వేదాలు గద్దించాయి
ఇతిహాసాలు ప్రశాంతంగా చెప్పాయి
పురాణాలు ప్రవచించాయి
గ్రంథాలు ఘోషించాయి
వనాలు
మన ప్రాణాలని
శాస్త్రం చెప్పింది
సామాన్యుడూ చెప్పాడు
ప్రకృతి ప్రకోపాలకు
విరుగుడు అడవులేనని
విద్యాభ్యాసంనుండి
వానప్రస్థం వరకు
పశుపాలననుండి
పరిపాలన వరకు
సంస్కృతి చెప్పింది
సాంప్రదాయం నిలబెట్టింది
ప్రజాస్వామ్యంలో
ప్రజాపాలనలో
మాటలు కోటలు దాటుతున్నాయి
చేతలు శాసనాలకే పరిమితమౌతున్నాయి
హరితహారమంటారు
హడావిడి చేసేస్తుంటారు
వేలకోట్ల వాయినాలిస్తారు
వనాలశాతం పెరగలేదంటారు
భూపందేరానికి
భూకామందులమంటారు భూకామాంధులైపోతుంటారు
పచ్చని అడవుల్లో
పశుపక్ష్యాదులు లేవంటారు
బుల్డోజర్లతో
భస్మీపటలం చేస్తుంటారు
అరణ్యాలు
ఆరోగ్య ప్రదాయిణులు
పెరగనివ్వండి
ప్రభుత్వస్థలాలంటూ
ప్రేలాపనలు మానండి
జీవవైవిధ్యాన్ని
అవనిపై మననీయండి
వన ప్రాశస్త్యాన్ని గుర్తించండి
ఘన వారసత్వాన్ని నిలబెట్టండి