Home వ్యాసాలు ముకుంద విలాసము – ప్రబంధము కాణాదం పెద్దన సోమయాజి పరిచయం

ముకుంద విలాసము – ప్రబంధము కాణాదం పెద్దన సోమయాజి పరిచయం

నిర్వహణ:

– గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ (తెలుగు)ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ ప్రబంధాలు:
1. చిత్ర భారతము- చరిగొండ ధర్మన్న
2. తపతీ సంవరణోపాఖ్యానము- అద్దంకి గంగాధరుడు
3. షట్చక్రవర్తి చరిత్ర – కామినేని మల్లారెడ్డి
4. యయాతి చరిత్రము – పొన్నిగంటి తెలగన్న
5. ముకుంద విలాసము – కాణాదం పెద్దన సోమయాజి

ఇవి ఈ శీర్షిక క్రింద పరిచయం చేయబోతున్న తెలంగాణ పంచ కావ్యాలు అనదగిన ఐదు ప్రబంధాలు

పరిచయ కర్తలు:
1. డా॥ సంగనభట్ల నరసయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
2. డా॥బ్రాహ్మణపల్లి జయరాములు, రిటైర్డ్ ప్రిన్సిపాల్.
3. డా॥ మృదుల నందవరం, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
4. డా॥ సి.హెచ్ . లక్ష్మణ చక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్ (తెలుగు)
5. డా॥ గండ్ర లక్ష్మణరావు, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్.

ఈ రచయితల వ్యాసాలు తెలంగాణ ప్రబంధ మాలిక శీర్షిక లో వరుసగా ధారావాహికంగా వస్తాయి


ప్రవేశిక
భారతీయ భాషలలో తెలుగు ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన ప్రసిద్ధమైన భాష. అనేకానేక విషయబాహుళ్యము వలన విస్తృతమైన సాహిత్య సంపదగలిగిన మధురమైన భాష. స్వరములు అంటే అచ్చులు .ఇవి నాద మాధుర్యానికి పుట్టినిండ్లు .అ,ఇ,ఉ కారాది స్వరాలతో ఆదిమధ్యాంతము సర్వవిధముల అలరారు మెలపులు గల పదాలతో కూడిన తెలుగు భాష పలుకు తీపికి తేనె పెర. మృదువైన పలుకుబడి పదములతో నవనీత సదృశ ‘రుచి’ర . ఈ కారణాలవల్లనే స్వభాషాభిమానానికి పరాకోటి ప్రాధాన్యతను పాటించే తమిళభాషా కవులలో సుప్రసిద్ధులైన సుబ్రహ్మణ్య భారతి వంటి ప్రామాణికులైన మాన్య సాహిత్యవేత్తలు సైతము “సుందర తెలుగు” అని వక్కాణించినారు. అంతకు’ముందెన్నడో “ఆంధ్రత్వమాంధ్రభాషా చ బహుజన్మ తపః ఫలమ”ని తెలుగును వేనోళ్ళ పొగిడిన అప్పయ్య దీక్షితులకు తెలుగు వారందరు కూడా కృతజ్ఞతాబద్ధులే! సుమారు రెండు వందల సంవత్సరాల కాలం భారతదేశంలో తిష్ఠ వేసిన బ్రిటీష్ , తదితర భాషా పండితులు మన తెలుగు భాషను “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ “ అని ముచ్చటపడి మెచ్చుకున్నారు. ఇక్కడొక విషయం చింతనీయం -అంతకు ముందు వాళ్ళకు ఇటాలియన్ తెలిసి దానితో మన తెలుగును పోల్చుకొని మెచ్చుకున్నారు . కాని , వాళ్ళు రావడానికి వేల సంవత్సరాలకు ముందే మాధుర్యాన్ని పండించుకొటున్న తెలుగు భాషను ఇటాలియన్ తో పోల్చుకొని ఇటాలియన్ గురించి ” తెలుగు ఆఫ్ ద వెస్ట్”అని మార్చుకొనదగినంత మధురాతి మధుర మృదు మాధ్వీక రసనిష్యంద తుందిలమైన మన తెలుగు నిజంగా ప్రపంచ భాషలలోనే మధురమైన భాష.

ఇక దక్షిణ భారతదేశంలో అక్షీణ యశస్సును పండించుకొని, స్వయంగా కవియై , ఆముక్తమాల్యాది కావ్యరచయితయై, స్వర్ణయుగ కర్తగా పేరుపొందిన శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటాది భాషాప్రాంతాలకు ఏలికయై ఉండి కూడా ‘“దేశభాషలందు తెలుగు లెస్స “అని ప్రశంసించటం సర్వజన సువిదితమే! అంతకుముందే శ్రీనాథ మహాకవి ఈ అభిప్రాయాన్నే ప్రకటించిన తీరు కూడా గమనార్హం.

మధ్యయుగాల వైభవమును ప్రతిబింబించిన 16 వ శతాబ్దపు ‘ ప్రబంధ పద్యము ’ పద్యరచనకు పరాకాష్ఠ స్థితి (climax) . ప్రబంధ పద్యం అంటే ప్రబంధం లోని పద్యం. ఇతిహాస,పురాణ , నాటకాది వివిధ ప్రక్రియలకు చెందిన గ్రంథాలన్నీ ప్రబంధ శబ్ద వాచ్యాలే అయినా కావ్యాలకే ప్రబంధము మారు పేరుగా, మరోపేరుగా ధ్రువపడింది. రూఢి అయింది .

వాస్తవానికి “సర్గబంధో మహాకావ్యమ్” అంటూ దండి అనే సంస్కృత లాక్షణికుడు చెప్పిన లక్షణాలే తెలుగు లాక్షణికులైన విన్నకోట పెద్దనాదులు కావ్య ప్రబంధ లక్షణాలుగా స్వీకరించారు.
క్రీ.శ. 16వశతాబ్ధమునందలి కావ్యములను ముఖ్యంగా మనుచరిత్రము ను పురస్కరించుకొని ప్రత్యేకంగా రూఢమైన “ప్రబంధ లక్షణముల”ను ప్రకటించినవారు 20 వ శతాబ్దపు తెలుగు విమర్శకులే కాని ప్రాచీన లాక్షణికులుకారు. ( తెలుగు అకాడమీ పత్రిక ‘తెలుగు’ మే 1995 సంచికలోని ప్రొఫెసర్ జి.వి.సుబ్రహ్మణ్యం గారి ప్రత్యేక వ్యాసం చూడండి.

పైన పేర్కొన్న కేంద్రసాహిత్య అకాడమీ విమర్శ పురస్కార స్వీకర్త గారి మాటలను అనుసరించి పర్యాలోచిస్తే ౼ కేవలం 16 వ శతాబ్దంలో క్రీ.శ. 1522 తదనంతరం శ్రీకృష్ణదేవరాయల కోరికపై అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర ను మాత్రమే దృష్టిలో ఉంచుకొని “……మనుచరిత్రమే ప్రబంధ లతకు పూచిన తొలి పువ్వు“ అని తీర్మానించిన మాట వాస్తవమని ఆంధ్రసాహిత్య అభిజ్ఞ పండితవర్గము గుర్తించగలదు. ఈ విధంగా ప్రబంధ లక్షణాలివి అని , తమకు నచ్చిన కావ్యగతాంశాలను కొన్నిటిని ప్రామాణీకరించుకొని , అష్టాదశ వర్ణనలు ప్రధానంగా ఉండే స్వతంత్ర కథోచిత మనోహర పద్యగద్యాలున్న కావ్యాన్నే “ప్రబంధమ”ని నిర్వచించినారు. కాని, మనుచరిత్ర కంటే సుమారు దశాబ్దం పైబడిన కాలం ముందటిదైన , 16 వ శతాబ్దపు ప్రారంభాన ఓరుగల్లు ను పాలించిన చిత్తాపుఖానుని మంత్రియైన పెద్దనామాత్యునికి అంకితమైన చరిగొండ ధర్మన్న కవియొక్క ‘చిత్ర భారతం ‘ ను గుర్తించదలచరైరి.

కాలక్రమానుగుణంగా “చిత్రభారతము” (చరిగొండ ధర్మన్న) క్రీ.శ. 1503-12 మధ్యకాలములోనిది. “మనుచరిత్రము” క్రీ.శ.1522లో భువన’విజయము లో కొలువుండి శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనను అడిగి వ్రాయించుకున్న ప్రబంధము. ఈ విధంగా కాల సన్నివేశాలను పోల్చిచూసినట్లైతే “చిత్రభారతము”తొలి తెలుగు ప్రబంధమగుట వాస్తవము.న్యాయము. ఈ ప్రామాణిక , చారిత్రక శాసనాధారాలుగల విషయాలను 2013 లో తెలుగు విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసిన డా॥సంగనభట్ల నరసయ్య గారు : ఉపకులపతి డా॥ ఎల్లూరి శివారెడ్డిగారి కోరికమేరకు పరిష్కరించి, విపులమైన పీఠికను చేర్చి వెలువరింప’చేసినారు.

ప్రస్తుతము 2014 నుండి తెలుగు భాషకు చెందిన రాష్ట్రాలు రెండు . ఒకటి తెలంగాణ , రెండు ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత 2017 డిసెంబరు నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిర్వహించుటకు సంకల్పించిరి. అంతకు కొద్ది నెలల ముందుగా డా॥నందిని సిధారెడ్డిగారు తొలి అధ్యక్షులుగా “తెలంగాణ సాహిత్య అకాడమీ” ప్రారంభించబడినది. ఈ క్రమంలో ప్రపంచ తెలుగుమహాసభలు డా౹౹నందిని సిధారెడ్డి గారి అధ్వర్యంలోనే మూడు రోజులు వివిధ ప్రసిద్ధ సాహితీవేత్తల పేరిట ఏర్పాటు చేయబడిన వేదికలపై నిర్వహింపబడినవి. అందులో భాగంగ “తెలంగాణ ప్రబంధాలు” శీర్షికన గతంలో ప్రచుర పఠన పాఠన పరంగా విస్తృత ప్రచారం లోకి రాని ప్రబంధములకు చెందిన ప్రత్యేక, విశిష్ట లక్షణములను గురించి నాకు : గురిజాల రామశేషయ్య కు ప్రసంగించుటకు అవకాశము లభించినది. ప్రముఖులైన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ పండితుల సమక్షంలో తెలంగాణ ప్రక్రియా ప్రాదుర్భావ వికాస విశేషాంశములు పునర్మూల్యాంకన గణనం లోనికి రావలెనని నివేదింపబడినది . ఆ క్రమంలోనే నేను తదుపరి సంవత్సరములలో తెలంగాణ సాహితీ వేత్తలను సంప్రదించి ఒక్కొక్కరికి ఒక్కో ప్రబంధం చొప్పున అప్పగించి కవిపరిచయము–స్థల కాలాది’విశేష–కథాసంగ్రహ–ప్రబంధ నిర్మాణ విశేషాదిక పద్య’శిల్ప వైభవ విశేషములను వివరిస్తూ విషయవిస్తృతి గల వ్యాసములను వ్రాసి ఇవ్వవలసినదిగా కోరితిని .

కోరినవెంటనే సమ్మతించి ఆయా ప్రబంధములను కూలంకషముగా అధ్యయనము చేసి తత్ ప్రబంధ సంబంధిత చర్చనీయాంశాలకు చెందిన వివిధ సాహిత్య చరిత్రాది గ్రంథములను సంప్రదించి రచించి విద్వన్మిత్రులు వ్యాసములను పంపినారు . అయితే ఇంతలోనే వచ్చిపడిన కరోనా గండ సమయములో ప్రచురణ -ఆవిష్కరణాదులకు చెందిన సమయసందర్భ అవకాశాలు కుంటు పడుటచే ఏదైన పత్రిక ద్వారా మొదటి విడతగా ఈ ఐదు వ్యాసాలను వెలువరించ దలిచితిని. ఇంతలో దైవికముగా అమెరికాలో తమ పిల్లల దగ్గర ఉన్న ప్రసిద్ధ తెలంగాణ స్త్రీవాద రచయిత్రి,కవయిత్రి, ఒద్దిరాజు సోదరులపై విశేష శ్రమకోర్చి పరిశోధన చేసిన విద్వాంసురాలు డా॥ కొండపల్లి నీహారిణి ఒక రోజు ఫోన్ ద్వారా సంభాషిస్తూ , తాను ఒక ద్వైమాసిక అంతర్జాల పత్రికను ప్లవ ఉగాది నుండి ప్రథమ సంచికను వసంత సంచికగా ప్రకటించ’దలచినానని చెప్తూ , మీరు ఏదైనా ఒక ప్రత్యేక అంశానికి చెందిన తెలంగాణ సాహిత్య శీర్షికను నిర్వహింపవలెనని కోరినారు. వెదుకబోయిన రత్నము చేతికి దొరికినట్లు భావించి : వెంటనే నేను సేకరించిన తెలంగాణ ప్రబంధాలకు చెందిన విషయ విస్తృతిగల వ్యాసములను తమ ‘ మయూఖ ’ అంతర్జాల పత్రికలో ధారావాహికముగా ప్రచురించుకొన’వచ్చునని చెప్పినాను. అందుకు సంపాదకులు డాక్టర్ నీహారిణిగారు అంగీకారము తెలిపినారు .

తెలంగాణ ప్రబంధాలు శీర్షికతో తొలివిడతగా _తెలంగాణ పంచకావ్యాలు_ అనదగిన తెలంగాణ సాహిత్య వికాసరూపాలనదగిన ఐదు ప్రబంధాల పరిచయమాలికను సహృదయులకు అందించగలుగుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను.

ఈ పరిచయ మాలికను తమ మయూఖ తెలంగాణ సాహిత్య ద్వైమాసిక అంతర్జాల పత్రిక లో ప్రచురించుకొనుటకు అంగీకరించిన మయూఖ సంపాదకులకు తదితర నిర్వాహక కుటుంబ సభ్యులకు : హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః

గురిజాల రామశేషయ్య రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ తెలుగు హైదరాబాద్ +91 70326 79471

 

 

 

 

 

డా॥గండ్ర లక్ష్మణరావు గారి పరిచయం:
__________

ఆధునిక తెలుగు సాహిత్య ప్రపంచంలో లబ్ధప్రతిష్ఠులైన తెలంగాణ సాహిత్యవేత్తలలో డా॥ గండ్ర లక్ష్మణరావుగారు ఒకరు . “సాహితీరత్న” బిరుదాంచితుడు. చేపట్టిన ప్రతి సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన స్థానం నిలుపుకున్న అక్షర తపస్వి. సుమనస్వి.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహింపబడిన ప్రపంచ తెలుగు మహాసభలలో నిర్వాహక మండలి సభ్యునిగా పనిచేసి ప్రశంసలందుకున్న నిర్విరామ కృషిశీలి. నాకు ఈ మహౕసభలలో నా కోరిక మేరకు “తెలంగాణ ప్రబంధాలు“ అనే అంశంపై డా. నందిని సిధారెడ్డి గారి అంగీకారంతో ప్రసంగించే అవకాశం లభించింది. తదనంతరం నా నిర్వహణ లో ఈ ‘మయూఖ’ పత్రికలో తెలంగాణ ప్రబంధాలకు చెందిన వ్యాసాలు ధారావాహికంగా వెలువడుతున్న విషయం పాఠకులు గుర్తించవచ్చు.
డా. లక్ష్మణరావు విశిష్ట బోధకునిగా పేరు పొందిన ఆచార్యుడు.
ఆదిపాద మకుట “నీవు” పదంతో ప్రయోగశీలమైన పద్యరచనలో వాసిగాంచిన శతక కర్త. వచన కవితా ప్రక్రియలో “వర్తమాన సంధ్య” కవితా సంపుటి ప్రచురించారు. “సాహితీ వనమాలి” పేరిట వివిధ విషయాలను గురించి సాహిత్యవ్యాస సంపుటి సమర్పించిన సాహిత్య విశ్లేషకుడు .
జూమ్ మీటింగ్ లలో ఆచార్య సుప్రసన్న వంటి ప్రసిద్ధ విమర్శకులను గురించి సాధికారిక ప్రసంగాలు చేసిన; తదితరులను గురించీ చేస్తున్న మంచి వక్త. పద్యపఠన – ధారణలలో రాణించే డా॥ లక్ష్మణరావు తెలంగాణ లోని నేటి అష్టావధానులలో ఒక అవధాని. విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రారంభించిన ‘జయంతి’ పత్రిక
డా. వెల్చాల కొండలరావుగారి సంపాదకత్వంలో పునః ప్రారంభింపబడిన నాటినుండి సంపాదక మండలి సభ్యుడు.
పద్మశ్రీ శ్రీభాష్యం పార్థసారథి గారు స్థాపించిన కరీంనగర్ “ఆది వరాహక్షేత్ర” సంబంధమైన సాహిత్య సేవలో పాలు పంచుకుంటున్నారు. కరీంనగర్ “ సాహితీ గౌతమి” వ్యవస్థాపక బాధ్యులలో వీరొకరు. ప్రతిష్టాత్మకమైన కరీంనగర్ సినారె అవార్డుల కమిటీ ముఖ్య సభ్యుడు. అనేకానేక గ్రంథాలకు పీఠికాకర్త . “వేయిపడగలు” పై పిహెచ్ . డి . పట్టా పొందినవారు. ఇటీవలి కాలంలో”రామాయణ కల్పవృక్షం” పై ప్రతిపద్య వాఖ్యానం ప్రారంభించిన వక్త. తెలుగు అకాడమీ వారి కోరికపై 30 రామాయణాలను గురించి పుస్తకం వ్రాసియిచ్చిన మంచి వచన రచయిత . “ ఒక పద్యం నేర్చుకుందాం” పేరుతో 100 తెలుగు పద్యాలకు సామాజిక వ్యాఖ్యానం రచించినారు.వివిధ విశ్వవిద్యాలయ సెమినార్లలో, అకాడమీ , పరిషత్తు వంటి విశిష్ట సంస్థలలో విశేష ప్రసంగాలు చేసిన వక్త. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార మండలి జిల్లా సభ్యుడు. వైష్ణవ దీక్షాస్వీకర్తయైననూ నా కోరికను మన్నించి నేెనెన్నుకున్న ముగ్గురు పద్య కవులలో ఒకడుగా చిన్న చిన్న మాటలతో శివచరిత్రను –తత్త్వమును జోడించి “శివా!” శతకమును రచించి యిచ్చిన హరిహరాద్వైత భావం నిలుపుకున్నవాడు.
“దేశ భాషలందు తెలుగు లెస్స” యన్న శ్రీకృష్ణదేవరాయల “భువన విజయము” రూపకమును రచించి ప్రదర్శనలిచ్చిన – యిప్పించిన తెలుగు పద్యాభిమాని.
విశ్వవిఖ్యాత ఆంగ్లకవి ఖలీల్ జిబ్రాన్ కవితను “వెఱ్ఱిమానవుడు” పేరుతో తెలుగులో పరిచయం చేసిన అనువాదకుడు. ఇది ఇంగ్లీషుకు చెందిన అంశం అయితే త్వరలో వీరి సంపాదకత్వం లో వెలువడనున్న సతాత్పర్య సంస్కృత “చమత్కార చంద్రిక” అనే అలంకార శాస్త్రగ్రంథం సంస్కృత పండితుల శ్లోక తాత్పర్య రచనతో వెలువడనుంది.
నేనూ లక్ష్మణరావు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ లో ఎం .ఏ., లో సహాధ్యాయులం . అద్దె గదిలో స్వంతవంటతో సాహిత్యపు వేపుడులు కూడా వడ్డించుకొని తిన్నవాళ్లం . అడిక్ మెట్ రైల్వే అడ్డదారిలో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ రోడ్డుపై నడుస్తూ చెరిరెండు పాదాలుగా పద్యాలూ-శ్లోకాలూ వల్లించుకుంటూ-సాహిత్యాంశాలు వర్ణించుకుంటూ నడుస్తుంటే సినారె సర్ మా ప్రక్కగా కారు ఆపించి ఎక్కించుకొని ఆర్ట్స్ కాలేజ్ ముందు దిగిన తర్వాత నమస్కారం స్వీకరించి తలపంకించి ఆశీర్వదించిన సందర్భాలు మాకిద్దరికీ మనోజ్ఞ గురువాత్సల్య ప్రకటన జ్ఞప్తి మాధుర్య దృశ్యాలు.
కాణాదం పెద్దన సోమయాజి రచించిన “ముకుంద విలాసం” అద్భుతమైన శబ్దశిల్పరేఖలతో అలరారే తెలంగాణ ప్రబంధం. కోరిన వెంటనే అంగీకరించి వ్యాసం వ్రాసి యిచ్చిన మిత్రుడు లక్ష్మణ రావుకు అభివందనములు తెలియజేసుకుంటున్నాను.
– గురిజాల రామశేషయ్య

 

ముకుంద విలాసము – ప్రబంధము కాణాదం పెద్దన సోమయాజి పరిచయం – డా. గండ్ర లక్ష్మణరావు

తెలంగాణ సాహిత్యం అనేక రూప ప్రక్రియల ప్రయోగాలకు నెలవు. ప్రబంధాలు కూడా పదహారవ శతాబ్దం కన్నా ముందు నుండి వెలుగులోకి వచ్చాయి. అయితే ఆధునిక యుగం దాకా తెలంగాణలో సంస్థానాల ఆశ్రయంలో అనేక కావ్యాలు అత్యంత ప్రతిభావంతంగా ప్రయోగాత్మకంగా వైవిధ్యభరితంగా వెలువడ్డాయి. అటువంటివాటిలో కాణాదం పెద్దన సోమయాజి రచించిన ముకుంద విలాసం విశిష్టంగా పేర్కొనదగింది.

తెలంగాణలోని గద్వాల సంస్థానానికి విద్వద్గద్వాలగా ప్రసిద్ధి వచ్చింది. గద్వాల సంస్థానాధీశులు స్వయంగా సాహితీవేత్తలు, కవులు, ఎందరో కవిపండితులను ఆదరించి సత్కరించినవారు. అన్ని ప్రాంతాల పండితులను ఆహ్వానించి విద్వద్గోష్టులు నిర్వహింపజేసినవారు. ఈ సంస్థానం ముష్టిపల్లి రెడ్డి వంశీయులు పాకనాటి రెడ్లు 1695-1705 ప్రాంతంలో స్థాపించి పాలించారు. వీరి వంశంలో చినసోమ భూపాలుడు క్రీ.శ. 1761లో అధికారానికి వచ్చాడు. ఇతని కాలం సాహిత్యానికి స్వర్ణయుగంగా భాసిల్లింది. ఆయన స్వయంగా కవి. హరిభట్టు సంస్కృతంలో రచించిన రతి రహస్యాన్ని తెలుగు చేశాడు. అప్పటి పండితులచే ఆంధ్రభోజుడనిపించుకున్నాడు. ఆయన ఆ స్థానంలో కాణాదం పెద్దన సోమయాజి, కిరీటి వేంకటాచార్యులు, కొత్తపల్లి రామాచార్యులు, గార్గ్యపురం సుబ్బశాస్త్రి, కామసముద్రం అప్పలాచార్యులు, తిరుమల కృష్ణమాచార్యులు, బోరవెల్లి శేషాచార్యులు, సోమనాథ శాస్త్రి అనే ఎనమండుగురు కవులు ఎంతో ప్రఖ్యాతి వహించినవారు. ఈతని ఆస్థానానికి వన్నె తెచ్చిన విద్వత్కవులు.

వీరందరూ వివిధ కావ్యాలు తెలుగులోను, సంస్కృతంలోనూ రచించినవారు. ముఖ్యంగా యథాశ్లోక తాత్పర్య రామాయణాన్ని ఆయా కాండలను రచించి పూరించడం ఒక విశేషం. తెలుగు సంస్కృతాలు మాత్రమే కాక బహుభాషావేత్తలు వీరిలో ఉన్నారు.

కాణాదం పెద్దన సోమయాజి – కవి పరిచయం

గద్వాల సంస్థానాన్ని చినసోమభూపాలుడు క్రీ.శ.1764-1793 వరకు పాలించారు. ఈయన ఆస్థానంలో పెద్దన సోమయాజి ఉన్నాడు. అంతకుముందు సురపురం సంస్థానలో రామన్నపాలుని సంస్థానంలో కూడా కొంతకాలం ఉన్నాడని అతని రచనల వలన తెలుస్తున్నది. దీన్నిబట్టి పెద్దన 18వ శతాబ్దంకవి అని స్పష్టం.

చినసోమభూపాలుడు తనను సభకు ఆహ్వానించిన సందర్భంలో పెద్దన చెప్పిన పద్యం,

నను నందవరపురాన్వయ పయోనిధి చంద్రు

కాణాద వంశ విఖ్యాతి సాంద్రు

అశ్వలాయన సూత్రం నాత్రేయ ముని గోత్రు

సకల విద్వత్కవి ప్రకరమ మిత్రు

ప్రౌఢలక్ష్మీపతి పండిత సోదర్యు

బాహట గ్రంథానుభావ ధుర్యు

వేదశాస్త్ర పురాణ వివిధ మర్మధురీణు

వరచతుర్విధ కవిత్వ ప్రవీణు

భోజచంపూ ప్రబంధార్థ బోధనాను

బంధ గీర్వాణ టీకా నిబంధనాది

పేశల వచో రచన ధుర్యు పెద్దనార్యు

గాంచి దయమించి పలెకె సగౌరవముగ (ముకుంద, వి.ప్ర.ఆ.23)

ఈ పద్యాన్నిబట్టి నందవర పురాన్వయానికి చెందినవాడు, కాణాద వంశం, ఆశ్వలాయన సూత్రం, ఆత్రేయ మునిగోత్రం అని తెలుస్తున్నది. సోదరుడు ప్రౌఢలక్ష్మీపతి అని అతడు పండితుడు. వేదశాస్ర్త పురాణగీర్వాణ పండితుడు. చతుర్విధ కవితా ధురీణుడు. భోజచంపూ మొదలైన కృతులు రచించినవాడు అని విదితమవుతున్నది. సోమభూపాలుని ఆస్థానంలోకి రాకముందే ఈ రచనలు చేసి ఉంటాడు.

భోజవ్యాఖ్య, శేషశైలేష లీల, మత్స్యపురాణం, ముకుంద విలాసము, ఆధ్యాత్మ రామాయణము పెద్దన రచనలు. వీటిలో శేషశైలేష లీల అనేది అపూర్వ ప్రయోగము. క,చ,ట,త,ప అనే వర్గాక్షరాలకు చెందిన 25 అక్షరాలు వాడకుండా కేవలం య,ర,ల,వ,శ,ష,స,హ లతో మాత్రమే పద్య రచన చేసి కావ్యాన్ని పూర్తి చేశాడు. తెలుగు సాహిత్యంలో నిరోష్ఠ్య, నిర్వచనాదికాలు వచ్చినవి కాని ఇన్ని అక్షరాలు వదిలేసిన కావ్య రచన ఈ పెద్దన నాటికి రాలేదు. దీనినిబట్టి ఆయన పాండిత్యము, కవితా ప్రతిభ తెలియవస్తుంది.

మత్స్యపురాణం మాత్రం సురపురం సంస్థానంలో ఉండగా వ్రాసినట్లు ముకుంద విలాసములోని అవతారిక వలన తెలియవస్తుంది.

“మీ తాతయు మీ తండ్రియు మీ తమ్ముడు మీరు మరియు మీ కులజులు విఖ్యాత ప్రబంధ రచనా ప్రీత చరిత్రులు” (ము.వి.ప్ర.ఆ.26) అని సోమభూపాలుడు ప్రశంసించడాన్నిబట్టి వారిది కవి పండిత వంశమని స్పష్టం. కాగా ఆశ్వాసాంత గద్యనుబట్టి “ఇది శ్రీమదుభయ కవితా నిస్సహాయది సాహితీ విహార కాణాదాన్వయ తిమ్మనార్యుడు. పైగా పెద్దన ఈ ప్రబంధం రాసే నాటికి సోమయాజి అని పేరొ్కనలేదు. తరువాతి కాలంలో సోమయాగం చేసి సోమయాజి అయి వుంటాడు.

ఈయన కూడా తిక్కనవలె ఉభయ కవితా నిస్సహాయ అని ఉభయ కవిత్వ విషయాన్ని పేర్కొనడం గమనార్హం.

ముకుంద విలాసము ప్రబంధము :

సోమభూపాలుని కోరిక మేరకే పెద్దన ముకుంద విలాసం కావ్యం రాశాడు.

పురుషోత్తమాష్టమహిషీ

పరిణయములలోన మున్ను భద్రాదేవీ

పరిణయ మెవ్వరు తెనుగున

విరచించుట వినము పూర్వ విబుధుల లోనన్ (ము.వి.ప్ర.ఆ.28)

అనడాన్నిబట్టి శ్రీ కృష్ణుని అష్టమహిషులలో భద్ర వివాహ కథను ప్రబంధంగా రచింపుమని కోరాడు. ఏ కవి కూడా ఇంతకు మునుపు ఇది కావ్యంగా రాసినట్టు లేదు అని సోమభూపాలుని మాటల వలన తెలుగు సాహిత్యంలో ఈ కథా ప్రబంధం రాలేదని రూఢి.

ఈ ప్రబంధానికి పెద్దన భద్రాపరిణయమని, ముకుంద విలాసమని రెండు పేర్లు ప్రయోగించాడు.

శ్రీనాథుని హరవిలాసము, చేమకూర విజయవిలాసము మొదలైన పేర్లు ప్రబంధాలకున్నాయి. ఆ వరుసలో ముకుంద విలాసము అని పేరు పెట్టి ఉంటాడు. అయితే రుక్మిణీ కల్యాణము అని నాయికా ప్రధానంగా భద్రాపరిణయము అని పేరును కూడా ఆశ్వాసాంతంలో పేర్కొన్నాడు. సోమభూపాలుడు కూడా ‘శ్రీముకుంద విలాసాఖ్యావిధి జేయుడు’ అని ముకుంద విలాసంగా సూచించాడు.

అంకింతం: సోమభూపాలుని ఆదేశాన్ననుసరించి ఈ ప్రబంధాన్ని రచించినాడు కాని ఆ సోమభూపాలుని ఇష్టదైవమైన కేశవస్వామికే దీన్ని అంకితం చేశాడు. “కేశవ దేవున కంకితముగాగ ధీరవతంసా” అని సోమభూపాలుడు ఆశించినట్లుగానే కేశవస్వామికంకితం చేశాడు. గద్వాలా సంస్థానాన్ని నెలకొల్పిన వారి పూర్వీకులే కేశవస్వామి ఆలయాన్ని నిర్మించి ఇష్టదైవంగా కులదైవంగా సేవించుకుంటున్నారు. ఈ విషయాలన్నీ అవతారికలో పెద్దన స్పష్టం చేశాడు.

ప్రబంధము : తెలుగు ప్రబంధాలు ప్రధానంగా వర్ణనా ప్రధానాలు అనే అంశాన్ని చర్వణం చేయవలసిన అవసరం లేదు. పెద్దన చతుర్విధ కవితా ధురీణుడు అని చెప్పుకున్నాడు. చిత్రబంధ కవిత్వాలలో కూడా అపారమైన ప్రతిభ కలవాడు అని శేషశైలేష లీల వంటి కావ్యాల వల్ల తెలుస్తున్నది. అట్లాంటి ప్రయోగాలు ఈ ప్రబంధంలో కొల్లలుగా చేశారు. చాలా చిన్న కథను సుమారు 911 గద్య పద్యాలలో మూడాశ్వాసాల ప్రబంధంగా విస్తరించారు. శబ్ధార్థాలంకారాలు, పాత్రోచితమైన వర్ణనలు, ప్రకృతి వర్ణనలు విశేష రీతిలో వర్ణించినవి ముందు దాహరించడం జరుగుతుంది.

అవతారిక : గద్వాల సంస్థాన ఇలవేలుపు కేశవస్వామి స్తుతితో ప్రారంభమైన అవతారికలో వేంకటేశ్వర, అలివేలుమంగ, పరమశివుడు, పార్వతి, బ్రహ్మ, సరస్వతి, గణపతి, గరుడ విష్వక్సేనులు హనుమంతుడు హరి పంచాయుధములు క్రమంగా స్తుతించబడినారు. వాల్మీకి, వ్యాస, భవభూతి, కాళిదాసు సంస్కృత కవులను నన్నయ, భీమన, తిక్కన, ఎఱ్రన, సోముడు, భాస్కరుడు, శ్రీనాథుడు, పోతన్న, పినవీరన, చిన్నన్న, సూరపరాజును, రామభద్రుని, పెద్దనను, తిమ్మనను తెలుగు కవులను స్మరించాడు. తన గురువైన మల్లేశ్వర దీక్షితులను సేవించాడు. తన భగినీధవుడు అంటే బావ ఊర్వసి నాగార్యుడనీ అతడు గొప్ప కవియని అతని తలచాడు. కుకని నిందలో కాకవులు, నా కవులు అని మంచి కవులుండగా పనికిరాని కవులను స్తుతించడమెందుకు అన్నాడు.

కృతిరచింపుమని కోరిన సోమభూపాలుని వంశవర్ణనము అతని గుణగములను సుమారు 75 గద్య పద్యాలలో వర్ణించారు. గద్వాల సంస్థానం నెలకొల్పిన ముష్టిపల్లి వంశీయుల తొలినాటి నుండి సోమభూపాలుని వరకు గల వంశపరంపర వర్ణించి సోమభూపాలుని ప్రత్యేకంగా పంచరత్నాలలో ప్రశంసించాడు. ఈ అవతారిక పద్యాలలో కూడా ముక్తపదగ్రస్తాలు, శ్లేషలు, అర్థాంతరన్యాసాలు, ఉత్ర్పేక్షలు వంటి ఎన్నో అలంకారాలు ప్రయోగించాడు. అవతారికలోని పద్యాలు కూడా పద్యరచనా పాటవానికి నిదర్శనాలుగా కనిపిస్తాయి. ఇందులో సోమభూపాలుడని ఔదార్యమునిట్లా ప్రశంసించాడు.

సుకవుల కొకరొక్కరికొసంగె నే ఘను/డలరి వేనూట పదార్లు గాగ

బహుభక్ష్య సత్రముల్ పరగించె నే దాత / ద్విజుల కర్ణము పదివేలుగాగ

మాఘ కార్తిక పూర్ణిమల నిచ్చె నే రాఉ / విప్రకోటికి పదివేలగాగ

నొగి కేశవస్వామి కొనరించె నే మేటి / లలిత భూషాదులు లక్షగాగ… దాన ధర్మములే కాక మాఘ కార్తిక పౌర్ణిమల సందర్భంగా ఘనంగా ఉత్సవాలు నిర్వహింపజేసేవారు. కేశవస్వామిని సోమభూపాలుని వివిధ విధాలుగా స్తుతించారు.

భద్రాపరిణయము మూలం :

సంస్కృత భాగవతంలో భద్రాపరిణయం కేవలం ఒక్క శ్లోకంలోనే వర్ణింపబడింది.

“శృతకీర్తేః సుతాం భద్రాముపయేమ పితృష్యసుః

కైకయీం భ్రాతృభిర్దత్తాం కృష్ణం సంతర్దనాదిభిః”

(శ్రీ కృష్ణుడు తన మేనత్త శ్రుతకీర్తి కూతురు, కేకరు రాజకుమార్తె అయిన భద్రాదేవిని ఆమె సోదరుడైన సంతర్దనాదులు సమర్పించగా వివాహమాడినాడు)

తెలుగులో పోతన భాగవతంలో కూడా ఒక పద్యంలోనే భద్రావివాహం తెలిపాడు.

“జనవంద్యన్ శ్రుతకీర్తి నంద్యతరుణిన్ సందర్శన క్షోణి పా

ద్యనుజునం మేనమఱందలినం విమల లోలాపాంగకైకేయ ని

ద్దన యో నిద్ర ప్రపూర్ణ సద్గుణ సముద్రన్ భద్ర నక్షుద్ర నా

వనజాతాక్షుడు పెండ్లియాడె నహిత వ్రాతంబు భీతిల్లగన్”….

ఇంత చిన్న కథనయినా పెద్దన తన కవితా ప్రతిభచే మూడాశ్వాసాల రమణీయ ప్రబంధంగా తీర్చిదిద్దాడు.

ఇదికాక కాళ్ళకూరి గౌరీనాథ కవి పూర్వీకులెవరో భద్రాపరిణయం రాసినట్లు తెలుస్తున్నదికాని వారి పేరుగాని ఆ కావ్యంగాని ఇప్పడ లభ్యములు. ఆధునికులలో ఒకరు అల్లమరాజు సుబ్రహ్మణ్య కవి రచించిన భద్రాపరిణయం ఒకటి ఈతని తరువాతికాలానిది. కాగా భద్రాపరిణయ ఇతివృత్తంతో రాసిన మొదటి కావ్యం ముకుంద విలాసము.

ఇతని కవిత విష్ణుచిత్తీయ తుల్యమౌనని చెప్పుకున్నాడు. రాయలవారి ఆముక్త మాల్యదను పోలి ఉంటుందని, కాని పెద్దన కవిత్వంలో మృదుత్వం ఎక్కువగా ఉంటుంది. కల్పనలతో, వర్ణనలతో, శబ్దార్థాలంకారాలతో ఈ కావ్యాన్ని కథను ఎంతో అందంగా మలిచినాడు. రసజ్ఞులు, పండితులైన పాఠకుల మనోరంజకంగా రచించాడు.

కథాసంగ్రహం : ప్రథమాశ్వాసం:

శ్రీ కృష్ణుడు ద్వారకలో ఉంటూ ఒకనాడు పాండవులను చూడాలని ఇంద్రప్రస్థపురానికి వెళ్లాడు. అక్కడ అర్జునునితో ఉండగా అగ్నిదేవుడు వచ్చి ఖాండవవనం దహనం చేయాలని ఉందని అడిగాడు. కృష్ణార్జునులంగీకరించారు. అగ్నిదేవుడు ఖాండవవనం దహనం చేస్తుండగా అందులో ఉన్న మయుడు తనను రక్ష్మింపుమని కోరాడు. అతడిని రక్షించారు. మయుడు కృతజ్ఞతగా అర్జునునికి మయసభ నిర్మించి ఇచ్చాడు. కృష్ణునికి ఏదయినా నిర్మించి ఇవ్వాలని ద్వారకకు వెళ్ళాడు. అయితే అక్కడ తాననుకున్న దానికన్నా ఆశ్చర్యకరమైన భవనాలను చూసి కృష్ణునితో ఏది ఇవ్వాలన్నా అన్నీ ఇక్కడ ఉన్నాయని చెప్పి దగ్గరలోని రైపతకపర్వతంపై ఒక అందమైన ఉద్యానవనాన్ని నిర్మించి ఇచ్చాడు. దేవేంద్రుడు కూడా ఖాండవవన దహనం వేళ చేసిన తప్పిదానికి కృష్ణునికి ఏదయినా ఇవ్వాలని ఆ ఉద్యానవనంలో అందమైన లతాగుల్మాదులను, హరిచందనాది వృక్షాలను ఏర్పాటు చేశాడు. కృష్ణుడు అప్పుడప్పుడు ఆ రైవతకాద్రిపై గల ఉద్యానవనంలో విహరిస్తూ ఆనందిస్తూండేవాడు.

వసుదేవుడు తన చెల్లెలైన శ్రుతకీర్తి యోగక్షేమాలు తెలుసుకొని రమ్మని గదుని పంపించాడు. గదుడు వెళ్ళి వచ్చి ఆమె యోగక్షేమాలు తెలియజేశాడు. ఏకాంతంగా ఉన్నప్పుడు శ్రీకృష్ణునితో ఆ శ్రుతకీర్తి కూతురు భద్ర గురించి ఆమె అందచందాల గురించి తెలియజేశాడు. ఆమె సౌందర్యాతిశయం విన్న కృష్ణునికి భద్రపై మనసు కలుగుతుంది.

ద్వితీయాశ్వాసం : శ్రీ కృష్ణుడు రైవతకాద్రిపై ఉద్యానవనంలో విహరిస్తుండగా మామిడి చెట్టుపై ఒక అందమైన రామచిలుక కనిపించింది. ఆ రామచిలుకను ముచ్చటపడి పట్టుకున్నాడు. ఆ రామచిలుక కృష్ణునితో మనుష్య భాషలో మాట్లాడింది. “ఓ కృష్ణా! నేను సరస్వతీ దేవి దగ్గర ఉండేదానను. ఒకసారి లక్ష్మీదేవికడకు వెళ్ళాను. అప్పుడు తన అంశతో జన్మించిన భద్రను అన్ని విద్యలలో నేర్పరి యగునట్టు చేయుమని నన్నాదేశించింది.

నేను కేకయ నగరానికి వెళ్ళ భ్రదాదేవితో పరిచయం చేసుకొని ఆమెకు సంగీతం, నాట్యం, కావ్యనాటకాదులు, అలంకారశాస్త్రం, తర్కవ్యాకరణాదులు, కవితా రచన వంటి అనేక విద్యలు నేర్పించాను. ఆమె ఇప్పుడు సకల విద్యా ప్రవీణ. అంతేకాదు గొప్ప సౌందర్యవతి. ఆమెకు తగిన వరుడు ఎక్కడ దొరుకుతాడో నని అనేక దేశాలు తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. మిమ్ములను చూసిన తరువాత మీరే తగిన వరుడని అనిపించింది.

ఆమె తండ్రి ధృష్టకేతువు ఎందరో రాజకుమారుల చిత్రపటాలను తెప్పించి చూపించాడు. ఆమె ఎవరినీ మెచ్చలేదు. ఒక్క మీ చిత్రపటాన్ని మాత్రమే చూస్తూ ఉంటుంది. మీ గురించి ఏమయినా పాడుమని నన్ను అడుగుతూ ఉంటుంది. మీ గురించి చిన్నప్పటి నుంచే విన్నదట. అప్పటి నుంచే మీరు తప్ప మరొకరు భర్త కారని భావించిందట. ఎల్లవేళలా మీ గురిఁచి కలువరిస్తూనే ఉంటున్నది. ఆమెను మీరు కరుణించి పరిగ్రహించాలి” అని రామచిలుక అనేక విధాలుగా ఆమె గుణగణాలను, రూపురేఖలను వర్ణించడంతోపాటు ఆమెకు కృష్ణునిపై గల ప్రేమను కూడా తెలిపింది.

శ్రీ కృష్ణుడు కూడా ఆమె మాటలకు భద్రపై మరింత ప్రేమను పెంచుకుంటాడు. ఆమెను ఎట్లయినా తనతో కూర్చుమని చిలుకతో వేడుకుంటాడు. చిలుక తన రెక్కలలో దాచిన భద్ర చిత్రపటాన్ని శ్రీ కృష్ణుని కందజేసింది. తరువాత కేకయ నగరానికి వెళ్ళిపోతుంది. కృష్ణుడు భద్రను స్మరిస్తూ కలవరిస్తూ ఉంటాడు.

తృతీయాశ్వాసం :

రామచిలుక కేకయ నగరానికి వచ్చి శ్రీ కృష్ణుడిచ్చిన పారిజాత సుమాలను భద్రకిచ్చి ఆయన గురించి మోహనాకారాన్ని గురించి వివిధ రకాలుగా వర్ణిస్తుంది. కృష్ణునికి తనపై ఇష్టమున్న విషయాన్ని కూడా తెలుపుతుంది. భద్ర ఎప్పుడు కృష్ణుడు వచ్చన తనను స్వీకరిస్తాడా అని ఎదురుచూస్తుంటుంది.

విరహ వేదననుభవిస్తుంది. ఇక్కడ చంద్రోపాలంభన, మదనోపాలంభన మొదలైన వర్ణనలున్నాయి.

ధృష్టకేతువు తన కూతురు భద్రకు స్వయంవరం ఏర్పాటుచేశాడు. స్వయంవరానికి ఎందరో రాకుమారులు వచ్చారు. రామచిలుకను తీసుకొని రథంపై భద్ర ఆయా రాజకుమారుల ముందుకు వెళుతుంది. రామచిలుక ఆయా రాజకుమారులను గురించి వివరాలు తెలుపుతుంది. శ్రీకృష్ణుని వద్దకు రాగానే అతని గుణగణాలను వర్ణించింది. భద్ర చూడగానే కృష్ణుని గుర్తించి అతని మెడలో హారం వేసి వరించింది. మిగతా రాకుమారులందరూ కృష్ణుడేదో మాయచేసి ఉంటాడని తిరుగుాటు చేశారు. కృష్ణుడు వారినోడించాడు.

కేకయ రాజు ధృష్టకేతువు తన కూతురు భద్రను శ్రీ కృష్ణునకిచ్చి వైభవంగా వివహం జరిపించాడు. వారిద్దరూ ద్వారకకు వచ్చి సుఖభోగాలననుభవించారు. వారికి కొంతకాలానికి భద్రజయుడను కుమారుడు జన్మించాడు.

విష్ణమూర్తి వివాహ కథలను జనకమహారాజు వినగోరినపుడు శుకమహర్షి పై కథను చెప్పినట్లు ముగించారు. మూలంలో ఎంతో సంక్షిప్తంగా ఒక శ్లోక పరిమితమైన కథను కాణాదం పెద్దన తన కవితా ప్రతిభచే, కల్పనలచే ఒక మహాప్రబంధంగా మలచినాడు. రైవతకాద్రి ఉద్యానవనం, రామచిలుక, కృష్ణభద్రల ప్రేమలు నాయికా నాయకుల విరహాలు స్వయంవరాలు మొదలైనవన్నీ పెద్దన చేసిన కల్పనలు మాత్రమే.

ప్రబంధోచితంగా పురవర్ణన, రైవతకాద్రి పర్వత వర్ణన, ఉద్యానవర్ణన, రామచిలుక వర్ణన, రామచిలుక దౌత్యము, సూర్యాస్తమయము, రాత్రి, చుక్కలు, చంద్రోదయము, నాయిక సౌందర్య వర్ణనము, నాయకుని వర్ణన, దశావతార కందములు, చంద్రోపాలంభన, మదనోపాలంభన, భద్రజననము, బాల్యయౌవనములు, స్వయంవరము, నానారాజుల వర్ణన, భద్రాకృష్ణుల కళ్యాణము, భద్రకు పుత్రోదయము… మొదలైన అనేక వర్ణనలు చేయబడినాయి. పరిపూర్ణ ప్రబంధంగా రూపొందించాడు కవి.

వర్ణనలు, శబ్దార్థాలంకారాల ప్రయోగాలు, పద్య రచనా ప్రాభవం పూర్వ ప్రబంధ కవులకేమాత్రం తీసిపోనివి. కాగా ఆశు, మధుర, చిత్ర, బంధ అనే చతుర్విధ కవిత్వంలో అత్యంత ప్రతిభావంతుడైన కవి ప్రబంధంలో ఆయా ప్రయోగాలు చేశాడు.

కొన్ని వర్ణనలు ఉదాహరణకు…. భద్రాదేవి మోమును వర్ణిస్తూ

అనువై నెన్నొదురొంటుగా పదునొకండై కన్బొమలం జంటగా

ఘనతం బోల్పగ రెండు తొమ్మిదులునై కర్ణద్వయం బొష్పగా

గన పూర్ణస్థితి బర్వలీల నెసగంగా నింతయుంగూడ దా

దిన సంఖ్యం దిలకింప నిండు నెలగా దీపించు మోమింతికిన్ (ది.ఆ.98)…

ఆమె ముఖం నిండు చందురునితో సమానమైనదని కవి భావము. నిండు నెల అనే ఉత్పేక్షగా చెపుతున్నాడు. అందుకు హేతువులు చూపుతున్నాడు. ఆమె నుదురు ఒంటు (౧) కనుబొమలు రెండు ౧ ౧ పదకొండు, రెండు చెవులు తొమ్మిది ౯ ఆకారంలో ఉన్నాయి, రెండు తొమ్మిదులు, అంట 1+11+18=30 సరిగా ముప్పది రోజులు నెల అంటే నెలచంద్రుని వలె అని సమర్థించినాడు. ఇట్లా నుదురు, కన్బొమలు, చెవులు కూడా లెక్క సరిపోయేట్లుగా చెప్పి ఆమె మోము చంద్రబింబమువలె ఉందనటం చమత్కార కల్పన.

ఆమె కనులను గురించి వర్ణిస్తూ….

ఒక యేట చిక్కెమీనము

ఒక నెలకే చిక్కె పద్మమొక పగటింటన్

వికలత చిక్కెం గుముదము

సకినయనంబులగునె జడగతులెపుడున్ (1-129)

ఆమె కనులను మీనములతోను, పద్మములతోను, కలువలతోను, పోల్చడం కవి భావం. కాని అవన్నీ కూడా ఆమె కనులతో పోటీ పడి ఓడిపోయినాయట. చేప ఒక సంవత్సరకాలంలో చిక్కిపోయింది, పద్మము ఒక నెలలో చిక్కిపోయింది, కలువ ఒక పగటిపూటకే చిక్కిపోయింది. అవన్నీ ఆమె కన్నుల అందం కన్నా తక్కువయి చిన్నపోయినాయి అని. సహజంగానే చేపను ఒక ఏడుగా, పద్మము ఒక నెలగా, కలువ ఒక పగటిగా మాత్రమే వికసించి ఉంటాయనే సహజ గుణాన్ని ఆమె కన్నులతో పోటీపడి ఓడినట్టుగా చమత్కరించాడు. జడగతులు ఆమె కన్నులతో పోటీపడతాయా? అంటే అవి జలగతులు నీటి పాలయినవి కదా! అని మరో చమత్కారము.

ఒకే పదాన్ని ప్రయోగించి ఆ పదానికున్న నానార్థాలతో ఆమె కురులు, కన్నులు, కంఠస్వరము, నడక వర్ణించారు.

సారంగంబు హసించు మేచక కచాంచచ్చాక చక్యంబులన్

సారంగంబు హసించు నీక్షణ రుచా సౌభాగ్య భాగ్యంబులన్

సారంగంబు హసించు కంఠ నినద స్వారస్య విస్ఫూర్తులన్

సారంగంబు హసించు యాన గరిమం చంద్రాస్య సాంద్రస్థితిన్…. (1-224)

సారంగము = తుమ్మెద, లేడి, వానకోకిల, ఏనుగు…. ఈ అర్థాలతో ఆమె కురులు తుమ్మెదలను పరిహసిస్తున్నాయని, కనులు లేళ్ళను పరిహసిస్తున్నాయని, స్వరం కోకిలను పరిహసిస్తున్నదని, ఆమె నడక ఏనుగులను పరిహసిస్తున్నాయని కల్పన చేశాడు.

పెద్దన కవికి సాహిత్యాలంకారాల పాండిత్యము, వైద్య, జ్యోతిష, తాత్త్వికాది శాస్త్రాల వైదుష్యం కూడా అపారమైనది. ఆయా శాస్త్ర్త విషయాలను సంవదింపజేస్తూ నాయిక వర్ణన చేసిన విధం కూడా అద్భుతమైనవి.

“గతి మత్తేభము నాస చంపకమొగిం కైశ్యంబు కందంబు సం

గత వాక్యంబులు మత్తకోకిలలు దృక్పాండిత్యమయ్యుత్పల

ద్యుతి మోమంబురుహంబు దేహరుచి విద్యున్మాలిగా మానినీ

తత వృత్త స్థితులెన్నగా తరమె తద్వాగ్జాని కైనం దగున్ (1-225)

ఈ పద్యంలో ఛందో విశేషాలున్న వృత్తాలను పేర్కొన్నాడు. మత్తేభము, చంపకము, కందము, మత్తకోకిల, ఉత్పల, విద్యున్మాలి, మానిని మొదలైన వన్నీ వృత్తాలు. కాని ఎన్ని వృత్తాలలోనైనా ఆమె నెన్నెగా తరమె అని ఒక ఆశ్చర్యం ప్రకటిస్తూ ఆయా వృత్తాల వైశిష్ట్యాన్ని ఆ పదాల అర్థాలలోని పోలికలతో ఆమె అవయవ సౌందర్యాన్ని వర్ణించాడు.

గతి మత్తేభము, అంటే నడక ఏనుగు, నాస చంపకము, ముక్కు సంపంగి, కొప్పు కందము, వాక్యాలు మత్తకోకిలలు, చూపులు ఉత్పలాలు, మోము అంబురుహము, శరీరకాంతి విద్యున్మాలి, మెరుపుతీగ, మానినీ ఆ మానిని యొక్క మానిని అనేది కూడా ఒక వృత్తం. ఇట్లా ఛందో వృత్తాలతో వర్ణించం విశేషం వసుచరిత్రకారుడు కన్నె నెన్న తరమే గేయ వాక్ర్పౌఢిమన్ అనగానే ఓహా అనిపించింది. ఆమె గేయాన్ని, వాక్కును ఎన్న తరమా? అని, ఏ గేయంలోను, ఏ వాక్కులోను ఆమెను పొగడలేము అని, కాని పై వర్ణన వసుచరిత్రకారుని వర్ణనను మించిదనుటలో సందేహం ేదు.

ఒకచోట కవికులశేఖరులు హరిన్ కొనియాడి… అంటారు ఇందులో కులశేఖరాళ్వార్ల ప్రస్తావన అర్ధాంతరం.

అట్లే ఆదిశంకర, మధ్వాచార్య, రామానుజాచార్యుల పేర్లను తీసుకొని నాయికను వర్ణించారు. ఇక్కడ ఆచార్య త్రయం అర్థాంతరంగా ప్రస్తావించడం ఇట్లాంటివెన్నో తన తాత్త్విక పరిజ్ఞానాన్ని పట్టి యిస్తాయి. సంధ్యారాగాన్ని వర్ణిస్తూ ఒక వైద్యుడు చేసే క్రియను చూపిస్తాడు.

సమయభిషగ్వరుండపర శైలపు కుప్పె దినేంద్రుడనం రసేం

ద్రమునిడి పై తదూర్థ్వ కరతాశ్రమశలాకఘటించి వహ్నియో

గము నొనరింప సింధురముగా పయికిం ప్రసరించె నా కరం

బమరెను సాంధ్యరాగము నభోంతర దంతురితాంశుభాగమై

కాలమనే వైద్యుడు పడమటి దిక్కు అనే కుప్పెలో సూర్యుడనే రసముపెట్టి పైన రాగిశలాకతో కదిలిస్తూ వేడిచేయగా పైకి వచ్చిన సింధురమా అన్నట్లుగా సంధ్య కనపడుతున్నదట. ఇది వైద్యప్రక్రియ.

వ్యాకరణజ్ఞుడు తండ్రి అని తర్కవేత్త భ్రాతయని, మీమాంసకుడు, నపుంసకుడని, ఛాందసుని అస్పృశ్యుడని అందరినీ దూరముంచి కావ్యరసమర్మజ్ఞుడైన కవిని కవితావధూమణి వరిస్తుంది ఒక పద్యంలో చెప్పారు. ఇక్కడ ఆయా శాస్త్రవేత్తలను శాస్త్రాలను ఉటంకించడం విశేషం. దీనికి సంస్కృత మూలశ్లోకం ఉంది, అది తెలుగులో ఇంత అందంగా అనువదించాడు. ఇట్లా అనేక శాస్త్రాల ప్రస్తావనలు చోటుచేసుకున్నాయి. వసుచరిత్రకారుని సీస పద్యాల వంటి సంగీత బద్ధమైన పద్యాలు, చేమకూర వంటి పదవిరుపుల చమత్కారాలు అనేకం అడుగడుగునా కనిపిస్తాయి. అక్షర శబ్ద క్రీడలు అపారంగా ఉన్నాయి.

భంబుగదే నఖవ్రజ మిభంబుగదే….., అనే పద్యంలో బిందుపూర్వక బకారాలనేకం ప్రయోగించాడు.

ఆసవఫలభోక్త విభుండాసవ ఫభోక్తయయ్యె…. ఇట్లాంటి యమకాలకు కొదువలేదు

మరియ గోరుచుండు మనభద్ర మదిగదా

మాధువులకెనైన మంచి మంచి మగని

మరియు గోరుచుండు మనభద్రమదిగదా

మాధవుండ కలుగ మంచి మగడు….. వంటి పద్యాలు చేమకూర మనసు భద్ర మహిమయే మనవచ్చు. మనసుభద్రమయ్యె మనకు నెల్ల వంటి పద్యాలు స్ఫురిస్తాయి. పెద్దన, రాయలు, రామరాజభూషణుడు, చేమకూర వీరందరి కవితా చమత్కారాల గడుసుదనాలనన్నిటినీ కొల్లగొట్టి వాటికి మెరుగులు దిద్దిన పద్యాలు రాశాడు పెద్దన.

అనుప్రాసలు, యమకాలు, శ్లేషలు అనేక పద్యాలలో దొంతరలు దొంతరలుగా దర్శనమిస్తాయి.

హరియీ గిరులం దరులం విరులం…. ఇట్లా అనుప్రాసలు, ఆహారమమేశుడిచ్చె నాహారమె కదా…. వంటి యమకాలు అనేకం ఉదాహరించవచ్చు. ప్రబంధ ప్రియులు ఈ ప్రబంధాన్ని చదివితే ఆ పద్య రచనకు ముగ్ధులవుతారు.

రెండక్షరాల కందం…. “మిమ్మే మమారేమా/ మమ్మోము మరేమి మర్మమా మమ్మారా / ముమ్మారు రమా రామా/ రమ్మరమర మేర మరి రామ రామ మురారీ!” కేవల సోష్ఠ్య కందాలు, నిరోష్ట్య ద్వివిధ కందం అంటే ఒకే కందంలో రెండు కందాలు నిరోష్ట్యంగా, అపంచవర్గీయ ముక్తపద గ్రస్తం, అంటే కచటతప వర్గాక్షరాలు వాడకుండా వాడిన మిగతా అక్షరాలతోనే ముక్తపదగ్రస్తంగా చెప్పటం, విశేషమైన విలక్షణమైన ప్రయోగాలున్నాయి.

ప్రసిద్ధ వృత్తాలే కాక పంచరామరము, తోటకము, మొదలైన విశేష వృత్తాలున్నాయి.

అచల జిహ్విక పద్యం, పద్యమంతా చదివితే నాలుక కదలదు.

పాదభ్రమిక కందం, ప్రతిపాదం తిరగేసినా ఒకే తీరుగా ఉండటం.

ద్విప్రాస, త్రిప్రాస, చతుష్, పంచ ప్రాసలతో పద్యాల ఆనందాన్ని కలిగిస్తాయి.

గర్భమత్తేభకందగీతాలు, ఛత్ర, చక్ర, పుష్పగుచ్ఛ, సర్వతో భద్రాది బంధాలు గల పద్యాలు అద్భుతమైన అతని రచనాపాటవాన్ని పట్టిస్తాయి.

తాడి తన్నెడి వాడుంటే తలదన్నేవాడుంటాడు వంటి సామెతలు ప్రయోగాలున్నాయి.

కాణాదం పెద్దన చతుర్విధ కవిత్వానికి కాణాచి.

పందొమ్మిదో శతాబ్దం ఉత్తరార్థం వాడయిన అల్లమరాజు సుబ్రహ్మణ్యం అనే కవి భద్రాపరిణయ కావ్యాన్ని రాశాడు. ఇతని కావ్యంలో అనేక పద్యాలు పెద్దననుకరించినవి ఉన్నాయి. కొన్ని పద్యాలు కించిద్భేదంతో యథాతథంగా రాశాడు. ఈ కవి ప్రభావాన్ని తప్పించుకోలేకపోయాడు.

తెలంగాణ నుండి వెలువడిన అరుదైన అద్భుతమైన ప్రబంధాలలో ముకుంద విలాసం ప్రత్యేకంగా పేర్కొనదగినది. ఇంత గొప్ప ప్రబంధమైనా అంతగా ప్రచారానికి నోచుకోని ఈ ప్రబంధాన్ని పరిచయం చేయుమని సూచించిన కవి, పండితుడు మిత్రుడు రామశేషయ్యకు, మయూఖలో ప్రచురణకు స్వీకరించిన సంపాదకురాలు, కవయిత్రి డా|| కొండపల్లి నీహారిణిగార్లకు ధన్యవాదాలు.

1985లో తెలుగు విజ్ఞానపీఠం వారు ఆచార్య రవ్వాశ్రీహరిగారి సంపాదకత్వంలో మొదటిసారి ప్రచురించారు. తెలంగాణ సాహిత్య అకాడమి కాని తెలుగు విశ్వవిద్యాలయం కాని మరల ముద్రించినట్లయితే ఈ ప్రబంధం వెలుగులోకి వస్తుంది.

You may also like

Leave a Comment