పదకొండవ ప్రకరణ
గ్రంథకర్త:-ఒద్దిరాజు సీతారామచంద్ర రాయశర్మ
సరళీకృతం:-రంగరాజు పద్మజ
[ నేడు తప్పినది; రేపు తప్పదు.]
శ్లో ॥ ” అస్మిన్ దినేనిష్ఫలతా భవేచ్ఛేత్
శ్వః సమ్యగేవ రచయామి నహిత్యజామి.”
— నవీన తపశ్విని.
భావం :–ఈ రోజున ప్రయత్నించిన కార్యం నిష్ఫలమయినా కానీ ,రేపు మళ్లీ ప్రయత్నం చేస్తాను కానీ ,దాన్ని వదిలి పెట్టను..మరల మరల..సఫలం అయ్యేదాక ప్రయత్నిస్తూనే ఉంటాను.
వ్యాఖ్య:–
రుద్రమదేవి నవలలోని ఈ కథాభాగానికి సరిగ్గా సరిపోయే అంశాన్ని ” నవీన తపశ్విని ” నుండి ప్రకరణాంశంగా తీసుకోవడం గ్రంథకర్త ప్రతినాయక లక్షణాలను చక్కగా వ్యక్తీకరిస్తూ… కథాగమనానికి ఎంతగానో తోడ్పడింది.
ఇలా పూర్వ కావ్యాలు, సుభాషితాలు. హితోపదేశం వంటివి ప్రకరణానికి పేర్లుగా ఉపయోగించడం వల్ల పాఠకులకు ఆ యా విశేషాలు ఏ గ్రంధంలో ఉన్నాయనే ఉత్సుకతతో వెతుకుతూ ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ చదువరులను తయారు చేసే నూతన ఒరవడి .
రంగరాజు పద్మజ
కథాభాగం:-
మహాదేవరాజు దేవగిరిలో తన ఉద్యానవనంలో విచిత్ర మంటపంలో ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. క్షణక్షణానికి అతని ముఖ కవళికలు రకరకాలుగా మారుతున్ననందు వల్ల అతడు ఒక విషయం కాకుండా, చాలా విషయాల గురించి ఆలోచిస్తున్నాడని మనకు తెలుస్తుంది. కోపం, దుఃఖం మొదలైన ఎన్నో భావాలు అతని ముఖంలో స్పష్టంగా కనపడుతూ మాయమవుతున్నాయి.
అప్పుడు సాయంకాలమైంది. ఇంకా చీకటి ముసురకున్నా దీపాలు వెలిగించారు. చల్లటి గాలి వీస్తున్నది. నిర్మలమైన ఆకాశంలో ఎరుపురంగు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. సంతోషం కలిగించే ఆ సమయం రాజులకు వేడుకగా తిరిగే సమయం. అయినా మహాదేవరాజు ఇంకొక మనుషి లేకుండా ఒంటరిగా ఉండడానికి జరిగిన విఫలతయే కారణమని తెలుస్తున్నది.
ఈ ఉద్యానవనం మహాదేవరాజు ఇంటి తోట. ఎన్నో రకాలైన పూలతో ఎప్పుడు చాలా దూరం వరకు సువాసనలను వ్యాపింపజేస్తూ మనసుకు సంతోషాన్ని కలిగిస్తుంది. మిగుల మగ్గిన పండ్లున్న చెట్లతో ఉన్న ఆ ఇంటి తోట ఈ మధ్యన నిండుగా ఉన్న నీటితో ఒక కొలను ఒడ్డున అందమైన పర్ణశాల ఉన్నది. దాన్నే ‘విచిత్ర మంటపం’ అని అంటారు. ఈ విచిత్ర మంటపంలోనే మహాదేవరాజు కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు.
మహాదేవరాజు ఆలోచిస్తున్న సమయంలో ఒకతను వచ్చి నమస్కరించి నిలబడ్డాడు. పది నిమిషాల దాకా రాజు ఏమి మాట్లాడలేదు. తరువాత అతనిని కూర్చోమన్నాడు. వచ్చినతను కూర్చున్నాడు.
అప్పుడు అతనితో ఇలా మాట్లాడాడు.
” ప్రహారేశ్వరా!” ఏం విశేషాలు?
ప్రహరేశ్వరుడు దేవగిరికి చెందిన వాడు. బ్రాహ్మణుడు కాక ఇతర వర్ణంవాడు. మహాదేవరాజు అతను కలిసి ఓకే గురుకులంలో చదువుకున్నారు. చిన్నతనం నుండి ఇద్దరూ మంచి స్నేహితులు. వీరిద్దరి మధ్య బంధుత్వం కూడా ఉన్నది. చూడడానికి రూపంలోనూ, వయసులోనూ ఇద్దరికీ అంత తేడా ఉండదు. వాళ్లకు చిన్నతనం నుండి ఉన్న వారి అభిప్రాయాలకు ఎటువంటి ఆటంకం కలగలేదు. ఇద్దరి మధ్య ఉన్న చనువు అలా కొనసాగటానికే మహాదేవరాజు దగ్గర ప్రహారీశ్వరుడు ఉద్యోగం చేయలేదు. మహాదేవరాజన్న మాటలకు అతను ఇలా బదులిచ్చాడు.
“అనుకున్న పనంతా ఇంకో తీరుగా జరిగింది”. అంతా అవమానం పాలే అయింది. అనుకున్నదొకటి జరిగిందొకటి.
రాజు గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఆశ్చర్యంతో ఇలా అన్నాడు. ఏమైంది? తొందరగా వివరంగా చెప్పు! నా మనసులో మొదలే ఒక అనుమానం వచ్చింది. నీ మాట మరింత భయం కలిగుతుంది. ఆలస్యం చేస్తే మనసులోని బాధ ఎక్కువ అవుతుంది.
” ఏమీ లేదు! మన ముగ్గురు యోధులు మరణించారు”.
చెప్పవెందుకు? కొంపముంచారే? ఎలా జరిగింది?
ప్రహరేశ్వరుడు జరిగిందంతా రాజుకు పూసగుచ్చినట్టు చెప్పాడు. రాజు పదిహేను నిమిషాల దాకా కొయ్యబారిపోయి, ఏమీ మాట్లాడలేదు. తరువాత దీర్ఘంగా నిట్టూర్చాడు.
బాధపడి మనం ఏం చేయగలం? చేయాల్సిన పని చాలా పకడ్బందీగా చేశాం. కాని దైవాజ్ఞ లేక ఫలించలేదు. అని ప్రహరేశ్వరుడు అన్నాడు.
నిజమే! చేసేది ఏమీ లేదు! పని సులువుగా అవుతుందనుకున్నాం. ఏ కారణం లేకుండానే మన పేరు బయట పడింది. అయినా అయ్యేది కాక మానదు! అని మహాదేవరాజు అన్నాడు.
ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగానే ఒక భటుడు వచ్చి ఒక కాగితం తెచ్చి మహాదేవరాజుకిచ్చి నమస్కరించాడు.
మహాదేవరాజు ఆ ఉత్తరం తీసుకుని నెమ్మదిగా చూస్తున్నాడు. అందులో ఏమి రాసి ఉన్నదో? కానీ, మహాదేవ రాజు పొగలేని నిప్పువలె మండిపడుతున్నాడు. గడ్డం దువ్వుతూ, మీసం మెలివేస్తూ, పళ్ళు పటపట కొరుకుతూ, లోలోపల చదువుకుంటున్నాడు.
కారణమేమిటో తెలియక ప్రహరేశ్వరుడు అలా చూస్తున్నాడు. మహాదేవరాజును ఆ విధంగా చూసి కారణం ఏమిటని అడిగే అవకాశం ప్రహరేశ్వరునికి ఇవ్వలేదు.
మహాదేవరాజు ఇలా కోపంతో ఊగిపోతూ, తరువాత చూశావా? ప్రహారేశ్వరా! ఆడవాళ్లకు కూడా కళ్ళు తలకెక్కాయి. నా దాసీదైన కమలనెంత అవమానించిందో ఈ రుద్రమ్మ! ” వినాశ కాలే విపరీత బుద్ధి” ( నాశనం అయ్యే సమయానికి వింత బుద్ధి పుట్టింది) అన్నట్టు నన్ను, నా పరివారాన్ని చులకనగా చూడడం ఈ రుద్రమకు పోయేకాలం వచ్చిందేమో? ఈ ఉత్తరం చూడు! అని ఆ ఉత్తరాన్ని ప్రహరేశ్వరుడికి ఇచ్చాడు.
అంతలోనే” ప్రహారేశ్వరా” ! ఒకసారి ఆ ఉత్తరాన్ని పెద్దగా చదువు! నేను వింటాను.” అని మహాదేవరాజన్నాడు.
ప్రహరేశ్వరుడు ఆ ఉత్తరాన్ని ఈ విధంగా చదవడం మొదలు పెట్టాడు.
” నన్నేలుతున్న నా శౌణ దేశాధీశ్వరులైన మహాదేవరాజ రాజ చూడామణి గారి పాదపద్మాల వద్ద పాద దాసైన కమల రోజూ మూడు కాలాల్లోనూ నా తలతో పాటు సాష్టాంగ నమస్కారాలెన్నో చేస్తూ రాసుకునే మనవి…..
అయ్యా! తమ ఆజ్ఞ తీసుకొని మురారి దేవుడు గారు, హరిహర దేవుడు గారు, ధర్మ వర్ధనుడు గారు, నేను….
సరే అదంతా వదిలేసి, ఉత్తరంలో ముందున్న విషయం చదవమన్నాడు మహాదేవ రాజు.
ప్రహరేశ్వరుడు అలాగే ఉత్తరం కొంత భాగం తన లోలోపల చదువుకొని, తరువాత ఇలా పైకి చదవడం మొదలు పెట్టాడు”ప్రహరేశ్వరుడు.
నన్ను తీసుకొనిపోయి సభలో రుద్రమ్మ ముందు నిలబెట్టారు.
ఆ…. అక్కడ నుండి చదవమని అన్నాడు మహాదేవ రాజు.
రుద్రమదేవి ముందు నిలబెట్టారు. రుద్రమదేవి ఎన్నో విషయాలు అడిగి, చివరకు నావైపు చూసి నిన్ను ఎవరు పంపారు? అని అడిగింది. నేను సమాధానమివ్వలేదు.
ఎవరు పంపారన్నది తెలుస్తూనే ఉన్నది. మహాదేవుడు వంకరగా చూశాడు. మంచిది! చదవమన్నాడు మహాదేవ రాజు.
” సభలో ఎవడో మీ పేరు కూడా చెప్పాడు.” అని చదివాడు.
రుద్రమదేవి సభలో నా పేరు పలికేంత మొనగాడున్నాడా? సరే !మిగతా ఉత్తరాన్ని చదువు !
” తరువాత రుద్రమదేవి నన్ను చూసి ఇవాళే మా రాజ్యం వదిలి వెళ్ళి పో! మా భటులు నిన్ను వెంబడిస్తారు.
నీకో రాజ్యం ఉన్నదా? ఆ రాజ్యం ఎలా దక్కించుకుంటావో నేనూ చూస్తాను.ప్రహారేశ్వరా! చదువు! చివరనున్న ఆ నాలుగు మాటలు ఏమిటో చదువు!
సరే అని ప్రహరేశ్వరుడు చదవడం మొదలు పెట్టాడు.” మళ్లీ మా రాజ్యంలో నీ మొహం కనపడితే నీ ప్రాణాలు దక్కవు!” ఆడదానివైనందున బ్రతికి పోయావు!”
వెంటనే మహాదేవరాజు ఇలా అన్నాడు. ఈ మాటలు విని, నేను తనని ఆడదని, జాలిపడి, విడిచి పెడతాననుకున్నది కావచ్చును… ఇంత అహంకారమా?
మళ్లీ ప్రహరేశ్వరుడు ఉత్తరం చదవడం మొదలు పెట్టాడు. నీ మహాదేవ రాజు ఆడదై గాజులు తొడుక్కోవడం వల్ల కావచ్చు! బహిరంగ యుద్ధంలో ఆడదానినైన నన్ను ఎదుర్కోలేక, మోసానికి తలపడ్డాడు….
శత్రువులను తిరస్కరించడం మోసమా? సరే! ఇక బహిరంగ యుద్ధమే చేస్తాను. కాచుకో! అన్నాడు మహాదేవరాజు.
మళ్లీ చదవడం మొదలు పెట్టాడు… సిగ్గు తెచ్చుకుని మళ్లీ ఇటువంటి పనులు చేయాలనుకోవద్దని చెప్పు!
సిగ్గు తెచ్చుకోవాలా? నిన్ను సింహాసనం ఎక్కించి నందుకు సిగ్గు తెచ్చుకోవాల్సిందే! మళ్లీ ఇటువంటి పని చేయకుండా.. నేనే ఓరుగల్లు సింహాసనాన్ని చేజిక్కించుకుంటాను. అహంకరించకు లెమ్మని అన్నాడు మహాదేవరాజు.
మళ్లీ ఉత్తరం ఇలా చదవడం మొదలుపెట్టాడు.
“రాజ్యం దక్కించు కోవాలంటే మాతో స్నేహంగా ఉండమని చెప్పు! ”
ఎలా? ఎలా? నీతో స్నేహం చేయాలా? నీకూ నాకూ మధ్య ఏమైనా బంధుత్వం ఉన్నదా? లేక నాకు వరసైన దానవా? పరాయి ఆడదానివి! అందులోను వితంతువువు! నీతో స్నేహం మాకు ఎలా మంచి జరుగుతుంది? నీతో స్నేహం ఒక యమభటులు మాత్రమే చేస్తారులే! గర్వపడకు! అన్నాడు మహాదేవరాజు.
” గర్వం, అహంభావం, వదులుకో” అని చదివాడు ప్రహరేశ్వరుడు.
” మంచేదో? చెడేదో తెలియని దానివి. మహా నాకు నీతులు చెప్ప వచ్చావా? అన్నాడు మహాదేవరాజు.
” మేము చెప్పే మంచి మాటలను మరిచిపోతే, నీకు తెల్లవారితే మా పదునైన బాణాలు చురచురమని తగిలి బుద్ధి చెప్తాయని చెప్పు! అని చదివాడు.
ఇంతటి పొడుగైన బాణాలు ఎన్నడు చేయించుకున్నావే? చురచుర తలగించు కోవాలనే బుద్ధి ఉంటే… అలాగే తగిలించుకుందువు గానిలే! అన్నాడు మహాదేవరాజు.
” అని కర్ణకఠోరాలైన మాటలని, ఆనాడే నన్ను భటుల నిచ్చి వెళ్ళ కొట్టించింది. నేను మన దేశం వచ్చాను. కొద్ది రోజులలో మీ పాదసేవ చేసి, నా దుఃఖాన్ని అంతా చెప్తాను.
ఇట్లు పాద సేవకురాలు
కమల.
కమల ! పాపం ! కమలకు ఎంత అవమానం జరిగిందో కదా! దీనికి ప్రతీకారం మనం తీర్చుకోకుంటే రుద్రమదేవి గర్వం కానీ, దాసి దుఃఖం కానీ తగ్గదు అన్నాడు ప్రహరేశ్వరుడు.
నిజమే! అన్నాడు.
ఆలస్యం చేయకుండా రేపటి కొలువులో పౌరులు, ఉద్యోగులు, మంత్రులు, సేనాపతులు మొదలైన వారందరిని పిలిపించండి. తగిన పనులు చేసి, ఆలస్యం చేయకుండా ఓరుగల్లు మీద దండెత్తి పోకుంటే మనం చేతగాని వారి వలె అవుతామన్నాడు మహాదేవరాజు.
తప్పనిసరిగా అలాగే చేద్దాం అన్నాడు ప్రహరే శ్వరుడు .
ఇంటికి వెళుతూ నా మాటగా మంత్రికి చెప్పు రేపు దర్బారుకు అందరూ వచ్చేటట్టు చేయమని.
మంచిది అన్నాడు ప్రహారేశ్వరుడు.
రాత్రి కావడంతో ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రంతా మహాదేవ రాజుకు నిద్ర పట్టలేదు. మాటిమాటికి ఆ ఉత్తరాన్ని చూస్తున్నాడు. చిట్టచివరకు తెల్లవారుజామున శరీరం మంచం మీద వాల్చాడు.
మహాదేవరాజు స్థిర చిత్తుడు కాబట్టి ఉలిక్కిపడి లేచి కళ్ళు విప్పి చూశాడు. తెల్లవారి రెండు ఘడియల పొద్దు ఎక్కింది. తను అజాగ్రత్తగా ఉన్నందుకు విచారించి, పడక విడిచి, కాలకృత్యాలు తీర్చుకొని కొలువు కూటమికి నడిచి వచ్చాడు.
మంత్రి ఆజ్ఞ ప్రకారం సభ్యులందరూ ముందే వచ్చి ఎవరి తాహతుకు తగిన ఆసనాలలో వారు కూర్చుని ఉన్నారు. ఇంతలో మహాదేవరాజు సభా మంటపానికి వచ్చాడు. సభలోని వారంతా రాజును చూసి, తమతమ ఆసనాలలో నుండి లేచి నిలబడి రాజుకు నమస్కరించి,రాజుపట్ల తమకున్న ప్రభుభక్తిని చాటుకున్నారు. రాజు సభ్యులందరినీ వారికి తగినట్టుగా మర్యాదతో పలకరిస్తూ వచ్చి తన సింహాసనం మీద కూర్చున్నాడు. సభలోని వారంతా కూర్చున్నారు.
ఎప్పటివలె రోజువారీ కార్యక్రమాల సభ జరుగుతున్నా, ఈరోజు మంత్రి ఆజ్ఞతో సమావేశమైన ఈ సభకు కారణం ఏమై ఉంటుందా? అని ఆలోచిస్తున్నారు కానీ కారణం ఎవరికీ తెలియదు. ప్రహరేశ్వరుడికి మాత్రం తెలుసు .అతడు మంత్రికి చెప్పలేదు. తెల్లవారక ముందే కాలకృత్యాలు తీర్చుకొని రాజు గారి ఇంటికి వెళ్లి, రాజు కోసం ఎదురుచూస్తూ, రాజు నిద్ర లేవగానే రాజుతో కలిసి సభకు వచ్చాడు. కాబట్టి అసలు విషయం తెలియని ప్రజలు రకరకాలుగా ఆలోచిస్తున్నారు.
ఇంతలో రాజుసభలోని వారందరినీ చూసి, సభ్యులారా! కొన్ని రోజుల కింద ఒకనాడు ఓరుగల్లు మీద దండయాత్ర గురించి సభ జరిగింది. దానికి మీరు అందరూ ఒప్పుకున్నారు. ఇవాళ అది కలిసి వచ్చింది. రుద్రమదేవికి అహంకారంతో కళ్లు తలకెక్కాయ్. నాకుబుద్ధి చెప్పేంత మొనగత్తె అయింది.
నిన్న మా దాసీదైన కమల నాకు ఒక ఉత్తరం పంపింది. దానిని మీరంతా వినాలి! అది వింటే మీకు రుద్రమ యొక్క గర్వం ఎంత ఉన్నదో తెలుస్తుంది. ఉత్తరాన్ని ప్రహరేశ్వరుడు చదివి మీ అందరికీ చదివి వినిపిస్తాడు.
” ప్రహారేశ్వరా! ” నన్ను గొనిపోయి సభలో రుద్రమదేవి ఎదుట” అక్కడి నుండి ఉత్తరం చదువు అని అన్నాడు.
ప్రహారేశ్వరుడు కమల రాసిన ఉత్తరాన్ని చదివి వినిపించాడు. ఆ ఉత్తరం విన్న సభ్యులందరూ” రుద్రమదేవి ఇలా చేయడం తప్పని ముక్త కంఠంతో అన్నారు .
సభలో నుండి ఒకడు లేచి” రాజచంద్రా! మీ శౌర్య ప్రతాపాలకు భయపడిన తమ రాజ్యాన్ని దక్కించుకోవాలనే బలమైన కోరిక ఉండి, తెలుగు వారొక ఆడదానిని మాళవులు ఒక పిల్లవాడిని సింహాసనంపై కూర్చుండబెట్టారు. దాని వల్ల స్త్రీ హింసకు, శిశుహింసకు వెనుకంజ వేసే ప్రభువులైన మీరు వారి దేశాల పైకి దాడికి వెళ్లరని, వాళ్ల రాజ్యాలకు ఎటువంటి అంతరాయం, నష్టం రాదనుకొని, అలా చేశారు. అయినా రాజ్యగర్వం కళ్ళకు మంచేదో?చెడేదో? తెలుపనీయక వాళ్ళమతులు పోగొట్టాయి. కాబట్టి తలచినంత మాత్రాన గుండెల్లో దిగులు పుట్టించే మీకు ద్రోహం చేయాలనుకోవడం పెద్ద సాహసమే అవుతుంది.తమరు ఇప్పుడు ఇటువంటి మహిళలనీ, శిశువులనీ అనుకుని ఊరుకుంటే మీకు ముప్పు తప్పక కలుగుతుంది.
” దుర్జనం, కాంచనం, భేరీమ్,దుష్టస్త్రీం,దుష్ట వాహనం, ఇక్షుఖండాన్, తిలాన్, మర్దనం- గుణ మర్దనం” అని( నీచులను, బంగారాన్ని, నగారాలనే వాయిద్యాలను, చెడు స్త్రీలను, చెడు వాహనాన్ని, చెరుకు గడలను, నువ్వులను మర్దించాలి… వాటి గుణం మారేదాకా) మర్దించాలని శాస్త్రం తప్పుగా చెప్పలేదు. మత్తెక్కి భూమ్యాకాశాల తేడా తెలియకుండా ఉన్న ఆడదాన్ని నరికినా పాపంలేదు.ఇది ఎన్ని సార్లూ చెప్పినా నిజం ! అని అన్నాడు.
ఇతను గుజరాత్ దేశ పాలకుడైన లవణ ప్రసాదుడు .మహాదేవ రాజుకు సంతోషం కలిగించాలని అనుకొని , దేవగిరికి తన కుమారుడుతో పాటు కలిసి వచ్చి, కొంత కాలమైంది. కుమారుడైన వీరధవలుడిని తన సొంత రాజ్యానికి పంపి,తను ప్రతి దినం మహాదేవ రాజ్యసభకు వస్తూ… రాజ కార్యాలలో జోక్యం కలిగించుకొని, రాజుకు నచ్చేటట్లు మాట్లాడు తుంటాడు. రాజుకు కూడా ఇతనంటే కొంచెం ఇష్టమే. లవణ ప్రసాదుడు అలా అని ,తన ఆసనం మీద కూర్చున్నాడు.
లవణ ప్రసాదు గారు అన్న మాటలు మెచ్చుకునే విధంగా ఉన్నాయి. మనమిప్పుడు సైన్యసహితంగా ఓరుగల్లుకు వెళ్లి, పొగరుతో గుడ్డిదైనా రుద్రమను, ఆమె సేనను యుద్ధంలో ఓడించి, రాజ్యాన్ని మనం చేజిక్కించు కోకపోతే మనకు ఆమె ఉత్తరంలో కలిగిన అవమానం మాసిపోదు. కాబట్టి మనం ఓరుగల్లు పైకి దండెత్తి పోవడానికి ఆలస్యం చేయవద్దని మహాదేవరాజు అన్నాడు.
రాజుగారి ఆజ్ఞ రావడమే ఆలస్యం, సేనా నాయకుడు తమ సైన్యంతో యుద్ధ సామగ్రితో బయలుదేరడానికి ఆలస్యం చేయరని మంత్రి అయిన భోళేశ్వరుడన్నాడు.
నాతో పాటు సేనానాయకులందరూ యుద్ధానికి ఎదురు చూస్తున్నాం. సైనికులు యుద్ధ పరికరాలతో సిద్ధంగా ఉన్నారు మీ అనుమతి తప్ప కొరత ఏమీ లేనేలేదని సేనాపతులలో ముఖ్యుడైన రామశర్మ అన్నాడు.
మంత్రిగారూ! మన విధేయులైన వారు, మిగతా వారైన మండలాధ్యక్షులకు ఉత్తరాలు రాసి పంపాలి. వారంతా వస్తే మనకి ఇంకా మంచిది. రుద్రమదేవి చాలా పెద్ద సైన్యం తయారుచేసింది. ఆమె తండ్రి అయిన గణపతిరాజు కూడబెట్టిన సైన్యాన్ని ఈమె రెండింతలు చేసిందన్నా తప్పు లేదు. కాబట్టి మన దగ్గర ఎంత ఎక్కువ సైన్యం ఉంటే అంత మంచిది. మనకు సహాయం చేసేవారు దేవగిరిలోనే మనతో కలవాలంటే అలా వీలు కాదు. కొంతమంది దేవగిరిలోనూ, కొందరు దారిలో మధ్యన, కొందరు పొలిమేర వరకు, తక్కినవారు ఓరుగల్లు వచ్చి చేరవచ్చును. మనం రాసి పంపే ఉత్తరాలలో ఇలా వివరంగా రాసి పంపాల్సి ఉంటుంది. మన సైన్యం సిద్ధంగా ఉంది కదా? ఇంకా బయలుదేరేందుకు నగారా మోగించేందుకు తగిన ముహూర్తం ఆలోచించాలి. ముహూర్తం అంటే చాలా రోజుల వ్యవధి ఉండకూడదు. జ్యోతిష్యులకు ఈ విషయం చెప్పి పది, పదిహేను రోజులలో మంచి ముహుర్తం నిర్ణయించుకుని వచ్చి నాకు తెలియ చేయాలి. ఆ రోజు మనం బయలుదేరి వెళ్లాలి. ముందుగా రాయబారి కానీ మరెవరినైనా పంపేందుకు నాకు ఇష్టం లేదు. మీరంతా దీనికి ఒప్పుకోవాలి. ఎందుకంటే మనతో సమానులయితే ఎటువంటి రాయబారినైనా పంపవచ్చు. కానీ, ఒక ఆడది, అందునా మనను దూషించిన దాని దగ్గరకు రాయబారం పంపితే సిగ్గుచేటు. మన రాయబారం బాణాలతోనే పంపాలి. నా మాటలు శ్రద్ధగా విని అలా చేయండి! అని మహాదేవ రాజు మంత్రితో అన్నాడు.
చిత్తం! రాజుగారి ఆజ్ఞ! తెల్లారేసరికి మీకు శుభముహూర్తం నిర్ణయించి తెలియజేస్తాను. మిగిలిన సేన మొదలైనవి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయని మంత్రి చెప్పాడు.
సభలోని వారంతా యుద్ధోత్సాహాన్ని తెలిపారు.
కొంతసేపటికి సభ ముగిసింది. ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.
పన్నెండవ ప్రకరణ
[ యుద్ధ ప్రయత్నం]
శ్లోకం. ప్రవిష్ట శత్రుసైన్యంహి ప్రాజ్ఞ శత్రురతర్కితః
నిహన్యాదన్తరం లబ్ధ్వాఉలూక ఇవ వాయసాన్
శ్రీమద్రామాయణం- యుద్ధకాండం. సర్గ-17
శ్లో. వధ్యతా మేషతీవృణె దణ్డేన సచివైస్సహ
రావణస్య నృశంసస్య భ్రాతాహ్యేష విభీషణః”
శ్రీమద్రామాయణం-యుద్ధకాండం- సర్గ-17
ఈ శ్లోకాలు విభీషణుడు రామ శరణాగతి కోరి తన మంత్రులతో సహా వచ్చినప్పుడు, సుగ్రీవుడు రామునితో అన్నమాటలు.
భావం :– తెలివైన మరియు జ్ఞానం కలిగిన శత్రువు, శత్రుసైన్యంలో ప్రవేశించి, తరువాతి కాలంలో అవకాశం చూసుకుని, రాత్రిపూట చీకటిలో గుడ్లగూబ కాకులను చంపినట్లుగా …
చంపి వేయగలరు. పైగా విభీషణుడు పర హింసా తత్పరుడైన రావణుడికి తమ్ముడు. కనుక ఇతనిని అనుచరులతో సహా తీవ్రమైన దండనతో వధించవలెను.
కథా భాగం:– క్రీస్తుశకం 1285 వ సంవత్సరంలో రెండు ,మూడు నెలలు గడిచాయి.చలికాలం క్రమంగా పోయి ఎండాకాలం వేడి తగులుతున్నది. పగలు ఎక్కువగా, రాత్రిపూట తక్కువ సమయంగా మారింది. చలి బాధ వల్ల ఎండకు కూర్చోవడం, లేదా చలిమంటల దగ్గర కూర్చుని వేడి కాపులు పెట్టుకోవడం జనాలకు తగ్గింది. శుభకార్యాలు చేయాలనుకునేవారు ఆ పనికి వస్తువులను సేకరించుకోవడం కోసం తిరుగుతున్నారు. ఆధ్యాత్మిక చింతలలో ఉన్న వారు బ్రాహ్మణులు యజ్ఞ యాగాలు చేయాలనుకుని వాటికి కావలసిన వస్తువుల కొరకు భిక్షాటనకు వెళ్లారు. పురోహితులకు,జ్యోతిష్యులకు శుభాకార్యాలు చేయించడం వల్ల, శుభ ముహూర్తాలు నిర్ణయించడం వల్ల తీరిక లేకుండా ఉన్నారు. కొందరు యజమానులు పాత ఇండ్లను కూలగొట్టించి, కొత్త ఇండ్లు కట్టిస్తున్నారు. శ్రీమంతులు కొందరు ఎత్తయిన ఇండ్లను చూసి అటువంటి ఇండ్లు తమకు కావాలని, తమ ఇండ్లు అందంగానూ, గట్టిగా ఉన్నా కూడా వాటిని కూల్చేసి, మళ్లీ కొత్తగా కట్టిస్తున్నారు.
ఓరుగల్లు పట్టణంలో రాతి పనులు, మట్టిపనులు ఎక్కువగా జరుగుతున్నవి. అయినా కారణం లేకుండా అవి జరగడం లేదు. కోటగోడలు అక్కడక్కడా కొద్దిగా కూలిపోయాయి. కూలిపోయిన చోట ముందటి కన్నా బలంగా బాగు చేయిస్తున్నారు. పట్టణం చుట్టూ కంప కోట కట్టిస్తున్నారు. కంప కోట అంటే పెద్ద పెద్ద ఇనుప ముళ్ళు ఉన్న ఇనుప తీగను చిక్కగా, దట్టంగా పట్టణానికి చుట్టూ గుండ్రంగా చుట్టడం. ఎందుకంటే వేగంగా వచ్చిన ఫిరంగి గుండ్లు కంపలో దూరితే అవతలికి గానీ, ఇవతలికి గాని వెళ్లదు. ఈ కంపకోటలో పెద్ద కందకం తవ్విస్తున్నారు. ఆ కందకంలో తవ్వగా వచ్చిన మట్టితో ప్రహరీని ఆనుకుని లోపలి వైపు మట్టికోట కడుతున్నారు. మట్టి కోటకు లోపలివైపు రాతికోట ఒకటి కడుతున్నారు. ఈ రాతికోట సున్నంతో కానీ, మట్టితో కానీ కట్టకుండా బలమైన రాతితో కడుతున్నారు. ఈ రాతికోట మందంగా ఉండి, అష్ట కోణాకారంలో ఉన్నది. రాతితో కట్టినదైనా వెంట్రుక కూడా పట్టేంత సందు లేకుండా కట్టిన ఆ రాతి పనివాడి పని ఈ నాటికీ సందర్శకులకు కళ్ళ పండుగగా ఉంటుంది. ఈ రాతిప్రాకారం లోపల సున్నంతో, ఇటుకలతో మరొక ప్రాకారం కడుతున్నారు. దాన్ని ఇటుకకోటని, భూమి కోటని పిలుస్తారు.
మొదట శత్రువులు దూరరాని కంపకోట, దాని తరువాత అగాధమైన కందకము, దాని వెనుక చాలా మందపాటి, చాలా ఎత్తయిన,పగలకొట్టి చొరబడరానిదైన మట్టికోట, తరువాత వంద వేల శతఘ్నుల పేల్చినా ఏమాత్రం చెడిపోకుండా, దాడికి లొంగని రాతికోట, దాని పక్కన దానికి ఏ మాత్రం తీసిపోని భూమి కోటలుండి ఏకశిలానగరమని తలిస్తే చాలు గుండె దిగులు పుట్టేలా ఉన్నది.
భూమి కోటకు నాలుగు దుర్గపు ద్వారాలు, వాటి పక్కనే ఎనిమిది చిన్న వాకిళ్లున్నాయి. రాతి కోటకు నాలుగు దుర్గపు ద్వారాలు, ఎనిమిది చిన్న వాకిళ్లున్నాయి. పుట్ట కోటకు ఎనిమిది దుర్గ ద్వారాలు, 18 చిన్నవాకిళ్లున్నాయి. పనివాళ్ళు కూలి వాళ్ళు రాత్రింబగళ్ళు పనులు చేస్తూనే ఉన్నారు. కొంత మంది ఉదయం కొంత మంది రాత్రి వరుసగా అంచలంచలుగా ఎనిమిది సంవత్సరాల నుండి పని చేస్తున్నారు. అందుకే ఈ కోటలు కందకాలు ఇప్పటికి సిద్ధమైనాయి. అప్పుడు ఇవన్నీ సిద్ధమైనట్టు రుద్రమదేవికి తెలిసింది. రుద్రమదేవి దర్బారులోనికి వచ్చినప్పుడు కట్టడాలను పర్యవేక్షిస్తున్నప్పుడు, గుఱ్ఱపుస్వారీ చేసేటప్పుడు పురుషుల వలె దుస్తులు ధరిస్తుంది. ఆరోజు సిద్ధమైన కోటలను చూసేందుకు రుద్రమదేవి మగవేషం వేసుకొని, వెంట కొంతమంది తోడురాగా బయలుదేరింది. వాళ్ళంతా వరుసగా ఒక్కొక్క కోటను, వాటికున్న బురుజు ద్వారాలు, చిన్న వాకిళ్ళను, కందకాలను, అన్నింటినీ జాగ్రత్తగా చూపారు. రుద్రమదేవికి చాలా సంతోషం కలిగింది. ఆ కట్టడాలను కట్టిన పనివాళ్లు, కూలి వాళ్లు రుద్రమదేవిని చూసి నమస్కరించారు. పని చేయించేందుకు నియమించిన పెద్దపనివాళ్ళు రుద్రమదేవి గుర్రం వెంట నడుస్తూ ఆయా ప్రదేశాలను, కట్టించే టప్పుడు కలిగిన శ్రమను, చాలా సన్నని స్వరంతో రుద్రమదేవికి చెప్పి చూపిస్తున్నారు. చిన్న వాకిళ్ళలో, బురుజు ద్వారాలలో అమర్చిన తికమక దర్వాజలను చేతితో ముట్టి, కదిలించి రుద్రమదేవి స్వయంగా పరీక్షించి చాలా బలంగా ఉన్నాయనుకొని సంతృప్తి పడింది.
రుద్రమదేవి అన్ని చోట్ల భద్రంగా పరిశీలించి నగరానికి బయలుదేరింది. పనివాళ్ళు ఆమె వెంట నడిచారు. ఆమె అంతరంగికులు వెంట నడిచారు. కొన్ని ఘడియలలో వారంతా నగరం చేరారు. రుద్రమదేవి రాజదర్బారులోనికి వచ్చి, వజ్రాల సింహాసనం మీద కూర్చున్నది. ఎప్పటివలె సభ్యులంతా వారివారి స్థానాలలో కూర్చున్నారు. లెక్కలు రాసే వారిని పిలిపించారు. రుద్రమదేవి ఆజ్ఞతో లెక్కలు వ్రాసేవారు, పనివాళ్ళ కూలి, వాళ్ళ జీతాలు మొత్తం లెక్క చేసి ఇచ్చిన డబ్బు తీసేసి , మిగిలిన డబ్బులు లెక్క చెప్పి రుద్రమదేవికి చూపించారు. రుద్రమదేవి కోశాధికారికి ఉత్తరం రాసి పని వాళ్లకు ఇవ్వవలసిన డబ్బును, మరి కొంత ధనాన్ని తెప్పించి వరుసగా అందరికీ లెక్క చొప్పున పంచి పెట్టింది. తరువాత ఒక్కొక్క పని వానికి వాడు చేసిన పని తెలుసుకొని కొంత బహుమతిని తన చేతితో పంచి, వారందరినీ పంపి వేసింది. పని వాళ్ళంతా చాలా సంతోషంతో దీవిస్తూ, పొగుడుతూ, సంతోషంతో కేకలు వేస్తూ రుద్రమదేవికి నమస్కరించి వెళ్లిపోయారు.
తరువాత రుద్రమ్మ కొలువులో ఉన్న తన సేనా నాయకుల పేర్లు పెట్టి పిలిచింది. వెంటనే వాళ్లంతా తమ ఆసనాల నుండి లేచి నిలబడ్డారు. అప్పుడు రుద్రమదేవి గంభీరమైన కంఠంతో ఇలా చెప్పటం మొదలు పెట్టింది.
సైన్యాధికారులారా! ఈనాటికీ మన ఏకశిలా నగరానికి ప్రసిద్ధమైన కోటలుండే భాగ్యం కలిగింది. ఎన్ని కోటలు, ఎన్ని కందకాలున్నా వాటి రక్షణభారం వీర భటులు చేయకుంటే ప్రయోజనం ఉండదు.మనలను ఎదిరించ లేరనుకొని ఊరికే ఉండటం మంచిది కాదని మా నాయన గారి హితవచనం.
అందుకు మనం పూర్తి శ్రద్ధ కలిగి కోటలను రక్షించడంలో ఏకశిలానగరం అందరికీ ఆదర్శంగా ముందుండాలి. దానికి నేను చెప్పేది ఏమిటంటే కోట గోడకు ఆధారంగా వేసిన కొరడు ( కోటకు అవతలివైపు ఉన్న మట్టి దిమ్మ) మీద రక్షణ బాధ్యత రాజ బంధువులలోని ముఖ్యులైన వీరుల ఆధీనంలోనూ, భూమి కోటలోని రక్షణ బాధ్యత మిగిలిన బంధు వీరుల ఆధీనంలో ఉంచాలి. జన్నిగ దేవసాహిణి తను చెప్పిన మాట వినే సేనలోని వారిని భూమి కోటలోని ఎనిమిది చిన్న వాకిళ్ళకు ఒక్కొక్క వాకిలికి ఐదు వందల మంది చొప్పున,18 చిన్న వాకిళ్ళకు ప్రతి ఒక్కొక్క వాకిలికి 100 మంది వీరభటుల చొప్పున, బురుజు ఒక్కదానికి 500 మంది వీర భటులను నియమించి, రాతికోటలోని నాలుగు బురుజుల, ఎనిమిది చిన్న వాకిళ్ళను రక్షించాలి.
అంబయ్య దేవ మహారాజు ఆదేశాల ప్రకారం సైనికులను అక్కడ ఉంచి, మట్టి కోటను రక్షించాలి.
గోనగన్నారెడ్డి తన అధికారం కింద ఉన్న సైనికుల నుండి కోటకు రెండు వైపులా నుంచి కోటను రక్షించాలి.
దాదియ సోమయ సాహిణి తన సైన్యం నుండి బూడిద ఒకటికి యాబై మందిని నిలపాలి. రుద్రమ నాయుడు నాగచమూపతి ఇద్దరూ యుద్ధానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయించాలి. మిగిలిన సేనానులు కంప కోటను, కందకాలను కాపలా కాయాలి. మనకు ఇప్పుడు ఎటువైపు నుండి కానీ యుద్ధం జరుగుతుందనే అనుమానం లేదు. కానీ దుర్మార్గుడైన మహాదేవరాజు విషయంలో మాత్రం కొంచెం అనుమానం ఉన్నది. అతని దుష్టస్వభావంతో నిస్సహాయులైన మమ్మల్ని పట్టుకుని తీసుకొని పోవాలి అనుకున్నాడు. హఠాత్తుగా మన మీద దండెత్తి వస్తాడనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అతను దండెత్తి వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. మనం జాగ్రత్తగా ఉంటే అంతా భద్రంగా ఉంటుంది.
రుద్రమదేవి చెప్తున్నప్పుడు సేనా నాయకులు తమకు అప్పగించిన పనులను, తమ రక్షణ కిందకు వచ్చిన కోటలను కాగితాల మీద రాసుకున్నారు. రుద్రమదేవి తాను చెప్పగలిగిన మాటలను చెప్పి ముగించగానే సేనా నాయకులందరూ ఒక్కసారి సింహనాదాలు చేసి తమ చేతులలో ఉన్న బరికత్తులను తళతళమని మెరిసేటట్లు ఊపారు. తర్వాత సభను ముగించారు.ఎవరి ఇళ్లకు వారు వెళ్లారు. సేనానాయకులు రాణిగారి ఆజ్ఞ ప్రకారం ఆయా చోట్లలో సైన్యాన్ని నియమించి, వారు శ్రద్ధగా ఉన్నట్టు గమనించి వచ్చి రాణికి తెలుపుతున్నారు.
కొన్ని రోజులు గడిచాయి. ప్రతిరోజు సభలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటివలె ఆ రోజు రాత్రి రుద్రమదేవి సభ తీర్చి ఉన్నది. రాజ దర్బారంతా సభ్యులతో కిక్కిరిసి నిండి ఉంది. రకరకాల విషయాలు చర్చిస్తున్నారు.
ఇంతలో ఒక యువభటుడు గబగబా వచ్చి, రాణీకి మొక్కి, సభలోని వారందరూ, రాణి గారు వినేటట్టుగా బిగ్గరగా ఇలా చెప్పాడు.” శౌణదేశాధీశ్వరుడైన మహాదేవరాజు గొప్ప సైన్యంతో దేవగిరి నుండి వస్తున్నాడు” మన ప్రాంతానికి ఇంకా నాలుగైదు రోజులలో ఇక్కడికి చేరగలడు. ప్రభువు ఆజ్ఞతో ఇతర దేశాల నుండి వచ్చే రహదారులను మేము కాపలా కాస్తున్నాం. అక్కడి పరిస్థితి చూసి వచ్చిన సంగతి ఇది. తర్వాత ప్రభువులకు ఎలా అనిపిస్తే అలా జరుగుతుంది. మాకు అప్ప చెప్పిన పని చక్కగా చేసుకుని వచ్చాం.”
మంచిది! నువ్వు వెళ్లిపొమ్మని రుద్రమదేవి అన్నది. గూఢచారి నమస్కరించి వెళ్ళిపోయాడు. రుద్రమదేవి మంత్రి అయిన శివదేవయ్య వైపు చూసి ఏమో చెప్పబోయి, చెప్పదలుచుకున్న విషయం కాస్త రహస్యంగా ఉంచ తలుచుకొని, సేవకుడిని చూసి, ఓరీ! నువ్వు వెళ్లి ఇప్పుడు వచ్చిన గూఢచారిని పిలుచుకొని రా! అని చెప్పింది. సేవకుడు గబగబా నడిచివెళ్ళి ,వెళ్ళిన గూఢచారిని సభలోనికి పిలుచుకొని వచ్చాడు.
ఓరీ! మహాదేవరాజు దండెత్తి వస్తున్నాడని చెప్పావు కదా! అతని సైన్యం ఎంత ఉందో నువ్వు చెప్పగలవా? అని రుద్రమదేవి గూఢచారిని అని అడిగింది.
అయ్యా! నేను నిజంగా అతని సైన్యం ఎంత ఉందో చెప్పలేను. కానీ ఎంత దూరం చూసిన సైన్యమే కనబడుతున్నది. గుర్రాలను ఏనుగులను ఒకటొకటి లెక్క పెట్ట గలమా? మా పని శత్రుసేన కొంత దూరంగా ఉండగా చెప్పడం వరకే! అదే చేశానని గూఢచారి జవాబిచ్చాడు.
సరే !నువ్వు వెళ్ళి, మీలో ఒకడినిఅక్కడికి పంపి, సైన్యం ఎంత ఉందో సంఖ్య తెలుసుకుని రమ్మని చెప్పు! అని రాణి అన్నది. గూఢచారి వెళ్ళిపోయాడు. రుద్రమదేవి మంత్రితో ఇలా మాట్లాడింది.
చూశారా! మహాదేవరాజు దండెత్తి వస్తున్నాడట.పూర్తిగా కుటిల మనసున్న వాడైనాడని అనడానికి సందేహం లేదు.
తల్లీ! కాల మారినట్లు గుణాలు మారుతాయి! అయినా వాళ్లు చేసిన దానికి తగిన ఫలితం అనుభవిస్తారు. కారణం లేకుండా మన మీద కోపం పెంచుకుని, మీకు అపకారం చేయదలచి, అందులో విఫలమవడంతో అసూయతో మనసులు నింపుకొని, ఇలా చేస్తున్నాడు. ఇప్పుడు దండెత్తి రావడానికి అదే కారణం. నాకు ముందే అనుమానం వచ్చి, దేవగిరి తోవకు గూఢచారులను కాపలా పెట్టాను.
దండెత్తి వస్తే రానివ్వు! అతనికి ఎన్ని రోజుల నుండి యుద్ధం చేయాలనే ఆలోచన ఉన్నదో? దానిమీద కాకతీయుల పదునైన బల్లేల రుచి చూస్తాడు. కానివ్వు! అతని ఉద్ధతి ఎంత ఉందో? దాని ప్రకారం ప్రతీకారం జరగనీ! వెనుకటి వాళ్లు కాకతీయుల అగ్నివంటి ప్రతాపాన్ని చూశారు. కానీ రెండు తరాల నుండి వీరికి ఆ రుచి తెలియదు. ఇతడు కావాలను కోరి వస్తే అతనిని చిన్న పుచ్చడం ఎందుకు? మనం కోటలను మరమ్మతు చేయించడం, కొత్తకోటలు కట్టించడం, వాటి మీద గట్టి కాపలా పెట్టడం మంచి పని అయింది. ఒక్క మహాదేవరాజే కాదు వంద మంది మహాదేవ రాజులొచ్చినా ఓరుగల్లుకు నష్టం లేదు.
కోటలే కాదు… మీ శౌర్య ప్రతాపాలు…నేనేమి చేయగలను? మరొకడు ఏమి చేయగలడు? రాజులకు ప్రాణం సైన్యం. ఉదారంగా పౌరుషవంతులైన శూరులు రాజ్యాన్ని దక్కించుకుంటే రాజ్యం దక్కుతుంది.
అందుకోసం మన సేవకులంతా సిద్ధంగా ఉన్నారు. కంఠనాళంలో రక్తప్రసారం జరుగుతున్నంతసేపు యుద్ధం చేసి, తమ ప్రభువును గెలిపించడమే వారి పనిగా మన సైనికులు యుద్ధం ఎప్పుడా? అని ఎదురు చూస్తున్నారు.
వీరిద్దరూ అలా మాట్లాడుతూ ఉండగా ఒక్క గూఢచారి సభలోనికి వచ్చి, రుద్రమదేవికి నమస్కరించి, అయ్యా! మహాదేవరాజు దండెత్తి వస్తున్న విషయం ఇంతకు ముందే నా తోటి ఉద్యోగులు మీకు తెలిపి ఉన్నారు. నేను సేనా సంఖ్య ఎంత ఉందో తెలుసుకొని వచ్చాను. మహాదేవరాజు సైన్యం మొత్తం మూడు లక్షలు. యుద్ధ సామాగ్రి, వస్తు సామాగ్రి చాలా ఉన్నది. సైన్యం ఇక్కడికి రావడానికి నాలుగు రోజులు పడుతుందని చెప్పాడు.
మంచిది! నువ్వు నీ పని మీద వెళ్ళు! అని రుద్రమదేవి అతనిని పంపి…
మంత్రిగారూ! మన సైన్యం ఎంత ఉంది? మహాదేవ రాజు సైన్యం మూడు లక్షలట! అని అన్నది.
తల్లీ! అయితే ఏం? బురుజులపైనా, కందకాలపైనా, చెట్లకొమ్మలపైనా ద్వారాల దగ్గరా, చిన్న తలుపుల దగ్గరా ఉన్న సైన్యం కాకుండా… మిగిలిన సైన్యం రెండు లక్షల డెబై వేలని నిన్న మన సేనా నాయకులు లెక్క ఇచ్చారు. కాపలా కాసే వారి సంఖ్యతో కలిసి మూడు లక్షల కన్నా ఎక్కువే ఉంటుంది. వస్తుసామగ్రి కూడా చాలా ఎక్కువగానే ఉంది. మూడు ,నాలుగు సంవత్సరాలు విరామం లేకుండా యుద్ధం చేసినా తక్కువ పడదు.
మనం ఒక్కసారి సైన్యం చూసి వస్తే బాగుంటుంది కదా! నాగచమూ నాయకులు మన వెంట వస్తారు.
సరే!
రుద్రమదేవి లేచి నిలబడింది. సభ్యులందరూ లేచి నిలబడ్డారు. రుద్రమదేవి భూమి కోట బురుజు ద్వారం దగ్గరకు నడిచింది. మంత్రి , సేనాధిపతులు వెంట నడిచారు. తక్కిన సభ్యులు వారి వారి ఇళ్లకు వెళ్ళారు.
పదమూడవ ప్రకరణ
[ సంధి ]
శ్లో॥ అపనీత శిరఃస్త్రాణాః శేషాస్తుం శరణం యయౌ ;
ప్రణిపాత ప్రతీకారః సంరంభోహి మహాత్మనాం !
— (రఘువంశము)
భావం :– చచ్చిన వారు పోగా బ్రతికి ఉండే వారు టోపీలు తీసివేసి, ఆ రఘువంశ మహారాజును శరణుజొచ్చారు. మహాత్ములు శత్రువుల గర్వం అణిచివేయడంలోనే దృష్టి ఉంచుతారు. కానీ వారు వినయంగా ఉండే వారిని, ముందటి వలె చంపాలనే కోపం ఉండదు కదా!
వ్యాఖ్య:– ఈ రఘువంశంలోని శ్లోకం ప్రకరణ మకుటంగా గ్రంధకర్త తీసుకోవడం, రుద్రమదేవి నవలలోని రుద్రమదేవి- మహాదేవరాజు మధ్య గల సంధిని సూచిస్తూ, కథార్ధ సూచిగా ఎంతో చక్కగా అమర్చారు.
ఈ శ్లోకాన్ని చదువుతూనే కథలోని మలుపులు తెలుస్తునాయి.ఈ విశేషమైన ప్రక్రియ అరుదుగా కనిపిస్తుంది.
కథాభాగం:– మహాదేవరాజు సైన్యం ఓరుగల్లు కోటను ముట్టడించింది. ఏనుగులు, గుర్రాలు వీరభటులు ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కనపడుతున్నారు. మహాదేవరాజు మూడు లక్షల సైన్యంతో ఓరుగల్లును ముట్టడించి, పదిహేను రోజులు అయింది. ప్రతిరోజు రుద్రమదేవి సైన్యానికి మహాదేవరాజు సైన్యానికి యుద్ధం జరుగుతూనే ఉన్నది. రెండు వైపులా సైన్యంలో సైనికులు చనిపోతున్నారు.
ఈరోజు పదిహేనవ రోజు యుద్ధం మొదలైంది. రుద్రమదేవి మగవేషంతో ఉత్తమజాతికి చెందిన గుర్రాన్నెక్కి పౌరుషానికి మారురూపుగా వచ్చిందా? అన్నట్టుగా చూడ శక్యం గానంతగా యుద్ధభూమిలో తిరుగుతూ, కనపడ్డ శత్రువులందరిని చంపి వేస్తున్నది. రుద్రమదేవి సేనానాయకులలో ముఖ్యులైన రుద్రమ నాయుడు వెలమ సైనికులకు, నాగచమూపతి కమ్మ సేనకు అధికారులై తమ సైన్యాన్ని ప్రోత్సహిస్తూ వీరవిహారం చేస్తున్నారు.
జన్నిగదేవ సాహిణి, త్రిపురాంతక మహాదేవ రాజు, అంబయ్య దేవమహారాజు, గోనగన్నారెడ్డి, దాదియ సోమన సాహిణి మొదలైన సేనానాయకులు ఎవరూ దగ్గరకు రావడానికి సాహసించ లేనంత భయంకరంగా యుద్ధం చేస్తున్నారు.
రుద్రమదేవి అల్లుండ్లైన ఇందులూరి అన్నమ రాజును, చాళుక్య వీరభధ్రుడు రాజును తన సైన్యాన్ని ప్రోత్సహిస్తూ, యుద్ధభూమిలో తిరుగుతూ, శత్రుసైన్యం గుడారాలను, శత్రువులను కింద మీదలు చేస్తున్నారు. మల్యాల గుండాదీశ్వరుడు మహాదేవరాజుతో యుద్ధం చేస్తున్నాడు. రుద్రమదేవి ముఖ్యమంత్రి అయిన శివదేవయ్య వయసురీత్యా ముసలివాడైనా యువకునివలె యుద్ధం చేస్తున్నాడు. గుండ ధరాధీశ్వరుని తమ్ములైన మల్లయ్య, బుద్ధయ, కోటయ్య, పిడుగు గుండయలు నాలుగు వైపులా తిరుగుతూ యుద్ధం చేస్తున్నారు. ప్రసాదాదిత్య నాయకులు మొదలైన సేవక వర్గం తమవెంట ఎవరైనా తోడుగా వస్తున్నారా? లేదా? అని చూడకుండా యుద్ధం చేస్తూ ఉన్నారు.
మహాదేవరాజు మంత్రి అయిన సాధులుడు, సేనాపతులైన భోళేశ్వరడు, రామశర్మ, బిచ్ఛణుడు మొదలైన వారు, కొంకణ దేశపురాజు, ఘూర్జర దేశపు అధినేతైన లవణప్రసాదుడు మొదలైనవారు చెలరేగి యుధ్ధం చేస్తున్నారు. ఇంకా ఎందరో మహాదేవరాజుకు సహాయం కోసం వచ్చిన మాండలికులు వీరవిహారం చేస్తున్నారు. రెండు వైపుల వారు విజయం మాకే కావాలనే కోరికతో గుంపులతో దొమ్మి యుద్ధం చేస్తున్నారు. యుద్ధం తీవ్ర రూపం దాల్చింది.
మధ్యాహ్నం రెండు జాములయింది. చెట్ల కొమ్మల మీద, బురుజుల మీద ఉన్న ఓరుగల్లు సేన మహాదేవరాజు సైనికుల మీద బాణాల వర్షం కురిపిస్తున్నది.
రుద్రమనాయుడు, నాగ చమూపతి తమ పరివార మైన వెలమ,కమ్మ వారిని వెంట తీసుకొని, దేవగిరి దళాన్ని ఎదుర్కొన్నారు. వారి పరాక్రమం చెప్పలేనంతగా ఉన్నది.
మల్యాల గుండదండధీశ్వరుడు శౌణ దేశాధీశ్వరులిద్దరూ కత్తి యుద్ధం చేస్తున్నారు.వారిద్దరి శరీరాలు రక్తంతో తడిసి, ఎర్రని పూలతో ఉన్న మోదుగ చెట్ల వలె కనపడుతున్నారు. యాదవరాజు పదునైన బల్లేన్ని తీసుకొని గుండ దండాధీశ్వరుని గుర్రాన్ని నరికి వేశాడు. అతడు కొంచెం కూడా తొట్రు పడకుండా పదునైన ఖడ్గం తీసుకొని మహాదేవరాజుపైకి ఉరికి అతనెక్కిన ఏనుగును కొట్టాడు. తొండం తెగిపోవడంతో ఆ ఏనుగు గీ అంటూ అరుస్తూ నేలమీద కూలిపోతున్న ది. వెంటనే మావటిని తల నరికేసి, నేలమీదికి దుముకుతున్న శౌణదేశపు రాజును చంపాలని, గుండ దండాధీశ్వరుడు కత్తిగిరగిరా తిప్పి విసిరాడు.
మహాదేవరాజు అతని కత్తి వేటునుండి తప్పించుకొని, యుద్ధం చేయడం మొదలు పెట్టాడు. దండాధీశ్వరుడు పరిశ అనే ఆయుధాన్ని మహాదేవరాజుపై విసిరాడు. ఆ దెబ్బకతను సొమ్మసిల్లి నేల మీద పడ్డాడు. గుండ దండాధీశ్వరుడు సింహనాదం చేశాడు. దేవగిరి సైనికులు భయపడ్డారు. మహాదేవరాజు వెంటనే తెప్పరిల్లి చీకటిని గిరగిరా తిప్పి దండాధీశ్వరుని పైకి విసిరాడు. ఆ కత్తివేటుకు కంఠానికి తాకినందున అతడు నేలపై పడి ప్రాణాలు విడిచాడు .
అన్న అలా నేల కూలాగానే తమ్ముళ్లు ఒక్కసారిగా యాదవరాజుపై కలియబడ్డారు. శౌణదేశాధిపతికి సహాయంగా లవణప్రసాదుడు, మంత్రి అయిన సాధులుడు వచ్చి కలిశారు. రుద్రమదేవి సేనా నాయకులను చుట్టుముట్టినందు వల్ల వాళ్లు రాజుకు సహాయం చేయలేకపోయారు.
గుండదండాధీశ్వరుని తమ్ముళ్లు ఐదుగురు ఎదురు నిలిచి యుద్ధం చేస్తూ మంత్రిని మూర్ఛ పోగొట్టారు. రుద్రమదేవి యాదవ రాజున్న దగ్గరికి దుర్గాదేవి ప్రత్యక్షమైందా అన్నట్లు భయంకర రూపంతో వస్తూ ఉండగా… తోవలో సేనా నాయకుడైన దాదియ సోమయ సాహిణి వీరమరణం పొందాడనే పిడుగు లాంటి ఆ వార్త విని మళ్లీ వచ్చిన చోటికి వెళ్ళి పోయింది రుద్రమదేవి.
గుండ దండాధీశ్వరుని తమ్ముడు శౌణదేశాధిపతిని చుట్టుముట్టి, మూర్చ పోయిన అతనిని కోటలోనికి మోసుకొని పోతున్నారు. వెలమ, కమ్మ వీరులు పరాక్రమంతో శత్రువులను మట్టి కరిపిస్తున్నారు. సైన్యం ఉత్సాహంగా, బలంగా ఉన్నది. అయినా ఓరుగల్లు సైన్యం అలిసిపోయింది. కానీ బింకం తగ్గలేదు. ఇంతలో” ” శత్రువులను చుట్టు ముట్టండి! వీరులకు వీరస్వర్గం కన్నా మించిన మంచి మార్గం లేదు!” శూరులకు వీర విహారమే ఉత్సాహంగా ఉంటుంది.” పోరాడి పోరాడి విజయం సంపాదించినా, వీరమరణం పొందినా మీ కీర్తి శాశ్వతంగా ఉంటుంది!” యుద్ధభూమిలో భయపడి,పారిపోయి మీ ఇండ్లకు శరణార్థుల వెడితే మీ భార్యలు మిమ్మల్ని ఆడవారి కన్నా ఎక్కువ హీనంగా చూస్తారు.” మన పూర్వీకుల పౌరుష చరిత్రలు మీ మనసులో జ్ఞాపకం చేసుకోండి!” ధైర్యాన్ని మీ సొంతం చేసుకోండి!” శత్రువులు పెచ్చుమీరుతున్నట్టున్నారు. వారి పొగరు అణచండి. అని గంభీరంగా అంటూ రుద్రమదేవి అక్కడికి వచ్చింది.
తమ రాణిని దగ్గరగా చూడగానే సైన్యంలో కొత్త ఉత్సాహం నిండి, ఏనుగంత బలం కలిగి,” హరహర ” అంటూ ఒక్కసారిగా శత్రువుల మీద పడ్డారు. అప్పటి ఆ యువ సైన్యాన్ని వర్ణించటం , దేనితో పోల్చాలో వర్ణించడానికి భాష చాలదు.
కోట బురుజుల మీద, కందకాల మీద, చెట్ల కొమ్మల మీద ఉన్న సైనికులు వచ్చి చేరారు. బురుజుల దగ్గర, చిన్న వాకిళ్ల దగ్గర కాపలా ఉన్న సైన్యంలో సగం సైన్యం వచ్చి, చేయూతనిచ్చింది. కోటలో ఉన్న మూలబలం కూడా కేకలు వేస్తూ వచ్చి చేరింది.
రుద్రమదేవి సైన్యం చాలా పెద్దదై శత్రువులను నరికి వేస్తున్నది. తళతళ మని కత్తులు మెరుస్తున్నాయి. తటతట మని తలలు తెగి కింద పడుతున్నాయి. ఇలా రెండు ఘడియల కాలం యుద్ధం చేసేసరికి వెలమనాయకుల, కమ్మ నాయకుల శౌర్యానికి తట్టుకోలేక అక్కడ ఉన్న శత్రువులు పారిపోయారు. రుద్రమదేవి సైన్యం వెంట పడగా… శౌణదేశపు సైన్యం అటు ఇటు పారిపోయింది.
అప్పుడు రుద్రమదేవి అక్కడ సైన్యాన్ని పంపి వేసి, ఉత్తర దిక్కున పోరాడుతున్న వీరుల వైపు తన సైన్యంతో వెళ్లి వారితో యుద్ధం చేసింది.
గుండ దండాధీశ్వరుని తమ్ములైదుగురు రాజును మూసుకొని పోయిన సమాచారం సేనాని అయిన బిచ్ఛణుడు విని, కోపంతో గబగబా వెళ్లి వారితో కలియబడ్డాడు. వాళ్ళు శౌణరాజును విడవకుండా సైన్యాన్ని ఎదుర్కొన్నారు. సైన్యాధిపతి కోపంతో వింటితో బాణాలు ఎక్కుపెట్టి పిడుగు గుండయ్య, విట్టల అయ్యను పడగొట్టాడు. మిగిలిన ముగ్గురు బిచ్చనుడితో యుద్ధం చేస్తున్నారు.
ఇంతలో శౌణరాజు మూర్ఛ నుండి తేరుకున్నాడు. శౌణరాజు తననెవరో మోసుకొని పోతున్నట్టు తెలుసుకొని, కోపంతో మండిపడుతూ నేలమీదకు దుమికాడు. వెంట ఖడ్గాలు చేతిలో పట్టుకొని, మల్లయ్య, బుద్ధయ, కోటయ్యలపై కలియబడేంతలో బిచ్ఛనుడు ప్రాణాలు విడిచాడు. సేనాని పరిస్థితి చూసి, కోపంతో శౌణరాజు ఖడ్గాన్ని తీసుకొని, ఆ ముగ్గురు వీరుల మీద పడి చాలా నొప్పించాడు. కొంతసేపటికి వాళ్ళు ముగ్గురు నిలువలేక పారిపోయారు.
శౌణదేశపు రాజు రుద్రమదేవి దగ్గరకు పోవాలనుకొని తలెత్తి చూశాడు. అప్పుడు అతనికి కలిగిన కలత అంతా ఇంతా కాదు. తన సైన్యం దెబ్బతిని పారి పోతున్నట్లు, రుద్రమదేవి, ఆమె సైన్యం తన సైన్యాన్ని తరుముతున్నట్లు, అతడు చూశాడు.ఎంత ప్రోత్సహించినా తన సైన్యం యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉన్నది అనుకోని, తన సైన్యం చాలా తక్కువ గానూ, రుద్రమదేవి సైన్యం చాలా ఎక్కువగా ఉన్నట్లు, ఆమె సైన్యంతో ఎదుర్కొంటే ప్రాణాలు దక్కవని, అతడు తెలుసుకున్నాడు.కాలం కలిసి రానప్పుడు తాను మాత్రం ఏం చేయగలడు. రుద్రమదేవికి ఆమెకు సంబంధించిన వారికి కనిపించకుండా ఒదిగి ఒదిగి ఒక పక్కనుండి పారిపోయాడు.
రుద్రమదేవి శౌణసేనను కొంతదూరం తరిమివేసి, మళ్లీ యుద్ధభూమికి వచ్చింది.దేవగిరి రాజును పట్టుకోవాలని ప్రయత్నించింది. కానీ అతడు కనపడక పోవటంతో మరలి వచ్చింది. ఆమె చుట్టూ సేనా నాయకులు, మిగిలిన సైన్యం నిలబడ్డారు. రుద్రమదేవి తన చుట్టూ మూగిన సైనికులను చూసింది. పెద్ద మొత్తంలో చనిపోయిన సైనికుల గురించి బాధ పడింది. సేనానాయకుడైన దాదియ సోమయ సాహిణియొక్క, గుండదండాధీశ్వరుని యొక్క,అతని తమ్ములయొక్క, మరికొందరు ప్రసిద్ధులైన వీరుల మరణం, మంత్రి అయిన శివదేవయ్య చాలా గాయపడడం ఆమెకు చాలా బాధ కలిగించింది. అప్పుడు ఆమె ఇలా అన్నది.
” ఓ! రాజభక్తి కల సైనికులారా! ఈరోజు మీరు నాకు విజయం కలిగించినా, వీరమరణం పొందిన సైన్యం, సైన్యాధికారులు, వీరులను పోగొట్టుకోవడం నాకు బాధను కలిగించారు. కులదైవంతో సమానమైన ముఖ్యమంత్రి శివదేవయ్య గారు గాయాల పాలవడం చాలా విచారకరం!శౌణదేశపు రాజు మనకు చిక్కకుండా దొంగవలె పారిపోయాడు. అతని పట్టుకోకుండా ఇల్లు చేరవద్దు! నేను సైన్యానికి ఆధిపత్యం వహించి, అధికారిగా ముందుకు నడుస్తాను. మిగిలిన సైనికులు, గాయపడిన వారు నా వెంట రావాలి! అని పెద్దగా అన్నది. సైనికులు, సేనాపతులు సరేనన్నారు.
రుద్రమదేవి గాయపడ్డ సైనికుల కొరకు మంత్రిని కోటకు పంపించి, గాయపడిన వారికి చికిత్స కోసం తగిన ఏర్పాట్లు చేయించింది. కోట నుండి భోజనం తెప్పించింది. వాళ్లంతా స్నానం చేసి , భోజనం చేసి, యుద్ధానికి సిద్ధమై శౌణదేశపు సైన్యం వెంటపడి, మహాదేవ రాజును పట్టి తేవాలనే గట్టి పట్టుదలతో నడిచారు.
ముందు దేవగిరి సైన్యం, వెనుక రుద్రమదేవి పరివారం నడుస్తున్నది ఓరుగల్లు సేన ఉన్న సంగతి శౌణ సైన్యానికి తెలియదు. గెలువలేక పోతిమనే విచారంతో, దేవగిరి రాజు పోయి పోయి రుద్రమదేవి రాజ్యం పొలిమేర దాటి,శౌణదేశపు ప్రాంతంలో ఒకచోట సైన్యాన్ని నిలిపి వేశాడు. అలసట తీరుతుందని, విడిపోయిన సైన్యం వచ్చి కలుస్తుందని రెండు రోజులు అక్కడే ఉన్నారు. ఆనాటి సాయంకాలమే విడిపోయినా కొంత సైన్యం, వస్తు సామాగ్రితో ఉన్న బండ్లు వచ్చి కలిశాయి. మూడు లక్షల సైన్యంతో వెళ్ళిన మహాదేవరాజు పదివేల కన్నా తక్కువ సైన్యంతో తన దేశపు పొలిమేర చేరి నిలిచాడు.
శౌణదేశపు సైన్యం తెల్లవారిన తర్వాత మేలుకొని చూసేసరికి ఏమున్నది? వారి చుట్టూ ఓరుగల్లు సేన ఉన్నది. తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎదిరించి యుద్ధం చేయడానికి రుద్రమ సైన్యం ఎక్కువగా ఉన్నది. ఆలస్యంగా ఈ వార్త రాజుకు తెలిసింది విచారంతో మహాదేవరాజు మంత్రులను, ముఖ్యులను పిలిపించి చేయవలసిన పనులు విచారించాడు. వాళ్లు తమ అభిప్రాయాన్ని రకరకాలుగా చెప్పారు. ఎవరి అభిప్రాయం అయినా యుద్ధం చేయటానికి సైన్యం సుముఖంగా లేదని…
చివరకు వారంతా సంధి కుదుర్చుకోవడం మంచిదని నిశ్చయించుకున్నారు. దేవరాజు రాయబారం నడిపేందుకు భోళేశ్వర సైన్యాధిపతి నియమించి చెప్పవలసిన విషయాలన్నీ అతనికి చెప్పి, రుద్రమదేవి వద్దకు పంపాడు.
భోగేశ్వరుడు ఏ ఆయుధాలు వెంట తీసుకొని పోకుండా. రుద్రమదేవి సైనిక గుడారంలోనికి వచ్చాడు.సైన్యం అతనిని అడ్డగించ లేదు. రాయబారి రుద్రమదేవి గుడారం దగ్గరకు వచ్చి , ద్వారపాలకుడితో తను వచ్చినట్లు లోపలికి తెలియజేశాడు. ద్వారపాలకుడు తిరిగివచ్చి భోళేశ్వరునికి రాణి అనుమతి తెలిపాడు. భోళేశ్వరుడు గుడారం లోనికి వెళ్ళాడు.
రుద్రమదేవి ముఖ్యులతో అంతరంగిక సమావేశమై,భోళేశ్వరుడు రావడం చూసింది.భోళేశ్వరుడు బ్రాహ్మణుడని తెలుసు కాబట్టి తన సింహాసనం నుండి లేచి నమస్కరించింది. భోళేశ్వరుడు యధావిధిగా బ్రాహ్మణ ఆచారపరంగా ఆశీర్వదించి, రాజు వేషంలో ఉన్న రాణి మీది గౌరవం తెలిపాడు. తరువాత తనకు కేటాయించిన ఆసనం మీద కూర్చున్నాడు.
అప్పుడు రుద్రమదేవి భోళేశ్వరునితో ఈ విధంగా మాట్లాడింది.
” మీరు ఏ పని మీద వచ్చారు?”
దేవీ! మారాజు రాయబారం పంపించాడు.
ఏమని?
ప్రస్తుత విషయం గురించి.
ఆ… అర్థమైంది… ముట్టడించడం ఆపివేసి వెళ్లిపొమ్మని కావచ్చును . మా పై పన్నిన కుట్ర…
ఆ విషయాలన్నిటినీ దయతో క్షమించండి!
మంచిది !మేము మూర్ఖపు పట్టుదలతో లేము! సంధిని ఒప్పుకుంటాం! మాకు తలపెట్టిన కుట్ర క్షమార్పణ సరిపోయింది. ఇంకా రాయబారం మూడు మాటల్లో చెప్పనా? యుద్ధ ఖర్చుల కింద ఐదు కోట్లధనం, యాభై ఏనుగులు, వంద గుర్రాలు… ఏమంటారు? మీ రాజు ఒప్పుకుంటాడా?, లేక రాజునడిగి చెప్తారా?
సంధిని కుదుర్చుకుని, అపాయం లేకుండా తమ శౌణదేశపు సైన్యాన్ని తమ దేశానికి చేరవేసేందుకు భోళేశ్వరుడు మారుమాట్లాడకుండ ఒప్పుకున్నాడు.రుద్రమదేవి కూడా అంగీకరించింది.
రాయబారి సెలవు తీసుకొని వెళ్ళి,జరిగిన విషయమంతా రాజుకు తెలిపాడు.అతడు సంతోషించి, ఒప్పుకున్న ధనం,మొదలైన వాటిని రుద్రమదేవికి పంపించాడు.
రుద్రమదేవి జయశాసనాలను అక్కడ స్ధాపించి, సైనికులకు యాభై లక్షల హొన్నులను బహుమతిగా ఇచ్చి, దేవగిరిని ముట్టడించాలన్న ఆలోచన మానుకుని ఓరుగల్లు చేరింది.
(సమాప్తం)