భానుడి ప్రతాపం రోజురోజుకీ పెరుగుతూ, ఎండలు చుర్రుమంటున్నాయి. ఎక్కండి! ఎక్కండి! ఎల్లిపోదాం అని కేకలేస్తూ ప్రయాణీకులను బస్సు లోపలికి కూరుతున్నాడు క్లీనర్ కన్నబాబు. ఈ మాటలు నువ్వు గంటసేపటి నుండీ చెపుతున్నావు తెలుసా! అసలు ఎక్కడికెళ్ళారయ్యా మీ డ్రైవరూ కండక్టరూ? అని తమ అసహనం ప్రదర్శించారు ప్రయాణీకులు.
బస్సుపైనా, లోపలా కూడా లగేజీతో నిండిపోయింది. వాటిల్లో మూటలు, కోళ్ళ గంపలున్నాయి. ఒక కుర్రాడైతే రెండు మేకల కాళ్ళకు బంధంవేసి, తాడును గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. బస్సులో సీట్ల కోసం ఆడంగుల తగాదా మొదలైయ్యింది. మగరాయుళ్ళు మటుకూ వేరుశనక్కాయలు తింటూ పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు. తిన్న వేరుశెనగ తొక్కలను బస్సు లోపలే వేస్తున్నారు.
ఎవరయ్యా! దారికడ్డంగా ఇలా చేపల బుట్టలను బస్సులో ఏసింది? మరి మీరు మేకలను, కోళ్ళను ఎక్కించలేదా? బస్సు నీ ఒక్కడిదే కాదు బాబూ మరి మన అందరిదీ! అంటూ చమత్కరించాడు చేపల చిన్నయ్య.
మీ మేకలు చూడవయ్యా, ఒంటేలు, రెండు చేసి ఎలా పాడుచేశాయో అని ఒకడంటే, నీ చేపల బుట్టల్లోంచి నీచువాసన నీళ్ళు ఎలా కారతన్నాయో చూడు! అంటూ వాగ్వాదానికి దిగారు. అయినా బస్సు మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు.
మొత్తానికి డ్రైవర్ వచ్చి డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు. ప్రయాణీకులందరీని ఒకసారి విమానం పైలట్‌లా చూసి, వెంటనే సిగరెట్ వెలిగించి, సినిమా పాటలు పెట్టాడు. ఇదుగో అందరూ టికెట్ సరిపడా డబ్బులు ఇచ్చి బేగా టికెట్ తీసుకోండి. టికెట్! టికెట్! అంటూ చిటికెలేస్తూ టికెట్లు కొడుతున్నాడు కండక్టర్.
ఇంతలో ఒక ప్యాసింజర్ బీడీ వెలిగించాడు. అసలే బస్సులో ఒకటే ఉక్కపోతగా ఉంది. దానికి తోడు ఈ సిగరెట్ల బీడీల పొగతోడైంద అని తిట్టేసరికి గబగబా మూడు దమ్ములులాగి బీడీని పడేశాడు అతను.
అప్పటికే కికిరిసిన బస్సులోకి స్కూలు పిల్లలూ, కూరగాయలవాళ్లు, చిన్నా చితకా వ్యాపారులు ఇంకా ఎక్కుతున్నారు.
అందుకే సత్తిరాజు ముందుగానే బస్సెక్కి హాయిగా పేపర్ చదువుకుంటున్నాడు. సత్తిరాజు ఆ చుట్టుప్రక్కల నాలుగు గ్రామాలకి ఒకే ఒక మెడికల్ స్పెషలిస్ట్, అదే ఆర్.యం.పి. డాక్టర్, వారాని ఒకసారి టౌనుకెళ్ళి ఒక సినిమా చూసి, పేషంట్లకి ఇవ్వవలసిన మందులు, ఇంజక్షన్లు కొని తెచ్చుకుంటాడు.
ఇదుగో డబ్బులు తీసుకో! టౌనుకి ఆరు టిక్కెట్లు ఇవ్వమన్నాడు ఓ ప్యాసింజర్. మరి ఆరుగురినీ చూపించమన్నాడు కండక్టర్. మేము ముగ్గురం మగ మనసులం. ఇంకా ముగ్గురు ఆడ టికెట్లు.ఇప్పుడే బాత్‌రూమ్‌కెళ్ళారని చెపుతుండగానే వాళ్ళు ముగ్గురూ పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కేశారు.
ఈ గందరగోళంలో, డాక్టర్‌గారూ ఒకసారి పేపరు ఇస్తారా! అని డాక్టర్ సత్తిరాజు చేతుల్లో నుండీ విసురుగా దినపత్రికను లాగేసుకున్నాడు వెనకసీటు స్కూలు మాస్టారు.
కండక్టర్ రైట్! రైట్! అని చెప్పటంతో బస్సుస్టార్ట్ అయ్యింది. బస్సు కదిలిందిగా! ఇక ఉక్కపోత ఉండదు, హాయిగా గాలేస్తోంది లే! అంటున్నారు ప్రయాణికులు. బస్సు ఒక ఫర్లాంగు దూరం వెళ్ళేలోపే బస్సులోకి నల్లని దట్టమైన పొగ కమ్ము కొచ్చింది. పొగతోపాటు కిరసనాయిల్ వాసనతో ప్రయాణీకులు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఇంజన్‌ని రైజ్ చేశాడు డ్రైవర్. అంతే! బస్సు ఆగిపోయింది.
తుమ్ముతున్నవాళ్ళు కొందరైతే, మరికొందరు వాంతులు కూడా బస్సులోనే చేసుకున్నారు. ఇదేం బస్సురా నాయనా! టాపునిండా చిల్లులే! ఇక కింద నుండి రోడ్డు కన్పిస్తోంది. ఇంజను సౌండూలో ఒకరి మాటలు ఇంకొకరికి వినిపించటంలేదు. కళ్లు మండటంతో ప్రయాణీకులు బస్సు దిగిపోతున్నారు.
డ్రైవరూ, క్లీనరూ కలసి ఏదో రిపేరింగు చేస్తున్నారు. స్టార్ట్ అవుతోంది, మళ్ళీ ఆగిపోతోంది. కానీ డాక్టర్ సత్తిరాజు, స్కూలు మాష్టర్ మటుకూ బస్సులోనే కూర్చుండిపోయారు. ఒకవేళ తాము కిందకు దిగితే మళ్ళీ సీటు దొరకదేమోనని.
డాక్టర్‌గారూ! ఈ పేపర్లో రాసిన దినఫలాలు నిజంగా జరుగుతాయంటారా? అని అదోలా అడిగాడు స్కూలు మాష్టారు. చూడండి మాష్టారు అది మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకీ దినఫలంలో మీకు ఏం రాసుందేమిటి? అని ఉత్కంఠగా అడిగాడు డాక్టర్ సత్తిరాజు. మీరు వస్తువులు కోల్పోతారు జాగ్రత్త! ప్రయాణాలలో అటంకాలు ఎదురౌతాయి అని రాసుంది. అయినా నా దగ్గరేముండిపోవటానికి? ఈ బ్యాగు ఒక్కటేగా? ఇది నా చేతిలోనే ఉంటుందిగా! అని చెప్పి కిందకి దిగాడు. కళ్లు మండటంతో సత్తిరాజు కూడా బస్సుదిగక తప్పలేదు.
దాదాపు రెండు గంటలు రిపేరింగు చేసినా బస్సు స్టార్ట్ అవలేదు. ప్రయాణీకులు కాస్తా, ఆందోళనకారులుగా మారిపోయారు. అసలు ఇలాంటి డొక్కు ప్రయివేటు బస్సుకి లైసెన్సు ఇచ్చిందెవరు? దీన్ని కాల్చిపారేయాలి అని రెచ్చిపోతున్నారు. దాన్ని మనం కాల్చక్కర్లేదు నాయనా! అదిగో పొగ ఇంకా ఎక్కువగా వస్తోందిగా! అదే కాలిపోతుందిలే! అని అంటూ డాక్టర్ సత్తిరాజు ఇంటికి తిరుగు ముఖం పెట్టాడు. అలాగే తిట్టుకుంటూ కండక్టర్ దగ్గర టికెట్ డబ్బులు తిరిగి తీసుకొని వెళ్ళిపోతున్నారు ప్యాసింజర్లు.
స్కూలు పిల్లలకి మాత్రం బస్సు ఇలా పాడైపోవటం ఆనందంగానే ఉంది. ఆడుతూ పాడుతూ ఇంటికెళ్ళిపోయారు. మాష్టారు స్కూలుకు ఆలస్యంగా చేరుకున్నాడు. మొఖానికి పట్టిన చెమట తుడుచుకుందామని తన చిన్న టర్కీటవల్‌ని బ్యాగ్‌లోంచి తీయబోయాడు. ‘‘అరే! ఆ టవల్‌ను బస్‌సీటుమీద వేసుకొని కూర్చున్నాను.’’ అది కాస్తా బస్సులోనే మర్చిపోయాను. అయితే పేపర్లో రాసిన దినఫలం రైట్! రైట్ అనుకున్నాడు.
‘‘కండక్టర్ రైట్! రైట్! అన్నా బస్సు మాత్రం అక్కడే ఉంది.’’