కావ్యాలలో నాటకం రమ్యమైనది.” నాటకాంతం హి సాహిత్యం ” అన్న మహాకవి కాళిదాసు భావనలో అన్ని సాహిత్య ప్రక్రియలోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకం . కవిత్వం, వ్యాసం ,కథ, నవల వీటన్నిటి తర్వాత నాటకం వస్తు రూపంలో భావగంధం కలిగి మనోరంజనం కలిగిస్తూ సామాజిక ప్రయోజనం తో పాటు సందేశాన్ని అందించే అద్భుత దృశ్యరూపకం నాటకం.
సజీవ ప్రదర్శన తో నాటకం అందరినీ ఆకట్టుకుంటుంది. కానీ ఏయే నాటకాలు నాటికలు ప్రదర్శించబడ్డాయో వాటి కథ, నటీనటులు , సాంకేతిక నిపుణులు ,దర్శకుడు వీరందరి గురించిన సమాచారం తిరిగి చూసుకోవాలంటే మనకు కనిపించదు అందుకోసం నా పరిధిలో నేను గమనించిన చూసిన నాటకాలను పరిచయం చేయాలని ఉద్దేశంతో మన తెలుగు నాటకాలు అనే పేరుతో నేను కొన్ని నాటకాలను పరిచయం చేయాలనుకుంటున్నాను. తద్వారా మన తెలుగు నాటకాలు కొన్ని చదివి తెలుసుకునే అవకాశం కొంతమందికైనా కలుగుతుందని ఆశాభావం. అయితే నాటకం చదివి తెలుసుకోమన్నది నా ఉద్దేశం కాదు. నాటకం ఖచ్చితంగా రంగస్థలం మీద ప్రదర్శించినప్పుడు చూడవలసినదే . కాకపోతే ఆ నాటకం గురించిన సమగ్ర సమాచారం తెలుసుకోవడం ద్వారా నాటక రచయిత ,నటీనటుడు ,ప్రదర్శనలు తీసుకున్నటువంటి శ్రద్ధ కళాకారుల నైపుణ్యం వీటన్నిటి గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుందనే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేస్తున్నాను మీ అందరి ఆదరణను కోరుకుంటున్నాను. ఇక పై నేను ధారావాహిక గా అందించే మన తెలుగు నాటకాలను మీరందరూ చదివి తెలుసుకుంటారు కదూ .. ఆయా నాటికలను మీ సమీపంలో ప్రదర్శించబడినప్పుడు తప్పనిసరిగా చూస్తారని ఆశిస్తున్నాను.

వ్యక్తిత్వాన్ని గురించి, తన అస్తిత్వాన్ని గురించి తనను తాను ఆవిష్కరించుకొని పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదుర్కొన్న సంఘర్షణలను అధిగమించి చేసే యుద్ధాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించిన నాటకం మూల్యం . రచన శ్రీ సింహప్రసాద్ దర్శకత్వం డాక్టర్ వెంకట్ గోవాడ . సింహ ప్రసాద్ గారు పరిచయం అవసరం లేని రచయిత. వారి పూర్తి పేరు చలంకూరి వరాహ నరసింహ ప్రసాద్. ఎన్నో కథలు నవలలు నాటికలు సీరియల్స్ రచించిన వీరు అన్నింటిలోనూ ఎక్కువ శాతం బహుమతులు అందుకోవడంలో తనకు తాను ప్రత్యేకతను నిలుపుకున్నారు 2013లో స్త్రీ పర్వం నవలకు స్వాతి అనిల్ అవార్డు అందుకున్నారు . 277 కథలు,
54 నవలలు రచించారు 2017 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళారాత్మ పురస్కారం కథలకు సోమేపల్లి పురస్కారం అందుకున్నారు శ్రీ పర్వం నాటకం పలుమార్లు నాటక రచన పోటీల్లో ప్రథమ బహుమతి అందుకుంది 2022లో ఆకిళ్ల నాటక పోటీలలో గ్రహణం నాటకానికి ప్రథమ బహుమతిని అందుకున్నారు ఇటీవల ఆరు నాటికలు ఆరు ఇతివృత్తాలతో విజయవాడలో హనుమంతరాయ గ్రంథాలయంలో తపస్వి కల్చరల్ ఆర్ట్స్ ఆంధ్ర నాటక కళా సమితి కొడాలి బ్రదర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రదర్శింప చేసిన నాటికలలో మూల్యం ఒకటి.
డా. వెంకట్ గోవాడ తెలుగు నాటక రంగంలో యువ నాటక దర్శకుడు నటుడు నిర్మాత ఇంటర్మీడియట్ బోర్డులో డిప్యూటీ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పదవికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి పూర్తిస్థాయిలో నాటక రంగానికి తమ సేవలను అందిస్తున్నారు. థియేటర్ ఆర్ట్స్ లో పీజీ డిప్లమా చేసిన డాక్టర్ వెంకట్ గోవాడ పలు నాటకాలలో విభిన్న పాత్రలను పోషించి అందర్నీ మెప్పించారు . 2013లో గోవాడ క్రియేషన్స్ ప్రారంభించి పలు నాటకాలలో నటించడమే కాకుండా దర్శకత్వం వహించారు సినిమాలు సీరియల్స్ లో పాత్రలు పోషిస్తున్నారు. మూల్యం నాటికలో నటన తో పాటు దర్శకత్వం వహించి పలువురి ప్రశంసలను అందుకున్నారు.

గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారిద్వారా ప్రదర్శించిన మూల్యం విభిన్నమైన కథాంశం కలిగి ఉంది. నేటి మన సమాజంలో ఆడపిల్లల మీద అడుగడుగునా రకరకాల ఆంక్షలు విధించబడుతున్నాయి జననంతో మొదలుకొని పెంపకం చదువులు సమాజవర్తన , వివాహం , ఉద్యోగం , స్వేచ్ఛ , దృష్టి దృక్పథం , చిన్న చూపు , వివక్ష ..ఇది చాలదన్నట్టు పెళ్ళవగానే మహిళ శరీరం మీద శరీరాంగాల మీద తన ఆమె భర్తకు సర్వాధికారాలు సంక్రమిస్తాయి అనడం నిస్సందేహంగా అన్యాయమే! వివక్షే!
మహిళను సాటి మనిషిగా గుర్తించకపోవడం నిజంగా అకృత్యమే అమానుషమే. మగవారితో సమానంగా అన్ని రంగాలలో భుజం భుజం కలిపి నడుస్తూ విజయబావుట ఎగురవేస్తున్న మహిళా శక్తిని కించపరచడమే అవమానించడమే!
లింగ అసమానతను దుర్విచక్షణ హక్కుల హసనాన్ని నేటి మహిళ ఎలా సహిస్తుంది? మరి ఎలా భరిస్తుంది ? అలాంటి దారుణ వివక్షకు వ్యతిరేకంగా ఒక వివాహిత మహిళ శంఖారావం చేసి తన హక్కును నిరూపించుకొని మరీ సాధించిన ఒక అపూర్వ ఘటన ఈ నాటిక !
నాటకానికి సంబంధించి ఏ వివరము తెలియకుండా వెళ్లినవారు ఈ సరికొత్త కోణం చూసి ఆశ్చర్య పడతారు అనడం అతిశయోక్తి కాదు . కథలోని పదును దానికి తగిన నటన నాటకాన్ని సమున్నత స్థానంలో నిలబడుతుంది . నాటకంలో ప్రధాన పాత్ర జయతి గా శ్రీమతి జ్యోతి రాజ్ భీశెట్టి , భర్త రాజారావు పాత్రను డాక్టర్ వెంకట్ గోవాడ , తండ్రి – -భాగి శాస్త్రి ,
లాయరు వేణు -బలగంగాధర్ మరియు గోవిందరాజుల నాగేశ్వరావు , ప్రతి లాయరు బ్రహ్మం -స్వరాజ్ కుమార్ మరియు ఉదయ్ సంతోష్ , డాక్టరు- ఉదయ్ సంతోష్ మరియు రాజకుమార్ , సంగీతం – మువ్వా నాగరాజు ,ఆహార్యం – గోవాడ క్రియేషన్స్ టీం లైటింగ్ సెట్ – దివాకర ఫణీంద్ర. వీరందరి సమిష్టి కృషి మూల్యం .
జయతి తండ్రి ఆరోగ్య సమస్యతో ఇంటికి వస్తాడు . వైద్యం చేయిస్తే అతనికి కిడ్నీ పాడైంది ఎవరైనా కిడ్నీ ఇవ్వాల్సి ఉంటుందని డాక్టర్ చెబుతాడు . ఇంటికి వచ్చిన మామయ్యను అనారోగ్యంతో ఉండగా పట్టించుకోకుండా మన ఇంటి మీదికి పంపాడు ఏమిటి మీ అన్నయ్య .. అని జయతిని నిలదీస్తాడు. అన్నయ్య చూసుకోకపోతే ఏం నేను చూసుకుంటాను అంటుంది జయతి. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి . వైద్యం చేసుకునేందుకు కిడ్నీ తానే ఇస్తానంటుంది జయతి. మీరైనా చెప్పండి అని లాయర్ వేణుని అడిగితే మీ కుటుంబ సమస్యలలో మేము తల దూర్చకూడదని వెళ్ళి పోతాడతను. కోపంతో కిడ్నీ ఇవ్వడానికి వెళ్తే నువ్వు తిరిగి రానవసరం లేదంటాడు భర్త కిడ్నీని దానం చేసేటట్లయితే ఒక ఫారం మీద భర్త అనుమతితో సంతకం పెట్టించుకుని తీసుకురావాలంటాడు డాక్టర్ . నా శరీరంలో భాగం నేను మా నాన్నకు ఇవ్వడానికి నా భర్త అనుమతి దేనికి అని ప్రశ్నిస్తుంది జయతి.
చివరికి భర్తను అడుగుతుంది భర్త నిరాకరిస్తాడు దిక్కుతోచని స్థితిలో కోర్టు నాశ్రయిస్తుంది కోర్టులో డాక్టరు లాయరు, ప్రతి లాయరు ,తండ్రి ,భర్తల మధ్య సంభాషణలు ఆద్యంతం ఆసక్తికరంగా అద్భుతమైన వాదోపవాదాలతో కొనసాగుతాయి . ఎవరి వైపు వారు తమ వాదనలతో సమర్థించుకుంటారు. తండ్రి కోసం కిడ్నీ ఇస్తే భార్యగా తనకు తన పిల్లలకు భవిష్యత్తులో కొనసాగడం కష్టమంటాడు భర్త రాజారాం . ఒక తండ్రి యొక్క స్థానాన్ని అందరికీ చాటి చెబుతుంది జయతి. తల్లిదండ్రుల తర్వాతే భర్త అని చెప్తుంది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అంటారు కానీ పతిదేవోభవ అనరని అంటుంది. సమర్ధించుకుంటున్న భర్తను ఈ పరిస్థితి మీకే వస్తే మీరేం చేస్తారు అని సూటిగా ప్రశ్నిస్తుంది.
నా శరీరం నాది నా శరీరంలో అవయవం నేను దానం చేసే హక్కు నాకు ఎందుకు లేదు అని కోర్టును ప్రశ్నిస్తుంది నా శరీరం మీద భర్త కు ఎలా హక్కు ఉంది అంటుంది? అంటుంది . అన్ని రంగాల్లో పురోగమిస్తున్న స్త్రీ వివాహమైనంత మాత్రాన తన దేహం మీద హక్కుల్ని ఎలా ఎందుకు వదులుకోవాలి అని తీవ్రంగా నిశితంగా నిరసించి న్యాయస్థానాన్ని సూటిగా నిలదీస్తుంది జయతి.
లింగ అసమానతను దుర్విచక్షణను హక్కుల హసనాన్ని నాటిక సహితుకంగా శక్తివంతంగా ఎండగట్టింది నా శరీరం మీద అవయవాల మీద ఉన్న హక్కులు నావే అని నిరూపించుకోవడానికి నేను ఏ మూల్యం చెల్లించుకోవాలి ఈ మూల్యానికి నేను ఏం చెల్లించుకున్నానో తెలుసా మా నాన్న ప్రాణాలు అని భావురం అంటుంది కుప్పకూలిన ఆ దృశ్యం పతాక సన్నివేశం అందరి హృదయాలను కదిలించి వేస్తుంది అద్భుతమైన నటనతో జీవించింది ఆ పాత్రలో జ్యోతిరాజ్ బి శెట్టి భర్త రాజారాం పాత్రకు తగిన నటనను పరిపూర్ణంగా పోషించారు వెంకట్ గోవాడ.
ఈ నాటకం 30కి పైగా ప్రదర్శనలు చేసి నాటకం యొక్క ఉత్తమ ప్రదర్శన , ద్వితీయ ఉత్తమ ప్రదర్శన , ఉత్తమ రచయిత , ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి , ఉత్తమ సహాయ నటుడు , ఉత్తమ లైటింగ్ & రంగాలంకరణ ఇలాంటి అనేకానేక అవార్డులను సొంతం చేసుకుంది.
రచయితగా శ్రీ సింహ ప్రసాద్ కు దర్శకుడుగా డాక్టర్ వెంకట గోవాడకు , నటిగా జ్యోతి రెడ్డి బి శెట్టి గారికి మూల్యం నాటకం అమూల్యమైన ఆదరణను అందించింది . చూడని వారందరూ తప్పని సరిగా చూసి తీరాల్సిన నాటకం మూల్యం !