మంత్ర నగరి నాటకం రచయిత శ్రీ మాఢభూషి దివాకర బాబు గారు . ప్రముఖ సినీ రచయిత యమలీల, శుభలగ్నం, మావి చిగురు , చూడాలని ఉంది , టాప్ హీరో, నెంబర్ వన్ ,ఆహ్వానం, వినోదం ,సర్దుకుపోదాం రండి ,ఇద్దరు మిత్రులు మొదలైన వంద సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే సంభాషణలు అందించారు. కథలు కవితలు రేడియో నాటకాలు అనేకం రచించారు .నాటక రచయితగా ప్రతి నాటికకు నాటకానికి అనేక పరిషత్తులలో ఉత్తమ రచన తదితర బహుమతులు అందుకున్నారు. యువ వాహిని డి.వి. నరసరాజు స్మారక పురస్కారం , అక్కినేని నాటక కళా సమితి అక్కినేని జీవన సాఫల్య పురస్కారం, బాపు రమణ వారి ముళ్ళపూడి వెంకటరమణ సాహితీ పురస్కారం ,సంస్కృతి సాంస్కృతిక సంస్థ గుంటూరు వారిచే ‘ఆచార్య’ బిరుదులు అందుకున్నారు.

వీరు రచించిన ప్రతి నాటిక నాటకం పలువురి ప్రశంసలను అందుకోవడం షరా మామూలే. అంత పదునైన మంచి వస్తు వైవిధ్యంతో కూడిన నాటిక నాటకాలలో మంత్ర నగరి నాటకం ఒకటి . రసరంజని నెలనెలా నాటకం ప్రేక్షకుడికి వినోదం పేరుతో నటుడికి ఆనందం అదే మా బాట అదే మా మాట అనే సంకల్పంతో నిర్వహించే నాటక ప్రదర్శనలలో భాగంగా 28-1-20 25న రవీంద్ర భారతిలో చైతన్య కళాశాలవంతి ఉక్కునగరం విశాఖపట్నం వారి సమర్పణలో మంత్ర నగరి నాటకం ప్రదర్శన జరిగింది . ఇప్పుడు మానవాళి అంతా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మాయలో పడి తాము మనుషులమన్న సంగతి మరిచిపోయి విం తగా బతుకుతున్నారు. ప్రేమలు పలకరింపులు ఆప్యాయతలు మరిచిపోయారు .మన సౌకర్యాల కోసం కనిపెట్టిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ మనల్ని శాసించే స్థితికి ఎదిగింది! ప్రపంచమంతా ఆక్రమించి భావితరాలను బానిసలుగా చేసే ప్రమాదం ఉంది. అందుకే ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో పాటు హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకోవాలి . రెండూ అవసరమే ఈ రెండు సమపాళ్ళలో ఉంటేనే ప్రపంచం యంత్ర నగరంలా కాకుండా మంత్ర నగరాల ప్రపంచంగా మారుతుందని తెలియజేయడం ఈ నాటకంలో మూలాంశం.

నాటకానికి దర్శకత్వం వహించిన శ్రీ బాలాజీ నాయక్ ముఖ్యపాత్రధారులైన తాత పాత్రను అద్భుతంగా పోషించారు . కథానాయకుడైన నవీన్ గా శ్రీ వై అనిల్ కుమార్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అరాచకం పాత్రతో పేరులోనే అరాచకం పాత్రకు తగిన పేరును పెట్టుకున్న పాత్రధారి శ్రీ పి. రామారావు తన పాత్రకు తగిన న్యాయం చేశారు . మేదో పాత్ర పేరుతో కృత్రిమ మనిషిగా శ్రీ కే ఉమా మహేష్ మంచి నటనను ప్రదర్శించాడు. వివేకం పేరుతో శ్రీ ఎం .వాసు తెలివైన స్నేహితుడిగా మంచి చెడు తెలిసి వివేకంతో ఎలా ఆలోచించాలి ప్రత్యక్షంగా చూపించడంలో సఫలీకృతుడైనాడు . తనఖా పాత్రతో రోబో గా ఉంటూ జర్మనీ భాషలో మాట్లాడుతూ అందర్నీ అలరించారు శ్రీ బి వెంకటరావు నాయక్ . నాటకంలో కథానాయకి ఆశాలత కుమారి రూప శ్రీ పాత్రకు తగిన విధంగా నటనను ప్రదర్శించి ప్రశంసలు పొందారు.


ఈ నాటకానికి సాంకేతిక సహకారం అందించిన వారు సంగీతం శ్రీ లీలామోహన్ ప్రతి సన్నివేశంలో ఆయా సందర్భాలలో వీరు అందించిన సంగీతం నాటకంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . ఆహార్యం అందించిన వారు శ్రీ థామస్ రోబోనూ మేధోపాత్రను మరింత ప్రత్యేకంగా చూపించవచ్చని అనిపించింది . నాటకంలో మంత్రనగరి పేరుతో ఉన్న మాయా లోకాన్ని తన లైటింగ్ తో శ్రీ ఫణీంద్ర ,రంగాలంకరణతో శ్రీ ఎం సత్తిబాబు ,బి శ్రీనివాసులు ఎప్పటికప్పుడు ఆ దృశ్యం మన కళ్ళకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేయడంలో విజయం సాధించారు.
ఈ నాటకం శ్రీ బాలాజీ నాయక్ దర్శకత్వంలో కళల కాణాచి తెనాలి పరిషత్తులు ప్రదర్శించినప్పుడు 2024 నవంబర్లో ఉత్తమ ద్వితీయ పరిషత్ ప్రదర్శన ఉత్తమ క్యారెక్టర్ నటుడు ఉత్తమ విలన్ ఉత్తమ లైటింగ్ ఉత్తమ ఆహార్యం , నవీన్ పాత్రకు జ్యూరీ బహుమతులు లభించాయి. ఈ నాటకం ప్రదర్శన గురించి
కవి ,గుణ నిర్ణీత ,విశ్లేషకులు అయినా శ్రీ ఆకుల మల్లేశ్వర రావు గారు తెలుగు ప్రభలో అద్భుతమైన సమీక్షను రచించారు.
నవీన్ కృత్రిమ మేధపై ఒక ప్రాజెక్టు తయారు చేస్తుంటాడు. తెర తీసేసరికి అక్కడ దృశ్యం అంతా ఆధునికతతో టెక్నాలజీ పెరిగిపోయి జపాన్ నుంచి తెచ్చుకున్న రోబో ఇంట్లో ఉండడం ఇంటికి ఎవరు రావాలన్నా యాక్సెస్ తో రావడం వంటివి ఇంటి పనులను రోబో నిర్వహించడం ఇటువంటి దృశ్యాలను మనం గమనిస్తాం. ఇంటికి వచ్చిన తాత ఆశ్చర్యపోతాడు . మనవడిలోని యాంత్రికత మనసుని కదిలించి వేస్తుంది. ఇంతకీ ఎప్పుడు వెళ్ళిపోతావు అని మనవడు వేసిన ప్రశ్నకు ఆవేదనకు గురవుతాడు తాత. డబ్బే ప్రధానంగా జీవించే అరాచకం తన కూతుర్ని నవీన్ చేసే ప్రాజెక్టు పేటెంట్ కోసం ఉసిగొల్పుతాడు. నవీన్ తన మేధస్సును యంత్రంపై ఆధారపడినప్పటి నుంచి నవీన్ తో ఆ పాత్ర అతని వెన్నంటి ఉండి నడిపించడం ఒక ప్రత్యేక అంశం ! నాటకంలో తాతయ్యకు అనారోగ్యాన్ని పట్టించుకోని స్థితికి చేరిన మనవడికి బదులుగా స్నేహితుడైన వివేకం పరీక్షలు చేయించడం ఎప్పటికప్పుడు నవీన్ అనుసరించే విధానాన్ని హెచ్చరించడం చేస్తుంటాడు . చివరికి తన ప్రాజెక్టుకు మరింత డబ్బులు అవసరమైనప్పుడు జరిగిన పరిణామాలు కృత్రిమ మేధకు పూర్తిగా వశమై తనను తాను మర్చిపోయి మనిషిలా కాకుండా యంత్రంగా ప్రవర్తిస్తాడు నవీన్ . అది చూసి నవీన్ లోని మనిషిని వెలికి తీసే ప్రయత్నం చేస్తారు తాత ,వివేకం ,ఆశాలత . మనిషి ఆధునికత పేరుతో ఎదగడం అవసరం . కొత్త టెక్నాలజీని నేర్చుకోవడం అమలుపరచడం అవసరాలకు తగినంతవరకు ఉపయోగించుకోవడం శుభ పరిణామం. కానీ అది అదునుగా తీసుకొని పూర్తిగా దానికి బానిసగా మారవలసిన అవసరం లేదని మానవత్వం మర్చిపోకూడదు అని తెలియజేసిన నాటకం మంత్రనగరి.

రచనలు సంభాషణలలో కృత్రిమమైన మేధను మానవమేధనూ రెండింటిని ఉదాహరణలతో తాత పాత్రలో బాలాజీ నాయక్ తో చెప్పించిన విధానం నాటకానికి హైలైట్ ! పరిణితి చెందిన రచయితగా అద్భుతమైన డైలాగులతో శ్రీ మాడభూషి దివాకర్ బాబు గారు మనకు నాటకం మొదటి నుంచి చివరి వరకు కనిపిస్తారు.ఈ నాటకం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించి అందరూ ఆలోచించవలసిన కథాంశం . అభివృద్ధి పేరుతో విలువలను పట్టించుకోకపోతే మనిషి మనుగడ ప్రమాదంలో పడుతుందని హెచ్చరిక నాటకంలో మనకు కనిపిస్తుంది . ఆలోచనాత్మక నాటకం అందించిన శ్రీ మాడభూషి దివాకర్ బాబు గారు సర్వదా అభినందనీయులు.