మేఖల:–నానమ్మా! ఇనుగుర్తి లో ఒద్దిరాజు సోదరులు గా ప్రఖ్యాతి చెందిన ఒద్దిరాజు సీతారామచందర్ రావు, ఒద్దిరాజు రాఘవ రంగారావు గార్లైన మా తాతయ్య లే కాకుండా కవి పండితులు ఎవరైనా ఆడవాళ్ళ లో ఉన్నారా?
మణి:– మంచి ప్రశ్న వేశావు మేఖలా!!
చెప్తాను చెప్తాను! మా ఊరిలో మహిళా మణుల నైపుణ్యాలకు కొదవేలేదు .
వంద సంవత్సరాల క్రితమే తెనుగు పత్రిక ఇనుగుర్తి లో స్థాపించి, స్వాతంత్ర ఉద్యమం తమపత్రిక ద్వారా, నడిపి ఎందరో స్వాతంత్ర సమరయోధులకు ఊపిరిలూదిన సోదరులిద్దరికీ వేగుచుక్క సోదరుల మాతృమూర్తి రంగనాయకమ్మ గారు. స్వయంగా స్వాతంత్రం గురించి బోధలు చేసిన మహనీయురాలు రంగనాయకమ్మ గారు.
గ్రంథాలయ ఉద్యమం “తెనుగు” పత్రిక ద్వారా పాఠకులకు -పాలకులకు ఎన్నో విషయాలు తెలియజేసిన పత్రికాధిపతులకు ప్రేరణ వారి తల్లి గారే! అందుకే మొట్టమొదటి తెలంగాణ నవల” అనురాగవిపాకం” రచయిత్రి చాట్రాతి లక్ష్మీ నరసమ్మగారిని రచయిత్రిగా ప్రోత్సహిస్తూ ఆమె రచనలను తమ పత్రిక ద్వారా ధారవాహికగా ప్రచురించి మహిళలకు ఉత్తేజం కలిగించడానికి సోదరుల తల్లి రంగనాయకమ్మ గారు స్వయంగా రచయిత్రి కావడం బహుశా కారణం కావచ్చు.
చేయొత్తు మనిషి, దబ్బపండు రంగు మేనిఛాయ. మెడలో తులసి మాల, తొమ్మిది గజాల తెల్లని చీర ను గోచీ పోసి కట్టుకొని, తెల్లగా నెరిసిన జుట్టు తో ఒక వర్చస్సుతో వెలిగిపోతూ కనపడే రంగనాయకమ్మగారు కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామ వాసి. ఆ కారణానికి తగ్గట్టు మంచి విద్య ఆమె సొంతం. నలుగురికి దానం చేసేదేగాని ఎవరినీ ఆశించని తత్వం ఆమెది.
అందరినీ ఆకట్టుకునే మాటతీరు, మంచితనం ఆమెకు పెట్టని ఆభరణాలు. అన్నిటికన్నా మించి దైవభక్తి కలవారు ప్రత్యేకంగా ఎందుకు చెప్పడం అంటే తెల్లవారు ఝామునే లేచి శ్రీరంగాపూర్ భగవానుల కు మేలుకొలుపులు ఎంతో శ్రావ్యంగా గానం చేసేవారట.
రంగనాయకమ్మగారు దేవులపల్లి వారి ఇంటి ఆడబిడ్డ. వీరి తండ్రి కృష్ణారావు గారు. తాతగారు రాఘవయ్య గారు. పండిత కవులు గా ప్రసిద్ధి చెందిన వారు “యతిరాజ వింశతి”,”ముకుందమాల” వంటి సంస్కృత కావ్యాలను తెలుగులో అనువదించారు . ఎన్నో రచనలు చేశారు. వారి ఇంట పుట్టిన
రంగనాయకమ్మ గారికి సంస్కృతం లోనూ, తెలుగులోనూ చక్కని పాండిత్యం ఉండేది. ఆమెకు ద్రావిడ సంప్రదాయ ప్రబంధాలు , సంస్కృత స్తోత్రాలు కంఠోపాఠం గా వచ్చేవి. వేదాల్లోని కొన్ని భాగాలు నేర్చుకున్నారు. ద్రావిడ ప్రబంధాలను చక్కగా విశ్లేషించే వారు.
అంతేకాదు 12 గ్రామాల కరణీకం ఆమె ఆధ్వర్యంలో జరిగేది. అందుకే తమ పుత్రరత్నాలు, తెలంగాణ వైతాళికులు గా పేరు తెచ్చుకున్న జంటకవులు వద్దిరాజు సీతా రామచంద్ర రావు వద్దిరాజు రాఘవ రంగారావు గార్లకు 5 సంవత్సరాలు వచ్చే సరికి ఐదు వందల పద్యాలు నేర్పించింది .
సోదరులకుగురువైన గోపాల కృష్ణ శాస్త్రి గారు జటాంతము , వేదం లోని కొన్ని భాగాలు పాఠాలు నేర్పించి వెడితే… అవి చక్కగా కుమారుల చేత వల్లె వేయించేదిట!
రంగనాయకమ్మ గారు భగవద్ విషయమూ, నాలాయిర ప్రబంధం కుమారులకు నేర్పించారు అట. ఆమె తీరిక సమయాలలోనే కాదు… మడి కట్టుకునివంట చేస్తూనే ఎన్నో విషయాలు సోదరులలో శిక్షణ ఇచ్చేవారట. పట్టు బట్టలు కట్టి, పీటలు వేసి కూర్చోబెట్టి తాను పనిచేస్తూ నేర్పించే వారట.
కుమారులకు ఏది నేర్చుకోవడానికిఇష్టమో? దానిని ప్రోత్సహిస్తూ కావలసిన గురువులను ఏర్పాటు చేసేవారట. గురువులు లేని సమయంలో సోదరులకు ఏవైనా అర్ధాలు తెలియకపోతే నిఘంటువును చూసి తెలుసుకోవడం ఎలానో నేర్పించారు అట.
తన కుమారులకు చిన్న వయస్సులోనే కరణీకం నేర్పించి ప్రభుత్వానికి పంపవలసిన జమాబంది లెక్కలు,పహాణీలు రాయడం నేర్పించారట. తమ ఖర్చులకు తామే సంపాదించుకునేలా ప్రోత్సహించే వారట.
ఆకాలంలో ఇనుగుర్తి చుట్టూ దట్టమైన అడవి ఉండేదట.ఆమె ఇంటి వెనుక రోట్లో పచ్చడి దంచుతుంటే చిరుత పులి వస్తే…భయపడకుండా ఆ రోకలి బండ మరోవైపు ఇనుప పొన్ను ఉంటే దాంతో ఒక్కటేసిందట…ఆ చిరుత మూర్ఛ పోయిందట.
మా పెద్ద నాయన అయ్యో! ఇలా అయిందేమిటని తాళ్ళతో కట్టించి, మొద్దుబండిలోకి ఎక్కించి అడవిలో వదిలి పెట్టించారట. ఆమె
అంత ధైర్యవంతురాలు.
అలాగే ఆమె కమ్యూనిష్టులకు కూడా తన కుటుంబ సభ్యులెవరూ ఎవరినీ బాధించలేదనీ, వంచించలేదనీ, ఎవరినీ వధించ లేదనీ కావాలంటే ఊరిలో ఎవరినైనా అడిగి, మీరు చేయదలుచుకున్నది చేయమని చెప్పిందట.
వాళ్ళకు ఈ విషయం తెలిసినా భూస్వాములని … హాని తలపెట్టాలనుకుని వచ్చారట కానీ నాయనమ్మ మాటలతో ఎవరినీ ఏమీచేయకుండా , సోదరుల ఇంట్లోని గ్రంథాలయాన్ని తగలబెట్టారట. అది మూడు రోజులు మండిందట బీరువాలతో సహా…! కమ్యూనిస్టు లని భయపడకుండా ఎదురు నిలిచి వాదించిందట! అలా ధైర్యంగా ప్రతీ సమస్యనూ ఎదుర్కొని, భర్త లేని లోటు కనపడనిచ్చేది కాదట!
రంగనాయకమ్మ గారు వైష్ణవ స్వాములతో సమానంగా ప్రబంధ పారాయణం, సేవాకాలం చేసేవారట. శ్లోకాల అర్థాలు వివరించే వారట.
రంగనాయకమ్మ గారు ఆదర్శ మహిళ ఆమె తన చుట్టూ ఉన్న వారిని విద్యావంతులుగా చేయాలన్నదే ఆమె తహతహ. తన ఇంటిని తీర్చిదిద్దుకోవడం అందరూ చేసే పనే కానీ తన చుట్టూ ఉన్న సమాజాన్ని జాగృత పరచడం , ఆరోగ్య సలహాలు ఇవ్వడం దానం చేయడం సంస్కృతిని తూచా తప్పకుండా పాటించాలి సంప్రదాయాన్ని తరువాతి తరాలకు అందించడం రంగ నాయకమ్మగారికే సాధ్యం.
మేఖల:- చాలా గొప్ప విషయం నాయనమ్మా ! వేగుచుక్కల వంటి వాళ్లకే వేగుచుక్క అని మీరు చెప్పడం చాలా బాగుంది నాయనమ్మా. మరి రంగనాయకమ్మ గారు వ్రాసిన పుస్తకాలు ఏవైనా ఉన్నాయా?
మణి:- ఆమె రచనలు అలభ్యం.