1జాతి గౌరవమును పెంచి ఖ్యాతి గనిన
వారి స్మృతులను స్తుతులను వ్రాయు కతన
భావి తరముల కందించ బడియె నవ్వి
జాషువా! వారు నీవు శాశ్వతులు సుమ్మి!
2 పుట్టి పెరిగిన వినుకొండ పురము నీకు
నుగ్గు పాలతో పోసిన యూసు లన్ని
తీపి చేదులు తీరైన జ్ఞాపకములు
కృతులుగా జేసితివి లోక హితుడ వీవు
3 గొల్ల సుద్దుల చేత నీ యుల్ల మింత
పులకరింపగా జేసిన పుణ్య మూర్తి
తండ్రి వీరయ్య పలుకుల ధాటి తోడ
పాడితివి శివాజీ గ్రంథ పద్యములను
4 ఛాందసుల యీయడింపులే సరస కృతులు
చేయ దగుటకు నీ కింత చేవ నిచ్చె
వెక్కిరించిన వారింత స్రుక్కి స్రుక్కి
వారె వాహ్ సెహ బాషని నారు నాడు
5 అతిశయోక్తులు గుప్పించి యసలు రంగు
కప్పి పిచ్చగా జూచిన కవివి గావు
కుండ బద్దలు గొట్టుచు గుట్టు నింత
విప్పి చూపి నాడవు గదా విబుధ వర్య!
6 పంచముడు కవి యని సభా ప్రాంగణమును
వదలి పాఱిన పాఱుల యెద లొకింత
కరగి పోయెడు రీతి నీ కలము నడిచె
పరుష మెఱుగని సంపూర్ణ పండితుడవు
7 ఖండ కావ్యాల తోడ నఖండ కీర్తి
నింపితివి జాషువా జాతి కింపు మీర
కవుల లోన దిగ్గజ మని; నవ యుగ కవి
చక్ర వర్తి యన్ బిరుదును సార్థకములు
8 ప్రతిభ గని నంత మది నింత పరవశించె
చెళ్ళ పిళ్ళ వేంకన తన చెలిమి పెంచె
గండ పెండేరమును నీదు కాల నుంచె
కవి కులంబున నుభయుల ఖ్యాతి మించె
9 కందుకూరి సుకవి నీదు కవిత జూచి
మెచ్చి; శారద నిన్నింత మెచ్చె;కులము
పిచ్చి వారలు నిను మది మెచ్చ లేరు
సాగు మని భుజమును తట్టి సాగ జేసె
10 ప్రేమతో ‘ కవి కోకిల’ బిరుద మిచ్చి
కన్న విను కొండ తన దైన ఖ్యాతి పెంచె
నిండు వెన్నెల బ్రతుకులో పండె ననుచు
వింటి గెలుపుగా దాని గై కొంటి వపుడు
11 చిలకమర్తి లక్ష్మీ నరసింహ సుకవి
మెప్పు కొండంత బలముగా నొప్పు కతన
నా’మదాలస’ నాటక మల్లి నావు
ప్రతిభ గని ప్రోత్సహించని వారు గలరె
12 సత్యవోలు గున్నేశ్వర సరస నీవు
చేరుటయె పెద్ద మలుపుగా చెప్ప దగును
వారి ప్రోత్సాహమున నీవు వ్రాసి నావు
నాడు రుక్మిణీ కల్యాణ నాటకమును
13 కరుణ రస పూర్ణ మైన నీ కావ్యములకు
కను చెమర్చని మనుజులు కాన రారు
నాటి భవభూతి రీతి యీ నాడు నీవె
కరుణ రస పూర్ణుడవు గాన ఖ్యాతి మిగిలె
14 పంచమునకు ప్రతీకగా పక్షులందు
గణపతి కెక్కని మ్రొక్కని గబ్బిలమును
దూతగా నెంచి నీ లోని దుఃఖ మంత
వ్రాసి పంపితి కైలాస వాసు డరయ
15 పంచముడ నాదు పాదము పడని గుడికి
పులుగు దొరసాని నీవు పోగల వటంచు
పురములను పూర్వ వైభ వమ్ముల నుతింప
తేట పడె సత్కవీ!నీదు దేశ భక్తి
16 భావ కవితా ప్రవాహాన బడిన కవులు
వ్రాసి యున్నట్టి మార్గాన వ్రాయ కున్న
ప్రకృతి కవితకు’ ఫిర దౌసి’ పట్టు గొమ్మ
యగుట నీ కాంధ్ర దేశాన యశము గలిగె
17 ఇరువురు వియోగ దుఃఖాబ్ది నీది రేని
వారి యూహ లొకే రీతి వరలి నటుల
పిచ్చి వాడైన శ్వపచుని మచ్చు బొమ్మ
పాదుషా మెప్పు కెంతయు పాత్ర మయ్యె
