అలవికాని ఆకర్షణబంధాల,
రాక్షస ఆనందాల
కోరికల కోలాహలంలో చిక్కుకున్నాడు మానవుడు
స్మార్ట్ ఫోన్ల నీలితెరల్లో గంటలకుగంటలు
అలసినమేధావి
నిద్రాణంగా వున్నాడు
ఛాటింగ్,చీటింగ్ లలో మాస్టరైన బుద్దిజీవి
కామవాంఛతో కళ్లు మూసుకుంటున్నాడు
ఒళ్లు మరచి తన భావి కొమ్మ పై తానే నిలబడి నరుక్కుంటున్నాడు
పల్లె నుండి పట్టణం
హస్తిన దాకైనా
ఒకటే కథ ఒకటే వ్యధ
ఆడవాళ్ల పై హత్యాచారం
నాగరికలోకం చీదరిస్తూ వుంటేనేం
సభ్యసమాజం ఊసివేస్తూ వుంటేనేం
ఒకటే కథ ఒకటే వ్యధ
ఆడవాళ్ల పై హత్యాచారం
ఎన్ని ‘దిశ’లు మొలవలేదు
ఎన్ని ఆశలు చితికిపోలేదు
ఎన్నిమార్లు కన్నీళ్ల గంగలు కన్నవాళ్ల కంట పొంగలేదు
ఎన్ని కుటుంబాలు కన్నీళ్ల ప్రవాహంలో కొట్టుకొనిపోలేదు
సంఘానికి ఇవి క్రొత్త కాదు
దేశానికి ఇవి క్రొత్తకాదు
ఈ గ్లోబల్ మార్కెట్ లో స్త్రీ లింగం
ఎపుడూ పురుషుపుంగవునికి ఆకర్షిణల ఆటవస్తువే
అఘాయిత్యాలు ఆగవాగవు అన్నిచోట్లా షరామామూలే
గాల్లో కలిసిపోయాయి
ఆధ్యాత్మిక ప్రవచనాలు
గంగలోకలిసిపోయాయి
కవుల అభ్యుదయ కవనాలు
షష్టిపూర్తైనా వీడలేడు మొనగాడు సెక్స్ శిఖరారోహణం
దేహం పుష్టితోఎక్కుపెడ్తున్నాడు ఎడాపెడా మన్మధ బాణం
కామలావాగ్ని పర్వతం మగరాయుడి దేహం
సముద్రమంతటి బలత్కార దాహం
వజ్రోత్సవ స్వాతంత్ర్య భారతంలో
వనిత గుండెగూడులో పగటివేళకూడా గుబులే
రాతిరైతే భయం దిగులే
కనికరం లేని కఠిన హృదయుడు
కన్నుమిన్ను కానని కామాంధుడు
ఆగదు ఈ అరణ్యరోదన
ఆగదాగదు ఈ మూగవేదన
ఆగదు ఈ తోలుయుద్ధం
ఆగదాగదు ఏ అన్యాయం
రక్తమాంసపు ఈ మహాసమరం
పాలన ఉదాసీనత గొడుగై ఉన్నంతవరకు
లా తన అడ్రస్ దాచుకొని నేరగాళ్లకు చుట్టాలైనంత వరకు
మగువ మనసు అర్థం కానంత వరకు
మగబుద్దిలోమార్పు రానంతవరకు
ఒకటే కథ ఒకటేవ్యధ
ఆడవారి లో మార్పు వచ్చినప్పుడు
చరిత రాత ఆమె వేదనైనప్పుడు
ఆవేదనను అణచిపెట్టి
ఆలోచనకు పదునుపెట్టి
ధీరురాలైనప్పుడు
వీరురాలైనప్పుడు
ఆగేనులే అత్యాచారాలు
ఆగేనులే హత్యాచారాలు
ఆమె ఒక బాణం
ఆమే ఒక ఖడ్గం
రాక్షస ఆనందం
previous post