Home కవితలు మా పంతులు

మా పంతులు

సిగరెట్టు త్రాగే బలహీనత ఉండేదేమో
త్రాగుచుండగ మా కంటపడలేదెన్నడు.

మాకు తెలియకూడదని చివరిదినం నాడు
రెండవ ఆటకు సినిమాకు పోయెవాడట.

మాలో ఒకరి వలె దైవ భక్తి ఉండెనో లేదో
నుదుటి పై విభూతి లేకుండ ఉండకుండె.

మధ్యాహ్నం ఓపిక ఉన్నా లేకున్న తప్పక
కాళ్ళు చేతులు ముఖం కడిగే తినేవాడు.

ఇంటిలో ఒక్క పనియైనా చేసేవాడో కాదో
బడిలో తిన్నాక బాక్స్ ను కడుక్కునేవాడు.

మద్యం సేవించే వాడో కాదో ఏ ఒక్కరును
మా పంతులు త్రాగునని అనగా వినలేదు.

మేము హోంవర్క్ సక్రమముగ చేయకుంటె
ఇళ్ళకు వచ్చి పెద్దలను చేయించమనేవాడు.

మా సోమరితనం వలన పై అధికారి నుండి
మాటపడిన మా ముందు అబద్దమాడలేదు.

మా అల్లరికి విసిగి ఒక్కోసారి ఆయన చేసిన
బడితెపూజ మేం మరచినను, బాధపడేవాడు.

బడిలో తనకొడుకు మాలాంటి విద్యార్థియే
ప్రత్యేకహోదా లేదు; అర్హత బట్టే మార్కులు.

మా పంతులు ముందు మేము విద్యార్థులమే
కాని విద్యార్థి మరియు విద్యార్థినిలము కాము.

మా యూనిఫామ్ స్టిచ్చింగ్ లో తేడా ఉండేదేమో
మా పంతులు చేయించే డ్రిల్ లో ఉండేదికాదు.

పద్యాల ఎక్కాల లో వారి కఠిన శిక్షణలో నేడు
మా ల్యాబ్ టాప్ తప్పినా మేం తప్పడములేదు.

వల్లెవేయించే వారి అసమాన ఓర్పుతో నేడు
స్పెల్లింగ్స్, అల్ప, మహాప్రాణాలలో దిట్టలం.

టైప్డ్ ‘ఒ’ మరియు ‘బ’లను గుర్తుపట్టలేరేమో
వారు దిద్దించినందున మేము వ్రాస్తె పొరబడరు.

You may also like

Leave a Comment