ఆకాశంలో ఉరుములు మెరుపులు… భూమిపైన జోరుగా వర్షపు చినుకులు… చెవులకు సోకుతున్న హోరుగాలి… ఆ చల్లని వాతావరణంలో టకటక వినిపిస్తున్న ఒక శబ్దం!
హాస్పిటల్ నుండి ఇంటికొచ్చి, తన బావమరుదులతో కూడి డాక్టర్ రాజారాం చేసుకుంటున్న మందు పార్టీలో అది రెండో రౌండ్. ‘ఛీర్స్… ఛీర్స్’ గ్లాసుల గలగల శబ్దానికి పోటీపడుతున్నట్టుగా టకటకమంటూ మళ్లీ అదే శబ్దం!
చిరాకుగా వెళ్ళి వీధి తలుపు తీసి చూశాడు రాజారాం. తెరుచుకున్న ఆ తలుపుల ముందు… తడిసిన తల కొప్పెరతో, బురదనిండిన చెప్పుల్లేని కాళ్లతో, సన్నగా వణుకుతూ నిల్చున్నాడో పదేళ్ల పిల్లాడు.
‘అరె…. వీడా? ఏడాదినాడే కాలం చేసిన, కాలనీ చివరింటి జానయ్య కొడుకు శీనయ్యగాడా!” అనుకుంటూ అదోలా చూశాడు రాజారాం.
ఆ రాత్రి వేళ తనను డిస్టర్బ్ చేసిన వాడి రాకకు, తడిసి నేలను తడుపుతున్న వాడి తీరుకు అసహనం కలిగింది డా. రాజారాంకు.
“ఏంట్రా శీనూ?” విసుగ్గా అడిగాడు.
“డాక్టర్ సార్… నిన్నట్నుండి మా యమ్మకు జెరం. రాత్రికి రాత్రే ఎక్కువైంది. కరోనా వచ్చిందేమోనని భయమైతుంది. ఓసారి మీరొచ్చి సూడండి సార్… ఏదైనా గవర్నమెంట్ దవకాన్ల సేర్పించి పరీచ్చలు సేయించండి. కరోనా అయితేగాన దయచేసి మందులిప్పించండి!” అంటూ డాక్టర్ గారి కాళ్లు పట్టుకున్నాడు కన్నీళ్ళతో శీనుగాడు.
మజాగా నడుస్తున్న మంది పార్టీ నుండి వైద్యుడిగా బయటకు రానివ్వలేదు రాజారాం మనసు.
“ఒరేయ్ శీనుగా… కష్టం జేసుకునేటోళ్లకు కరోనా రాదు లేరా! శక్తికి మించి పనిచేసిందేమో….. సుస్తీ చేసుంటది. మీయమ్మకేమీ కాదులే… రేపటికల్లా తగ్గిపోతుంది గానీ వెళ్లువెళ్లు!”
అంటూ… వాడిని బలవంతంగా బయటికి పంపించేసి, తలుపులు మూసేసి, గదిలోకొచ్చి మరో బాటిల్ ఓపెన్ చేశాడు డాక్టర్ రాజారాం.
* * *
ఓ వారం అనంతరం….
ఇంట్లోనే ఓ మూల గదిలో… బెడ్ పై అసహనంగా అటూ ఇటూ కదులుతూ చిన్నగా మూలుగుతున్నాడు రాజారాం.
‘వైద్యుడుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, తను కూడా కరోనా బారిన పడక తప్పలేదు. హోం క్వారంటైన్ పద్నాలుగు రోజులు పడకేసే తిప్పలు పడక తప్పడం లేదు! బాధగా, భయంగా, ఒంటరిగా… ఏదోలా గడుపుతున్నాడు తను. కొవిడ్ భయంతో బంధు మిత్రులెవరూ రావడం లేదు. కుటుంబీకులు మాత్రం అన్న పానాదులను గది బయటే పెట్టి తలుపు కొట్టి వెళుతున్నారు. అంతటి వైద్యుణ్ణి తనను తాకడానికే భయపడుతూ…. అందరూ దూరంగా వెళ్ళిపోతున్నారు. తననో అంటరానివాణ్ణి చేసిన కరోనా కాలమెంతటి భయంకరమైనది!’
ఆయాసంతో కూడిన ఆవేదనతో అనుకున్నాడు ఆరో రోజున డా.రాజారాం.
* * *
మందుల ప్రభావంతో, మగతగా పడుకున్న రాజారాం నుదుటిపై ఓ సున్నితమైన చల్లని స్పర్శ తగిలి మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు.
ఏదో జ్ఞాపకం… మంద్రపవనంలా అతడి మనసులో కదలాడింది!
‘పక్షం రోజుల క్రితం…. ఆనాటి వర్షపు రాత్రిలో…. నిర్ధాక్షిణ్యంగా వీణ్ణి తను వెళ్ళగొట్టినా ఈనాడు తనకు కరోనా వున్నా, తనను ముట్టుకని తన నుదుట బొట్టుపెట్టిన ఈ శీనుగాడి సింధూరం చేతులు అప్పుడే విచ్చిన మందారాల్లా అన్పిస్తున్నాయి తనకు!’ అనుకొంటూ “శీనూ ఏంట్రా ఇది?” సంచలనంతో కూడిన ఆశ్చర్యంతో అడిగాడు!
‘’దండాలు డాక్టర్ గారూ… నిజంగా మీరు దేవుడే! ఆ రాత్రి మీరు సెప్పిన…. కాదు కాదు మీరు దీవించిన మాటతో మయమ్మకు జెరం తగ్గింది. కరోనా కూడా రాలేదు. అయ్య లేని నాకు అమ్మ తోడైనా నిలబెట్టిండ్రు మీరు!”
కృతజ్ఞతతో నమస్కారం పెడుతూ అన్నాడు శీనుగాడు.
“నిజమా శీనూ” నమ్మలేనట్టుగా అడిగాడు రాజారాం.
“అవును సార్! మందులేకుండానే మీ నోటి మాటతోనే మాయమ్మ రోగాన్ని తగ్గించిన మనిసి దేవుడు మీరు! అట్లాంటి మీకు కరోనా వచ్చిందని తెలిసి బాగా బాధపడిన. మనిసిదేవుడికి గుళ్ళోని ఆ పెద్ద దేవుడే కదా తగ్గించాలె! అందుకే మన కాలనీలున్న ఆంజనేయస్వామి గుడికెల్లి మీకు తగ్గించమని రోజూ మొక్కేటోణ్ని. ఇయాల గుళ్లో ఏదో పండుగుంట! టెంకాయ కొట్టి దండం పెట్టి సిందూరం తెచ్చిన…. ఎవరు సూడకుండ మీ ఇంటి లోపలికొచ్చిన…. ఆ దేవుని బొట్టు మీకు పెట్టిన, మీకు తప్పక తగ్గిపోతది సార్!
అంటున్న శీనుగాడి కళ్లల్లో అంతులేని విశ్వాసం అగుపించింది.
అబ్బురంగా వాడివైపు చూశాడు రాజారాం!
‘ప్రాణాంతకమైన కరోనా భయంతో తన వాళ్ళెవరూ తనను తాకనైనా తాకలేని దుర్భరమైన స్థితిలో… తననే దేవుడనుకున్న అమాయకమైన నమ్మకంతో… భయంలేని బాల రుద్రుడిలా తనను తాకిన వీడి హస్తముద్ర తనకెంతో సాంత్వన కలిగించిన మాట నిజం!’
అనుకొంటూ అపురూపంగా చూశాడా పిల్లాడివైపు.
‘ఆనాడు… మందు మత్తులో వాళ్ళమ్మకు మందివ్వని మా గొప్ప వైద్యుడు తను! తండ్రిలేని పిల్లాడు, తల్లినైనా బ్రతికించుకుందామని… ఎంతో ఆత్రంగా ఆ జోరువానాలో తన దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు. కానీ… తను… విసుగును దాచుకున్న నటనతో చెప్పిన తన మాయమాటలు నమ్మి, ఆ నమ్మకంతోనే తన తల్లియందు ఆరోగ్య దేవతను దర్శించుకున్న అదృష్టవంతుడు!
ఆర్ద్రతా హృదయంతో అనుకున్నాడు డా. రాజారాం.
అంతలోనే….
“రాజా…. మొన్నటి శాంపిల్ టెస్ట్ రిజల్ట్స్ ల్యాబ్ నుండి నా మొబైల్ కు ఫార్ వర్డ్ చేశారు. నీకు కరోనా నెగెటివ్ వచ్చింది కంగ్రాట్స్ రా!”
సాటి డాక్టర్ మిత్రుడి మాటలతో…. అణువణువునా ఆనంద స్పందన కలిగింది రాజారాంలో, ఆప్యాయంగా శీనుగాడివైపు చూశాడు.
“నీ విశ్వాసంతో, నీ స్పర్శతో నన్ను స్వస్తుణ్ని చేసిన బాల ధన్వంతరివి నీవు శీనూ…. నా వృత్తి ధర్మంలోని పరమార్థాన్నెరిగించిన బాల గురుడవు కూడా నీవే! నీకు నా జోహార్లు శ్రీనివాసా!”
అంటూ పశ్చాత్తాపంతో కూడిన బాధానందాశ్రువులతో వాడి సింధూరం చేతుల్ని పూజా పుష్పల్లా కళ్ళకద్దుకున్నాడు డాక్టర్ రాజారాం.