సేవ అనేది అన్ని ధర్మాలలో కెల్లా ఉత్తమ ధర్మం. మన ఈ భారతదేశంలో కుల,మత, జాతులకు అతీతంగా సేవాగుణం గురించి బోధించి, ఆచరణలో పెట్టి సేవాధర్మాన్ని ఎలా ఆచరించాలో చెప్పారు. సేవ అనేది ప్రతిఫలం ఆశించకుండా చేస్తేనే నిజమైన సేవ. పేరు కోసం పాకులాడి చేసే సేవలో స్వార్ధం ఉంటుంది.
మానవాళి ఎలా జీవించాలో నేర్పింది రామాయణం. చిన్న చిన్న కథల ద్వారా, వ్యక్తుల ద్వారా సేవా ధర్మాన్ని అంతగా చదువుకోని వారికి కూడా తెలిసేలా వివరించింది. సమాజంలో ఒకరికొకరి మధ్యన సేవాగుణం ఉంటేనే బంధాలు నిలుస్తాయి.
సేవలు ఎన్నో రకాలుగా చేయవచ్చు. రోగులు, అనాధ శిశువులకు, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం మొదలైనవెన్నో ఉన్నాయి.
సేవ చేయడంలో సేవలు పొందినవారే కాక- సేవలు అందించిన వారికి కూడా ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఒకసారి అనుభవంలోకి వస్తే పదే పదే సేవలు చేయాలని అనిపిస్తుంది. సేవ చేయడానికి స్వార్ధం వదిలితే చాలు!
అటువంటి సేవా గుణాన్ని శబరి పాత్ర ద్వారా రామాయణం చెప్తుంది.సేవాగుణం పెంపొందించేలా మాటిమాటికి చెప్పకపోతే మానవ మనస్తత్వాలు, విద్రోహ చర్యలు ఎక్కువగా పెరిగిపోతున్న ఈ రోజులలో సేవాధర్మం పెంచి, సత్ప్రవర్తన అలవర్చుకొనే దిశగా సాగాలి.
శబరి బోయ జాతిలో పుట్టిన పరమ భక్తురాలు. భక్తికీ, ప్రపత్తికీ… పరాకాష్టగా నిలిచి, నిష్ఠతో రాముని పూజించి తరించిన మహిళా భక్తురాలు ..
నవ విధ భక్తి మార్గాలలో తరించినవారుగా పేరు పొందిన వారిలో…. శ్రీరాముడి కథ వింటూ ప్రేమించిన వాడు హనుమంతుడు, కీర్తించి తరించిన వాడు వాల్మీకి. పాదుకా సేవ చేసి తన భక్తిని లోకానికి తెలిపిన వాడు భరతుడు… ఇలా రామాయణంలో ఎందరో భక్తులు మనకు దర్శనమిస్తారు… అందులో రాముని పూజించి తన్మయురాలయింది ‘శబరి’.
శబరికి జన పదాలలో జీవితం కృత్రిమంగా కనపడటంతో ఆ జీవితం నచ్చక అడవిలో కాలం గడుపుతూ… అక్కడి మునులను, ఋషులను దర్శిస్తూ… వారు భగవంతుడి గురించి చెప్పే బోధనలు వింటూ… చూస్తూ గడుపుతుంది… ఎందుకంటే ఆ కాలంలో మహిళలను ఆశ్రమాలలో ఋషులు చేర్చుకోక పోయేవారు… అయినా ఆమె మతంగ మహాముని తన గురువుగా భావించి, ఆ గురువుగారి ఆశ్రమాన్ని
మతంగముని సమిధల కొరకు, పూలు పండ్లు, దుంపల కొరకు వెళ్ళినప్పుడు చక్కగా శుభ్రపరిచి ప్రాంగణమంతా కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టేది.. ఇలా ఎన్నో రకాల సేవలు చేసేది.
పంపా సరస్సుకు వెళ్ళే తోవలో ముళ్ళు, రాళ్లు లేకుండా దారి అంతా బాగు చేసేది. ఇదంతా గురువుగారి కటాక్షం ముఖ్యమని, రాముడి దర్శనం కావాలంటే గురువు యొక్క మార్గదర్శనంలో భగవంతుడిని పొందాలని ఆమె ఎంపిక చేసుకున్న ప్రపత్తి మార్గము.
మతంగ మహాముని శబరితో రాముడు వస్తాడు, నిన్ను అనుగ్రహిస్తాడు… రాముడిని దర్శనం చేసుకొమ్మని చెప్పి, మతంగముని ఆయువు తీరడంతో ఆయన దేహాన్ని చాలిస్తాడు. ఆనాటి నుండి 14 సంవత్సరాలు నిరంతరంగా రామనామం చేస్తూ… రాముడి కొరకు ఎదురు చూస్తూ కాలం గడుపుతుంది శబరి.
రామలక్ష్మణులు సీతాన్వేషణ చేస్తూ పంపా తీరానికి వచ్చే తోవలో వృద్ధురాలై, వంగిపోయిన నడుముతో, తలంతా నెరసి, కళ్ళు కనిపించక, చేతులు నొసట ఆనించుకుని చూస్తూ… వణుకుతున్న చేతులతో ఒక పండ్ల బుట్టను పట్టుకొని వస్తూ కనిపించింది.
ఆమె ఎదురుగా ఆజానుబాహులైన సుందరమైన రామలక్ష్మణులను చూసింది…. వీరే మునులు చెప్పిన రామలక్ష్మణులనుకున్నది… చేతిలోని బుట్టను కింద పెట్టి నమస్కరిస్తూ….
రామా! రామా! నా తండ్రీ ! అని పిలుస్తూ కనపడిన శబరిని చూసి లక్ష్మణుడు రాక్షస స్త్రీ మనుష్య రూపంగా వచ్చిందని అంటాడు. రాముడికి మాత్రం ఆమె రాక్షస స్త్రీ కాదని… సరే గమనిద్దాం… అనుకొని ఆ పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని కూర్చున్నారు… ఆ పక్కనే శబరి కుటీరం ఉన్నది.
వచ్చింది రామలక్ష్మణులే అని శబరి అనుకొని రాముడి పాదాల మీద పడి ఏడుస్తూ…. నాయనా నీ భార్యను రాక్షసుడు అపహరించాడట కదా! అయినా సీతమ్మ నీ దగ్గరికి వస్తుందని రాముడిని ఓదారుస్తుంది…
ఇది కూడా సేవాభావమే! ఆపదలో ఉన్నవారికి ఓదార్పు నివ్వడం నిజమైనసేవే!!
నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను.. నా గురువుల అనుగ్రహమే మీ దర్శనం అయిందని కళ్ళల్లో నీరు ధారగా కారుతూండగా… నాయనా నా కుటీరంలోకి రాండి… కాసేపు విశ్రమిద్దురు అని, పళ్ళ బుట్టను చేతిలో పట్టుకొని కుటీరం వైపు తోవ చూపిస్తూ ఉండగా.. అమ్మా! నీ గురువు ఎవరు? అని అడుగుతాడు రాముడు.
నా గురువు మతంగ ముని… ఆయన నీ గురించి చెప్పి నువ్వు ఇక్కడే ఉండు… శ్రీరాముడు వస్తాడు సేవలు చేయమని చెప్పగా ఆనాటినుండి మీ కొరకు ఎదురు చూస్తున్నానని చెప్పింది శబరి.
రాముడి కొరకు రోజూ చెట్టుచెట్టు కూ తిరిగి తీయని మామిడి పండ్లు తాను రుచి చూసి, బాగుంటేనే రాముడి కొరకని అలా నైవేద్యం పెట్టేది..
రాముడు పండ్లు తింటూ రాముడు నీ మనసు వలనే ఈ పండ్లు కూడా తీయగా ఉన్నాయి… ఎందుకంటే భక్తిశ్రద్ధలతో ఇచ్చిన పండ్లు ఇవి అని రాముడుతింటూ ఉంటే… లక్ష్మణుడికి చాలా సంతోషం కలిగింది… ఎందుకంటే సీతా వియోగం జరిగినప్పటి నుండి రాముడు ఆహారం తీసుకోలేదు. శబరి ప్రేమతో కూడిన భక్తితో ఇవ్వడం వలన తింటున్నాడని సంతోషం…(ఇది లక్ష్మణుని సేవాగుణం)
శబరి కూడా 14 సంవత్సరాలుగా రోజూ రాముడికని పండ్లు ఏరుకొని తేవడం, నివేదించడం…( ఏదేని పని తలపెడితే కొద్ది రోజులు ఉత్సాహంగాఆ పని చేయడం, తరువాత ఆ పనినుండి పక్కకు వైదొలగడం కాకుండా ఆ పని అయ్యేటంత వరకూ దీక్ష వలె చేయడం అనేది కార్యసాధకుల గొప్ప లక్షణం…ఇదిఆచరణీయం…)
ఎదురు చూసి ఎదురు చూసి రాముడు రాకపోయేసరికి.. రాముని ప్రసాదంగా ఆ పళ్ళను తానుతిని, మళ్లీ తెల్లవారి మంచి పండ్లు ఏరుకొని తెచ్చి పెట్టేది.
శబరి రాముడితో నేను బోయ జాతిలో పుట్టాను. నేను చదువుకున్న దాన్ని కాదు, పెద్దగా విషయాలు తెలియవు, మంచిగా మాట్లాడటం కూడా రాదు… అయినా రామా!… నామీద దయ తలచి ఇంత చక్కగా మాట్లాడుతున్నావు… నా అదృష్టం సుమా!( వినయప్రకటనం- గ్రహించవలసిన విషయం)
ఏదీ? నీ పాదాలను చూడనీ! అయ్యో! రాళ్లు ముళ్ళు గుచ్చుకొని, నీ పాదాలు వాచి పోయాయి అంటూ… తన పమిట కొంగును నోటికి చేర్చి ఆవిరిపట్టి వేడి కాపు రాముడి పాదాలకు పెట్టింది…( ప్రేమ తత్త్వం) అయినా రామా! మీకూ.. మాకూ ఎప్పటినుండో సంబంధంఉంది . నీ పాదాలను తాకే అధికారం మా బోయల కే ఉంది… ఒక నాడు గుహుడికి నీ పాదాలను కడిగే భాగ్యం, గౌరవం దక్కింది.. ఆ గుహుడు మా జాతి వాడే.. కాబట్టి శ్రీరామ చరణాలు తాకె అదృష్టం భిల్ల వంశీయులకే ఉంది.. ( హక్కులు తెలుపడం- తెలుసుకోవడం)దానికి కారణం.. ఆచార్య కటాక్షమే కారణం అంటుంది. ( గురుభక్తి)
ఆమె ఆర్తి చూసిన రాముడు తనకు భక్తి మాత్రమే ముఖ్యమని, జాతి, వంశాలతో నాకు అవసరం లేదు అని అంటాడు.(జాతి వివక్షత లేకపోవడం )భక్తి లేని వాడు ఎంత గొప్ప వంశంలో పుట్టి నా… ఎంత గొప్పవాడైనా నాకు దగ్గర కాలేడు.
నువ్వు మనస్ఫూర్తిగా ఆరాధించావు కాబట్టి ధన్యురాలువి అన్నాడు రాముడు.
భగవంతుడు భక్తినే చూస్తాడు… కానీ జాతిని చూడడు కదా! భగవంతుని పొందుటకు… భగవంతుడే ఉపాయమని నమ్మినవారిని ప్రపన్నులని అంటారు.( ప్రపన్నతనే భక్తి తో భగవంతుని కరుణాకటాక్షం పొందగలుగుతాం)భగవంతుని పొందుటకు ఆచార్యుడే
ఉపాయమని విశ్వసించిన శబరి అంతకన్నా ఒక మెట్టు పైనే నిలుచున్న భక్తురాలు. ఆమె ఆచార్య కటాక్షం, భగవత్ కటాక్షం రెండూ ఆచరించి.. మోక్షం పొందడానికి కావలసిన ఆరెండు ముఖ్య సాధనాలను స్వంతం చేసుకున్న శబరి…యోగంతో అగ్నిని పుట్టించుకొని, రామలక్ష్మణుల ఎదుటనే యోగాగ్నిలో ప్రవేశించి, పరమపదము పొందిన శబరి ధన్యురాలు.
భక్తి, ప్రపత్తులకు సేవకూ పరాకాష్ట శబరి వృత్తాంతం…
శబరి నదిగా మారిందని అనడంలో కూడా సేవ అనేదిఏ ఒక్క రోజో చేసి ఊరుకునేది కాదనీ, నిరంతరం నది ఎలా ప్రవహిస్తుందో…సహజంగా అలాగే సేవా గుణం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉండాలని సూచించే శబరి కథ ఆనాటికీ – ఈనాటికీ ఆచరణీయం!
చిన్న ఆఖ్యానంలో దార్శనికులైన ఋషులు లక్ష్యం ఏర్పరుచుకోవడం, దానికై శ్రద్ధగా శ్రమించడం, సేవాతత్పరత, ప్రేమ, భక్తి….రామునిలో ఐక్యమైనదంటే ఈ గుణాలన్నీ రాముడిని కూడా కదా! అలా మంచి మార్గం చూపేవారి భావాలతో, చేతలతో మమేకవడమే కదా!
శబరిలోని ఏ ఒక్క గుణం మనం స్వీకరించి పాటించినా మన జన్మ ధన్యమే కాకుండా… సమాజ అశాంతి, అల్లరుల నుండి బయటపడడమే కాకుండా మంచి లక్ష్యాలతో ముందుకు సాగవచ్చు.
పురాణ కథలను యథాతథంగా చదవడం మంచిదే ఐనా అంతరార్ధం గ్రహిస్తే ఋషుల ప్రయత్నం ఫలించినట్టే….