[ విఫలత ]
( నిరుపయోగం )
అపరాధః సదైవస్య
నపునర్మన్తిణా మయమ్ ;
కార్యం సఘటితం యత్నాత్, దైవయోగాద్వినశ్యతి ”
— హితోపదేశం.
భావం:-అనగా నాకు కలిగిన వంచన మంత్రి యొక్క లోపం వల్ల కాదు. అది దైవకృతాపరాధం. ఏ హేతువు చేతనో బాగా ప్రయత్నం చేసిన పని దైవాధీనం వల్ల నశించింది. కాబట్టి మంత్రి యొక్క దోషం కాదు.
కథాభాగం:– తెల్లవారుజాము చాలా అందంగా ఉంది.తూర్పుదిక్కున ఎరుపు రంగు కనపడుతోంది.కాకులు తమ గూళ్ళను వదిలి అరుస్తూ వెళుతున్నాయి. పశువుల కాపరులు కట్టి వేసిన ఆవుల దగ్గరకు దూడలను వదిలి, కొంచెం పాలు తాగనిచ్చి, తరువాత దూడలకు పాలు అందకుండా దూరంగా కట్టివేసి, పాలు పితికి, కుండలను నింపుతున్నారు. గృహిణిలు నిద్ర లేచి రోజువారీ పనులు చేయడానికి పూనుకున్నారు.కొందరు పశువులను తోలుకొని ఊరి బయలు ప్రదేశానికి మేపడానికి వెళుతున్నారు. తెల్లవారితే ఏవైనా చెడు శకునాలు ఎదురవుతాయని, వాటివల్ల పనులకు అడ్డంకులు కలుగుతాయని, ప్రయాణాలు చేసేవారు ఇండ్ల నుండి బయలుదేరి వెళ్ళిపోతున్నారు.
ఊరివారు కొందరు రుద్రమదేవి నివసిస్తున్న ఇంటి దగ్గరకు వచ్చి, ఆ రాత్రి జరిగిన ఆ పనికి అందరూ బాధపడుతున్నారు. “ఇంత పని చేయడానికి ఎవరు సాహసించారు?” అని కొందరంటూంటే…ఇంకా కొంత మంది ” ఆ పని చేసేవాడికెంత గుండె ధైర్యం?” అని, ధర్మాత్మురాలైన రుద్రమదేవిని జైల్లో పెట్టారో? చంపేసారో? అయ్యో! అయ్యో!! అని కొందరు బాధపడుతున్నారు. కొందరు ఇంటి లోపలికి వెళ్లి చూసి వస్తున్నారు. కొందరు చుట్టుపక్కల చూస్తున్నారు. ఇలా ఇంటి చుట్టు వాతావరణం దీనంగా తయారయింది.
అక్కడ నుండి ముగ్గురు మగవారు ఒక మహిళ బయలుదేరి ఒకే తోవలో ఒకరి వెంట మరొకరు నడుస్తున్నారు. కొద్ది దూరం నడిచి వారు ఆ ఊరు దాటి చిక్కటి అడవిలోనికి వెళ్లారు. అలాగే కొంత దూరం నడిచి ఒక చోట కూర్చున్నారు.
ఆ ప్రదేశం ఎత్తుగా ఉన్న చెట్లు ఉండటం వల్ల, చిక్కటి పొదలు అల్లుకొని ఉండడం వల్ల రహస్య విషయాలు ఆలోచించు కోవడానికి తగినట్లుగా ఉన్నది. కాబట్టే ఆ నలుగురు ఆ స్థలానికి వచ్చారు. నేలంతా మొనతేలిన కంకర రాళ్ళు ఉండడం వల్ల గడ్డి ఏమంత ఎక్కువగా మొలువలేదు. అలా ఉండడం వాళ్ళకి ఆ స్థలం కూర్చోవడానికి వీలుగా ఉంది.
వారెవరో పాఠకులు ఆలోచించ అక్కరలేదు. ఒక్కడు మురారి దేవుడు, రెండవవాడు హరిహర దేవుడు, మూడవ వాడు ధర్మవర్తనుడు, ఆ మహిళ కమల. అక్కడ కూర్చొని ఇలా మాట్లాడు కుంటున్నారు.
ధర్మ:– చూశారా? పని అంతా ఎలా అయిందో? రుద్రమదేవి మగవాళ్ళను చంపి పుట్టిన ఆడమనిషి. ఆమెకు తెలిసిన అన్ని మాయలు మంత్రాలు మగవాళ్ళకి కూడా తెలియవు. ఏమీ తెలియనట్లుండే రుద్రమదేవి మన ప్రయత్నాన్ని మంట కలిపింది. నాకెందుకో మొదటినుండి అనుమానం గానే ఉన్నది.
మురారి:– నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఇంట్లో కట్టు వేసిన వారు ఎలా తప్పించుకున్నారు? చుట్టూ కాపలా ఉన్న వారు కంటిమీద రెప్పవేయకుండా కాపలా కాస్తున్నారు. అదే కాకుండా ఆ ఊరు చుట్టూ ఉన్న మన సైనికుల కనుగప్పి ఎలా తప్పించుకొని పోనిచ్చారు? ఇదంతా గారడి విద్యవలె ఉన్నది.కమలా! నువ్వు వాళ్ళ దగ్గర ఉన్నావు కదా! వారు ఎక్కడికి వెళ్లారు నువ్వు చూడలేదా?
కమల:– నాతో వారెప్పుడూ భయపడుతున్నట్లుగా మాట్లాడనేలేదు. రోజు ఎలా ఉన్నారో రాత్రి కూడా అలానే ఉన్నారు. మిమ్మల్ని వదిలి వెళ్లిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్లావని కూడా నన్ను అడగలేదు ప్రయాణం ఉందని మాత్రం చెప్పింది. తర్వాత రోజుటివలనే నిద్రపోయాం.
ఇంకా నాకు ఆశ్చర్యం కలిగింది. నేను చూస్తూనే ఉన్నాను. వెనుకనుంచి ఎవరో వచ్చే నా కళ్లను మూసి, నా నోట్లో గుడ్డలు కుక్కి నన్ను తాళ్ళతో కట్టి వేశారు. తర్వాత ఏమైందో నాకు తెలియదు.
హరిహర దేవుడు:– వాళ్ళు తగిన జాగ్రత్తలు ఉండి భయపడకుండా ఉన్నారు. కావలివాళ్లకు ధనమిచ్చి కట్లు విడిపించుకున్నారు కావచ్చును. లేకపోతే వీళ్లు కాకుండా లోపలికి వేరెవ్వరు రావడానికి కానీ పోవడానికి కానీ ఎలా వీలు చిక్కింది? మనం కూడా చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉన్నాం కదా!
కమల:– మొదట వాళ్ళకు ఈ సంగతి ఎలా తెలిసింది?
ఆనాడు ధర్మవర్తనుడు గారు చెరువుకట్టపై కూర్చుని ఉన్నప్పుడు చూసింది గూఢచారై ఉంటాడు.అతను మన గుట్టు బయట పెట్టాడా?
అయ్యో! అయ్యో! మన పని అంతా వెల్లిపాయలో కలిపిన చింతపండు లాగా అయింది కదా!
ధర్మ:– మన ఆశలన్నీ వ్యర్థమైనవి. మహాదేవరాజువద్ద మనం చెప్పినవన్నీ అబద్ధాలు అయినవి కదా! అయ్యో! ఎలా కావలసిన పని ఎలా అయ్యింది? ఆ నలుగురు మాట్లాడుకుంటు ఉండగా ఇద్దరు మగవారు వచ్చి నిలబడ్డారు. వారిని చూడగానే మురారి దేవుడు” మీరేం వార్తలు తెచ్చారు? శుభమా? అశుభమా? శుభమని అనుకోవడానికి వీలు లేకపోతే అది ఎలా కలుగుతుంది? మీరంతా మీ మీ పనుల మీద శ్రద్ధతో ఉన్నా కూడా రుద్రమదేవి ఎలా తప్పించుకొని పోయింది? ఇలా తప్పించుకున్నారని ఆలోచించడానికి అవకాశమే లేదని అన్నాడు.
అయ్యా! మీ ఆజ్ఞ ప్రకారం మేమంతా జాగ్రత్తగా ఇంటి చుట్టూ ఉన్నాం. ఇంటి నుండి పిల్లి కూడా బయటకు పోలేదని మేము ఖచ్చితంగా చెప్పగలం. మాలో తప్పు ఉంటే మమ్మల్ని శిక్షించండి. ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడా “రుద్రమదేవి తప్పించుక పోయిందని మీరు చెప్పే దాకా మాకు తెలియదు. ఏమి చేయాలి? మాకు మాట దక్కని రోజు వచ్చిందని వచ్చిన ఇద్దరిలో ఒకడు అన్నాడు.
మరొక చిత్రమైన సంగతి జరిగింది. మీరు అడవిలో కావలి ఉంచిన సైన్యమంతా చనిపోయారని రెండవవాడు చెప్పాడు.
ఆ మాటలకు వారంతా అవాక్కయ్యారు.
ఎలా? ఎలా? సైన్యమంతా చనిపోయిందా? కటకటా! ఆ సైన్యాన్ని చంపిందెవరు? అని హరిహర దేవుడు అన్నాడు.
అయ్యా! ఏమని చెప్పేది? ఊరికే నాలుగువైపులా కావలి ఉన్న సైనికులను రెండు భాగాలుగా మారి ఓరుగల్లు తోవను కాపలా కాస్తూ ఒక సైనిక దళమూ, ఊరిని చుట్టుముట్టి మరొక దళమూ ఉన్నాం. అక్కడక్కడ ఇద్దరిద్దరినీ ఉంచాం. ఎప్పుడు కావాల్సి వస్తే సైగ చేయగానే తోడుగా రావాలని సైగలు ఏర్పాటు చేసుకుని ఎవరి పనుల మీద వారు ఉన్నాం. ఇంతలో గుర్రపు స్వారీ చేస్తూ ఎక్కడినుండో వచ్చారు. మేము ఊరి దగ్గరగా ఉన్నాం కాబట్టి వారు తప్పించుకొని పోతున్న వారనుకొని, వారి మీద దాడి చేశాం , కానీ వాళ్లు నలుగురు మగవారే! కటిక చీకటిలో వాళ్ళను మగవారిగా పోల్చుకోలేదు. పోల్చుకుంటే వారిని ఎదుర్కొనే వాళ్ళం కాదు. ఆ వీరుల శౌర్యం చెప్పనలవికాలేదు. నలుగురు నాలుగు వైపులా మమ్మలను అవతలికి పోనీయకుండా నరికి వేయడం మొదలుపెట్టారు. కొన్ని ఘడియలలో మా సైన్యం పావువంతు మాత్రమే మిగిలింది. చీకటిగా ఉన్నా ఎలానో ఒకలాగ వారి నుండి తప్పించుకొని ఓరుగల్లు తోవను కాపలా కాస్తున్నవాళ్ళను పిలుచుకొని వచ్చేందుకు పోదామనుకునేసరికి శస్త్రాల చప్పుడేదో వినపించింది. పరిగెత్తుకొని అటు వెళ్ళాం. అప్పుడు ఓరుగల్లు సైన్యంతో మనవాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఓరుగల్లు సేన తక్కువగా ఉండి, మన సేన ఎక్కువ మంది ఉండటం వల్ల శత్రువులను ముందుకు రానీయకుండా అరికట్టి నిలిపాం. దాదాపు విజయం మాసొంతమైందని చెప్పవచ్చు. దాదాపు ఇరవై మంది దాకా చంపాం. ఏమనాలి? ముందు మాతో యుద్ధం చేసి, మమ్మల్ని తరిమిన ఆ నలుగురు వీరులు ప్రత్యక్షమై బాధించటం మొదలుపెట్టారు. వారు వచ్చి చాలా మందిని చంపారు. పది పదిహేను మందిమి మాత్రం మిగిలి, అటూ ఇటూ చెల్లాచెదురు అయిపోయాం. మేము కూడా ఊరిలో ఆ ఇంటి చుట్టూ ఉన్న వారితో కలిసి ఏ ఊరుకైనా పోదాం అనుకుని వస్తున్నాం. ఇంతలో ఇతడు కలిసి మీ జాడ మాకు చెప్పాడు. మేమిద్దరం ముందు నడిచి ఇలా వచ్చాం. వారు ఇప్పుడో, ఇంకాసేపటికో ఇక్కడికి వస్తారు. మీరు ఎలా చెప్తే అలా చేస్తానని అందరూ వినేటట్లు గా బొంగురు గొంతుతో అన్నాడు.
పనంతా తలకిందులైంది. మనలను వారు గుర్తుపట్టారా ఏమో? అని కొంచెం అనుమానం వస్తున్నది. ఒక్క పని చెడిపోయి, ఎంత మందికి బాధ కలిగించిందో కదా! మహాదేవరాజుకు, మాకు, కొందరు మాండలికాలకు చెప్తే కూడా తీరనంత ఆశాభంగం కలిగిందని మురారి దేవుడన్నాడు.
వాళ్లు మనను ఎప్పటినుండో కనిపెట్టి తిరుగుతున్నట్టున్నారు లేకపోతే అవలీలగా తప్పించుకోవడం సాధ్యమా? మన కాపలా వారికి లంచం ఇచ్చి ఉంటారు. రెండో దారి లేదు అని కమల అన్నది.
ఇంతలో మరి కొంత మంది మనుషులు వచ్చి నమస్కరించి నిలబడ్డారు. వారు రాగానే మురారి దేవుడు వారిని చూసి, మీరు ఇంత మంది మాత్రమే బతుక గలిగారా? ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు.
సరిగ్గా చెప్పలేం పది పదిహేను మంది చెల్లాచెదరై పోయి ఉంటారు. వాళ్ళందరిని వెతికి రమ్మని మన వాళ్ళను ఇద్దరు ముగ్గురిని పంపాను. వెతికి మనలను కలుస్తారని వచ్చిన వారిలో ముఖ్యుడన్నాడు.
ఇంకా మనం ఆలస్యం చేయవద్దు. ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. మన రహస్యం తెలుసుకుంటున్నవారు మనం ఉన్న చోటు తెలుసుకుంటారనడం నిజం! వాళ్లకు దొరికిపోయి, ఇగిలిగించడం కన్నా పరిగెత్తి వెక్కిరించడం మంచిది. లేవండి! వెడదామని ధర్మవర్ధనుడు అన్నాడు.
వారంతా ప్రయాణమైనారు. కమల కూడా వారి వెంటే ఉన్నది. వారంతా అడవిలో పడి ఒక పక్కగా నడుస్తున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు.నాలుగు వైపులా జాగ్రత్తగా చూస్తూ నడుస్తున్నారు.అర కోసు దూరం నడిచే టప్పటికీ వాళ్లకు ఆడవిలో జనాలు నడుస్తున్నట్టు చప్పుళ్ళు వినబడ్డాయి.ముందుకు నడవకుండా వాళ్ళు నిలిచి తమ చుట్టుపక్కల చూశారు. కొంతమంది బలిష్టులయిన వాళ్ళు కత్తులు పట్టుకొని వస్తుండటం చూశారు.వచ్చినవాళ్లు క్షణంలో చుట్టుముట్టారు. తప్పించుకుని పారిపోవడానికి అవకాశం చిక్కలేదు. అప్పటికి తగిన పని యుద్ధమే అనుకొని, ఒరల నుండి కత్తులను దూశారు. రెండు వైపుల వారికి పోరాటం జరిగింది. మురారి దేవుడు మొదలైనవారు కూడా మామూలు వ్యక్తులు కారు.యుక్తిగా యుద్ధం చేస్తున్నారు. వారి అనుచరులు కూడా యుద్ధం చేస్తున్నారు. వచ్చి చుట్టూ మూగిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో మురారి దేవుడు మొదలైన వారి శౌర్యంతో నిలువలేక గడ్డిపోచ మంటకు మాడిపోయినట్టు క్షణంలో నశించిపోయింది.
క్రమంగా మురారి దేవుడు, హరిహర దేవుడు, ధర్మవరధనుడు నేల మీద కూలిపోయారు.కొందరు సైనికులు చచ్చారు. మిగిలిన వారు తప్పించుకొని పారిపోయారు. కమల ఒక్కతే వారికి చిక్కింది. ఆ స్త్రీ ఎంత మాయామర్మాలు నేర్చుకున్నా పౌరుషానికి చిక్కితే ఏం చేయగలదు? ఆమెను వారు బంధించారు
కమల ఏడుస్తూ ఏమేమో మొర పెట్టుకుంటున్నది. వీరులు ఆమె మాటలను పట్టించుకోకుండా, జాలి పడక, కట్టిన కట్లు విప్పకుండా ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు.
పదవ ప్రకరణ
[ వార్త నిర్దేశనం]
ఏతదాఖ్యాంతితే సర్వే
హరయోరయోరామ సన్నిధౌ
వైదేహీ మర్షతాం శ్రుత్వా
రామ స్తూత్తరమబ్రవీత్
సుందరకాండ..65 సర్గ 3వ శ్లోకం
ఉవాచ వాక్యం వాక్యఙ్ఞ
సీతాయాదర్శనం యథా
సముద్రం లంఘమిత్వాఽహం
శతయోజనమాయతమ్
సుందరకాండ..65 సర్గ 5వ శ్లోకం
భావం:– వానరులు శ్రీ రాముని దగ్గరకు వెళ్లి సీతమ్మ రావణుడి అంతఃపురంలో బంధింప బడి ఉండడం, రాక్షస స్త్రీలు ఆమెను బెదిరించడం మొదలైన సమాచారమంతా రామునికి చెప్పి మౌనంగా ఉన్నారు.
రాముడు సీతాదేవి నాశనం చెందక క్షేమంగా ఉన్నదని విని వానరులను చూచి ఇలా అన్నాడు. హనుమ సీత ఇచ్చిన మణిని రామునకు సమర్పించి, తాను సీతాదేవిని చూసిన విధం చెప్పెను.నేను నూరు యోజనముల విస్తీర్ణం కలిగిన సముద్రం దాటి సీతాదేవిని చూడడానికి వెతుకుతూ పోయాను.
వ్యాఖ్య:–రామాయణం లోని సుందరకాండలోని సీతాన్వేషణ ఘట్టంలోని హనుమ సీతను చూసినట్లు రామునికి చెప్పినట్టు…
రుద్రమదేవి నవలలో ప్రకరణౌచిత్య శ్లోకం…రుద్రమదేవిని గోనగన్నారెడ్డి చూసినట్లు చెప్తూ…రాబోవు కథాసూచిగా చెప్తూ… మంగళాంతంగా ముగియనున్నట్లు గ్రంథకర్త ఇలా ఇతిహాసోపమానం ఇవ్వడం అనేక పురాణ, ఇతిహాసాల పఠనాసక్తి, పరిచయం ఉన్నట్లు తెలుస్తున్నది…
ఇది ఒక అపూర్వ ప్రక్రియ…ప్రకరణాలకు నామకరణం చేయడం పాఠ్యాంశంగా అభ్యాసానికి సులువైన పద్ధతి…
(రంగరాజు పద్మజ)
కథాభాగం:- ఓరుగల్లులో రుద్రమదేవి రాజదర్బార్ లో కూర్చుని ఉంది. ఆమెకు కుడివైపున ముఖ్యమంత్రి అయిన శివదేవయ్య, అతని తర్వాత కాయస్థ కులంలో పుట్టిన వాడు” బ్రహ్మరాక్షసుడు” మొదలైన బిరుదులున్న వాడైన మంత్రి, సేనాపతి రెండు పదవులను నిర్వహిస్తున్న జన్నిగదేవ సాహిణి, అతనికవతల కాయస్త వంశీకుడైన” ఏకంగా వీర, వీరావాతార” మొదలైన ఎన్నో బిరుదులున్న మంత్రి, సేనాధిపతి అయిన త్రిపురాంతక మహాదేవ రాజు, అతనికవితల వైపు ఇతని చిన్న తమ్ముడు “రాయ సహస్ర మల్ల” బిరుదు పొందిన గండికోట, ములికి, నాడు, రేనాడు,పెందాడి , పెడకట్ల, సకిలియెరువ, పొత్తపినాడు మొదలైన ప్రాంతాలను రుద్రమదేవికి ప్రతినిధిగా పాలిస్తున్న అంబ దేవమహారాజు, కూర్చుని ఉన్నారు.ఎడమ వైపున నాగదేవరాజు, ఇతని పక్కన రుద్రమదేవి అల్లుండ్లు విక్రమాఢ్యులైన అన్నమ దేవరాజు, చాళుక్య వీరభధ్రరాజు కూర్చుని ఉన్నారు. ఒకవైపు మిగిలిన సైన్యాధ్యక్షులు, మరొకపక్కన ఆస్థాన పండితులు, ఇంకో వరుసలో విదేశీయులు, ఇంకొక చోట ఉన్నతోద్యోగులు, మరోచోట రాయబారులు కూర్చున్నారు.
రుద్రమదేవి పొగలేని నిప్పు వలె భగభగమండి పడుతున్నది. ఆ సభలో ఉన్న వారికి ఆమె మనసులో ఏమి ఆలోచిస్తున్నదో తెలియడం లేదు. ఆమెను అటువంటి వేషంలో ఎవరూ.. ఎప్పుడూ.. చూడలేదు.సభలోనే కొందరు ముఖ్యులకు అసలు ఏం జరిగిందనే కారణం తెలుసుకోవాలని కుతూహలంతో ఉన్నారు. అయినా కానీ ప్రశ్నించడానికి ధైర్యం చేయలేదు.
శివదేవయ్య సభ్యుల మనసు తెలుసుకొని, తన ఆసనం నుండి లేచి, అందరూ వినేటట్లు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు.
” ఓ సభ్యులారా! భారతీయులకు సత్యం వంటి ఆభరణం ఇంకొకటి లేదు… బాహాటంగా యుద్ధంలో ఖడ్గంతో ఖడ్గం పోరాడి శత్రువును గెలవడమో? లేక శత్రువుతో ఓడిపోవడమో మాత్రమే ప్రజలు మెచ్చుకుంటారు.శాస్త్రం కూడా అదే ఒప్పుకుంటుంది దుర్మార్గులు ఈ పద్ధతిని విమర్శిస్తారు. అంతేకాదు మరింత చెడుతోవ తొక్కుతారు. మనకు తల్లితో సమానమైనది, ధర్మానికి మారూపైన మన రాణి గారి యొక్క ఉత్తమమైన ఉదార గుణాలతో, సేవకుల మీది వాత్సల్యంతో ఉండడం మన అందరికీ తెలిసిందే.
” శరణని వచ్చిన వారికి తల్లివలె కాపాడే శ్రీమతి రుద్రమదేవికి దేశంలో కొందరు దేశద్రోహులు కారణం లేకుండా పగబూని, ఈ కుట్ర పన్నారు. మనం పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యఫలం వల్ల మన రాణి చిక్కులలో పడిన కూడా శ్రమ పడకుండా బయటపడ్డారని చెప్పడానికి నాకూ, వినడానికి మీకు చాలా ఆనందంగా ఉన్నది. అయినా శ్రద్ధతో పనిచేస్తున్న శత్రువులకు పూర్తిగా దొరికిపోయి, ఎక్కువ శ్రమ లేకుండా తిరిగి రావడం అసంభవమని ఆ ద్రోహులను చూసి మీరు అనుకున్నారు కావచ్చు…..
ఇంతలో ఒకతను సభలోనికి త్వర త్వరగా వచ్చి, రుద్రమదేవికి నమస్కరించాడు. అతని వెంట ఒక మహిళ ఉన్నది. ఆమె తాళ్లతో కట్టి వేయబడి ఉన్నది. రాజభటులు ఆమెను కాపలా కాస్తూ వెంట నడుస్తూ వస్తున్నారు. మరి కొంతమంది కొన్ని పెట్టెలను తలపై పెట్టుకొని వచ్చి, రుద్రమదేవి ముందు దింపి, నమస్కారం చేసి పక్కకు పక్కకు ఒదిగి నిలబడ్డారు.
వచ్చినతను గోనగన్నారెడ్డి. ఇతడు రుద్రమదేవికి నమ్మకమైన బంటు.తనకు అప్పచెప్పిన పనికి వెనకడుగు వేయడు. పేరున్న గొప్ప వీరుడు. గోనగన్నారెడ్డి తన వెంట తీసుకొని వచ్చిన స్త్రీని, ధనమున్న పెట్టెలను రుద్రమదేవికి, సభలోని వారికి చూపించి ఇలా అన్నాడు.
ఈమె శత్రువుతో కుట్ర చేయమని పంపినదే అయినా, కాకతీయ రాణివాసం కొలుస్తూ జీవిస్తున్న దాసి కులంలో పుట్టిందనీ,శ్రీ గణపతి రాజరాజ రాజేంద్రుని దేవికి సేవలు చేసిన లలిత కూతురు అని, క్రీ.శ.1228 లో శ్రీ చక్రవర్తి గారు అద్దంకి సేనపై దాడి చేసినప్పుడు తన తల్లి, తాను శ్రీవారి వెంట ఉన్నామని, ఆ కల్లోలంలో తన తల్లి ఎక్కడో తప్పిపోయిందని, మొదలైన ఏవేవో కట్టుకథలు చెప్పి, తన పేరు మదనమంజరి అని చెప్పింది. దీని పేరు కమల. కానీ మదనమంజరి కాదు. మాయలు పన్నే ఈమె చెప్పిన చరిత్ర తన తల్లి గురించి కాకపోయినా, నిజమైన చరిత్ర కాబట్టి మన రాణిగారు నమ్మవలసి వచ్చింది. మన రాణి చాలా ఉపాయంగా ప్రశ్నలు వేసినా, మాయామర్మాలను బాగా వంట పట్టించుకున్న ఈవంచకురాలు ఆ ప్రశ్నలకు చిక్కక సరైన సమాధానాలిచ్చి, రాణి గారు అనుమాన పడకుండా చేసింది. నాకు మాత్రం మొదటి నుండి దీని విషయం కొంచెం అనుమానంగానే ఉంది. అందుకే నేను ఈమె విషయంలో శ్రద్ధతో గమనిస్తున్నాను. కొన్ని రోజులకు రాణిగారు తమ కూతుళ్లతో బుద్ధగణపతిని పూజించాలని వడ్డేపల్లికి వస్తున్నారు. అప్పుడు ఈ దొంగ దాసీ మంతనాలతో మన రాణిగారి వెంట వీరులను లేకుండా చేసింది. మొదటి నుండి అనుమానం ఉన్న నేను మారువేషంలో రాణిగారి వెంట మొగిలిచర్లకు వెళ్లాను. నేనెప్పుడూ దాసిని కనిపెట్టుకొని ఉన్నా కూడా ఒకనాటి సాయంకాలం ఈ దాసి కనిపించకుండా ఉండటంతో భయం వేసి, అటు ఇటు కొంతసేపు వెతికి, ఈ దాసి దొరకక నిరాశతో ఎక్కడ పోయిందో చూద్దామని చెరువు కట్ట ఎక్కి నడుస్తూ పోతున్నాను. నేను కొంత దూరం నడిచేటప్పటికీ ఈ దాసి కట్టకింద ఉన్న మర్రిచెట్టు దగ్గర నుండి వస్తున్నది. అప్పుడు నా అనుమానం సరైనది అనుకొని, దానికి కనిపించకుండా దాక్కొని, అది వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఏమీ తెలియనట్లు కూర్చొని, నా ద్యాసంతా మర్రిచెట్టు మీదే నిలిపాను. ఎవరో ఆ చెట్టుకింద ఉన్నట్టు, గుసగుసలు పెట్టుకుంటున్నట్టనిపించింది. వాళ్ళ మాటలు స్పష్టంగా వినబడటం లేదు. ఇంతలో ఒకడు వాళ్ళ దగ్గర నుండి నా వైపు వస్తున్నాడు. అతను పైకి వస్తున్నప్పుడు” ఇప్పుడే వెళ్లి త్వరత్వరగా కమలను కలుసుకోవాలి” అనే మాటలు వినబడ్డాయి. చూసి చూడనట్టు వాళ్ళ వైపు చూసి వారి రూపాలను నా హృదయంలో ముద్ర వేసుకున్నాను. వాళ్ళు ముగ్గురు మగవారు, అందులో ఇద్దరు అక్కడ ఉన్నారు. ఒకతను గబగబా నడుస్తూ వచ్చి నన్ను చూసి” ఎవరు నువ్వు?” అని అడిగాడు. నేను వినిపించుకోలేదు. వచ్చిన అతను అచ్చంగా బ్రాహ్మణుడు వలె ఉన్నాడు. ఇంకా కొన్ని మాటలు అడిగాడు. చెవిటి వాడి వలె నటించాను. అతను నన్ను ఏమీ అడగకుండా వెళ్ళిపోయాడు. మర్రిచెట్టు కింద ఉన్న ఇద్దరు ఎక్కడికో వెళ్ళిపోయారు.నేను లేచి ఇంతకుముందు నా దగ్గరకు వచ్చి నన్ను మాట్లాడించిన బ్రాహ్మణుని వెంట నడిచాను. అతడు అంతకుముందే చాలా దూరం వెళ్ళాడు.అయినా నాకు అతడు కనిపిస్తున్నాడు.అతన్ని చూస్తూ పోతున్నాను. కాబట్టి అతడు తోవలో ఈ దుర్మార్గురాలుని పనికి పురమాయించడం చూశాను. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ, ఏదో మోసం ఉన్నది అని అనుకొని, బుద్ధగణపతి ఆలయానికి వెళ్లి, నా వేశం మార్చుకుని, పరమభక్తుని వేషం వేసుకున్నాను. ఇంతలో ఆ బ్రాహ్మణుడు దేవుడు ఆవేశం అయినట్టు నటించి, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడాడు. మర్రిచెట్టు కింద నేను చూసిన మరో ఇద్దరు కూడా వచ్చి అతనికి సేవలు చేశారు. ఇదంతా నా అనుమానాన్ని మరింత బలపరిచింది.నా అనుమానం సరైనదే అని తేలేదాక ఆ విషయం రాణిగారికి చెప్పడం సమంజసం కాదని, అప్పటికి చెప్పడం మానివేసి ఆ ముగ్గురి వెంటనే ఉన్నాను.
తెల్లవారకముందే రాణిగారు ఇద్దరు కూతుళ్లతో మాయ బ్రాహ్మణునికి దేవత ఆదేశించినప్పుడు అన్న మాటల ప్రకారం మొగిలిచర్లకు ప్రయాణం అయిపోయారు. నేనా ముగ్గురుతో పాటు వారికి తెలియకుండా మొగిలిచర్లకు వెళ్లాను. వాళ్లు నేరుగా ఆ ఊరికి రాకుండా అడవి నుండి రావడానికి నిశ్చయించుకున్నారు. ఆ ఆలోచన మోసానికి సంబంధించిందని నేను అనుకొని, రుద్రమదేవి తెలుపాలని అనుకొని, రుద్రమదేవిగారున్న విడిది గృహానికి వెళ్లాను కానీ, ఆ ఇంటి చుట్టూ కాపలా ఉన్న భటలు నన్ను లోపలికి వెళ్లనియ్యలేదు. ఎన్ని విధాల చెప్పినా లోపలికి వెళ్లి వచ్చి,” ఇది సమయం కాదని రాణిగారు అన్నారు అని” నాకు వచ్చి చెప్తున్నారు .
” నా దగ్గరకు ఎవరూ రాలేదని” రుద్రమదేవి అన్నది.
నాకు తెలుసు వాళ్లు శత్రుపక్షం వారు. కాబట్టి లోపలికి వచ్చి మీకు చెప్పలేదని తెలుసు. వాళ్ళని ఎదుర్కొందామంటే నేను ఒక్కడినే ఉన్నాను. అంతే కాదు నా దగ్గర నన్ను నేను రక్షించుకునేంత మాత్రమే ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి సాహసించే వీలు లేకపోయింది.
ఓరుగల్లుకు పోయి సైన్యంతో వద్దామంటే ఆ లోపలే ఇక్కడ ఏం జరుగుతుందో అని మనసొప్పలేదు. అప్పుడు ఆ ఊరికి పోయి దేనికైనా పనికి వస్తుందని నా వెంట తెచ్చిన ధనంతో కొంతమంది మట్టి పని చేసే వారిని నా వెంట తీసుకొని, ఊరి బయట నుండి చిన్న ఎడ కత్తులతో సొరంగం చేసి, దేవిగారు ఉన్న ఇంటి గదిలోనికి సొరంగం తవ్వమని చెప్పి, నేను ఆ ఇంటిని కాపలా కాస్తున్నాను. మళ్లీ ఒకసారి అడవి మధ్యకు వచ్చాను.అప్పటికి ఈ దాసి, ఆ ముగ్గురు అడవిలో కూర్చొని ఏదో రహస్య ఆలోచన చేస్తున్నారు. నేను వచ్చిన సంగతి వాళ్లకు తెలియక, ఆనాటి రాత్రి రుద్రమదేవిని పట్టి బంధించాలనుకుంటున్నారని, పట్టణం చుట్టూ దారుల వెంట జనాలు కాపలా ఉండాలని అనుకుంటున్నారు. నేను అక్కడ నిలబడడం అంత మంచిది కాదనుకుని, ఊరికి వచ్చాను. కానీ ఇంతలోనే మరొక ఆపద ఎదురైంది. ఊరి బయట సొరంగం ఊరికి ఏమంత దూరంలో లేదు.ఆ సొరంగం నుండి రుద్రమదేవి వస్తే,ఇవతల కాచుకొని ఉన్న వారిని ఎదుర్కో లేము. అయినా పనికి విచారించక, గబగబా ఊరికి వెళ్లి, ఒక ఊరు అతని దగ్గరకు పోయి, రహస్యంగా అతనికి కొంత ధనమిచ్చి, శ్రీ శివదేవయ్య మంత్రి పేరు మీద” మోసం జరిగింది. జాము రాత్రి లోపల సైన్యం మొగిలిచర్లకు రావాలని” ఒక ఉత్తరం రాసి పంపాను.
ఇంతలో సొరంగం తవ్వడం అయిందని తెలిసింది. సాయంత్రం అయింది. నాలుగు ఘడియల రాత్రి దాటిన తర్వాత ఆ సొరంగం బయట చాటుగా నాలుగు గుర్రాలను, నాలుగు నిలువు కత్తులను సిద్ధంగా ఉంచి, ఆ సొరంగం ద్వారా నడచి, శ్రీ రుద్రమదేవి దగ్గరకు చేరాను. నేను రావడం దేవికి ఆశ్చర్యం వేసింది. జరిగిన సంగతంతా సంక్షిప్తంగా చెప్పి, దాసిని కట్టేసి, కళ్ళకు గంతలు కట్టి, ఆ వచ్చిన తోవనే బయట పడ్డాము.
సొరంగం తవ్విన వారే వెంటనే దానిని సాధ్యమైనంత వరకు పూడ్చి వేశారు. దాసిని వెంట పెట్టుకొని వెడితే తోవలో రహస్యం దాచడం కష్టమని అక్కడనే కట్టి వేసాం. బయట పడి కొన్ని రాళ్ళు రప్పలు, సొరంగంలో వేసి నలుగురం గుర్రాలనెక్కాము. ఇద్దరు కూతుళ్లతో రాణిగారు కట్టుకున్న బట్టలనే మగవారు కట్టుకున్నట్టుగా సవరించుకున్నారు. మేము నలుగురం నడుస్తూ వస్తుండగా ఊరు చుట్టూ కాపలా ఉన్న వారు మాపై దాడి చేశారు. వాళ్లని అవలీలగా చంపేసి, ఓరుగల్లు తోవ వెంట వస్తుండగా బాటకు కొంచెం దూరంలో రెండు సైన్యాలు యుద్ధం చేస్తున్నట్టు తెలిసి అక్కడికి వెళ్ళాం. అందులో ఒక సైన్యం ఓరుగల్లు సైన్యమని, మేము అంచనాగా తెలుసుకొని, శత్రువులను వెళ్ళగొట్టాం. మేం ఎవరిమో? ఆ సైనికులకు తెలియదు. వాళ్లను వెంట తీసుకొని వచ్చి, కొంత దూరం వెళ్ళేటప్పటికి ఇంకొంత ఓరుగల్లు సైన్యం మాకు కలిసింది. కొత్త సైన్యాన్ని వెంటబెట్టుకుని నేను మళ్ళీ మొగిలిచర్లకు వెళ్లాను. కూతుళ్లు ఇద్దరు నీ వెంట తీసుకొని రాణిగారు జాగ్రత్తగా ఓరుగల్లు చేరారు. నేను మొగిలిచర్లకు వెళ్లి; నేరస్తుల కోసం వెతికాను కానీ వారు ఎక్కడా కనపడలేదు. ఆ రాత్రి అక్కడే గడిపి, తెల్లవారక ముందే చెట్లపై దాక్కొని, వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంతలో వాళ్ళు మా దగ్గరికి వచ్చి, మేమున్నది తెలియక నడుస్తున్నారు. మేము వాళ్లను చుట్టుముట్టి సైనికులను, ఈ పనికి ముఖ్య కారకులైన మురారి, హరిహర దేవులను, ధర్మవర్ధనుడుని చంపేసి, ఈ దుర్మార్గురాలిని కట్టేసాం. దీనిని అడిగి మురారి దేవుడికి ,హరిహర దేవుడికి సంబంధించిన ధనాన్ని కొల్లగొట్టు కొని తెచ్చాను.ఇక ముందు మీ ఇష్టప్రకారం ఈ ధనాన్ని, ఈ దాసీని ఏమి చేస్తారో చేయవచ్చు. అని చెప్పి గోనబుద్ధారెడ్డి తన ఆసనం మీద కూర్చొన్నాడు.
ఈ విషయం విన్న సభలోని సభ్యులందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. కమల వంచిన తల ఎత్తలేదు. అందరూ గన్నారెడ్డి చేసిన సాహస కృత్యానికి , అతని రాజభక్తికి మెచ్చుకున్నారు.
రుద్రమదేవి తన సింహాసనం నుండి లేచి, ” నా ప్రాణాలను ,నా కూతుళ్ళ మాన, ప్రాణాలను ” రక్షించిన గోనగన్నారెడ్డికి నా మనస్ఫూర్తిగా నా చేతిలో ఎప్పుడూ ఉండే ముత్యాల బాకును బహుకరిస్తున్నానని అంటూ తన చేతిలో ఉన్న బాకు గన్నారెడ్డి కిచ్చారు.
రాణీగారు అన్నమాటలతో సభ్యులందరికీ సంతోషంతో కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
గోనగన్నారెడ్డి దిగ్గున లేచి రెండు చేతులతో ఆ కత్తిని తీసుకుని, కృతజ్ఞతగా నమస్కారం చేసాడు.
రుద్రమదేవి కమలను చూస్తూ ” నువ్వేమైనా చెప్పదలచుకున్నావా?” అని అన్నది.కమల ఏమీ సమాధాన మీయకుండా తలవాల్చుకుని నిలబడింది.
మారుమాట్లాడకున్నంత మాత్రాన నువ్వు నిర్దోషివి కాదు ! నీ ప్రాణాలు మా చేతిలో ఉన్నాయి.నిజం చెప్పి,నీకొచ్చే ముప్పు తప్పించుకో ! నిన్నెవరు పంపారో? చెప్పు! అని రుద్రమదేవి అడిగింది.
” నన్నేమి చేసినా సరే! నేను మీకేమీ చెప్పలేను.” అని కమల అన్నది.
ఎవరు పంపారన్న అనుమానం మీకక్కరలేదు. వీళ్ళ నందరినీ పంపింది మహాదేవరాజు. ఈ నలుగురు దుర్మార్గులు. మొగిలిచర్లకు చెందిన అడవిలో కూర్చుని మాట్లాడుకుంటుండగా నాకు తెలిసిందని అన్నాడు గోనగన్నారెడ్డి.
నువ్వు చెప్పకున్నా నిన్ను పంపింది మహాదేవరాజని తెలిసింది. నీ నోటితో చెప్పి ఇక్కడ నుండి వెళ్లి పో! అని అన్నది రుద్రమదేవి.
దాసి కొంచెం సేపు ఆలోచించి ” నేనిక్కడ నుండి పోకున్నా, నన్ను మీరు కఠినంగా శిక్షించినా నన్నెవరు పంపారో వారి పేరు చెప్పను. ” అని మొండికేసి నిలబడింది.
దాసి మొండితనానికి రుద్రమదేవికి చాలా కోపం వచ్చింది. ఆడది కావడం వల్ల చంపక వదిలాను.” నువ్వు ఈరోజే మా దేశాన్ని వదిలి వెళ్లిపో! మా ఎల్లలు విడిచే దాకా మా భటులు నిన్ను వెంటాడుతూ ఉంటారు.మళ్లీ మా రాజ్యంలో నీ మొహం కనపడితే నీ ప్రాణాలు నీకు దక్కవు.ఆడుదానివైనందుకు బతికిపోయావు! నీ మహాదేవరాజు కూడా ఆడదాని వలె గాజులు తొడుక్కోవడం వల్లనే కదా! బహిరంగంగా యుద్ధంలో ఆడదానినైన నాతో ఎదుర్కోలేక కుట్ర చేసాడు.
సిగ్గు, బుద్ధి తెచ్చుకుని మళ్లీ ఇటువంటి పనులు చేయవద్దని చెప్పు. రాజ్యం దక్కించుకోవాలంటే మాతో స్నేహంగా ఉండమనీ గర్వం, అహంకారం వదిలి పెట్టమని చెప్పు! మేము మంచిగా చెప్పిన మాటలు మరచిపోతే మా పదునైన బాణాల గుట్టలై చురచుర మని వచ్చి తగిలి , బుద్ధి చెబుతాయని చెప్పు! అని దాసికి చెప్పి, ” త్రిపురాంతక దేవా! దీన్ని ఈ రోజు మన రాజ్యం దాటించేందుకు నలుగురు భటులకు చెప్పి పంపుమని అన్నది.
త్రిపురాంతక దేవుడు వెంటనే లేచి నమస్కరించి, కమలను వెంటబెట్టుకొని అక్కడ నుండి వెళ్లి పోయాడు.
అంతలో సభలో నుండి ఒకతను లేచి, నిలబడి “నేను వెనీసు వర్తకుడిని , నా పేరు మార్కోపోలో” అని అంటారు. నేను చాలా దేశాలు వ్యాపారంకోసం తిరుగుతుంటాను. పురుష పరిపాలన అజమాయిషీలో ఉన్న దేశాలు , స్త్రీ స్వభావమున్న పరిపాలనలో ఉన్న దేశాలను చూసాను. రాజులకుండాల్సిన ధర్మాలోచన, నీతి సమృద్ధిగా ఉండడం, సేవకుల పట్ల అభిమానం ఆదరణ , రాచకార్యాలు చేసేటప్పుడు చూపించే చతురత కలిగి ఉండడం మొదలైనవి ఈ రాణి దగ్గర చూసినట్లు ఎక్కడా చూడలేదు. రాజు పట్ల ఎంత భక్తి శ్రద్ధలుండాలో అవన్నీ ఈ రాణి సేవకుల దగ్గర మాత్రమే చూడగలిగాను. మిగిలిన దేశాలలో సేవకులకు ఇటువంటి వినయం లేదు.ఈ రాజ్యం కేవలం పురుష రాజశ్రేష్ఠులు పాలిస్తున్నట్టున్నది కానీ మహిళ చేత పరిపాలింప బడుతున్నట్టు లేదు. ఈమెను రాజు అనక తప్పదు.నాకు చాలా సంతోషంగాఉంది. మిగతా దేశాధినేతలు ,ఆ దేశాలలోని సేవకులు ఇక్కడకు వచ్చి ఈ నీతిని నేర్చుకోవాలని బిగ్గరగా అంటూ తన దగ్గర ఉన్న విలువైన విదేశీ వస్తువులను రుద్రమదేవి కి బహుమతిగా ఇచ్చాడు.
సభ్యులందరూ రుద్రమదేవి యొక్క చాకచక్యమైన పనులను పొగుడుతూ అవన్నీ మార్కోపోలోకు తెలిపారు.
సభ్యులారా! ఈనాటి ఈ అపూర్వమైన కార్యక్రమం వల్ల సభయొక్క ఉద్దేశ్యం మీరు ఇంకో తీరుగా అనుకున్నారు. కానీ ముఖ్యమైన అభిప్రాయం తెలుసుకునే అవకాశం చిక్కలేదు. రాయబారులెందరో వచ్చినట్టు తెలిసింది.వారి రాయబారాలను తెలుసుకునేందుకు సమయం చిక్కలేదు. దాడిలో పాల్గొని గెలిచిన వీరులైన సైనికులకు పారితోషికం ఇవ్వలేదు. కుట్రలో బలైనవారెందరో ? ఎంతమంది ఉన్నారో? తెలుసుకొని, వాళ్ల కుటుంబాలకు భరణం ఏర్పాటు చేయలేదు.
ఇప్పుడు సమయం చాలా గడిచి పోవడంవల్ల సభ ఇంతటితో చాలిస్తున్నాం. రేపటి కొలువులో అన్నీ జరుగుతాయని మంత్రి శివదేవయ్య తన ఆసనం నుండి లేచి చెప్పి మరలా కూర్చున్నాడు.
సభలోనివారందరూ ఒప్పుకున్నారు
(కొలువుకూటమి ముగిసింది.)
(సశేషం)