గ్రంథకర్త:-ఒద్దిరాజు సీతారామ చంద్ర రాయశర్మ
సరళీకృతం :-రంగరాజు పద్మజ
ఒద్దిరాజు సీతారామ చంద్ర రావు గారు
2వ ప్రకరణ
చర్చ
(ప్రకరణ శీర్షిక )
” గుణవదగుణవద్వా
కుర్వతాకార్య మాదౌ
పరిణతి రవధార్యా
యత్నతః పండితేన
అతిరభస కృతానాం
కర్మణా మావిపత్తే
ర్భవతి హృదయ దాహీ
శల్య తుల్య విపాకః ॥
(హితోపదేశం)
భావం:– మంచిది కానీ చెడ్డది కానీ ఒక పని ప్రారంభించేటప్పుడు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? అని బుద్ధిమంతుడు ముందే ఆలోచించుకోవాలి. అలా ఆలోచన లేకుండా తొందరపడి చేసిన పనులకు బ్రతికినంత కాలం శల్యం లాగా హృదయాన్ని పీడించే దుష్పరిణామాలు కలుగుతాయని అర్థం.
కథాభాగం:–
దేవగిరి రాజ్యం చాలా పురాతనమైనది. దానిని దౌలతాబాద్ అని అంటారు. అది ఇప్పుడు నైజాం రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నది. ఢిల్లీ పట్టణానికి దాదాపు ఏడువందల మైళ్ళ దూరంలో ఉన్నది.
ఈ దేవగిరి పట్టణంలో చాలా అందమైన భవనాలు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దుర్గం ఉన్నది. ఈ దుర్గం గురించి ప్రతి భారతీయుడికి తెలుసు.
దేవగిరి ప్రభువులు యాదవులు. వీరు శ్రీకృష్ణుని సంతతికి చెందినవారు. వీరి వంశంలో రెండు తెగలు ఉన్నాయి. ఒక తెగ వారికి ద్వారక సముద్రం రాజధాని. రెండో తెగవారికి దేవగిరి రాజధాని. ద్వారక సముద్రం రాజధానిగా ఉన్న యాదవకులాన్ని విడిచి, మన కథకు సంబంధించిన దేవగిరి ప్రభుత్వం వారి గురించి కొంచెం తెలుసుకోవడం అప్రస్తుతం ఏమీ కాదు.
మధురానగర నివాసి, యాదవుడైన సుబాహుడు, అతని సంతతివారు ధృఢప్రహారుడు, శౌణచంద్రుడు, ధాడియప్ప, భిల్లముడు, శ్రీరాజావడ్డిగ,ధాడియ నవవల్లభుడు, నేణచంద్రుడు, ఇలా వంశ పారంపర్యంగా రాజ్యాన్ని పాలిస్తూ వచ్చారు. వీరిలో కొంతమంది కొంతకాలం చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు. కానీ ఐదవ భిల్లముడు చాళుక్యులను ఓడించి, చాళుక్య సామంతులనే తమ పేరును తుడిచి వేసుకున్నారు.
ఇంతకుముందు పైన చెప్పిన రాజులు ధైర్య సాహసాల యందు అంతులేని శక్తివంతులు అనడానికి ఉదాహరణగా చాళుక్య వంశీయుడు జయసింహుని కూతురును వివాహం చేసుకోవడం,చాళుక్య విక్రమాదిత్యుడికి యుద్ధంలో సహాయం చేయడం, చాళుక్యులను గెలిచి సామంతులనే తమ పేరును తొలగించు కోవడం కీ.శ.1182 వ సంవత్సరంలో ద్వార సముద్రంలో యాదవులను చాణుక్య క్షమావల్లభులను గెలిచి, కళ్యాణపట్టణాన్ని, కృష్ణానదికి ఉత్తరాన ఉన్న రాజ్యాన్ని స్వాధీన పరచుకొనడమే ఇందుకు తార్కాణం.
భిల్లముడు ఒక్కడు మాత్రం కృష్ణానదికి దక్షిణాన ఉన్న కుంతల దేశాధినేత వీరభల్లాణుని పైకి క్రీస్తుశకం1182 సంవత్సరంలో పోయి, ధార్వాడ జిల్లాలో “నిలక్కుండి” అనే స్థలంలో యుద్ధంచేసి, వీరమరణం పొందాడు. ఆ సమయంలో పృథ్వీరాజ్ కు మహమ్మద్ ఘోరికి యుద్ధం జరుగుతున్నది. మొత్తం మీద యాదవ వంశంలో ఒక చివరి భిల్లముడు తప్ప ఎవరూ ఓడిపోలేదు.
భిల్లముడి కుమారుడు జైత్రపాలుడు, అఖండమైన వైభవంతో వెలిగిపోతూ, శత్రువులను ఎదిరించి, రాజ్యసుఖాన్ని పొంది, కాకతీయ గణపతి రాజుతో యుద్ధం చేస్తూ కీ.శ.1247లో మరణించాడు.
జైత్ర పాలుని పెద్దకొడుకు శింగణమాధవుడు తండ్రి కన్నా ముందే మరణించాడు.రెండవ కుమారుడు కృష్ణ భూపుడు అతనికి తండ్రి పదవి ఇవ్వవద్దని సోమ పాలుడు మరణించిన నాడే ఈ కృష్ణ భూపాలుని, ఇతని అక్క అయిన పద్మావతిని, దేశపు ఖజానాను దేవగిరి నుండి తరలించి, ఆ డబ్బుతో పాతాళ మందిరంలో జోడు లేని సుఖాల తేలియాడుతూ, రాజు సంతానాన్ని చెరపట్టినారు. కృష్ణ భూపాలుని తమ్ముడైన మహాదేవరాజును శంకర మంత్రి శత్రువుల నుండి రక్షించారు. స్వామి భక్తి పరాయణుడైన శంకర మంత్రి గణపతి దేవరాజు సహాయంతో శత్రువులను చంపి వేసి, కృష్ణ భూపాలునికి రాజ్యాభిషేకం చేశాడు.
కృష్ణ భూపాలుడు గణపతిరాజుకు అంకితుడై, స్నేహితుడై, దక్షతతో రాజ్యాన్ని పాలించి,కీ.శ. 1260లో కన్నుమూశాడు.
కృష్ణ భూపుని తమ్ముడు మహాదేవరాజు. ఈ మహాదేవరాజే ప్రస్తుతం దేవగిరి రాజు. మహాదేవరాజు విద్యావంతుడు. అంతేకాదు పరిపాలన న్యాయ మార్గంలో చేసేవాడు. అంతేకాదు గొప్ప దానగుణం కలవాడు. చాలా ధర్మకార్యాలు చేశాడు. విద్వాంసులను పోషించాడు. ఇతనికి సంగీతంలోనూ ప్రావీణ్యత ఉన్నది. పెదన్న అయిన సింగణ యాదవుడి కాలం నాటి మంత్రి అయిన సాధులుని కొడుకు శారంఙ్గధరుడు రచించిన సంగీతరత్నాకరం అనే గ్రంథాన్ని శారంఙ్గధరుని దగ్గర నేర్చుకున్నాడు. జ్యోతిష్యంలోనూ మంచి పాండిత్యం ఉన్నది. అన్నతో స్థాపించబడిన జ్యోతిష్య కళాశాలను ఇతడి ఇంకా నడుపుతూనే ఉన్నాడు. చాలామంది జ్యోతిష్యులు ఇతని కొలువులో పండితులుగా ఉన్నారు. వారంతా సింగణ యాదవుని కాలంలో ఆస్థాన పండితులుగా ఉన్నవారే.
ఈ మహాదేవరాజు కొంకణాంధ్ర, ఘూర్జర దేశాల రాజులను ఓడించి, నయానా భయానా చాలామంది రాజులను తన సామంతరాజులుగా చేసుకొని, చక్రవర్తి బిరుదు పొందాడు కాశ్యపస గోత్రీకుడైన కేశవుని ఋత్విక్కుగా చేసుకుని,” యాస్త్యా రామ” అనే యజ్ఞాన్ని చేశాడు.
ఒక్క కాకతీయులు మాత్రం సామంతులు కాలేదనే కొరత తప్ప, మహాదేవరాజుకు ఎందులోనూ లోపం లేదు. కానీ అతనికి కాకతీయులను తన సామంత రాజులుగా చేసుకోవాలనే కోరిక ఉంది. మధ్యమధ్య సభలు ఏర్పాటు చేసి, రాజ్యాంగాన్ని విమర్శించేవాడు. ఆనాటి సభకు చాలా మంది ప్రజలు వచ్చి సభాస్థలంలో వేసిన ఆసనాలపై కూర్చునేవారు.
మహాదేవరాజు సింహాసనం మాత్రం అతడింకా రాకపోవడంతో ఖాళీగా మిగిలి ఉంది ఆ రోజు. ఆ పీఠానికి దక్షిణంలో” శ్రీ కరుణాధిప” అనే బిరుదు పొందిన పోథలా మాత్యుడు, ఇతనికి అవతల ఇతని కుమారుడైన సంగీత విద్వాంసుడైన శారంఙ్గధరుడు, అతనికి అవతల భాస్కరాచార్యుని మనవడు ఛాంగదేవుడు , భాస్కరాచార్యుని తమ్ముని మనుమడైన అనంత దేవుడు కూర్చుని ఉన్నారు. సింహాసనానికి ఉత్తరంలో గుజరాతి దేశ పాలకుడైన లవణ ప్రసాదుడు, అతని కుమారుడు వీరధవనుడు, వారికి అవతల కొంకణ దేశాధినేత మొదలైన సామంతరాజులు, వారికి అవతల ముద్గల గోత్రీకుడు, భోళేశ్వరశర్మ, అతని కుమారులు రామశర్మ,బిచ్ఛణశర్మ, మొదలైన సేనా నాయకులు కూర్చుని ఉన్నారు. రాయబారులు తమ తమ గోడులను వినిపించేందుకు వచ్చిన వారు, వారి వారికి తగిన స్థానాలలో కూర్చున్నారు.
రాజు ఇంకా రాలేదు. సభ్యులు అందరూ ఎదురుచూస్తున్నారు. సభ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంతలో” పృద్వీ వల్లభా! శ్రీ విష్ణు వంశోద్భవా” అనే చారుణుల స్తోత్రగానాలు వినపడ్డాయి. కొన్ని నిమిషాలలో కొద్దిమంది వెంటరాగా ఒక పురుషుడు ఆ సభలోనికి వచ్చినాడు.
అతడి శరీరం చాలా అందంగా ఉండి, తుమ్మెద రెక్కలకు సరిసమానమైన పట్టుకుచ్చులను ఎగతాళి చేసేట్టున్న తలవెంట్రుకలు, గడ్డం, మీసం, ఎర్రని సన్నని చారికలతో ఉన్న తామర పూల రేకుల వంటి కండ్లు, మోకాలును తాకేంత పొడవైన చేతులు, సౌందర్యానికి మారురూపా అన్నట్టున్న అతను జలతారు తలపాగా చుట్టుకొని, మోకాళ్ళ వరకు ఉన్న పట్టు అంగి తొడుక్కుని, అదొక రకమైన చెప్పులను కాళ్లకు తొడుక్కుని ఉన్నాడు . అతనే శౌణదేశపు చక్రవర్తి మహాదేవ రాజు.
మహాదేవ రాజును చూడగానే సభలోని సభ్యులందరూ లేచి, తమకున్న రాజు మీద భక్తిని చాటుకున్నారు. వారుమొక్కుతున్న వారి మొక్కలను అందుకుంటూ, తాను మొక్కగల పెద్ద వారికి తాను మొక్కుతూ పోయి, మహాదేవరాజు సింహాసనం మీద కూర్చున్నాడు. తర్వాత సభలో ఉన్న వారంతా కూర్చున్నారు.
కొన్ని నిమిషాల తర్వాత మహాదేవరాజు తన కుడి వైపున పీఠం మీద కూర్చున్న మంత్రి సాధులుని చూశాడు.ఎదుటివారి భావాలను గ్రహించగలిగిన నేర్పున్న ఆ మంత్రి వెంటనే తను కూర్చున్న ఆసనం నుండి లేచి, సభలోని వారితో ఇలా చెప్పసాగాడు.
” సభ్యులారా! భారతీయ మహాజనులారా! నేడు శ్రీ పృథ్వి వల్లభులును, శ్రీవిష్ణువంశోద్భవులు అయిన మహాదేవరాజు గారు మిమ్మల్ని ఇలా సమావేశపరచడానికి కారణం ఏమీ లేదని మీరు అనుకోరు. అయినా ఎందుకు పిలిచారో? ఆ కారణం మీకు తెలిసి ఉన్నదో, లేదో ? గట్టిగా చెప్పలేను! కొందరికి తెలిస్తే తెలిసి ఉండవచ్చు! తెలియనివారికి తెలుపడం ముఖ్యం. రాజుగారి ఉప్పు పులుసు తినే సేవకులు, సామంతులు తమతమ ఉదార పరాక్రమాలు తెలపడం వల్లనే సామంతులు ఎక్కువయ్యారు; అందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను. చక్రవర్తి బిరుదు లభించినందుకు ఆ దేవదేవుడిని ఎప్పుడూ వారి హృదయంలో తలుచుకుంటూనే ఉంటారు.ఇంక ఒకటే కొరత ఉంది వారికిఅది ఏమిటంటే గుజరాతి, కొంకణ దేశాల వలె పూర్తి ఆంధ్రరాష్ట్రం తమ స్వంతం కాలేదనీ, కాకతీయులు పాలించు భాగం ఇంకా మిగిలే ఉన్నదని, దాన్ని జయిస్తే ఇక వారికి కొదవేలేదు అందు కోసమే ఈ సమావేశం ఇక్కడ జరిగింది. మంచిచెడ్డలు బాగా ఆలోచించుకుంటే తప్ప చేయవలసిన పని తేలదు. గౌరవ సభ్యులు అందరూ మీ మీ అభిప్రాయాలను తెలుపగలరు. ఎవరూ అనుమానించ అక్కరలేదు.
ఇలా చెప్పి మంత్రి తన పీఠం మీద కూర్చున్నాడు. ధర్మవర్తనుడు, హరిహర దేవుడు, మురారి దేవుడు వచ్చి ఆ సభలో కూర్చొని ఉన్నారు. మంత్రి చెప్పిన మాటలు మురారి, హరిహర దేవులకు ఎలా అనిపించాయో? తెలియదు కానీ, ధర్మవర్ధనునకు మాత్రం సంతోషంగా ఉన్నాయి. ఎలా అయినా మహాదేవరాజను ప్రార్ధించి, తన యొక్క కుల స్థితిగతులను చెప్పుకొని, ఓరుగల్లు పై దండును తీసుకొని పోవడానికి వచ్చాడు. అందుకే మంత్రి గారు సభలోని వారికి చెప్పిన మాటలు అతనికి ఆనందం కలిగించాయి. అనుకున్న పని ప్రయత్నం లేకుండానే కాబోవడం ఎవరికి మాత్రం ఇష్టంగా ఉండదు?
మంత్రి మాటలకు సమాధానం ఏమని చెప్పాలా? అని సభ్యులు ఆలోచిస్తున్నారు.
ఇంతలో ఒకడు దిగ్గున లేచి శౌణదేశాధినేతకు ఎదురుగా నిలబడి, రాజు తలచుకుంటే దెబ్బలకు తక్కువేమి ఉండదు. అందరు రాజుల వలే కాక శ్రీ ఏలినవారు అనుకున్నదే తడవు కార్యం చక్కగా నెరవేరుస్తారు మీరు జయించాలనుకున్నారు. జయించారు. అదే దానికి ఋజువు. తప్పనిసరిగా కాకతీయుల పాలనలో ఉన్న ఆంధ్రదేశం శ్రీవారి వశమయితే ఇక లోపం ఏమీ ఉండదు. ఇది ఇదివరకెప్పుడో కావలసిఉండే! కానీ కాలేదు. అయినా ఇప్పుడు మాత్రం ఏమిటి? సైన్యం సిద్ధ పరుచుకొని యుద్ధానికి మేము, సైన్యాధ్యక్షులు అందరూ సిద్ధంగా ఉన్నాం. తమరి ఆజ్ఞ అనే పూమాలను మా తలదాల్చి రాజ్యభారం తీరుస్తున్న సామంతరాజులందరూ సిద్ధంగా ఉన్నారు.
సేనాధిపతి మాట నిజం!! ఈ పని ఇంతకు ముందే జరగవలసి ఉండే! అది అలా జరిగిపోయేది! ఒక్క కారణం వల్ల అది ఆగిపోయింది. బలవంతుడైన గణపతి రాజును జయించాలంటే కొంకణ, ఘూర్జర దేశాలలో యుద్ధం చేసిన శ్రీ వారి సైనిక శక్తులనుకున్నారు. ఇంతలో గణపతిరాజు అనారోగ్యం పాలవడం తెలిసినందు వల్ల కొందరిని వారికి కాపలా ఉంచి, అతనిని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండమని చెప్పినారు. ఏ కారణం వల్లనో ఏమో? తమకు అప్పజెప్పిన పని ఎంతో శ్రద్ధ చూపలేదు. గణపతిరాజు మరణించిన ఆదను తెలుసుకొని , రాజ్యాన్ని ఇతరులకు పట్టం కట్టకుండా అడ్డుకొని ఉంటే శ్రమ లేకుండా రాజ్యం చేతికి చిక్కి ఉండేది. గణపతిరాయ మంత్రి అయిన శివదేవయ్య చాలా తెలివికలవాడు. అతడికి ఈ సంగతి ఇలా జరుగుతుందని ముందే గ్రహించి, గణపతిరాజు మరణించిన సమాచారం బయట పడనీయకుండా అతని కూతురు అయిన రుద్రమదేవిని పీఠంపై కూర్చుండబెట్టి నాడు. శ్రీవారి వల్ల పంపబడిన వారు బహు జాగ్రత్తగా ప్రవర్తించినా ఇంతపని జరగక పోయేది. సూది కొరకు దూలం మోసినట్లయింది. ఎలా అయినా ఆ రాజ్యం స్వాధీనానికి తెచ్చుకోకుండా విడిచిపెట్టరని మంత్రి తన పీఠం నుండి లేచి చెప్పి మరలా కూర్చున్నాడు.
” రాజుగారి కార్యం కోసం మా ప్రాణాలను వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆజ్ఞ ఇవ్వడమే ఆలస్యం… సైన్యంతో సహా సిద్ధంగా ఉన్నామని గుజరాతి దేశపు రాజయిన లవణ ప్రసాదుడు చెప్పాడు.
సామంతులు అందరూ ఒప్పుకున్నారు. సభ్యులందరూ అంగీకారం తెలిపారు. ఒక గడియ సేపటివరకు సభ సద్దుమణిగింది. తర్వాత మహాదేవరాజు సభ్యులతో ఇలా అన్నాడు.
” మంత్రి మాటలను విన్న మీ మనుసులకు యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? ఎటువంటి ప్రయత్నాలు చేయాలనే సంగతి తెలియదు. అది మీరు తప్పక నెరవేర్చాల్సిన పని. అది ఏమిటో చెబుతాను. మనం ఇప్పుడే ప్రయాణించి ఓరుగల్లును ముట్టడించాల్సిన పనిలేదు. మనకు కాకతీయులు అంకితమవ్వాల్సి ఉన్నది. రాజ్యం మనవశం కావాల్సి ఉన్నది. కావలసిన పనులు అయినవి. యుద్ధం చేయకుండా చేతికి అందదని అనుకోవడం మూర్ఖుల పని. సామ, దాన, భేద దండోపాయాలు అని పూర్వం నాలుగు మాత్రమే చెప్పారు .బాగా ఆలోచిస్తే ఉపాయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి సహాయ శక్తుల మొదట ప్రయోగిస్తాను. దాంతో పని జరగకుంటే తర్వాత ఏం చేయాలని ఆలోచించాలి. కాబట్టి ప్రస్తుతం యుద్ధం మాట లేదనడం నిజం. కానీ యుద్ధం లేదనుకొని దానికోసం చేయాల్సిన ప్రయత్నం విరమించుకోవడం మంచిది కాదు. ఏ సమయం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఉపాయం వల్ల కార్యం అవుతుందన్నదీ తెలియదు. సాధ్యమైన యుద్ధ ఏర్పాట్లు చేయనందుకు… మనకు అవసరం లేకపోవడం వల్ల అక్కడితో అది సరిపోతుంది. ఒకవేళ సాధ్యం కాకపోతే యుద్ధమే కావాల్సి వస్తే దానికి సంబంధించిన ప్రయత్న విరమణ ఎలా విషమిస్తుందో నేను మీకు చెప్పకపోయినా… అది మీకే తెలుస్తుంది! అప్పుడు ప్రయత్నించడం ఎలా ఉంటుందంటే… ఇల్లు కాలుతున్నప్పుడు మంటలు చల్లార్చేందుకు నీటి కోసం బావి తవ్వినట్లుగా ఉంటుంది. మీరు ఇప్పటి నుండే యుద్ధ ప్రయత్నాలు మొదలు పెట్టాలి ! మన సైన్యం మొత్తం రెండు మూడు లక్షలు ఉంటేనే కానీ కాకతీయులను ఎదుర్కొని పోరాడ లేము. కాకతీయ సైనికులు, సైన్యాధిపతులు యుద్ధం చేయడంలో ఎంతో అనుభవం ఉన్న వారు.గణపతి రాజు చేతి కింద పనిచేసిన ప్రతి ఒక్కడికీ
బుద్ధికుశలత కలగడం వింతేమీ కాదు. మా అన్నగారు బందీ అయినప్పుడు తన పేరు’ భద్రుడు’ అనీ, ప్రసాదాదిత్యుని పేరు ‘పేరడు’ అని, తిరుమల దేవ నాయకుని పేరు’ తిమ్మడు’ అని పెట్టుకొని ముగ్గురు మాత్రమే వచ్చి ఎంత పని చేశారో ? అది కూడా అతని మంత్రి శివదేవయ్య మన కన్నుగప్పి రుద్రమదేవిని
” మహారాణిగా” చేయడమే వారి యొక్క బుద్ధికుశలతకు తార్కాణం. కాబట్టి మీరందరు జాగ్రత్తగా ప్రయత్నాన్ని గట్టిగా చేయాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు సిద్ధమై రావడానికి తగ్గినట్లు ఉండాలి”.
రాజు మాటలను కొందరు ఒప్పుకొని సరేనని అన్నారు. అంతటితో సభ ముగిసింది.
(సశేషం)
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
మూడవ ప్రకరణ
( మదన మంజరి)
…” స్వశాభృశ మా దృతకజ్ఞత మతి రసోత్పాదనచణ
మధికశోభాటన పాటన మాశ్రిత గన్ధర్వకుల
మాకలిత గోత్రాన్తరం, వఞ్చాధారూపముదఞ్చయన్తి
………అనుయాతవతి.
— భారత చంపు.
శ్రీ మజ్జినేంద్ర పద పద్మ మశేష భవ్యమ్
నవ్యత్రిలోక నృపతీంద్ర మనీంన్ద్ర వన్ద్యమ్
నిశ్శేష దోష పరిఖండన చణ్డ కాణ్డమ్
రత్న త్రయ ప్రభన మద్యగుణైకతానమ్.
అను స్తోత్ర శ్లోకం అనుమకొండ పద్మాక్షి దేవాలయంలో ఉన్న శ్రీ కాకతి ప్రోలరాజు శాసనాలలో ఉండడం వల్ల కాకతి ప్రోలరాజు జిన మతస్థుడు అని,
” అన్యాచ్చానమకొండ నామ నగర్చీ సంవేష్ట్యయోయం
స్థితో నామమణ్డలి కాన్వితో భువిగద్దేవస్య ప్రభుస్తమ్భిత ఏవకార్యణీ రక్తాకషణానిర్గతః
శ్రీ మత్ప్రోల నృపస్య థస్య జయినః
కిం బ్రూమహే గౌరవమ్ ॥ ”
అని అనుమకొండ శాసనము వలన కాకతి ప్రోలరాజు బలవంతుడనీ,
” శివ పాదపద్మ యుగళ ధ్యానామృతా వన్దభూ
రుణ్ఠాకోరిపు సున్దరీ జప మహాసౌభాగ్య సమచ్ఛియ
ప్రోలరాజ ఇతి ప్రసిద్ధ మగమద్వైరీంద్ర దర్పహా
నిశ్శంజ్క ప్రథన ప్రనన మహాహజ్ఞ్కర లజ్ఞేశ్వరః
అనే అనుమకొండ శాసనంలోని శ్లోకం వల్ల జినమతంలో చేరిన కాకతి ప్రోలరాజు కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత శైవ మతాన్ని అనుసరించాడు అని తెలుస్తున్నది.
” దేవి ముప్పమనామ ధేయ సహితా యస్యా గుణ స్తారకాః
కీర్తి శ్శారద చంద్రికేవ విలసత్ కౌంతేనేస్తు నైవోపమా
కౌసల్యేవచ, జానకి వచ సతీ కుంతీచ పద్మా చ,సా
పౌలోమి,చణ్డీ కేవచ తథా తస్య భవద్భామినీ ॥
భావం :– కౌసల్య, సీత, సతి, కుంతి, పద్మ, పౌలోమి, చండి మొదలగు త్రిమూర్తులు చంద్రుని కాంతి వంటి కీర్తి గలవారు. వారి వలనే ముప్పమ్మ కూడా గుణాలలో అంతటి కీర్తి కలది. ఆమె ప్రోలరాజు భార్యని ఈ అనుమకొండ శాసనం వల్ల కాకతి ప్రోలరాజు భార్య ముప్పమ్మ అని తెలుస్తున్నది.
” తతో ముప్ప మామ్బాయా అధిగతజనూ రుద్రనృపతి
ర్జయత్యేక స్థానస్థిత ఇవ నృపాణాం గుణగణః
ధనీధీరోవీరశ్శుచి రుచిత కర్మానసుభగః
క్షమీదక్ష్య స్త్యాగీ మిత మధుర వాగార్ధ హృదయః ”
మానుకోట తాలూకా లోని ఇనుగుర్తి గ్రామ శాసనం మీద లిఖించబడిన ఈ శిలా శాసనం మీద ఉన్న ఈ శ్లోకం వల్ల ప్రోలరాజు కు ముప్పాంబికకు శ్రీమత్
ప్రతాపరుద్ర మహారాజు జన్మించినట్లు తెలుస్తున్నది.
” నానావనీ నాధ కిరీట కోటి, తాంశుభిశ్చుమ్బిత పాదపీఠే
నిర్దుష్టమమ్బోనిధి వేష్ఠితాం ,విశ్వమ్బరాంశానతి రుద్రదేవే ॥”
అనే ఈ శాసనం సూర్యాపేట తాలూకా లోని పిల్లలమర్రి గ్రామం శాసన మీద ఉన్న ఈ శ్లోకం అరుద్ర మహాదేవ మహాదేవ రాజు సముద్రంతో చుట్టి ఉన్న భూభాగాన్ని పరిపాలించాడని తెలుస్తున్నది. అంతేకాదు
పరువడి నాటధ్రభాష గల బద్దైన నీతియు సంస్కృతం బుతో
బఱగ ప్రతాపరుద్రవర పాలునిచే రచియింపబడ్డ యా
నరవరు నీతిసారము వినం జదువం గడు మంచిదంచు జె
చ్చెర గలనీతి పద్ధతులు జేసె వినోదము బాల బోధకున్ ॥”
అనే పద్యంలో ప్రతాపరుద్ర మహారాజు సంస్కృత భాషలో గ్రంథం రాసినట్టు తెలుస్తున్నది.
యస్యాః కాకతి రాజవంశ తిలకం ప్రోల ప్రజేశాత్మజః
శ్రీ మద్ద్రుద్ర నృపానుజస్సహి మహాదేవోనృపాలః పితా
మాతా బయ్యమ నామధేయవనితా దేవీ భువో భూషణం
భ్రాతైకోదర సమద్భవో గణపతిర్భూపాల చూడామణిః
అనే ఇనుగుర్తిలోని శాసనంపైన ఉన్న శ్లోకం వల్ల రుద్రమహారాజుకు తమ్ముడైన మహాదేవరాజుకు బయ్యమాంబకు గణపతి రాజు జన్మించినట్లు తెలుస్తున్నది . ఈ గణపతి రాజు శత్రువులకు గుండెలో గాలమై, ఆశ్రయించుకుని ఉన్నవాళ్లకు కల్పవృక్షం వలే ఉన్నాడు.
” కతికత వసంతి భూపాః కతికతి వాగుణ గుణా భరణాః
గణపతి నృపతి స్యైకో, నరపతి శతపోషకః క్షోణ్యాం”
అనే మంగళగిరి తాలూకాలోని మల్కాపురం అగ్రహారంలోని శాసన శ్లోకం గణపతి రాజు నరపతి శత పోషకుడు అని తెలుపుతున్నది. ఈ గణపతి రాజకుమార్తె రుద్రమదేవి. ఈ రుద్రమదేవిని గణపతి రాజు భార్య అని కొందరు అనుకున్నారు కానీ,
” సర్వోర్వీశ కిరీటకుట్టిమ తటీవిన్యస్తపాదామ్భుజా
శాస్త్యేశా చతురమ్బురాశిరసానాం శ్రీ రుద్రదేవ భువమ్
యస్యా జన్మమహోత్సవో గణపతిక్ష్మాపాల చూడామణీః
విస్పూర్జిత్కలికాల కల్మషకథాధ్యాన్తేషు తేజోనిధిః ”
అనే మల్కాపురంలోని శిలాశాసనం వలన రుద్రమదేవి గణపతి రాజు కూతురు అయినట్టు తేటతెల్లమైంది.
(సీతారామ చంద్రరాయ):– పాఠక మహాశయుల రా! కాకతీయుల వంశ పరంపర గురించి ఋజువులతో సహా తెలిపినాను. మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసి, శ్లోకాలను చదువుటకు ఇష్టం లేకపోతే
( చదవక పోయినా పర్వాలేదు) చదవకండి!
కాకతీయులు రెడ్డి వారు.” కాకతి” అనే శక్తిని పూజించడం చేత” కాకతీయుల”ని వీరికి పేరు వచ్చింది. ఈ వంశంలో పుట్టిన రుద్రమదేవి తండ్రి అయిన గణపతిరాజు మరణించిన తర్వాత శివదేవయ్య అనే మంత్రి సహాయంతో తండ్రి సింహాసనమెక్కింది.
రుద్రమదేవి తండ్రికి ఏ మాత్రం తీసిపోనిది. రాజ్యాంగ తంత్రాలు చక్కగా తెలుసు. ఆలోచన చేయడంలో ఆమెకు ఆమే సాటి! న్యాయ గుణం కలిగినది. దుఃఖితుల మీద ఆదరం, ప్రేమ కలిగి ఉంటుంది. శత్రువుల మీద క్రూర భావంతో ఉండడం ఆమెకు సహజగుణాలు.
రుద్రమకు మగసంతానం లేదు. ముమ్మడమ్మ, రుయ్యమ్మ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ముమ్మడమ్మ ను చాళుక్య వంశానికి చెందిన వీరభద్ర రాజుకు, రుయ్యమ్మను మైలారు భీమన ( మైళముభీమన)వంశీకుడైన ఇందులూరి అన్నమ్మ దేవరాజు కు ఇచ్చి వివాహము చేసి, అల్లుళ్లను ఇద్దరినీ తన రాజ్యంలోనే అట్టే పెట్టుకున్నది. ఇద్దరూ అల్లుళ్లు రుద్రమదేవి కుడిభుజం వంటివారు.
కూతుళ్లకు సంతానం లేదనే విచారము రుద్రమదేవికి ఎక్కువగా ఉండేది. బిడ్డల చేత చాలా వ్రతాలు, దానధర్మాలు చేయిస్తూ ఉండేది.
ఒకరోజు రుద్రమదేవి ఇద్దరు కూతుళ్లతో కూడి అనంతపురంలోని ఏకాంత ప్రదేశంలో కూర్చుని ఉన్నది. వాళ్ళు ఏదో లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. అంతలో ఒక స్త్రీ మెట్లు ఎక్కుతూ వచ్చి, రుద్రమదేవిని చూసి, తలవంచి, నమస్కరించింది.
ఆ వచ్చిన స్త్రీ కూడా దాదాపు రుద్రమదేవి వయసంత వయసే ఉన్నది. ఆమెను చూస్తే మంచి దానివల్ల కనపడుతున్నది.రాగానే నమస్కరించి చేతులు జోడించి తల వంచుకొని నిలబడింది.
ఆమె ఎందుకు వచ్చిందో? ఆమె ఎవరో? కూడా రుద్రమదేవికి తెలియదు. రుద్రమదేవి ఆమెను కూర్చోమని చెప్పింది. ఆమె కూర్చున్నది. తరువాత ఆమె, రుద్రమదేవి ఇలా మాట్లాడుతున్నారు.
” నువ్వు ఎవరు?” ఎక్కడినుండి వస్తున్నావు?
” తల్లీ! ఈ సేవకురాలు మీకు తెలియదు. నేను నా దొరసానిని గుర్తుపట్టలేను. అయినా నా తల్లి మీకుసేవ చేసే భాగ్యం కల్పించింది.
అలా అయితే నీ చరిత్ర వినాల్సిందే! నీ తల్లి ఎవరు? నీ చరిత్ర ఏమిటి?
తల్లీ! నాది రాచ వారికి సేవ చేసే సేవ కులం.
మా అమ్మ మీ అమ్మగారి దగ్గర చాలా కాలము సేవ చేసిందట శ్రీ గణపతి చక్రవర్తి గారు అద్దంకి సీమకు రాజైన శాలంకాయన గోత్రికుడైన మాధవ నాయకునిపైకి దండెత్తి వెళ్లారట. అప్పుడు శ్రీ రాజు గారు రాణిగారితో కలిసే వచ్చారట. నాకు అప్పుడు రెండు సంవత్సరాల వయసు అట. మీకు కూడా రెండు సంవత్సరాల వయసే ఉందని మా అమ్మ చెప్తూ ఉండేది. రాణి గారి వెంట మా అమ్మ, నేను వెళ్ళామట . శ్రీ గణపతి చక్రవర్తి గారు ఆ దాడిలో గెలిచారట.
ఇంతలో ఒక చిత్రమైన కథ జరిగిందట. ఒకతను నన్ను మా అమ్మ నుండి వేరు చేసి, ఆమెను ఎత్తుకొని పోయాడట. మా అమ్మ ఏదో విధంగా అతని నుండి తప్పించుకొని, ఒక్కొక్క ఊరిలో మారువేషంలో బిక్షం ఎత్తుకొని ఎలాగో జీవిస్తూ… నన్ను వెతుకుతూ ఉండేదట ! రాజుగారు గెలిచి ప్రయాణమై పోవడానికి నిశ్చయించుకొని మా అమ్మ కోసం చాలా వెతికారట .
కానీ ఎక్కడో పోయిన అమ్మ వారికి దొరకలేదట. అందుకోసం ఆమెను వెతకటానికి తగిన ఏర్పాటు చేసి వెళ్లిపోయారట.
నన్ను ఒక కాపు అతను పోషించాడు. నాకు వివాహ వయసు వచ్చింది. నన్ను పోషిస్తున్న కాపు ఒక గృహస్థు కొడుకుకు నన్ను ఇచ్చి వివాహం చేశాడు. నా దురదృష్టం కొద్దీ వివాహమైన 15 సంవత్సరాలలోనే అతను మరణించాడు. నా చరిత్రే నాకు తెలియదు. ఇలా ఉండగా కొంత కాలానికి నేను ఉన్న చోటునకు ఒక ముసలమ్మ వచ్చి, నన్ను చూసి చాలా ఏడ్చింది. ఆమె ఎందుకు నన్ను చూసి ఏడుస్తున్నదో నాకు అర్థం కాలేదు. ఆమెను చూస్తున్న కొద్దీ నాకు ఆమె మీద జాలి కలిగింది . చివరకు ఆమెను ఓదార్చి, అసలు సంగతి ఏమిటని? ఏమి జరిగిందని అడిగాను. ఆమె జరిగినదంతా చెప్పింది. అప్పుడు నేను ఆమె కూతురునని తెలుసుకున్నాను. ఆమె మా అమ్మ ని తెలియగానే చాలా సంతోషం అయింది. కానీ ఆమె అప్పటికే పూర్తిగా అనారోగ్యం పాలయింది. వైద్యుడిని పిలిపించుకొని వచ్చి ఆమెకు చికిత్స చేయించాను. ముసలిదవ్వడం వలన ఏ మందు ఆమెకు పని చెయ్యలేదు. వైద్యులు వైద్యం ఆపివేసినారు.రోజురోజుకు ఆమె వ్యాధి ముదిరిపోయి ప్రాణం పోయే స్థితికి వచ్చింది. చివరి సమయంలో మా అమ్మ నాతో “బిడ్డా ! మన వారంతా శ్రీ కాకతీయ వంశాన్ని కొలిచారు! మనకు అదే జీవనోపాధి! నేను బ్రతికి ఉన్నంతకాలం దేవిని కొలువలేక పోయాను. నా ప్రాణాలు రుద్రమదేవి వద్ద విడువ లేకపోయాను. నా తలరాత ఇలా నన్ను విదేశాలకు వెళ్ళే చెట్టు చేసింది. నాకే కొరతా లేదు! నువ్వు మళ్ళీ పోయి మన రాజవంశానికి సేవ చేస్తానని నాకు మాట ఇస్తూ ప్రమాణం చేస్తే… నా ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది. ఆశ్రితులను కాపాడడంలో మన ప్రభువులకు నా ప్రేమ లోకంలో ఏ వంశం లోనూ లేదు. నా దొరసానికి నీ వయసంత వయసే కలిగిన కూతురు ఉండేది. ఆమె పేరు రుద్రమదేవి.” ఇంతలో ఆమె కంఠం ఒక్కసారిగా మూగ పోయింది.
” తల్లీ! ఏమని చెప్పను? రాజుల సేవయే పరమ ధర్మంగా తలచిన నా తల్లి ..మ..ర…ణిం..చిం..ది !!
ఆ దాసి కన్నులు కన్నీటితో నిండాయి. రుద్రమదేవికి జాలి కలిగింది. ముమ్మడమ్మ, రుయ్యమ్మలు కూడా కంటతడి పెట్టారు.
అంతలో రుద్రమదేవి” బాధపడకు! విధిరాతను ఎవరు తప్పించగలరు? మీ అమ్మ గొప్ప హృదయం ఉన్న దయామయురాలు. శరీరాలు ఎప్పుడైనా పడిపోయేవే… అయినా మా అమ్మ కొద్ది రోజులైనా తమ రాజు లకు సేవచేసి జన్మ ఎత్తినందుకు సార్ధకత పొంది, మరణించింది. మా అమ్మ నన్ను విడిచి వెళ్ళినప్పుడు నేను రెండేళ్ళ వయస్సు ఉన్న దాన్ని. నేనెవరో నాకే తెలియదు. ఇక రాజ కుటుంబం ఎలా తెలుస్తుంది? నేను ఉన్నది విదేశంలో… నేను తెలియని వారికి నా రాజవంశం గురించి కూడా వారికి తెలియదు. నా అదృష్టవశాత్తు నా తల్లి మళ్లీ రావడం, నా రాజులను కొలవమని నాకు హితవు చెప్పడం, జరిగింది అలా కాకుంటే నేను ప్రభువుల సేవా చేయకపోయే దాన్ని కదా! అని విచారించే దాన్ని!
” అది కూడా దైవాధీనమే!”
” నా భాగ్యం”
” నీ పేరు ఏమిటి?”
” దాసు రాలి పేరు మదన మంజరి”
మామ అప్పుడప్పుడు ఈ విషయాలన్నీ చెప్తూ ఎంతో విశ్వాసం ఉన్న ఆ దాసి ఏమైందో? అని అనుకొనేది.
నీ తల్లి పేరు ఏమిటి?శ్యా…మ…ల..కదా! నాకు అలానే గుర్తున్నది.
” అయ్యో! దొరసానీ ! దాసదాసీల పైన నీకు ఎంత ప్రేమ ఉన్నదో? లేకపోతే దాసి దాని గురించి అప్పుడప్పుడు గుర్తు చేసుకున్నావా? తల్లీ! ఎంత గొప్ప దొరసానివి? అని కన్నీళ్లు కార్చింది.
తల్లీ! మీకు సరిగా జ్ఞాపకం లేనట్టు ఉన్నది. నా తల్లి పేరు శ్యామల కాదు.” లలిత” అని చెప్పింది.
” ఔనౌను! శ్యామల కాదు! లలిత అని ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందని రుద్రమదేవి అన్నది.
రుద్రమదేవికి దాసీ దాని పేరు లలిత అని తెలుసు. అయినా మదనమంజరి ఏమని చెబుతుందో చూద్దామని నటించింది. తల్లి చెప్పిన సమాచారాన్ని తల్లి చెప్పిన పేరునే మదనమంజరి చెప్పడంతో రుద్రమదేవికి నమ్మకం కలిగింది.
” మదన మంజరీ! నీకు సంతానం లేదా?”
” లేదు తల్లీ లేదు!”
” సరే ఇప్పుడు నీ ఉద్దేశ్యం ఏమిటి?”
“మా పూర్వీకులు , నా తల్లి ఎలా జీవించారో.. నేను అలానే జీవించాలని కోరిక!”
“ఏమని? నా దగ్గర ఉండాలను కుంటున్నావా?”
” ఉండడమంటే.. “తిండికి తిమ్మరాజు- పనికి పోతరాజు” అని జనాలు అన్నట్టుగా కాదమ్మా! మీ సేవ చేస్తూ ఉంటాను.”
” సరే నీ ఇష్టం వచ్చినట్లు నా దగ్గర ఉండవచ్చు, పని చేయాలనే బాధలేదు.” ఒకవేళ నువ్వుపని చేయాలనుకుంటే చిన్న చిన్న పనులు చేయవచ్చు.!
నీవే మీ వయసులో ఉన్న దానివి కాదు! పెద్ద పెద్ద పనులు చేయడానికి.. ముసలితనం వచ్చేసింది “కొమ్ములు కోసినంత మాత్రాన కోడె కాజాలదు! నీకు పనిచేయాలని ఎంత ఆసక్తి ఉన్నా వయసు మీద పడిన దానివి కదా!
తల్లీ! కొత్తగా వచ్చిన దాని మీద మీకు ఇంత ప్రేమ ఉంచినందుకు నీకు సేవకుల పట్ల ఎంత దయ ఉన్నదో! అని నిన్ను మెచ్చుకోవచ్చు ను. నాకు అభయమిచ్చినావు! కాబట్టి నిర్భయంగా చెప్తున్నాను. మామ నన్ను మీ దగ్గరికి సేవ చేయడానికి వెళ్లమన్న అప్పటినుండి మీ దగ్గరికి ఎలా చేరుతానో? చేరినా నన్ను మీరు నమ్ముతారో? లేదో? అనుకున్నాను. నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి రాణీవాసపు స్త్రీలను చూడలేదు. చక్రవర్తినిలైన మిమ్మల్ని ఎలా సేవించు కుంటానో? అని భయం వేసింది. నన్ను చూసి మా అమ్మ రాణివాస స్త్రీలకు చేసే సేవ చేసింది కాబట్టి వారితో ఎలా మెలగాలో మొదలైన అన్ని విషయాలు చెప్పింది.
” మదన మంజరీ! నీ తల్లి చనిపోయి ఎన్ని రోజులైంది?”
” ఒక సంవత్సరం మీద రెండు నెలలు.”
అంతకు ముందు నువ్వు నీ తల్లి తో కలిసి ఇక్కడికి ఎందుకు రాలేదు? నీ తల్లికి రాజ వైద్యులు, రాజ వైద్యం, సేవలు, ఔషధాలు ఇచ్చేవారు కదా!
అలా జరగలేదు. పాడు క్షయ వ్యాధి దినదినగండంగా గడిచింది. చాతకాని ఆమెను తీసుకొని రావడం మంచిది కాదని అనుకున్నాను. మాకు తెలిసిన వారు కూడా అలానే ఉన్నారు మూర్ఖంగా ప్రవర్తించ వద్దని అనుకున్నాను. అంతే కాదు మా అమ్మ నడవలేకపోతున్నది. మాకు బండి ఇచ్చే వారు కూడా లేరు
” నిన్ను పోషించిన వారు కానీ, నీ అత్త వారింటి బంధువులు కానీ అంతమాత్రం సహాయం చేయలేక పోయారా?
” అయ్యో !తల్లీ! పోయినంత దూరం పొరక దండు”అన్నట్టు అంతా బాగానే ఉన్నది. నన్ను పెళ్లి చేసుకున్న వాడు తప్ప వారి కుటుంబ సభ్యులు ఎవరో నాకు తెలియదు. ఇంకా నన్ను సాదిన వాళ్ళు మా ఊరు విడిచిపెట్టి మరో ఊరికి వలసగా వెళ్లారు. కొంతకాలం నా భర్త సంపాదనతో ఇల్లు గడిపాను. మా అమ్మ వచ్చేందుకు ముందు రెండు సంవత్సరాల ముందే ఆ డబ్బు అయిపోవడం చేత బిక్షం ఎత్తుకొని జీవించాను.
” నీ తల్లి చచ్చిపోయి పద్నాలుగు నెలలు అయింది కదా! ఇంత కాలం ఒక్కదానివే కష్టపడుతూ ఎందుకున్నావు? ఒకవేళ నువ్వు ఇక్కడికి వస్తే నేను ఆదరించినను కున్నావా? ఎంతో కాలం నుండి ఉన్న ఊరు వదిలి పెట్టడం ఇష్టం లేదా? నువ్వు మరొక విధంగా అనుకోకు నీ కష్టాలు విని జాలి కలిగింది నీ మీద.
” అడిగితే తప్పేముంది తల్లీ! ? ధర్మ స్వరూపిణులు కనుక జాలిపడి అడిగారు. నా తల్లి చనిపోయి 14 నెలలు అయినా వచ్చేందుకు వీలు కాలేదు. మీరు నన్ను మన్నిస్తారో?లేదో?అని అనుకుంటే ఇప్పుడు ఎలా మీ దగ్గరకు వస్తాను? బిక్షం ఎత్తుకొని జీవించే దానికి పట్టణం వదిలి పెట్ట బుద్ధి కాదా?
” అవును మొదట అనుకోవచ్చు తరువాత ఎవరైనా చెబితే ఆశ్రయం ఇస్తారని రావచ్చు! లేదనకుండా బిచ్చం పెట్టిన ఊరును మాత్రం విడువవచ్చునా?
” ప్రేమతో పెంచే వారు ఉన్నారని తెలిసి, బిచ్చమెత్తాలని అనుకుంటానా? మీరు ఏది చెప్పినా అదే కదా! నా తల్లికి పితృకార్యం చేయాలంటే నేనొక్కదాన్నే కర్తను. కాబట్టి సంవత్సర శ్రాద్ధం అక్కడే పెట్టాలని అందరూ చెప్పటం వలన ఏదో ముళ్ల మీద ఉన్నట్టు ఉన్నాను. సంవత్సరం పూర్తి కాగానే నడుస్తూ వచ్చాను. నాకు ఈ పట్టడానికి తోవ తెలియదు. ఎక్కువ మంది ఏ ఊరికి వెళుతుంటే వారి వెంట ఆ ఊరికి వెళ్లి ఏ దయామయులో అన్నం పెట్టిన నాడు తింటూ… లేనినాడు ఉపవాసం ఉంటూ… చివరికి ఎలాగో మీ పాదాల దగ్గర చేరాను నా కష్టాలన్నీ గట్టెక్కినవని అనుకుంటున్నాను. ఇక మీ చిత్తం నా భాగ్యం !
దాసి చివరి మాటలను బొంగురుపోయిన గొంతుతో అంటూ రుద్రమదేవి పాదాల మీద పడింది.
రుద్రమదేవి ఆదరంగా మదనమంజరిని లేపి, నీవు ఇక దిగులు చెందకు ! నా ఇంట్లో సుఖంగా కాలం గడుపుకొమ్మని ఇదివరకే చెప్పాను. కాకతీయ వంశంలో ఎవరు అబద్ధం ఆడారని గట్టిగా నమ్ము !. అని అన్నది.
( ఒక సేవిక రుద్రమదేవిని నమ్మించి కోటలో పాగా వేయుట… ఈ ప్రకరణంలోని కథ! దేవగిరి కుట్ర మొదలవుతుంది.)
(సశేషం)
●●●●●●●●●●●●●●●●●●