ప్రముఖ కవి,సీనియర్ న్యాయవాది, గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన పల్లెపొలిమేరల్లోకి కవితా సంపుటి పై పుస్తక సమీక్ష.ఈ పుస్తకాన్ని కవి మల్లారెడ్డి తమ తండ్రి లింగారెడ్డికి అంకితం ఇవ్వడం ముదావహం.ఈ పుస్తకానికి వి.లక్మి నారాయణ చారి చక్కటి ముఖచిత్రం అందించారు.కవి మల్లా రెడ్డి ఈ పుస్తకానికి ఒక మాట – కవి బాట అంటూ తన మనసులోని భావాలను వెల్లడించారు.కవిత్వం ఇలా ఉండాలని నిర్వచించను నేను.దానికి హద్దు ఉంటుందని అనుకోను.అది వివిధ కళారూపాలలో ఉంటుందని నమ్ముతాను.కవిత్వానికి పరమార్థం ఉండాలని నమ్మే వాళ్ళలో నేను ఒకన్ని.
ఈ చిన్న పుస్తకములో ప్రచురించిన గేయాలు,కవితలలో ఉన్నది కవిత్వమో,కాదో సహృదయులైన పాఠక మిత్రులు,కవులు,రచయితలు,విమర్శకులే నిర్ణయించాలి.నా గుండె చేస్తున్న లయకి,మనస్సు కంపనాలకి,సమాజములో ప్రత్యక్షంగా కనిపిస్తున్న దృశ్యాలకి నాకు తెలిసిన పదాలలో రూపకల్పన చేశాను.ఇవన్నీ నా అనుభూతి గీతికలు.నా కళ్ళు చూసిన నిజాలు,మనస్సు కనే కలలు.కవిత్వానికి సామాజిక స్పృహ,మానవతా దృక్పథం ఉండాలని, సమస్త మానవజాతి కళ్యాణం కోసం,సుఖ శాంతుల కోసం మానవున్ని కార్యోన్ముఖున్ని చేయాలని ప్రగాఢంగా వాంఛిస్తాను. ఉపనిషత్తులలో మన పూర్వీకులు నుడివినట్లుగా అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ,మృత్యోర్మా అమృతం గమయ అనే నానుడి కవిత్వానికి ఊపిరి కావాలి. మానవుడు అనంతంగా దోపిడీ చేయబడుతూనే ఉన్నాడు.దోపిడీ నశించాలి.మనుషులందరు స్వతంత్రులై ఆర్థిక,రాజకీయ,సాంఘిక,సమానత పొందాలని ఎన్నో కలలతో,ఆశలతో స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాము.కాని జరిగింది ఏమిటి? సమానత్వం వచ్చిందా?రూల్ ఆఫ్ లా దేశములో పాటించబడుతుందా?దేశములో పోలీసులు,కోర్టులు ఆలోచనాసరళి,నడవడి ఏ విధంగా ఉంది?అని తోటి మనుష్యుల్ని ఆలోచింపజేయాలని ఈ కవితా సంపుటిని ప్రచురిస్తున్నాను.ఈ పల్లెపొలిమేరల్లోకి కవితా సంపుటిని ఆదరించగలరని సహృదయులైన పాఠక మిత్రులను కోరుకుంటాను.ఇందులో ప్రధానంగా సామ్యవాదం,చైతన్యం గూర్చి చెప్పబడిన గేయాలే అధికంగా యున్నవి. ఇందులో కనిపించే ఇజం మానవ నైజం.మానవత అదే నా అంతరాంతరాలలో అనునిత్యం పారాడే అనుభూతి.ఈ చిన్న కవితా సంపుటిని ఆదరించగలరని కోరుకుంటూ సహృదయులైన పాఠకులను సాహితీ మిత్రులను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అని కవి మల్లారెడ్డి అన్నారు. కవి మల్లారెడ్డి రచించిన విలక్షణ కవితా సంపుటి పల్లెపొలిమేరల్లోకి అంటే అతిశయోక్తి కాదు. నాగలి పట్టి దుక్కి దున్ని బక్క చిక్కిన సగటు గ్రామీణ రైతు జీవిత చిత్రం ఈ కవిత్వంలో చూడొచ్చు. దేశంలోని 70 శాతం మంది ప్రజలు వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నారు.హాలికుడైన రైతు మట్టిని నమ్ముకుని మడి చెక్కను దున్ని సేద్యం చేస్తున్నాడు.కాలం ఉంటేనే పంటలు.వర్షాధారంతో సాగుబడి అవుతున్న భూములు.రైతు ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని కష్ట పడతాడు.రైతు అహర్నిశలు పొలాలు,చేనులు,చెల్కల్లో శ్రమిస్తాడు.ఈ దేశంలో కష్టపడే వాళ్ళు ఎవరు?అంటే రైతులు అని ఠక్కున చెప్పవచ్చు.రైతు చేస్తున్న శ్రమకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉందా?లేదు అని చెప్పవచ్చు.రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమిస్తున్నది రైతు.లాభాలు దండుకుంటున్నది దళారులు.ఈ వ్యవస్థలో తరాలుగా మార్పు లేదు.నిజంగా భారత దేశంలో రైతుల దుస్థితిని కళ్ళకు కట్టినట్లు చిత్రించారు ఈ కవితలో మల్లారెడ్డి.పల్లె పొలిమేరల్లోకి కవితలో నా వాళ్లంతా/నాగళ్లకు సిలువ వేయబడి/తరతరాలుగా/నెత్తురుని/నెత్తురు కంటే అమూల్యమైన చెమటని/సమాజం కోసం ధారపోస్తున్నప్పుడు/అంటున్నారు.మనకు తెలిసిన బైబిల్ కథ ఏ నేరం చేయని మంచి కోసం పాటు పడిన ఏసుక్రీస్తు ప్రవక్తను సిలువ వేసి పొట్టన పెట్టుకున్న వైనం.భారతదేశంలో రైతులు నాగళ్ళకి సిలువ వేయబడి తరతరాలుగా నెత్తురుని నెత్తురు కంటే అమూల్యమైన చెమటని సమాజం కోసం ధారపోస్తున్నారు.ఈ కవిత 1984 సంవత్సరంలో నలభై సంవత్సరాల కింద రాయబడింది.ఇది కవితా సంపుటిలోని మొదటి కవిత.దేశంలో రైతులను నాగళ్ళకి సిలువ వేసినప్పటికీ దుక్కి దున్నడం మాన లేదు.అనాదిగా రైతు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.రైతు పండించిన పంటతో జనానికి తిండిని పెడుతున్నాడు.రైతే రాజు,జై కిసాన్, అన్నదాత సుఖీభవ అనే నినాదాలు వెలవెలబోతున్నాయి.స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం. అయినప్పటికి రైతు జీవితంలో ఎలాంటి మార్పు రాదు అనే తీరుగా పాలకులు వ్యవహరిస్తున్నారు. మల్లారెడ్డి ఆశావాది.రైతు శ్రేయస్సు కోసం అహరహం కాంక్షించే వ్యక్తి అని కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.ఈ కవిత రైతులు ఎదుర్కొంటున్న సామాజిక,ఆర్థిక సమస్యలకు అద్దం పట్టినట్లుగా ఉంది.వర్తమాన గీతం కవితలో గాలిలా/ సూర్యరశ్మిలా/విశాల విశ్వములో/నీలాల నింగిలా/ నేలా/నీరు/అందరిది/భౌగోళిక హద్దులు లేవు/స్వంత పద్దుల ఆలోచనే లేదు/అప్పుడు మనిషంటె/సమిష్టి మానవ సంఘంలో/ఒక అంగం – అంతర్భాగం/ నేడు/మనిషంటె/కులం/మతం/వర్గం/దేశం/ఖండం అంటూ/విశ్వ మానవాత్మని/ముక్కలు ముక్కలుగా నరుకుతున్నాడు/మానవతని సమూలంగా హత్య చేస్తున్నారు/చీ!చీ!/ఏం దుర్గతి పట్టింది మానవ జాతికి/చీదరించుకుంటున్నవి/మిగతా నోరులేని విగత జీవులు/విప్పి చెప్పలేని సత్యాన్ని/విడమరిచి ముచ్చటించుకొంటున్నవి/మరి మనసున్న/ మనకెందుకు రాదు?/ఆ మంచి ఆలోచన/రండి కూర్చుందాము/తీరికగా చర్చిద్దాము/విశ్వ మానవ తత్వాన్ని/మంచి చెడుల/వెలుగునీడల/జాడల్ని వాడల్ని/గుండె మూలల్లో వెదుకుదాము/ అంటున్నారు.విశాల విశ్వంలో పంచ భూతాలు అందరివి.ఆ రోజుల్లో మనుషులందరు సమిష్టిగా కలిసి మెలిసి ఉండే వారు.నేడు మనిషి కుల మతాల పేరిట వర్గ విభేదాలను సృష్టిస్తున్నాడు. అధిపత్యం పేరిట దేశాల మధ్య యుద్ధాలు నడుస్తున్నాయి.మానవతను సమూలంగా హత్య చేస్తున్నారు.ఈనాటి మనుషులకు బుద్ధి ఎప్పుడు వస్తుంది?మనుషులు విశ్వ మానవ తత్వాన్ని ఎరిగి మసులుకోవాలి అనే భావన అద్భుతంగా ఉంది. ఎంత హాయి కవితలో ఇప్పుడు రోజు పాడుతున్నాను/అదే పాట/జైల్లొ – రైల్లొ/బస్సుల్లో/ కోర్టు హాల్లో/వందల దొరల ముందు/వేల పోలీసుల ముందు/జనం ముందు/జడ్జీల ముందు/ఎంత హాయి/అంటున్నారు.తెలంగాణలో ధనవంతులైన ఆసాములకు పోలీసులు దాసులుగా పని చేస్తున్నారు.ఈ వ్యవస్థ మారాలి.ప్రశ్నించే గొంతులను తప్పుడు కేసులతో వేధిస్తూ కొందరి ప్రాణాలను తీస్తున్నారు.రాజ్యాంగం కల్పించిన హక్కులను మనం పోరాటాలు చేసి పరిరక్షించుకోవాలి.ప్రజలు తమ హక్కుల కోసం పోరాటాలు చేయాలి.ఈ వ్యవస్థ బాగు కోసం దొర దొమ్మి ఆటలను గూర్చి పాట పాడినందుకు యువకుడు ఎన్నో శిక్షలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ఇప్పుడు ఆ యువకుడు పాట పాడుతున్నాడు.జనం ముందు,జడ్జీల ముందు, ఎంత హాయి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.కత్తి – డాలు కవితలో కాలం ఒక్కటే నాకున్న డాలు/నిజం ఒక్కటే నాకున్న కత్తి/నీకు ఎన్నెన్ని ఆయుధాలు/ అయినప్పటికి/గెలుపు నీకు సందేహమే?/ఎందుకో తెలుసా?/నా డాలు మానవత్వపు లోహపు ముద్ద/ నా కత్తి కమ్యూనిజంలో పదును పెట్టింది/ అంటున్నారు.డాలు పోరాట సమయంలో కత్తితో పాటు ఉపయోగించే ఆయుధం.వర్తులాకారంగా ఉండి మధ్యలో వుబ్బెత్తుగా ఉండును.వెనుక పక్కన చేతితో పట్టుకొనుటకు పిడి వుండును.ఎదుటి వ్యక్తి కత్తితో దాడి చేసినప్పుడు కత్తి వేటును అడ్డు కొనుటకు డాలును అడ్డుగా ఉంచెదరు.కత్తి – డాలు జంట పదాలు.ఈ కవితలో వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది.నేనెవరో తెలుసా?కవితలో ఇంతకి నా పేరు చెప్పనేలేదు/గౌతముడు నా రూపమే/జీసస్ నా ప్రతిరూపమే/గాంధీ నా వారసుడే/పేరు మానవత/ ఊరు విశాల విశ్వం/అంటున్నారు.సర్వ మానవాళి సుఖశాంతులు కాంక్షించడం,గౌతముడు,జీసస్, గాంధీ నా వారసుడే అని పేర్కొనడం,పేరు మానవత,ఊరు విశాల విశ్వం అని వ్యక్తపరిచిన భావాలు నిజాయితీని చాటుతున్నాయి.నేనెవరో తెలుసా?అంటూ ప్రశ్నిస్తూ సమాధానం చెప్పిన తీరు చక్కగా ఉంది.నిజం కవితలో ఇవాళ్ల పోలీసులు అరెస్టు చేశారు నన్ను/ఎందుకో తెలుసా?/నేను అక్కపల్లిలో పుట్టినందుకు/అక్కపల్లిలో ఇరవై సంవత్సరాలు నుండి పెరిగినందుకు/స్వేచ్ఛగా గాడుపు పీల్చి నందుకు/దొరల మాట విననందుకు/అంటున్నారు.అమాయకుడైన యువకుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు.జైలు నుండి విడుదల అయి కన్నీళ్ళతో చెప్పిన కథను కవి మల్లారెడ్డి కవితగా మలిచారు.దొరలు పోలీసులను లంచాలతో తమ వైపు తిప్పుకుంటారు.దొరలు తమ మాట వినని అమాయకులను కేసులలో ఇరికించి జైలు పాలు చేస్తారు.ఆ యువకుడు నిజమైన విప్లవకారుడు అవునా?కాదా?అని పరిశీలించాల్సిన పోలీసులు ఒక క్షణం ఆలోచిస్తే బాగుండేది.కానీ చివరకు పోలీసులు ఏ నేరం చేయని అమాయకుడైన యువకుడిని బలి చేశారు.చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు రాక్షసత్వం ప్రదర్శిస్తూ అమాయకులను పట్టుకొని జైలు పాలు చేస్తున్నారు. బ్రిటిష్ కాలం నుండి వచ్చిన పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలి.నిజాయితీపరులను పోలీసులుగా ఎంపిక చేయాలి.ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేసి సమ సమాజంను స్థాపించాలి.ఆ యువకుడి అశ్రుధారలు కవితా బిందువులుగా మల్లారెడ్డి కలం నుండి నిజం కవితగా రూపుదిద్దుకున్నాయి.నిజం కవిత సమాజానికి స్ఫూర్తిని అందిస్తుంది.నడవడి కవితలో అయితె నేమి ఆ కామ్రేడు నడవడి/భావితరాల వాళ్ళకి రహదారి/మరి పోలీసుల నడవడి/యమదూతల ఒరవడిలో/అంటున్నారు.సమాజంలో పేదరికం, నిరుద్యోగం,అసమానతలు కొనసాగుతున్నాయి. పేదలు నిరుపేదలుగా మారుతున్నారు.నిరుద్యోగం పెచ్చు పెరిగిపోతుంది.ధనికులు కోట్లకు పడగ లెత్తుతున్నారు.అత్యాచారాలు,అరాచకాలు,దోపిడీల గురించి ప్రశ్నించినందుకు,పోరాటం చేస్తున్నందుకు కక్షతో దొరలు వారి తాబేదారులు పోలీసులకు అప్పగిస్తున్నారు.పోలీసులు పోరాట వీరులను చిత్రవధ చేసి చంపుతున్నారు.సమాజం కోసం పాటుపడుతున్న ఆ కామ్రేడు నడవడి,భావితరాలకి రహదారి,పోలీసుల నడవడి యమదూతల ఒరవడి. యమదూతలు తప్పు చేసిన వాళ్లను తీసుకుపోయి యమధర్మరాజు ముందు ప్రవేశపెడతారు.అప్పుడు యమధర్మరాజు ఇతడు చేసిన నేరం ఏమిటి?అని అడుగుతాడు.తప్పు చేసిన వాళ్లను సలసల కాగే నూనెలో వేస్తారు.కానీ మంచి కోసం,మంచి సమాజం కోసం పోరాడే వాళ్లకు స్వర్గం చూపించాలి.తప్పులు చేయని వాళ్లకు పోలీసులు నరకం చూపించడం ఎంత వరకు సబబు,ఏ శిక్షా స్మృతిలో ఉంది. పోలీసులు పరిశీలన చేసుకోవాలి.ఆత్మ శోధనలేని బతుకు అది ఏమి బతుకు?పోలీసు మిత్రులు సరియైన నడవడిలోకి మారేందుకు ఈ కవిత ఒక గుణపాఠంగా ఉంటుందని భావిస్తున్నాను.పోలీసుల నైతిక శిక్షణ పాఠ్యాంశాల్లో నడవడి కవితను కూడా చేర్చాలి.కవులు,కళాకారులు ప్రజలను సరైన నడవడి కల వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు రచనల ద్వారా కళారూపాల ద్వారా అశేషమైన కృషి చేస్తున్నారు.చేదు మాత్ర కవితలో ఏదో అన్యాయం జరిగి/వాడిలో ఆవేశం పెరిగి/ఎవడి రక్తం వాడికే చెందాలి/ఎవడి చెమటని వాడే పొందాలి/మధ్యలో దొర ఎవ్వడు?/ఆని పోకడేంది?/పటేలు ఎవ్వడు?/ ఆని పటాటోపం ఏంది?/అన్నంత మాత్రాన/నక్సలైట్ ఎలా అవుతాడు?/వాడి దగ్గర బాంబు లెందుకుంటాయి?/కేసు పెట్టిన నాడు/ఒక్క పోలీసులకే మెదడు లేదనుకున్నాను/నేడు తీరా శిక్ష పడ్డాక/జడ్జీలలో పోలీసు తమ్ముళ్లే ఉన్నారని/నన్ను నేను సముదాయించుకున్నాను/అంటున్నారు.ఈ కవితను వ్రాసిన మల్లారెడ్డి న్యాయవాది,మా పల్లె గొల్ల ఎల్లయ్యకు సంబంధించిన కేసును వాదించినాడు.గొర్లు కాచేవాళ్లు పోలీసు అధికారులకి పండుగల పేరిట జీవాలు ఇనాంగా ఇవ్వాలి. దొరలకి,పటేండ్లకి, పెండ్లిండ్లకు మరియు పేరంటాలకి జీవాలు ఇనాంగా ఇవ్వాలి.ఎల్లయ్యకు దొరలపై, పటేండ్లపై మరియు పోలీసులపై కక్ష ఎందుకు ఉంటుంది?ఎల్లయ్య జీవాలను కాస్తూ వృత్తి జీవితాన్ని గడుపుతున్నాడు.ఎల్లయ్య దగ్గర బాంబులు ఎందుకు ఉంటాయి?అమాయకుడు ఎల్లయ్య మీద కేసు బనాయించడం,దొరలు,పటేండ్ల ప్రోద్బలంతో జరిగినట్లుగా తోస్తుంది.నక్సలైట్లను ఎదుర్కోలేక అమాయకుడైన ఎల్లయ్య మీద కేసు బనాయించారు.సాక్ష్యాధారాలు పరిశీలించి జడ్జి అమాయకుడికి శిక్ష వేయడం ఎంత వరకు సబబు? అమాయకుని మీద కేసు పెట్టిన పోలీసులకే మెదడు లేదనుకున్నాను.కానీ తీరా శిక్ష పడ్డాక జడ్జీలలో కూడా పోలీసు తమ్ముళ్లే ఉన్నారని నన్ను నేను సముదాయించుకున్నాను అని వ్రాసిన కవిత చేదు మాత్రగా ఉంది.ఆనాటి వైద్యులు ధన్వంతరి వారసులు ధరణిలోని దేవతలు ఇచ్చిన చేదు మాత్ర రోగాన్ని నయం చేస్తుంది.అమాయకుడైన గొల్ల ఎల్లయ్యకు వేసిన శిక్ష చేదు మాత్ర.జడ్జీలలో పోలీసు తమ్ముళ్లే ఉన్నారు అనడం మల్లారెడ్డి సంస్కారాన్ని తెలియజేస్తుంది.చాలా మంది జడ్జీలు కింది నుండి పై దాకా అన్యాయపు తీర్పులు ఇస్తూ అమాయకుల ఉసురు పోసుకుంటున్న తీరును చేదుమాత్ర కవిత ద్వారా వెల్లడి చేశారు.ఖైది సంకల్పం కవితలో ఖైది కళ్ళలో/తిరుగుబాటు బావుటా రెపరెపలాడింది/ అంటున్నారు.జైలులో ఉన్న ఖైదీ కళ్ళలో తిరుగుబాటు జెండా ఎగురవేసినట్లు కనిపించింది. ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్యంలో ప్రజలకు సుఖశాంతులు లభించడం లేదు.ఈనాటికీ దోపిడీ విధానం కొనసాగుతుంది. పాలకవర్గాలు చేస్తున్న దోపిడీని అరికట్టడం కొరకు యువకులు మార్పు కోసం పోరాడుతున్నారు.ఈ దేశంలో నివసిస్తున్న తల్లులు ప్రజల జీవితాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న తమ పిల్లలను జైలులో ఖైదీలుగా చూస్తున్నారు.ఈ వ్యవస్థ మారాలని కాంక్షించే వాళ్ళలో కవి మల్లారెడ్డి ఒకరు. అతడు రాసిన ఖైది సంకల్పం కవిత సమాజానికి ఒక ప్రేరణగా నిలుస్తుంది.ఖైదీ సంకల్పం కవిత దిక్సూచిగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. 164 Cr.P.C. STATEMENT (స్టేట్ మెంట్) కవితలో కాని/నిరాశ వాదాన్ని/కర్మ సిద్ధాంతాన్ని/ మర్మ సిద్ధాంతాన్ని/మాయ సిద్ధాంతాన్ని/నా చుట్టూర పడి వున్న/చీమలకు మాత్రం/చస్తే చెప్పలేను/ అంటున్నారు.చీమలను మాత్రం సరైన దారిలో నడిపిస్తానని ప్రతిన చేసి చెప్తున్నాడు.90 శాతం ఉన్న చీమల్లాంటి జనాలు పేదరికం,అవిద్య, నిరుద్యోగం,అసమానతలు,కుల వివక్ష ఎదుర్కొంటున్నారు.పౌరుల హక్కుల కోసం పోరాడుతున్న కలాలను,గళాలను చంపుతున్నారు.
అయినప్పటికీ 90 శాతం ఉన్న చీమల్లాంటి ప్రజలకు నిరాశా వాదాన్ని,కర్మ సిద్ధాంతాన్ని,మర్మ సిద్ధాంతాన్ని,నా చుట్టూర పడి ఉన్న వాళ్లకు చస్తే చెప్పను.చీమలను ఉదాహరణగా చెబుతూ 90% ప్రజలకు హామీ ఇస్తున్నాడు.కవి మల్లారెడ్డి మానవులంతా ఒక్కటేనని ధనిక,పేద,తేడాలు ఎందుకని సమానత్వంతో అందరూ క్షేమంగా ఉండాలని కాంక్షించే వారిలో ఒకరని కవిత చదివితే తెలుస్తుంది.కవి మల్లారెడ్డి ప్రజలకు స్ఫూర్తిని, చైతన్యాన్ని కలిగించే కవితను అందించారు. ఇదెక్కడి న్యాయం కవితలో పాలకవర్గమా!/చట్టం, నువ్వు/ఇద్దరు నా శత్రువు చుట్టాలే అని చెబుతున్నా/చట్టం చెప్పినట్టు వింటామంటావేమిటి?/ఇదెక్కడి న్యాయం?/ అంటున్నారు.సాధారణంగా అన్యాయమును ప్రశ్నించే సందర్భంలో ఇదెక్కడి న్యాయం అని ఉపయోగిస్తాం.న్యాయం అనేది సమానత్వం, సత్యం,ధర్మం మీద ఆధారపడినది.కానీ మన జీవితంలో అనేక సందర్భాల్లో అన్యాయం చోటు చేసుకుంటుంది.అది వ్యక్తిగతంగా కావచ్చు లేదా సమాజంలో ఇతరుల పట్ల జరగడం కావచ్చు.
అన్యాయం జరిగినప్పుడు మనలో ఆవేదన, ఆగ్రహం కలుగుతాయి.కోర్టు వ్యవస్థలో ఆలస్యాలు మరియు న్యాయం ఆలస్యం కావడం వలన బాధితులకు న్యాయం దక్కడం లేదు.సత్వర న్యాయం జరగకపోవడం వల్ల ప్రజల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.సమాజంలో ధర్మంపై న్యాయంపై ఆలోచింప జేస్తుంది.చట్టం,పాలకులు,సామాన్య మనిషి మధ్య ఉన్న విరోధాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కవి న్యాయ వ్యవస్థ మరియు పాలకులపై ప్రశ్నలు లేపుతున్నాడు.ఇదెక్కడి న్యాయం?అని ఒక ప్రశ్నను సంధిస్తున్నాడు.అన్యాయానికి గురి చేసిన పరిస్థితిని ప్రశ్నిస్తున్నాడు.ఈ దేశంలో నివసించే సామాన్య ప్రజలకు న్యాయం అందడం లేదు.సామాన్య ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు అనే భావనను ఈ కవిత ప్రతిబింబిస్తుంది.చట్టాలు తయారుచేసి అమలు చేసే పాలకులను ఉద్దేశించి పాలకవర్గమా?అని ప్రశ్నిస్తున్నాడు.పాలకులు సామాన్యుల అవసరాలను పట్టించుకోవడం లేదు. పాలకులు స్వార్థంతో వ్యవహరిస్తున్నారనే భావం వ్యక్తం అవుతుంది.చట్టం మరియు పాలకులను శత్రువులుగా చూపించారు.చట్టం దుర్వినియోగం చేస్తున్నారు.పాలకులు స్వార్థంతో వ్యవహరిస్తున్నారు.ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది.ఈ దేశంలో సామాన్యులకు న్యాయం అందుబాటులో లేదు.ఇది ఎలాంటి చట్టం?చట్టం వల్ల సామాన్యులకు మేలు జరగడం లేదు.ప్రజలు చట్టాలను గౌరవించడం తప్పనిసరేనా?అని ప్రశ్నిస్తున్నారు.ప్రజలకు న్యాయస్థానాలు నిరాశను, పాలకుల తీరుపై వేదనను కలిగిస్తున్నాయి. ఇదెక్కడి న్యాయం అంటూ కవి మల్లారెడ్డి న్యాయం గురించి ఆలోచింపజేస్తున్నారు.తేడా కవితలో చెలీ!/అప్పుడు నీవు నవ వసంత యామినివి/నాడు కనిపించినవన్ని/మల్లియలు – గులాబీలు/నేడు కనిపిస్తున్నవన్ని/పల్లేరులు – జిల్లేడులు/ ఎండమావులు – బండ బతుకులు/కన్నీళ్లు కష్టాలు/ పంతాలు సాధింపులు/నేడు వినిపిస్తున్నవన్ని/పిల్లల రోగాల గానం/దైనందిన జీవిత నిశ్శబ్ద భయంకర రావాలతో/నీవు నాడు అంది అందని ప్రేయసివి/ కలల ఊర్వశివి/నేడు అందిన యిల్లాలివి/నిరాశల నీడవి/నిట్టూర్పుల జాడవి/అంటున్నారు.చెలీ నీవు కనిపించినప్పుడు జీవితం ఎంతో మధురంగా ఉంది.నాడు అంది అందని ప్రేయసివి.నేడు అందిన ఇల్లాలివి,నిరాశల నీడవి నిట్టూర్పుల జాడవి అంటూ జీవితాన్ని కాచి వడబోసినట్లు వివరించిన తీరు అద్భుతంగా ఉంది.మానవుడే మరో దేవుడై గేయంలో మానవుడే మరో దేవుడై భూతలమ్మున స్వర్గము సృష్టించే/దేవుని మించిన దేవుడై సకల చరాచర జగతిని పాలించే/ కులాల గోడలు కూల్చి – మతాల ముళ్లను కాల్చి/మానవులందరికి మానవతయే గొప్ప మతమని చాటెను/శాంతి అమృతం పంచుతూ లోకమంత స్వర్గము చేయ తలంచే మానవుడు/అంటున్నారు.మానవుడే మరో దేవుడై అనే గేయ వాక్యం ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది.మానవుడు దేవుడితో సమానమైన వ్యక్తిగా భావించబడుతున్నాడు.భూమి మీద స్వర్గాన్ని సృష్టించగల సత్తా మానవునికి ఉన్నది. మానవుని ఆలోచనలు గొప్పవి.మానవుడు సృష్టికి శాంతిని,సంతోషాన్ని ప్రపంచానికి అందించగలరని చెప్పబడింది.మానవుడు దేవుని కంటే గొప్ప శక్తిపరుడు,సమస్త చరాచర జగతిని పాలించగలవాడిగా చూపబడ్డాడు.కులాల మధ్య ఉన్న గోడలు,మతాల మధ్య ఉన్న విభేదాలు తొలగించి మానవత్వాన్ని పెంపొందించుకోవాలని కవి ఆశిస్తున్నాడు.మానవుడు శాంతి,సామరస్యం, సహనం వంటి ఉత్తమ గుణాలను అలవర్చుకొని ఈ లోకాన్ని స్వర్గంగా మార్చాలని తలుస్తున్నాడు.ఈ గేయంలో మానవతా విలువల్ని ప్రోత్సహించి సమాజం అంతట శాంతిని వ్యాప్తి చేయాలనే భావన వ్యక్తం అవుతుంది.మానవుడిని మహోన్నతునిగా గేయంలో వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది. మనుష్యులారా! కోయిలలై గేయంలో మనుష్యులారా కోయిలలై/యిలపై వసంత గానం చేయండి/సమ సమాజానికి ఊపిరి పోయండి/ ఓరిమి పంచి కూరిమి పెంచి/మనిషి అంటే మంచి తనమని చాటుతూ/నవ వసంత గానం చేయండి/ అంటున్నారు.మనుష్యులను కోయిలలతో పోలుస్తూ సమాజంలో వసంతాన్ని తీసుకురావాలని వసంతం కొత్త ఆశలకి సంతోషానికి చిహ్నం. మనుష్యులు కోయిలలా మారి ప్రేమతో ఐకమత్యంతో జీవించాలని కోరుతున్నారు. సమాజంలో అందరికీ న్యాయం,సమానత్వం, అందరు స్నేహంతో అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటూ సమాజాన్ని మంచి దిశలో నడిపించాలని సూచిస్తున్నారు.మనుష్యుల మధ్య ప్రేమను, ఆత్మీయతను,సౌభ్రాతృత్వం భావనను, మంచితనాన్ని పెంచుకొని అందరూ కలిసిమెలిసి ఉండి సమాజాన్ని సౌభాగ్యవంతం చేయాలని కోరుతున్నారు.మనిషి అంటే మంచితనానికి మారు పేరు.మనిషి నిరంతరం కొత్త ఆలోచనలు కలిగి ఉండాలి.కొత్త మార్పులకు స్వీకారం చుట్టాలి. మంచితనాన్ని చాటాలి.నవ వసంతాన్ని గానం చేయాలి అంటూ స్ఫూర్తిని కలిగిస్తున్నారు.రెండు తరాలు కవితలో నేను నా చుట్టూరా పల్లె జనమంతా/పట్టుకూడుపు పిల్లలం/పొట్ట పోసుకోని దరిద్రులం/ఓరిమితో ఊరుకోవడం అలవాటె మాకు/ కాని మా పిల్లలు పొట్ట పోసుకోని దరిద్రులు కాదు/ పోరంటే,వెను తిరిగని పొట్టేళ్లు వాళ్ళు/గమ్యం తప్పా గతులు తెలియని సూర్యుళ్లు వాళ్ళు/అంటున్నారు. మొదటి తరం వాళ్లు బానిస బతుకులు బతికారు. రెండవ తరం వాళ్ళు వెను తిరుగకుండా పోరు బాటలో సాగే పొట్టేళ్లు వాళ్ళు.తరాల మధ్య మార్పును వ్యక్తీకరించిన తీరు చక్కగా ఉంది. ఎవరన్నారు కవితలో ఎవరన్నారు మీరు మంచి వారు కాదని?/అంటున్నారు.ఎవరన్నారు మీరు మంచివారు కాదని ప్రశ్నించడంలోనే సమాధానం దాగి ఉంది.ఈ అసమ సమాజంలో కూడా మంచివారు ఉంటారని నమ్మిన వ్యక్తి.మంచి కోసం పాటుపడుతున్న మంచి వారి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఎందరికి ఉంటుంది?ఎవరన్నారు కవిత మనలో ఆలోచనలు రేకెత్తిస్తుంది.మనలో మరుగున పడిపోయిన మంచితనాన్ని ప్రేరేపించే భావనలు కలిగిస్తుంది.గది – హృది కవితలో ఆ గది/ఈ హృదికి ప్రతిబింబం/ఈ హృది/ఆ గదిని/ కూల్చి రేపటి సౌభాగ్యం కోసం/చెట్ల నీడల్లోకి/కొండ గుహల్లోకి/ బాధలు లేని బంజరు భూముల్లోకి/ సూర్యుడి కిరణాలపై పయనిస్తా/అమృత లోకాల కోసం బాణం సంధిస్తా/అంటున్నారు.విద్యార్థి ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్న రోజులవి.కొందరు విద్యార్థులు చదువు పూర్తి కాగానే ఒక లక్ష్యంతో సమాజాన్ని పట్టిపీడిస్తున్న అసమానతలకు చరమ గీతం పాడేందుకు కంకణం కట్టుకున్నారు.విద్యార్థులు ప్రభంజనంలా ఉద్యమాల్లో దూకారు.సమాజంలో చైతన్యం తీసుకురావాలి అనే సంకల్పంతో అడవులు కొండల బాటలు పట్టారు.కొందరు విద్యార్థులు తమ జీవితాలను ఉద్యమాలకు అంకితం చేశారు.కొందరు విద్యార్థులు భారతమాత ముద్దుబిడ్డలై ప్రజా పోరాటాల్లోకి చేరి ప్రజలను మమేకం చేసే దిశగా ఎదిగారు.ప్రజలకు రాత్రిపూట చదువు నేర్పించినారు.నిరక్షరాస్యత నిర్మూలన,కూలీల రేట్ల పెంపు,వెట్టి చాకిరి నిర్మూలనతో పాటు ప్రజలను సంఘటిత పరిచారు.ప్రజల హక్కులు ఏమిటో తెలియజేసి పోరాటం చేస్తేనే హక్కులు సాధిస్తాం. పోరాటం లేకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉండిపోతాం.ప్రజలకు కూడా తమ సంక్షేమం గురించి పాటుపడుతున్న కార్యకర్తల పట్ల నమ్మకం పెరిగింది.ప్రజలు ఐక్యం అవ్వడం వలన ఉద్యమాలకు ఊపు వచ్చింది.ప్రజలలో వచ్చిన చైతన్యం చూసి పల్లెలో తమ అధికారం సాగదని దొరలు గ్రామాలు విడిచి పారిపోయినారు.దొరలు పట్టణాలలో నివాసం ఏర్పాటు చేసుకుని జీవించసాగారు.ఆ యువకులు సూర్యుడి కిరణాలపై పయనిస్తారని అమృత లోకాల కోసం బాణం సంధిస్తారనే కవి భావన అద్భుతంగా ఉంది.ప్రేయసీ! కవితలో నిన్ను చూశాక తెల్సింది నాకు/అజంతా అడుగులేస్తుందని/ఎల్లోరా కదలాడుతుందని/హంపీ స్వరం విప్పుతుందని/మల్లియలు మాట్లాడగలవని/ వాడని గులాబీలు ఉంటాయనీ/అంటున్నారు.కవి తన ప్రేయసిని చూసిన తర్వాత తనలో పొంగిపొరలే భావాలను అనుభూతులను కవితగా మలిచిన తీరు బాగుంది.ప్రేయసి అందాన్ని,మనసుని కవి భారతీయ సాంస్కృతిక సంపదలైన అజంతా, ఎల్లోరా,హంపీల శిల్ప సౌందర్యంతో మరియు ప్రకృతిలో భాగమైన మల్లెపూలు,గులాబీ పూలతో పోల్చడం అద్భుతంగా ఉంది.అజంతా అడుగు లేస్తుందని అంటే అజంతా గుహల నైపుణ్యాన్ని సూచిస్తుంది.ప్రేయసిని అజంతా లాంటి అపూర్వమైన శిల్ప కళారూపంతో పోలుస్తున్నాడు. ఆమె సౌందర్యం అజంతా శిల్ప సౌందర్యంలా అద్భుతంగా ఉంది.ఎల్లోరా గుహలు భారతీయ శిల్పకళలో ప్రసిద్ధి చెందినవి.ప్రేయసి నడకను, సొగసును ఎల్లోరా శిల్పాలతో పోలుస్తున్నాడు. హంపీ అపూర్వ కట్టడాలకు ప్రసిద్ధి చెందినది.
ప్రేయసి మాటలు స్వరం హంపి శిల్పాలను ప్రతిబింబిస్తుందని చెబుతున్నాడు.సువాసనలు వెదజల్లే మల్లెపూవులను ప్రేయసి మాటల మాధుర్యంతో పోలుస్తున్నాడు.ఆమె మాటలు సుగంధాలు వెదజల్లుతాయి అని సూచిస్తున్నాడు. తన ప్రేయసి అందం వాడని గులాబీ వలె ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉంటుందని అంటున్నాడు.తన ప్రేయసి ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ గులాబీ వలె అందంతో మెరుస్తూ ఉల్లాసంగా ఉంటుందని భావిస్తున్నాడు.ప్రేయసి అందాన్ని భారతీయ సాంస్కృతిక సంపదలతో మరియు ప్రకృతిలో భాగమైన మల్లెపూలతో,గులాబీలతో పోలుస్తూ తన ప్రేమను సున్నితంగా వ్యక్తీకరించిన తీరు బాగుంది. మల్లారెడ్డి ABOUT MY BETTER HALF అని ఆంగ్లంలో రాసిన కవిత గొప్పగా ఉంది. సర్వాంతర్యామితో మనవి కవితలో ప్రజాకంటకులు/ జాతి ద్రోహులు/స్వార్థం మోసం పెంచుకున్న వాళ్లు/ అధికారాన్ని పంచుకుంటున్న వాళ్ళు/అందలాలు ఎక్కుతున్నారు/ఇదెక్కడి న్యాయం ప్రభూ!/ అంటున్నారు.బాధలో ఉన్నప్పుడు భరించలేక గిలగిలా కొట్టుకుంటాం.మన ఆత్మ తృప్తి కొరకే దేవునికి మొర పెట్టుకుంటాం.దేవుడు మన మొరలు ఆలకిస్తాడా?అనేది ప్రశ్నగానే తోస్తుంది.ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లను,ఇబ్బందులను సర్వాంతర్యామితో కవిత ద్వారా మనవి చేయడం చక్కగా ఉంది.సత్యము స్వప్నము కవితలో కలల సౌధంలో – కళ్యాణమందిరం/అంటున్నారు. విద్యార్థులు కంటున్న కలలో కలలసౌధం ఉంది. అందులో కళ్యాణమందిరం ఉంది అని మనకు తెలియజేస్తున్నాడు.పెళ్లంటే నూరేళ్ల పంట అది పండాలి అని కవి రాసిన సినిమా పాటను ప్రతి పెళ్లిలో వింటాం.పెళ్లంటే ఎంత హంగామా?ఇప్పుడు లక్షల రూపాయలు కల్యాణ మందిరాలకు చెల్లిస్తున్నారు.ఆడంబరాల కోసం తల్లిదండ్రులు పెళ్లిలో అనవసరంగా వృధా ఖర్చులు చేయడం వల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.పెళ్లిలో అంత ఖర్చు చేయడం అవసరమా?ఆడపిల్ల తల్లిదండ్రులకు ఆడంబరాల పేరిట ఎంత ఖర్చు చేసినప్పటికీ అమ్మాయిల కాపురాలు బాగున్నాయా?అంటే అది కూడా లేదు.అదనపు వరకట్నం కోసం అత్త,మామ,ఆడబిడ్డలు,భర్త, మరదలు కలిసి కొత్త కోడలును వేధించి చంపేస్తున్నారు.వరకట్నం దురాచారం ఈ దేశంలో ఆడపిల్లల పాలిట శాపంగా మారింది.కట్నం తీసుకుని కోడలును చక్కగా చూడక కాటికి పంపిస్తున్న వైనం మనం ఎరిగినదే.ఆడపిల్లల తల్లిదండ్రులను తీరని క్షోభకు గురి చేస్తున్నారు. వరకట్నం అనే సాంఘిక దురాచారం వల్ల ఎంతో మంది ఆడపిల్లలు బలి అవుతున్న సంగతికి చక్కటి పరిష్కార మార్గం అందించారు.స్వప్నంలో కూడా సత్యాన్ని ఆవిష్కరించడం చక్కగా ఉంది. సుప్రభాతం ఆగుతుందా?కవితలో ఈ తపన/ఈ తపస్సు/ఈ యజ్ఞం/ఇది మా నేరమని,కుట్రని/మా కలాలకు – చేతులకు సంకెళ్లు వేస్తే/రానున్న సుప్రభాతం ఆగుతుందా?అంటున్నారు.ప్రజా కళాకారులు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వాళ్ళ హక్కులను తెలియజేస్తూ గజ్జె కట్టి గళాల నెత్తి పాడుతున్నారు.ప్రదర్శనలు ఇస్తున్నారు.ప్రజా క్షేమం కాంక్షించి పాటల ద్వారా,కళారూపాల ద్వారా ప్రదర్శన చేస్తున్న కవులు,కళాకారులు,ప్రజలను కర్తవ్యం వైపుగా సాగేటట్లు చేస్తున్నారు.ప్రజల కోసం పాటుపడుతున్న కవులు,కళాకారులది కుట్రని మా కలాలకు,చేతులకు సంకెళ్లు వేస్తే రానున్న సుప్రభాతం ఆగుతుందా?సుప్రభాతం ఏనాడు ఆగదు.ఉదయించిన సూర్యుడు అస్తమించక మానడు.మళ్లీ సూర్యుడు ఉదయిస్తాడు.సుప్రభాతం కొనసాగుతుంది.వేనవేల సూర్య కిరణాలై అక్షర కళాకారులు చేస్తున్న ప్రదర్శనలు,దీక్షలు ఏనాడు ఆగవు.రానున్న సుప్రభాతం ఆగదు అని కవి మల్లారెడ్డి ఘంటాపథంగా చెబుతున్నాడు.జంపాల ప్రసాద్ కవితలో నేస్తం/క్యాంపస్ విద్యార్థివైన నీవు/ కొత్త ఆర్థిక విధానాలు చూపినందుకు/మూఢ సంస్కృతిపై నీవు పురోగమించి/శాస్త్రీయ విద్యా విధానం కావాలన్నందుకు/నిన్ను నక్సలైటని/ నిస్సహాయంగా/చెట్టుకు కట్టి/బందూకు గురి పెట్టినపుడు/కొండల గుండెలు జాలువారినవి/కన్నీటి జాలువారినవి/చెట్ల కొమ్మలు – ఆకులు/కత్తులై లేద్దామని/పిట్టలతో పిచ్చుకలతో ముచ్చట్లాడినవి/నీ గుండె చీల్చిన తుపాకి గుండు/జీవము లేని బొగ్గుగా మారింది/నీ రక్తం మోదుగు పూలై వనమంతా పూసింది/అంటున్నారు.జంపాల ప్రసాద్ ను నేస్తంగా సంబోధిస్తున్నాడు.చెలిమికి మారుపేరు స్నేహం. ఆపతి సంపతిలో ఆదుకునేవాడు స్నేహితుడు. అశేష విద్యార్థి లోకానికి ఆశాదీపం ప్రసాద్. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థిగా ఎదిగిన నిన్ను చూసి కన్న తల్లిదండ్రులే కాదు.నీవు పుట్టిన నేల కూడా పునీతమైంది.ప్రసాద్ తనతో చదువుకున్న స్నేహితులు,విద్యార్థులందరికీ మార్గదర్శిగా నిలిచాడు.ప్రసాద్ విద్యార్థులు, రైతులు,రైతు కూలీలు,సకల జనావళి ఎదుర్కొంటున్న సమస్యలకు మూలాలను కనుక్కున్నాడు.ప్రసాద్ నూతన ఆర్థిక విధానం, శాస్త్రీయ విద్యా విధానం కావాలన్నాడు.ప్రసాద్ మూఢ సంస్కృతిని ఎదిరించాడు.పురోగమించిన ప్రసాద్ ను నక్సలైట్ అని ముద్ర వేసి నిస్సహాయంగా చెట్టుకు కట్టి బందూకు గురి పెట్టినప్పుడు కొండల గుండెలు కన్నీటితో జాలువారినవి.శిఖరంగా ఎదిగిన ప్రసాద్ ను చూసి కొండల గుండెలు కరిగి దుఃఖంతో కన్నీటి జలపాతాలై ప్రవహించినవి.ప్రసాద్ వీరుని హత్య చేస్తుంటే చూసి ప్రకృతిలో భాగాలైన చెట్లు, కొమ్మలు,ఆకులు కత్తులై లేద్దామని పిట్టలతో పిచ్చుకలతో మాట్లాడినవి.నోరు లేని పక్షులు ముచ్చటించాయని చదువుతుంటే ఒళ్లంతా బాధతో వణుకుతుంది.ప్రసాద్ గుండెను చీల్చిన తుపాకీ గుండు కూడా చలించి జీవము లేని బొగ్గుగా మారింది.ప్రసాద్ రక్తంతో తడిసిన నేల మోదుగు పూలై వనమంతా పూసింది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.నిశ్శబ్ద నిరాకార ఛాయ చిత్రాలు కవితలో ఈ నిరాకార ఛాయ చిత్రాలలో/ఒక శిశువు నడవాలని/తొలి అడుగు వేయాలని తపిస్తున్నాడు/ఈ చీకటి వెలుతురు జయించి/ నూతన నవ వసంతోదయ పరంపర కోసం తొలి అడుగు/అంటున్నారు.నిజానికి మనకు కనిపించని వినిపించని ఎన్నెన్నో సంఘటనలు నిశ్శబ్దంగా నిరాకారంగా కనుల ముందు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సంఘటనలు ఎన్నింటినో తీసుకొని ప్రతి శిశువు (మనిషి) నడవాలని చీకటి జీవితాలను జయించి నూతన వసంతోదయ పరంపర కోసం తొలి అడుగు వేయాలని కవి వ్యక్తం చేసిన భావాలు అద్భుతంగా ఉన్నాయి.ఎక్కడిది చైతన్య సమీరం కవితలో ఎక్కడిదీ చైతన్యపు సమీరం?/ఎక్కడిదీ ప్రభంజనం హోరు?/ఎక్కడిదీ ఝం,ఝం తుఫాను/ దీనికి మొదలెక్కడ?తుది యెక్కడ?/ఏ దూర తీరాల నుండి వీస్తుందీ ప్రభంజనం/ఏ దెస నుండి వీస్తుంది/ ఏ కొస నుండి వీస్తుంది/ అంటున్నారు.ఇది ప్రకృతి మరియు జీవితం యొక్క అంతర్లీన శక్తి చైతన్యాన్ని ప్రశ్నిస్తూ రాయబడిన కవిత.కవి తన ప్రశ్నల ద్వారా చైతన్యపు మూలాన్ని దాని ఆరంభాన్ని,అంత్యాన్ని విశ్లేషించడాన్ని తెలుపుతుంది.చైతన్యపు సమీరం అంటే జీవన శక్తి, ప్రాణ శక్తి.ఈ జీవన శక్తికి మూలం ఎక్కడుంది?ఇది ఎక్కడినుండి ఉద్భవించింది? ప్రభంజనం హోరు అంటే గొప్ప గాలుల తుఫాను. ప్రభంజనానికి పుట్టుక ఎక్కడ ఉంది?ఝం ఝం తుఫాను అంటే ప్రకృతి యొక్క ఉగ్ర రూపాన్ని తెలియజేస్తుంది.జీవితం మరియు ప్రకృతి శక్తుల ఆరంభం,ముగింపు ఏమిటి?అని ప్రశ్నిస్తున్నారు. ప్రభంజనం ఎక్కడి నుండి మొదలైంది?అది ఏ సుదూర ప్రాంతాల నుండి ఉద్భవించింది?జీవన శక్తి ఎటు నుండి వీస్తుంది?దాని ప్రయాణం ఏమిటి? అంటూ కవి వ్యక్తికరించిన భావాలు చక్కగా ఉన్నాయి.శిల్ప సుందరి కవితలో చూడాలి నా దేవి!నీ చూపు వాడి/కనికరించి కడవ దించి కాలు కదిలించి/మెరుపుతీగవై – వెలుగు రేఖవై/పూల బాణమై – విద్యుల్లతవై/కోడె నాగిణివై – రస రాగిణివై/భువన మోహినివై – నవమోహన నాట్యంల తేలించు/లాలించు పాలించు ఓ శిల్ప సుందరీ!/ ఇదిగో!నీ పాదపద్మాల ఉండనీ/నా కవితా మంజరీ/ అంటున్నారు.శిల్ప సుందరిపై వ్యక్తీకరించిన భావాలు అద్భుతంగా ఉన్నాయి.జ్ఞాపకాలు కవితలో నీ జ్ఞాపకాల వాకిట/నీ గుండె లోగిలిలోనే/దోసిట మల్లియలతో/మజ్నునై నిలుస్తాను/అందినట్టే అంది/అందకుండా – అందే అంత దూరములోనే ఉంటూ/మల్లియలా – మౌనంగా నిలచిన/నా జీవన నెచ్చలి – కలల ఊర్వశికి/బతుకంతా నైవేద్యం/ అంటున్నారు.కవి జ్ఞాపకాలను పంచుకొని ఆమెను సజీవం చేసిన తీరు బాగుంది.సాగువాటు కవితలో నా దీన జనావళీ కన్నీళ్లను మాటి మాటికి తుడవ లేక/నేను సామ్యవాద పద్ధతిలో సాగువాటు చేద్దామనుకుంటున్నాను/తిరుగుబాటు చేసి అయినా సరే/భూముల్ని కబ్జా చేసుకుంటాను/ ప్రాణమే ఆయుధంగా బయలుదేరుతున్నాను/ కృత్తిక ఎండలు మండి/కుటిల విషం కక్కినా సరే/ రోహిణి వడలు తడలు/పెడబొబ్బలు పెడుతూ/ కబలించాలని వచ్చినా సరే/తిరుగుబాటు చేస్తాను/ సామ్య వాదం కోసం సాగువాటు చేస్తాను/నా దేశాన్ని నందన కేదారవనంగా మారుస్తాను/మరో స్వర్గం సృష్టిస్తాను/అంటున్నారు.సమాజంలో అన్యాయాలు, అక్రమాలు,అసమానతలు మనసును కలవరపెడుతున్నాయి.దీన జనావళి కన్నీళ్లను తుడవడం అనేది ప్రజల సమస్యలను పరిష్కారం కోసం ప్రయత్నించడం.సామ్యవాద పద్ధతి ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరి అవకాశాలు తీరేలా వ్యవస్థను తీర్చిదిద్దాలనే సంకల్పం వ్యక్తం అవుతుంది.నందన కేదారవనం ఇది ఒక ప్రకృతి అందాల పూతోట.ఇది శాంతి,సౌందర్యం,న్యాయం, సమాజానికి చిహ్నంగా నిలుస్తుంది.సమాజాన్ని నందన కేదార వనం లాంటి పరిపూర్ణ స్థితికి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంది.మరో స్వర్గం సృష్టిస్తాం అంటే ప్రపంచాన్ని మార్చేందుకు అందరి శ్రేయస్సు కలిగించే సమాజం నిర్మించేందుకు దోహదపడతానని దృఢ నిశ్చయాన్ని వ్యక్తపరుస్తున్నాడు.సామాజిక మార్పును సమానత్వం మరియు ప్రజలకు శ్రేయస్సును అందించాలనే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది.ఇది ప్రేరణ కలిగించేది.ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా ఉంటుంది.నగరంలో కన్నెలు కవితలో కన్నెలు .. కన్నెలు . నగరమంతా వన్నె వన్నెల కన్నెలు/సాయం సమయంలో నగరమంతా/ కన్నెల మేని కాంతితో ఎరుపెక్కుతుంది/ఎరుపెక్కిన సంధ్యలో రాగ రంజిత వేళలో/వెచ్చవెచ్చని చల్లగాలి సైక్లోనొకటి/ఆ గుమ్మల ఆ అమ్మల ఆ బొమ్మల/ఆ కొమ్మల పైట చెంగుల విసరులోయన/ముచ్చటగా ముద్దిడుతుంది/గిలిగింతల కవిత్వాన్ని వ్రాయమంటుంది/అంటున్నారు.నగరంలో కన్నెలను కవితామయం చేయడం అద్భుతంగా ఉంది.ఇది నా దేశం గాథ కవితలో ఇక నా దేశం నాగరికత/ఇక్కడ పార్టీకి క్యాడర్ కాని వాడు లీడరు/ఆశయాలు చంపుకున్నవాడు/ఆదర్శాలకి తిలోదకాలిచ్చిన వాడు/మానవత్వం ఎరువు తెచ్చుకున్నవాడు/ తోకవాల్చడం నేర్చుకున్నవాడు/ బట్రాజుగా మారినవాడు/వందిమాగధిగా ఎదిగిన వాడు/కాకా పట్టేవాడు/బాకాలూదేవాడు/నా దేశ ప్రజా ప్రతినిధి/నా దేశ నాయకుడు/అంటున్నారు. సమాజాన్ని కలుషితం చేస్తున్న నాయకుల దిగజారుడుతనాన్ని ఎండగట్టుతున్నాడు.నా దేశంలో ప్రజా ప్రతినిధి మరియు దేశ నాయకుడు ప్రజాసంక్షేమం కోసం పాటుపడాల్సిన వాళ్ళు స్వార్థంతో వ్యవహరిస్తున్న తీరును చూసి కవి తీవ్రమైన ఆవేదనని వ్యక్తపరుస్తున్నాడు. పల్లెపొలిమేరల్లోకి కవితా సంపుటిలోని కవితలన్ని అభ్యుదయ భావాలతో అలరారుతున్నాయి. మల్లారెడ్డి యువకుడిగా ఉన్నప్పుడు పొంగిపొరలే భావావేశం అద్భుతమైన కవితలుగా రూపు దాల్చాయి.కవితలను హాయిగా చదువుకోవచ్చు. ఇవి పాఠకుల హృదయాలను రంజింప జేస్తాయి. చక్కటి కవితలు రాసిన కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను.మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.