ఆనందమంటే
తారల్లా దూరతీరాల్లో ఉన్న మిత్రుడు
తళుక్కుమని చెంతన మెరవడం
రెండుమనసులు ముఖాముఖవ్వడం
కష్టసుఖాల కరచాలనమవ్వడం
ఎదురు చూపులంటే
క్రొత్తజంట కలయిక కోసం కలగనడమే కానక్కర్లేదు
ఇన్నాళ్లు నేను మోసింది
ప్రేయసీ ప్రియుల విరహానికి
ఏ మాత్రం తీసిపోనిదని నేను భావిస్తాను
దీన్ని స్నేహవిరహమని
అనురాగ విరామని అంటాన్నేను
నీళ్లులేక ఎండలకు వలవల
వాడిన పూలచెట్టు
చిరుజల్లులకే
కొమ్మ కొమ్మల పూలై పూచిన చెట్టూ ఆకాశం
పువ్వై నవ్వడమే కదా అందమంటే
ఎన్నాళ్లుగా ఎదురు చూసిన
స్నేహితుని ముఖము
నాకు కేవలంగా కళ్లు ముక్కులు కానేకాదు
అది వేలకొమ్మలు పూచిన మహాపూలమాను
ఎండిన గుండైన చెరువు
వానాకాలం చెరవుగట్టు దాకా
నీళ్లతో నిండిన చందం
చిరకాల మిత్రుడు కలసిన ఆనందం
మమతల మాటలన్నీ అలలు అలలై
మనసునే తాకుతాయి
ఆ సమయమే
ఆ సమయమే మరుపురానిది
ఆ కాలం మిత్రునికాలం.
చందమామను మబ్బులు దాచినట్టు
మిత్రుణ్ణి వేసవి సెలవులు దాచాయి
జీవితాలకే చావుపుట్టుకలు
స్నేహమెపుడూ శాశ్వతమే
మనసున మనసైన
చెలిమి తోడుంటే అదికదా స్వర్గము.
మిత్రుని చెంత ఆనందం ఉంటే
ఆ ఆనందం
వేసవి సెలవులవెంటే ఉందనుకుంటా బహుశా
వేసవి సెలవులు వస్తే
ఉపాధ్యాయులకు,బడి పిల్లలకు సంబరమైతే
అల్లరిపిడుగుల అమ్మానాన్నల్ని,నన్నూ
ఒకింత భరించరానితనం అల్లుకుంటుంది