Home వ్యాసాలు లేఖా సాహిత్యం- సాంస్కృతిక సాహిత్య ఉద్దీపకుడు కందుకూరి వీరేశలింగం పంతులు..

లేఖా సాహిత్యం- సాంస్కృతిక సాహిత్య ఉద్దీపకుడు కందుకూరి వీరేశలింగం పంతులు..

by Cheedella Seetha Lakshmi
నాటి కాలంలో ఉత్తరాలకు చాలా ప్రాధాన్యముండేది.భావాలను పంచుకోవడానికి చాలా ఉపయోగపడ్డాయి.సుఖదుఃఖాలు, సంతోషాలు ,అనుభూతులు ఎన్నో విషయాలను పంచుకోవడమే కాక దాచుకొని మళ్లీ మళ్లీ చూసుకొని మురిసిపోయేవారు.
ఎదలో దాచుకుని అనుభవించే ఉత్తరాలు సాంకేతిక ప్రభావం వల్ల కనుమరుగైనాయని చెప్పవచ్చు.
ఎన్నో సాహిత్యంశాలు,నాటి సంస్కృతి సంప్రదాయాలు,సామాజిక పరిస్థితులు కూడా లేఖల్లో ప్రస్ఫుటమౌతాయి.
కందుకూరి వీరేశలింగం పంతులు గారు  1848 సంవత్సరం 16 వ తేదీ ఏప్రిల్ నెల రాజమండ్రి లో సుబ్బారాయుడు పున్నమ్మ దంపతులకు జన్మించారు.భార్య రాజ్యలక్ష్మమ్మ.
రావుబహద్దూర్ అనే బిరుదముంది.ఎన్నో ప్రక్రియలలో రచనలు చేసిన పంతులు 1919 సంవత్సరం మే నెల 27 వ తేదీన తన 71 సంవత్సరాల వయసులో తనువు చాలించి మనకు ఎంతో జ్ఞాన సంపదను మిగిలించి వెళ్లారు.
కందుకూరి వీరేశలింగం గారు ప్రముఖ కవి,సాంఘీక సంస్కర్త,బాల్య వివాహాలను రూపుమాపి,వితంతు వివాహాలను ప్రోత్సహించి,స్త్రీ విద్యా వ్యాప్తికై పాటుపడిన సంఘ సంస్కర్త.
సాహిత్యంలో  ఈయన చేపట్టని ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు సాహిత్యంలో
నవల,కథ,స్వీయ చరిత్ర,  జీవిత చరిత్ర,ప్రహసనాలు,
నాటకాలు,
ఖండకావ్యాలు మొదలైన  వివిధ ప్రక్రియలే కాక అనువాద ప్రక్రియను కూడా చేపట్టి తనదంటూ  ఒక ప్రత్యేక బాటను ఏర్పరచి  అందరికీ మార్గదర్శకుడై
యుగపురుషుడుగా,
శతాధిక గ్రంథకర్తగా కీర్తింపబడిన మహోన్నత వ్యక్తి.
వీరేశలింగం గారు సాహిత్య విషయపరంగా గానీ,సంఘ సంస్కార విషయపరంగా గానీ చేసిన అవిరళ కృషి.,కష్టనష్టాలు ఆయన తన సమకాలికులకు రాసిన లేఖల ద్వారా  తెలుసుకోవచ్చు.
    రాయసం వేంకట శివుడు గారికి రాసిన లేఖ ద్వారా స్నేహితులు పట్టుబట్టుట చేత  “సంఘ సంస్కరణ మహాధ్యక్ష పదవి” ని అలంకరించినట్లు తెలుస్తుంది.వీరేశలింగం గారి జీవితచరిత్రను గ్రంథరూపములో ప్రచురిస్తారని”సంఘ సంస్కారిణి” పత్రికలో  ప్రకటించినట్లు కూడా ఈ లేఖలో రాశారు. ఆయనకే రాసిన వేరొక లేఖలో వితంతు శరణాలయం గురించి తెలుపబడింది. ” నాకు గల స్వల్పధనము నేనిచ్చట వితంతు శరణాలయమునకై వెచ్చించుచుంటినని  మీకు బహుశ తెలిసియే యుండును. నెలకు 15 రూపాయలు అద్దె వచ్చు గృహమును నేను వితంతు శరణాలయమునకు ఇచ్చినాను.ఈ యద్దె వలన వచ్చు రాబడి శరణాలయమందలి  బాలికలపై  వెచ్చింపబడుచున్నది.
ఈ  బాలికలిప్పుడు  నా గృహముననే యున్నారు.ఇప్పటి ఏర్పాటును బట్టి ఇది నాకును వారికిని గూడా  సదుపాయముగ లేదు.
అందువలన పక్క వీధిలో
ఆర్ద యకరము స్థలమును అందులో వితంతు శరణాలయమును గట్టించుటకై  నేను కొని ఆ స్థలమునకు నాలుగు వైపుల ఇటుకతో ప్రహరీగోడల
బెట్టించితిని.
వితంతువులచ్చట నివాసముగా నుండుటకై ఈ క్రొత్తగా కొన్న స్థలములో  వంటగదులను కొన్నింటిని గట్టించినాను.దీనికొఱకై
ఇప్పటివరకు నేను రూ.2000/- వ్యయపరిచినాను.మరియొక 2000/- రూపాయలు వెచ్చించి
మధ్యమ హాలు కట్టించవలెనని యున్నది.చెన్నపురికి నేనొసంగు కానుకలలో బహుశ ఇది కడపటిది కావొచ్చును. ఇందుకై నేను రూ.400/- ఋణము చేసినాను. పని చేయుచున్న కూలివాండ్రు ఏ దినము కూలీ దినమే అడుగుచున్నారు.సంవత్సరం తరువాత సంవత్సరం నా ఆరోగ్యం పాడై పోవుచున్నది.రాబోవు ఏప్రిల్ నుండి నేను ఉద్యోగము నుండి విరమింప అభిలాషించు
చున్నాను.పరిపూర్ణ దయాద్వారూపుడగు
సర్వేశ్వరుడు నాకాయుర్దాయము నారోగ్యము ననుగ్రహించిన యెడల
నేనుద్యోగము  నుండి విరమించిన తరువాత నా దేశమునకు గొంత సేవ  జేయకలుగుదునని
యాశించుచున్నాను.  వీరేశలింగం గారి సంఘ
సంస్కరణాభిలాష వితంతువుల కోసం ఆయన పడే పాట్లు,నిస్వార్థంగా,
ధారాళంగా వితంతు శరణాలయం కోసం ఖర్చు పెట్టడం,ఉద్యోగ విరమణ తర్వాత కూడా దేశసేవ చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయడం,పరోపకారేచ్ఛ
హృదయంలో అణువణువునా దేశసేవ,సంఘసేవా తత్పరతే ప్రధాన ధ్యేయంగా కలిగిన గొప్ప మానవతావాదిగా  గోచరిస్తారు.
         ఇదే లేఖలో” కృష్ణామండల సాంఘీక సభాధ్యక్ష పదవిని  ఉపన్యాసమివ్వక్కరాలేదనే షరతు మీద అంగీకరించినప్పటికీ సమావేశమైన ప్రజల ఉత్సాహానికి అనుగుణంగా తప్పనిసరిగా ఉపన్యాసమివ్వ
వలిసి వచ్చిందన్నారు. ఇలా వీరేశలింగం గారి పట్ల ప్రజలకున్న అభిమానం వ్యక్తమౌతుంది.  రాయసం వెంకట శివుడు గారికి  రాసిన ఇంకో లేఖలో…
“సహాయకుల కొరతయే నన్ను బాధించుచున్నది.నా తదనంతరం వితంతు శరణాలయమెట్లు జరుగునో” అను విచారాన్ని వ్యక్తం చేశారు కందుకూరి. స్త్రీలకు ఉపయోగపడు పుస్తకాలను, మత గ్రంథములను రాయుటకు సంకల్పించడం,స్త్రీ ప్రార్థనా సమాజం బాగా పని చేస్తోందని తెలపడం,స్త్రీ పునర్వివాహ పట్టికను రాసి పంపడం,
భార్యాభర్తలిద్దరూ వితంతు  శరణాలయం
కోసం సేవచేయడమే కాక వితంతువులను పోషించడానికి తగినంత సొమ్ము లేదనే బాధ వ్యక్తం చేశారు. “పర రంధ్రాన్వేషణ సులభకార్యము.గొప్ప ధర్మ సంస్థలు జరుపువారి కష్టములు
కార్య సాధకులకే ఎరుకపడగలవు. దైవ సహాయము నా విద్యుక్తముల నేను నెరవేర్చ ప్రయత్నింతును. ఈశ్వరుడు తోడ్పడక మానడు. చందాలు పోగుచేయుటకు నేను పర్యటనము చేయవలయును ఇతరులను  తప్పు పట్టడం సులభం.సంస్థ నడపడంలో కష్టము నడిపేవారికే తెలుస్తుంది”  అని ధర్మసంస్థలు నడపడంలో గల సాధకబాధకాలను తెలియచేశారు. స్త్రీ సంస్కరణాభిలాష ఎంత  గాఢంగా వుందో
లేఖల ద్వారా విదితమవుతుంది. బాలికల కోసం తను స్థాపించిన పాఠశాల్లో బాలికలు ఎక్కువ శాతం ఉత్తీర్ణులయినందుకు
ఆనందాన్ని వ్యక్తం చేశారు” అని  కందుకూరి వెంకటరత్నం గారికి  రాసిన లేఖలో పేర్కొన్నారు.
కందుకూరిలో సంఘసేవ,దేశసేవాకాంక్ష ఎంత గాఢంగా ఉందొ దైవభక్తి,ఈశ్వరినిపట్ల విశ్వాసం కూడా అంత తీవ్రంగా ఉందని ఉత్తరాలే నిరూపిస్తాయి.”
 పరిపూర్ణ దయాస్వరూపుడగు సర్వేశ్వరుడు నాకాయుర్దాయము నారోగ్యముననుగ్రహించు” ననీ ఆయన తదనంతరం వితంతశరణాలయం ఎట్లా జరుగుతుందనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ” అన్నిటి యందును దైవ సహాయమునే నేనాశించుచున్నా” నని,చిరాయువొసంగినందు కీశ్వరునికి కృతజ్ఞతలు” తెలిపాడు.మూడువారాల నుండి కురుపుతో బాధపడుతున్న సమయంలో కురుపు తగ్గితే దైవానుగ్రహం వలన ఆ కురుపు పూర్తిగా నిమ్మళించినది,ఈ కష్టమునోర్చుకొనుటకు దేవుడు నాకు దగిన బలమునొసగి నన్నన్నివిధముల సంరక్షించుచున్నాడని,దైవ సహాయమున నా విద్యుక్తముల నేను నెరవేర్చ ప్రయత్నింతునని,అవసర సమయములందు స్వార్థ పరాయణులైన మిత్రులు నన్ను వీడవచ్చును,కాని సర్వేశ్వరుడు నన్ను వీడడనే నా నమ్మకము” అని నా వృద్ధాప్యములో యిప్పటి నా అసహాయస్థితిలో సర్వేశ్వరుడు నాకు శాంతి నొసంగియున్నాడు.నేనెప్పుడును ఈశ్వరునిపై ఆధారపడియున్నాను.ఈశ్వరపాలితమైన ఈ ప్రపంచమున సత్యమే జయించి తీరును.మన యుద్యమము ధర్మము పైనను సత్యముపైనను ఆధారపడి యున్నది” అంటూనే ఎవరేమన్న లెక్కచేయక మన విద్యుక్తధర్మాన్ని నిర్వహిస్తే అంతా దేవుడే చూసుకుంటాడనే మనస్తత్వం కలవాడు.వ్రాతలను లెక్కచేయడం తెలివితక్కువ.కుక్కలు మనలను చూచి మొరిగితే మొరగనీయండి,మన జీవితాంతం వరకు భూషణ దూషణములు పరిగణించక మన విద్యుక్త ధర్మాన్ని చేద్దామని,కష్టపడి పనిచేస్తే తప్పక ఫలితముంటుందని  సర్వేశ్వరుడే మంచి చెడ్డలు నిర్ణయించగలడనే అభిప్రాయం  తెలుస్తుంది.సర్వేశ్వరుడు నిస్శంశయంగా సహాయం చేస్తాడనడానికి నిదర్శనంగా తన జీవితంలో కూడా ఒక విచిత్ర సంఘటన జరిగింది. వీరేశలింగం గారు స్వీయచరిత్ర రాస్తున్న సమయంలో తనకు బలహీనంగా వుండడం వల్ల బలమిచ్చే ఔషధం కొరకు కలకత్తాకు రాసి మందు తెప్పించుకున్నారు.పెట్టె తెరచి మందు ప్రారంభిద్దామనుకొని సీసా మూత తీయడానికి ప్రయత్నం చేయగా ఆ సీసామూత గట్టిగా బిగించి వుండడం వల్ల తెరవలేక పోయారు.మూత తీయడానికి తగిన సాధనం నొకదాన్ని కొనడానికి సాయంత్రం బజారుకెళ్లాలని ఆలోచిస్తున్న సమయంలో,ఉదయం బల్ల దగ్గర కూర్చుని గ్రంథం వ్రాస్తున్న బల్ల దగ్గరే ఆకస్మికంగా ఒక ధ్వని విని పై నుండి యేదో పడిందనుకున్నాడు.ఎవరో రాయి విసిరితే యే పెంకుముక్కో బట్టలో పడిందనుకుని పైకి చూస్తే విశేషం ఏమీ లేదు.తన బట్ట తఫుముకుని చూస్తే అందులో ఒక కార్క్ వుండడం చూసి ఆశ్చర్యపోయాడు.కిటికీలో ఉన్న సేసాను చూస్తే సీసామూత తెరవబడి ఉంది.ఇది దైవ సంఘటనగా భావించారు.
    ఈ విధంగా దైవంపట్ల దృఢమైన నమ్మకానికిది నిదర్శనం.స్వార్థపరులు,మిత్రులు కూడా వదలిపోవచ్చు కానీ దైవం మాత్రం తననెప్పుడు వీడదనే అచంచల విశ్వాసమున్నవారు.అనేక ఉత్తరాల్లో దైవాన్ని స్మరించడం కనిపిస్తుంది.వీరేశలింగం గారి చిత్తశుద్ధి,సత్యాన్వేషణ,కార్య దీక్ష లేఖల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
   సాహిత్య విషయంగా ఈయన చేసిన కృషి అనన్యసామాన్యమని, వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి లేఖలు దోహదం చేస్తాయి.
   1870 సంవత్సరం ఆగస్టు నెల ‘ గోదావరీ విద్యా ప్రబోధికా’ పత్రిక యందు సంధి విషయమై పంతులుగారు ప్రచురించిన అంశాలు అసంగతులుగా తమకు తోచినవని,గుంటూరు గవర్నమెంటు ఆంగ్ల వర్ణాక్యులర్ స్కూల్ సహాయోపాధ్యాయులు.ఎ.వేంకట రంగాచార్యులు నవంబర్ నెల పత్రికలో ప్రకటించారు.దానిపై పంతులుగారు సమాధానాన్ని’ పురుషార్థ ప్రదాయిని’ పత్రికలో లేఖా ముఖంగా వెల్లడించారు.ఈ లేఖలో పంతులుగారు ఎందుకు సమాధానామీయవలసి వచ్చిందో చెప్పుకుంటూ” ఆ వ్రాసిన వ్రాత వరుసను బట్టి చూడగా నవి యొకమూల బారవైచి యూరకుండుటయే తగిన తిరస్కృతి యని పండితులొకవేళ భావించినను సామాన్యముగా బామరుజనులాయన మాటలను బాటుగ గట్టి నే జెప్పినవి తప్పులనుకొందురేమోయని యెంచి ప్రత్యుత్తరమివ్వవలసి వచ్చెను” అని వ్రాసారు.తన గురించి ఎవరేమైనా అనుకోనీయండని అనుకునే స్వభావం కాదని తెలుస్తుంది.పండితులైనా సరే మిడిమిడి జ్ఞానం వున్నవారెవ్వరైనాసరే సమాధానమియ్యవలసిందే.ఎందుకంటే సమాధానమీయకపోతే పామరజనులు తాను చెప్పే అంశంలో నిజంగా తప్పులున్నాయేమో
నని అనుకునే ప్రమాదముంది. వీరేశలింగం మనస్తత్వం స్పష్టమౌతుంది ఈ లేఖలో. సంధి విషయంలో తను చెప్పిన అంశాలు సరియైనవేనని, పూర్వలాక్షణికులు: అప్పకవి,అభినవ దండి ,అధర్వణాచార్యుల లక్షణ గ్రంథాల్లోని సంధి సూత్రాలను పేర్కొంటూ వివరంగా,సలక్ష్యంగా,విపులంగా చర్చించి సమాధానమిచ్చారు.కావ్య ప్రయోగాలను కూడా చూపించడం జరిగింది.
  ఒకనికి దారి జూపబోయి తానే దారి తప్పినట్లు తప్పులు పట్టేవారికి సైతం తప్పు గలిగెను గదా అని తప్పు పట్టడంలో గూడా ఒక అర్థముండాలని” ఇక ముందైన తప్పులు పట్టుటయందు గొంచెము జాగ్రత్తగా నుందురని” వేడుకోలుగా మందలిస్తూ హెచ్చరించారు.తనపై అకారణంగా విమర్శ వస్తే భరించలేని స్వభావం కలవాడిగా,వెంటనే ప్రతి సమాధానం పంపించేదాకా ఆయనకు తృప్తి వుండదని తెలుస్తుంది.
   ఎవరైనా తప్పు చెపితే యే విధంగా విమర్శించేవారో తనది తప్పని తెలిస్తే నిరభ్యంతరంగా ఒప్పుకునే స్వభావం కూడా కలవాడని ‘పురుషార్థ ప్రదాయిని’పత్రికాధిపతికి వ్రాసిన లేఖ ద్వారా తెలుసుకోవచ్చు.సంధి విషయంలోనే వేంకటాచార్యుల గారిని ” భ్రమ ప్రమాదాదులు మనుజ ధర్మములగుటంజేసీ యొకవేళ యొత్తి వ్రాయునపుడు నేనే యట్లు వ్రాసియుండవచ్చును” అని వేడుకుంటూ “నిర్మల దేహమును వదలి వ్రణములకే పరుగులెత్తు మక్షికముల వలె గాక నీరు విడిచి పాలుగొను హంసలంబోలుట పండితులకు సహజము గాన నా తప్పులు మన్నించి యొప్పుల గ్రహింతురని నమ్మెద” నంటారు.పొరబాట్లు జరగడం సహజం.కానీ సమాజంలో చాలామంది తప్పున్నా కూడా ఒప్పుకోరు.కానీ వీరేశలింగం గారి వ్యక్తిత్వం తిరిగి పత్రికాముఖంగానే సమాధానాన్ని ప్రచురించడం ద్వారా హృదయ వైశాల్యాన్ని,నిర్మల హృదయాన్ని అర్థం చేసుకోవచ్చు.
    ‘ఆముద్రితగ్రంథ చింతామణి’ పత్రికాధిపతి పూండ్ల రామకృష్ణయ్య గారికి  వ్రాసిన లేఖ కందుకూరి సంస్కారానికి ప్రతీక.శకుంతల నాటక భాషాంతరీకరణకు సంబంధించిన విషయాన్ని తెలుపుతూ నాకు తప్పులు లేవను వారు చేసెడి యాక్షేపణలు సయుక్తికములైనచో వందన పూర్వకముగా నందుకొని యింకొక కూర్పునందు సాధ్యమైనచో సంస్కరించుకొనియెదను.యీర్ష్యా ప్రధానములై దూషణముల నిండియున్నచో దిరస్కార భావముననుపేక్షించెదను” అని నిర్మొహమాటంగా వ్రాసారు.
   ఆకాలంలో కూడా పేర్లుమార్చి రాసేవారని,అటువంటి వారిని కనుగొని వారికి తగిన సమాధానం ఇచ్చిన పద్ధతి పూండ్ల కృష్ణయ్య గారికి వ్రాసిన లేఖలో తెల్పబడింది.శకుంతలా నాటకానువాదంలోని పద్యాల విమర్శ ‘ సూర్యాలోక’ మనే పత్రికలో చూసి వెంటనే ప్రత్యుత్తరాన్ని ఆ పత్రికకే రాయక పూండ్ల కృష్ణయ్యకు రాసినట్లు తెలిపారు.అందులో పత్రిక చదవగానే ” నామములు మార్చుకొన్నను వానినన్నింటిని వ్రాసిన వారొక్కరేయనియు,వారిట్టివారనియు,వారు వ్రాసిన యుద్దేశమిట్టిదనియు నాయూహకు దగిలినది,అందుచేత నేను బదులు వ్రాసి తగవులాడుచుండుట యుచితముగాదని” అంటూనే “వారితో సమానుండను గాకపోయినను తప్పులు పట్టుటలోను,పరిహసించుటలోను నాకును గొంత సామర్థ్యము కలదు” పూర్వం లాగా నేను లేను,మారిపోయానని చెప్పి “అట్టి పాడు పనికి బూనుట నా కనర్హమైన పనియని వారిని సవినయులుగా జేయుట కీశ్వరుం బ్రార్థించెద” అంటూ సునిశితంగా రాసాడు.ఆయన స్నేహితులకు రాసిన లేఖల్లో ఆరోగ్య విషయాలు,భార్య మరణం మొదలైన ఎన్నో వ్యక్తిగత విషయాలు తెలుస్తాయి.
‘రాయసం వేంకటశివుడు’ గారికి రాసిన లేఖలో పలువురి కోరిక మేరకు తన స్వీయచరిత్రమును వ్రాస్తున్నట్లుగా,తన  దినచర్యపుస్తకాలు దగ్గరుంచుకోలేదని తెలిపారు.తన ‘జనానా’పత్రికను తన ముద్రణాలయంలో అచ్చువేస్తున్నట్లు,మీరు సారస్వత పత్రిక నెలకొల్పాలన్న సంకల్పం యోగ్యమైనదేనంటూ” అనేక విషయాలను గురించి స్వతంత్రములు,ఉపయుక్తములగు వ్యాసము ప్రచురించి ప్రాచుర్యముననున్న పత్రికలను మించవలెనని” సూచనలిచ్చి  ‘చింతామణి’ అని పేరు పెట్టాలని సూచించారు.వ్యాసాలు ఉద్బోధకములు,జనరంజకముగా ఉండాలని సూచిస్తూ తన అప్పులన్ని తీర్చివేసి ” ఆంధ్ర వాఙ్మయాభివృద్ధికి తోడ్పడాలనే ఆకాంక్షను,ఆశయాన్ని వెలిబుచ్చుట ద్వారా ఆంధ్ర సాహిత్యాభివృద్ధి కోసం వీరేశలింగంగారి తపన తెలుస్తుంది.’ కాళ్లకూరి నరసింహము’ గారికి వ్రాసిన లేఖలో స్త్రీలకుపయోగించు పుస్తకములు,మతపుస్తకములు వ్రాయదలచానని చెప్తూనే ” ఇక నా జీవిత శేషమును సాధ్యమైన యెడల పుస్తకములు వ్రాయుటలోనే గడుపవలెనని యున్నది”అంటూ తన దృక్పథాన్ని తేటతెల్లం చేశారు.
వీరేశలింగం గారు తాను రచించిన కవుల చరిత్ర పునరుద్ధరణ విషయంలో వంగూరి సుబ్బారావు గారి సహాయాన్ని   అర్థించినట్లు సుబ్బారావు గారికి రాసిన లేఖల వల్ల తెలుస్తుంది. “నా కవుల చరిత్రమును
సంస్కరించుటలో మీరు  చేయు వాగ్దానము,చేసిన తోడ్పాటుకును మిగుల కృతజ్ఞుడై ఉన్నాను. నేను వృద్ధుడను వ్యాధి బాధితుడను దుర్బలుడై యున్నాను.
ఇక  దీర్ఘ కాలము బతుకబోను. కాబట్టి శీఘ్రకాలంలోనే నా కవుల చరిత్రమును సరిచేసి పునర్ముద్రణము చేయింప నిశ్చయించుకున్నాను”.అని రాయడం వలన  వృద్ధుడు వ్యాధిగ్రస్తుడు
అయినప్పటికి  కవుల చరిత్ర పునర్ముద్రణ
విషయంలో   కందుకూరి కి గల శ్రద్ధ వ్యక్తమౌతుంది. నిరంతర కృషి  కొనసాగించాడని తెలుస్తుంది.
  కవుల చరిత్రలోని గ్రంథాలను ఏ వ్
భాగంలో చేర్చాలో మార్పుచేర్పులను సరిగ్గా తెలిపి ‘గురుతు పెట్టగలరని’ రాశారు.ప్రథమ భాగంలో చేర్చాల్సిన కవులను  రాసి పంపమనియు, సత్యం తెలుసుకోవడమంటే
ఇష్టమని తప్పులు శత్రువులు  చూపిననూ
కృతజ్ఞతతో  అంగీకరిస్తానని, ఒప్పులు చూపేవారికంటే   తప్పులు చూపేవారే అధికమిత్రులని చెబుతూ కవుల చరిత్రము లోని ప్రమాదములను మీరు
పుస్తకములో వ్రాసి కొన్నట్లు రమణారావు పంతులు చెప్పారని  రాస్తూ నా తప్పులను
దిద్దుకునే అవకాశం  కలుగుతుందని వంగూరి సుబ్బారావు గారికి  రాశారు. కవుల చరిత్ర విషయంలో  వీరేశలింగం గారి కృషి,ఎంత శ్రమ పడ్డారో,మొదలగు విషయాలు కళ్ళకు కట్టినట్లు వంగూరి సుబ్బారావు గారికి రాసిన లేఖ వలన తెలుస్తుంది.
1.పండిత సుబ్బరాయశాస్త్రి ఎవరు?
2.సత్యాశ్రయుని శాసనములో నున్న పద్యమేది?
3.నన్నెచోడుడు కానీ
యధర్వణుడు  గానీ
నన్నయ్య కు పూర్వులు కారని నేను
తలచెదను.
4.చిక్కరాజు మొదలైన వారిని గూర్చి ఏ లక్షణ గ్రంథములలో నేమేమి
వ్రాయబడినదో తెలుపుడు.
5.ఫణిభట్టు కాలమును నిర్ణయించుటకాధారము లేమియున్నవి?
నన్నయ తిక్కనలను మాత్రం స్తుతించుట కాల నిర్ణయమునకు చాలదు.రామకృష్ణ కవిగారు ప్రచురించిన
“పరతత్వ రసాయనము నా  యొద్ద లేదు. మీ యొద్ద నున్న నొక్కసారి బంపుడు” అని మద్రాసులో ఉన్న ప్రాచ్య లిఖిత
 బాండాగారానికి వంగూరి సుబ్బారావు గారికి వేరొక జాబులో రాస్తూ ‘నిస్సంక కొమ్మన
దగ్గుపల్లి దుగ్గయ్య పుస్తకాలను. చూడొచ్చు.అల్లసాని పెద్దన గూర్చి నూతన వివరాలను తెలిసికోవచ్చునని, వేరొక లేఖలో ప్రభాకరశాస్త్రి గారును,మానవల్లి రామకృష్ణయ్య గారును,నాకింకను ఏమీ సహాయము చెయలేదని,
చేస్తారో చేయరో తెలియదని  చేయకపోయినను పుస్తకాన్ని సవరించి ముద్రిస్తానని రాస్తూనే
కవుల చరిత్ర విషయంలో  ఎప్పటికప్పుడు సమాచారాన్ని,సమస్యలను రాసేవారు. కాల నిర్ణయ  విషయంలో
తన ఉద్దేశ్యాన్ని తెలుపుతూ లేఖలు రాశారు.
కవి నిర్ణయం చేసే ముందు,కాల నిర్ణయం చేసేముందు తన అభిప్రాయాన్ని తెలుపుతూనే
సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఎంతో శ్రమకోర్చి 684 పుటల కవుల చరిత్ర గ్రంథాన్ని ముద్రించి వంగూరి సుబ్బారావు గారికి,పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారికి,కూచి నరసింహం గారికి
పంపించి వారికందరికి “లేఖలను రాసిన వారికెల్లరకును నా పుస్తకములోని గుణములను    శ్లాఘింపవలసిన పని లేదని నేను దిద్దుకోనుటకవకాశము
కలుగుటకయి దోషములను మాత్రమే చూపవలసినదియు,వ్రాసియుంటిని”అని రాస్తూనే మీరు కూడదోషములను చూపాలని సుబ్బారావు గారికి రాయడం వలన వీరేశలింగం గారి హృదయం అవగతమౌతుంది. పది మంది చేత పొగిడించుకోవాలని కాక విమర్శనాత్మక దృష్టితో గ్రంథాన్ని చదవాలన్న సూచన చేసినట్లు తెలుస్తోంది. విమర్శనాత్మక  దృష్టితో
చదివి విమర్శించినప్పుడే
పొరబాట్లను దిద్దుకునే
అవకాశం కలుగుతుంది.నిర్మొహమాట వ్యక్తిత్వం,పొగడ్తలకు తలవంచే మనస్తత్వం కందుకూరిది కాదని తెలుస్తుంది.
    వీరేశలింగం గారు మిత్రులకు,సమకాలికులకు రాసిన లేఖల వల్ల ఆయన వ్యక్తిత్వం,సంఘ సంస్కరణాభిలాష,కృషి,పట్టుదల,స్వీయచరిత్ర రచన,కవులచరిత్ర పునర్ముద్రణ విషయంలో పడ్డ కష్టాలు,సర్వేశ్వరుని పట్ల అచంచల విశ్వాసం,మిత్రులతో ఉన్న సంబంధ బాంధవ్యాలు,సలహాలు,సూచనలు, ఆయన ఉపన్యాసాల పట్ల ప్రజలకుండే ఆసక్తి,నాటి భాష మొదలైన విషయాలు లేఖల వల్ల తెలుసుకోవచ్చును.
———————–
*డా.చీదెళ్ళ సీతాలక్ష్మి*
విశ్రాంత సహయాచార్యులు
హస్తినాపురం
హైదరాబాద్
చరవాణి :9490367383

You may also like

Leave a Comment