కాల మెప్పుడు ముందుకే కదలుచుండ
జ్ఞాన సంపన్నుడయ్యెను మానవుండు
అయిన హత్యలు యుద్ధాలు ఆక్రమణలును
ఆప లేనట్టి యిట్టి విజ్ఞానమేల 1
తీయగా రాగమ్ము తీయవే కోకిలా
కఱకు గుండెల లోన కరుణ గలుగ
చలువ చేయగరావె మలయానిలాంగన
కోపాగ్ని చల్లారి కుదురు కొనగ
తెల్లని మల్లెలు చల్లుమా వల్లికా
పగల భావము లన్ని ప్రణయ మవగ
తరులార రెక్కల తలిరాకు నింపుడీ
బీటలౌ మనముల ప్రేమ లోలుక
అరుణ కిరణాల రథమెక్కి తరలి రమ్ము
అంద మంతయు లొకాన చిందు లాడ
సరస మాధవా శుభ వసంత మవగ
వచ్చు నీకు నిదియె శుభ స్వాగతమ్ము 2
తెలుగు జనాలు షడ్రుచుల తీరును పచ్చడి గా గ్రహించి యీ
కలుములు లేములున్ మరియు కష్ట సుఖమ్ముల రాక పోకలన్
దలతురు గాని యాశలను తప్పక పెంచుక చూచు చుందు రా
ఫలముల నీయ రాగదవె| పండుగ వోలెను నవ్య వత్సరా | 3
వైద్య మెంతగా పెరిగిన , వాయు వందు
ప్రాణ హరమైన కీటముల్ ప్రాకి పోయె
మానవులు తప్పు చేయుట మాన రైరి
మనిషి తడి యెండి పోవుటే మనకు శిక్ష 4
ఎప్పుడు వచ్చి పోయెదవు నెన్నియొ కోర్కెల పంచి పెట్టుచున్
ఇప్పుడు తీరునింక నని యెంతోముదమ్మున చూచు చున్న మా
తప్పులు దిద్ది సర్వ శుభదాయిని వైన యుగాది నీకు మే
మెప్పుడు స్వాగతించెదము, మీరిన యాశల త్రుంచ బోకుమా | 5
దేశము లందు వైరములు తెచ్చి, యమాంతము పోరు పెట్టి,యా
వేశము నింపి ప్రాణముల పేల్చి నివాసము కాల్చి వేసి యా
కాశము వైపు చూపినది కాలము కాలుడు గాప్లవాబ్ది ,రా
వే, శుభ కృత్ సార్థకము వేయివిధమ్ముల చేయు మాధవా| 6
చైత్ర రథమెక్కి భాస్కర శస్త్రములతొ
దుష్ట రాక్షస గుణముల దునిమి వేయ
శ్రీ వసంతమాధుర్యము చిహ్న ములుగ
సకల జనులకు మేలుగా సాగి రమ్ము 7
ఈ శుభ కృత్ వత్సర మున
రాశులు గా పంచి పెట్టు ప్రజలందరకున్
పేశల మైన గుణమ్ముల
దేశము సుఖ శాంతులందు తేలి సుఖించన్ 8
అర్థ కామమ్ము లందున అణగి పోక
ధర్మ మార్గమ్ము వైపుకు ధరణి యంత
కదలి సాగగ నీవె దిగ్దర్శనమ్ము
నగుచు రావయ్య నీకు నమస్కరింతు 9