Home కవితలు రాగమాలిక

రాగమాలిక

by B.V. Shivaprasad

తెల్లవారే జాము మరెంతో మిగిలేవుంటుంది

నేను సుషుప్తిలో గురకలు తీస్తూనేవుంటాను

కానీ నీ సగం నిద్ర కళ్ళు మాత్రం

నిన్ను నిర్దాక్షిణ్యంగా వంటగదిలోకి ఈడ్చుకుపోతాయి

నీ రోజువారీ రాగమాలిక మూడవ ‘కాలం’ లో మొదలౌతుంది

బ్రేక్ఫాస్ట్ బిలహరి రాగాన్నీ, లంచ్ బాక్సులు సర్దే మధ్యమావతి రాగాల్నీ ఆలపించి

అలసట థిల్లానా పాడుకుంటూనే ఆఫీసుకు చేరుకుంటావు

అక్కడ నీతోటివారూ, అధికారులూ

మరో మడత కచేరీ మొదలెడతారు

కాలగానం సాగి సాగి సాయంత్రమయ్యాక

సంధ్యారాగం సాయంతో ఇంటికి చేరుకుంటావు

ఆవారం తన వయసును ముగించుకుంటూ

ఆదివారంలోకి అంతిమంగా అడుగుపెడుతుంది

అయినా నీ కాలపట్టిక పెద్దగా మారదు

ఈసారి అదనంగా ఇల్లు శుభ్రం చేసే ఇంకో దీర్ఘ రాగాన్ని

నీ నిస్సతువ శరీరంతో పాడడం ప్రారంభిస్తావు

వారాంతం ముగిశాక సోమవారం మళ్ళీ మాకోసం

నీ శ్రమదాన సంగీత కచేరీ మొదలౌతుంది

‘ప్రేమికుల దినం’ రోజు మాత్రం నేను నీకు ఐ లవ్యూ చెప్పి

ఒక ముద్దుతో సరిపెడుతూవుంటాను

రేపు ఉగాది-మన కొత్త సంవత్సరాది

నేను కూడా రేపటినుంచి ప్రతిరోజూ

నీ దినచర్యలో పాలుపంచుకుంటాను

మాకోసం నువ్వు చేసే శ్రమయజ్ఞంలో

నావంతు పాత్రను పోషిస్తాను

You may also like

Leave a Comment