Home బాల‌సాహిత్యం వేదవ్యాసుడు

శ్రీ గురుభ్యోన్నమః సభకు నమస్కారం నా పేరు రొంపిచర్ల శ్రీరంగ సిద్ధార్థ. నేను ఎనిమిదో తరగతి గుడవలేరు ఏ.ఏస్.ఎస్ & వి.వి.ఆర్.ఎస్.ఆర్. హైస్కూల్, గుడ్డవల్లేరు, విన్నకోట గ్రామము, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాను.

నేను ఈ రోజు మహాభారతంలోని ప్రధానకర్త అయిన వ్యాసభగవానుని గురించి చెప్పబోతున్నాను.

పుట్టుకతోనే వేదములను అవగతం చేసుకుని, పంచమ వేదమైన మహాభారతాన్ని ప్రపంచానికి అందించిన, బ్రహ్మంశ సంభూతుడైన వ్యాసమహర్షి వాఙ్మయాన్నికంతటికీ వెలుగుల దివ్వె లాంటివారు. ఆయనే లేకపోతే కటిక చీకటి గాఢాంధకారము.

నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర యేన త్వయా భారత తైల పూర్ణ హ ప్రజ్వాలితో జ్ఞానమ య ప్రదీపః

అనగా ఒక ప్రమిదలో మహాభారతం అనే తైలాన్ని పోసి, జ్ఞానమనే వత్తిని వెలిగించి మనకందరికీ ప్రకాశాన్ని అందించి ఆ వెలుగులో ధర్మమార్గాన్ని నిర్దేశించారు వ్యాసమహర్షి. మహాభారతం ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన సంఘర్షణ. మహాభారతం ప్రపంచాన్ని శాసించే భారతీయ ఇతిహాసం.

వ్యాసమహర్షి లోకంలో వెలిగిన మొట్టమొదటి జ్ఞానజ్యోతి. ఆ జ్యోతి నుండి మిగిలిన జ్యోతులన్నీ వెలిగాయి. ఏ గురు స్వరూపమైన వ్యాస వాక్కుతో పరవశించిపోతుంది. అన్ని గురుస్వరూపాలు వ్యాసుని హృదయాన్నే ఆవిష్కరిస్తాయి. మహా తపోజ్ఞాని అయిన పరాశర మహర్షి జాలరి కన్య అయిన సత్యవతీదేవి యందు తమకము చెందడం వలన సద్యోగర్భుడైన కుమారుడు యమునా ద్వీపంలో జన్మించారు. ఆయనే వేదవ్యాసుడు, త్రిమూర్తి స్వరూపుడు, బాదరాయణుడు, కృష్ణద్వైపాయనుడుగా పేరుంది. తల్లి ఆశీస్సులతో ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పి తపస్సుకి వెళ్ళిపోతాడు వ్యాసుడు. కొన్ని ఆర్షమైన ధర్మములను నిరూపణ చేయడానికి అనేకసార్లు వ్యాసమహర్షి మనకు మహాభారతంలో కనిపిస్తారు. ఆయన ప్రతి రాకకు ఒక కారణం, ప్రయోజనం ఉంటుంది. జ్ఞానఖని అయిన వ్యాసుడు తల్లి అభ్యర్థన మేరకు భీష్ముని కోరిక మేరకు దేవర న్యాయం చేత, ధార్మికంగా, కురువంశ అభివృద్ధికి, కురువంశ రక్షణకు కారణమయ్యారు.

గాంధారిదేవికి గర్భసోకము కలిగినప్పుడు శివుని యొక్క వరము మేరకు పిండమునకు నూటొక్క ముక్కలుగా చేసి నూటొక్క మంది సంతానం కలగడానికి కారణమయ్యారు. త్రికాలజ్ఞాని అయిన వ్యాసుడు తన తల్లి సత్యవతిదేవి, అంబికా, అంబాలికలు రాబోయే కఠిన పరిస్థితులను తట్టుకోలేరని భీష్మునికి చెప్పి, వారిని తపస్సుకు పంపి, వారికి శాంతి మార్గము చూపి, వారి మోక్షానికి కారణమయ్యారు. కౌరవులు, పాండవులు విలువిద్యా ప్రదర్శన సమయంలో వ్యాసుని రాక ఒక కుటుంబపరమైన కర్తవ్యాన్ని నిర్వహింపచేయడానికి మార్గదర్శకమైంది. అనేకసార్లు పాండవులు, కౌరవుల దుశ్చర్యలు వలన మానసికంగా ఆందోళన చెందుతున్నప్పుడు, దైన్య పరిస్థితులను అనుభవిస్తున్నప్పుడు, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే సమయంలో త్రిమూర్తి స్వరూపుడైన వ్యాసుడు వచ్చి సమస్య పరిష్కారానికి మార్గం చూపి, పాండవులకు ధర్మమార్గాన్ని నిర్దేశించారు. అలాగే కౌరవులు తప్పు చేస్తున్నప్పుడల్లా వ్యాసుడు వచ్చి కౌరవులకు హితబోధ చేసినా వారు పెద్ద వారి మాటలను ధర్మచక్రంలో ఇముడ్చుకోక తమ నాశనాన్ని తామే కోరుకున్నారు. కానీ పాండవులు ధర్మంతో ఉండుట వలన భగవంతుడు వారి పక్షాన ఉండుటవలన విజయాన్ని, ఖ్యాతిని పొందారు.

వ్యాసమహర్షి నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు :

వ్యాసమహర్షి సమయానుకూలంగా పరిణితి చెందిన పెద్దరికంతో కురువంశ రక్షణ చేశారు. కురువంశ అభివృద్ధికి పాటుపడ్డారు.

అలాగే పాండవులు కూడా వ్యాసమహర్షి చెప్పిన ధర్మసూక్ష్మాలను పాటించి ఆయన్ని సమున్నత స్థానంలో నిలిపారు. కాబట్టి ఎవరికైతే ఓర్పు, నేర్పు, సహనం, శాంతి, సత్యం, ధర్మం, వినయం, విధేయత, పెద్దల యందు గౌరవం ఉంటాయో వారికి పెద్దల దీవెనలు, వారి సూచనలు ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటాయి.

మహాభారతంలో అంతర్భాగమైన కీలకపాత్ర పోషించిన వ్యాసమహర్షిని గురించి మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. వ్యాసుడు అంటే పదవి, ఈ సభలో వ్యాసపదవి అలంకరించిన నా గురుస్వరూపులందరికీ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదములు తెలుపుకుంటూ

‘వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ నమః నమో బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః’

కృష్ణం వందే జగద్గురుం

You may also like

Leave a Comment