Home కవితలు విలువల మూట

అడిగి అడిగి అలసిపోయాను

కాశీపుర వీధుల్లో తిరిగినట్లు

కాగితపు భిక్షా పాత్రతో

గడప గడపను గంగలా తాకి తీర్థమయ్యాను

ఐనా –

నా గొంతు తడారే వుంది

గుండె ఎడారై ఇసుక నదుల్ని

సాగనంపడానికి సిద్ధంగా ఉంది

భుజాన వేళ్లాడుతున్న ఖాళీ జోలె

బరువు విలువ ఏమిటో బోధిస్తోంది

కొన్ని యోజనాల పొడవు నా గమ్యం

తెలియని దారుల్లో అడుక్కుంటూ, వెతుక్కుంటూ-

ప్రతి సింహద్వారం ఎదురగా నిలుచొని

గడప మీద విసుగ్గా విసిరేసిన అనుభవాలను ఏరుకుంటూ –

దారి మధ్యలో –

గడ్డకట్టిన మాటల చిత్తు కాగితాలను పోగేసుకుంటూ

ఛీత్కారాల గ్రీష్మంలో కాలిపోతున్న

మంచులో తడిసి ముద్దయిన ‘గొబ్బెమ్మ’ పొడపైన

విరిసే వసంతాలను ఎదపైకి ఎత్తుకుంటూ

నడచి నడచి అలసిపోయాను

ఫడేల్ మని మూసుకుంటున్న ద్వారాల వెనుక

కనబడిన ఖండిత దృశ్యాలను

మూగబోయిన ముఖ ద్వారాల గొంతుల్లోంచి

జారిపడుతున్న కొన్ని మాటల రేణువులను

రిక్తమైన హృదయ కళశంలోకి వొంపుకున్నాను

బరువెక్కిన జోలెతో వెనక్కి తిరిగితె

ఈ ప్రపంచం వదిలి వెళ్లిన చోటే

నేనొక

విలువల మూటనయ్యాను.

You may also like

Leave a Comment