అడవి అంతా ఒకే విషయం పై చర్చలు జరుగుతున్నాయి. ఆరోజు మృగరాజు నిర్ణయించిన విషయంపై అన్ని జంతువులూ మాట్లాడుకుంటున్నాయి. కాకులన్నీ చెట్టు మీద వాలి వాటిలో అవి చర్చించుకుంటున్నాయి. కోతులు మరోవైపు కూర్చుని మాట్లాడుకుంటున్నాయి ! ఏ జాతి జంతువులు ఆ జాతంతా ఒక చోట కూడి ఈ సమస్యనెలా పరిష్కరించాలా అని తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి.
ఆరోజు నిద్రలేవగానే మృగరాజుకు ఒక మిత ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా జంతువులన్నింటినీ పిలిచి సమావేశపరిచి తన ఆలోచన చెప్పింది ఆ మాట వినగానే జంతువులకు గుండెల్లో రాయి పడింది మృగరాజు ఏమన్నదంటే “నేను ఈ రాజ్యానికి రాజును కదా! నేను మాట్లాడే భాషనే మీరు కూడా మాట్లాడాలి యదారాజా! తథాప్రజా అన్నారు కదా! రాజు వలె ప్రజలు ఉండాలి. మీరంతా రెపటి నుండి నాలాగా గర్జించటం మొదలు పెట్టండి”
ఈ మాటలు విన్న దగ్గర నుంచీ జంతువులు ఇలా గుంపులుగా కూర్చుని మాట్లాడుకుంటున్నాయి ఏనుగులు. ఓ గుంపుగా, పులులు మరో గుంపులా, జింకలు మరోచోట సమావేశమయ్యాయి పెద్ద జంతువులన్నీ ఒక చోట ఉంటే చిన్న జంతువులన్నీ మరో చోట కూర్చున్నాయి. ఏది ఏమైనా గర్జించటం ఎలా నేర్చుకోవాలో అర్థం కాలేదు.
పులులు ఎంత అరిచినా గాండ్రింపే అనిపిస్తున్నది. కానీ గర్జింపులా రావటం లేదు. ఏనుగులు అరుస్తున్నాయి ఘీంకారమే వినిపిస్తోంది కానీ గర్జనలా వినిపించటం లేదు గుర్రాలు, గాడిదలు బాగా గర్జించామనుకున్నాయి. అన్నీ సకిలింపులు, ఓండ్రు పెట్టడాలే అయ్యాయి.
జంతువులన్నీ గొంతెత్తి అరుస్తున్నాయి. గానీ ఏ జంతువు కూడా గర్జించలేక పోతున్నది. సాయంత్రందాకా అరిచి అరిచి అలిసిపోయి చెట్ల కింద కూలబడ్డాయి. ఏం చేద్దాం ఏం చేద్దాం అంటూ చర్చించుకున్నాయి. ఒళ్ళు అలిసిపోవడంతో బుర్రలూ పనిచేయడం మానేశాయి.
ఒక ఏనుగు ఒక ఉపాయం చెప్పింది. మిగతా జంతువులన్నీ తల ఊపాయి. జంతువులన్నీ మూకుమ్మడిగా మృగరాజు దగ్గరకు వెళ్ళారు.
”మహారాజా! మీరు ఆడవికే రాజు కదా! ముందుగా మీరు మా బాషల్లో మాట్లాడితే చూడాలని ఉన్నది. మేమంతా మందమతులం. త్వరగా నేర్చుకోలేక పోతున్నాం. మీరు ఒక్కసారి మా అందరి మాటల్లో మాట్లాడితే విని తరించాలని ఉన్నది ప్రజలందరికీ రాజు గొప్పదనం గురించి తెలియాలి. మీరు గొప్పవారు ఒక్కసారి మీ ప్రతిభను చూపండి” అని జంతువులన్నీ వేడుకున్నాయి.
అన్ని జంతువులు దీనంగా మొహం పెట్టి వేడుకుంటుంటే సింహరాజు గర్వంగా మీసం మెలేసింది. తర్వాత గొంతు సవరించుకొని ఒక్క జంతువు యొక్క అరుపూ వినిపించాలనుకున్నది. ఏనుగుల్లా ఘీంకారం చేద్దామని ప్రయత్నించింది. కానీ నోరు పెగల్లేదు పులిలా గాండ్రిద్దా మనుకున్నది. రాలేదు అదేమిటి ఎంత ప్రయత్నించినా ఏ జంతువు అరుపూ రావడం లేదు చిన్న పక్షులు కాకి, పిచ్చుకల్లా అరుద్దాం. సులభంగా ఉంటుంది అనుకున్నంది ఏముంది కావ్ కావ్ అనటమే కదా అనటమే కదా అనుకుంటే అదీ రాలేడు. గ్రామ సింహం అని నారే పెట్టుకున్నది భౌ భౌ అని చూద్దామంటే, అబ్బె ఏదీ రాదే ఏం చేయడం. సింహానికి పరువు పోయింది. ఏం చేయాలో అర్థం కాక తల దించుకున్నది.
ఏనుగుల నాయకుడు “ఇందులో మీ తప్పేమి లేదు మహారాజా ! సృష్టిలో ఒక్కో జంతువుకు ఒక్కో అరుపు ఒక్కో భాష ఉన్నాయి. అవి అలాగే మాట్లాడగలవు. అందరూ అన్ని అరుపులూ అరిచేస్తే ఆయా జంతువుల ప్రత్యేకత ఎలా తెలుస్తుంది. భిన్నత్యంలో ఏకత్వం ఉంటేనే అడవి ప్రశాంతంగా ఉంటుంది. ఈ భాషల గోల వదిలేసి అందరం కలిసిమెలిసి ఉందాం” అన్నాడు.
జంతువులన్నీ “మహారాజుకు జై” అని అరిచాయి. సింహం సంతోషంగా తల ఊపింది.
మృగరాజు భాష
previous post