పచ్చని నేలపై పశుత్వం
పెల్లుబికిన వేళ
భూగర్భ ఖనిజాలపై
దృష్టి పడిన వేళ
కన్నూ మిన్నూ కానకుండా,
స్త్రీలు పిల్లలు అని చూడకుండా,
దాడులు అత్యాచారాలు
జరిపిన వేళ
దుకాణాలు,
వాహనాలు,
ఇళ్ళు,కాల్చివేసి,
బూడిద చేసిన వేళ
దిగంబర స్త్రీపై
దాష్టీకం చేస్తున్నాడు క్రూరుడొకడు
బెల్టుతో బాదుతున్నాడు
నిర్దయతో వాడొకడు
నవ్విపోదురుగాక నాకేంటన్నట్టు
నడిబజార్ లో సిగ్గు లేని జనాలు
చోద్యం చూస్తున్నవేళ
కాళ్లొకచోట
చేతులొకచోట
తలొకచోట
మొండెమెుక చోట
తెగిపడిన వేళ
మణిపూర్ మాయలో పడిన వేళ
ప్రపంచంలో జరుగనటువంటి
హింస జరిగిన వేళ
ఈ కిరాతకానికి
హిట్లర్ సైతం సిగ్గుపడేవేళ
రెండు నెలలుగా
సోషల్ మీడియాను
చీకట్లో ఉంచిన వేళ
ఎంతోమంది తల్లుల
అక్కల చెల్లెళ్ళ
కూతుళ్ళ హాహాకారాలకు
ఆకాశం దద్దరిల్లిందేమో
దేవుని వద్ద దేర్ ఉంది
ఆయన వద్ద
అధేంర్ లేదు
దేవుడికి భయపడాలి మరి
అది మణిపూర్ కానీ
మరోటి కానీ
తప్పు చేసారంటే తలవంచాల్సిందే!
పిల్లి కళ్ళు మూసుకొని
పాలు తాగినంత మాత్రాన
ప్రపంచం చూడకుండా ఉంటుందా?
ఓ ప్రపంచమా మేలుకో
ఓభారతీయుడా మేలుకో
శాంతిని
సోదర భావాన్ని
ప్రేమాభిమానాలు
గల వాతావరణాన్ని
ఈ నేల కోరుతున్నది
కంకణం కట్టుకో
కంకణం కట్టుకో
కంకణం కట్టుకో