పుట్టం బుట్ట, శరంబునన్ మొలవ, నంభోయాన పాత్రంబునన్
నెట్టం గల్గను, గాళి గొల్వను, బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంట రచింతు తత్సరణి నీవీవమ్మ యో యమ్మ మేల్
పట్టున్ మానకు మమ్మ నమ్మితి జుమీ బ్రాహ్మీ దయాంభోనిధీ!
(భాగవతము – పోతన)
“మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో”.. నన్నయ తిక్కనాది కవులు ఈ భాగవతాన్ని ఇప్పటి వరకు తెలుగులో వ్రాయలేదు.. “దీనిం తెనింగించి నా జననంబున్ సఫలంబు సేనెద పునర్జన్మంబు లేకుండగన్” అనే విశ్వాసాన్ని ప్రకటించాడు, పోతన గారు. మరొక జన్మ లేకుండా ఉండేందుకు ఈ భాగవతాన్ని తెలుగులో వ్రాస్తాను.. అంటూ ఆరంభించారు పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరించడం.
ఆ ప్రక్రియలో భాగంగా సరస్వతీ దేవిని ప్రార్థిస్తూ చెప్పిన పద్యమే పై “పుట్టం బుట్ట” అన్న పద్యం..
నమ్రత, వినయ, విధేయతలను వ్యక్తీకరించే విధంగా చెప్పిన పద్యం ఇది.
భాగవతాన్ని తెలిసి పలకడం తమ్మి చూలికి కాని శూలికి కాని సాధ్యం కాదని ఒకవైపు చెపుతూనే దానిని తెనిగించేందుకు సన్నద్ధమైన పోతన గారి ప్రజ్ఞాపాటవాలు ఆ సంకల్పంలోనే వ్యక్తమౌతున్నాయి.
అయినా .. “ఎట్టే వెంట రచింతు తత్సరణి నీవీవమ్మ” అంటూ భారం ఆమెపైనే పెట్టడం ఆయనలోని సర్వ సమర్పణ భావాన్ని తెలుపుతుంది. పుట్టలో పుట్ట లేదు.. అంటే పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను.. వాల్మీకి తపస్సు చేస్తున్న సమయంలో ఆయన శరీరం అంతా పుట్టలు పెట్టిందట. దానిలో నుండి వెలికి వచ్చిన వాడు కాబట్టి అతను వాల్మీకిగా ప్రసిద్ధుడయ్యాడు. శరంబునన్ మొలవ.. రెల్లుగడ్డిలో జనించిన వాడు.. శరవణ భవుడు లేదా కుమారస్వామి. నేను కుమార స్వామిని కాదు.. అంభస్ అంటే నీరు.. నీటిపై చేసే ప్రయాణానికి అనువైన సాధనము (పాత్ర).. పడవలో సత్యవతికి పరాశరునికి జనించిన వాడు.. వ్యాసుడు.. ఆ వ్యాసుని నేను కాను.. కాళి గొల్వను.. కాళికా మాతను సేవించి ఆమె ప్రసాదంతో మహాకవి యైన వాడు.. కాళిదాసు.. నేనా కాళిదాసును కాను.. అయినా దొరంకొని (పూనుకొని) ఉంటిని.. ఉన్నాను… దేనికి? పురాణింపన్.. భాగవత పురాణాన్ని రచించేందుకు పూనుకొని ఉన్నాను. నిజానికి నాకా సామర్ధ్యం లేదు.. ఎవరికి ఉన్నది? వాల్మీకి, కుమారస్వామికి, వ్యాసునికి, కాళిదాసు లాంటి మహాత్ములకు మాత్రమే ఉన్నది… అయినా నేనా పనిని సంకల్పించాను. ఎందుకని? నా జననము సఫలము చేసుకోవాలని.. సామర్ధ్యం లేదని తెలిసినా ఎందుకు ప్రయత్నిస్తున్నాను? అంటే నాకు అండగా నీవు ఉన్నావనే నమ్మకంతో…
అమ్మా! నీ అండ చూచుకొని గొప్పనైన కార్యాన్ని తల కెత్తుకున్నాను. అంతేకాదు.. ముందు చెప్పిన మహాత్ములైన వారి వెంట నడుస్తాను.. అయితే ఆ సరణి మాత్రం నీవే నాకివ్వాలి. నిన్ను నమ్ముకున్నాను తల్లి.. “మేల్ పట్టున్ మానకు మమ్మ” మంచి పట్టుగా ఉండవమ్మా… ఓ దయకు సముద్రం లాంటి దానా.. బ్రహ్మీ మాతా అంటున్నాడు, పోతనగారు.
దయ ఆలోచనకు పరిమితమైనది కాగా కరుణ ఆచరణకు సంబంధించినది.. ఆలోచన ఆరంభం కాగా.. ఆచరణ ముగింపు…
“మేల్ పట్టున్ మానకు మమ్మ” … ఒక ఇరుకైన చేదబావి పూడిక తీస్తున్నారు.. అది ఒక ఉదాత్తమైన కార్యం.. ఒకడు లోపల ఉన్నాడు.. ఒకడు వెలుపల ఉన్నాడు. లోపల ఉన్నవ్యక్తి బావి లోపలి మట్టిని తీసి తట్టలో వేస్తాడు.. వెలుపల ఉన్న వ్యక్తి దానిని జాగ్రత్తగా పైకి చేది ఆ తట్టలోని మట్టిని బైట పారబోస్తాడు. పైన ఉన్న వ్యక్తి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా లోపలి వ్యక్తి ప్రమాదానికి గురవుతాడు. మట్టి తట్ట తొణికినా… జారినా.. తాడు తెగినా.. లోని వ్యక్తికి ప్రాణాపాయ స్థితి కలుగుతుంది. అందుకే లోని వ్యక్తి అంటున్నాడు.. అరే జాగ్రత్తగా పైకి చేదుకో… అంటూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని పైన ఉండే వ్యక్తికి చెపుతున్నాడు. లోపలి వ్యక్తి ప్రాణాలు పైన ఉన్న వ్యక్తి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉన్నాయి.
అదే విధంగా పోతన గారు దుష్కరమైన కార్యాన్ని తలకెత్తుకున్నాడు. తన సంకల్పం ఉదాత్తమైనది.. అత్యంత గహనమైనది. తానెంత సమర్ధుడైనా.. అమ్మవారి కరుణాదృక్కులు లేకపోతే తన ప్రయత్నం అపహాస్యం పాలవుతుంది. అందుకే మేల్ పట్టున్ మానకు మమ్మ.. అంటున్నాడు.
ఇకపోతే.. ముందు చెప్పిన వాల్మీకి వ్యాసుల మధ్యలో శరవణ భవుడు ఎందుకు వచ్చాడు అనేది చర్చ.. సుబ్రహ్మణ్య స్వామి కవిగా కాని పురాణకర్తగా కానీ ఎక్కడా చెప్పబడలేదు కదా మరి ఆ వరసలో ఆయనను ఎందుకు చేర్చినట్లు అనేది అనుమానం.
దీనిని చర్చిస్తూ.. మా ఆప్త మిత్రులు, పెద్దలు కీ. శ్రీ సత్యనారాయణ రాజుగారు ఒక మాట చెప్పేవారు. ఒకప్పుడు భారతి మాస పత్రికలో దీనిపై చర్చ జరిగిందని… శరంబునన్ మొలవ అనేది నిజానికి శిరంబునన్ మొలవ అని ఉండాలని కొందరు పండితులు అభిప్రాయ పడ్డారని అయితే ఆ అభిప్రాయాన్ని పలువురు పరిష్కర్తలు, పండితులు ఖండించారని చెప్పేవారు. పుట్టం, బుట్టశిరంబునన్ అనేది కాలక్రమంలో పుట్టంబుట్ట, శరంబునన్ మొలవగా మారిందని చెప్పడం హాస్యాస్పదం అని చెప్పేవారు.
మహాకవి చెప్పిన పాఠాన్ని మార్చడం చాలా అన్యాయమని పెద్దల అభిప్రాయం. కావ్యమనేది పురుషుడని.. ఆ కావ్య పురుషునికి కుమార స్వామికి గాఢమైన మైత్రి ఉన్నదని.. అంతేకాదు.. అతడు గొప్ప రసజ్ఞుడని అందుకే కవికి పురాణ కర్తకు మధ్య కుమార స్వామిని పెట్టాడని మా సత్యనారాయణ రాజు గారి అభిప్రాయం.
పెద్దలు ఈ పద్యాన్ని పరిశీలించి మీ మీ అభిప్రాయాలను జోడింపుల రూపంలో పంచుకుంటే రసజ్ఞులకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తూ.. నమస్సులతో..