(సినిమా బిర్యానీ)
మీనా, శివల వివాహబంధానికి దశాబ్దం గడచింది. వారి పూర్వీకులది బొబ్బిలి వంశం. ఆస్తులు-అంతస్తులు ఎప్పుడో కాలగర్భంలో కలసిపోయాయి. ఔనన్నా కాదన్నా ఇద్దరు ప్రేమమూర్తులు. ప్రేమకు చిహ్నంగా వారికి పుట్టిన ముద్దుల సంతానం రాము, ఆది. తల్లిదండ్రులు రామును పండూ అని, ఆదిని చంటి అని పిలవటం అలవాటైంది. ఆట నుండి అప్పుడే రాము ఇంటికొచ్చాడు. “ఒరేయ్ పండూ, నీ స్నేహితుడు మురారితో గొడవ పడి కాలికి గాయం అయ్యేట్టు దెబ్బలు కొట్టావట. అతడు నీతో తప్పుగా ప్రవర్తిస్తే నాతో చెప్పి ఉండాల్సింది, నేను వాళ్ళ డాడీతో మాట్లాడే దాన్ని” అంటూ మీనా తన కొడుకు రామును మందలించింది.
“అమ్మా , కన్నతల్లివై ఉండి నిజం తెలుసుకోకుండా నన్నే దోషి అంటావేం, వాడు నన్ను దొంగ అంటే చూస్తూ ఊరుకోవాలా! ప్రతీకారం తీర్చుకున్నాను” ఉచ్ఛస్వరంతో బదులిచ్చాడు రాము.
“అంత పౌరుషం వద్దు పండూ. నీవు వాడిని కొట్టిన విషయం మీ నాన్నకు తెలిస్తే పెద్ద రచ్చ జరుగుతుంది. ఈ అమ్మమాట విని శ్రద్ధగా చదువుకో నాన్నా, చదువు-సంస్కారం ఉన్నవాడే అందరి అభిమానం పొందగలుగుతాడు” కొడుక్కి హితబోధ చేసింది మీనా.
“అలాగే నువ్వు చెప్పింది చేస్తా. నిజంగా ఒట్టేసి చెప్తున్నా. అవును, శ్రీశైలం నుండి కల్పన పిన్ని వాళ్ళు వస్తారన్నావుగా, ఎప్పుడొస్తారు” అడిగాడు రాము.
“బాబాయి బొంబాయి వెళ్ళారట. పిన్ని మామగారు అనారోగ్యంతో ఉన్నారని డాక్టర్ బాబుకి చూపిస్తే రెండు రోజులు విశ్రాంతి తీసుకొమ్మన్నారట. అంజలి స్కూలుకు ఇంకా శలవులు ఇవ్వలేదట. అందుకే ఎప్పుడు వచ్చేది నిర్ణయం తీసుకోలేదట” జవాబిచ్చింది మీనా.
“నేను, తమ్ముడు చంటి, పిన్ని కూతురు అంజలి సరదా సరదాగా శలవులు గడపొచ్చనుకున్నాను”.
“నిజమే, సంక్రాంతి పండుగ కూడా వస్తుంది కదా. బొమ్మల కొలువు పెడతాను. నీవు దీపావళి పండుగకి చేసినట్టే ఇంటి దర్వాజలకి మావిడాకుల తోరణాలు కట్టి నాకు సాయం చెయ్యాలి” సలహా ఇచ్చింది మీనా.
“మన చంటిగాడు బొమ్మల కొలువును పెట్టనిస్తాడా, వీడొక్కడే చాలు చెడగొట్టడానికి.”
“ఈ మధ్య వాడు బుద్దిమంతుడు అయ్యాడు. అయినా వాడి సంగతి చూసుకోడానికి నా దగ్గర మంత్రదండం ఉందిలే. సరే గానీ దేవాలయానికి వెళ్దాం రెడీ అవ్వు”.
“ఎప్పుడు దేవాలయం, అమ్మవారు, పూజ, నోములంటావు. సరదాగా సర్కసుకో, జురాసిక్ పార్కుకో తీసుకెళ్లవచ్చు కదా” బుంగమూతి పెట్టి మారాముగా అన్నాడు రాము.
“శలవుల్లో అందరం ఎంచక్కా జెమిని వారి ఫ్యామిలీ సర్కస్, నెక్లెస్ రోడ్డు, గోల్కొండ కోట వెళ్దాం. ఈ రోజు మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి కంచి స్వామి వస్తున్నారట. వారి ఆశీర్వాదం తీసుకుంటే ఎంతో శుభప్రదం”
“థాంక్స్ అమ్మా, కాసేపట్లో రెడీ అవుతాను”.
**
కూతురు అంజలితో పాటు టాక్సీ దిగిన కల్పన ఇంట్లోకి వస్తూ “అక్కా బాగున్నావా, పండు, చంటి బాగున్నారా” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
“అందరం బాగున్నాం. మీరెలా ఉన్నారే. అబ్బో, బంగారం జడగంటలు వేసుకుందే” అంటూ అంజలిని దగ్గరకు తీసుకుని కౌగలించుకుంది మీనా.
ఆహా బాగున్నాం. అక్కా బావెక్కడ, అడిగింది కల్పన. అడుగుతుండగానే శివ ఇంట్లోకి వచ్చాడు. బావగారూ బాగున్నారా అంటూ శివను పలకరించింది కల్పన. సూపర్ గా ఉన్నాను. తమ్ముడు రాలేదా అంటూ శివ ప్రశ్నించాడు .
“పోలీసు ఇన్స్పెక్టర్ ఉద్యోగం మానేసి సినిమా ప్రొడక్షన్ వైపు దృష్టి పెట్టారు మా ఆయనగారు. మొదటి సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు మా ఇలవేలుపు తిరపతి వెంకన్న అనుగ్రహం కోసం వెళ్లారు. కాలి నడకన ఏడుకొండలు ఎక్కి దైవదర్శనం చేసుకోవాలని ఆయన అభిలాష. సినిమా సినిమా అంటూ ఈ మధ్య ఆయనగారు పిచ్చిమారాజులా చేస్తున్న ఆలోచన మా జీవితంలో ఎన్ని యూటర్న్ లు తిప్పుతుందో” అంటూ కల్పన కాసింత వెటకారంగానే అంది.
“వావ్, పోలీసుభార్య ఇప్పుడొక నిర్మాతకు అర్ధాంగి కాబోతుంది. కాసింత పాజిటివ్ గా ఆలోచన చెయ్యి కల్పనా. చక్రవర్తి చేసేది అంతా మనమంచికే. అతడు కుటుంబం కొరకు కష్టపడే మంచిమనిషి. నువ్వనుకుంటు న్నట్లు ఆయన పిచ్చిమారాజు కాదులే, మంచి మారాజు కాబట్టే భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు” అంటూ ధైర్యం నింపే ప్రయత్నం చేసింది మీనా.
ఇంతలో పనుందంటూ శివ బయటకు వెళ్ళాడు. “అక్కా మీ మాయదారి మరిది చిరంజీవి, తోడికోడలు జ్యోతి మీతో కలిసి ఉండట్లేదా” అడిగింది కల్పన.
“ఏం చెప్పమంటావు. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టే రకాలు ఆ ఆలుమగలు. ఇద్దరూ ఇద్దరే. మా పెళ్ళిరోజు వాళ్ళు చేసిన నిర్వాకానికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండే మా కాపురం కొంతకాలం కలహాల కాపురంగా మారింది . ఉమ్మడి కుటుంబంలో ఉండాలని వాళ్ళకూ లేదు. కాలం మారింది. పోనీలే, ఆ విషయాన్ని వదిలేద్దాం ” అంటూ నవ్వింది మీనా.
**
సంక్రాంతి పండక్కి రెండు రోజుల ముందుగానే చక్రవర్తి శివ ఇంటికి వచ్చాడు. కుశల ప్రశ్నలు ముగిశాయి. సినిమా స్క్రిప్ట్ అయిపోయిందని, దేశభక్తికి సంబంధించిన సినిమా అని, పేరు సుభాష్ చంద్ర బోస్ అనుకుంటు న్నట్లు, శ్రావణ మాసం కల్లా షూటింగ్ పూర్తి చేసి దేవీ అభయంతో దీపావళి రోజు విడుదల చేసి ప్రేక్షకుల దీవెన అందుకోవాలని డైరెక్టర్ పంతం అంటూ సగర్వంగా చెప్పాడు చక్రవర్తి.
తోడల్లుళ్ళు శివ, చక్రవర్తి సొంత అన్న-తమ్ముడు మాదిరి కలిసిపోయే రకం. ఇల్లంతా పెళ్ళిసందడి లాగా పెద్దలు, పిల్లలతో ఎవడిగోల వాడిది అన్న చందాన సందడే సందడి. పిల్లలు టీవీ లో హ్యారీ పోటర్, డిస్కవరీ ఛానల్ మార్చి మార్చి చూస్తూ ఖుషీ చేస్తున్నారు. అక్కా చెల్లెలు మీనా, కల్పనలు అన్నపూర్ణ బ్యూటీ పార్లరు, బాబు టైలర్ షాపు, లీలా మహల్ సెంటర్ లోని శంకరాభరణం జెవలర్స్, రాఘవేంద్ర స్వగృహ ఫుడ్స్ అంటూ పూటకో షాప్ కు పరుగుతీస్తూ హంగామా చేస్తున్నారు. మీనా, కల్పనల తండ్రి సాంబయ్య ఆరు సంవత్సరాల క్రితం క్యాన్సర్ వ్యాధితో కన్ను మూశారు. కొడుకులు లేనందున తల్లి యశోద మూడు సంవత్సరాల పాటు సొంత ఊరులో ఒంటరిగా గడిపింది. ఆ తర్వాత ఆరోగ్యం బాగా లేక పల్లెటూరులో సరైన వైద్యం అందుబాటులో లేక కుమార్తెల పంచన చేరింది. కూతుళ్ళు బాగానే చూసుకున్నా, అభిమానవతి అయిన యశోద పోరు పెట్టి అల్లుళ్ళకు ఇష్టం లేకున్నా వృద్ధాశ్రమంలో చేరింది.
భార్యలు లేని సమయం చూసుకొని శివ చక్రవర్తితో అత్తగారి ప్రస్తావన తెచ్చాడు.
“అత్తగారికి కూతుళ్ళైనా, కొడుకులైనా మీ వదిన, కల్పనే కదా. న్యాయపరంగా కూడ అత్తగారి మంచీ-చెడూ చూసుకోవలసిన బాధ్యత ఆవిడ సంతానందే అని నా మిత్రుడు లాయర్ విశ్వనాధ్ చెప్పాడు. మన మామగారి మరణం అత్తగారిని బాగా కుంగదీసింది. జీవితం చరమాంకంలో మనవళ్ళతో ఆనందంగా గడపటానికి ఆమెను
వృద్ధాశ్రమం నుండి తీసుకొస్తే బాగుంటుందని నా సూచన. నేనొక్కడినే కోరుకోవడం కాకుండా నీ అభిప్రాయం అడుగుతున్నాను చక్రవర్తి” అన్నాడు శివ.
“ఎప్పటినుండో నా మదిలో ఇదే ఆలోచన ఉంది అన్నయ్యా. కానీ ఆనాడు పంతం పట్టి వెళ్లినావిడ తిరిగి వస్తుందా. నాకైతే హోప్ లేదు ” బదులిచ్చాడు చక్రవర్తి .
“నిజం చెప్పాలంటే మన కుటుంబాల్లో నేడు ఎన్నో మార్పులు వచ్చాయి. ఆనాటి గందరగోళానికి కారణం అసాధ్యుడు లాంటి నా తమ్ముడు, మహానటి లాంటి వాడి భార్యామణి. ఇద్దరు ఇప్పుడు సింహాచలం వెళ్లి అక్కడే కొత్త కాపురం పెట్టారు కదా. అదీ గాక ఈ మధ్యనే నీ ధర్మపత్ని కల్పన ఉద్యోగంలో చేరింది. ఆమె ఆఫీసుకు వెళ్తే అంజలి స్కూలు నుండి రాగానే ఇంటి దగ్గర రక్షణ కోసం ఎవరో ఒకరు ఉండాలి. ఈ విషయాలు చెప్పి అక్కా చెల్లెళ్ళను ఒప్పించే ప్రయత్నం చేద్దాం.”
శివ చెప్పిన ఐడియా నచ్చిన చక్రవర్తి సరేనంటూ అభినందన పూర్వకంగా కళ్ళు పెద్దవిగా చేసి నిలువుగా తల తిప్పాడు. ఐడియాను వెంటనే అమలు చేయటానికి మీనా, కల్పనను కూర్చోబెట్టి పెద్దమనిషిగా అత్తగారి పెత్తనం, కూతుళ్ళ ధర్మం, న్యాయం, బాంధవ్యాలు గురించి శివ చెప్పటంతో ఇద్దరిలో పరివర్తన వచ్చింది. తప్పును సరిదిద్దు కోవాలనుకున్న అక్కా చెల్లెళ్లిద్దరూ తక్షణమే కారులో ఆనందనిలయం వృద్ధాశ్రమానికి వెళ్ళి యశోదను క్షమాపణ కోరి, ఆవిడను ఒప్పించి,తోడ్కొని వచ్చి కుటుంబగౌరవం నిలబెట్టారు. సిసింద్రీలు ఆనందమానంద మాయె అంటూ అమ్మమ్మకు సంబరంగా స్వాగతం పలికారు. అమ్మమ్మా మాకు చందమామ కథలు, రాముడు కృష్ణుడు కథలు చెప్పాలి అంటూ రాము యశోద చీర కుచ్చిళ్ళు పట్టుకున్నాడు. యశోద ముగ్గురు జూనియర్స్ ని దగ్గరకి తీసుకుని శుభాశీస్సులు అందిస్తుండగా ఆవిడ కళ్ళ నుండి ఆనంద భాష్పాలు రాలాయి.
(160 పైగా తెలుగు సినిమాల పేర్లతో అల్లిన కథ )
2 comments
Awesome!!!
Superb