Home వ్యాసాలు కవిత్వ నైపుణ్యాలు: ‘కవితా శిల్పం’

కవిత్వ నైపుణ్యాలు: ‘కవితా శిల్పం’

ఈరోజు కవిత్వం నైపుణ్యాలలో నాలుగవ అంశం ‘కవిత్వం – శిల్పం’.

కవిత్వమనేది జీవితకాలమంతా అభ్యాసం చేయవలసినటువంటి కళ. నేర్చుకోవలసినటువంటి కళ. సాధించవలసినటువంటి కళ. అందువల్ల ఈ రూపంలో, కరోనా ఇవాళ మనని ముందుకు తీసుకొచ్చిన ఈ కాలం, ఈ వేదిక ద్వారా దీని కోసం నేను మళ్ళా చదవడం వల్ల నన్ను నేను పునః సమీక్షించుకున్నట్లు ఉన్నది. ఇది మంజీరా రచయితల సంఘం ద్వారా వీలవుతున్నది. మీ అందరితో చర్చించడం వల్ల కవిత్వానికి సంబంధించినటు వంటి ఈ అంశాలు కదన కుతూహలమే అంటాం అట్లా, నాకు కవన కుతూహలం కలిగించడానికి ఇట్లా మీరందరూ తోడ్పడుతున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు మన అంశం ‘కవిత్వం – శిల్పం’

గత ప్రసంగంలో “కవిత్వం, వస్తువు” అనేది చెప్పుకున్నాం. ఏ వస్తువును ఎట్లా ఎన్నుకోవాలో మాట్లాడుకున్నాం. ఏ కవితా వస్తువును ఎంత జాగరూకతతో, ఎంత సమకాలీకతతో ఎంచుకోవాలో చెప్పుకున్నాం. ఇవాళటి సమావేశంలో మనం శిల్పం గురించి మాట్లాడుకుందాం. వస్తువును ఎన్నుకోగానే సరిపోదు. వస్తువు దొరుకుతుంది. రచనకు చెంది ఎవరికి అభ్యాసమైన రూపనిర్మాణం వారికి ఉంటుంది. ఇక ఉన్న సమస్యంతా శిల్పం. వస్తువును కవిత్వంగా మలిచేప్పుడు, వస్తువుకు సంబంధించిన రూపురేఖలు సవ్యంగానే ఉన్నాయి. కానీ శిల్పానికి సంబంధించినటువంటి రూపురేఖలు ప్రత్యేకంగా మనం అన్వేషించి నిర్ధారించినవి కొన్ని ఉండవచ్చును. కానీ, ఎవరూ కచ్చితంగా ఇదే కవిత్వం, ఇదే నిర్ణీత శిల్పం అని చెప్పడానికి ఉండదు. ప్రత్యేకంగా ఇవే కవిత్వానికి సంబంధించిన శిల్పం అని చెప్పడానికి మనకు వేల సంవత్సరాలనుంచి చర్చ జరిపినా ఇప్పటివరకూ కరెక్ట్ గా ఇదే శిల్పం అని చెప్పడానికి ఏ ఆధారాలు లేవు. లేవన్నంతమాత్రాన మరి ఏం లేదా !? చాలా చర్చలు జరిగినవి. ఒక వస్తువుకు రూపం ఉంటుందన్నది అనుకున్నాం. ఆ రూపానికి శిల్పం వల్లనే కవిత్వంగా మారేటటువంటి దృష్టి ఏర్పడ్డటువంటిదవుతుంది. శిల్పం ఒనగూరినప్పుడు మాత్రమే అది ఆ స్థాయికి చేరేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని శిల్పం ఒనగూర్చడమనేది చాలా కీలకం. అందువల్ల ఉన్న సమస్య అంతా ఎక్కడున్నది? కవిత్వం అవునో కాదో చాలామందికి తెలియదు. మంచి కవిత్వమేదో చెప్పగలం, కవిత్వం కానిదేదో చెప్పగలం. కాని కవిత్వం ఇలానే ఉండాలి, ఉంటుంది అని చెప్పలేం కదా! మహా మహా కవుల దగ్గరి నుంచి మామూలు కవుల వరకు కూడా! ఒక కవిత్వానికి , కవిత్వం కానిదానికి మధ్య ఉండే భిన్నమైన వికాసం లేదా గుర్తింపు ఏమిటీ అంటే శిల్పం అనేది అని రూఢిలో ఉంది. శిల్పం ద్వారానే కవిత్వం రాణింపుకు వస్తుంది. అందుకని, శిల్పం అంటే ఏంటీ అని అన్నప్పుడు అందులో ఆంగ్ల పదంలోకి వెళితే ‘టెక్నిక్’ అన్నారు. రూపానికేమో ‘ఫామ్’ (Form) అన్నారు. శిల్పానికేమో టెక్నిక్ అన్నారు. ఇదిగో ఇది ఈ టెక్నిక్ ను పట్టుకోవడమన్నది చాలా కీలకం. అంటే శిల్పం పట్టుకోవడం చాలా కీలకం. అంటే వస్తువు అందరి దగ్గరా ఉంటుంది. వస్తువుకు చెందిన రూపాన్ని మరింత కళాత్మకంగా మలిచేదే శిల్పం. శిల్పం అంటే ఒక్కమాటలో చెప్పవలసి వస్తే, వస్తువును ఆకట్టుకునే విధంగా మలచడమే శిల్పం. శిల ఉంటుంది. దాన్ని శిల్పి మాత్రమే అద్భుతమైన శిల్పంగా మార్చగలడు, తయారు చేయగలడు. ఆ శిల్పాన్ని చెక్కేటప్పుడు శిల్పి శిల్పాన్ని చేసే క్రమంలో కూడా కొన్ని చెడిపోవచ్చు. కొన్నిసార్లు ఎక్కడైనా చెక్కడంలో లోపం ఏర్పడితే ఆ రాయి మొత్తం వృథా అవుతుంది. శిల్పం తయారు కాదు. అందుకని చాలా ఆలోచనతో కష్టపడి చెక్కాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ ఉలితో చెక్కేటప్పుడు ఉలిని ఎంత సున్నితంగా వాడాలో అంత సున్నితంగా వాడుతాడు, ఒక కన్ను దగ్గర, ఒక పెదవి దగ్గర ఏ రేఖమైతే రావాల్సి ఉంటుందో ఆ రేఖను చాలా జాగ్రత్తగా చాలా సున్నితంగా నిర్మిస్తాడు, చెక్కుతాడు. అప్పుడు మాత్రమే అందులో శిల్పం జీవకళ ఉట్టిపడుందన్నట్లు ఉన్నదని అంటాం. సులువుగా, సున్నితంగా, మృదువుగా డీల్ చేయాల్సినటు వంటి క్రమంలో హార్డ్ గా డీల్ చేస్తే రాయి ఎగిరిపోతుంది. అందుకే అంతవరకు చేసింది, అంటే ఒక పెదవిని చెక్కుతుంటే చెడిపోయిందనుకోండి ఇక అంతే. కొత్త దానికోసం ప్రయత్నించాలి. అంతే తప్ప ఇంకొక మార్గం లేదు. అందుకని సున్నితంగా వర్తించవలసిన చోట సున్నితంగా వర్తించాలి. కటువుగా వర్తించవలసినచోట కటువుగా, ఇంకా కటువుగా తయారుచేయాలి, పటువైన విధంగా ఆకర్షణీయంగా తయారు చేయవలసిన చోట చాలా జాగ్రత్తగా చెక్కాలి.

ఒక రాయిని ఎంత చెక్కాల్సినచోట అంత చెక్కాల్సిందే. ఒక రాయిని శిల్పంగా, కళాత్మకంగా మలచాల్సిన చోట ఆ అవసరముంటుంది. శిల్పాన్ని సరళీకరించాల్సినట్లు, కవిత్వంలో ఎట్లా, ఎక్కడ శిల్పం ఉంది అంటామంటే, వ్యక్తీకరించే పద్ధతి, చెప్పే పద్ధతిలో శిల్పం ఉందని అంటాం. చెప్పేచోట ఎట్లా చెప్తున్నామో, ఎట్లా వ్యక్తీకరిస్తున్నామో దాన్ని శిల్పం అంటాం. ‘మెథడ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్’ వ్యక్తీకరణ. అభివ్యక్తీకరించడ మనేది చెక్కే పద్ధతిని శిల్పం అంటాం. చెప్పే పద్ధతిలోని సమగ్రతను శిల్పం అంటాం. ఈ విధమైన శిల్పం ఆ భాషలో ఆ వస్తువుకు చెంది సరియైన అభివ్యక్తి రూపం అవుతుంది.

చెప్పే ఇతివృత్తం వస్తువు అయితే, చెప్పే పద్ధతి శిల్పం. ఒక వస్తువును కళాత్మకంగా మలచాలి. ఈ కళాత్మకంగా మలిచేప్పుడు ఈ శిల్పమనేటువంటిది ఏంటిది శిల్పం అంటే మనం చేసే పనిలో నైపుణ్యం సాధించడమే శిల్పం. ఏ పని చేస్తున్నామో, కవిత్వం రాసేప్పుడు కవిత్వంలో మనం నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. కథ రాస్తున్నాం అనుకోండి. కథ రాసేప్పుడు మన రచనా నైపుణ్యాన్ని ప్రదర్శించడం అన్నట్టు. అదే ఒక రాయిని శిల్పంగా మలిచేప్పుడు అక్కడ ఒక శిల్పకారుని నైపుణ్యమే బలమైన రూపాభివ్యక్తికి ప్రధానం అవుతుంది కాబట్టి ఇది కీలకం అంటే ఒక వస్తువుకు రూపం ఉంటుంది, ఆ రూపాన్ని ఒక శిల్పంగా మార్చేటువంటి ఒక క్రమం ఉంటుంది. అంటే ఒక ఆర్డర్ ఉంటుంది. అది మాత్రమే శిల్పం. కాబట్టి రూపాన్ని కళాత్మకంగా మలిచేదే శిల్పం. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఏ ప్రమాణాలు ఏమీ లేవు. ఒకటే ఒకటంటే హృదయాన్ని ఆకట్టుకునేట్టుగా చెప్పటం. ఎప్పుడు హృదయాన్ని ఆకట్టుకుంటాం? అంటే – మన రచనా నైపుణ్యం మన యొక్క వ్యక్తీకరణ నైపుణ్యం చాలా అందంగా, చాలా బలంగా ఉంటే దాన్ని శిల్పం అంటాం అన్నమాట. అందుకని శిల్పమనేది కేవలం ఒక్కమాటకు సంబంధించింది కాదు.

చూసే పద్ధతి, చూయించే పద్ధతి వీటన్నింటి వెనకాల ఉన్న ప్రమాణం ఏదైతే ఒక విధానం, ఒక పద్ధతి ఏదైతే ఉందో మీరు ఏ పని చేయాలన్నా ఆ పనిలో ఉండే నైపుణ్యం, ఆ పద్ధతి, ఆ నేర్పరి తనం తెలంగాణలో ఒకమాట

చెక్కణమా? కుందనమా అంటారు. “నాగూడ తెలుసు”. అన్నట్టు ‘చెక్కడమా? కుందనమా?” అనేటువంటిది. అంటే మామూలుగా చేసేటువంటి ఈ పనికి సంబంధించిన మటుకే ఇట్లా అంటారు.

బంగారాన్ని నగగా తయారుచేసే పద్ధతి ఒకటున్నది. కుందనం అంటే మనందరికీ తెలిసిందే. కుందనం అంటే బంగారం. చెక్కణమా? కుందనమా అన్నారు. అంటే బంగారాన్ని నగగా అందమైన ఆభరణంగా మలిచేది ఒక స్వర్ణకారునికి మాత్రమే తెలుస్తుంది. బంగారాన్ని నగగా మలచడం, ఆభరణంగా చేయడం అది శిల్పం. మంచి శిల్పకారుడైనటువంటి స్వర్ణకారుడు మాత్రమే మిమ్ముల్ని ఆకట్టుకునేటువంటి నగను తయారు చేయగలడు. ఆమె ధరించి చూపరులను అందరినీ ఆకట్టుకునేటు వంటి ఆ నైపుణ్యం ఆ నగలో ఉన్నది. కాబట్టి ఈ అందరినీ ఆకట్టుకోవటం, తనని ఆకట్టుకోవటం అనేది చెక్కణమా, కుందనమా అనేది ఎందుకన్నారు? చెక్కితే కళాత్మకంగా మారిందని అనడం శిల్పం అనేటువంటిది. రాయిని శిల్పంగా మార్చేప్పుడు ఉలితో చెక్కాల్సిందే. మనకందరికీ తెలిసిందే. ఒకనికి ఒక కర్రని అద్భుతమైన బొమ్మగా మలిచే ఒక శక్తి ఉంటుంది. మామూలుగా చేయడం వేరు. చాలా కళాత్మకంగా చేయడం వేరు. మనందరికీ తెలిసిందే. మన చిన్నప్పుడు చూసిందే. బొంగరాలు వండ్రంగులు చేస్తారు. మనమందరం ఆడుకున్నం. ఆ బొంగరంలో సంగడి బొంగరం ఉంటుంది. అంటే దాని సంగడి బట్టి చాలా అందంగా తయారు చేస్తారు. ఈ సంగడి బొంగరం చేసేటువంటి శక్తి అనేది కొందరికే ఉంటుంది. అందరికి రాదది. ఈ సంగటి బట్టి చేసేది సంగటి బొంగరం. చక్రంతోని ఒక అద్భుతమైన ఒక చెక్కబొమ్మను చేయడం అనేదే శిల్పం. ఒక స్వర్ణకారుడి చేతిలో, ఒక వడ్రంగి చేతిలో ఏదైతే నైపుణ్యం ఉన్నదో అదే శిల్పం. ఆ నైపుణ్యమే శిల్పం అది కవి చేతిలో ఉన్నప్పుడు కవిత్వానికి సంబంధించిందై ఉంటుంది అని శిల్పం గురించి మనం చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే కవి చేతిలో ఉంటుందో, అది చెప్పేటువంటి పద్ధతిలో, చూపెట్టేటువంటి ఎక్స్ ప్రెషన్ అద్భుతమైన పద్ధతి, నైపుణ్యం. అందుకని ఈ నైపుణ్యం ప్రతి వస్తువు అందంగా కనబడాలని చేస్తారు. ఒక వస్తువును తీసుకొని మలచడం. అది కేవలం ఉపయోగానికే అంటే సరిపోదు. మనందరికి తెలిసిందే, చెప్పులు మనం షాపులో కొంటాం. కానీ అందమైన చెప్పుల కోసం మనం వెతుకుతాం. ఏదైతేనేం చెప్పులకు అని ఊరుకోలేం. ఆ చెప్పు కూడా అందంగా ఉండాలి. మనకు నచ్చాలి. చెప్పులు వేసుకోగానే, ఎవరేమన్నంటరేమోనని అంటే మళ్ళీ వీటిని నేనేసుకున్న తర్వాత నా కాలికి బాగుందో లేదో అని, అందరినీ ఆకట్టుకోవాలని ఈ రెండు ప్రయోజనాలు నెరవేరాలి. ఒకటి వేసుకునే వాడికి నచ్చాలి, రెండవది వేసుకున్న తర్వాత మన కాలి యొక్క అందం పెరిగి, ఎదుటివాళ్ళకి కూడా నచ్చాలి. అందం వ్యక్తిది పెరగాలి. వెనకట మాదిగ కళాకారుడు, చెప్పులను చేసే కళాకారుడు. మరి దాంట్లో ‘కిర్రుచెప్పులు’ అని మన కథలల్లో చదువుతుంటాం. కవిత్వంలో చదువుతుంటాం. “కిర్రు చెప్పులతో వచ్చాడు” అని. ఈ కిర్రుచెప్పులు అందరు చెయ్యలేరు. అట్లాగే మళ్ళీ ఆ చెప్పుల మీద అద్భుతమైన పోతబోసేటువంటి వాళ్ళు. అంటే నల్లగా ఉండేటువంటి తోలుమీద తెల్లగా ఉండేటువంటి దానితో రుద్ది, అంటే పోతబోసినట్లుగా వాటిని కుట్టి ఒక అందమైన చెప్పులను తయారు చేసే పద్ధతి. పాతకాలం పద్ధతి అది. అయితే షాపుకు పోయి చూసినప్పుడు దుకాణంలో కూడా చూసేవాళ్ళం మనం. ఏ కళాకారుడైనా సరే, ఏ పని చేసేవాడైనా సరే, ఆ పనిలో నైపుణ్యం ప్రదర్శించాలి. అప్పుడే కళాకారుడవుతాడు. మనం నైపుణ్యం ప్రదర్శించకపోతే కేవలం పనే అది! పనిలో నైపుణ్యం ప్రదర్శించక పోతే ఆ పని యొక్క ‘పనితనం’ రాణించనట్లే. Skillfulness అంటామే అదే ఇది.

ఏమంటడంటే “యు ఆడ్ యువర్ లైట్ దట్ ఆఫ్ లైట్ – నీ కాంతిని దాని మీద విస్తరింప జేయి. ఎట్లా? దాంట్లో

అంతకుముందున్న కాంతి మరింత ప్రకాశవంతం అయేట్లు చెయ్యి” అని.

యు ఆడ్ యువర్ లైట్. నీ కాంతిని వస్తువు మీద ప్రసరింప జేయు. వస్తువులో అంతకుముందే ఒక కాంతి ఉంది. అది నువ్వు గుర్తుపట్టి ఈ కాంతిని, అందులోని కాంతి, నీకాంతి కలిసి దేదీప్యమానంగా నిరంతరాయంగా పెరిగేటువంటి అవకాశమున్నది. అంటే “అంతకుముందే ఉన్న కాంతిని నీ కాంతి ద్వారా ప్రకాశింపజేయి. చాలా

సులువైనటువంటి నిర్వచనం ఇది. సాహిత్య శిల్పానికి సంబంధించింది ఇది ఎట్లా చేస్తావు?

నిజానికి ఒక వస్తువు కళాత్మకంగా ఉందా లేదా అనేటవంటి దానికి దీన్ని బట్టి చూస్తారు కవితకు అంటే –

కవితను కళాత్మకంగా చూపేది శిల్పమే. అందుకని శిల్పం ముఖ్యం. ఈ శిల్పంతోనే కొందరు గొప్పకవులు అయినారు. ఈ శిల్పం అందుకోవటం కోసం కవులు నిరంతరం తపించారు. ఈ శిల్పం కొరకు ఇంగ్లీష్ లో చెప్పేమాట ఒకటి క్రాఫ్ Craft / Craftmanship అన్నారు. ఈ చెక్కడాన్ని క్రాఫ్ట్ అనడానికి… ఆ చెక్కే విధానం గనక తెలియకపోతే ఇందాక చెప్పుకున్నట్లే శిల్పం చెక్కుతుంటే రాయి ముక్క ఎగిరిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చెక్కేటప్పుడే సున్నితంగా, కళాత్మకంగా, మెళకువగా చెక్కినట్లైతే, శిల్పం నైపుణ్యంగా చెక్కితే బాగా వస్తుంది. ఈ చెక్కడం కోసం మనకు కావాల్సింది ఏమిటంటే, భావుకత ఉండాలి. భావుకతతో రాయాలి. ఈ శిల్పం సాధించడానికి ఇన్ని నిర్వచనాలు చేస్తారు. ఈ శిల్పం చెక్కడానికి, తయారు కావడానికి లేదా శిల్పాత్మకంగా, నైపుణ్యంగా చెక్కడానికి కావలసింది ఒకే ఒక్కమాటలో చెప్పాలంటే అది : భావుకత. భావుకత అనేది ఒకటి ఉండాలి. ఇమాజినేషన్ సరిగ్గా, ఎట్లా చేస్తే అందంగా వస్తుందో దాన్నే, అట్లా చేయడాన్నే భావుకత కన్పిస్తున్న శిల్పం అంటారు. శిల్పానికి భావుకత అనేది ఒకటి ఉంటే అందంగా వస్తుంది. ఈ శిల్పకారునికి, ఈ కవికి ఉండాల్సింది ఏంటిది? ఇమాజినేషన్ (Imagination) అనేది ఉండాలి. ఎట్లాగైతే ఒక మాదిగ కళాకారునికి ఇది పోతబోస్తే చాలా అందంగా ఉంటుందని ఎట్లా పోత బోసి సిద్ధం చేస్తాడో, ఒక స్వర్ణకారునికి ఇందులో రాయిని, రత్నాన్ని పొదిగితే అందంగా ఉంటుందని చేస్తాడో, ఒక వడ్రంగి ఈ కర్రకు సంగటి బెడితే అది ఎంత అందంగా తయారవుతుందని అనుకుంటాడో ఇవ్వన్నీ ఈ అనుకోవడమనేది భావుకత. భావనాత్మకత. దీనినే ఇమాజినేషన్ అంటారు. ఇట్లా జేస్తే అందంగా ఉంటుంది, ఇట్లా రాస్తే భావుకత బావుంటుందని కళాత్మకంగా ఆలోచిస్తాడో, తయారు చేస్తాడో అదే శిల్పం.

రామప్ప శిల్పంలో నాగిని గొప్ప శిల్పం. దానికి దగ్గరల్లో మరొక ఆమెని పెట్టి, కాలికి విరిగిన ముల్లును తీసే ఇంకో శిల్పాన్ని చెక్కాడు శిల్పకారుడు అద్భుతంగా శిల్పంగా చెక్కాడు. అది అందరికీ తెలిసిందే. చాలా అద్భుతమైన శిల్పం. అందరినీ ఆకర్షించే శిల్పం. కాలుకు ముల్లు విరిగితే, ఆ ముల్లు తీసే శిల్పం మరొకటి ఉంటుంది. అద్భుతంగా వచ్చింది. ఇది ఎక్కడినుంచి వచ్చింది? కాలుకు ముల్లు విరగడమేమిటి? కాలుకు ముల్లు విరగడమనేది జీవితంలో చూసాడు. పనిచేసే వారికి ముల్లు ఇరిగే అవకాశం ఉంటుంది. కాని అక్కడ నాగినికి అట్లా చెక్కాడు. కాలికి ముల్లు తీసే శిల్పాన్ని అత్యంత సున్నితమైన సన్నివేశాన్ని శిల్పంగా చెక్కాడు, రామప్ప అనే శిల్పి. ఆ గుడి పేరు రామప్ప గుడి. అతని పేరుతో ఉన్న గుడి. కాని గుడిలో వున్న దేవుడు రామలింగేశుడు. ఆ కళాకారుని పేరు మీద ఆ గుడి వున్నది. ఆ శిల్పం అంత గొప్పగా రావడానికి కారణం ఏమిటి? అంటే ఆయనలో భావుకత ఉన్నది. ఊహారేఖ రూపరహితమైన మాట. ఈ భావుకత అనేది ఎట్లుంటే అట్లా, ఈ హృదయం యొక్క ఉన్నతి.

ఈ భావుకత, ఇమాజినేషన్ ఎట్లా అలవడాలి? ఒక రూపరహితమైన ఈ భావం ఎట్లా కనబడుతుంది అంటే ఈ ఊహ, ఈ హృదయం యొక్క ఉన్నతి యొక్క సంస్కార వ్యక్తీకరణలో భావుకత. ఇక్కడ ఈ హృదయం యొక్క భావసంస్కరణమే కౌలశం. కవిత్వం రాస్తున్నాను. ఇది ఇట్లా రాస్తే చాలా అందంగా వస్తుంది అనే ఒక ఊహ రావాలి. భావం రావాలి. భావనాశక్తి, భావుకత, భావనాత్మకత, ఇమాజినరీ అనేవి ఉండాలి. కాబట్టి ఇమాజినేషన్ అనేది కీలకమైనది. మహా వైజ్ఞానిక మేధావి ఐన్ స్టీన్ కూడా Imagination యొక్క ప్రాధాన్యతను ఉగ్గడించాడు. ‘వైజ్ఞానిక సత్య’ ఆవిష్కరణకు కూడా Imagine చేయగలగడం అవసరమన్నట్లే కదా!

భావుకత ఎవరికి ఉంటుంది? మళ్ళీ మరల ఇంకోమాట మాట్లాడారు. మనలో అది, ఒక మాట చెప్పటానికి ఇంకోమాట మాట్లాడగలగడం. అంటే మరోమాట అనేది నైరూప్యంగా కవి సూత్రతలాగా ఉంటుంది. ఒక కవికి భావుకత రావడానికి ఏంగావాలి? ప్రతిభ గావాలి. ఈ నైపుణ్యానికి, ఈ భావుకతకు నీ దగ్గర ఉండవలసిందేమిటి అని అంటే, ప్రతిభ ! ప్రాచీన ఆలంకారికులు ఏమన్నారంటే “ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసము” అనే మూడు అంశాలను “కవితా సామగ్రి”గా చెప్పారు, అన్నారు. కవిత్వం రాయడానికి, ఈ భావుకతను ఆవిష్కరించడానికి, వస్తువును ఆవిష్కరించడానికి కవికి ఏంగా వాలంటే తప్పనిసరిగా పై కవితాసామాగ్రి ఉండాలి. కవిత్వానికి ఈ మూడు విషయాలు గావాలి. ఇవి కావ్యహేతువులు అన్నారు. కవితా సామాగ్రి అన్నారు. నైపుణ్యంతో కవితను రాయాలి అంటే కవికి ఈ మూడు ఉండాలి అన్నారు. ఏవి అంటే మొదటిది ప్రతిభ, రెండవది వ్యుత్పత్తి, మూడవది అభ్యాసము. వీటిలో ప్రతిభ ఎట్లా ఉంటుంది మరి? ప్రతిభ అనేది నీ యొక్క భావుకతను బట్టి, నీ యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది. నీ భావనాత్మక సంస్కారాన్ని బట్టి నీ పుట్టుక సంస్కారం, సాంస్కృతిక సంస్కారం, నీ సామాజిక సంస్కారం అనేవి కలిపి ఉంటాయి. ఎవరికి ఉంటుంది అంటే అది పుట్టుకతో రావాలి అంటారు. కాని, అదొక విశ్వాసమైతే, నాలాంటి వాడిని ఏమనుకుంటానంటే, మూడు సంస్కారాల వల్ల ప్రతిభ మనకు వస్తుంది, ఉంటుంది అని. మూడు సంస్కారాలేంటీ అంటే ఒకటి కుటుంబ సంస్కారం, రెండవది సామాజిక సంస్కారం. సమాజం నీకు కొంత సంస్కార మిచ్చింది. నువ్వు తిరిగిన నువ్వు పెరిగిన వాతావరణం కావచ్చు. గ్రామం కావచ్చు. నువ్వు తిరిగిన పట్టణం కావచ్చు, నువ్వు తిరిగిన దేశాలు కావచ్చు. ఇది రెండవది అయితే, ఇక మూడవది నీవు చదివిన కవిత్వమూ, నువు చదివిన పుస్తకాలదీ కావచ్చు. ఈ మూడు సంస్కారాలు నీ ప్రతిభను ఇనుమడింప జేస్తాయి. అయితే, దీనికే వాళ్ళేం చెబుతారంటే,

“శక్తి ర్నిపుణతా లోకశాస్త్రా ద్యవేక్షణాత్” అన్నారు. “శక్తిరి పుణత!” నీ భావనాశక్తి, నీ రాసేటు వంటి శక్తి రావాలంటే, అందుకు మూడు విషయాలుంటాయి అన్నారు.

లోకానికి సంబంధించిన, జీవితానికి సంబంధించినది జీవన జ్ఞానం ఉండాలి. లోకజ్ఞానం, శాస్త్రజ్ఞానం ఉండాలి. ఆ కాలంలో ఉండేటువంటి రాజకీయ శాస్త్రం గావచ్చు, సామాజిక శాస్త్రం గావచ్చు, ఆర్థికశాస్త్రం గావచ్చు, మానవశాస్త్రం గావచ్చు ఏదైనా తీసుకోండి. శాస్త్రానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. కావ్యాలకు సంబంధించిన జ్ఞానము, సంస్కారమూ ఉండాలి. ఈ మూడింటికి సంబంధించిన నైపుణ్యాన్ని ప్రదర్శించడం అనేది – దీన్ని ప్రాచీన ఆలంకారికులు చెప్పింది. ప్రతిభ, వ్యుత్పత్తి, సామర్థ్యం. ప్రతిభ అనేది నీలోనే ఉంటుంది. “యూ ట్రై యువర్ టాలెంట్” అని అంటారు. అది నీలోనే ఉంటుంది. నీయొక్క కాంతిని ప్రసరింపచేయడం. ప్రకృతిలో ఒక కాంతి ఉంటుంది. నీలో ఒక కాంతి ఉంది. నీలో ఒక తేజస్సు ఉంది. కవి అనేవాడు మామూలువాడు కాదు. కవిలో తేజస్సుంటుంది. ఒక ప్రతిభ ఉంటుంది. ఒక సంస్కారముంటుంది. ఆ తేజస్సు సంస్కారం ఉన్నవాళ్ళు అనివార్యంగా తనలో ఉన్నటువంటి ప్రతిభను ప్రదర్శిస్తుంటారు.

ఒకటి వ్యుత్పత్తి, మరోటి ప్రతిభ కావాలి, ఉండాలి అన్నారు.

ఇందాక చెప్పినటువంటి వాటిల్లో లోకాన్ని చదవడం ద్వారా, శాస్త్రాల్ని చదవడం ద్వారా, కావ్యాల్ని చదవడం ద్వారా అందేది వ్యుత్పత్తి, పాండిత్యం.

అభ్యాసము – దాన్ని మనం తరచుగా ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి శిల్పం అనేది కవి యొక్క భావనా శక్తిని ఆవిష్కరించాలి. ఇవి ప్రాచీన ఆలంకారికులు చెప్పిన సూత్రాలు. అట్లానే, ఇవి మన దగ్గర చెప్పినవైతే, పాశ్చాత్యులు కూడా చెప్పింది చూస్తే, పాశ్చాత్యులు కూడా శిల్పం మీద చాలా చర్చలు చేశారు. ఉన్న సమస్యంతా శిల్పంలోనే ఉంటుంది కాబట్టి ఈ శిల్పం అనేది ముఖ్యమని ఇక్కడి ప్రాచీన భారతీయ ఆలంకారికులు చర్చ చేసారు, అట్లాగే పాశ్చాత్య విమర్శకులైనా చర్చ చేశారు.

వస్తువు కవిత్వం కావడానికి కారణం శిల్పమే, కాకపోవడానికి కారణం శిల్పమే. ఒక వస్తువు సార్వకాలికంగా మంచి కవిత్వం కావడానికి కూడా శిల్పమే కారణం కావచ్చు. ఇప్పుడు ఆ వస్తువు లేకున్నా కూడా అది నిలిచి

ఉండటానికి కారణం సాహత్యంలోని ఈ శిల్పమే. ఆ రచనలో ఉన్న అసామాన్యమైన నైపుణ్యం వల్ల నిలుస్తుంది.

సార్వకాలీనమవుతుంది. శాశ్వత స్థాయీ వస్తుంది. సార్వకాలం కావాలన్నా, శాశ్వతం కావాలన్నా సామాజిక సమస్యను రాయాల్సి వస్తుంది. ఉదాహరణకి ఒక సమస్య అంతరించినా కూడా శాశ్వతంగా ఉంటుంది. ‘కన్యాశుల్కం నాటకం’ ఉందనుకోండి. గురజాడ అప్పారావు రాసిన నాటకం. ‘కన్యాశుల్కం’ ఇప్పుడు లేదు. ఇప్పుడంతా వరశుల్కం. వరకట్నం ఉన్నది కన్యాశుల్కం అంతరించింది. అదే సమయంలో ‘వరవిక్రయం’ అని కాళ్ళకూరి నారాయణరావు రచన, కన్యాశుల్కం నాటకం గురజాడది. ఈ రెండు నాటకాలలో ఉన్న కన్యాశుల్కం ఇప్పుడు లేదు. కాని, నాటకంగా సాహిత్యంలో నిలదొక్కుకున్నది. అది దురాచారంగా ఇప్పుడు లేకపోవచ్చు. కాని ‘వరవిక్రయం’లా ‘వరశుల్కం’ దురాచారంగా ఇప్పటికీ కొనసాగుతున్నది. ఆ నాటకం చాలా మంచి నాటకం. వరవిక్రయం కూడా మంచి నాటకమే. కాని ‘కన్యాశుల్కం’ నాటకానికి వచ్చినంత పేరు రాలేదు. దీనికి కారణం కేవలం గురజాడ అప్పారావు సాధించి పాటించిన నాటక శిల్పం వల్లనే. ఆ నాటక శిల్పం వల్లనే ఆ నాటకస్థాయి, ఆ సాహిత్య స్థాయీ వచ్చింది. దానికి శాశ్వతం కలిగింది. వంద సంవత్సరాలైనా ఇప్పటికీ సాహత్యంలో శాశ్వతంగా ఉంది. సాహిత్యంలో అట్లా నిలదొక్కుకున్నది, పేరు వచ్చింది. ఆ దురాచారం ఇప్పుడు లేకున్నా ఇవ్వాళటికీ ప్రదర్శింపబడుతున్నది. కేవలం నాటక శిల్పం వల్లనే.

మరి అదే వరవిక్రయం నాటకంలోని వరశుల్కం ఇప్పుడున్నా అంతగా ప్రాచుర్యంలో లేదు. ఈ తేడా ఉండేది కేవలం శిల్పం వల్ల. ఆ వస్తువు ఒక గొప్ప కళగా గొప్ప కళాత్మకమైన సృష్టిగా నిలిచి పోతుంది.

తిక్కన ఏమన్నాడంటే “యేను ఉభయ కావ్యప్రౌఢి పాటించు శిల్పంబునన్ పారగుడన్” అంటే తీరం చేరిన కృతార్థుడిని అన్నాడు. ఏమన్నాడు. “రెండు రకాల కావ్యశిల్పాన్ని పాటిస్తునన్నాడు. ఏమిటా రెండు శిల్పాలు అంటే, ఒకటి దృశ్యకావ్య శిల్పం, రెండోది శ్రవ్యకావ్య శిల్పం. అంటే వినడానికి అందంగానే చెప్పడం, చెప్పేప్పుడు అందంగా చెప్పడం. నా కవిత్వం చదివితే కావ్యంలోని పాత్రలు నీ కళ్ళముందు బొమ్మకత్తాయి. అట్లా చెప్పగలుగుతాడు కవి.

కథ చాలా ఆసక్తి కలిగించేటట్లు చెప్పడం. అట్లా ఆసక్తి కలిగేలా చెప్పడమన్నది శ్రవ్యశిల్పం. వినే శిల్పం. అదేవిధంగా కండ్లకు బొమ్మ కట్టించేటట్లు రాయడం దృశ్యశిల్పం. మీ మనసును రంజింపచేసేటటువంటి శక్తి, విషయమూ నాకు తెలుసు అని తిక్కనగారు భారతాన్ని అనువాదం చేసేప్పుడు అన్నాడు. ఆంధ్రావళి మొదముంబొరయ – తెలుగు మాట్లాడేవాళ్లు ఉన్నంతవరకూ తిక్కన కావ్యశిల్పం నిలిచే ఉంటుంది. అదీ తిక్కన “నేర్చిన భంగి” కావ్యరసముంగాని యాడుచు ఉండే కావ్య శిల్పం.

“ఉభయకావ్య ప్రౌఢిమను..” ఈ రెండింట్లో కూడా ఒక గొప్పదనం ఒక ప్రౌఢిమను, గర్వాన్ని కలిగి ఉన్నాన్నేను అనడం. కాబట్టి ఏది శిల్పం అనేప్పుడు భావుకత ఉండాలన్నా, ఇందాక అన్నట్లు నాటకీయత ఉండాలన్నా, ఆ ప్రతిభ కావాల్సి ఉండాలన్నా ఉత్పత్యభ్యాసాలు, నాటకీయత అనే శిల్పం తెలిసి ఉండాలి. పాశ్చాత్య ఆలంకారికులు చెప్పిన మాటలేమంటే ‘ఇమాజినేషన్’ దేనివల్ల కలుగుతుందనటువంటింది. దాన్ని ఆవిష్కరించడానికి మన దగ్గర ఈ కవితా సామాగ్రి మాత్రమే ఉండాలన్నారు.

వాళ్ళు కొన్ని కొలమానాలు పెట్టారు. అంటే సింబల్స్ ద్వారా చెప్పడం. అట్లానే ఇమేజినరీ, పదచిత్రాల ద్వారా చెప్పటం, పదచిత్రాల ద్వారా ప్రతీకల ద్వారా, రెగ్యులర్ పదాలను ఒకటి మీద ఒకటి చాలా అందమైన భావనీయమైన పదాలను వాడటం ద్వారా కూడా శిల్పాన్ని సాధించడం సాధ్యం అవుతుంది. అటువంటి అవకాశమున్నది.

ఇంకొకటి సిమిలీ. సిమిలీ అనేది ఉపమానం. భారతీయ ఆలంకారికులు చెప్పిన ఉపమాలంకారము. ఉపమ- దాన్ని సిమిలీ అన్నారు సిమిలీ అంటే పోలిక. పోలిక లేకుండా భాష లేదు. పోలిక లేకుండా కవిత్వం లేదు. ఒక అలీగరీ.. రెండు ఇమేజినరీ మూడు జగ్లరీ నాలుగు సిమిలీ ఐదు మెటబాలి. ఈ మాటలు వాళ్ళు చెప్పినపుడు ఆ మాటల యొక్క సారాంశమంతా, సిమిలీ, ఇమేజినరీ ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం. తర్వాత చర్చలో తెలుసుకుందాం, తెలుసుకొనే అవకాశముంది.

అట్లానే మన వాళ్ళే చెప్పినటువంటివి, సాహిత్యంలో ప్రముఖమైనవి కొన్ని చెప్పారు. శిల్పమయంగా శోభించడానికి, కవిత్వం అందంగా ఉండడానికి, కవిత్వమయంగా చెప్పడానికి ఏమేమి ఉండాలో మనవాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. ఐదు లక్షణాలు చెప్పారు. అవి ఏమంటే, ఒకటి క్లుప్తత, అంటే ‘బ్రెవిటీ’గా ఉండాలి. కొందరు చాలా ‘లెంథీ’గా, చాలా పొడుగ్గా రాస్తుంటారు. రాస్తేనేమో విరివిగా రాస్తూనే ఉంటారు. అది 4,5 పేజీలు వరుసగా పోతూనే ఉంటుంది. టైప్ కొట్టి కొట్టి అలసట రావాలి. ఇప్పుడు వాట్సప్ ల్లో రీడ్ మోర్ అని వస్తుంది. టచ్ చేసి చదివాక మళ్ళీ రీడ్ మోర్ వస్తుంది. మళ్ళీ టచ్ చేసి చదవాలి. అట్లా రెండు మూడు ప్రయత్నాలు చేయాలి. అంటే పొడుగ్గా ఉండటం తప్పని కాదు నా ఉద్దేశ్యం. ఎక్కడైతే క్లుప్తత ఉంటుందో అది చాలాకీలకం. బ్రివిటీ అనేది చాలా కీలకం. ఇదే సంక్షిప్తత అనేది. రెండోది క్లుప్తత. అంటే అన్నీ విప్పి చెప్పక్కరలేదు. క్లుప్తత అంటే దాచిచెప్పు. ప్రతిదీ వివరించి చెప్పవద్దు. వివరించి చెప్తే వ్యాసమవుతుంది. సి.నారాయణరెడ్డి గారు “కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ”అని అన్నారు. కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ. గుప్తతతో క్లుప్తంగా చెప్పడమనేది ఒక రహస్యమనేది ఏదో ఒకటి అందులో ఉండాలి. ఎదుటివారిని ఎట్లా ఆకర్షిస్తావు? ప్రతీక ఒకటి వేస్తామనుకోండి. ఈ ప్రతీక ఏమిటి అనేది చదివేవారికి ఆలోచన ఇవ్వాలి. అతనికి ఆలోచనకు కొంత ఆస్కారముంటుంది. అందుకే “ఆలోచనామృతం” అన్నారు సాహిత్యాన్ని, మూడోది ఆప్తత. గుప్తత తర్వాత ఆప్తత. ఆప్తత ఏంటిది? అది దగ్గరతనము. మన హృదయానికి దగ్గరగా ఉండాలి. ఆత్మీయత అన్నాం. ఆత్మీయంగా ఉండేదే ఆప్తత. మనకు చాలా దగ్గరిదై ఉండాలి. మనకు తెలిసిన వస్తువై ఉండాలి. హృదయానికి హత్తుకునేలా ఉండాలి. ఆత్మీయత ఉండాలి. ఆ ముల్లు దీసే అమ్మాయిని ఎందుకు చెక్కాడంటే ముల్లు చాలామందికి విరుగుతుంది. ఆ ముల్లు విరికిన బాధ తెలిసేలా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆప్తత అయ్యింది. ఇంకోటి కీలకమైంది. నాలుగోది వక్రత అన్నారు. సూటిగా చెప్పకూడదు. “నేను నవ్వాను. ఈ లోకం ఏడ్చింది” అన్నాడాయన. నేను నవ్వితే ఈ లోకం ఏడ్చింది. ఆ పాటలో ఏదైతే వక్రత ఉన్నదో అది కొంచెం వంకరగా, కొంచెం శోభాయమానంగా ఉండేటట్లు చెప్పాలి. వక్రత, వంకరగా చెప్పడం అంటే దాన్ని విమర్శించడం కాదు. కొంచెం దాన్ని వేరుగా చెప్పాలి. గుంభనంగా చెప్పాలి. కొంచెం విప్పి చెప్పాలి. ఒకసారి మన కనుబొమ్మలుంటాయి. అన్నీ సూటిగానే ఉండవు. కనుబొమ్మలు ఎప్పుడు అందంగా ఉంటాయి? కొంచెం వంకరగా ఉండి ఉంటేనే అందంగా ఉంటాయి. ముక్కు ఎప్పుడు అందంగా ఉంటుంది? కొంచెం సాఫ్ట్ గా ఉండాలి జారినట్లు ఉండాలి. ఎక్కువగా జారినట్టు ఉన్నా అందంగా ఉండదు. ఎక్కువ జారగూడదు, కొంచెం జారినట్లుండాలి. వక్రత ఉండాల్సిందే. వక్రత ఉంటుంది. కానీ ఎక్కువ వక్రత ఉంటే చెడిపోతుంది. కాని వక్రత లేకపోతే, సరళరేఖలాగా ఉంటే అందంగా ఉండదూ. సరళరేఖ అనేది అందంగా ఉండదు? వంకర ఉండాల్సిందే. మనం బొమ్మ గీయాలన్నా గూడా తప్పనిసరితనం కొంతైనా వక్రం ఉండాలి. కన్నుగీయాలంటే వక్రం ఉండాలి. ముక్కు గీయాలంటే వక్రం ఉండాలి. ఏ బొమ్మ గీయాలన్నా వక్రరేఖలుండాలి తప్పదు. అందుకని ఈ వక్రత అనేది వాడారు. సాహిత్యంలో ఈ వక్రతనే వక్రోక్తి అన్నాడు కుంతకుడు. “వక్రోక్తి కావ్యస్య జీవితం” అని అన్నాడు. కావ్యానికి ఏది జీవనం అంటే ఏది ప్రాణం పోస్తుంది అంటే “వక్రోక్తి జీవనం” అని అన్నాడు. వక్రోక్తి అనేది చాలా కీలకం. ఇది నాలుగవది. ఇక ఐదవది గాఢత. చిక్కదనముండాలి. మన వాళ్ళంటుంటారు. కవిత్వం కొంచెం పలుచగయ్యింది. కొంచెం చిక్కగ ఉంటే బాగుండు అంటుంటారు. ఈ పలుచన చిక్కదనమూ అనేవి చిక్కగెందుకో చెప్పలేం కాని ఇది పలుచగైంది అని చెప్పగలం. ఇది కొంచెం చిక్కగ ఉండే దుండె. ఇంకొంచెం నున్నగ చెక్కాల్సి ఉండె అంటారు.

ఇంకోసారి చెక్కడం, గాఢపరచడం ఇవి కొంచెం శక్తివంతంగా తయారు చేయడం అనే ఈ అంశాలన్నీ మనం తరచుగా చెప్తుంటాం. కాబట్టి అటు భారతీయ ఆలంకారికులు చెప్పినటువంటి మాటలు, ఇటు పాశ్చాత్య విమర్శకులు చెప్పినటువంటి మాటలు క్రోడీకరించికొని చూసినట్లయితే మనం కవిత్వాన్ని కళాత్మకంగా సృష్టి చేసి చూసినపుడు చాలా నైపుణ్యం ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆ చాలా నైపుణ్యం, నిపుణత్వం ప్రదర్శించేప్పుడు జాగ్రత్త వహించాలి. ఆ నిపుణత్వాన్ని దేని ద్వారా సాధిస్తాం, ప్రదర్శిస్తాం అంటే సాధన ద్వారానే. ఇవన్నీ కొలమానాలు. ఇంకొకాయన ఏమన్నాడంటే “వర్డ్స్ ఇన్ బెస్ట్ ఆర్డర్” అన్నాడు. శిల్పం అంటే ఏంటిదంటే “వర్డ్స్ ఇన్ బెస్ట్ ఆర్డర్’ అని అంటే ‘వర్డ్స్ ని అందంగా పేర్చడమే శిల్పం’ అన్నాడు మాటలు అందంగా పేర్చడం, కవితా శిల్పం అంటే వేరే ఏం గాదు. మాటలు మంచి క్రమంలో కూర్చడం పేర్చాలి. వర్డ్స్ ఇన్ బెస్ట్ ఆర్డర్. ఏ పదం తర్వాత ఏది పేరిస్తే అక్కడ అందం ఇనుమడిస్తుందో అది చేర్చాలి అని. మార్చడానికి వీలులేదు. ఇక్కడిదక్కడ అక్కడిదిక్కడ పెట్టడానికి వీలులేదు.

అట్లాంటి మాటే ఇంకోటి ఉంది. “పొసగ ముత్యపు సరుల్ పోహళించిన రీతి ” ముత్యాల పేరులో ఒక ముత్యం తర్వాత ఇంకో ముత్యం ఎట్లయితే పేరుస్తారో, అన్నీ తెల్లటి ముత్యాలే అయితే మన కళ్ళకు ఇంప్రెషన్ కలుగకపోవచ్చు. అంత నచ్చకపోవచ్చు. మళ్ళీ మార్చినపుడు అందంగా ఉండాలి అంటే ఒక మూడు ముత్యాలు గుచ్చి తర్వాత రత్నంవేసి అందంగా దృష్టిని ఆకర్షించాలి. ఇంకొక రంగు రాయి వేయాలి. గ్రుచ్చాలి. రత్నమన్నా వేయాలి. ఒక రాయైనా వేయాల్సి ఉంటుంది. ఒక రత్నమూ, ఒక రంగురాయి వేస్తే ఆ హారానికి విలువొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎవరేస్తరు? ధరించేటువంటి ఆమె ఇష్టం. రెండవది చేసేటటువంటి కళాకారుడి ఇష్టం. మనకు కూడా, ధరించేటువంటి ఆమె అంటే కళాకారుడిలా పాఠకుడిలా అన్నట్టు. పాఠకుల ఇష్టం ఒకటి ఉంటుంది. ఇందులో సృష్టించిన శిల్పం తీర్చిదిద్దడం కనుక శిల్పం తీర్చిదిద్దడం వెనకాల తప్పని ఆనాటి పాఠకుల యొక్క అభిరుచి అనేది ముఖ్యం. అట్లనే ఈ కవి యొక్క అభిరుచి కూడా కీలకమే. అంటే కవి యొక్క అభిరుచీ కీలకంగానే ఉంటుంది. పాఠకుల యొక్క అభిరుచీ కీలకంగానే ఉంటుంది. ఈ రెండింటిని కలిపేటటువంటిది శిల్పము. కాబట్టి ఈ రెండింటిని కలిపేటటువంటి శిల్పమనేది “పొసగ ముత్యపు సరుల్”. ముత్యాల వరుస ఎట్లా పేరిస్తే ఎట్లా ఉంటుందో అట్లా అది తెలుసుకునేటువంటి నైపుణ్యమే శిల్పము. కాబట్టి శిల్పం కీలకమైంది అని భావించాల్సి వస్తుంది. అయితే శిల్పం గురించి మాట్లాడేప్పుడు చాలా విషయాలు చర్చలోకి వస్తాయి గాని, ఆ మాటలలో ఆ శిల్పం ఎందుకు అందంగా ఉంది అని తెలుసుకునే దానికి ఉపయోగపడుతుంది.

“సురకన్య కాబోలు సురకన్య యయ్యెనే యీ రేయి రెప్పలాడించు టేమి”

ఆమె సురకన్యలాగా అందంగా ఉంది అన్నాడు. ‘సురకన్య కాబోలు’ అనే అనుమానం వచ్చింది. ఒక వేళ నిజంగానే సురకన్యే అయితే ఆమె రెప్పలు కొడుతున్నది కదా! మనుషులే రెప్పలు కొద్దరు కదా. దేవతలు రెప్పలు కొట్టరు కదా! అందుకని సురకన్య అని అనుమానమొస్తుంది గాని సురకన్యలు రెప్పలు కొట్టరు గనుక సురకన్యగాదు మానవకన్యనే! మానవకన్యే! !

మానవకన్యనే గాని దేవకన్యలాగా ఉన్నది. అది చెప్పడానికి ఏమన్నాడు ‘సురకన్య కాబోలు సురకన్య అయితే “పుత్తడి………..కాబోలు” బంగారుదే కావచ్చు. ఆమె బంగారుదే అనుకుందామనుకుంటే హంసలా నడుచుకుంటూ పోతున్నది కదా! మరి బంగారం అయితే నడవదు కదా! బంగారం నడువనపుడు దాన్ని.. మరి హంసలాగా నడుచుకుంటూ పోతున్నది కదా! అంటే ఆమె బంగారంలా ఉన్న మానవకన్య. దేవకన్యలాగా ఉన్న మానవకన్య. రెప్పలు కొడ్తుంది కనుక. రెప్పలు కొడుతుంది గనుక, హంసవలె నడుస్తుంది గనుక ఆమె అందమైంది అని – ఇట్లా విప్పి చాలా అందంగా చెప్పేటు వంటి పద్ధతి “సురకన్య కాకపోతే” ఒక్కటే అనుకుందామంటే, “హంసగతుల నడయాడే” హంసలాగా నడుచుకుంటూ బోతుంది గనుక అని చెప్పే ఈ వ్యక్తీకరణ ఈ ఎక్స్ ప్రెషన్ ఏదైతే ఉన్నదో అది కవిత్వీకరణంపై ఉంటుంది. మనసాకర్షించేలా ఉంటుంది అని.

అదే వచన కవిత్వంలోకి వస్తే, మీరుగూడా వినే ఉంటారు ఇది. దాసరాజు రామారావు రాసిన కవిత నేను మీ ముందు ఉంచుతున్నాను. శిల్పానికి ఉదాహరణగా చెప్తాను. “అయ్య చేతిలో అమ్మాయిని పెట్టినపుడు చేతులతో బాటు మనసూ వణికింది” కూతురు పెళ్ళి చేసాడు. సాగనంపు తున్నాడు, సాగనంపేటప్పుడు కవి రాస్తున్నాడు “అయ్య చేతిలో అమ్మాయిని పెట్టినప్పుడు చేతులతో బాటు మనసూ వణికింది” అంటాడు. చేతులు వణికేది అందరికీ తెలుసు. కాని మనసు వణికేది! ఇదే కవిత్వం. ఇదే కవిత్వానికి సంబంధించిన శిల్పం. “చేతులతో బాటు మనసు వణికింది” అంటే చేతులు వణకటం అందరం చూస్తాం గాని ఇప్పుడు తెలిసింది మనసూ వణుకుతుందని. తర్వాత ఏమవుతుందో అమ్మాయి జీవితం ఎలా గడుస్తుందో అని  చేతులూ వణుకుతాయి. కానీ చేతులతో బాటు మనసూ వణికింది. ఇక్కడ ఈ అంశం మన మనసును ఆకర్షిస్తుంది. అరుంధతీ నక్షత్రం చూపించినప్పుడు, “అరుంధతీ నక్షత్రం చూపించి, అమెరికాకు రమ్మంటున్నం” అంటాడు. ఇక్కడ అరుంధతీ నక్షత్రం చూపించడం అనేది ఒక ఆకర్షణీయమైన విషయం. పెళ్ళిల్లో అదొక తంతు. అరుంధతీ నక్షత్రం చూపెట్టడం, అట్లా చూపించినప్పుడు. ఇప్పుడేమంటున్నాడంటే ఇక్కడ గాదు చూపేది, అరుంధతీ నక్షత్రం ఇక్కడ లేదు అమెరికాల ఉన్నదని అనడం అని చెప్పడం అనేది శిల్పం. కనిపెంచిన ఋణం తీర్చుకొని అమ్మాయి వెళ్తుంది అనేది బలాన్ని చేకూర్చేటటువంటిది. ఋణాలను తీర్చుకోవచ్చు ప్రేమలను తీర్చుకోవటమెలా? చూడండి ఇక్కడ, ప్రేమ పెంచుకోవచ్చు. ఋణం దీర్చటడం, ప్రేమను ప్రేమతోనే తీర్చగలది. ప్రేమలను తెంచుకోవటం రెండూ ఎట్లా చెప్తున్నాడో చూడండి ఇక్కడ, ఋణాలనైతే తీర్చుకోవచ్చు గాని, అప్పుకు తిరిగి కట్టడమనేది ఉంటుంది. కానీ ప్రేమకు? అప్పు దీర్చుకోవచ్చు కానీ పెంచిన ప్రేమ మనం తీర్చుకోలేము. ప్రేమను ప్రేమతో తప్ప తీర్చుకోలేము. అది తీర్చుకోవడమనేది ఉండదు. అందుకని అప్పుకు తీర్చుకోవడమనేది ఉంటుంది కాని, ప్రేమకు తీర్చుకోవడం ఏముంటుంది? అని ఋణాలనైతే తీర్చుకోగలం గాని, ప్రేమలను తీర్చుకోవడం ఉంటుందా? అంటూ ఇది ఇట్లా ఒక భావశబలత, భావుకతతో చూపుతూ ఆ సన్నివేశాన్ని, పోతున్నటువంటి సన్నివేశాన్ని రూపుగట్టేటువంటిదిగా, మనసు చెదిరేటువంటి విషయంగా, మనసు కల్లోలమయ్యేట్టుగా, మనసు ఆలోచనల్లో పడేట్లుగా రాయడమన్నదే శిల్పం. అట్లగాకుంటే అది కృత్రిమ కవిత్వం అవుతుంది. అది శిల్పంగాదు అని. అట్లా మనసుకు పట్టుకునేట్టుగా చెప్పడమనేదే శిల్పం.

అందుకని ఈ శిల్పం అనేదానిని మనం సులువుగా అర్థం చేసుకునేటప్పుడు, ఆర్ట్ ఆఫ్ పోయెట్రీ, కవిత్వ కళ, ఇది క్రాఫ్ట్ ఆఫ్ పోయెట్రీ కవిత్వం రాసేటువంటి కళ. రచనా నైపుణ్యం, ప్రాక్టీస్ ఆఫ్ పోయెట్రీ ఈ మూడు మాటలు

వాడుకలో ఉన్నాయి. 1. ఆర్ట్ ఆఫ్ పోయెట్రీ, 2. క్రాఫ్ట్ ఆఫ్ పోయెట్రీ, 3. ప్రాక్టీస్ ఆఫ్ పోయెట్రీ. కవిత్వ అభ్యాసము. ఇది దేనివల్ల వస్తుంది? దీనికి భావుకత ఉండాలి. అంతకుముందనుకున్నట్లుగానే భావుకతను ఆవిష్కరించడానికి ప్రతిభ కావాలి. ప్రతిభ ఉన్నంత మాత్రాన సరిపోదు. ప్రతిభ ఉంటుంది, కానీ పని తనకు  ఉండదు. అభ్యాసమనేది ఉండాలి. అలాంటి వాళ్ళు కూడా కవిగా నిలబడలేరు. ఆయనలో మంచి ప్రతిభ ఉంది అంటాం. ప్రతిభ వున్నా, మంచి ప్రతిభావంతుడైనా గాని ఆయన దురలవాట్లకు లోనయ్యాడు అంటాం. అప్పుడెట్లా ఉంటుంది? మంచి ప్రతిభావంతుడే, పాటలు మంచి ప్రతిభావంతంగా రాస్తాడు. రాస్తే బాగా రాస్తాడు కాని రాయడు, బాగానే రాస్తడు దానివల్ల ఏదీ ప్రయోజనముండదు. ఇది గూడా చాలా కీలకమైన విషయం. రాయగలడు కానీ రాయడు. దానివల్ల ఏమి ఉపయోగం? ఉపయోగం ఉండదు. అందుకే, దీన్నే ప్రాక్టీస్ ఆఫ్ పోయెట్రీ అంటారు. కవిత్వాన్ని నిత్యం అభ్యసించాలి. ఎందుకూ అంటే ఇది లై లాంగ్ క్రాఫ్ట్. జీవితాంతం అభ్యసించాల్సినటువంటి ఒక పనితనం, ఒక కళ. కాబట్టి దీనికి ఒకసారికి అయిపోవడమనేది ఉండదు. ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు చదవాలి. ఇది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి | ఎప్పటికప్పుడు అన్వయిస్తూ అభ్యసించాలి, రాయాలి. అధ్యయనం, అభ్యాసం ఈ రెండిటితో పాటు కూడ అన్వయం కూడా చేయాలి. అంటే మనం నేర్చుకున్నదంతా కూడా మన రచనలో శిల్పానికి అన్వయించుకొని, కొత్త కొత్త శిల్పాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని కవిత్వానికి సంబంధించి శిల్పాన్ని మెరుగు పరుచుకొని అభ్యాసం చేయాల్సిన అవసరమూ ఉంటుంది.

ఈ శిల్పాన్ని ఒనగూర్చుకోవడానికి ఇంకా ఎక్కడెక్కడ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది, ఎక్కడెక్కడి నుండి

మనం సేకరించుకోవాల్సి ఉంటుంది అన్నది ప్రతిభ కావచ్చు, జ్ఞానంగావచ్చు లేదా అనుభవం కావచ్చు. నైపుణ్యం గావచ్చు, మెళకువలు గావచ్చు. మనం తప్పకుండా జానపద సాహిత్యం తెలుసుకోవాలి. జానపద సాహిత్యంలో కూడా చాలా గొప్పనైనటువంటి మాటలు, ఆ మాటల్లో ఉండే శిల్పాన్ని మనం, చాలావరకు మనకు జానపద సాహిత్యమనగానే చాలా తక్కువ అభిప్రాయముండొచ్చు. కానీ దాంట్లో కూడా అద్భుతమైనటువంటి భావుకత ఉన్నది. సృజనాత్మకత ఉన్నది. ఒక పాట… నాకు చాలా ఇష్టమైనటువంటి పాట జానపద గేయం “పొడుస్తున్న భానుడు, పొన్నపువ్వు ఛాయ, పొన్నపువ్వు మీద, పొగడపు ఛాయ” – పొడుస్తున్న సూర్యుడు ఎట్లా ఉన్నాడంటే చూడండి. ఇక్కడ, పొన్న పువ్వు ఛాయ అన్నాడు. పొన్నపువ్వు ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. పొన్నపువ్వు ఛాయ. ఆ పొన్న పువ్వూ మీద పొగడ పూవూ ఛాయ. పొన్నపువ్వు మీద పొగడపువ్వు ఛాయ నీడ గనక బడితే ఎట్లా ఉంటుందో అట్లా సూర్యుడు అందంగా ఉన్నాడు

అని వర్ణించుకుంటూ పోతాడు. “ఉదయ సూర్యఛాయ ఉల్లిపొర ఛాయ. ఉల్లిపొర రంగు మీద బీరపువ్వు పొడి చాయ” అని పూల సొగసులతో వరుసగా చెప్తూ పోతాడు. “గుడి యెక్కి బాలుడు, గడి యెక్కి బాలుడు”. “కంబపువ్వూ ఛాయ, కంబ పువ్వు మీద కాకరపూవు ఛాయ”. గడి యెక్కి భానుడు అంటే బాల భానుడు. గుడి యెక్కి భానుడు కనబడుతున్నాడు. గడి మీద కనబడుతున్నాడు. ఎట్లున్నాడు అంటే కంబపువ్వూ ఛాయ. ఆ కంబపువ్వు మీద తాటాకు ఛాయ. ఇక్కడ ఎట్లున్నాడంటే, ఇక్కడ రూపకాలంకారమున్నది, శబ్దాలంకారమూ ఉన్నది. శబ్దాలంకారంతో బాటు అర్థాలంకారమూ ఉన్నది. అది ఆయన సాధించినటువంటి అలంకారాలు. ఆ జానపద గేయంలో ప్రతీకలు. అట్లా ఒక శిల్పాన్ని ఉచ్ఛారణ చేయడమనేది ప్రత్యేకం. ఈ పాట – మన బాలమురళీకృష్ణ పాడినటువంటి పాట. ఒక గీతంలో “గంగ ఉదకముతెచ్చి, నీకు లింగపూజను చేతమంటే” భక్తికి సంబంధించింది అనుకోవద్దు, కవిత్వానికి సంబంధించింది. గంగ ఉదకము తెచ్చినీకు లింగపూజను చేతమంటే “గంగ నుంచి నీరు తెచ్చి లింగాన్ని కడిగి పూజ చేద్దామని అనుకుంటే, “గంగలోని చేప, కప్ప ఎంగిలంటున్నాయి లింగా” ఈ ఊహ ఎట్లా వచ్చిందో చూడండి. నేను గంగలోనుండి నీళ్ళు తెచ్చి నిన్ను కడుగుదామనుకున్నాను. కాని, ఓ శివుడా!, ఓ లింగా! ఆ గంగలో ఉండే మేము ఇంతకుముందే ఈ నీళ్ళు తాగి ఉన్నాం కదా. ఈ ఎంగిలి నీళ్ళతోని ఎట్లా లింగాన్ని కడుగుతావని? చేప, కప్పలు నన్ను వెక్కిరిస్తున్నాయి అన్నాడు. ఎంత ఊహ కావాలి దీనికి? గంగ పవిత్ర జలమంటారు. గంగలో ఉన్న చేప, కప్ప ఎంగిలంటున్నాయి లింగా అని. అంటే గంగనీళ్ళు తెచ్చి పూజ చేయడమనేది. గంగ నీరు చాలా పవిత్రమంటున్నం కాని ఇక్కడ అవి ఎంగిలి చేసినామంటున్నవి. గంగ నీళ్ళు కూడా ఎంగిలి నీళ్ళు అన్నాడు. ఎందుకు ఎంగిలి నీరయ్యాయి అంటే దాంట్లో ఉన్న చేప, కప్ప ఇలాంటి వాటివల్ల అని అర్థం.

ఇక కావ్యశిల్పం గురించి చెప్పుకుంటే, పోతన గారి పద్యాలలో ఒకటి మచ్చుకు

రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై,

శ్రవణాలంకృతియై, గళాభరణమై, సౌవర్ణ కేయూరమై,

ఛవిమత్కంకణమై, కటి స్థలి నుదచదంటయై, నూపుర

ప్రవరంబై, పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్ !

బలి చక్రవర్తి దగ్గరికి వటుని రూపంలో విష్ణువు, వామనుడుగా వచ్చిన సందర్భంలోని ఈ పద్యంలోని శిల్పాన్ని గమనిద్దాం. సూర్యుడు పైన ఉన్నపుడు నెత్తిన గొడుగులాగా ఉన్నదీ, తర్వాత కొంచెం క్రిందికి వచ్చాక ‘శిరోరత్నం’లాగా అది తర్వాత క్రిందికి అట్లా తగ్గడం సువర్ణ కేయూరాభరణం లాగా అవడం అంటే ఒక వస్తువును స్థిరంగా ఉంచి, దానికి సంబంధించిన వాటితో ఎదుగుతున్న క్రమాన్ని పోలికలతో చెప్పడమన్నమాట. ఈ దృశ్యీకరణలో సూర్యబింబం చిన్నగెట్లయ్యిందంటే ముందు ఈ వామనుని మీద ఛత్రీలాగా ఉండేవాడు సూర్యుడు. ఆ తరువాత చెవికుండేటువంటి ఆభరణంలాగా అయ్యాడు సూర్యుడు. అంటే వామనుడు పెరుగుతున్నాడు సూర్యుడు క్రిందికి వస్తున్నాడు. ప్రకాశించే కంకణం లాగా, కాలి అందె లాగా అయ్యాడు. అంటే ఇక్కడ ఒక నగలాగా అయ్యిండు.

అట్లా చిన్నగా అయ్యి ఎట్లా అయ్యిండన్నాడంటే పాదం లాగా అయ్యాడు. పాదాలను అలంకరించి నటువంటి గీతలాగా అయ్యాడు. అంటే మొదట ఛత్రి దగ్గర మొదలుబెట్టి పైన గొడుగులాగ ఉన్నది అంటాడు, క్రింద అదే సూర్యుడు పాదాల దగ్గర, పీఠంగా చేరిండు అని, క్రమాలంకారం వేసినాడు. క్రమాలంకారంతో ఉన్న చాలా మంచి పద్యం ఇది. అట్లా ఆ అలంకారాల గమనిక అటు పద్యసాహిత్యంలో ఉన్నది, ఇటు జానపదంలోనూ ఉన్నది.

ఇలా పోలికల ఆధారంగా చెప్పేటువంటి, ప్రతీకల ఆధారంగా చెప్పేటు వంటి శిల్పం ఏదైతే ఉందో ఆ శిల్పం కోసం మనం కొంచెం, కొన్ని వస్తువులను వరుసగా ఎన్నుకున్నం. ఇప్పుడు మాత్రం వాటికి సంబంధించినటువంటి అంశాలను మనం చూసుకున్నట్లయితే ఏమిటిది? మనకు కావలిసింది ఇదీ అని మనం అనుకున్నప్పుడు ఈ భావుకతనావిష్కరించడానికి, లేదా శిల్పాన్నావిష్కరించడానికి మనకుండాల్సింది కవితా సామాగ్రి అని అనుకున్నాం. దాంట్లో ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసమని మూడింటిని చెప్పుకున్నాం. కాని అసలైతే ఏ కవిత్వమైతే రావాలో దాని కవితా వస్తువు ఏదైతే ఉన్నదో దానికి కావలసిన మొట్టమొదటి పరికరం భాష. మనకు దేనిమీద అనుభవం గావాలి, దేనిమీద అభ్యాసం గావాలి అంటే మొదట భాష మీద కావాలి. దేనితోని భావాన్ని ప్రకటిస్తావు నీవు అంటే, ఒక శిల్పాన్ని నువ్వు ఎక్స్ ప్రెస్ చెయ్యాలి అంటే వ్యక్తీకరించాలి అంటే నువ్వు దేనితోని వ్యక్తీకరిస్తావు అంటే భాషతోని. భాష చాలా కీలకం. భాష లేకుంటే ఏం చేయలేం. అంటే భాష తప్పనిసరి వచ్చి ఉండాలి. భాషలో ఏమున్నది అంటే భాషలో పదజాలం ఉన్నది. మాటలు బాగా తెలిసి ఉంటే రాస్తావు. ఒక్కోసారి మనకు మంచిమాట దొరుకుత లేదంటాం. మంచిమాట దొరకలేదంటే మనకు పదజాలం లేదు. అందుకే పదం అక్కడ వస్తలేదన్నట్టు. అందుకనే పదజాలం బాగా తెలుసుండాలి. విస్తృతంగా చదవాలి. నీకు కరెక్ట్ వర్డ్ రావాలి అంటే, ఇందాక కవిత్వానికి శీర్షిక చెప్పేప్పుడు Best words in Best Order. మంచి మాటను, మంచి క్రమంలో అలంకరించడమే కవిత్వం అన్నారు. అందుకని ఈ మంచిమాటను రాయాలంటే విస్తృతంగా తెలిసి ఉండాలి. ఏయే పువ్వు ఏఏ ఋతువులో పూస్తుంది. ఏ ఏ పూవురంగు ఏంటిది. ఏయే పూవులను ఏరుకుంటావు, ఏయే మాటల పూవులను ఏరుకుంటావు. అసలు నీ దగ్గర పూవే లేకుంటే, ఉన్నదొకటే పూవైతే? ఏరుకోవడానికి ఎట్ల వీలవుతుంది. అట్లే మాటలు, నీ దగ్గర మంచి మాటలు చాలా లేకుంటే ఎట్లా? పూలగంపలాగా మాటల గంప కావాలి. ఆ మాటలన్నీ ఒకచోట చేర్చగలిగే నేర్పు కావాలి. అట్లాగే, అందులో ఏం గావాలి అంటే పలుకుబడులు కావాలి. ఈ పలుకుబడులు కూడా చాలా కీలకమైనవి. పలుకుబడులు వెంటనే చాలా ఆకర్షిస్తాయి. ఇవి సంస్కృతిని చెప్పేవి. ఒక జాతి యొక్క జీవితాన్ని చెప్పేవి పలుకుబడులు. కనుక ఈ పలుకుబడులను తరచుగా కవిత్వంలో వాడటం వలన, నుడికారం వాడటం ద్వారా మీకు ఒక జీవం వచ్చేటటువంటి అవకాశమున్నది. ప్రాణం వచ్చే అవకాశముంది. ఒక బలం చేకూరేటువంటి అవకాశం ఉన్నది. అట్లాగే ఇవన్నీ కలిసినప్పుడు ఇంకొకమాట వాడుతుంటాం. మనం కవిత్వంలో సాధారణంగా శైలి ఉండాలి అని. ఈ శైలి అనేది కూడా తర్వాత చెప్పుకుందాం. ఈ పదగుంఫనలు, ఈ భాష ఇవి ఉపయోగించేటువంటి పద్ధతి, శైలి కవికి ఉండాలి. శైలి ఎలా ఉండాలి? ఈ భాష, పలుకుబడులు పదజాలం వల్ల ఈ శైలి ఉండాలి. శైలి తర్వాత ఉండాల్సింది అలంకారాలు. చాలా అలంకారాలున్నాయి. ఆలంకారికులు చెప్పినదాని ప్రకారం శబ్దాలంకారాలున్నాయి, అర్థాలంకారాలున్నాయి.

మనం తరువాత అలంకారాల గురించి చెప్పుకుందాం. అలంకారాల మీద కూడా మాట్లాడుకుందాం. అలంకారమంటే భాషను అలంకరించడం. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలతో భాషకు కూడా అలంకారాలవసరం

ఉంది. అలంకారాలున్నప్పుడే భాష అందంగా కనిపిస్తుంది. అవి ఎన్ని రకాల అలంకారాలున్నవి అనేది మరోసారి తెలుసుకుందాం. కవిత్వ సామాగ్రిలో ఇంకొక పనిముట్టు ఏంటంటే పదచిత్రాలు.

కవిత్వంలో అలంకారాలతో పాటు చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్ర పోషించే పదచిత్రాలు, భావ చిత్రాలు చాలా కీలకం. అట్లనే ఇంకొకటి శిల్పమయం కావడానికి కవిత్వ శిల్పం చెక్కటానికి కావలసినవి ప్రతీకలు. ప్రతీక అంటే SYMBOL. అవి కూడా అవసరం.

అట్లనే ఇవన్నీ చర్చలు చేస్తున్నాం. ఇవన్నీ ఉంటేనే అది మంచి కవిత్వమవుతుంది అంటున్నాం. ఈ ఎంపిక చేసుకొని రాసి రక్తి కట్టిస్తాం అనేప్పుడు, రక్తి కట్టించడం అనేది కీలకం. అది రసాత్మకంగా ఉండాలి. ఇందులో ఏదివాడితే రక్తి కడుతుంది? అవతలివారిని ఆకట్టుకోవడం జరుగుతుంది? ఎదుటివ్యక్తి హృదయాన్ని ఆకట్టుకోవడానికి?

ఎదుటి వ్యక్తి హృదయాన్ని ఆకట్టుకోవడం. దీనికి ఒకటి ధ్వని అయితే ఇంకోటి రసం. అలాగే “వాక్యం రసాత్మకం కావ్యం” అన్నారు. కావ్యం అంటే ఏమిటి? అంటే రసాత్మకమైన వాక్యం కావ్యానికి కావాలని. రసాత్మకంగా ఎట్లా చేయాలి అని తెలుసుకోవాలి. అందుకే రసం అనేది రససిద్ధాంతం అనేది ప్రవేశపెట్టారు. ఆ రసమనేది వచ్చింది. కాబట్టి ఒక శిల్పం వెనుక కరెక్ట్ గా ఆకట్టుకోవడానికి పనిముట్లను చాలానే వేసారు. ఇవన్నీ చుట్టూ ఉన్నవే  ఏరుకొని వేసేటువంటి ఈ నైపుణ్యం ఉండాలి. ఆకట్టుకునేలా రాయడం : అది శిల్పం. ఆకట్టుకోవడానికి ఈ పనిముట్లు, ఈ వస్తువులు ఇవన్నీ కావాలి. ఈ పనిముట్లలో ఏది ఉపయోగిస్తావు? ఎట్లా ఉపయోగిస్తావు? ఏది వాడతావు? దేనిద్వారా హృదయాన్ని ఆకట్టుకుంటావు అనేది అటు పాఠకుడు ఇటు నీవు ఇద్దరూ కలిసి నిర్ధారణ చేసుకోవాలి. శిల్పాన్ని మరింత మెరుగు పెట్టుకోవడం అవసరం. అప్పుడే కవిత్వం కవిత్వస్థాయికి చేరుతుంది. ఒక వస్తువు కవిత్వ శిల్పానికి చేర్చాలంటే శిల్పం, శైలి అవసరం.

ఒక మామూలు వస్తువు. దానికి రూపం తప్పకుండా ఉంటుంది. ఆ రూపాన్ని మెరుగు పరచడమన్నది శిల్పం. రూపానికి వన్నె బెట్టడమన్నది. వన్నెబెట్టటమంటే మెరుపు ఎట్లా వస్తుంది? సాన బట్టాలి, వన్నె బెట్టాలి. సరిగ్గా ఒక నగ చేసేప్పుడు ఒక స్వర్ణకారుడు ఎట్లాగైతే వన్నె తేవడానికి, ఎక్కడ ఎంత జాగ్రత్తగా చెక్కుతాడో అంత జాగ్రత్తగా పనితనంతో చెక్కుతాడు. అప్పుడే ఆ నగకు వన్నె వస్తుంది. ఆ పనితనమే శిల్పం. కాబట్టి రూపానికి వన్నె వచ్చేంతదాకా అతడు ఎట్లా శ్రమ చేస్తాడో అట్లా మీరు కవిత్వ శిల్పం బాగా వచ్చేవరకు ప్రయత్నించాలి. రంగు వేస్తాడా? అక్కడ గీత గీస్తాడా? చుక్క పెడతాడా? రాయిని చేరుస్తాడా? ముత్యం అద్దుతాడా? అనేది ఎట్లా కీలకమో అట్లా అది మీ ఇష్టం. కాబట్టి ఏమి పెడితే అక్కడ శిల్పం బాగుంటుందో తెలిసిపోయేదే భావుకత. భావుకత దగ్గరికే మళ్ళీ వస్తే ఏది బెడితే అందంగా ఉంటుందో అది పెట్టే నైపుణ్యం ఉండాలి. అది ప్రతి కళాకారుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. భావుకత ద్వారా శిల్పం అనేది సాధ్యం. ఇట్ల చేస్తే అట్లు బాగుంటుందన్న ఒక ఊహ రావాలి. భావుకతకు వన్నె కూర్చడం అనేది కూడుకుని ఉంటుందని తెలియాలి. భావుకతకు శిల్పం ఉంటే రాణించి మరింతగా పరిఢవిల్లే అవకాశం ఉంటుంది. చిక్కని కవిత్వం వచ్చే అవకాశం ఉన్నది. “ఔనౌను శిల్పమనర్ఘం” అన్నాడు శ్రీశ్రీ. శిల్పం చాలా గొప్పది అని అన్నాడు. వస్తువును గురించి గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు వస్తువు ఎంత గొప్పదో ఔనౌను శిల్ప మనర్ఘం అనేలా వస్తువు కొనియాడబడిందో తెలుస్తుంది. ఈ శిల్పం వల్లనే ఒక తిలక్ నిలబడ గలిగాడు. ఈ శిల్పం వల్లనే ఒక బైరాగి నిలబడ్డాడు, ఈ శిల్పం వల్లనే పోతన కవిత్వం చదువుతాం. ఆ శిల్పం వల్లనే ఒక ‘మహాస్వప్నం’ చదువుతాం. ఈ శిల్పం వల్లనే ఒక శివ సాగర్ ను చదువుకున్నాం. అట్లా జాషువాను మీరంతా ఇష్టపడటం వెనకాలా ఆ శిల్పమే దాగున్నది. అయితే వస్తువు ఆకర్షించలేదా అంటే, వస్తువుకు శిల్పం జత కూడినప్పుడే కవిత్వం నిలుస్తుంది. వస్తువుకు శిల్పం గనుక జత కూడకపోతే వస్తువు పేవలమవుతుంది.

సమాజాన్ని కొత్తపుంతలు తొక్కించిన ఒక మాట, ఒక వస్తువు ఎంత గొప్పదైనప్పటికీ శిల్పం లేనిదే రాణించదు. శిల్పం ఎంత గొప్పగా ఉన్నా వస్తువు ప్రజలకు సంబంధించింది కాకుంటే రాణించదు. ప్రజా ప్రయోజనమైనటువంటి వస్తువు శిల్పం లేకపోతే రాణించదు. చాలా అద్భుతమైన కవిత వస్తుంది. కాని అద్భుతమైన పనితనంతో ఉండే శిల్పం లేకుంటే అది రాణించదు. శిల్పం తెలిసీ, భావుకత ఉన్న రచయిత గూడా మంచి వస్తువును ఎన్నుకోకపోతే ఆ శిల్పమూ రాణించదు. వెనకటి నుండి మనకొక మాట ఉన్నది. “మన బంగారం మంచిదైతే మందినెందుకంటం” అని మన బంగారం మంచిది కావాలి. నగ బాగుండాలంటే మన బంగారం కూడా మంచిదయి ఉండాలి. ఒరిజినల్, దాన్నేమంటారు, చొక్కం బంగారం కావాలి. 24 కారెట్ల బంగారం గావాలి. కనుక వస్తువూ చొక్కం బంగారం కావాలి. వస్తువును నగ చేసే శిల్పకారుడు కూడా మంచి భావుకత కలిగి ఉండాలి. అదే సమయంలో అతని అభిరుచికి తగిన విధంగా నగ చేయించుకునేవారూ గావాలి. అంటే మంచి పాఠకులూ కావాలి. అంటే పాఠకుల అభిరుచి, కవి అభిరుచి, సామాజిక అభిరుచి కూడా మంచిగా ఉన్నప్పుడు, కలిసినప్పుడు మాత్రమే శిల్పం కూడా ఎక్కువగా ప్రకాశిస్తుంది. ఈ శిల్పాన్ని మనమందరం కూడా మెరుగు బెట్టుకుందాం. శిల్పాన్ని నిలుపుకునేటువంటి పనిలో మనమెంత కృషి చేస్తే అంత మంచిగా రాణిస్తుంది. ఆ కవిత్వానికి మంచి గుర్తింపు వస్తుంది. ఆ కవిత్వానికి ప్రాణం వస్తుంది. నలుగురి నాలుకలపై కలకాలం నడయాడే శక్తి వస్తుంది. ఇది శిల్పం వల్లనే వస్తుంది.

xxxxxxx

కాబట్టి శిల్ప ప్రాధాన్యతను గుర్తించి మన కవిత్వం కూడా సార్వకాలికంగా, సామాజికంగా ఉండేలా రాయాల్సి ఉంటుంది. వస్తువు అవసరాన్ని గురించి మనం శిల్పం అవసరాన్ని మెరుగు పరిచి రాయాలి. మన కవిత్వం కూడా సార్వకాలీనమైనదై ఉంటే శాశ్వతత్వాన్ని ఆపాదించుకొని నిలిచిపోతుంది. కాబట్టి మన కవులందరూ మంచి శిల్పంతో గొప్ప కవిత్వాన్ని సృష్టించాలని ఆశిస్తున్నాను.

 

You may also like

2 comments

Dr.Darla VenkateswaraRao November 17, 2021 - 2:23 am

ఇదొక మంచి ప్రయత్నం. ప్రసంగాన్ని రాయడం అంత సులువు కాదు.కానీ, మీరు దానిలో సక్సెస్ అయ్యారు. అన్ని వ్యాసాలు వచ్చాక, వాటిని ఎడిట్ చేసి పుస్తకంగా తీసుకొస్తే ఎంతో ఉపయోగకరం. మళ్ళీ మా డా.సిధారెడ్డిగార్ని చదవగలిగే అవకాశం లభించింది. శుభాకాంక్షలు, ధన్యవాదాలు…*ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు*, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్

Reply
ముహమ్మద్ అబ్దుర్రషీద్ రచయిత అనువాదకుడు కవి హైదరాబాద్ November 17, 2021 - 2:28 am

ముందుగామయూఖ కు శుభాభినందనలు ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు నిద్ర లేవగానే నన్ను mayookha పలకరించింది అది పలకరింపు కాదు అది నందిని సిద్ధారెడ్డి గారి శిల్పం గత నలభై సంవత్సరాల నుండి శిల్పాన్ని తెలుసుకోవాలనే ఆరాటం ఉండేది కానీ ఎవరిని అడగాలి ఎవరు చెబుతారు ఎంత చెబుతారు అనే సంశయం వల్ల నేను ఎవరిని అడగలేక పోయాను ఈనాడు మయూఖ అడగకుండానే శిల్పాన్ని నా ముందు పెట్టింది కాదు కాదు పెట్టించింది ఎవరి ద్వారా పెట్టించింది ఒక మహా మహా పండితుని ద్వారా పెట్టించింది అంత సుదీర్ఘమైన శిల్పం గురించి ఆ పండితుడు చెబుతూ ఉంటే నేనుచదువుతూ ఉంటే ఎంత ఆసక్తి కలిగించిందంటే విసుగు పుట్టలేనంతగా ఉత్సాహాన్ని కలిగించింది కుతూహలాన్ని కలిగించింది శిల్పం అనేదాన్ని అంతగా విడమర్చి చెప్పడం వల్ల అంతగా ఆసక్తి తో చదవడం వల్ల తెలుసుకోవాలనే జిజ్ఞాసతో చదవడం వల్ల ఎంతో మధురానుభూతి కలిగింది. అసలు విషయం ఏమిటంటే శిల్పం అర్థమైంది నేను మయూఖను చదువుతున్నాను కానీ నా ముందునిలబడి గౌరవనీయులైన సిద్ధారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నట్లుగా భావన కలిగింది ఆయన గారి మాటలశబ్దాలు నా చెవుల ద్వారా హృదయంలో కిచొచ్చుకు పోయాయి నిజంగా ఆయన ఎదురుగా ఉంటే పాదాభివందనాలు చేయాలనిపించింది శిల్పం గురించి తెలుసుకోవాలనే నా నాలుగు శతాబ్దాల దాహాన్ని మయూఖ తీర్చింది ఆ శిల్పం అనే నీటిని గ్లాసులో నింపి నా నోటికి అందించిన పెద్దలు సిద్ధారెడ్డి గారికి పాదాభివందనాలు

Reply

Leave a Comment