను పొందుటకు వెళ్ళెను.

సతీర్థ లబ్ధాయుధ శస్త్ర సంపదా
గుణాభిరామో గురుణైవ శిక్షితః ౹
శరాసనాసి ప్రముఖేషు శాత ధీ
ర గచ్ఛదస్త్రేష్వభిరేషు పాటవమ్ ॥

భావం:- శౌర్య ఔదార్యాది గుణములతో ఆహ్లాదమైన సూక్ష్మ బుద్ధి గల ఆ రాజకుమారుడు (కంపరాజు) గురువు నుండి ఆయుధాలను మంచి శాస్త్రాల జ్ఞానాన్ని పొంది గురువు ద్వారా శిక్షణ పొంది శర( బాణము) ఖడ్గము (పొడవైన కత్తి) మొదలైన అస్త్రముల ఉపయోగ సామర్థ్యం పొందెను.

సత్య వాగ్ భూరిబలో ధనుర్ధర
స్తురంగ మారోహణ కర్మ మర్మవిత్ ౹
కృపాణ విద్యా నిపుణః పృథాభువా
మదర్శి సంఘాత యివైకతాం గతః ॥

భావం:- ఆ రాజకుమారుడు (కంపరాజు) సత్యభాషణలో ధర్మరాజు వలె బలసంపన్నతలో భీముడి వలె, ధనుర్దారులలో అర్జునుడి వలె, అశ్వ (గుర్రం ) విద్యలో నకులుడి వలె, కత్తి సాములో సహదేవుడి వలె.. పాండవులందరిని ఒక చోటు చేర్చినట్టు ఆ రాజకుమారుడు కనిపించ సాగాడు.

ఇంత గొప్పగా వర్ణన చేస్తూ కావ్య రచన సాగింది. ఈ కావ్యానికి ఇతివృత్తం ఇతిహాసాల నుండి కాకుండా భర్త యొక్క పరిపాలన విధానం, దండయాత్రలో గెలుపు అనే అంశాలను తీసుకొని శాస్త్రీయంగా మధురా విజయం అనే కావ్యాన్ని గంగాదేవి రచించింది. ఐతే తాళపత్రాలమీద రాయడం వల్లకొన్ని తాటాకు కమ్మలు ఎక్కడో పోయాయట! కొన్నిచోట్ల పురుగులు తినడం వల్ల ఆయా పదాలు కనపడడంలేదు. అలాగే గంగాదేవి కన్నుక్కొన్న పదాలకర్ధాలు కాలక్రమంలో మారడంతో తాళపత్రాలను పరిష్కరించిన భాషావేత్తలు అక్కడ చుక్క గుర్తు పెట్టి , సమానార్థ పదాలను చేర్చారు.

ఒక మహిళ చరిత్ర తాను రాసిన కావ్యం వైధర్భీ శైలిలో రాసి, సంస్కృత భాషలో తనకనుగుణంగా కొన్ని పదాలు వ్యాకరణానికి తగినట్టుగా సృష్టించి, దోషాలు లేకుండా, శాస్త్రీయ కావ్య నియమాలతో, సంప్రదాయబద్ధంగా చక్కని వాక్య నిర్మాణం, పద గుంఫనలతో మధురా విజయం లేదా కంపరాయ చరిత్ర అనే పేరుతో తన భర్త కంపరాయని సాహస గాధను రాసింది.
అది కూడా సంప్రదాయంగా!ఇలా…

దాస్తా కాళీదాసస్య కవయః కేన విభ్రాతి
ఇదానీమాపి తస్యార్ధానుపజీవస్య భీయతః ॥

అని కాళిదాసుకు నమస్కరించి,

వాణీపాణీ పరామృష్టవీణా నిక్కంపహారిణీం
భావయంతి బ్రహ్మశ్రీ వాన్యే భట్ట బాణస్య భారతీమ్

ఇలా భారవి, ఆచార్య దండి,భవభూతి,కర్ణామృత కవీశ్వరులను , తిక్కన్నను,తన గురువైన అగస్త్యుడిని, నాటక రచయిత గంగాధర మహాకవిని, విద్యానాధులను మొదలైన కవులనెందరినో స్మరిస్తూ… నమస్కరిస్తూ మధురావిజయ కావ్య రచన ప్రారంభించింది రచయిత్రి గంగాదేవి.
క్రీ.శ.16 శతాబ్దం ప్రాంభంలో విజయనగర మహారాజు అచ్చుతదేవరాయల ఆస్థానంలో మహిళా గ్రంథ కర్తలుండే వారని చరిత్ర స్పష్టం చేసింది.
విజయనగరవైభవాన్ని గొప్పగా వర్ణిస్తూ రాసిన చారిత్రక విశేషాలతో రాసింది. కంపరాయ చరిత్ర రాయడానికి గంగాదేవికి (రచయిత్రికి) పెద్దకారణమే ఉన్నది.. అది ఏమిటి అంటే?యువరాజుగా ఉన్న కంపరాయుడు గొప్ప వీరుడు… తన భర్త పరాక్రమాన్ని గ్రంథస్తం చేయాలని రాసిన కావ్యమిది. ఈయన బుక్కరాయల కుమారుడు కనుక అతనిని పరిచయంచేసి, తరువాత కంపరాయల విజయయాత్రను రాయాలనుకుని, విజయనగర రాజైన హరిహర రాయలు సోదరుడు బుక్కరాయలుతో కథను ప్రారంభించింది రచయిత్రి. ఈయనకు ఎంతోమంది భార్యలున్నా దేవయాని అంటే చాలా ప్రేమ ఉండేదట. ఈ దేవయానికి కంపన, చినకంపన,సంగమ అనే కుమారులు పుట్టారని, కంపన గర్భంలో ఉండగా తామ్రపర్ణీ నదిలో స్నానం చేయాలనే కోరిక కలిగిందట దేవయానికి…తన ఇష్టమైన భార్యకోరిక కోరడం రాజు తీర్చకుండా ఉంటాడా? అలా నదిలో స్నానం చేయడం వల్ల కొడుకు అందంగా పుట్టాడని ఆమె నమ్మకం.
ఈ బుక్కరాయలుకు ఎందరో సామంత రాజులు ఉండేవారని వారంతా ఎంతో విధేయులై ఉన్నారని రాస్తూనే… విజయనగర నగరవర్ణన ఎంతో గొప్పగా చేసింది. అందమైన భవనాలు, సుందరమైన ఉద్యానవనాలు ఉండేవనీ, తుంగభద్రానది నుండి నీళ్లు కాలవల ద్వారా తెప్పించి కృత్రిమ స్నాన కొలనులు ఏర్పాటు చేసుకున్నారనీ, తుంగభద్రా నది కోటకు ఒక కందకం వలే రక్షణ కల్పించిందనీ, అటు దక్షిణం వైపు మలయ పర్వతాలు, ఉత్తరంలో వింధ్య పర్వతాలు ఉండేవనీ, తూర్పున ఉదయాచలం, పడమటివైపున ఆశాచలం పర్వతాలు సరిహద్దుగా ఉండి, మంచి శిక్షణతో ఉన్న సైన్యాలతో రక్షణకు లోటు లేకుండా ఉండేదనీ, నగర శివారులలో విరూపాక్ష దేవాలయం ఉండి ఆధ్యాత్మికతతో సంపన్నమై, బుక్కరాయల పరిపాలన రామ రాజ్యం వలె సాగిందని, రాజులకుండాల్సిన చతుర్విధ పురుషోర్ధాలు పుష్కలంగా ఉన్నాయని, విజయనగర వైభవంతో పాటు, కుమారుడు కంపన పుట్టుక,గంగా దేవితోవివాహం, అతని జీవితం, దండయాత్రలో శంభువరాయల నుండి తుండీర మండలాన్ని ఎలాగెలిచి, చేజిక్కించుకున్నారో, ఆ కథను, సుల్తాన్ తో కంపన చేసిన యుద్ధరీతి చదివేవారికి కూడా పౌరుషం ఉప్పొంగేలా రచించింది. అంతేకాకుండా దండయాత్ర సాగిస్తున్నప్పుడు తోవలో ఆయన శృంగార సన్నివేశాలను, కంపన వీరత్వం, అతని అందం, సాహసం, యుద్ధ వివరాలను మొదటి రెండు సర్గలలో… కొన్నిచోట్ల రాఘవేంద్ర విజయం రచయిత నారాయణ కవివర్ణన వలె, కొన్నిచోట్ల కామసాని రచనా శైలివలె రాసింది.
” ఒక స్త్రీ గర్భధారణ ” గురించి రాసిన ద్విపదలలో తను కనుగొన్న కొత్త పదాలనే ఉపయోగించింది. అవి కూడా సహజంగా ఉండేలా పాఠకులు చదువుతున్నట్టుగా కాకుండా ఆ సంఘటనలు వారి కళ్ళ ఎదుట దృశ్యాల వలె కదలాడుతుంటాయి.
ఈ కావ్యంలో ఆనాటి సైనికుల సాహసాలు, యుద్ధ నైపుణ్యాలు, విజయనగర విస్తరణ కోసం చేసిన దండయాత్ర కొనసాగుతున్నప్పుడు ఉదయాస్తమానాల వర్ణనలనూ, ఋతువుల వర్ణనలనూ తన ప్రతిభతో చక్కగా రచించి, కావ్యాన్ని భర్త పుట్టినరోజున బహుమతిగా ఇచ్చింది గంగాదేవి.

ముస్లిం సైన్యాలను హతమార్చిన కంపన పేరు చెబితే చాలు ఎదుటి శత్రు సేనలు కంపించిపోయేవారట అలా పేరుకు తగిన వీరత్వం, అతని అందం అన్నీ వర్ణించింది. కంపన రకరకాల ఆయుధాలు, ఉపయోగించి యుద్ధం చేసిన సాహసం గురించి రాసింది.

ఇందులో రాసిన ఓ గొప్ప విశేషం …. సుల్తాన్ తో యుద్ధం చేస్తుండగా తల తెగిపోయినా ఒక సామంతుడు గుఱ్ఱం యొక్క పగ్గం పట్టుకున్న అతని చేతి పట్టుతప్పలేదనీ, కుడిచేయి కంపనునితో యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నదని రాయడం ఔరా! అనిపించింది.

గంగాదేవి రచనా చమత్కారం బాగుంటూనే… మనసును ఒక్కోచోట కలుక్కుమనిపిస్తుంది….

తురుష్కుల దౌర్జన్యానికి శ్రీరంగ పట్టణం నాశనమైందనీ, చక్కని పచ్చని కొబ్బరి తోటలను నాశనం చేసారనీ, కోవెలలో ఆరాధనలు చేయకుండా బ్రాహ్మణులను బంధించారనీ, కోవెలలో వేద మంత్రాలకు బదులు గుడ్లగూబల కేకలు వినలేకపోయేవారమనీ, చిలుక పలుకులకు బదులు పారశీక పలుకులు చెవిలో ముల్లులవలె గుచ్చాయనీ, రాజుతో చెప్పి దండయాత్ర కు ఉసిగొల్పిందట! మహ్మదీయుల పరాజయం వరకూ రచన కొనసాగింది.
దిగ్విజయంగా విజయ యాత్ర ముగించుకొని వచ్చిన తర్వాత విషయాలెన్నో రచించింది గంగాదేవి. శ్రీరంగంలోని విమాన గోపురం శిధిలమై పోవడం, రంగనాథుని కోవెల మండపాలు చెట్లు మొలిచి ఉండడం, దేవాలయ ప్రధాన ద్వారం తలుపులు చెదపురుగులు తిని పాడుచేయడం వంటివన్నీ ఈ వర్ణన లలో ఉన్నాయి. ఇతర సన్నిధులలోని ఆలయాల గర్భగుడులన్నీ శిధిలమైనాయి… వాటి నుండి సంగీత మృదంగ ధ్వనులు ఎంతో మధురంగా వినిపించేవి. అంత గొప్ప దేవాలయంలో నక్కల అరుపులు వినిపిస్తుంటే కంపన సహించలేకపోయాడు.

కావేరీ నది ఉప్పొంగి, ఎన్నో నష్టాలు జరిగాయి. అగ్రహారాలలో తురుష్కులు మద్యమాంసాలను తిని- తాగుతూ యజ్ఞాలు చేయనివ్వకుండా యజ్ఞ కుండాలు చల్లారిపోయి, హోమపు సువాసనలు రావడంలేదు. మాంసం కాల్చిన వాసనలు రావడం , దుర్వాసన రావడం, వేదగానాలు మోగి వీనులవిందైన దేవాలయం శోకాలతో నిండిపోయింది.

ఇనుప శూలాలతో యువకుల తలలను గుచ్చేవారు. తామ్రపర్ణి నదిలో యువతులు స్నానం చేస్తుంటే వారి రొమ్ములను కోయగా వారి నెత్తురుతో తామ్రపర్ణీ నది నీళ్లన్నీ రక్తసిక్తమైపోయి ఎర్ర రంగుతో పారాయట. ఆవులను చంపి ఆ నదిలో వేసారట.ఈ విషయం కంపనకు చెప్పి, దక్షిణ దిక్కు గెలిచేలా ఉపాయం చెప్పింది. తనను పంపించిన విషయం గుర్తుకు వచ్చి, ఆమె వైపు సానుకూలంగా చూసి అవన్నీ బాగు చేయించాడు… గంగాదేవి నడికట్టుకు ఒక తళతళ లాడే ఖడ్గంఉంది. దాన్ని తీసి చక్రవర్తీ! పూర్వ కాలంలో విశ్వకర్మ దేవతల ఆయుధాల నుండి కొసలను సేకరించి వాటిని కరిగించి, ఈ ఖడ్గం తయారు చేసి, రాక్షసులపైన గెలవడానికి పరమేశ్వరుడికి ఇచ్చాడు. ఆ ఖడ్గం కోసం తపస్సుచేసి, పాండవ మధ్యముడు వరంగా పొందాడు . దాంతో యుద్ధంచేసి, ధర్మ రక్షణ చేసాడు. అలాగే మీరు కూడా ముష్కర మూకలను తరిమి వేయండి అని అతనికిచ్చింది.

మెట్టినింటి- పుట్టినింటి దేశభక్తి కల గంగాదేవి వంటి భార్య ప్రోత్సాహం వల్లనే విజయం సాధించగలిగానని, ఆమెను మనస్పూర్తిగా అభినందించాడట.
ఇలా దేశ పౌరురాలిగానూ , భార్యగానూ, రచయిత్రిగాను ఎందరి మెప్పులో పొందిన గంగాదేవి మహిళలకెంతో ప్రేరణ! మార్గదర్శి! స్పూర్తి!

[ ఈ రచయిత్రి గురించి రాజశేఖరుడనే కవి గొప్ప నాటక కర్త చెప్పాడు ]

సేకరణ:- మల్యాల దయామతీదేవి* ఈయన గుఱ్ఱం చాలా పేరుపొందిన గుఱ్ఱం! ఎలా అంటే ఆ గుఱ్ఱమెక్కి బయలుదేరితే చోళ, కేరళ, పాండ్య రాజులు ఆ గుఱ్ఱానికి దారి ఇస్తూ… చేత ఖడ్గాలు పట్టుకొని ముందు నడిచే వారట! అంతటి వీరుడు కంపన. అతను గుఱ్ఱం మీద వీధుల్లో వెడుతుంటే అతనే గెలవాలని ముత్తైదువలు, కన్యలు బంగాళాల మీద నుండి ఆశీర్వదిస్తూ పూలు చల్లేవారట! అలా ప్రయాణించి ఐదారు రోజులకు కర్ణాటకను దాటి కంటకానన అనే ప్రదేశం చేరాడు. ఆ రాజును వశపరచుకోవడానికి ఎప్పటినుండో అతను ఎదురుచూస్తూ కొంతకాలం అక్కడే ఉన్నాడు. ఎవరూ తనపై దండెత్తిరాకుండా.. విరించిపురంలో తన మకాం ఏర్పాటు చేసుకున్నాడు. సైన్యాన్ని కాపలా పెట్టుకున్నాడు.
కంపన ద్రవిడరాజుతో యుద్ధం చేసి అతన్ని భయపెట్టాడు. అతను భయపడి పారిపోయాడు.
అయితే ఈ కావ్యంలో అతిశయోక్తులున్నాయని ఆంగ్ల కవి [ Long for affair] రచయిత విజయనగరం నుండి 150 మైళ్ళ దూరం 5 రోజూలలో ఎలా చేరగలరు? ఇది అతిశయోక్తి వలె ఉన్నదని విమర్శించడంతో ఈ కావ్య స్థాయి తగ్గిందని భాషావేత్తలు అభిప్రాయ పడ్డారు… ఎలా అంటే 21 పేజీలో 47 శ్లోకంలో కంపన పెద్దసైన్యంతో ఉత్తర ఆర్కాటు జిల్లా నుండి కంటకానన చేరుకున్నడని ఉంది … ఐతే ఆకాలంలో ఎంతటి కారడవియైనా , బాటలు సరిగా లేకపోయినా సైన్యం 30 మైళ్ళ వేగంతో నడిచే సత్తాగల సైన్యం కంపన దగ్గిర ఉండేదని చారిత్రక విశ్లేషకులు వ్రాశారు.
ఈ కావ్యం రాసిన గంగాదేవి స్వయంగా కంపన భార్య కనుక ఆమె ప్రత్యక్ష సాక్షిగా అలా రాసి ఉండవచ్చు.
మద్రాసు యూనివర్శిటీ సంస్కృత పండితుల ఆదరణ, కావ్యానికి రచనా పరంగా వారిచ్చిన గౌరవం, ఆమోదం వల్ల వారు డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఈ ‘ మధురా విజయం‘ కావ్యాన్ని నిర్ణయించినందువల్ల పాఠకుల సంఖ్య ఎక్కువై రెండవ ముద్రణ కూడా చేసారు.

మధురావిజయ కావ్యం చదవి, ఒక స్త్రీ రాసిందని కొట్టిపడేయక … సంస్కృత సాహిత్యంలో పురుషులతో పాటు స్త్రీలు సమాన స్థాయిలో రాయగల విదుషీమణులున్నారని అంగీకరించి… ఈ కావ్యం తమ స్వంత గ్రంథాలయంలో దాచుకోతగిన గ్రంథం!
ఒక మహిళగా గర్వ పడుతూ…

ఈ గ్రంథానికి ముందుమాట రాసిన G.హరిహర శాస్త్రిగారి మరియు T.A గోపీనాథ రావు సూపరండెంట్ ఆర్కియాలజీ ( ట్రావెన్కూర్) వారి సౌజన్యంతో…

You may also like

Leave a Comment