Home ఇంద్రధనుస్సు మున్నుడి

మున్నుడి

తెలుగు సాహిత్యంలో శతకానికి చాలా ప్రాముఖ్యత ఉన్నదని మన పెద్దలు చెప్పి ఎన్నో శతకాలు వెలువరించారు కూడా…భక్తిని తెలిపేందుకు, భక్తి మార్గంలో నడిచేందుకు అంటే భక్తి ప్రచోదనంగా శతక సాహిత్యం ఎంతగానో తోడ్పడుతుంది.
శతకము అంటే వంద. ఒకటి పక్కన రెండు సున్నాలు.ఈ వంద సంఖ్య ఆధ్యాత్మిక ప్రపంచంలో ( భక్తి సామ్రాజ్యంలో) ఎంతో వందనీయం. ఎలా అంటే….
ఒకటి సంఖ్య స్థానంలో శ్రీమన్నారాయణుడున్నాడనుకుంటే ఒక సున్న (0) జీవతత్త్వం మరొక సున్న (0) ప్రకృతి తత్త్వం ….ఈమూడు కలిసిన తత్త్వం…
1= శ్రీమన్నారాయణుడు
0= జీవ తత్త్వం
0 = ప్రకృతి తత్త్వం
100 = జీవ తత్త్వం…ఈ తత్త్వం గురువుల దైతే…
ప్రకృతి తత్త్వం అంటే పంచభూతాత్మకమైన శరీరం.
సర్వలోకేశ్వరుడు = ఒకటి (1)అనే అంకెను రెండు సున్నాల (00)ముందు ఒకటి చేరిస్తేనే (1+00) ఆ రెండు సున్నాలకు విలువ ఉంటుంది.
ఇంకా వివరంగా చెప్పాలంటే…
1= దివ్యశక్తి సాకారం. ( ఈ దివ్య శక్తే కదా! జగత్తును నడిపే శక్తి…)
అందుకే వందసార్లు వేడుకుంటూ రచయిత గాదె వేంకటరామారావు గారి “యాదగిరి లక్ష్మీనారసింహ” శతక రచనసాగింది.
మంచి సంప్రదాయ పరులు కావడం వల్ల శరణాగతి చేసారు.
శరణాగతినే ప్రపత్తి అనీ, భరన్యాసమనీ అంటారు. భగవంతుడే రక్షకుడు, మోక్షం కావాలన్నా ఆయనే ఉపాయమనీ ( శరణం) పూర్తి నమ్మకంతో భగవంతుని మనసులో నిలుపుకోవడమే శరణాగతి. మన భారాన్ని భగవంతుని పైన ఉంచడం న్యాసం లేదా శరణాగతి చేయడం…

అలా కాకుండా నన్ను నేను రక్షించుకుంటాననడం వ్యతిరేకమవుతుంది. ఎందుకంటే భగవంతుడు తన భక్తులను ఎప్పుడూ రక్షించాలనే ఎదురుచూస్తుంటాడు. అది ఆయన స్వభావం. అందుకు వ్యతిరేకంగా: నన్ను నేను రక్షించుకోగలను ” అనే స్వతంత్ర భావన ఉండకూడదు. స్వప్రవృత్తి నివృత్తి అంటే ఇదే! ఇలా ఏ పరిస్థితులలో నైనా భగవంతుని మీద విశ్వాసం పోగొట్టుకోకుండా ఉండడమే శరణాగతి లేదా ప్రపత్తి.
శరణాగతి చేయడానికి రెండు ప్రధాన లక్షణాలుండాలి. 1. ఆకించన్యము, 2. అనన్యగతి.

  1. ఆకించన్యము – “స్వామీ! నేను ఎలాటి యోగ్యత, శక్తి లేనివాడిని, దీనుణ్ణి” అని ప్రార్థించడం.
  2. అనన్యగతి – “స్వామీ! నువ్వు తప్ప నాకు ఎవ్వరూ రక్షకులు లేరు, నువ్వే నాకు దిక్కూ, దీపమూ” అని మహావిశ్వాసాన్ని ప్రకటించి, ఆచరణలో పెట్టడం.

సకృదేవ ప్రపన్నాయ అని శ్రీరాముడూ,
సర్వధర్మాన్ పరిత్యజ్య అని శ్రీకృష్ణుడూ శరణాగతే సులభమైన, సుకరమైన మోక్షోపాయమని చెప్పారు.

శరణాగతి ఈ విధంగా ఒక్కసారి చేస్తే చాలు, సదాచార్యుల సమాశ్రయణం శరణాగతి మంత్రాన్ని ప్రసాదిస్తుంది.

శ్రీరామాయణాన్ని శరణాగతి వేదం అనీ,
విభీషణ శరణాగతిని పరిపూర్ణ ప్రపత్తి విధానం అనీ పెద్దలు నిరూపించారు.

రచయిత చెప్పిన భక్తి మార్గంలో నడిస్తే సులువుగా భగవంతుని అనుగ్రహం లభిస్తుందని ఏకీభవిస్తూ…

రంగరాజు పద్మజ

శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ శతకము :–

1.శార్దూలము

శ్రీ లక్ష్మీశ, నృసింహ, భక్తజన, సు శ్రేయోభిలాషా,హరీ
నీ లాలిత్యము సూసి నా కవిత సాన్నిధ్యాల సంసేవకై
అలాపంబున బల్కుచున్నది ప్రభూ ఆనందసంధాయివై మేలాసించుము దేవ! యాదగిరి లక్ష్మీ నారసింహా ప్రభూ !

ప్రతి పదార్థము:–
శ్రీ లక్ష్మీశ= లక్ష్మీదేవి భర్తైన; నృసింహ= నర శ్రేష్ఠుడు,
భక్తజన= భక్తులైన వారి; సు= మంచి; శ్రేయోభిలాషి= హితుడు; హరీ=విష్ణువు; లాలిత్యము = లలితము; సూసి= చూసి; నా= నాయొక్క;
కవిత =కవిత్వం ( శతకరచన) సాన్నిధ్యము=సన్నిధిలో
సంసేవ=పూజ, అర్చన ;
ఆలాపన= పలవరింత ;
పల్కు= మాట్లాడు;
ప్రభూ= ప్రభువా!
ఆనంద=సంతోషము;
సంధానము=సమకూర్చుట;
మేలు= శుభము, (ఉపకారం) ;
ఆసించు= కోరుకొను
దేవ= ఓ దేవుడా! ఇచ్చేవాడా!
యాదగిరి లక్ష్మీ నారసింహ = యాదగిరి గుట్టపై వెలసిన నరసింహా !!!

తాత్పర్యం:– యాదగిరి గుట్టపై వెలసిన ఓ నరసింహా! లక్ష్మీదేవి భర్తగా, నరశ్రేష్ఠుడిగా భక్త జనుల హితము కోరి,అందరికీ సుఖసంతోషాలనిచ్చేదేవుడా! నేను నీ అందమైన రూపం చూసి,నిన్నే పలవరిస్తూ , నీ దగ్గర పూజార్చన వలె నా శతకాన్ని నీకు సమర్పిస్తున్నాను.. స్వీకరించి ఆనందాన్ని కలిగించువయ్యా!

  1. మత్తేభము

కవినై వచ్చితి జన్మ కర్మ ఫల సత్కారార్హ సౌభాగ్య సం
స్థవ నీయంబగుఁ గీర్తి చంద్రికలమందానంద సందోహలై
అవదానంబున భక్తిభావనల నత్యంతంబు లాలింపగన్
శివ దేవా కరుణించు యాదగిరి లక్ష్మీ నారసింహా ప్రభూ॥

అర్థము:–

కవి= కవిత్వం చెప్పేవాడు,
జన్మ కర్మ ఫలం= పుట్టుకలచే ప్రారబ్దంతో కలిగిన ఫలితం;
సత్కారార్హ = మంచి పనులు చేయుటకు అర్హత;
సౌభాగ్య= యోగము;
సంస్తవ = చక్కని స్తోత్రం;
కీర్తి చంద్రికలు= వెన్నెల వంటి యశము
అమందానంద = అధికమైన సంతోషం;
సందోహము = సమూహం( మొత్తము)
అవదానంబున= తుంచి వేసి
భక్తి = శ్రద్ధ
భావన= తలంపు
అత్యంత= మిక్కిలి,
లాలింపగ = బుజ్జగించ,
శివ దేవా= శుభాలనిచ్చే వాడా!
తాత్పర్యం:– శుభాలనిచ్చే ! ఓ యాదగిరి లక్ష్మీ నరసింహ!! నాపై దయచూపుము. నేను
ఎన్నో జన్మల నుండి చేస్తున్న కర్మలతో కలిగిన ప్రారబ్ధాన్ని తొలగించుకోవడానికి, మంచి పనులను చేసే అర్హత యోగ్యతను ఇవ్వమంటూ చక్కని స్తోత్రాలతో వెన్నెల వంటి నీ ప్రతాపాన్ని ఎంతో సంతోషంతో, శ్రద్ధాసక్తులతో లలితంగా చెప్పడానికి కవినై వచ్చాను. నన్ను లాలించవయ్యా!

అలంకారం :-రూపకాలంకారం

  1. మత్తేభము

కలలో గాంచితి నీదు రూపమును, సాక్షాత్కార సంపత్తియున్
కలగా వచ్చిన నీకు నా హృదయ సంకల్పంబు సిద్దించగన్
కల నాదంబున పద్య సద్రచన సత్కారంబు గావించెదన్
సెలవా! శ్రీనగవాస యాదగిరి లక్ష్మీనారసింహా ప్రభూ॥

అర్థాలు :–
కల = స్వప్నం;
కాంచి= చూసి;
నీదు= నీ యొక్క;
రూపము= ఆకారం;
సాక్షాత్కారము= ప్రత్యక్షం
సంపత్తి= ఐశ్వర్యం
హృదయము= మనసు;
సంకల్పము= మనసులో పని తలపెట్టుట
సిద్ధించుట= లభించు
కల= కలిగిన;
నాదం= ధ్వని ( మోత)
పద్యము= యతి ప్రాసలతో కూడిన రచన
సత్= మంచి;
రచన= కవిత్వం చెప్పడం;
సత్కారము= సమ్మానం;
గావించుట= చేయుట.
శ్రీ= శ్రేష్టమైన;
నగము= కొండ.

తాత్పర్యం:–
పవిత్రమైన యాదగిరిగుట్టపై వెలసిన యాదగిరి లక్ష్మీ నరసింహా! నా ఎదుట కనిపించగానే, నీ యొక్క సామర్థ్యాన్ని, ఐశ్వర్యాన్ని చూసిన నా మనసు నిన్ను సమ్మానించాలనే తలపుతో నా ఆత్మ మనసును, మనసు వహ్నిని, వహ్ని వాయువును ప్రేరేపించగా వాయువు బ్రహ్మ గ్రంథి యైన మూలాధారం నుండి ఊర్ధ్వ ముఖంగా నాభి, హృదయం, కంఠం, శిరస్సు, ముఖం నుండి మంచి పద్యాలను రచించి నిన్ను సన్మానించాలని తలచాను.

4.మత్తేభము
జననంబందినదాది సచ్చరిత సంస్కారంబులం జెందకన్
దినముల్బుచ్చుచు,దీనమానసుడనై దివ్య
ప్రభావంబులన్
గనలేనైతిని మూఢ జన్మునకు సంకల్పాల రాగంబు జే
సిన దేవా శృతినిమ్ము యాదగిరి లక్ష్మీ నారసింహా ప్రభూ॥
అర్థాలు:–
జననంబు= పుట్టుక ;
అందినదాది= పుట్టినది మొదలు;
సచ్చరిత= మంచి నడవడి;
సంస్కారంబులు= పంచ సంస్కారములు [ తాప సంస్కారం, పుండ్ర సంస్కారం, నామ సంస్కారం, మంత్ర సంస్కారం, వైష్ణవేష్టి]
చెందక= పొందక;
దినము=రోజులు;
పుచ్చుచు= గడుపుచు;
దీన= భయంతో;
మానసుడు= మనసుకలవాడు;
దివ్య=ప్రకాశించు;
ప్రభావంబులు=మహాత్మ్యము;
కనలేనైతి= చూడలేకపోతిని;
మూఢ= తెలివిలేని;
సంకల్పాలు= బాగా ఆలోచించుట;
రాగంబు= రాగద్వేషాలు
శృతి=వేదాధ్యయనం.

తాత్పర్యం:—
యాదగిరి లక్ష్మీ నరసింహా! పుట్టినది మొదలు మంచి నడవడి లేక , గురువులతో సమాశ్రయణం పొందకుండా, కాలం వృధాగా గడిపుతూ… నా తెలివి తక్కువ తనంతో, నా మనసు రాగద్వేషాలతో నిండిపోయి, ఆలోచించే జ్ఞానంలేక నీ యొక్క మహాత్మ్యం చూడలేక పోతిని! నా వంటి తెలివి లేని వానికి వేదాధ్యయనము చేసే జ్ఞానమునిమ్ము!

5 శార్దూలము

నేముక్తుండనుగాన, నవ్వు ముఖమున్, నిర్దోష భద్రా కృతిన్
ధీమంతోజ్వల విశ్వదర్శన కళాధ్యేయంబు పూర్ణత్వమున్
సామీప్యంబును గాంచినాడగద శ్రీశా భక్త కల్పధ్రుమా
శ్రీ మంతా జయదేవ యాదగిరి లక్ష్మీ నారసింహా ప్రభూ॥

అర్థాలు:–

నే= నేను
ముక్తుండ = మోక్షం పొందిన వాడను
నిర్దోష = తప్పు చేయని వాడు
భద్రాకృతి = శుభా కారుడు( శ్రేష్ఠుడు)
ధీమంతము = బుద్ధి గల
ఉజ్వలము = వెలుగునది
విశ్వదర్శన = ప్రపంచాన్ని పారమార్థికంగా చూడడం
కళ = విద్య( శోభ)
ధ్యేయంబు = లక్ష్యము( గురి)
పూర్ణ త్వము = నిండుగా( సంపూర్ణ)
సామీప్యంబు = దగ్గర ( దాపు)
శ్రీశా = లక్ష్మిభర్త ( విష్ణువు)
కల్ప ధ్రుమ = కోరినవి ప్రసాదించే దేవతా వృక్షం
శ్రీమంత = భాగ్యవంతుడు
జయదేవ = గెలుపు( జయము)

తాత్పర్యం:–
యాదగిరి లక్ష్మీ నరసింహ! నీ యొక్క ఎలాంటి దోషాలు లేని నవ్వు ముఖాన్ని, శ్రేష్టమైననీ రూపాన్ని, శోభతో వెలిగి పోయే నీ రూపును పారమార్థిక దృష్టితో చూడాలని లక్ష్యంతో దగ్గరనుండి చూసాను కదా!
లక్ష్మీ వల్లభా కోరిన కోరికలు తీర్చే భాగ్యవంతుడా! నేను మోక్షం పొందడానికి అర్హుడను కానా? నీకు జయం కలుగుగాక!

6.శార్దూలము
చేమంతుల్ విరజాజి కేతకులు సచ్ఛీలాల మందారముల్
మీ మేలుందలబోయ, యక్షతలు సామీప్యాల సంధింపగన్
నోమున్నోమెద గంధహారతుల నెన్నో గూర్చి సర్వాత్మకా
శ్రీమంతా సెలవిమ్ము యాదగిరి లక్ష్మీనారసింహా ప్రభూ॥

అర్థములు:–

చేమంతులు = చామంతి పువ్వులు
విరజాజి = నవ మాలిక పువ్వులు( జాజిపూలు)
కేతకులు = మొగిలి పువ్వులు.
సచ్ఛీలాల = సువాసన గలిగిన
మందారాలు = మందార పువ్వు
మేలు = ఉపకారం
అక్షతలు = ఆశీర్వదించేందుకు పసుపు కలిపిన విరగని బియ్యం( అక్షంతలు)
సామీప్యము = దగ్గరలే
సంధింప = కూర్చు (కలుపు)
నోము = వ్రతము
గంధ హారతులు = చందనము, కర్పూర ఆరతి
ఎన్నో కూర్చి = ఎన్నో చేర్చి
సర్వాత్మకా = అంతటా వ్యాపించిన
శ్రీమంతా = భాగ్యవంతుడా
సెలవిమ్ము = ఆజ్ఞ ఇవ్వు

తాత్పర్యం:–
ఓ!యాదగిరి నరసింహా! మాకు నువ్వు చేసిన ఉపకారాన్ని తలుచుకుంటూ కృతజ్ఞతగా, నీ దగ్గరే ఉంటూ, చేమంతులు, విరజాజులు, మొగిలి పువ్వులు, మందారాలు, అక్షంతలు, మంచి వాసన కలిగిన చందనం, కర్పూర హారతులతో నీ పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నాము… ఓ భాగ్యవంతుడా
ఆజ్ఞ ఇవ్వు!

7.మత్తేభము

సురధీప్తిన్ లిఖితారక్షరంబుల వలెన్ సూచించు సాహిత్య సం
బర లేఖాకృతి గ్రంథజాతములు, దుష్ప్రాప్తానబోర్లాడు చున్
దరిజేర్పుండని మ్రొక్కుచున్నవి కరద్వంద్వాల బైకెత్తి రా
సిరి నాకుంగలిగించు యాదగిరి లక్ష్మీ నారసింహా ప్రభూ!

అర్థములు :—

సురధీప్తిన్ = అధిక కాంతితో
లిఖిత = రాయబడిన;
అక్షరంబులు = (క్షరముకానివి) ఓనమాలు
సూచించు = తెలియజేయు
సాహిత్య = హితముతో కూడిన
సంబర = ఉత్సవము( పండుగ)
లేఖాకృతి = ఉత్తరంవలె
గ్రంథ జాతములు = కావ్యా సమూహం
దుష్ప్రాప్త = పరితపించేలా చేయునవి
బోర్లాడు = ముఖం నేలకు ఆనేలా పడిపోవు
దరిచేర్పుండని = తీరం చేర్చమని
ద్వంద్వము = రెండు
కరము = చేతులతో
పైకెత్తి = తల మీదకు చేర్చి
మొక్కుచు = నమస్కరించుచు
సిరి = శోభ
నాకు కలిగించు = నాకు ఇవ్వు

తాత్పర్యం:—

ఓ లక్ష్మీ నరసింహా! ముత్యాలవలె రాసిన అక్షరాలతో రాసిన లేఖలు మంచి హితవు కోరే కావ్యాలను పరితపింపచేస్తాయి. మంచి హితవు కోరిన కావ్యాలు అడుగున పడిపోతాయి అలా కాకుండా నాకు మంచి విద్యనిమ్మనిరెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను !!

8.శార్దూలము:-
వింటిన్ వేద పురాణ భారత కథావిర్భూత భావంబులన్
గంటిన్ భాగవత ప్రబంధ చయ సత్కావ్యార్థ ఛందంబులన్
కుంటైపోతిని నీదు మాయ గన లేకుంటిన్ వృషీకేశవా
యింటింటన్ గలవాడ యాదగిరి లక్ష్మీ నారసింహా ప్రభూ!

అర్ధములు:–

వేద పురాణ భారత కథావిర్భూత= వేదాల, పురాణాల ,భారత కథల నుండి
భావంబుల = అభిప్రాయాల
వింటిని = విన్నాను
కంటిన్ = తెలుసుకున్నాను
ప్రబంధ = ప్రబంధాల యొక్క
చయ = సంగ్రహాలు
సత్కావ్య = ఉత్తమమైన కావ్యాలు
అర్ధ = అర్థాలు
ఛందంబులన్ = అభిప్రాయాలను
కుంటినై = అవిటి వాడినై
నీదు = నీ యొక్క
మాయగన = గారడీని తెలుసుకో
లేకుంటి = లేకపోతి
వృషీకేశవా = విష్ణువు
యింటింట = ప్రతీ యింటిలో

తాత్పర్యం :–
ఓ యాదగిరి లక్ష్మీ నరసింహప్రభూ!
వేదాలలోని ,పురాణాలలోని మరియు భారత కథలలోని భావాలను విన్నాను. ప్రబంధాలలోని మంచి విషయాలను చూశాను.ప్రతి ఇంట్లో ఉన్న వృషీకేశవా ! నీ మాయను వైకల్యంతో తెలుసుకోలేక పోయాను!

9.శార్దూలము:

మెట్లెక్కాలని యెక్కుచుంటి నలకల్మీదారిలోనున్నదా
కట్లం జూసెగ బోతబోసుకుని, దీక్షంబూర్తిగావించి రా
కట్లం దాటితి నేను నీవు దయతో గైవల్య లోకానికిం
కెట్లో నం దరిజేర్చు యాదగిరి లక్ష్మీ నారసింహా ప్రభూ ॥

అర్ధాలు :–

మెట్లు = తంతెలు ( సోపానములు)
ఎక్కడం = అధిరోహించడం
కల్మి = కలిమి( సంపద)
దారి = తోవ ( బాట )
ఉన్న = వాస్తవం
తాకట్లు = చాడీలు ( కొట్లాట)
పోతపోసుకొని = అచ్చు పోసినట్టు( ఉన్నది ఉన్నట్టు)
దీక్ష = పట్టుదల
కట్లు = తాడుతో కట్టడం
కైవల్యము = మోక్షం
లోకము = ప్రపంచం
దరిచేర్చు = గట్టు చేర్చు.

తాత్పర్యం :—
ఓ యాదగిరి లక్ష్మీ నారసింహ ప్రభూ !
నేను మెట్లు ఎక్కాలని ఎక్కుతున్నాను.. కానీ అవి వంకరటింకరగా ఉండి, అచ్చంగా తగవుపెట్టి అడ్డుపడేలా ఉన్నాయి. ఎలాగో పట్టుదలగా ఆ మెలికలను దాటాను. నువ్వు దయతో స్వర్గ లోకానికి చేర్చు!

విశేషార్థం:– సాధకుడు మోక్షగామియై దీక్షబూని, యజ్ఞం, యాగం, తపస్సు, దానం మంచి నడవడితో ధర్మబద్ధంగా జీవించడం మొదలైన ఎన్నో సాధనలు చేస్తున్నాడు. కానీ ఆసాధనకు ఎన్నో అంతరాయాలు ఏర్పడినా, పట్టుదలతో సక్రమంగా నెరవేర్చి స్వర్గ సోపానాలన్నీఎక్కే ప్రయత్నంలో ఓ!యాదగిరీశా!!
దయతో నన్ను ఆ మోక్షలోకానికి తీసుకుని వెళ్ళు
అని మోక్ష గామిగా కవి హృదయం ఆవిష్కరించారు.

10 శార్దూలము

స్వామీ! నీకు నమస్కృతుల్సలిపి యీషా! భావమున్ గల్గి ఢ
క్కామొక్కీలను లెక్కసేయకను ,సంకల్పంబు సిద్ధింప గన్
ప్రేమానంద మరంద కందళిత, సంప్రీతిన్
యశః కామినై
మీముందాగితినయ్య! యాదగిరి లక్ష్మీనారసింహా ప్రభూ

అర్ధాలు :–

స్వామి = యజమాని
నమస్కృతులు = నమస్కారాలు
సల్పి = చేసి
ఈషా = ప్రభువా!
భావము కలిగి = అభిమానంతో
ఢక్కాముక్కీలు = ఇబ్బందులు( కష్టనష్టాలు)
లెక్కచేయక = లక్ష్యపెట్టక
సంకల్పంబు = ఒక పని చేయాలనే ఆలోచన
సిద్ధింపగా = నెరవేరగా( సమకూరగా)
ప్రేమానంద మరంద కందళిత= మొగ్గ తొడిగిన తేనె వంటి తీయనైన పరవళ్ళు తొక్కే ఆనందంతో కూడిన ప్రేమ
సంప్రీతి = ప్రేమ
యశఃకామిని = కీర్తి కాంత
మీ ముందు = నీ ఎదుట
ఆగితిని = నిలిచాను

భావము:– యాదగిరి లక్ష్మీనారసింహ ప్రభూ!! నువ్వే నాకు ప్రభువని తలచి,నీకు నమస్కారాలు చేసి, కష్టనష్టాలను లెక్కచేయకుండా నన్ను కీర్తికాంత వరించాలనే కోరికతో హుషారుగా పరవళ్ళు తొక్కే సంతోషంతో నీపై ప్రేమతో మీ ముందు నిలిచానయ్యా!

వ్యాకరణ విశేషం
అలంకారం :-రూపకాలంకారం

You may also like

Leave a Comment