తెలుగు వాఙ్మయంలో శతక ప్రక్రియకున్న స్థానం విశిష్టమైనది. పాల్కురికి సోమన మొట్టమొదటి “వృషాధిపశతకం” నుండి నేటివరకు జనుల జిహ్వాగ్రముల నుండి శతక పద్యాలు నిరంతరవాహినులుగా జాలువారుతూనే ఉన్నాయి. ఆధునిక కాలంలో శతకరచనలు చేస్తున్న కవులు అనేకులు పద్య రసవాహినిలో అందరినీ అలరిస్తున్నారు. శతకాలు భక్తి, వైరాగ్య, శృంగార, నీతి ప్రధానాలుగా ప్రజల జీవితాల్లో మమేకమైపోయాయి.
అటువంటివారిలో తనకొక స్థానాన్ని సుస్థిరం చేసుకున్న కవి శంభునికుమార్ గారు. ఇంతకుమునుపే తండ్రి పట్ల అనురాగంతో ఒక స్మృతి కావ్యాన్ని, ఆంజనేయ స్వామిపై భక్తితో ద్విశతిని, మరికొన్ని చిలిపిపద్యాలను రాసిన వీరు తను పుట్టిన సూరారం ఊరి దైవం అనంతపద్మనాభ స్వామి ప్రేరణతో ఒక శతకాన్ని రాసి ఆయనకు అక్షర నైవేద్యంగా సమర్పించారు. అదే “శ్రీ అనంత పద్మనాభ శతకం”.
“పలికెడిది భాగవతమట” అన్న పోతన, “చెప్పుమని రామచంద్రుడు” అన్న మొల్ల బాటలో “పంటపొత్తము గొని వండిన రీతిగా/ పద్యపాకము గూర్చు పాట్లు నావి” అంటూ తనకేదీ తెలియదని, చదువరులకు మెచ్చునట్లు కృతిని సాగనిమ్మని శతక ప్రారంభంలోనే ఆ జగన్నాథుని వేడుకుంటారు కుమార్ గారు.
“నే కుచేలుడను గాను” అనే పద్యంలో నేను నీకు ఏమీ కానని నన్ను విడిచిపెట్టొద్దు అని మొర పెట్టుకుంటారు..”అన్నదాతల మోమునందున” అను పద్యంలో జగతిలో సుఖశాంతులు కలిగి ఉండేలా వరమివ్వుమని, ఆ చిన్ని ఆశ తీర్పమని లోకక్షేమాన్ని కాంక్షిస్తారు. “కన్నవారిని వీడి ఉన్న ఊరిని వదిలి” అనే పద్యంలో మన వీరజవానుల త్యాగాన్ని మంచుకొండల్లో మెరిపిస్తారు.
“గంగా జలమనగ- కప్ప, చేపల ఎంగిలి” అనే పద్యం బాలమురళీ కృష్ణ గారి “ఏమీ సేతురా లింగా” అనే తత్వాన్ని స్ఫురింపచేస్తూ, మనం నిమిత్తమాత్రులమనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.
“మూడు కాళ్ళను పొందు ముసలి గాక మునుపె” అని ” శరీరమాద్యం ఖలు ధర్మ సాధనమ”న్నట్లు ఈ శరీరం పూర్తిగా అధీనం తప్పకముందే మురారి నామస్మరణ కవచమై కాపాడుతుందని ఉద్భోధిస్తారు. “లాలిపాటలలేవి? లాలింపులవి యేవి?” అంటూ నేటి బాల్యం పూర్తిగా అదుపు తప్పిందని వాపోతారు.
“పోరి పోరి అలసిపోయితినిక నాకు/ లావొక్కింతయు లేదు, రంధి హెచ్చె” జీవితమనే పోరాటంలో అలసిపోయానని, బలహీనుడయ్యానని చెప్తూ భాగవత పద్యాన్ని గుర్తుకు తెస్తారు.
“పవి పుష్పంబగు, నగ్ని మంచగు” అని భర్తృహరి అన్నట్లు ” నీ దయ మాకున్న” పద్యంలో మా బ్రతుకు నీదే మాధవా! అంటూ హృదయపుష్పాన్ని సమర్పిస్తారు.
భక్తిభావమే కాకుండా ఈ శతకంలో తల్లిదండ్రులు, గోమాత, స్నేహభావం, శ్రమజీవులు, వ్యసనాలు, క్రీడలు, నైతిక విలువలు …మొదలైన ఎన్నో అంశాలు ప్రస్తావింపబడడం కవికి ఉన్న బలీయమైన సమాజ శ్రేయస్సు కాంక్ష గోచరమవుతున్నది. పురాణేతిహాసాల పట్ల వీరికున్న అపారజ్ఞానం అనేక పద్యాల్లో మనకు ద్యోతకమవుతుంది.
‘శంకు’ నుండి తీర్థంలా ఇంకా ఎన్నో శతక మకరందాలు ఈ కవి కలం నుండి ఆ అనంత పద్మనాభుని అనుగ్రహంగా స్రవించాలని ఆశిద్దాం.