Home కవితలు లంబాడోళ్ళ పిల్ల

లంబాడోళ్ళ పిల్ల

పాండవులు వాళ్లే గాదు
మేమూ ఐదుగురమే !
వాళ్లు అరణ్యవాసం చేశారు
మేము సముద్రవాసం చేశాం

  • * * *

అప్సరస కావచ్చు
రాజహంస కావచ్చు
చీకట్లో చూడలేము
చూద్దామని
వేకువ కోసం
కాళ్లు ముందుకు వెళుతుంటే భూమి వెనక్కి వెళ్తుంది ఆకాశమంచును చూడటానికి అడవులు

దాటి పర్వతాలు దాటి మైదానాలు దాటితే
ఒక ఉదయాన మా ముందు
మిలమిల మెరిసే లంబాడోళ్ళ పిల్ల నృత్యం చేస్తున్నట్టు సముద్రం –
అల అలా ముసుగేస్తూ తీస్తూ ఎంత అందమో –

పిఠాపురం వెళితే పండు లాంటి సోమసుందర్ కనపడ్డట్టు
ఉప్పాడ వెళితే జాంపండు లాంటి సంద్రం పిల్ల కంటపడ్డది
‘ కెరట గమన ‘
సయ్యాటలాడుకుంటూ వస్తుంది
చెమ్మా చెక్కలాడుకుంటూ వయ్యారంగా పోతుంది
మేమంతా తన్మయత్వంలో పడి ఇసుకలో ఇటూఅటూతిరుగుతుంటే
ఆల్చిప్ప దొరికింది ఆ తీరాన
అది ఆ పిల్ల అద్దం బిళ్ళ అనుకొని అరచేతిలో వేసుకుని అందులో చూస్తే
గలగల నవ్వుతుంది గజ్జల గౌను తొడుక్కొని
చూస్తేనే తరిగిపోతుంటే
నవ్వితే కరిగిపోకుండా ఉంటామా !

ప్రేమకు పొద్దూ లేదు మాపూ లేదు తెల్లారిందో లేదో
భూమిని సూర్యుడు చూసినట్టు ప్రేమికులం మేం అదే పనిగా చూస్తుంటే
దేహమునిండా అద్దాలు తగిలించుకుని
పొర్లుతుంది నీటి పొర మీద నెలవంకలా –
రజిత పథకాల జిలుగు పైట మెరిసిపోతుంటే
అందాల ముద్దుగుమ్మ
పడుకునే పరవశించిపోతుంది
తళతళ మెరుస్తున్న అలల దారాలతో నేసినవే
ఉప్పాడ జరీ చీరలు
నీటి కాంతుల్తోనో చెక్కిళ్ల నునుపుల్తోనో
చీర మెరుపుల్తోనో
చేపల కన్నుల్తోనో
లంబాడ పిల్ల తళుక్ తళుక్ మంటున్నది
ఓరచూపు కిరణాల కాళ్లు విసురుతూ
కసితీరా వేళ్ళు
మా కళ్ళల్లో గుచ్చుతున్నాయి
ఒడ్డు మీద మోకాళ్ళ మీద కూర్చుని
మోహం తపస్సు చేస్తున్నాం
మేనక ముందు విశ్వామిత్రుడిలా –

తుంపరల్తో తనువును తనివితీరా సుతి మెత్తని చెక్కిలిగింతలుచేస్తుంటే
మతి గతితప్పి చెలించిపోతుంది
చేతులతో రారమ్మంటూ
పాదాలతో పోపొమ్మంటూ
ఆరామ్ చైర్ లో కూర్చుని హాయిగా ఊగుతుంది
ఉప్పాడ లంబాడోళ్ళ పిల్ల ఉద్వేగమైపోతుంది నిమిషనిమిషానికి –
దాని వాడి చూపులతో మేమంతా వేడెక్కిపోతున్నాం క్షణక్షణానికీ –

  • * * * *

పంచ పాండవులు వాళ్లే కాదు మేము ఐదుగురమే
వాళ్లు అరణ్యవాసం చేశారు
మేం సముద్రవాసం చేశాం
వాళ్లు ద్రౌపది కోసం మత్స్యయంత్రాన్ని కొట్టారు
మేం లంబాడోళ్ళ పిల్ల కోసం జల మంత్రాన్ని బట్టీ పట్టాం !!

( కె.శివారెడ్డిగారు , సుగమ్ బాబు గారు , ఆశారాజు గారు ,పెన్నా శివరామకృష్ణ గారు, నేను
ఒంగోలు కవిసమ్మేళనంలో పాల్గొనటానికి వెళ్లిన సందర్భంలో ఉప్పాడ బీచ్ సందర్శించిన సమయంలో రాసిన కవిత.

‘ పీఠభూమి’ పుస్తకంలో ప్రచురించబడిన
సౌజన్యంతో )

You may also like

Leave a Comment