Home వ్యాసాలు విశ్వకవి : రవీంద్రనాథ్ ఠాగూర్

విశ్వకవి : రవీంద్రనాథ్ ఠాగూర్

by Radhika Suri

కవి ,రచయిత,ఆధ్యాత్మికవేత్త ,
తత్వజ్ఞాని. బహుముఖ ప్రజ్ఞాశాలి యైన వీరు కలకత్తాలో మే 7 ,1861న జన్మించారు . దేవేంద్రనాథ్ ఠాగూర్, శారదాదేవిల 14వ సంతానమైన వీరు, ప్రముఖ బెంగాలీ రచయిత. నాలుగు గోడలకే పరిమితమైన బాల్యంతో బయట ప్రపంచం వింతగా తోచేది వీరికి. బాల్యంలో పాఠశాల చదువు ఇష్టపడక ఇంటి వద్దే చదువుకొనసాగించినా చక్కని క్రమశిక్షణతో వ్యాయామం, లెక్కలు, భూగోళం ,సంస్కృతాంగ్లాలను అభ్యసించారు. లలిత కళలపై ఆసక్తితో చిత్రలేఖనం ,సంగీతం నేర్చుకున్నారు. కాళిదాసు, షేక్స్పియర్ రచనలు బాగా చదివారు. రవీంద్రుడు తన16వ యేటనుండే రచనలు చేయడం మొదలు పెట్టారు.వీరు సాంప్రదాయ, సంస్కృత భూయిష్టపు రచనాపద్ధతిని వీడి వ్యావహారిక భాషలో రచనలు చేసి సాహిత్యాభిమానులకు చేరువయ్యారు వీరి మొదటి నాటకం ‘వాల్మీకి ప్రతిభ’.

బెంగాలీ గ్రామీణ ప్రాంతాలంటే ఇష్టపడే ఈయనకు కవిత్వం ప్రియవస్తువైనా పద్యాలు ,నవలలు,నృత్యనాటికలుచిన్న కథలు, కాల్పనిక రచనలు, వ్యాసాలు ,విమర్శలుఇలా ఎన్నో ప్రక్రియల్ని సృజించారు. వీరికి సంగీతమంటే ఎంతో మక్కువ సుమారు 2,230 గీతాలు రచించారు.’సంధ్యా గీతం ‘కావ్యాన్ని కవులంతా ప్రశంసించారు. తండ్రి వీరి రచనలు విని,ప్రచురణకు అవసరమయ్యే డబ్బును సమకూర్చేవారట. విర్గరేర్ స్వప్న భంగ , సంగీత ప్రభాత కావ్యాల్ని రచించారు. రవీంద్రుడు ఇంగ్లాండు లోని ఓ పబ్లిక్ స్కూల్లో చేరి ,ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలకు ఆకర్షితులై , ఆంగ్ల నాటకాలకు, కచేరీలకు వెళ్లడంతో భాష పై పట్టు ఏర్పడింది. 1883 డిసెంబర్ 9న మృణాళినీ దేవిని వివాహమాడారు. భగ్న హృదయం కావ్యాన్ని ఇంగ్లాండ్లో ఉన్నప్పుడే
రాశారు

వీరి’ గీతాంజలి ‘చాలా గొప్ప రచన. బెంగాలీలో రచించిన కొన్ని భక్తి గీతాలను ఆంగ్లంలోకి అనువదించి ‘గీతాంజలి ‘అని పేరు పెట్టారు .103 బెంగాలీ పద్యాల సంకలనం. ఎన్నో భాషల్లోకి అందించబడిందీరచన .శ్రమైక జీవన సౌందర్యాన్ని, సార్వజనీన ప్రేమమయ జీవనంలోని మాధుర్యాన్ని సూచించే సందేశాత్మక సమాహారమే గీతాంజలి. 1913లో ‘గీతాంజలి’ కి సాహిత్యాంశంలో ‘నోబెల్ ‘బహుమతి లభించింది. ఆసియా ఖండంలో ఈ బహుమతి పొందిన తొలి వ్యక్తిగా కీర్తించబడ్డారు.వీరు ప్రేమ, శాంతి,సామర్థ్యాలే ప్రధానాంశంగా తీసుకుని చేసిన రచనలకు ఎంతోమంది స్ఫూర్తి పొందారు.
అప్పటినుండి వారు ‘విశ్వకవి’ గా కీర్తిగాంచారు.అందరూ’ గురుదేవ్’అంటూ ఆప్యాయంగా పిలుచుకునేవారట. సనాతన పద్ధతిలో బాలల మనోవికాసానికి ‘గురుకులం’ తరహాలో ‘శాంతినికేతన్’ గా ప్రసిద్ధిగాంచిన ‘విశ్వ భారతి ‘విశ్వవిద్యాలయాన్ని 1921 డిసెంబర్లో స్థాపించారు. మొదట అయిదుగురితో ప్రారంభమై క్రమంగా విస్తరించబడింది. చిన్నపిల్లలకు ఉపాధ్యాయుల ఇళ్ళల్లోనే వసతి కల్పించి , భోజన సదుపాయాలన్నీ అక్కడే జరిగేవి. క్రమశిక్షణతో కూడిన దినచర్యలో భాగంగా సత్యాన్ని పలకడం , మితమైన నిద్ర, పరిశుభ్రత, గురువుల్ని, పెద్దల్ని గౌరవించడం, నడక యొక్క ప్రాధాన్యత నేర్పేవారు. 1919లో కళాభవన్ స్థాపించారు, ఇందులో వివిధ కళల్ని నేర్పించేవారు. గ్రామాభ్యుదయంతోనే దేశ పురోగతి సాధ్యం అనేది వీరి భావన. దానికోసం’ శ్రీనికేతా’న్ని ఏర్పాటు చేసి, గ్రామ పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. ‘వాల్మీకి ప్రతిభ’ వీరి మొదటి నాటకం కాగా, పోస్ట్ ఆఫీస్ చిత్రాంగద, ప్రకృతి – ప్రతీక ఇలా ఎన్నో నాటకాల్ని రాశారు. సాంఘిక ప్రయోజనం ,సందేశాత్మక మైన నవలగా ‘గోరా ‘ వీరికి ఎంతో పేరు తెచ్చి పెట్టింది.
రవీంద్రులు తమ 70వ యేట చిత్రకళను సాధన చేసి, వేసిన చిత్రాలు లండన్ ,పారిస్, న్యూయార్క్ మొదలైన నగరాలలో ప్రదర్శించబడ్డాయి. దాదాపు 2,000ల చిత్రాలు గీశారు. విశ్వ కవికి సంగీతం అంటే వల్లమాలిన ప్రేమ ,ఆయన బెంగాల్ జానపద గీతాల్ని, బాపుల్ కీర్తనల్ని విని పరవశించేవారు. స్వయంగా గాయకులైన వీరు’ రవీంద్ర సంగీత్’ అనే ప్రక్రియ ప్రవేశపెట్టారు.

దేశభక్తి మెండుగా గల వీరు
దేశభక్తి గీతాలు పాడుతూ ,ప్రబోధాత్మకమైన పద్య గేయం రచించారు. బ్రిటిష్ ప్రభుత్వం తిలక్ ను నిర్బంధించినప్పుడు తీవ్రంగా విమర్శించారు. బెంగాల్ విభజన ప్రతిఘటన ఉద్యమంలో వీరిది ప్రముఖపాత్ర. జాతీయ నిధికి విరాళాలు కూడా సేకరించారు. ఠాగూర్ 1896 కలకత్తా కాంగ్రెస్ సదస్సులో బంకించంద్ర ఛటర్జీ రాసిన’ వందేమాతర’ గీతాన్ని ఆలపించారు .జాతీయ గీతాన్ని ప్రకటించే ముందు ‘వందేమాతరం’, ‘జనగణమన’ రెండింటిలో దేన్ని ‘జాతీయగీతం’ గా తీసుకోవాలనే తర్జనభర్జనల నడుమ’ రాజ్యాంగ కమిటీ’ అధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ గారు 1950 జనవరి 24న రవీంద్రుని జనగణమనను’ జాతీయగీతం’ గా ‘వందేమాతరా’న్ని జాతీయగేయంగా ప్రకటించారు. రెండింటికీ సమాన ప్రతిపత్తి (హోదా) కలిగిఉంటుందని పేర్కొన్నారు .రవీంద్రుని రచనల్లోని కొన్ని ప్రభావిత పంక్తులు: ‘ గీతాంజలి’ — ఈ మంత్రములు, జపమాలలు విడిచిపెట్టు, తలుపులన్నీ బంధించి ఈ చీకటి గదిలో ఎవరిని పూజిస్తున్నావు? కళ్ళు తెరిచి చూడు నీవు ఆరాధించే దేవుడు నీ ఎదుట లేడు ఎచట రైతు నేలను దున్నుతున్నాడో, ఎచట శ్రామికుడు రాళ్లు పగలగొడుతున్నాడో అచట ఆ పరమాత్ముడు ఉన్నాడు .వారితో ఎండలో వానలో ధూళీ దూపరితములైన వస్త్రములలో ఉన్నాడు. నీవు కూడా నీ పట్టు పీతాంబరములు ఆవల పెట్టి ఆ నేల మీదికి పద . అంటూ ..ఉపదేశిస్తూనే
2.ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో అక్కడ దేశాన్ని నిలుపు అనడంలో వారిలోని దార్శనికులు మన కళ్ళముందు కదలాడుతారు. ఈ వాక్యాలు మహాత్మాగాంధీకి చాలా ప్రియమైనవి . జవహర్లాల్ నెహ్రూ ఒక సందర్భంలో రవీంద్రుని ప్రభావం తనపై ఎంతో ఉందని పేర్కొన్నారు. అలాగే గాంధీజీని మొదట ‘మహాత్మా ‘అని పిలిచింది కూడా ఠాగూర్ గారే.
1915 లో బ్రిటిష్ వారు ‘నైట్ హుడ్ ‘బిరుదు ప్రధానం చేయగా జలియన్ వాలాబాగ్ దురాగతానికి నిరసనగా 1919లో దానిని తిరస్కరించారు. బంగ్లాదేశ్ జాతీయ గీతం ‘అమర్ సోనార్ బంగ్లా ‘కూడా వీరు రచించిందే.

ఠాగూర్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ,ఇద్దరు కుమారులు తమ 70వ పుట్టినరోజున 1918లో తాను స్థాపించిన విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ ఠాగూర్ ఇలా అన్నారు: నేను అనేక కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నాను, నిజమేకానీ నా అంతరంగం వీటిలో దేనిలోనూ కనిపించదు. నా ప్రయాణం ముగింపులో నా జీవిత గోళాన్ని కొంచెం స్పష్టంగా చూడగలుగుతున్నాను .వెనక్కి తిరిగి చూసుకుంటే నేను కవిని (అమీ కవి) మాత్రమే అని నాకు కచ్చితమైన అభిప్రాయం అంటారు.

జీవితంలో ప్రతిరోజు ,క్రితం రోజు కన్నా కాస్తోకూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకోవాలంటారు. ‘కళ్ళకు రెప్పలు ఉన్నట్లే ‘మనిషి కి విశ్రాంతి ఉండాలని వీరి అభిప్రాయం.
‘ కాగితపు పడవ’లోని జ్ఞాపకాల దొంతరలోని పంక్తులు కొన్ని : రోజురోజుకు నేను నా కాగితపు పడవలను ఒక్కొక్కటిగా నడుస్తున్న ప్రవాహంలోకి తేలేను. పెద్ద నల్లని అక్షరాలతో వాటిపై నాపేరు ఊరు రాస్తానంటారు.

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో రవీంద్రుడు మానసికంగా కృంగిపోయి అనారోగ్యం పాలయ్యారు .వ్యాధి తీవ్రతతో 1946 ఆగస్టు 7న స్వర్గస్తులైనారు. ‘మై రెమినిసెన్సెస్’ పేరుతో ఆత్మ కథను రాసుకున్నారు.

కొంగర జగ్గయ్య గారు ‘రవీంద్ర గీత’ పేరిట గీతాంజలిని అనువదించారు. తెలుగులో అనువదించబడిన తొలి రచన అందులోని కొన్ని పంక్తులు :
మూడు ప్రొద్దున చిమ్మట లోదిగిల్ల
పదము పాడుచు నేల దున్నే దము మేము
మా కరంములు లోహ సలాక లయ్యు
మా మనమ్మలు మవ్వపు మండసములు అంటూ అనువదించగా,

రామస్వామి నాగరాజు గారు అనువదించిన గీతాంజలిలో తమకు ఇష్టమైన 53వ కవిత:
“ఎంత అందంగా ఉంది
రవ్వలతో రంగురంగుల రత్నాలతో నైపుణ్య యుక్తియుక్తంగా చెక్కబడిన
నీ నక్షత్ర కర కంకణం”అంటూ హృద్యంగా తెనిగించారు.

ఇలా ఎంతోమంది గురుదేవునిపై అభిమానంతో తమ భాషా నైపుణ్యానికి పదునుపెడుతూ చక్కని అనువాదాలతో సాహితీసుధను మనకందించారు.

రచయితగా, సంగీతజ్ఞునిగా, చిత్రకారునిగా, విద్యావేత్తగా గొప్ప మానవీయవిలువలున్న మహాశక్తి గా చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయారు ఠాగూర్.
రవీంద్ర జయంతిని బెంగాలీలు ఎంతో వైభవోపేతంగా జరుపుకుంటారు. వేకువ ఝాము నుండే తమ తమ గృహ సముదాయాల్లో రవీంద్రసంగీతాన్ని వింటూ నివాళులర్పిస్తారు. విద్యా సంస్థలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాయి . విదేశీ విద్యార్థులు సైతం ఈ వేడుకలలో భాగస్వాములౌతారు. ఇంత గొప్ప గౌరవాన్ని పొందిన ఆ సాహితీవేల్పుకు అక్షర ప్రణతులర్పిస్తూ.

You may also like

Leave a Comment