Home కవితలు రెడ్ వెల్వెట్ మైట్స్

రెడ్ వెల్వెట్ మైట్స్

నేలను కరుచుకుని అర అంగుళం దేహం
తలకు రెండు యాంటినా కళ్ళు
ఆరుకాళ్ళతో చలాకీగా కదులుతూ
కత్తిరించిన ఎర్రటి మక్మల్ బట్ట ముక్కలు
చల్లినట్లు నేలపై ఆరుద్రలు!

ఆరుద్ర కార్తె ఆరంభం తో
చినుకులతో పాటే
ఎర్రటి మొగ్గలు పూసినట్లు
పచ్చటి గడ్డిపై అవి…

బీడు వారిన భూమిపై
తొలకరి జల్లు చేరంగానే…
బడిగంట శబ్దానికి
పిల్లలు బిలబిలా పరుగుతీసినట్లు
కుప్పలుతెప్పలుగా చందమామ పురుగులు!

కొంత ఇసుక నేల
మరికొంత పచ్చ గడ్డి నేల ఉంటే చాలు
పట్టుకుచ్చుపూలలా అలరిస్తాయి!

పిల్లలను పెద్దలను ఆకర్షిస్తూ
ముట్టుకుంటే ముడుచుకు పోయే
అత్తిపత్తి మొక్క లా మక్మల్ పురుగులు!

ఇసుకనేల బొరియల్లో జీవనం సాగిస్తూ ….
నేలను గుల్ల బార్చి పంటకుపోషకాలు
అందించడంలో సహాయకారులు!

ఆ రుద్రుడికి ప్రీతికరమైన నామాలతో
మన మధ్యే మనకోసం బ్రతికే జీవులు !
వరుణదేవుడి కి ప్రతిరూపాలు
రైతన్నలకు నేస్తాలు ఆరుద్ర పురుగులు!

పక్షవాతం మరెన్నో రుగ్మతలకు
తమ ప్రాణాలను అర్పించి
సాంప్రదాయ ఔషధ ప్రధాతలు రెడ్ వెల్వెట్ మైట్స్!

ఇప్పుడు
దళారుల చేతుల్లో కాసులు కురిపించేందుకు
వాటి దేహాలను చాలించి
రేపటి తరానికి ఆన్లైన్ లో
బొమ్మలుగా కనిపించబోతున్నాయి!

You may also like

Leave a Comment