Home వ్యాసాలు కవిత్వ కళ – నైపుణ్యాలు

కవిత్వ కళ – నైపుణ్యాలు

కవిత్వాన్ని సమాజమెప్పుడూ గౌరవిస్తుంది. అటువంటి కవిత్వం ఎంత విస్తృతంగా వస్తే, ఎంత మంది వ్రాస్తే అంత మంచిది. కానీ, కవిత్వానికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నవా అని యోచించాలి. పోటెత్తుతున్న కవిత్వాన్ని కాలం వస్త్రగాలం పట్టినప్పుడు, నిలువగలగాలి కవిత్వం. నిర్దాక్షిణ్యంగా వడబోసే శక్తి కాలానికి ఉంటుంది. అందుకే కవులు కవిత్వాన్ని మెరుగుపరుచుకోవాలి. కవిత్వ నైపుణ్యాలను అలవర్చుకోవడానికి కొన్ని విషయాలను స్పృశించుకోవడం అవసరం. కవిత్వ నిర్వచనాలను, ప్రత్యేకతలను, కవిత్వ కళను, నైపుణ్యాలను చర్చించుకుందాం.
కవులు ఎన్నుకోబడని శాసనకర్తలు, “పోయెట్స్ ఆర్ అన్-ఎక్నాలెడ్జెడ్ లెజిస్లేటర్స్”
అంటాడు షెల్లీ. ఎన్నుకోబడని, కవులు మన చుట్టూ ఉంటారు. దాశరథి లాంటి కవి ‘కవిత్వం అంటే నాకొక వెర్రి’ అన్నాడు. ప్రజాసంఘంలో ఉండే కవికి ఎంతో గౌరవమిస్తూ, “ కవిరేవ ప్రజాపతిః” అన్నారు. కవి అనేవాడు బ్రహ్మతో సమానమన్నారు. ఎప్పుడైతే కవిత్వం పలుచగయినా, హీనమైనప్పుడైనా ఎగతాళి కూడా చేయబడుతుందని ఆనాటినుండి ఈనాటివరకు చూస్తూనే ఉన్నాం. ఒకప్రక్క బలమైన కవిత్వం వస్తుంటే, మరోప్రక్కన పలుచనైన కవిత్వమూ వస్తున్నది. పలుచని కవిత్వాన్ని సమాజం నిరసిస్తూనే ఉన్నది. అందుకే కవిత్వం రాయాలంటే తపస్సు చేసినట్టుచేయాలి. “నానృషిః కురుతే కావ్యమ్” ఋషి కానివాడు కవికాడని అన్నారు పూర్వీకులు. ఋషి అంటే, ఒక సుదీర్ఘకాలం తమ శక్తులన్నీ ఒకే విషయంపైన కేంద్రీకరించడమన్నమాట. బహుశా ఆనాడు అడవుల్లో ఈ విధంగా చేసి ఉండవచ్చు. శక్తులన్నీ అన్నప్పుడు, అవి 1.మానసిక శక్తి 2. బౌద్ధిక శక్తి 3. భౌతిక శక్తి అనే ఈ మూడింటికి శక్తిని కేంద్రీకరించినప్పుడు మాత్రమే కవిత్వాన్ని రాసే ఋుషి అవుతాడు. కవి ఈ మూడు శక్తులకు తోడు వాక్శక్తి కూడా కలిపి ఏకాగ్రతతో ప్రయోగిస్తే రచనా నైపుణ్యం పెరుగుతుంది. సంప్రదాయమైన పదజాలం ఉపయోగిస్తే అది సంప్రదాయవాదమేమీ కాదు. కేంద్రీకరించడం కీలకమైంది. ఆనాడు అడవుల్లో చేసిఉండవచ్చు, ఈ నాడు సమాజంలో ఉండి కూడా చేయవచ్చు. కవిత్వాన్ని నిండుగా, గంభీరంగా, పరిపూర్ణంగా ఉండేలా రాయాలి.
“దర్శనాత్ వర్ణోచ్చాద రూడే లోక కవిశ్రుతిః ” అన్నారు.
దర్శంచినదాన్ని వర్ణించేవాడే కవి. దేన్ని దర్శించాడు కవి? ఆనాడు ఇతిహాసాలు, పురాణాలు దర్శించి ఉంటారు. దర్శించాలంటే జీవితంలోకి వెళ్లాలి. జీవితం వినా మరొక ప్రపంచమేలేదు. ఇవ్వాళ తత్త్వానికిగాని, శాస్త్రానికిగాని, కవిత్వానికిగాని, మూలం ఎక్కడ అంటే జీవితమే భూమిక. ప్రపంచమే భూమిక. కాబట్టి మూలాల్లోకి, జీవితాల్లోకి వెళ్ళాలి. వర్ణించడమంటే ఏమిటి? దర్శించినదాన్ని వర్ణించగలగాలి, సమగ్రంగా రాయాలి. ఏదైతే చూసామో దాన్ని చెప్పడం, ఉన్నది అందమైతే అందంగా చెప్పడం, అందంగా భావించడం. దుఃఖాన్ని ఏడుపొచ్చే విధంగా చెప్పడం! కోపాన్ని అవతలి వాళ్ళకు కోపం వచ్చే విధంగా,ఆశ్చర్యాన్ని మరింత ఆశ్చర్యకరంగా,వికారాన్ని మరింత వికారంగా వర్ణించగలగాలి. అందాన్ని మరింత అందంగా చెప్పగలగాలి. ఉన్నది అందమైతే ఆ అందమంటే ఏమిటి? అని చెప్పడం వర్ణన. వర్ణన చేయగలిగేవాడు కవి అని వాడుక. వర్ణన అంటే ఎక్కువ చేసి చెప్పటం.
వర్ణించడానికి పరికరాలు సమకూర్చుకోవాలి. ప్రాచీన లాక్షణికులు, ఆలంకారికులు కవిత్వాన్ని గురించి నిర్వచిస్తూ “శబ్దార్థౌ సహితౌ కావ్యం” అన్నాడు భామహుడు. శబ్దార్థాలతో కూడుకొని ఉండేదే కవిత్వం అన్నారు. శబ్దాలు,అర్ధాలు రెండూ తప్పనిసరిగా ప్రతిభాషకూ ఉండాలి. అర్ధం లేని మాట అనేది ఉండదు. ఈ రెండు ఉన్నంతమాత్రాన కవిత్వం అంటామా?
అంటే, భామహుడు “కావ్యం అలంకారార్ధం” అన్నాడు. అందంగా, అలంకరించి శబ్దాన్ని చెప్పాలని అన్నాడు. మాట్లాడే మాటలనుండి ఒక అందాన్ని తీసుకురావాలి, ఒక అలంకారాన్ని తీసుకురావాలి. భాషలో ఉండే శబ్దాలను, అర్ధాలను ఉపయోగిస్తూ అలంకారాలను తయారుచేయాలి.
ఉన్నదాన్ని తీర్చిదిద్దాలి, మరింత శోభాయమానంగా అలంకరించగలగాలి. శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు అని ఉన్నవి. వాటిని ప్రత్యేకంగా అధ్యయనం చేసినపుడు చర్చించవచ్చు.
మాట్లాడే మాటలను అలంకరించి చెపితే చాలా? బాగా అలంకరించుకున్నంతమాత్రాన అందంగా ఉన్నట్టా? ఎక్కువ పౌడర్ మేకప్ వేసుకుంటే అందంగా ఉంటారా? అలంకారాలే కవిత్వమా? కాదు.
అలంకారాలు ఎక్కువవేసినా ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎంత తగుతుందో అంత ఉండాలి. ఏ వస్తువు ఎక్కువ ఉపయోగించవద్దు. ఉచిత రీతిన ఉండాలి. దానినే ‘ఔచిత్యం’ అంటారు, “ఔచిత్యం రససిద్ధస్య స్థిరం” అన్నాడు క్షేమేంద్రుడు. ఇది కీలకం. ‘ఔచిత్యం’ ఉంటేనే రసం సిద్ధిస్తుంది అన్నాడు. “రీతి ఆత్మ కావ్యస్య” అన్నాడు వామనుడు. అంటే పద్ధతి ఉండాలని అర్థం. అర్థం, రీతి ఉంటె కవిత్వం అయిపోతుందా?
రీతి అంటే ఏమిటి? అని తెలుసుకుంటే, రీతి అంటే,”విశిష్ట పదరచనా రీతిః” అన్నాడు. అంటే మంచి పదాలను, విశేషమైన పదాలను ఏరి కూర్చడమే రీతి. నడవడిక అనేది రీతి, శైలి. అంటే, సరైన పాదాలను ఏర్చి కుర్చాలి అన్నాడు.
శ్రీశ్రీ రీతిని నిర్వచిస్తూ,”సరైనటువంటి మాటల్ని సరైనచోట, సరైనవిధంగా ప్రయోగించడమే కవిత్వరీతి“ అన్నాడు. కాలరిడ్జ్ “బెస్ట్ వర్డ్స్, ఇన్ బెస్ట్ ప్లేస్“ అన్నాడు. మంచి పదాలను మంచి స్థానంలో రచించడమే కవిత్వం. అయితే, మంచి పదాలను మంచిస్థానం దగ్గర రాయడం అనేదాంట్లోనూ సమస్య ఉన్నది. ఏ పదం ఎలాంటి చోట అనే విషయం. మనం ఉపయోగించే పద్ధతిని బట్టి, థాట్ ను బట్టి కూడా మంచిగా రాణించడం కవిత్వం అవుతుంది. చెప్పాల్సిన అంశానికి తగినట్టుగ చెప్పాలి. లేకుంటే అర్థం మారిపోతుంది. ఉదాహరణకు, తప్పుడు ప్రదేశంలో ఉంటె, తాటిచెట్టు క్రింద కూర్చుంటే ఏమంటారో మనకందరికీ తెలిసిందే! మంచి అంటే అర్థం ఏమిటి? లోకం ఒప్పుకునేదే! లోకం సమ్మతించేదే మంచి. లోకం ఒప్పుకునే రీతిలో ఉండాలి. మంచి అనేది నీతికి సంబంధించింది కూడా! గొప్పవైన పదాలను తీసుకొని మంచి స్థలంలో నిర్ణయించి ఉపయోగించి రాయడం అనేది కీలకమైనది. కవిత్వ రచనలో 1. భావాలు, 2. భావోద్రేకాలు (తీవ్రమైన భావాలు), 3. భావోద్వేగాలు (సెంటిమెంట్) అనేవి ముఖ్యమైనవి. అయితే, సాధారణ భావాలు,తీవ్రభావాలు, ఉద్వేగంతో కూడిన భావాలు. ఈ మూడింటిని వరుసగా కూరుస్తే కవిత్వమవుతుందా? అంటే అదికూడా కాదు. ఈ భావాలనూ, భావోద్రేకాలను, భావోద్వేగాలను పేర్చేప్పుడు నైపుణ్యంగా రాస్తూ పోవాలి. ఇక్కడ ముఖ్యవిషయం మరోటున్నది. ప్రాచీనులు ‘రసం’ అన్నారు. “వాక్యమ్ రసాత్మకం కావ్యం” అన్నారు. అంటే రసాత్మకంగా ఉండే రచన మాత్రమే కవిత్వం అవుతుంది. ఇది విశ్వనాథుడు అనే అలంకారికుడు అన్నాడు. ఇది చాలా ప్రాచుర్యం లోకి వచ్చిన మాట. ‘రసం’ అంటే ఏమిటి? అంటే, ఎదుటి వ్యక్తి హృదయాన్ని చ్వలింపచేసేది, ఎదుటి వ్యక్తి హృదయంలో కదలిక కలిగించేది, సంచలనం కలిగించేదిమాత్రమే రసం. ఎదుటి వ్యక్తి హృదయాన్ని కదిలించలేకపోతే ఎంత గొప్ప మాటలు, పదాలు వేసినా అది కవిత్వం కాదు.
కాలాన్నిబట్టి వాళ్ళ హృదయ భావాలూ, స్థాయిలు మారుతుంటాయి. కాబట్టి మారిన హృదయాలకు తగినట్టి భావాలనూ రాయాల్సి ఉంటుంది. కాబట్టి కవికి ఉండవలసిన లక్షణాలలో, కవిత్వానికి ఉండాల్సిన లక్షణాలలో ప్రధానమైనవి నవ్యత, కాలానుగుణ్యత భావాన్ని, భావనాశక్తితో, భావోద్రేకంతో ఇతరుల హృదయాలలో చలనం కలిగింపజేయాలి. శబ్దాలు ఎట్లైతే కవిత్వం కాదో, అట్లే, భావోద్వేగం కలిగించని భావాలు కవిత్వం కాదు. కవి భావాలు ఉద్వేగాన్ని కలిగించేలా ఉండాలి. అందుకే కవిత్వానికి ప్రత్యేక స్థానం ఉన్నది. జీవితంలో ఉద్వేగాలను పట్టుకోగలిగే శక్తి, కదిలించగలిగే శక్తి కవిత్వానికే ఉన్నది. కథ, నవలలకు కూడా ఈ శక్తి ఉన్నది. అవీ గొప్పవే, కానీ శరీరాన్ని, మనసునీ, రెండూ గగుర్పాటు పరిచే విధంగా, రోమాంచితమయ్యే స్థితి లో రాయగలిగే శక్తి కవిత్వానికి ఉంటుంది. అంటే వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా ఉండాలి కవిత్వం! కవిత్వాన్ని కళగా భావించగలగే, భావోద్వేగం కలిగించే శక్తి ఎక్కువ ఉన్నది కాబట్టే సాహిత్యంలో మొదటి స్థానం కల్పించారు
సుదీర్ఘంగా రాసే కథ,నవలా రచయితల ప్రయత్నం కంటే కవితలో నాలుగైదు వాక్యాల్లో జీవితాన్ని చెప్పగలిగే భావం ఉంటుంది, నైపుణ్యం ఉంటుంది. అవి ఒక ఎత్తైతే ఇది ఒక ఎత్తు. ఉదాహరణకు, ”కాళ్ళు తడవకుండా సముద్రాలు దాటవచ్చు, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము.”” రెండే వాక్యాలు! విమానాలు, ఓడలూ ఉన్నాయి కాబట్టి కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటి వెళ్ళి పోవచ్చు. కళ్ళు తడవని వారు, ఎంత ధనవంతులైనా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేరు. జీవితంతోనే క‌విత్వం జీవిస్తుంది ! ఇట్లా మనసును కదిలించే భావోద్వేగంతో కవిత్వం రాయాలి.
పాశ్చాత్యకవి, వర్డ్స్ వర్త్ “పొయెట్రీ ఈజ్ స్పాంటేనియస్ ఓవర్ ఫ్లో ఆఫ్ పవర్ ఫుల్ ఫీలింగ్స్” అన్నాడు. ఆశువుగా, అప్పటికప్పుడు నీలోంచి వెల్లువెత్తే బలమైన అనుభవాలను వ్యక్తీకరించేదే కవిత్వం. ఎప్పుడొస్తది కవిత్వం? మనసు పొంగిపొర్లాలి. చెరువులు పొంగిపొర్లినట్లే, మనసులోని భావాలూ పొంగిపొర్లాలి. ఆ పొంగిపొర్లే పవర్ ఫుల్ ఫీలింగ్స్ తో , అంటే మనసు శక్తివంతమైన అనుభవాలతో, అనుభూతులతో అక్షరమై పొంగిపొర్లాలి. మనం తట్టుకోలేనంత ఉద్వేగం కలగాలి. కృతక ప్రయత్నం వేరు, తెచ్చిపెట్టుకున్న ప్రయత్నం వేరు. స్పాంటేనియస్ కవిత్వం వేరు. దాశరథికి కవిత్వం కోసం కాగితం దొరకకపోతే, ఒక పద్యం మనసులో కలిగితే, తన పైజామా నాడాను ఒక్కో భావం రాగానే ఒక్కో ముడి వేసేవాడట. తెల్లవారి జైలు గోడలమీద బొగ్గుతో రాసేవాడట. భావోద్వేగం కవిత్వంలో కీలకం.
కట్టమంచి రామలింగారెడ్డి “భావోద్రేకమే కవిత్వానికి ప్రాణం“. అన్నాడు. అణచుకున్నా, శాంతంగా ఉండాలన్నా ఉండనీయని భావోద్రేకం కలిగి కవి శరీరంలోంచి, కవి మనసులోంచి, తట్టుకోలేని భావాలు పొంగాలి.. పొంగి పొర్లడమనేది ఎప్పుడు జరుగుతుంది? ఆ స్థితి ఏంటి? అంటే దాన్నే ‘మూడ్’ అన్నారు. పోయెట్రీ రాయడానికి మూడ్ ఉండాలి. కానీ మూడ్ రాగానే సరిపోదు. భాష, శబ్దాలు కవి మూడ్ కు సహకరించే ఉపకరణాలు. క్రిస్ట‌ర్ కాడ్వెల్‌ “ పొయెట్రీ ఈజ్ హైటెన్డ్ లాంగ్వేజ్ “అన్నాడు. కవిత్వ‌మంటే ఉన్నతీకరించబడిన భాష. అన్నింటికి భాషే ముడిసరుకు. ఉదాహరణకు వజ్రం, రత్నం ముడిసరుకుగా ఉన్నప్పుడు వాటి కాంతి దేదీప్యమానమవవు. సానబెడితే ధగద్ధగేయమానంగా మెరుస్తాయి. మెరుపును తీసుకురావడం అంటే ఉన్నతీకరించాలి. మన చుట్టూ ఉన్న నిత్యజీవితంలోనూ, కాలప్రవాహంలో దొర్లుతూపోయే ఈ భాషను పట్టుకోవాలి. భరతుడు, “మృదులలిత పదార్థం”అన్నాడు. లలితమైనటువంటి, సుతిమెత్తనైనటువంటి, మృదువైనటువంటి పదాలు నాలుక మీద నడయాడాలి. ఇవి సేకరించుకోవడానికి విస్తృత అధ్యయనం ఒకటే మార్గం.
మార్మికమైన శబ్దాల ప్రయోగం చేస్తే కవిత్వ సోయగం దెబ్బతింటుంది. కవిత్వానికి మూడు శత్రువులు అనీ అన్నారు. 1. పాండిత్యం 2. బౌద్ధికత 3. శాస్త్రం. కవికీ, శాస్త్రకారునికి పొంత‌న కుదురదు. కవి భావుకతతో పని చేస్తే, శాస్త్రవేత్త సత్యంతో పనిచేస్తాడు. ప్రకృతిని వర్ణించేప్పుడు అది నిరూపణ కావాలంటుంది శాస్త్రం.

“వెన్నెల నన్ను ప్రేయసిలా ఆలింగనం చేసుకున్నది” అంటాడు కవి. శాస్త్రకారుడు, వెన్నెలేంటిది? నిన్ను ఎలా పట్టుకుంటుంది? అంటాడు. నండూరి సుబ్బారావు ఎంకిపాటలు రాస్తూ, “ఎన్నెలంతా మేసి యేరు నెమరేసింది” అన్నాడు. అద్భుతమైన పంక్తులు. సెలయేరు మీద వెన్నెల కురిసినప్పుడు మొత్తం ఆ ఏరు వెన్నెలను స్వీకరించి నెమరేసుకున్నట్లున్నది అంటాడు. వెన్నెల గడ్డా? ఏరు గొడ్డా? అంటూ విమర్శిస్తాడు శాస్త్రకారుడు. కవిత్వం భావోద్వేగంతో కూడి ఉంటుంది కాబట్టి లోలోపలినుండి తన్నుకువస్తుంది. కవిత్వం రాసే కవి హృదయావిష్కారమ‌ది. ఇందులో ఉప్పొంగేవి భావాలే! మన హృదయమే, మన మనసే సాక్షి. కవిత రాసాక మనసు తేలికపడితే గొప్ప కవి అన్నట్టు. కవితగా వచ్చేస్తే మానసికమైన ఒత్తిడులు తగ్గి హాయి ఉంటుంది. లేకుంటే అశాంతిగా ఉంటుంది. ఇట్లా భావాన్ని వ్యక్తీకరించే శక్తి కూడా ఉండాలి. కట్టమంచి రామలింగారెడ్డిగారు జ్ఞాపకశక్తి గొప్పదా, మనశ్శక్తి గొప్పదా అని చర్చించినప్పుడు మనశ్శక్తే గొప్పదన్నాడు. ఇప్పుడు వేరుగాని గతంలో కృష్ణశాస్త్రి, రాయప్రోలు అవధానాలను కవిత్వంగా ఒప్పుకోలేదు. అవధానులది అంతా పాండిత్యం. ధారణ అది. అంటే జ్ఞాపకశక్తి. వారు పండితులు. మనశ్శక్తి కొత్తది సృష్టిస్తుంది. జ్ఞాపకశక్తి ఉన్నదాన్ని గుర్తుకుపెట్టుకుంటుంది. కొత్త సృష్టి చేయదు. విలక్షణమైన, లక్షణమైనకవిత్వం ‘మహాప్రస్థానం‘. ‘మరో ప్రపంచం ‘ అన్నాడు శ్రీశ్రీ. మనం నిజంగానే మరోప్రపంచం ఊహించాము. అలా కవిత్వం వర్ణించాలి,అందంగా ఉండాలి,ఔచితీమంతంగా ఉండాలి . కవిత్వంలో నచ్చిన పంక్తులు పదేపదే గుర్తొచ్చే పంక్తులు ఎవరైతే రాస్తారో అదే కవిత్వం.

“నిరంతరం జ్ఞాపకం ఉండేది కవిత్వం “ అన్నారు తిరుపతి వేంకట కవులు. వెంటాడేది,భావోద్వేగాలతో మనసును ఆవహించేలా ఉండాలి కవిత్వం. భాష పట్టుబడాలి. కవిత్వం మీద ఉండే ప్రేమ ఖచ్చితంగా భాష మీద ఉండాలి. వరవర‌రావ్ “నా ఫస్ట్ లవ్ కవిత్వం” అన్నాడు. భాష ద్వారానె కవిత్వ కళ‌ సిద్ధిస్తుంది, ఆకట్టుకుంటుంది. అభ్యాసం తో కళ వస్తుంది. కవిత్వాన్ని ప్రేమించగలిగే అభ్యాసం కావాలి. దండి, ‘ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళీ కవిత్వం’ అన్నాడు. ఇష్టముతో కూడిన అర్దాలను ఇష్టం తో నే పట్టుకోగలము. కవిత్వ ఆత్మ‌ను పట్టుకోవాలి. పదాలు, మాటలు, వాక్యాలు మన పక్కనించే పోతుంటవి. మనం గుర్తించకుంటే కవిత్వం రాదు. భాష లో ఉండే సౌందర్యాన్ని ఆవాహన చేసుకోవాలి. ప్రతిభావంతుడు కూడా బాల్యం నుంచి నైపుణ్యాల కోసం కృషిచేయాల్సిందే. ఈ కాలానికి అన్వయించుకుంటే , సెల్ఫోన్ కు సిగ్నల్స్ అందినట్టు ఉండాలి కవిత్వం. అప్పుడే కళ ఆవిష్కారమవుతుంది. కవికీ పాఠకునికీ కనెక్ట్ కావాలి.ఆ సిగ్నల్స్ ద్వారానే కళ ఆవిష్కారమవుతుంది. ఇది ప్రత్యేకమైన కళ. అలవోకగారాదు. నేర్చుకోవాలన్న తపన ఉండాలి. జిజ్ఞాస ఉండాలి. నేర్చుకున్నాక కళగా మారే అవకాశం వుంది.

పోయెట్రీ ఈస్ ఆర్ట్ అఫ్ ఎక్స్ప్రెషన్. జీవితం లో ముంచి తీయాలి. రగులుతున్న భావం లో కాలినటువంటి భాష కావాలి. జీవితం తో ఉండే గాఢమైన అనుబంధంతో పరిశీలనతో కవిత్వం వస్తుంది. ఏ కళ అయినా భావోద్వేగం తో నే ముడిపడింది ఉంటుంది. మొండివారిపోయిన యాంత్రికమైన మనసుకు కవిత్వం అంటదు. భావాలని స్వీకరించ గలగాలి.

ఆర్ట్ ఆఫ్ పోయెట్రీ , అనేది లైఫ్ లాంగ్ క్రాఫ్ట్ . అంటే చెక్కడమే! ఇది క్రాఫ్టే! నిపుణత్వం ! జీవితకాలం నేర్చుకోవాల్సిన నైపుణ్యం . కవిత్వం జీవితకాలం అభ్యసించాల్సిన క‌ళ కవిత్వకళ . హృదయంతో ఆస్వాదన చేసుకోవాల్సింది . దాశరథి “ అన్ని ఇజాల వాళ్ళు చాపకూడు కుడువడానికి సరిపోయే అద్భుతమైన వేదిక కవిత్వం” అన్నాడు. అన్ని ఇజాలు, భావకవిత్వం, రివెల్యూషనరీ పోయెట్రీ , ప్రోగ్రెసివ్ పోయెట్రీ , దళిత, వుమెన్ , మైనారిటీ పోయెట్రీ, అనుభూతి వాద , సర్రియలిస్టిక్ పోయెట్రీ -అన్ని,అన్నీ ఉంటాయి. ఇన్ని ఇజాలవారు ఎక్కడ కలుస్తారూ అంటే కవిత్వం దగ్గర కలుస్తారు. ఒక కవికి మరో కవి అంటే అభిమానం ఉంటుంది ఉండాలి. ఇదే కవిత్వ శక్తి, ఇదే కవిత్వ కళ!

కవిత్వం మరింత గొప్పగా రాయడానికి మనశ్శక్తి, బౌద్ధిక శక్తి,శరీర శక్తి అన్నీ కలిసి, కలిపి రాస్తే ప్రాణ‌శ‌క్తి వ‌స్తుంది. పరవశాన్ని కలిగించే కవిత్వం వస్తుంది. వర్తమానానికి అనుగుణంగా కవిత్వాన్ని మలుచుకుంటూ రాయాలి. నిన్న కోత కోసిన కొడవలి ఇవ్వాళ తెగదు. మళ్ళీ సాన పెట్టుకోవాలి. అట్లాగే కవి తనను తాను సాన పెట్టుకోవాలి. సీతాకోక చిలుకనో, దువ్వెననో తూనీగనో పట్టుకోవాలంటే చిన్నతనంలో ఎట్లైతే ఎంత నిశ్శబ్దంగా , జాగ్రత్త పడేదో ఒదిగి, ఒడిసి ప‌ట్టుకునేదో అట్లా! అట్లా జాగ్రత్తవహిస్తే దొరుకుతుంది. మనల్ని మనం అంతగా ఒదిగించుకోవాలి. పట్టుకోవాలి. నేర్పుగా కవిత్వ రెక్కల్ని పట్టుకోవాలి. క‌విత్వాన్ని అందుకుందాం. కవిత్వ కళలు లోకం కోసం వినియోగిద్దాం!!

-నందిని సిధారెడ్డి
తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు
+91-94403 81148

You may also like

Leave a Comment