ఆరవ ప్రకరణం
గ్రంథకర్త:-ఒద్దిరాజు సీతారామ చంద్రరాయశర్మసరళీకృతం:- రంగరాజు పద్మజ
( సిగము )
(దేవతావేశం)
పరమభక్తినుపాసించు భక్తవరుల
కొక్క చోటుగాకున్న నింకొక్కచోట
ఫలము బ్రాపింపగోఱి చెప్పంగలేడే?
తద్విధివిధానముల దేవతా ప్రభుండు.
— గ్రంథకర్త.
భావం:- భక్తుడైనవాడు తాను నమ్మిన దైవాన్ని పరమభక్తితో విధివిధానంగా పూజిస్తే ఒకచోట కాకున్నా మరొక చోటైనా ఫలితం పొందగలడు.
వ్యాఖ్య:-గ్రంథకర్త ఈ పద్యాన్ని రుద్రమదేవి తన కూతుర్లకు సంతానం కలగక పోవడంతో బుద్ధ గణపతిని పూజించమని మదనమంజరి చెప్పినప్పుడు “ఎంత పూజించినా లాభమేముంది ?”అని నిరుత్సాహ పడిన సందర్భంలో పూజలు చేయగానే వెంటనే ఫలితం కలగక పోయినా పూజల ఫలితం తప్పక ఉంటుందని భావి కథాభాగాన్ని సూచిస్తూ సాగిన ప్రకరణ ఔచిత్య పద్యమిది–
సాయంకాలం తర్వాత రుద్రమదేవి బుద్ధగణపతి దేవాలయంలో కూర్చుని ఉన్నది. ముమ్మడమ్మ, రుయమ్మలు ఆమె పక్కనే కూర్చున్నారు. మరికొందరు సేవికులు కొంచెం దూరంలో కూర్చున్నారు. మదనమంజరి రుద్రమదేవి దగ్గరకు వెళ్లి ఇలా అన్నది.
తల్లీ ! ఈ బుద్ధగణపతి ఆలయంలో ఇంతకు ముందు ఎవ్వరూ ఇంతగా దానం చేసిన వారులేరని అనుకుంటున్నారు. బ్రాహ్మణులు మీరు చేసిన దానాలతో చాలా సంతృప్తి పొందారు. మీరు ఇచ్చిన ధనం మోసుకొని పోలేక దారిలో ఎదురైన వారికల్లా పంచిపెడుతూ పోతున్నారు.
నిజమేనా? అయినా ఫలితం ఏమున్నది? అన్నది రుద్రమదేవి. ఫలితానికి భక్తి కారణమైనా, భక్తి కలిగినప్పుడే ఫలితం కలుగదు ! కొన్ని రోజు
లు కొలిస్తే ఫలితం కనపడుతుంది. అయినా ఇవన్నీ మీకు తెలియవా? నేను మీకు తెలియదని చెప్పడం లేదు. ఫలితం కోరే వాళ్ళు శ్రద్ధతో మనస్సును లగ్నం చేసి అనుకున్న పని నెరవేరే దాకా దేవుడిని పూజించడం వదలకూడదని దాసి అన్నది.
మరిచిపోయాను
నువ్వు చెబితే జ్ఞాపకం వచ్చింది. సాయంత్రం ఎక్కడికైనా వెళ్లావా? కనిపించలేదు? అని రుద్రమదేవి అడిగింది.
అమ్మా! మీరు తప్ప నాకు ఇక్కడ పరిచయస్తులు ఎవరున్నారు? కనుక ఎక్కడికి వెళ్ళలేదు. రుయ్యమ్మ దొరసాని ,నేను తోటలో తిరుగుతూ ఏవో పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేశామన్నది మదనమంజరి.
ఆ సంగతి నాకు తెలుసు. అప్పుడు కాదు… మీరు వచ్చేసరికి కొంచెం పొద్దున్నది. ఆ తర్వాత సాయంత్రం నువ్వు కనిపించలేదు. అక్కడా ఇక్కడ చూశానని అన్నది రుద్రమదేవి.
అయ్యోయ్యో! మీరు బిగ్గరగా పిలిచి ఉండరు. అయినా ఎక్కడికైనా వెళ్లే పని నాకు ఏముంది? చిన్న దొరసాని, నేను తోటలో తిరుగుతున్నప్పుడు కొన్ని అందమైన పూలు కనిపించాయి. వాటిని తెంపీ తెచ్చి చిన్న దొరసానులకు ఈరోజు దండలను గుచ్చాలను కున్నాను. అప్పుడు నేను రుయ్యమ్మ గారితో మాట్లాడుతున్నాను. కానీ పూలు ఏరడం కోసం కాదు. దొరసానిని ఇక్క
డికి తీసుకొని వచ్చి, మళ్లీ నేనొక్కదాన్నే వెళ్లి తోటలో ముందు చూసిన పూలను తెంపుకుని వచ్చి, మళ్లీ ఇక్కడ కూర్చుండి పోతే దండలను గుచ్చడానికి అవకాశం దొరకదని అనుకొని, దేవుని గుడి వెనుక కూర్చొని దండలను గుచ్చుకొని వచ్చాను. ఇది సరే! మన మొగిలిచర్ల ప్రయాణం ఎప్పుడు? రేపు తెల్లవారుజామున పోవాలి కావచ్చని అన్నది మదనమంజరి.
ఇక్కడి నుండి ఇంటికే వెళ్ళేది. మళ్లీ ఒకసారి మొగిలిచర్ల ప్రయాణం గురించి ఆలోచించవచ్చు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం లేదని రుద్రమదేవి అన్నది.
అప్పటికి రాత్రి రెండు మూడు గడియలు అయింది. ముమ్మడమ్మ, రుయ్యమ్మ బుద్ధ గణపతిని పూజించడానికి వెళ్ళిపోయారు.
రుద్రమదేవి అక్కడే కూర్చుని ఉన్నది. మదనమంజరి ఆమె దగ్గర కూర్చొని, ఒకసారి వెనకవైపు చక్కగా చూసి తర్వాత ఏమేమో విచిత్రంగా మాట్లాడుతూ కాలం గడుపుతున్న ది.
ఇంతలో ఒక బ్రాహ్మణుడు వచ్చి రుద్రమదేవి దగ్గర నిలబడ్డాడు. ఆ బ్రాహ్మణుడు దాదాపు యాబై సంవత్సరాల వయస్సున్న వాడు. వెంట్రుకలు తెల్లబడ్డాయి. ఎర్రని శరీరం మీద తెల్లని విభూతి రేఖలు స్పష్టంగా కనబడుతున్నాయి. నుదుటిమీద విభూతి రేఖలమధ్య గంధంతో తడిపిన అక్షింతలు అందంగా కనబడుతున్నాయి. మెడలో రుద్రాక్షమాల వేలాడుతున్నది. ఏడువరుసలు కుచ్చిళ్ళు పోసి తెల్లని ధోవతి కట్టుకున్నాడు. పెట్టిన శాలువా భుజంపై రెపరెపలాడుతున్నది.చేతిలో చిన్న పంచ ఉన్నది.
నడుముకు( రొంటిలో) చెక్కిన నశ్యపు కాయ అతడు అచ్చమైన బ్రాహ్మణుడని తెలుపుతున్నది.
ఇలాంటి వేషంతో వచ్చిన బ్రాహ్మణుని చూడగానే రుద్రమదేవి లేచి భయంతోనూ, వినయంతోనూ నమస్కరించింది.
బ్రాహ్మణుడు రుద్రమదేవిని శాస్త్ర ప్రకారంగా ఆశీర్వదించాడు. బ్రాహ్మణుడు, రుద్రమదేవి వారివారి ఆసనాలపై వారు కూర్చుని ఇలా మాట్లాడుతున్నారు.
బ్రాహ్మణోత్తమా! మీరు ఈ ప్రాంతం వారేనా?
అమ్మా నాది; ఈదేశం కాదు.
ఏ దేశం?
పనికిరాని దేశంలో బతికాను. అయినా వెనుకటి మాటలు ఎందుకు?
ముందు మీరు ఏ దేశంలో ఉండేవారో చెప్పండి? మన చరిత్ర మనకే వద్దంటే మరెవరికి అవసరమవుతుంది?
ధర్మానికి మారురూపంగా ఉన్న అమ్మా! నా వెనుకటి విషయాలు చెప్తే నా శత్రువులు నన్ను ఏమైనా హింసిస్తారేమో అని భయం.
నేను ఉన్నంతదాకా మీకేమీ భయంలేదు చెప్పండి!
నేను దేవగిరిలో నివసించే వాడిని.
దేవగిరిని ఎందుకు వదిలారు?
రాజు అవమానించటం వల్ల.
యాదవ రాజులు బ్రాహ్మణులపై కోపగించుకున్నరా?
రాజుల కోపం బ్రాహ్మణులా? భట్టులా? అని చూడనీయదు.
అక్కడ మీరు ఏం పని చేసేవారు?
వారికి నేను పురోహితుడిని. ఒకనాడు కృష్ణ భూపతి ఇంట్లో వ్రతం జరిగింది. ఆ రోజు నాకు ఆరోగ్యం బాగా లేక, లేవలేక పోయాను. వ్రతం చేయించి రమ్మని నా మేనల్లుడిని పంపాను. అలా అతన్ని పంపినందుకు నా మీద చాలా కోపంతో నన్ను మోసం చేయాలని ప్రయత్నించాడు.నాకు ఈ సంగతి తెలిసి వచ్చాను. కృష్ణ భూపుడు మరణించినా… అతని తమ్ముడు మహాదేవరాజు మాపై ఉన్న కోపం వదలలేదు.
ఏవండీ ! మీ మాటలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కృష్ణభూపాలుడు సామాన్యుడు కాడు. తెలివి లేని వాడు అంతకన్నా కాడు. కారణం లేకుండా ఇంత చిన్న విషయానికి మిమ్ములను ఇంత స్థితికి రానివ్వడని నాకు బాగా తెలుసు. మీరు బ్రాహ్మణులు.అబద్ధం ఆడరని నాకుతెలిసినా ఇప్పుడు మీ మాటలు నేను నమ్మలేను. బ్రాహ్మణుని మొహం విచారంగా మారింది.
ఏమండీ! అలా ఎందుకు బాధ పడుతున్నారు? మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే కృష్ణభూపుడు గానీ, మహాదేవరాజు గాని ఈ చిన్న కారణం చేత అలా చేయరు.
నా మాట మీరు నమ్మకపోతే మొన్న నాకు నా స్నేహితుడు రామభట్టు రాసిన ఉత్తరం చూడండి! అది చదివితే మీకే తెలుస్తుంది.
బ్రాహ్మణుడు రుద్రమదేవి చేతికి ఒక ఉత్తరాన్ని ఇచ్చాడు.
రుద్రమదేవి ఆ ఉత్తరం విప్పి చదివింది. దానిలో ఉన్న సమాచారం ఇలా ఉంది.
యజ్ఞయాగాలు చేయించడంలో, పరమ నిష్ణాతులైన షడ్వింశ బ్రాహ్మణులైన శాస్త్రి గారికి…
రాంభట్టు ఈరోజుపదివేల నమస్కారాలు చేస్తూ,
ఇక్కడ మేమంతా క్షేమం! మీ క్షేమసమాచారాలు రాయించగలరు.
తర్వాత చాలా రోజుల నుండి మీ క్షేమ సమాచారాలేమీ తెలియడం లేదు. మీ మీద మహాదేవరాజుగారికి చాలా కోపంగా ఉన్నది ఇప్పట్లో మీరు ఈ దేశానికి రావడం మంచిది కాదు అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మీకా మారువేషం బాగానే ఉన్నది. మీ వారు అందరూ క్షేమంగా ఉన్నారు.
కావున దయ ఉంచండి….
ఉత్తరం నిపుణుడైన వాడు రాయలేదని రుద్రమ తెలుసుకుంది. ఆ ఉత్తరం వంకరటింకర అక్షరాలతో రాసి ఉన్నది మళ్లీ రుద్రమదేవి బ్రాహ్మణునితో ఇలా అన్నది .
కావచ్చును కానీ ఈ ఉత్తరం వల్ల మీకున్న శత్రుత్వానికి సరైన కారణం తెలియడంలేదు. మీరు చెప్పిన కారణం మాత్రం సరిగ్గా లేదు
నీ సన్నిధికి వచ్చి రాయబారం అనే మాట ఇంతదాకా వచ్చినప్పుడు అసలు విషయం చెప్పకుండా ఉండడం మంచిది కాదు. నేను ఒక తప్పు చేశాను. దాన్ని వివరించి చెప్తే మీకు తప్పక కోపం వస్తుంది. అయినా చెప్పక తప్పదు. దేవగిరి రాజులు మేము శ్రీకృష్ణుని సంతతి వారమని, యాదవులమనీ, యాదవ శబ్దం మా ఇంటి పేరు గాని, మేము గొల్లవాళ్ళ తెగకు చెందమనీ చంద్ర వంశాన పుట్టిన క్షత్రియులమనీ, మాకు వేదోక్త కర్మలు కావాలని వారంటారు. నేనందుకు ఒప్పుకోక పురాణం చెప్పిన ప్రకారం కర్మలు చేయించేవాడిని. వారికి నామీద అనుమానం ఎక్కువై,ఆ వ్రతం రోజున నేను వెళ్ళక, నా మేనల్లుడైన చిన్నవాడిని పంపాను. రాజు వల్ల అవమానమైనా,సన్మానమైనా చిన్నవాడు అతను భరిస్తాడనీ పంపాను. రాజు ఈ విషయం తెలుసుకున్నాడో? ఏమో? నా అల్లుడిని తిప్పి పంపేసి, నన్ను రమ్మని కబురు చేశాడు, నేను ఒప్పుకోలేదు. ఆ కోపం ఇంతకాలమైనా విడిచిపెట్టలేదు. అందుకే దేశం వదిలి వచ్చాను. కుటుంబాన్ని వదిలి పెట్టాను. ఒంటరి వాడిని పారాయణం ఇంట్లో ఉంటూ కాలక్షేపం చేస్తున్నాను. ఏం చెప్పను? తల్లీ!? మాటలలో పడి నాసంగతి మీకు చెప్పాను. ఎన్నడూ, ఎక్కడా, ఎప్పుడూ, ఎవరితోనూ చెప్పినా నాకు ముప్పు తప్పదని నాకు పూర్తిగా తెలుసు. తల్లీ! మీరు వారికి తెలిపితే నా కొంప మునుగుతుంది. నా ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి. ముంచినా తేల్చినా మీదే భారం!
భక్తులందరు బుద్ధ గణపతి ఆలయం లోపలికి వెళ్లి స్తోత్రపాఠాలు చేస్తున్నారు. కీర్తనలు పాడుతున్నారు. ఆ శబ్దాలన్నీ భక్తిభావంతో కూడి ఉన్నాయి. గుడి బయట చాలా దూరం వరకు వినవస్తున్నాయి.
” కుమార శాస్త్రి గారూ! మీరు భయ పడకండి! మీ మాటలను నేను రెండో వాడి చెవిలో పడనివ్వను లెండి! అని అన్నది రుద్రమదేవి.
బ్రాహ్మణుడు తల పంకించాడు. తన మాటలకు సమాధానం చెప్పేందుకు తల ఊపాడు అనుకున్నది రుద్రమదేవి. కానీ ఆ బ్రాహ్మణుని తల అలా ఊగుతూనే ఉన్నది… ఆగడం లేదు. తలతోపాటు కాళ్లు చేతులు కూడా ఊగుతున్నాయి. రుద్రమదేవికి ఏమీ తోచటం లేదు. అయ్యా! అయ్యా !!అని పిలిచింది. అతను సమాధానం ఇవ్వలేదు.
ఆయన స్వభావం తెలియని రుద్రమదేవి” రక్షించండి! రక్షించండి! అని పెద్దగా కేక వేసింది. ఆ గుడిలో ఉన్న వారికి వినబడనందున ఎవరు రాలేదు. ఇంతలో దాసి బ్రాహ్మణుని తేరిపార చూసి, అమ్మా! మీరు భయపడవలసిన పనిలేదు ఈ బ్రాహ్మణునికి ఏం భయం లేదు. ఇతనికి దేవత ఆవేశం అయినట్టు అనిపిస్తుంది. ఇతని వల్ల మనకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే రాశిఫలాలు అడిగి తెలుసుకోవచ్చని అన్నది.
ఆ బ్రాహ్మణుడు అలా వణికి -వణికి కెవ్వుమని కేక వేసి లేచి, బుద్ధ గణపతి కోవెలలోనికి పరిగెత్తి వెళ్ళాడు. రుద్రమదేవి, దాసి ఇద్దరు అతని వెనుకనే నడిచారు.
కుమార భట్టు పెద్దగా అరుస్తూ… ఒక చోట నిలబడకుండా అటూ- ఇటు తిరుగుతూ, ఊగి పోతూ, వణుకుతూ, పండ్లు పటపటా కొరుకుతూ, కౄరంగా దేవతా విగ్రహాన్ని చూస్తున్నాడు.
అతని పరిస్థితి తెలుసుకొని కొందరు కొంత సామ్రాణి, నిప్పును తెచ్చి ధూపంవేసి,” స్వామీ! ఏం సమాచారం? ఇంతగా ఎందుకు ఊగిపోతున్నారు? ఎందుకు వచ్చారు? ఎందుకు ఆయాస పడుతున్నారని అడిగారు.
రుద్రమదేవి ఇటువంటి వినోదం ఎప్పుడూ చూడలేదు కాబట్టి ముందుకు వచ్చి నిలబడింది. రాణి గారి కొరకు ప్రజలు కాస్త వెనుకకు వెళ్లి చోటుకల్పించారు. దాసిని దగ్గర నిలబెట్టుకొని ఆ వింత చూస్తున్నది రుద్రమ దేవి.
ఒక మనిషి ఆ గుంపు నుండి ముందుకు వచ్చి నమస్కారం చేసి ,చేతులు జోడించి, నిలబడి” స్వామి నా సంగతి ఏమిటి? అని అడిగాడు.
“హూ! ఏమిరా? భక్తుడా? నువ్వు నన్ను పూజిస్తూ ఉండి రెండు మూడు మండలాలైనా ( మండలం అనగా నలబై రోజులు.) కాలేదు, అప్పుడే నీకు ఫలితం కావాలిరా? ఇంకొక మండలం నన్ను పూజించు! నీ కోరిక నెరవేరుతుంది.
హూ! అని గంభీరంగా అన్నాడు.
ఇలా ఒకరి తర్వాత మరొకరు వచ్చి దేవుని వల్ల తమకు ఎటువంటి ఫలాలున్నాయో అని అడిగి తెలుసుకుంటున్నారు. దేవుడు పూనిన బ్రాహ్మణుడు కొందరికి మంచి జరుగుతుందనీ, కొందరికీ చెడు ఫలితాలు ఉన్నాయని చెబుతున్నాడు కొందరికి విభూతి, ఖర్జూర ఫలాలు, సామ్రాణి ఇస్తున్నాడు.
అమ్మా! మనం వచ్చిన పని గురించి అడుగుదామా? అని రుద్రమదేవిని అడిగింది మదనమంజరి. రుద్రమదేవి అవునని కానీ, కాదని కానీ ఏమీ అనలేదు. ఆమెకు ఇది అంతా విచిత్రంగా అనిపిస్తుంది.
మదనమంజరి దేవతావశమైన బ్రాహ్మణుని దగ్గరకు వచ్చి భయభక్తులతో నమస్కరించి, దేవుడా!మేమొక పని మీద వచ్చాం. మా మనసులోని అనుమానం తొలిగేటట్టు మంచి వరమివ్వమని అడిగి మళ్లీ నమస్కరించింది.
రుద్రమదేవి మనసులో కొంచెం ధైర్యం తెచ్చుకున్నది.ముమ్మడమ్మ, రుయ్యమ్మ కూడా ధైర్యం చెప్పారు దాసి మాత్రం ధైర్యం వదలకుండా… స్వామీ! ఎల్లకాలం మిమ్మల్నేనమ్మి ఉన్న మా కోరికలను తప్పక తీర్చాలి! మీరు తప్ప మాకు వేరే గతిలేదు. మమ్ములను ఆదరించండి !అని వేడుకున్నది.
హా! భక్తురాలా! హూ! మీకు… మంచి ఫలితం లేదని నేను చెప్పలేదు కానీ, మీరు రేపు పొద్దున్నే…హా… లేచి.. మొగిలిచర్లకు పోయి… ఏకవీరా… మహాదేవిని.. హా .. మొక్కండి! ఫలము….హూ! … తెండి… శీతలం
( బెల్లంపానకం) ఏదిరా? అని అరవడం మొదలు పెట్టాడు వెంటనే అక్కడే ఉన్న బ్రాహ్మణుడొకడు” స్వామీ! మీరు అడిగిన శీతలం చేస్తాము! శాంతి పొందండి! అని రెండు బిందెల నీళ్ళలో బెల్లం కలిపి తెచ్చాడు దేవుడు ఆవేశించినవాడు ఆ శీతలం తాగకముందే ” ధభేలుమని” నేల మీద పడ్డాడు. అతనికి స్మృతి లేనట్టున్నది. గుడి అంతా సంక్షోభం తీరిన సముద్రం వలె నిశబ్దంగా మారింది.
ఏడవ ప్రకరణ
గ్రంథకర్త:- ఒద్దిరాజు సీతారామ చంద్రరాయ శర్మ
సరళీకృతం:-రంగరాజు పద్మజ
[ ముఖ్యరాలు రుద్రమ చిక్కినది]
అల్పోపాయాన్మహాసిద్ధి
రేతన్మసన్త్ర ఫలంమహత్ ॥
—హితోపదేశము.
భావం:-కొంచెమైన సాధన వల్ల గొప్ప లాభం పొందవచ్చు.విస్తారమైన ఆలోచన వల్ల మరెంతో లాభం పొందువచ్చు
కథాభాగం:- రుద్రమదేవి వడ్డేపల్లి విడిదికి వచ్చి ఐదు రోజులు అయింది. ఇప్పుడు రుద్రమదేవి కూతుళ్లతో, దాసితో మొగిలిచర్లలో ఉన్నది. మొగిలిచర్ల ఓరుగల్లుకు ఈశాన్యదిశలో నాలుగైదు కోసుల దూరంలో ఉంటుంది.
మొగిలిచర్ల పెద్ద ఊరు కాకున్నా ఆ ఊరిలో” ఏకవీర మహాదేవి” చాలా ప్రభావవంతమైన దేవత.ఆ కోవెలతో ఆ ఊరు ప్రశస్తి గాంచినది. ఆ కోవెలలో రుయ్యమ్మ ,ముమ్మడమ్మ ఇద్దరూ ఏకవీరాదేవిని భక్తితో పూజిస్తున్నారు.
మనకథా కాలంలో ఈ ప్రదేశమంతా అడవి ఉండేది. అడవి పగటిపూటనే చీకటి అయిందా ! అని భ్రమ కలిగించేలా చిక్కగా ఉండేది. అడవి నుండి మనుషులు ,బండ్లు నడవడానికి ఒక బాట ఏర్పడింది. ఆ బాటకు ఉత్తరానికి కొంత సాగి తిరిగి తూర్పుదిక్కుకు మళ్ళింది. ధర్మాత్ములు కొందరు ఆ దారి వెంట అక్కడక్కడా మూడు నాలుగు ఆమడలకొక ధర్మసత్రాలు కట్టించారు. అందులో ఎవరూ నివసించరు. కానీ, ప్రయాణపు అలసట తీర్చుకుని తమ వెంట తెచ్చుకున్న భోజన పదార్థాలను తినేందుకు ఉపయోగకరంగా ఆ ధర్మసత్రాలలో యోగులు, బైరాగులు , అడవి జంతువులకు భయపడని వారు ఒక పగలో, ఒక రోజో ఉంటారు.
ఇప్పుడు మన ఈ ప్రయాణానికి సంబంధించిన అటువంటిదే ఒక సత్రం. ఆ సత్రం మొగిలిచెర్లకు దాదాపు ఒక కోసు దూరంలో ఉన్నది. మొగిలిచర్ల నుండి ఉత్తరానికి పోయే బాట తూర్పు దిక్కునకు మరిలే బాట దగ్గర ఆ సత్రం ఉన్నది. అక్కడ ఒక బావి ఉన్నది. అందులో నీరు ఏమంత పరిశుభ్రంగా ఉండదు. అయినా బావి నిండా నీరున్నా వాడక పోవటం చేత నాచు పట్టి ఉన్నది.
ముగ్గురు మగవారు, ఒక స్త్రీ ఆ సత్రం ముందటి వైపు కూర్చున్నారు. ఏమంత పొద్దు పోలేదు. సాయంకాలం అయింది. వాళ్ళందరూ ఏం మాట్లాడు కుంటున్నారు? వారి చూపులు అడవి జంతువులను కనిపెట్టేందుకో ఏమో! నాలుగువైపులా చూస్తున్నారు. అందులో ఇద్దరు మగవారు మాత్రం దాదాపు ఒకే వయసు ఉన్నవారు. ఒకడికి మాత్రం యాబై సంవత్సరాల వయసు ఉన్నది.ఆ స్త్రీ దాదాపు నలబై సంవత్సరాలు వయస్సున్నది. మగవారి చేతులలో నిలువెత్తు ఖడ్గాలు ఉన్నాయి.
ఆ బాట వెంట జనాలు ఎక్కువగా తిరగరు. అందున సాయంకాలమైంది కాబట్టి ఎవరో వస్తారని అనుకోలేము. వారిలో ఒకరి పేరు హరిహర దేవుడు, మరొకరి పేరు మురారి దేవుడు, ముసలి వాడి పేరు ధర్మవర్తనుడు. ఆమె పేరు కమల. వాళ్ళు ఇలా మాట్లాడు కుంటున్నారు.
మురారి:– కమల చాలా నేర్పు ఉన్న స్త్రీ. చక్కని చమత్కారంతో మాట్లాడుతూ పనిని చక్కగా తోవకు తెచ్చింది.అందుకే అంటారు”బుద్ధిష్చాపి చతుర్గుణమ్”
( అంటే ఆడవాళ్లకు మగవారికన్నా బుద్ధి నాలుగు రెట్లు ఎక్కువ పని చేస్తుందని)
ధర్మ:– నిజమే మనం తలపెట్టిన పనికి మూడు వంతుల సహాయం కమలదే! అనుమానమే లేదు.
మురారి:– మీరు మాత్రం సామాన్యమైన వారా? పనిని ఆచరణలో పెట్టే దక్షులు.
హరి:– అవును అలా కాకపోతే వెతికి వెతికి మహాదేవరాజు వీరిని ఎందుకు పంపుతాడు? మన పనికి సగం సహాయం కమల, సగం సహాయం ధర్మవర్తనుడు గారు తల పెట్టిన పనని పూర్తి చేసి వచ్చారు.
ధర్మ:– నా సహాయం ఏం సహాయం? కమలను మెచ్చుకోవాలి. మహాదేవరాజు గారి దగ్గర తాంబూలం పుచ్చుకొని, వచ్చి రుద్రమదేవి దగ్గర చేరి, పన్నిన మాయలను, ఆడిన అబద్దాలను పొల్లు పోకుండా ఎలా సమర్థించుకుంటూ వచ్చిందో చూడండి! పనిలో నైపుణ్యం అంటే ఇంతకన్నా ఎక్కువ ఏముంటుంది? రుద్రమదేవిని ఓరుగల్లు నుండి లేవదీసి వడ్డేపల్లికి తీసుకొని వచ్చింది ఎవరు? మన కమలనే కదా! కమల సాయం మనం మెచ్చుకోవాలి. అవును మరిచిపోయాను కమల నీ పేరేమిటి? కమల కాదు కదా! మదనమంజరీ! మీ అమ్మని ఎత్తుకొని పోయిన వాడెవడు?
కమల సిగ్గుపడింది.
ధర్మ:– చెప్పు చెప్పు! నిన్ను పెళ్లి చేసుకున్న భర్త ఏ రోగంతో ప్రాణాలు కోల్పోయాడు? మీ రుద్రమదేవితో చెప్పిన మాటలే మాతో చెప్పు, కానీ ఏడవ వద్దు!
హరి:– కమలకు ఇప్పుడు ఏడుపు ఎందుకు వస్తుంది? అప్పుడంటే రాచకార్యం ఎలా చక్కబెట్టాలని ఒకవైపు, రుద్రమదేవి తనను ఎలా నమ్ముతుందా? అని మరోవైపు, తనను అనుమానించకుండా పని ఎలా చక్కబడుతుందా! అని ఇలా మూడు రకాల విచారంతో అప్పుడు అలా నటించవలసిన వచ్చింది కానీ ఇప్పుడు విచారం ఎందుకు? ఇద్దరు బిడ్డలతో రుద్రమదేవి మన చేత చిక్కింది. ఇంకో జాముకో అర జాముకోపూర్తిగా మన వశం అవుతారు. సంతోషించే వేళ ఏడ్చేందుకు కమలకేమి గ్రహచారం? రుద్రమదేవికి చెప్పిన విషయం ఎన్నిసార్లు పాఠం అభ్యాసం వలె చేసిందో కానీ అలా చెప్పకుంటే రుద్రమదేవి కమలను నమ్మక పోయేది.
మురారి:– నిజమే! కమల బుద్ధి మెచ్చుకో తగిందే!ఏం మంజరి ఏమంటావు?
కమల:- వడ్డేపల్లికి రుద్రమదేవిని తీసుకొని రావడానికి నాకు అంత కష్టం అనిపించలేదు. కానీ మొగిలిచర్లకు రానని అన్నారు. నా ప్రాప్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని ఆమె అనగానే నాకు నిరాశ కలిగింది. మన ధర్మవర్తనుడు గారు దేవుడు, ఆ విషయమైయినట్లు నటించి, వారి బుద్ధిని మరలించక ఉంటే వారు రాకపోయే వారు. వారు అలా బ్రాహ్మణ వేషం వేయకపోతే నేను అన్నమాటలు కానీ, నేను పన్నిన పన్నాగం కానీ ప్రయోజనం లేకపోయేది.మీతో నేను వారిని మొగిలిచర్లకు తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళాను. అప్పటికి నాకు వారి సంగతి పూర్తిగా తెలియదు.” మేము మొగిలిచర్లకు రాము” అని అన్నారని మీకు తెలియజేసి, మన పనిని అక్కడనే చేయాలని ప్రయత్నం చేశాను కానీ వడ్డేపల్లిలో ఈ పని జరుగుతుందా? అని అనుమానంగానే ఉండేది. ఉన్న రెడ్డి వారు రుద్రమదేవిని కనిపెట్టుకొని కాపు వేసినట్లు నాకనిపించింది. ఇంతలో ధర్మవర్తనుడు గారు రావడంతో ఇలా చేస్తే బాగుండు అనిపించింది. అలా ఆలోచన చేశాను. వారు అవునని ఆ వేషం వేశారు .లేకపోతే ఈ పన్నాగం అంతా పాడై పోయేది.
మురారి:- నువ్వూ, మేము చెరువు కట్ట కింద మర్రిచెట్టు నీడలో కూర్చుని మాట్లాడి, నువ్వు పెళ్లిపోయిన మరు నిమిషంలో ధర్మవర్తనుడు గారు మా దగ్గరికి వచ్చారు. పని ఎలా అవుతుందో! అని చూసి రమ్మని వారిని నీ దగ్గరికి పంపాను. వారు నీకు ఎక్కడ కనబడ్డారు?
కమల:– ముందే నాకు వారు కనిపించి తనను పరిచయం చేసుకున్నారు. జరగబోయే సంగతి తెలుసుకొని, వినవచ్చని వారికి చెప్పి తీసుకొని వచ్చాను. రుద్రమదేవితో ప్రయాణం విషయం మాట్లాడుతూ ఉంటే ధర్మవర్ధనుడు గారు మా వెనుక కొంచెం దూరంలో నుండి వింటున్నారు. ముమ్మడమ్మ, రుయ్యమ్మలు దేవుని గుడి లోనికి పోగానే వీరు వచ్చి వింతగా మాట్లాడి చివరకు ఆ వేషం వేశారు. మీరు ఎప్పుడు వచ్చారు? పానకం ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు తడి పడిపోయారు? దేవత నివేదన చేయకుండానే అతని ముందర ఎందుకు పెట్టారు పానకాన్ని?
హరి:– ఏదో జరిగింది జరిగిన దానికేం గాని?
కమల:- ఏం గుర్రపు బండ్లు ,మనుషులు తయారుగా లేరా? ఇంకా మనం విచారించడానికి ఏముంది?
హరి:– అందరూ సిద్ధంగా ఉన్నారు లేకేం? మరి మన ప్రయాణం ఎప్పుడు ?
మురారి :-ఎప్పుడు అనడానికి ఏముంది? మనం ఎప్పడనుకుంటే అప్పుడే! మనలను అడ్డుకొనేవారెవరున్నారు?
మనం ఎంత చేతులు చాపితే బాఱ అంత పొడుగు అవుతుంది.
ధర్మ:– అలా అనుకోవద్దు రుద్రమదేవి సామాన్యురాలు కాదు ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. మహా మేధావతి. కనుమరుగైన అంతవరకూ పనిచేశాం. ఇప్పుడు తప్పించ వలసిన పని జాగ్రత్తగా చేయాలి.
మురారి:– ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నారు కదా!
కమల:- మన ఇల్లు అంటే? మీరున్న ఇంట్లోనా?
మురారి:- కాదు వారి కోసం కట్టించిన ఇంట్లోనే ఉన్నారు. ఇంకా ఎక్కడికి పోగలుగుతారు? వంటిల్లు చొచ్చిన కుందేలు తప్పి పోగలదా?
ధర్మ:- అలా అనలేము! ప్రాప్తం లేకుంటే చేతిలో ఉన్న పండు బావిలో పడి పోతుంది. మన ఇంట్లో ఉన్న వారు మన చేతికి చిక్కినారని అశ్రద్ధగా ఉండకూడదు. వడ్డేపల్లిలో మనం మర్రిచెట్టు కింద కూర్చుని మాట్లాడుతున్న తర్వాత నేను కమలను చూసేందుకు చెరువు కట్ట ఎక్కినాను. అప్పుడు అక్కడ ఒక అతను ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టు కూర్చుని ఉన్నాడు. అతను మన మాటలు విన్నాడో? లేదో ?నేను ఖచ్చితంగా చెప్పలేను. నేను వచ్చింది అతనికి తెలియదు. నువ్వు ఎవరు ? అని నేను అతనిని అడిగాను. ఆ మాటకు అతను ఉలిక్కిపడి లేచి ఏమి మాట్లాడకుండా వెర్రి చూపులు చూస్తూ వెళ్లిపోయాడు. అతను నిజంగా పిచ్చివాడో? లేదా మన మాటలు విన్నాడో? నాకు అర్థం కాలేదు.
మురారి:– అతనెవరో? ఏదైనా గూఢచారిగా పని చేసేవాడేమో? తన నీడ కనపడినా ఉలిక్కిపడ్తాడు. మన మాటలు వింటే రుద్రమదేవికి తెలియకుండా ఉండదు. ఆమె మన మాటలు అతనికి చెప్పితే వడ్డేపల్లి నుండి ఓరుగల్లుకే పోయేది. మొగిలిచర్లకు ఎందుకు వస్తుంది?
ధర్మ:- ఎందుకు రాదు? మన మోసం తెలిసీ, తెలియనట్లు నటించి మనలను పట్టుకునేందుకు తగిన సైనికులను పిలిపించవచ్చు కదా! వచ్చిన సైన్యాన్ని మనం పట్టుకో కూడదా? ఎలా అయినా మన ప్రయత్నం నెరవేరే దాకా ముందూవెనుకా చేయకూడదు. పట్టు విడిచి పెట్టవద్దు!
హరి:- నిజమే! అయినా కూడా దానికి తగిన పని చేశాం. వారు నివసించి ఉన్న ఇంటి చుట్టూ కత్తులు చేతబూని భటులు అప్రమత్తంగా ఉన్నారు. మన సంగతి తెలిసి బయటపడడానికి ప్రయత్నిస్తే వరుసబెట్టి నరికి వేస్తారు. బయటి సైన్యం రాకుండా ఆపేందుకు ఈ ఊరిలో నాలుగువైపులా అడవిలో చాలినంత మంది జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉన్నారు. కాబట్టి వచ్చే సైన్యం కూడా రాలేదు.
ధర్మ:- ఇది మంచి ఏర్పాటు. ఇంకా మనకు ఆలస్యం ఎందుకు? అర్ధరాత్రి దాటిన తర్వాత మన పని మనం చేసుకుందాం! ఊరికి పోదామా!
మురారి:– మంచిది కమలా! నువ్వు వెళ్లి ఎప్పటివలె రుద్రమదేవి దగ్గర ఉండు !
అందరూ తమతమ స్థానాల నుండి లేచి నిలబడ్డారు .ఊరు చేరే దాకా అందరూ కలిసి వచ్చి తర్వాత తలోదారిన వెళ్లారు.
దాదాపు సాయంత్రమైంది. మెల్లగా రాత్రి అవుతున్నది అమావాస్య ముందు దశమి కాబట్టి వెన్నెల జాడలేదు మూడు జాముల రాత్రి అయితే తప్ప సూర్యోదయం కాదని ప్రజలకు తెలియనందున జనలెవరూ వెన్నెల కోసం కానీ ,చంద్రుడి కోసం ఎదురు చూడడం లేదు.
రుద్రమదేవి విడిదిగా చేసుకొన్న భవనం సత్రమని చెప్పటానికి సందేహం లేకున్నా, కేవలం సత్రం వల్లే బట్టబయలుగాలేదు. విశాలంగా లేదు. రెండు మూడు గదులు రెండు మూడు మనసాలలున్న మూసినట్లు ఉన్న ఇల్లు, ఇంటినిండా దీపాలు వెలుగుతున్నాయి. రుద్రమదేవి ఆమె కూతురు ఇద్దరూ ఒక మనసాలలో కూర్చున్నారు.
ఇంతలో మదనమంజరి అక్కడికి వచ్చింది. మదనమంజరి రుద్రమదేవిని వదలిపెట్టి చాలాసేపు అయింది. మదనమంజరి వచ్చేదాకా వాళ్లు ముగ్గురే మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు చాలా నెమ్మదిగా అంటే కనీసం వారికి కూడా వినపడడం లేదేమో అన్నంత మెల్లగా మాట్లాడు కుంటున్నారు. మదనమంజరి రాగానే వారు సంభాషణ ఆపినట్టుగా ఆమె గుర్తించలేదు. మదనమంజరిని చూడగానే అయ్యో! మదన మంజరీ! మమ్మల్ని విడిచి పెట్టి నువ్వు వెళ్లి చాలాసేపు అయింది. కొత్త ఊర్లో తెలిసిన దానివి నువ్వు లేకుండా మాకు పొద్దు ఎలా గడుస్తుంది? దా! కూర్చో! అని అన్నది రుద్రమదేవి.
మదనమంజరి వచ్చి రుద్రమదేవి దగ్గర కూర్చొని ఏదో చెప్పబోయింది ఆమెను మాట్లాడ నివ్వకుండా ఇలా అన్నది.
మదనమంజరీ! నీకు ఒక విషయం చెప్పాలి అనుకుని మరిచిపోయాను. ఈ రోజు ఏకవీరాదేవి దేవాలయం చూశాం. కానీ మదనమంజరి ఏం చెప్పను? దేవికి మా మీద దయలేదు. రుయ్యమ్మకు సంతానం ఇవ్వలేదు. ముమ్మడమ్మకు మాత్రమే సంతానమున్నదని దేవి ఆజ్ఞ!
రేపు ఓరుగళ్ళకు వెళ్లి బ్రాహ్మణ సమారాధన చేయాలి. ప్రయాణానికి తగినట్లు మూటాముళ్ళు కట్టాలి. బండి వాళ్లను, పల్లకీల వాళ్లను ఎక్కడ ఉన్నారో వారికి తగిన జాగ్రత్తలు చెప్పి రావాలేమో? అయినా వారందరూ అంత జాగ్రత్తగా ఉండరేమో? కాచుకొని ఉంటారేమో!
ఇంతలో వంట తయారయిందని లోపల నుండి వంట చేసే సేవకురాలు వచ్చి చెప్పింది. రుద్రమదేవి ఆమె ఇద్దరు కూతుళ్లు లేచి భోజనం చేశారు. మదనమంజరి కూడా తిని లేచింది. పనిచేసే సేవకురాలు ఎప్పటివలె పడుకోవడానికి వెళ్ళింది. మదనమంజరి మూడు పడకలను సిద్ధం చేసింది.దాని మీద ముగ్గురు విశ్రమించారు. మదనమంజరి వారి దగ్గరే తనపడక వేసుకొని పడుకున్నది. అందరూ క్రమంగా నిద్రపోయారు.
దాదాపు జామురాత్రి దాటింది. ఊరి ప్రజలు అందరూ నిద్ర పోయారు. చిన్నపల్లెటూరు కాబట్టి ఊరి వారంతా తలుపులు బిగించుకొని అడవి మృగాల భయం లేదని నిశ్చింతగా నిద్ర పోయారు. రుద్రమదేవి నివసిస్తున్న ఇంటి తలుపులు అన్నీ బిగించబడ్డాయి.
అనుకోకుండా రుద్రమదేవి ఉన్న ఇంటి చుట్టూ ఏదో కలకలం పుట్టింది. ఆ ఇంటి చుట్టూ జనాలు మూగి ఉన్నారు. వారంతా ఊరి వారు కాదు. వాళ్ల చేతులలో కత్తులు మొదలైన సాము చేసే దుడ్డుకర్ర వంటివి చాలా ఉన్నాయి. వారందరూ కలిసి ఇంటి దర్వాజా తడుతున్నారు. కానీ తలుపులు తీయలేదు. తలుపులు రాకపోవడంతో అందులో కొందరు గడ్డపారతో పెళ్లగించి, తలుపులు ఊడదీసి లోపలికి ప్రవేశించారు. మొదట గదిగదికి పది మంది మనుషులు లోపల అంత శ్రద్ధగా వెతుకుతున్నారు. ఒక మనసాలలో మూడు మంచాలపై ఉన్న వారిని కొందరుచూశారు.రుద్రమదేవి ఆమె కూతుర్లు ఆ మంచాలపై నిద్రిస్తున్నారని వారు అనుకున్నారు. మూడు మంచాల మీద ముగ్గురు దుమికారు. ఆ ముగ్గురిలో ఒకడు హరిహర దేవుడు. మరొకడు మురారి దేవుడు. మూడోవాడు ధర్మవర్ధనుడు.
[వీళ్ల ముగ్గురిని మన పాఠకుల్లో నిర్మలాపురం నుండి దేవగిరి కి వెళ్ళే తోవలో ఉన్న చెరువు కట్టమీద మాట్లాడుకున్న అప్పటి నుండి చూస్తూనే ఉన్నారు]
వాళ్లు ముగ్గురూ మూడు మంచాలపై పడి చూశారు. ఆ మంచాలపై ఎవరూ లేరు. వారికి చాలా ఆశ్చర్యం వేసింది. చుట్టుపక్కల చూశారు .ఎవరూ పట్టుబడ్డ లేదు. నాయకులు ముగ్గురూ నిశ్చేష్టులయ్యారు .
ఇంతలో ఒకడు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి హరిహర దేవుడికి అప్పగించాడు.
అతడి కాళ్లు చేతులు బట్టలతో కట్టేసి ఉన్నాయి. మోహం కనపడకుండా బట్టతో మూతి కట్టేశారు. కట్టుకున్న బట్టలను బట్టి ఆమె ఒక మహిళ అని తెలుస్తున్నది. దాన్ని చూసి హరహర దేవుడు సేవకులకు ఇలా చెప్పాడు.
మిగిలినవారు చిక్కపోయినా సరే ముఖ్యులైన రుద్రమ్మ మన చేతికి చిక్కింది. దీనిని కట్లు విప్పకుండానే గుర్రం బండిలో వేసి తలుపులు మూసి చాలా త్వరగా నడిపించండి! ఊరూరికి మన బండ్లు ఉన్నాయి. నదుల దగ్గర మన పడవలు ఉన్నాయి.
సేవకులు ప్రభువు ఆజ్ఞ పాటించారు.
ఎనిమిదవ ప్రకరణ
గ్రంథకర్త:-ఒద్దిరాజు సీతారామ చంద్రరాయశర్మ
సరళీకృతం:-రంగరాజు పద్మజ
[ అనభిజ్ఞాన సహాయ్యము]
(తెలియనివారి సహాయం)
మ. సమదాటోపత వాయునందనుడు ధృష్టద్యుమ్ను శైనేయు లే
కమనోవృత్తి గడంగితో నడర దోర్వర్గంబు శోభిల్ల శౌ
ర్యము సొంపార నిలింపకోటి వొగడన్ రారాజు సైన్యంబు లొ
క్క మొగిం బెల్లగిలంగ బెట్టడరె సక్రోధాంతరంగంబుతోన్ .
— మహాభారతము
భావం:- క్రోధాంతరంగంతో, పరాక్రమాతిశయంతో భీముడు దృష్టద్యుమ్న , సాత్యకులు తనకు తోడురాగా, దుర్యోధనుడి సేనలు పారి పోయేటట్లుగా విజృంభించాడు. అది చూసి దేవతలు ప్రశంసించారు.
వ్యాఖ్య :—కర్ణపర్వం ద్వితీయాశ్వాసం లోని యుద్ధవర్ణనను… గ్రంథకర్త రుద్రమదేవి నవల కథాసూచిగా తీసుకున్నారు. కథార్ధభాగం అచ్చంగా భారత యుద్ధాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించడం పోలికలో గొప్ప విశేషం.
కథాభాగం:-
రెండు జాముల రాత్రి. ఇంకా చంద్రోదయం కాలేదు. లోకమంతా చీకట్లు కమ్ముకుని ఉంది. వేలవేల నక్షత్రాలు ఆకాశంలో వజ్రాల ముక్కల వలె మెరుస్తున్నాయి. మబ్బులు లేకుండా ఆకాశం నిర్మలంగా ఉంది. చూడడానికి ఎంతో అందంగా కనపడుతున్నప్పటికీ… ఆకాశంలో చంద్రుడు లేని వెలితి స్పష్టంగా తెలుస్తూనే ఉంది.
మొగిలిచర్ల నైరుతి దిక్కున పెద్ద అడవి ఉంది. సహజంగా లోకమంతా పరుచుకున్న చీకటి ఆ అడవిలో ఇంకా చిక్కగా పరుచుకొని ఉన్నది. ఆ అడవిలోని ప్రాణులకు కళ్లు మూసినా తెరచినా ఒకే తీరుగా ఉంది. కళ్ళు ఆ చోట్ల ఏమాత్రం పనిచేయవు.
ఏదైనా శరీరానికి తాకితే తెలుసుకోవాల్సిందే తప్ప అలా కాకపోతే తెలుసుకోలేరు. ఆ తాకిన వస్తువును కూడా గుర్తించడం కష్టంగా ఉంది ఆ చీకట్లో…
అంత చిమ్మచీకటిలో ఆనాటి అడవిలో కొందరు ద్వంద యుద్ధం చేస్తున్నారు. ఎవరిని ఎవరు కొడుతున్నారో? తాను ఎవరినీ కొడుతున్నాడో? తనను ఎవరు కొడుతున్నారో కూడా తెలియడం లేదు.
కత్తీ కత్తీ తాకినపుడు వచ్చే నిప్పు కణాల వెలుగు అప్పుడప్పుడు కాస్త కనబడుతున్నది. ఆ నిప్పురవ్వలు ఎంతసేపు ఉంటాయి కనుక? దరిద్రుడి మనసులోని కోరికలు పుట్టడం అవి ఎలా తీరుతాయిలే అనే నిరాశలో మాయమై పోయినట్టు మాయమైపోతూన్నాయి.
అలా చీకటిగా ఉన్నా కూడా వారు యుద్ధం చేయడం ఆపలేదు. అసలు తమ వారెందరు జీవించివున్నారో, ఎదుటి వారి వైపు ఎందరు మరణించారో! అని తమ బలంగానీ, ఎదుటి వారి బలంగానీ వారికి తెలియదు. అలా అని కత్తి వేటు ఏ మనిషిపై వేస్తే అది తప్పకుండా ఆ వ్యక్తిని తాకడం లేదు. అలా అని గాయపడని వారు కానీ, చావని వారు కానీ లేరని చెప్పలేం. ఆ దొమ్మి యుద్ధపు కలకలం చాలా ఎక్కువగా ఉన్నది.
ఇంతలో ఒకప్పుడు ఉన్న చీకటి మెల్లగా తొలగిపోయి, నక్షత్రాలు తన సహజమైన వెలుగునిస్తున్నాయి. ఉదయ పర్వత శిఖరం మీద తెల్లని కాంతులు వెదజల్లుతూ చల్లని సూర్యుడు ఉదయించాడు. ప్రపంచమంతా నిర్మలమైన సూర్యకిరణాలతో చక్కగా కనపడుతున్నది.
సైనికులకు అందాకా చీకటితో మూతపడుతున్న కళ్ళు చీకటి తొలగిపోవడంతో చాలా సంతోషపడ్డారు. కొత్త ఉత్సాహంతో రెండువైపులా సైనికులు ఎదురుపడి యుద్ధం చేస్తున్నారు . ఇప్పుడు వారి యుద్ధ నైపుణ్యం చక్కగా కనపడుతున్నది. అంతకుముందు గాయాలపాలైన వారు, చనిపోయిన వారు అందరూ కనపడి ఎవరెవరో తెలుసుకున్నారు. తమ వారు చచ్చిపడి ఉండటం చూసిన వారి కోపానికి అంతేలేదు.
” హుమ్మని” ఒక్కసారిగా ఎదుటివారిపై దూకి యుద్ధం చేస్తున్నారు.కత్తివేట్లను తప్పించుకుంటున్నారు. కొందరు గాయపడుతున్నారు. కొందరు చస్తున్నారు. యుద్ధతీవ్రత ఎక్కువైపోయింది.
ఒకవైపు సైన్యం తక్కువ సంఖ్యలోనూ, రెండో వైపు సైన్యం కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎక్కువ సైన్యం ఉన్నవారు వారికున్న దళ బలంతో చెలరేగి శత్రు వీరులను చంపుతున్నారు. రెండు వైపులా సైన్యంలో సైనికాధికారులున్నట్టు కనిపించడం లేదు.రథాలు, గుఱ్ఱాలు, ఏనుగులు రెండు వైపులాసైన్యంలోను లేవు. సామాన్య పదాతి దళాలు అయినా బింకంగా, పరాక్రమంతో, పంతంతో బలం గల సేనానాయకులు ఉన్న సైన్యం వలె కనపడుతున్నది.
చంద్రోదయం తరువాత దాదాపు నాలుగు గడియలు యుద్ధం అయ్యే సరికి రెండు వైపులా సైన్యంలో చాలామంది చనిపోయారు. అందులో ఒక వైపు మరీ తక్కువ సైన్యంతో ఉన్నది. అందులో కొందరు శత్రువులచే చంపబడ్డారు. ఇక వారి గెలిచే అవకాశం లేదని అనుకున్నారు. తమను ప్రోత్సహించే వారు లేరు. అయినా ప్రాణాలు ఉన్నంత దాకా పోరాడడమే వారి నిర్ణయం. ఏం చేయగలరు? బలం నశించింది కాబట్టీ శత్రువులను చంపక పోయినా, మనుషులు తమపైన పడకుండా కష్టంగా తప్పించుకుంటున్నారు. శత్రువులు తరుముకుంటూ వస్తున్నారు. తక్కువ సైన్యం ఉన్నవారు వెనుకకు మళ్ళీ పోతున్నారు.ఇంతలో వారికి అడవిలోపల ఫెళఫళమని చప్పుడు వినబడింది. అది జంతువులు పరిగెత్తడం వలన కలిగిన చప్పుడు వలె ఉన్నది. డెక్కలు ఉన్న పెద్ద జాతి జంతువుల పరుగు శబ్దం అది. రెండు వైపులా సైన్యాలు ఆ చప్పుడు విన్నారు. కానీ యుద్ధం ఆపలేదు. యుద్ధం అంత పెద్దగా లేకున్నా… వీరాలాపములు ఎక్కువగా ఉన్నాయి.
ఇంతలో నలుగురు గుర్రపు స్వారీ చేస్తూ వచ్చిన యోధులు త్వరగా త్వరగా వచ్చి రెండు వైపులా ఉన్న సైన్యం మధ్య నిలబడి ఒక సారి అటు ఇటు చూసి, ఎక్కువ సైనికులున్న దళాన్ని నరకడం మొదలు పెట్టారు. ఆ నలుగురూ ఇరవై సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు వయసు ఉన్నవారు.వారు ఎక్కిన గుర్రాలు చాలా ఎత్తుగా, బలంగా ఉన్నాయి. వారు మామూలు మగవారు కట్టుకొనే టటువంటి దుస్తులనే కట్టుకున్నారు. వారి చేతులలో అర్ధచంద్రాకారంలో ఉన్న పదునైన కత్తులు ఉన్నాయి. ఆ వెన్నెల వెలుగులో వారి గుర్రపు జీనులు మిలమిలా మెరుస్తున్నాయి. ఖడ్గాలను పెట్టే ఒరలు ఆ గుర్రపు జీనులకు వేలాడుతున్నాయి. ఆ నలుగురు యోధుల శరీరాలపై, వారు కట్టుకున్న దుస్తులపై నెత్తురు మరకలు ఉన్నాయి. వారెవరు? ఎక్కడనుండి వస్తున్నారు? వారి శరీరాలపై బట్టలపై రక్తపు మరకలు ఎందుకు ఉన్నాయన్న సంగతి మనకు తెలియదు. అలాగే ఆ యుద్ధం చేస్తున్న రెండు సైనిక దళాలు ఎవరివైనవని మనకు తెలియకపోయినా… తక్కువ సైనికులున్న సేన ఈ గుర్రపుస్వారీ చేస్తూ వచ్చిన యోధుల స్వంత సేననో లేక, వారి బంధువుల సేనయో కావచ్చునని మనం ఊహించగలం.
ఆ వీరులు నలుగురు తమకు అండగా రావడం, తనకు బదులుగా శత్రువులను ఎదుర్కొనేందుకు సిద్ధం చేయడం చూసి, ఎక్కువ సేన ఉన్న మిగిలిన సేన యుద్ధానికి సిద్ధపడింది. ఎదుటి పక్షం వారు కొంచెం సేపు యుద్ధం చేశారు కానీ కొత్త వీరుల కోపపు వేడికి నిలువలేక ఎక్కడివారక్కడ పారిపోయారు. యుద్ధభూమిలో శత్రువులు ఎవరూ లేరని గ్రహించారు.
తమను ఆపదనుండి రక్షించిన నలుగురు వీరులు ఎవరైనదీ, సైనికులకు తెలియకపోయినా తమ కృతజ్ఞతా వందనాలు తెలిపి ఇలా చెప్పడం మొదలు పెట్టారు.
అయ్యా! మీరెవరో మాకు తెలియకున్నా మమ్మల్ని రక్షించడానికి వచ్చిన దేవతా స్వరూపులని అనుకుంటున్నాం. మృత్యువు ఒడిలోకి చేరే సమయంలో ఏ కారణం లేకుండా మాపై దయ చూపారు? ఎందుకు మమ్మల్ని రక్షించారు?
అయ్యా! మేము ఓరుగల్లు సైనికులం. మా రాణి గారు తమ కూతుళ్లతో కలిసి వడ్డేపల్లికి పోయి, అక్కడినుండి మొగిలిచర్ల పోయారట. వారి వద్ద మాయలు చేసే ఒక దాసి దాపురించి, మేము ఎవరమూ వెంట రానీయకుండా చేసి, మా రాణి ఒక్క దాన్ని తీసుకొని వచ్చిందట. మా రాజా దేవేరి మోసగించిన బడిందని ఎలా తెలుసుకున్నారో కానీ, శివదేవ మంత్రీశ్వరులు గారు మమ్మల్ని త్వరగా వెళ్లి మొగిలిచర్లకు పోయే మన ప్రభువు ఉన్న విడిదికి వెళ్లి వారికి రాబోయే ఆపదలను తొలగించి, సుఖంగా ప్రయాణం చేయించుకొని రమ్మని ఆజ్ఞ ఇచ్చి పంపారు. మేము దాదాపు నూటా ఇరవై మందిమి బయల్దేరి వస్తున్నాం. మంత్రి మహారాజు గారికి ఈ వార్త సాయంకాలం తెలిసింది కావచ్చు. మాకు వెంటనే తెలిపారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా మేము ప్రయాణమై వస్తున్నాం మమ్మల్ని ఈ సేన రక్షించింది కావచ్చు. రహస్యంగా అల్లరి చేయకుండా తోవను విడిచి, అడవిలో పడి వస్తున్నా కూడా కనిపెట్టి ఎదుర్కొన్నారు. మమ్మల్ని ఎదిరించిన వారు దాదాపు రెండు వందలమంది. సాధ్యమైనంత వరకు యుద్ధం చేసాం. ఎదుటి వారి బలం ఎక్కువగా ఉండడంతో నాలుగువైపులా వాళ్లే నిలిచి, మమ్మల్ని హింసిస్తున్నారు. చివరకు ఈ గుంపుకు చిక్కినాం. ఇరవై మంది ఉన్నామనుకుంటాను. మీరు రాకపోతే మేము మా రాణి గారిని కష్టపడకుండా రక్షించుకోలేక పోయే వాళ్ళం.
అయ్యా! మా నమస్కారాలను అందుకొని మాకు సెలవు ఇప్పించండి. మేము త్వరగా వెళ్లాలి. అక్కడ ఏం జరుగుతుందో ఏమో?
ఎప్పటి వరకు మీరు మొగిలిచెర్లకు పొమ్మని మీ మంత్రి గారు ఆదేశించారు? అని ఒక యోధుడు అడిగాడు.
అయ్యా! మమ్మల్ని మీరు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి సమయం వృధాగా గడిచేలా చేయకండి. ఇప్పటికే ఆలస్యం అయిందని బాధపడుతున్నాం. ఇంకా ఆలస్యం చేస్తే మేము అనుకున్న పని చేయగలమా? అని ఒకడు అన్నాడు.
ఒక విషయం చెప్పండి!
జామురాత్రి కాకముందే పొమ్మని మంత్రి గారి ఆజ్ఞ! మాకు ఇబ్బంది లేకుంటే ఇదివరకే పోయే వాళ్ళం
శత్రువుల వల్ల మీ దొరసానికి ఆపద కలుగుతుందని తెలుసుకొని దానిని ఆపేందుకేనా? మీరు వెళ్ళేది.
ఔను !
మీరు ఇరవై మంది కన్నా ఎక్కువ లేరు. ఇంత తక్కువ మందితో వెళ్లి ఏం చేయగలరు? శత్రువులు మీకన్నా ఎక్కువ మంది ఉన్నారనడంలో సందేహం లేదు.అందున దారిలో మిమ్మల్ని ఎదుర్కొనే వారు ఎక్కువగా ఉన్నప్పుడు… ఇంక ఊరి లో ఎంత మంది ఉన్నారో? ఆలోచించారా? లేకపోతే ఇప్పుడైనా ఆలోచించుకోండి!
ఏది ఏమైనా మాకు విచారం లేదు. మా ప్రాణాలు మా దొరసాని పని కోసం కానీ, వారి కనుల ముందు మా ప్రాణాలు విడువడానికైనా మాకు సంతోషమే! మేము వారి సేవకులుగా ఉన్నందుకు, వారి ఉప్పు పులుసు తింటున్నందుకు మా జన్మలు అప్పుడే సార్థకం అవుతాయి. మమ్మల్ని తొందరగా పంపితే మీకు దండం పెడతాం!
ఎందుకలా తొందర పడుతున్నారు? మీ ప్రాణాలు రక్షించడానికి పైన రెండు మాటలు వినరా?
అయ్యా! మీరంటే మాకు ఎనలేని గౌరవం ఉంది. అయినా మా రాణీగారి పని కన్నా మీతో మాట్లాడటం మాకు ఎక్కువ కాదు. మీరు మా ప్రాణాలు రక్షించినందుకు మేము మరణించేటప్పుడు కూడా మిమ్మల్ని తలుచుకుంటూ మరణిస్తాం. దయతలచి మీరెవరో మాకు చెప్పండి! బతికి ఉంటే మళ్లీ ఎప్పుడైనా మీ సేవ చేసుకుంటాం! మేము స్వతంత్రులం కాము. నాకు అప్పజెప్పిన పని చేసేదాకా మేము ఆలస్యం చేయకూడదు.అయినా మీకు తెలియనిది ఏమున్నది?
మేము రాకుంటే యుద్ధంలో మరణించేవారు కదా! అలా అయితే మీరు ఏం చేసేవారు?
అది మాకు మంచే జరిగింది. మా తోటి వారంతా తమ ప్రభువు కోసం ప్రాణాలను సంతోషంగా విడిచారు. మేము కూడా అలాగే విడిచిపెట్టే వాళ్ళం.
అలా అయితే మీ దొరసాని పని ఏమయ్యేది? ఇలా ఆలోచించే వారు ఎవరు?
మీరు అలా అంటారా? మాలాంటి వాళ్లు వేల మంది ఉన్నారు.
ఇప్పుడు కూడా అలానే అనుకోండి!
అయ్యా! మీరెవరో రాజద్రోహుల వలే కనపడుతున్నారు. మమ్మల్ని ప్రభుత్వం పోషిస్తున్నప్పుడు మా రాణిగారి కోసం నీతి లేని మాటలు విన్నప్పుడు మా చేతులలోని కత్తులు ఊరుకోవు! మీరు మా ప్రాణాలు రక్షించుకునేందుకు యుద్ధంలో మా ప్రాణాలు మీకు అర్పిస్తాం! ఇక ముందు ఎటువంటి మాటలని, మమ్మల్ని కృతఘ్నులుగా చేయకండి! మాకాజ్ఞ ఇవ్వండి !
ఓ సైనికులారా! పిచ్చివాళ్ళయి పోయారు! అలా కాదు! మీ మంత్రి ముందే అక్కడికి చేరుకోమని చెప్పాడు. ఆ సమయం దాటింది. మీరు ఇప్పుడు వెళ్తే ఉపయోగం లేదు. అయ్యే పని ఏదో ఇంతకు ముందే జరిగిపోయి ఉంటుంది. మీరు ఇప్పుడు పోయి ఏం చేస్తారు? అని అన్నాను, కానీ మీ రాజు పైన ఉన్న భక్తిని విడిచి పెట్టమని చెప్పలేదు.
ఒకవేళ జరిగితే వారి జాడ తెలుసుకుంటాం. ఇంకేదైనా జరగకుండా తగిన జాగ్రత్త తీసుకుంటాను. మమ్మల్ని విడిచి పెట్టండి!
సరే !వెళ్ళి రండి! మాకేమీ అభ్యంతరం లేదు! అటు బాట వైపు వెళ్లి, మీరు మీ పని మీద, మేము మా పని మీద వెళ్దాం! అడవిలో నుండి ఎందుకు వెళ్లడం?
బాట ఇక నుండి ఎంత దూరం ఉందో?
అదిగో ! దగ్గరలోనే కనపడుతున్నది. మీ మాటలు మాకు బాట వెంట పోయే వారికి సులువుగా వినపడటం చేతనే ఇక్కడికి వచ్చాం. రండి! బాట దగ్గరికి వెళ్దాం!
సైనికులు ఆ మాటలకు ఒప్పుకున్నారు. గుర్రపు రౌతులు ముందు దారిన వెడుతుంటే… సైనికులు వెనుక నడుస్తున్నారు. వారంతా బాట వెంట నడిచారు.
(సశేషం)