Home కథలు విజేత

విజేత

Ilustration by Ahobhilam Prabhakar (9490868288)
  ” ఆశలు, లక్ష్యాలు ఎక్కువై,  అవి సాధ్యం కాక పోతే నిరాశ..దుఃఖం.. !   ఏమీ  సాధించలేక పోతిననే నైరాశ్యం నుండి ఆత్మ న్యూనతా భావం,!కోపం చిరాకు విసుగు , విరక్తి  కలుగుతుంది. . దాంతో  సాధించిన విజయాలను మరిచిపోతం. వాటిని చిన్న చూపు చూస్తం. .  దొరికినదాన్ని గౌరవించాలి. ఆ విజయాలను చూసి , గుర్తు చేసుకొని మనకు మనం సంతోషించాలి. నిరాశకు గురి చేసే వైఫల్యాలు,  ఆశలు ఆశయాలు , లక్ష్యాలను తగ్గించుకోవాలె. పరిస్థితులతోపాటు  , పదిమంది కలిసి సహకరిస్తే  గాని సాధ్యమయ్యే వాటిని నీవో నేనో ఒక్కల్లమే సాధించాలనుకుంటే  సాధ్యం అవుతయా? మనను ఎవడో నమ్మించి మోసం చేస్తే జీవితంలో కోలుకోలేని దెబ్బ. దాంతో జీవిత గమనమే మారి పోతుంది. ాదకులకు
అయినా తప్పు మనదే అని జీవితమంతా కుంగి పోవడంలో అర్థం లేదు.  మనం మోసపోయింది ఆశ వల్లనే కదా! . దుకఃఖానికి  మూలం ఆశలు, కోరికలే అన్నడు బుద్దుడు. నీ  నిరాశకు మూలం అత్యాశలే.  ” అన్నాడు సిధ్దార్థ.
            ”  డాక్టర్ కావాలనుకోవడం , డీలర్ షిప్ , తీసుకోవాలనుకోవడం , కాంట్రాక్టులు చేయాలనుకోవడం కోవడం అత్యాశా ? ” ఖంగున ఎదురు తిరిగాడు సూర్యం.
           ” అంత కోపం అక్కర లేదు సూర్యం.  డాక్టర్ కావాలనుకున్నది , కాంట్రాక్టులు చేయాలనుకున్నది, డీలర్ షిప్ తీసుకోవాలనుకున్నది నీ కోసమా. ప్రజలకు సేవ చేయడం కోసమా? సంపాదించడం కోసమా? కేవలం సోషల్ స్టేటస్ కోసమా.? సూటిగా చెప్పు”
 సూర్యానికి మరింత మండుకొచ్చింది.  సూటిగా కత్తితో పొడిచినట్టుందా ప్రశ్న. అందరిలో గొప్పగా ఉంటుందని, కాస్త సంపాదించుకోవచ్చనే అస్పష్ట భావమే ఆ కోరికలకు  మూలం. మరీ అంత సూటిగా అడిగే సరికి తట్టు కోలేక పోయాడు సూర్యం.
              ” ఇంత కాలం నుంచి నన్ను అర్థం చేసుకున్నది  ఇదేనా ? ఇంతేనా? ”  అంటూ అంతెత్తున ఎగిరాడు సూర్యం.
          సూర్యం ఆవేదన, ఆవేశం తగ్గే దాక  సిద్దార్థ అతన్నే చూస్తూ ఉండి పోయాడు. పక్కనున్న రేకుల షెడ్డు మీద డబ డబ వర్షం అకస్మాత్తుగ పడ్డట్టుంది.  పందిరికి పాకిన మల్లె తీగ అటూ ఇటూ ఊగుతూ కమ్మని సువాసన పంచుతోంది.
        ” హేమలత ఆలోచనలో తప్పు లేదు. అది ఆడవాల్లకుండే సహజమైన కోరిక. పైగా వాల్ల నాన్నకు హోల్ సేల్ బట్టల దుకాణం ఉండె. లారీలకొద్ది బట్టల గోదాములు . ఎందరో గుమస్తాలు  వచ్చిపోయే దుకాణాదారులు. సంపన్నకుటుంబంలో  పెరిగింది హేమలత.   మీ కష్టాలకు కారణం మోసపోవడం. మోసం చేసినోన్ని వదిలి ఆ కోపం బాధ ఆమె మీద చూపిస్తే ఏం ఉపయోగం? మాటలు పెంచుకోవడం తప్ప?”
            సూర్యం ముఖం ఎర్ర వడ్డది. . కాళ్లు చేతులు శరీరం ఆవేశంతో వణుకుతున్నాయి. గుండె పోటు హెచ్చినట్టు ఎగపోస్తున్నాడు .  సూర్యాన్ని ఏమనకుండా అలాగే చూస్తుండి పోయాడు సిద్దార్థ.
        ఎవరో వేడి వేడి  స్నాక్స్ చాయ్ టీ పాయ్ మీద పెట్టి వెళ్లి పోయారు. వర్షం చినుకులు, చల్లగాలికి  మల్లెల సువాసనకు వేడి వేడి పాప్ కార్న్ చాయ్ ఎంతో ఆహ్లాదం కలిగిస్తోంది.  సిద్దార్థ చాయ్ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాడు.  సూర్యం చేతిలోని కప్పు వణుకుతోంది. సూర్యం ఆవేశం శరీరం నిండా  పాకింది.  నవ్వితే బాగుండదని వేడి చాయ్ లో మల్లెల సువాసన .అంటూ మాట మార్చి నవ్వించే ప్రయత్నం చేశాడు సిద్దార్థ.
        ” అవును . చాలా బాగుంది ఈ మల్లెలు చాలా స్పెషల్  హేమలత సెలక్షన్.. “
         ” అకాల వర్షంలో మనం అడగక ముందే స్నాక్స్ చాయ్ పంపించడం బాగుంది కదా! “
          ” అవును “
            “ఆశించకుండా అందితే ఎంత ఆనందమో..,! “
            ” ఆశించి అరగంట దాకా రాకపోతే ఎంత కోపం చిరాకు కలుగుతుందో! అపుడు చాయ్ మాధుర్యాన్ని కూడా మరిచి పోతం.. “
            ” నిజమే. “
             ” ఆశించింది అందక పోయినా ఆలస్యంగా అందినా దాన్ని పూర్తి గా ఆస్వాదించలేం. ఎక్కడో కోపం అసంతృప్తి , అసహనం  రగులుతూనే ఉంటుంది. అయినా సహనం వీడద్దు. జో బైడెన్ జీవితంలో ఎన్ని విషాదాలు! ఎన్ని వైఫల్యాలు! అబ్రహాం లింకన్ ను తీసుకో! అంబేడ్కర్ ను తీసుకో! వాల్ల జీవితాల్లో ఎన్ని విషాదాలు? ఎన్ని వైఫల్యాలు? ఎన్ని ఎదురు దెబ్బలు? అందినట్టే అంది జారిపోయినవెన్నో! అయినా కుంగి పోలేదు. చివరకు విజయం వరించింది. అంత సంకల్ప బలం ఉండాలి. కుంగి పోతె ఎట్ల? ఉరకడం చాతగాకపోతే  సాధించిన దాంతో సంతృప్తిగ ఆనందంగ జీవించాలె.”
 ” అంతేనంటవ?”
               ”  అంతే.! అందుకే అంటున్న.  ఇంటికి పెద్ద కొడుకుగా నీకు అన్నీ అందినా సకాలంలో అందకపోవడం, ఆశించినవన్నీ అందక పోవడం వల్ల ,కొన్ని మోసాలు జరగడం వల్ల,అందినతృప్తికూడా మిగలకుండా పోయింది. ఇంటికి పెద్ద కొడుకు కావడం ఒక వరం ఒక శాపం. ఎట్ల చూస్తే అట్ల కనవడుతది.”
           ” నా కా? సుఖం తృప్తి ఈ జన్మలో రాదు. ఎందుకులే ఈ చర్చ. ఈ బతుకింతే. ఎంత చేసినా ఉమ్మడి కుటుంబం కోసం ఎన్ని త్యాగాలు ! ఎన్ని కోరికలు వదులుకున్ననో  నీకు తెలియదు. చివరకు హేమకూడ నన్నే అంటది. “
            ” సూర్యం ! వాల్ల నుంచి అతిగా  ఆశించడం వల్ల నువు చేసిన త్యాగాల వల్ల కలిగిన పెద్దరికాన్ని,  దానివల్ల  కలిగే ఆనందాన్ని కూడ పొంద లేక పోతున్నవు.   నీ చెల్లెండ్లకు, తమ్ముల్లకు నువ్వంటే ఎంత గౌరవం! .  నిజానికి నీకేం తక్కువ. కొడుకు అమెరికాలో ఇంజనీర్. బిడ్డ డాక్టర్. వాల్లను ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాలల్ల చదివిచ్చినవు. ఉన్న భూములు అమ్మినవు. అయితేంది? ఇపుడు నెలకు ఇరవై వేల  కిరాయ  వచ్చే ఇల్లు. స్కూటర్, కార్ , ఏ రోగాలు లేని చక్కని ఆరోగ్యం. ఇంతకన్నా ఏం కావాలి? మీ నాన్నను ఇంటికి పెద్ద కొడుకుగా కాపాడుకున్నావు. ఓర్వలేని తనంతో ఫ్యాక్షనిజంతో మీ నాన్న పై జరిగిన హత్యా ప్రయత్నం నుంచి ప్రాణాలకు  ఒడ్డి కాపాడుకున్నవు. అదొక్కటి చాలదా? అపుడే మరోసారి నీ జీవితం మలుపు తిరిగిందని నాకు తెలుసు. నాన్న కోసం నీ సుదూర ఆశలు లక్ష్యాలు వదులుకున్నవు. నాన్నకు తోడుండాలనుకున్నవు. దీన్నెవరు మర్చిపోరు.  మీ నాన్న పోయినంక  చెల్లె పెండ్లి చేసి తండ్రి లా కర్తవ్యం నెరవేర్చినవు. . అన్నదమ్ముల ఆస్తి పంపకాలు అమ్మ చెప్పినట్టు , తమ్ముల్లు కోరుకున్నట్టే పంచి ఇచ్చినవు. నీవు  ఇంటికి పెద్ద కొడుకుగా ఎన్నో త్యాగాలు చేసినవు. మీ తమ్ముల్లు గుర్తించక పోయినా మీ చెల్లెల్లకు తెలుసు. లోకానికి తెలుసు.  నాన్న సంపాదించిన ఆస్తి తరిగి పోయింది. పెద్ద పెద్ద దొరల ఆస్తులే చదువులకు , పెండ్లిల్లకు కరిగి పోయినయి. మధ్య తరగతి గా  మారిపోయిన్రు. అది నీ ఒక్కడి సమస్య కాదు. అయినా నువు ఇంటి గౌరవాన్ని నిలబెట్టినవు. పూర్తిగా నిలబెట్టి ఇంకా ఎదగాలనేది నీ ఆశ. అందుకు పరిస్థితులు అనుకూలంగా ఉండద్దా? ప్రధాన  మంత్రి కొడుకులు తమ తండ్రి అంత ఎదగడం సాధ్యమా? అసాధ్యం . అది వారి అసమర్థత కాదు. లక్ష్యాలు ఆశయాలు పరిస్థితులు, వ్యక్తిత్వాలు తరాలు  మారుతుంటాయి.  నీ క్లాస్ మేట్సు తో పోల్చుకో. అందరూ నీలాగే ఇదే స్థాయిలో హాయిగా బతుకుతున్నారు. సొంత ఇల్లు, చక్కని పిల్లలు, మంచి ఆరోగ్యం. పదిమందిలో గౌరవం. ఇంతకన్నా ఏంకావాలి? ఎపుడో చిన్నపుడు తెలిసీ తెలియని వయసులో పుస్తకాలు చదివి సినిమాలు చూసి నేను కూడా అలా ఉండాలె ఎదగాలె అన్నకున్న వన్నీ ఊహలు. వయసు పెరిగి అనుభవాలు కలిగినకొద్దీ మారడం రాజీ పడడం సహజం.”
          ” రాజీ పడక చేసేదేముంది. అమ్మ ఎపుడూ నువు పెద్ద కొడుకువు రా , తమ్ముల్లు చెల్లెండ్లు చిన్న పిలగాన్లు. ఏదైనా. నువు పెద్ద మనుసుతో ఓర్చుకోవాలె అని చెప్పేది. వాల్లను వెనుకేసుకచ్చేది. వాల్లకు ఎంత చేసినా ఒడిసేటిది కాదు.మీ కోసం నేను  ఎన్ని  త్యాగం చేసిన్నో తెలుసా అంటే ఏం చేసినవు? నాన్న సంపాయించినవన్ని అమ్మినవు
అని అంతెత్తు లేస్తరు. అపుడు అందరి నోల్లు పెద్దగైతయి.  ఉమ్మడి కుటుంబం కాపాడడం కోసం ఎన్ని వదులుకున్ననో తెలుసా? మంచి మంచి ఉద్యోగాలస్తే అమ్మ ఏడ్చె. నువ్వు దూరం ఎల్లి పోతె వీల్లంత ఎట్లరా? నీ  చెల్లె స్వాతి  పెండ్లి ఎట్ల? తమ్ముల్లకు ఏదో ఒక దారి చూపక పోతె ఎట్ల . నాన్న లేకపాయె. అన్నవు నువు పోతనంటే తమ్ముల్లు ఎవలబయం లేక ఏగి అయితరు. అని ఏడ్చె. ఆశలన్ని వదులుకొని ఇంటికి , ఊరికి దగ్గర ఉద్యోగం వెతుక్కుంటి. సిద్దూ! నీకు తెలువది. ఇంటికి పెద్ద కొడుకై పుట్టుడు ఎంత కష్టమో ! ఇపుడట్ల లేదనుకో,! కాని నా బతుకు నేను అనుకున్నట్టు బతికిన్నా? నా కిష్టం ఉన్నా లేకున్నా అందరికోసం బతికిన. నేను ఎట్ల బతుకాలనుకున్ననో నీకు తెలువది” సూర్యంలో తనను ఎవరు అర్థం చేసుకోలేదన్న బాధ , కోపం  వెల్లువై ప్రవహించింది.
           ” సూర్యం ! ఇపుడు అమ్మలేదు. నాన్న ఎపుడో పోయిండు. మోసం చేసినోల్లతోని మాటలు బందయినయి. అతడు పోయినా  మీ కుటుంబాలు మల్ల కలుసుకున్నది లేదు. అవన్ని గతం. ఇపుడు మీరందరు ఎక్కడోల్లక్కడ బతుకుతున్నరు.  పరిస్థితులు, వ్యక్తిత్వాలు తరా లు మారినై. మనం ఇంకా ఎదిగేదుండె అని మనం … ఏం సంపాదించ లేదు అని ఎవరైనా ఎన్నన్నా అనుకోనీ! అన్ని చూస్తనే ఉన్న హేమలత అనుకుంటే ఏం చేస్తవు చెప్పు? ఒక మాట అడుగుత! కోపం తెచ్చుకోకు. నువ్వు ఇన్ని త్యాగాలు చేసినా అనుకుంటున్నవు. ఆ త్యాగాలు హేమలత కూడా చేసింది కదా! నువ్వు ఇంటికి పెద్ద కొడుకుగా చేసిన త్యాగాలన్ని  ఇంటికి పెద్ద కోడలుగా  హేమ కూడా చేసినట్టే కదా! అట్ల ఆమెను , ఆమెలోని మంచి తనాన్ని , త్యాగాన్ని ఎందుకు గుర్తించవు? పిల్లలు ఎదిగినారంటే అదంత ఆమెదే క్రెడిట్! “
        “. సిద్దూ., నీకు తెలువది.
ఎవలెవలకో  చేసిన అంటవు! నాకేం చేసినవు? అంటది ఆమె! ఏంచెయ్యాలె చెప్పు. ఇన్ని బరువు బాధ్యతలల్ల ఆమెకు ఏంచేయ్యాలె? ఇన్ని సగవెట్టుకుంట కిలోల కొద్ది బంగారం కొనేదుండెనా? ఉమ్మడి కుటుంబంల ప్రత్యేకంగ హేమలతకు ఎట్ల చేస్తరు చెప్పు. ముందు చెల్లెండ్లను చూడక పోతె లోకం ఏమంటది? ఆలస్యంగ ఉద్యోగంల చేరితి. వచ్చిన జీతం ఇంటి ఖర్చులకే చాలవాయె! పిల్లల చదువులకు నా వంతుకు వచ్చిన ఆస్తి అమ్మితి. అప్పుడన్నా నాకోసం అదీ ఇదీ కొనద్దా ? అని చెవిల జోరీగ తీరుగ అరిస్తే ఇంట్ల ఎట్ల మనసున వడ్తది.? “
          ” సూర్యం ఇది ఎవరికివారు అర్థం చేసుకోవాల్సిన విషయం. ముందు ఆమె ఆశలు , కోర్కెలు గుర్తించు. గౌరవించు.  హేమలోని మంచి తనాన్ని మెచ్చుకో! అందరికోసం మనం త్యాగం చేయక తప్పలేదు అని అర్థం చేయించు. అర్థం చేసుకుంటది.. హేమ ఏమైనా చిన్న పిల్లనా ? అర్థం కాకపోవడానికి? నీ త్యాగాన్ని గుర్తించ లేదని నువ్వెట్ల బాధపడుతున్నవో అంతకన్న ఎక్కువ బాధ పడుతున్నదని గుర్తించు. ఆమెకు నీకు పెండ్లి సంబంధం కుదిర్చినోడే గ్యాస్ డీలర్ షిప్ డిపాజిట్ కని ఇరవైయైదు వేలు ముంచింది ఆమెకు తెలువదా? అప్పటి ఇరవై అయిదు వేలు ఇప్పటి ఇరవై అయిదు లక్షల కన్నా ఎక్కువ. ఇట్ల సముదాయించి ఎవరో చెప్తే చెప్పిన వాల్లు దూరం అవడం తప్ప ఏం ఉపయోగం. అయినా ఇంకా చిననాటి కోర్కెలతో అసంతృప్తితో నిత్యం సంఘర్షించుకుంట బతికితే ఎట్ల? ఈ జీవితం మల్ల రాదు గదా?  సూర్యం!  ఆమె విషయం పక్కకు పెట్టు . నువ్వు తక్కువ తిన్నవా? ఇపుడైనా అవన్ని పక్కకు పెట్టి నువు నీ క్లాస్ మేట్సు తో పోల్చుకో. అందరూ నీలాగే ఇదే స్థాయిలో హాయిగా బతుకుతున్నరు. . సొంత ఇల్లు, చక్కని పిల్లలు, మంచి ఆరోగ్యం. పదిమందిలో గౌరవం. ఇంతకన్నా ఏంకావాలి? ఎపుడో చిన్నపుడు తెలిసీ తెలియని వయసులో పుస్తకాలు చదివి సినిమాలు చూసి నేను కూడా అలా ఉండాలె అనుకుంటె ఆ తప్పు ఎవరిది?”
     ఎక్కడో ఉరిమింది. రేకులు డబ డబ మనని కదిలాయి. మల్లెల సువాసన విసిరి కొట్టింది.
సూర్యం గుండెలో ఏదో అలజడి.
             ”  సూర్యం!  చిననాటి ఊహలు ఊరిస్తాయి. మంచి జరిగితే ఓకే. అనుకున్నది జరగక పోతే జానేదేవ్. ! ఉన్న బతుకులోనే ఆనందం తృప్తి వెతుక్కోవాలి. వేటగాడు వెంటాడిన దుప్పి తప్పించుకు పోయిందని కోపం తెచ్చుకుంటే దుప్పి అతని ఒడిలోకి వచ్చి వాలుతుందా.? కనీసం కుందేలునైనా వేసుకొని పోవాలనుకుంటాడు. కుందేలు కూరను తింటూ దుప్పి దొరకలేదని తిట్టుకుంటే కుందేలు రుచి ఆస్వాదించడం సాద్యమా?  కుందేలుకూర ఎంత బాగుందో ఆస్వాదించాలి. జీవితంలో ఇన్ని సాధించిన నీకు ఇంకా అసంతృప్తి ఎందుకు? ఎంత అందమైన జీవితం మనది. అందినదేదో అందినది. అది మనది. అందనిదేదో అందలేదు. అది మనది కాదు. మనకు బాకిలేదు అనుకోవాలి.  ఏమంటవు? “అ న్నాడు సిద్దార్థ.
            తాను చాలా విషయాల్లో ఇట్లనే సర్దుక పోయిండు. లైట్ గ తీసుకున్నడు. రాజీ పడ్డడు.  కాని కొన్ని మాత్రం మరిచి పోలేక పోతున్నడు. హేమలత నిత్య సంఘర్షణ ఎందుకో అర్థం కాదు అనుకున్నాడు సూర్యం.  ఆస్తి పంపకాల్లో తాను అన్ని సర్దుక  పోయిండు.  ఎన్నో ఖర్చులయినా వాటికి లెక్కలు చెప్పడం సాధ్యం కాదు…అడిగితే అన్ని ఖర్చులెట్లయితై అని తమ్ముల్లతో  అడిగించుకోవడం అవమానం అన్పించింది అనుకున్నాడు సూర్యం.  హేమకు అవి అర్థం కావు.
 ”  మగ పెత్తనం ఆలోచన వదిలి నువ్వు హేమ వైపు నుంచి కూడ ఆలోచించు. ” అంటూ చాలా సేపు అర్థం చేయిస్తూ పోయాడు సిద్దార్థ.
           ” నువ్వన్నది నిజమే సిద్దూ.! మనం సాదించిన వన్ని సహజం అనుకుంటున్నం. కాని ఇవన్ని ఎంతో కష్టపడి సాధించుకున్నవే అని మరిచి పోతున్నం. లేని దాన్ని రాని దాన్ని  సాధించలేదని బాధ పడడంలో సాధించిన వాటిని కూడ తేలిక గా చూడడం వల్ల నువ్వన్నట్టు అసంతృప్తి  వెంటాడుతున్నది. అందినది తక్కువేమీ కాదు. చేసిన త్యాగాలు తక్కువేమీ కాదు. గెలుచుకున్న జీవితం కూడ తక్కువేమీ కాదు.” అన్నాడు సూర్యం.
” ఎవరో గుర్తించాలనే  భావం వదిలేస్తే మనలో మనకు ఎంత సంతృప్తి కలుగుతుందో! ” అన్నాడు సిద్దార్థ.
         తనకా  దృష్టే లేనట్టు వాదించబోయాడు సూర్యం.
         “అదంతా వదిలెయ్!  ఆ గతం అంతా ఎందుకిపుడు? మనం సాధించింది తక్కువేమీ కాదు.  మన జీవితాలను గెలుచుకున్నం. మన పిల్లల జీవితాలను గెలిపించినం. మన తరం కర్తవ్యాలు పూర్తి చేసినం. ఇక చేసేదేమైనా ఉంటే అదంతా బోనసే. వైఫల్యాలను మరిచి పోదాం.
ఎవరైనా  విజయాలను గుర్తు చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎన్ని వైఫల్యాలెదురైనా , మనను ఎంత మంది ఎన్ని రకాలుగా ముంచినా , నిలదొక్కుకున్నం.  మనం  జీవితాలను గెలుచుకున్న విజేతలమే. “అన్నాడు  సిద్దార్థ.
           ” అంతే అంటవా? “
           ” ఔను ఇంత మంచి జీవితం ఎంత మందికుంది? మూడింట రెండు వంతుల మంది మనవంటి జీవితాలను గెలుచుకోవాలని ఎంత ఆరాట పడుతున్నరో.. తెలుసా? “
            ” సిద్దూ!  ువ్వన్నది  నిజమే. మనం సాదించింది తక్కువేమీ కాదు. మన వైఫల్యాలు,
మన అదనపు కోర్కెలు వదిలేస్తే .. మనం చిన్న ఉద్యోగాలతో చిన్న జీతాలతో  మన పిల్లలను
ఎక్కడెక్కడో చదివించినం. మన పిల్లల జీవితాలను గెలిపించినం.  మనకు ప్రమోషన్లు తక్కువైనా మనం మన జీవితాలను గెలుచుకున్నవాల్లమే ” అని చివరకు ఒప్పుకున్నాడు సూర్యం.
              హమ్మయ్య అనుకున్నాడు సిద్దార్థ.
                వాన వెలిసినట్టుంది.. రేకుల మీద వాన చప్పుడు ఆగి పోయింది.
 ఎవరో మల్లీ చాయ్ తెచ్చారు.  వారితో పాటు మల్లెల గాలి మల్లీ వీచింది.
 ” అడగక ముందే రెండు సార్లు చాయ్ పంపింది హేమలత.  హేమలత కూడ చాల మంచిదే “
అంటూ మెచ్చుకున్నాడు సిద్దార్థ.
               ”  హేమలత మర్యాదలకేం లోటు లేదులే ! ” అంటూ నవ్వాడు సూర్యం
              ” మరింకేం కావాలె?  ఆహా ,  అడగక ముందే మల్లీ చాయ్ పంపింది. గృహమే కదా స్వర్గ సీమ . నీ అంత అదృష్టవంతుడు లేడు సూర్యం !  ” అంటూ  కూని రాగం తీసాడు సిద్దార్థ.
         ఆమాటతో   ఏవేవో  తొలినాటి మధుర స్మృతులు గుర్తుకు వచ్చాయి  సూర్యానికి.
         కాసేపటికి   హృదయపు లోతులనుండి నవ్వాడు సూర్యం.
         మల్లెల వాసన గట్టిగా పీలుస్తూ ….
          ” అవును మనం జీవితాలను గెలుకున్న విజేతలమే! గట్టిగా ఆనందంగా అరిచాడు సూర్యం.
          తెరచాటు నుండి హేమలత అకస్మాత్తుగ ఊడి పడ్డంతో  సూర్యం కంగు తిన్నాడు. అన్నీ విన్నదా అని కించ పడి పోయాడు.
       ” అన్ని విన్నవా హేమా?” అంటూ నవ్వుతూ పలకరించాడు సిద్దార్థ.
            అవునన్నటు   ముసి ముసి నవ్వులు నవ్వింది హేమ.
         చాలా రోజుల తర్వాత సూర్యం హేమల కళ్లు కళ్లు కలిసాయి.
           క్షణంలో తేరుకుని సిద్ధార్థ వైపు చూస్తూ
             ” థాంక్స్ ” అంది హేమలత.
–  బి ఎస్ రాములు

You may also like

3 comments

నాగారం డి ప్రకాష్ June 24, 2021 - 1:44 am

రెండు పాత్రల సంభాషణ తో చాలా బాగుంది
నేపథ్యంలో వర్షం టీ , చాటు గా తన గురించి ఆమె వినడం, ఒడి పోవడం కాదు అందులో విజయం ఉంది అని చెప్పిన తీరు బాగుంది

Reply
డా చీదెళ్ళ సీతాలక్ష్మి July 3, 2021 - 9:18 am

చాలా బాగుంది.సంభాషణాత్మక శైలిలో కొనసాగిన కథ…

Reply
కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి October 29, 2021 - 7:32 am

శ్రీ రాములు గారి కథ ఒక సంభాషణ రెండుయాసలతో చక్కగా నడిచింది. అభినందనలు.

Reply

Leave a Comment