భారత ఉపఖండంలో ఒకప్పటి భాగం బర్మా దేశం. బాలగంగాధర తిక్ లాంటి దేశభక్తులు బర్మాలోని మాండలే జైల్లో కారాగారవాస శిక్ష అనుభవించారు. తమిళ కంబ రామాయణం 1800లో బర్మాలోకి అనువాదమైంది. 1874లో యూట్ అనే కవి రాసిన ‘రామయోగిన్’కు బర్మా దేశంలో ఎంతో పేరు వచ్చింది. బర్మా రామాయణంలో దశరథుడు పుత్రకామేష్ఠి చేయడు. త్రిశూలుడు అనే మహర్షి ఇచ్చిన మంత్రపూరితమైన ఫలాల వలన సంతానం కలుగుతుంది. మారీచునకు బదులుు ‘బంబి’ అనబడే శూర్పణఖ మాయామృగంగా మారుతుంది. అవాల్మీకంగా తెలుగునేలపై ప్రసిద్ధమైనట్లే పర్ణశాల చుట్టూ మూడు గీతలు గీసి సీతాదేవిని దాటి రావద్దని ఆదేశించి లక్ష్మణుడు రాముని కోసం వెళ్తాడు.
బర్మా రామాయణంలో రావణుడు తనను క్షమించమని రాముని ప్రార్థించడం విశేషం. రాముడు అంగీకరించకుండా ‘నీ దుష్టకర్మ ఫలితమే నిన్ను చంపుతుంది’ అని సంహరిస్తాడు. భూటాన్ రామాయణంపై బౌద్ధమత ప్రభావం అధికంగా గోచరిస్తుంది. కార్తవీర్యార్జునుని కథ దశరథుని కథ కలగాపులగమై చిక్కు విడదీయరానంతగా కలిసిపోయాయి. దశరథుని కుమారుడు సహస్ర బాహువు. అడవిలో పరశురాముని తండ్రి ఆతిథ్యాన్ని స్వీకరించి అతనే కామధేనువుని లాక్కోబోతాడు. అతడు తిరస్కరించేసరికి సహస్రబాహువు అతన్ని చంపేస్తాడు. పరశురాముడు ప్రతీకారంతో సహస్రబాహుని చంపేస్తాడు. సహస్ర బాహువు కొడుకులే రామలక్ష్మణులు. రాముడు పెరిగి పెద్దవాడై తండ్రిని చంపిన పరశురాముని సంహరిస్తాడు. ఇది కథ. ఈ భూటాన్ రామాయణంలో దశరథుని మనుమలుు రామలక్ష్మణులన్నమాట. రాముడు చిన్నవాడు. లక్ష్మణుడు పెద్దవాడు. రామక్ష్మణుల్లో సీతాదేవిని ఎవరు పెళ్ళాడుతారో స్పష్టంగా లేదు. కథాంతంలో బుద్దుడే రాముడని చెప్తారు.
కాంబోడియాలో 17వ శతాబ్దం నుంచి రామాయణం వ్యాప్తిలో ఉన్నట్లు తోస్తుంది. కాంబోడియా రాజధానిలో వున్న బౌద్ధారామంలో రెండువేల తాళపత్ర గ్రంథాలున్నట్లు అందులో ఎన్నో రామాయణ సంబంధమైన పుస్తకాలున్నట్లు వినికిడి. కాంబోడియా రామాయణంలో విశ్వామిత్రుని యాగాన్ని తాటక మారీచులకు బదులు కాకాసురుడు ధ్వంసం చేస్తాడు. సంజీవని కోసం వెళ్ళిన ఆంజనేయుడు సంజీవనితోపాటు నంది మూత్రం, దేవగంగా జలాలను కూడా తెస్తాడు.
చైనాలో ప్రధానమైన మతం బౌద్ధం. రామునకు మారుగా బోధిసత్వుడు కనిపిస్తాడు. బోధిసత్వుడు ప్రజారంజకుడైన పాలకుడు. ఆయన భార్య అపురూప సౌందర్యవతి. ‘నాగుడు’ అనే వ్యక్తి బోధిసత్వుని రాణిని వశపరచుకోవాలనే దురూహతో బోధిసత్వుని సేవించి విశ్వాసాన్ని చూరగొంటాడు. ఒకనాడు బోధిసత్వుడు అడవికి వెళ్ళగా మహారాణిని ఎత్తుకొని పోతాడు. తర్వాత జటాయువుతో యుద్ధం `వానర సాయం` బోధిసత్వుడు యుద్ధంలో మూర్ఛపోతే సంజీవనితో బతికిస్తారు. తర్వాత బోధిసత్వుడు నాగుడిని సంహరించి మహారాణిని తెచ్చుకుంటాడు. వాల్మీకి కథకు ప్రతిధ్వనిలా బోధిసత్వుని పరంగా చైనా రామాయణం మలచబడిందిి.
టిబెట్ రామాయణంలో కైకేయి భరత శత్రుఘ్నుల పాత్రలు వుండవు. ఒకసారి దశరథుడు రాక్షసునితో యుద్ధంలో గాయపడి మంచం పాలై రాజ్యాన్ని పాలించలేని స్థితిలో వుండి రామునకు పట్టాభిషేకం చేయాని నిర్ణయించుకుంటాడు. రాముడు తన తండ్రి మాత్రమే రాజ్యమేలాలని వాదించి అడవికి వెళ్ళిపోతాడు. రాముని పాదుకలను వుంచి ప్రతినిధిగా లక్ష్మణుడే పాలిస్తాడు. ఈ రామాయణంలో రాముని భార్య పేరు సీత కాదు లీలావతి. రావణుడు లీలావతిని ఎత్తుకుపోతాడు. విభీషణునితోపాటు కుంభకర్ణుడు కూడా రావణుని తిరస్కరించి రాముని శరణు కోరుతాడు.
వియత్నాంలో ఎన్నో సంస్కృత శాసనాలు బయటపడ్డాయి. రాముని వంశం వారమని రామునిలాగా పరిపాలిస్తామని రాజులు తమ శాసనాల్లో చెప్పుకొన్నారు. వాల్మీకికి ఒక దేవాలయం కట్టిస్తున్నట్లు ఒక శాసనంలో పేర్కొనబడిరది.
రామాయణంలోని లంక నేటి శ్రీలంక అనీ కాదనీ వాదోపవాదాలున్నాయి. 7వ శతాబ్దిలో వాల్మీకి రామాయణాన్ని అనుసరించి శ్రీలంక రాజవంశానికి చెందిన కుమార దాసుడు ‘జానకీహరణం’ అనే సంస్కృత కావ్యాన్ని రాశాడు. భారవి కాళిదాసు స్థాయిలో రాయబడిన ఈ కావ్యం 12వ శతాబ్దిలోనే సింహళ భాషలోకి అనువాదమైంది. శ్రీలంకలోని సువార ఏలియా అనే జిల్లాలో ఒక ప్రదేశాన్ని రావణుని అంతఃపురమని చెప్తారు. వాలి కలలో ప్రవేశించి అశోకవనాన్ని, లంకను దహించి సీతాదేవిని తన వీపుమీద కూర్చోబెట్టుకుని శ్రీరామునకప్పగిస్తాడు. కొంత కాలమయ్యాక పార్వతీదేవి సీతాదేవిని చూడడానికి వస్తుంది. ఆమె మాటల సందర్భంగా రావణుడెలా వుంటాడని అడుగుతుంది. సీతాదేవి రావణుని బొమ్మ గీసి చూపెడుతుంది. ఆ సమయంలో రాముడు మందిరానికి రావడంతో హడావుడిగా సీత తన పరుపు కింద బొమ్మను దాచిపెడుతుంది. రామునకు పాన్పు కదులుతున్నట్లు తన నెవరో పడదోస్తున్నట్లు అనిపించడంతో పాన్పును పక్కకు జరిపి చూస్తాడు. రావణుని చిత్రపటం కనిపిస్తుంది. దానితో గర్భవతి అని కూడా దయ దల్చకుండా సీతాదేవిని అడవిలో వదిలిపెడ్తాడు. సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో ఒక కుమారుని కంటుంది.
ఒకరోజు సీతాదేవి స్నానానికి వెళ్ళగా కుమారుడు దోగాడుతూ పక్కనున్న పొదల్లోకి వెళ్తాడు. వాల్మీకి సీతాదేవి వచ్చేలోగా మరో శిశువును మంత్రశక్తితో సృష్టిస్తాడు. తాను కన్న శిశువు ఇతడే అని ఎత్తుకుంటున్నప్పుడు దోగాడుతూ బయటికి వెళ్ళిన అసలు శిశువు వస్తాడు. సీతాదేవి ఆశ్చర్యపోగా వాల్మీకి జరిగిన సంగతి చెప్తాడు. అప్పుడు సీతాదేవి నీకు అంత శక్తి నిజంగా ఉంటే నా ముందు ప్రదర్శించమంటుంది. అప్పుడు వాల్మీకి మరో శిశువును మంత్రశక్తితో సృష్టిస్తాడు. సీతాదేవి సంతోషంతో ముగ్గురు పిల్లలను పెంచుతుంది.
పిలిప్పైన్స్‌లో ఇస్లాం మత సంస్కృతి ప్రాచీన భారతీయ సంస్కృతీ కలిసి వారిదైన ఒక సంస్కృతి ఏర్పడింది. ఈ దేశంలో రామాయణాన్ని ‘మహారాజ రావణ’ అని వ్యవహరిస్తారు. రామలక్ష్మణులు సీత స్వయంవర వార్త విని స్వయంవరం జరిగే ప్రాంతానికి సముద్ర మార్గాల గుండా వెళ్ళి మధ్యలో ఆపద పాలవుతారు. ‘కబైమాన్’ అనే ఒక స్త్రీ చూసి సముద్రంలోకి దూకి రామక్ష్మణులను రక్షించి స్వయంవరం జరిగే చోటికి చేరుస్తుంది. శివధనుర్బంగానికి బదులు ఒక పెద్ద బంతిని కాలితో తంతే అది వెళ్ళి సీత వున్న గది ముందు పడాలన్నది నియమం. శ్రీరాముడు నెగ్గుతాడు. మరికొన్ని పరీక్షలు వుంటాయి. కావ్యమంతటా దశరథుని సుల్తాన్ అని సంబోధిస్తారు. రావణుని పడగ్గదిలో ఉన్న ఒక వజ్ర పాషాణంమీద ఖడ్గాన్ని పదునుపెట్టి ఆ ఖడ్గంతో రావణుని చంపితే చస్తాడు.
థాయ్‌లాండ్ దేశ రాజధాని అయోధ్య. 420 సంవత్సరాలు 37మంది రాజులు ఆ దేశాన్ని పాలించారు. రాజు పేర్లు అన్నీ రామనామంతో ముడిపడి వున్నవే. 1737లో థాయ్‌లాండ్‌ను పాలించిన రామచక్రవర్తి ‘రామకీన్’ పేరుతో రాసిన రామాయణానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగాయి. థాయ్‌లాండ్‌లో రామాయణ పాత్రలు ఎలా రూపాంతరం చెందాయో చూడండి. తోనరట్ – దశరథుడు, కౌసూర్య – కౌస్య, కయకశి – కైకేయి, రామ – రాముడు, లక్ – లక్ష్మణుడు, బ్రోత్ – భరతుడు, శత్రూట్ – శత్రుఘ్నుడు, సీదా – సీత, సుక్రీవ్ – సుగ్రీవుడు, రావన – రావణుడు, సమ్మనక్క – శూర్పణఖ.
థాయ్‌లాండ్ రామాయణంలో సీతారాములిరువురు వివాహానికి ముందే పరస్పరం ఆకర్షితులవుతారు. అంతఃపుర గవాక్షం దగ్గర సీతను చూసి రాముడు రహస్యంగా మాట్లాడుతాడు. సీత కలలో వున్నప్పుడు ఆంజనేయునకు ఆ మధుర సంభాషణను తన గుర్తుగా సీతకు చెప్పమంటాడు. చిన్నప్పుడు మంధర కాలు లాగి పడవేసినందుకు ప్రతీకారంగా రాముని పట్టాభిషేకం చెడగొడుతుంది. థాయ్‌లాండ్ రామాయణంలో మూలానుసారంగా వుంటూనే మైరావణుని కథలాంటి విశేషాలున్నాయి. రావణుడు విభీషణుని కూతురును ‘సీత రూపంలో వెళ్ళి రాముని సైన్యమున్న చోట నదిలో చనిపోయినట్లు శవంలాగ తేలియాడుతున్నట్లు వుండు. నిన్ను చూసి రాముడు సీత చనిపోయిందన్న దుఃఖంతో అయోధ్యకు వెళ్లిపోతాడు’ అని ఆదేశిస్తాడు. కాని విభీషణుడు రాక్షస మాయగా గుర్తుపట్టి తన కూతురు అని కూడా దయదల్చకుండా రామునితో చెప్పి మరణశిక్ష విధించమని చెప్తాడు. ఇలా వాల్మీకి కవికోకిల గానం భారతదేశం దాటి దిగంతాల దాకా వ్యాపించింది. ఇంకా ఆ గానం నిరంతరం సాగుతుంటుంది.
(మాన్య శ్రీ జె.వి.సుబ్బారాయుడి విదేశాల్లో రామకథ ఆధారంగా ఆకాశవాణి ప్రసారం) – ఆంధ్రభూమి (దినపత్రిక) 30-3-2004
-డా॥ వెలుదండ నిత్యానంద రావు
ప్రొఫెసర్ , ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ.
+91-9441666881