అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది కాగా, అన్ని మాసాలలో కార్తీక మాసం శ్రేష్ఠమైనది. ఈ మాసములో యే స్వల్ప కార్యమైనా నియమంగా చేస్తే అక్షయమైన ఫలితాన్ని కలగజేస్తుంది. శివుడు త్రిపురాసురుని సంహరించింది కార్తీక పౌర్ణమినాడే. విశ్వకర్మ త్రిపురాసురునికి త్రిపురమనే విమానమర్పించి, అందులో ఉండి ఆ దైత్యుడు హింసిస్తున్న దేవతల మొరవిని పరమేశ్వరుడు వానికి ఏకబాణమున త్రిపురముతో సహా దహించి చంపాడు. జ్వాలా తోరణమును, త్రిపురోత్సవాన్ని కార్తీక పౌర్ణమి నాడు ఒనరిస్తే పాపహారము అని అంటారు.
శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన ‘కార్తీక’ మాసం చాంద్రమాన ప్రకారం ఎనిమిదవ మాసం. స్త్రీలు ఈ మాసంలో ఆచరించే కార్తీక వ్రతం, నోము స్వల్ప కార్యమైనా గొప్ప ఫలితాన్నిస్తుంది. కార్తీక స్నానం, దీపదానం, దీపారాధన, కన్యాదానం, ఉపవాసం చేయడం వల్ల అనేక జన్మజన్మల్లో చేసిన సకల పాపాలు హరించుకుపోయి అనంతమైన అక్షయమైన పుణ్యఫలితం పొందుతారని, కార్తీకపౌర్ణమి అన్నింటికంటే అత్యంత విశేషఫలదాయకమైన పుణ్యకాలమని మనకు స్కాంద, పద్మ పురాణాంతర్గతమైన కార్తీక పురాణం ద్వారా తెలుస్తోంది.
శివకేశవ ప్రీతికరమైన ‘కార్తీకం’ సమస్త ధర్మాలకన్నా శ్రేష్ఠతరమైనది. కార్తీకంలో సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపము ధరించి సమస్త నదీ జలాలయందు చేరుతుంది. శ్రీమహా విష్ణువు సమస్త జలాశయాలలో వ్యాపించి ఉంటాడు. కాబట్టి ఈ మాసమంతా సూర్యోదయానికి పూర్వమే పుణ్య నదులలోను,పుణ్యక్షేత్రాలలోగానీ, నదిలో, కాలువలో,నూతులలో గానీ నిత్యం కార్తీక స్నానమాచరించటం వలన పాప నాశనమై, మోక్షం కలుగుతుందని మన పురాణాలు, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సాక్షాత్తూ గంగాదేవే సర్వజనుల పాపాలు తనలో ఉంటాయని భయపడి పరమేశ్వరుని ఉపాయాన్ని అడుగగా ‘కార్తీక మాసంలో కావేరినది, స్నానముచే సకల పాపాలు తొలగి పోతాయని చెప్పగా, గంగాదేవి అట్లాచేసి తన సంశయాన్ని తొలగించుకొన్నదని ధర్మసింధు వచనము. మీన పౌర్ణమి, మేష పౌర్ణమి, మిధున, కర్కాటక, సింహ, కన్య, తులా, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ అనేవి సంవత్సరానికి పన్నెండు పూర్ణిమలు. ఇందు కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిని ప్రవేశించే పూర్ణిమ కార్తీక పూర్ణిమ. ఈ కార్తీక పూర్ణమిలో ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ పూర్ణిమను వ్యాసపూర్ణిమని చెప్తారు. కాబట్టి అన్ని మాసాలలోని పూర్ణిమల కంటే కార్తీక పూర్ణిమ ప్రశస్తమైనది. పూర్ణిమ అంటే మిక్కిలి పర్వదినమని వేదాలలో చెప్పబడింది.
ఈ కార్తీక పౌర్ణమినాడు చేయవలసిన విధి ఒకటి ఉంది. ఉసిరి మూలయిన శ్రీహరి, స్కందమున శివుడు, ఊర్ధ్వమున బ్రహ్మ, సమస్త దేవతలు కూడా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరిచెట్టును ఆశ్రయించి వుంటారు. కాబట్టి కార్తీక దామోదరుడిని పూజిస్తారు. కార్తీక పౌర్ణమినాడు నిర్వహించే కార్యక్రమాల ద్వారా మానసికమైన ప్రశాంతత, ఆనందమూ లభిస్తాయి. కార్తీకమాసం హరిహరాత్మకమైన అద్వైత విశిష్టమైన మాసం. స్నానం, దీపారాధన, దానం, ఉపవాసం, వనభోజనం ఈ మాసంలో పుణ్యాన్ని అగణ్యంగా కలగచేస్తాయి. కార్తీక పౌర్ణమినాడు చేసే ఉత్సవానికి ‘జ్వాలాతోరణ’ ఉత్సవమని పేరు.
“ఉపవాసంబైక భుక్తం ! నక్తం ఛాయా చితవ్రతం స్నానం చతిలదానంద! షద్విధం కవయో విదు! అని ఉపవాసం, ఏకభుక్తం, నక్తభోజనం లేదా నక్తం, ఆయాచితం, స్నానం, తిలదానం. (1) శక్తి ఉన్నవాళ్ళు పూర్తి ఉపవాసం చేయటం, శివునికి అభిషేకం చేసి తులసి తీర్థం మాత్రమే తీసికొనుట, (2). ఉపవాసం చేయలేని వాళ్లు జపం, దీపారాధన చేసి, మధ్యాహ్నం భోజనం చేసి, రాత్రి మాత్రం భోజనం చేయకూడదు. పాలు, పళ్ళు తీసుకోవచ్చు. దీనిని ఏకభుక్తం అంటారు. (3) మూడో పద్ధతిలో ఉదయాన్నే స్నానజపాదులు చేసి, పగలంతా ఉపవాసం చేస్తూ నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయాలి. దీనిని నక్తం అంటారు. (4) పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం ఎవరైనా అడగకుండా పెట్టిన దానిని తినటం. దీనిని ఆయాచిత వ్రతం అంటారు. (5) మంత్రయుక్తంగా స్నాన జపాదులు గావించవచ్చు. (6) కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసిన వ్రతం చేసినట్లు అవుతుంది ఇది కార్తీక మాసంలో ఉపవాస పద్ధతులు.
భూమిమీద గల జీవులు శరీరం లోని ప్రాణమయ, బుద్ధిమయ, మనోమయ కోశంలోని శక్తి ప్రవాహాలు పూర్ణిమనాడు ఎంతో ఎక్కువ ఉత్తేజాన్ని పొంది ఏకోన్ముఖములై ఉంటారని కూడా చెప్పబడినది. కార్తీక శుద్ధ పూర్ణిమను వ్యాసపూర్ణిమ అనీ అంటారు. ఈ దినం చంద్రుడు కృత్తికా నక్షత్రం లో ఉంటాడు. రవి కూడా వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రము లేక అనురాధా నక్షత్రాలలో ఉంటాడు. కృత్తికా నక్షత్రము రవి యొక్క నక్షత్రము, కృత్తికా నక్షత్రానికి అగ్ని, ఆది దేవత రుద్రుడు కాబట్టి ఇంత విశేషం.
చంద్రుడు కృత్తికలో పూర్ణుడై వుంటాడు. కాబట్టి కృత్తికా నక్షత్రంలో ఉండే ‘పూర్ణిమ’ వలన ఈ మాసానికి ‘కార్తీకం’ అని నిర్ణయించారు మన మహర్షులు. అగ్నికి అధిష్టాత ‘సూర్యుడు’ , చల్లదనానికి అధిష్టాత ‘చంద్రుడు’ కావడంచే ఈ రోజున సూర్యచంద్రులిద్దరూ పూజింపబడతారు.
కార్తీక మాసము శివకేశవులిద్దరికీ ప్రీతికరం. వృక్షాలలో అశ్వత్థ వృక్షము, తీర్థాలలో నారాయణ తీర్థము, తేజస్సులందరిలో సూర్యుడు, మాసములలో కార్తీక మాసానికి మించినవి లేవు. ఈ మాసములో సోమవార వ్రతం సర్వోత్తమము. కార్తీక సోమవారాలలో పంచామృతముతో, చమకముతో, శివాభిషేకం చేస్తే అశ్వమేథ యాగఫలం పొందుతారని, అన్ని సోమవారాలు ఆచరించినవారు ఇహమున సకలైశ్వర్యములను అనుభవించి, పరమశివుని అనుగ్రహానికి పాత్రులౌతారని కార్తీక పురాణోక్తి. పౌర్ణమి నాడు విష్ణాలయంలోగాని, శివాలయంలోగాని స్థంభం పైన దీపాలుంచిన వారి పుణ్యం వర్ణనాతీతం.
ప్రతి పండుగకు కొన్ని నియమాలున్నట్లే ఈ కార్తీక పౌర్ణమికీ ఉన్నాయి. కథలూ ఉన్నాయి. కార్తీక మాసమంతా బ్రహ్మముహూర్తానికి పూర్వమే స్నానం చేయాలి. అట్లా చేసే స్నానమే కార్తీక స్నానమవుతుంది. ఈ కార్తీక మాసమంతా స్నానం, దానం, ఉపవాసం చేసే శక్తి లేని వారు కనీం ఒక్క కార్తీక పౌర్ణమినాడైనా వీటిని ఆచరిస్తే ‘కార్తీక పుణ్యఫలం’ లభిస్తుందని శాస్త్రోక్తి.
కార్తీక మాసంలో ఉపవాసం చేయడమంటే ఆహారం మానేసి ఆకలితో కాలం గడపడం కాదు. ఉప= భగవత్సమ-వాస= శరీరేంద్రియమనః ప్రాణదిభిః నివాసః ఉపవాసః అని అంటే “శరీరం, మనస్సు, ఇంద్రియాలు, ప్రాణాధి శక్తులు అన్నింటితో సహా భగవంతుని సమీపంలో ఉండడం అని అర్థం.”
చల్లని వెన్నెలలు హృదయోల్లాసాన్నిచ్చినట్లే పండుగలూ ఇస్తాయి. మన హైందవ సంస్కృతి, సాంప్రదాయం విశిష్టమైనది. చైత్రమాసం నుండి ఫాల్గుణ మాసం వరకు ప్రతి మాసం ఒక విశిష్టతను సంతరించుకోగా, ‘కార్తీక’ మాసం సంవత్సరములోని అన్ని మాసాల కంటే మహిమాన్వితమైనదిగా, ప్రశస్త్యమైనదిగా భావిస్తూ తరువాతి తరాలకూ చెప్పుకోవాలి.