Home ఇంట‌ర్వ్యూలు సంస్కృత భాషను కాపాడుకోవాలి

సంస్కృత భాషను కాపాడుకోవాలి

by Aruna Dhulipala

జ: “పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా
ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృత మాతరం”
“గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః”
“విశేష విత్పారిషదేషు నాథ విదగ్ధ గోష్ఠీ సమరాంగణేషు
జిగీష తో మే కవితార్కి కేంద్రాన్ జిహ్వాగ్ర సింహాసన మభ్యుపేయా”
నమస్కారం తల్లీ! అవసరమైన విషయాన్ని ప్రశ్న రూపంలో అడిగారు. సమాజానికి తెలియాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. అవి పదిమందికి స్ఫూర్తి దాయకంగా ఉంటాయి. ఈ ఇంటర్వ్యూ వల్ల మీకో నాకో ప్రయోజనం చేకూరుతుందని కాదు. ఇది ఏ ఒక్కరికైనా ఉపయోగపడితే చాలు అని నా అభిప్రాయం. మీరు అడిగినట్టుగా నేను జూన్ 9వ తేదీ (2025) ‘ప్రాచ్య విద్యా విభూషణ’ పురస్కారాన్ని పొందాను. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విశ్వవిద్యాలయం, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వారు సంయుక్తంగా ఇచ్చే పురస్కారం. ఈ మూడు సంస్థలు కలిపి ‘ఉత్కర్ష’ అనే ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అందులో ఈ పురస్కారాన్ని అందజేశారు. దేశం మొత్తంలో ఉన్న పండితులలో నుండి ఎంచుకుంటారు. అట్లా ఆంధ్రప్రదేశ్ నుండి నన్ను ఎంపిక చేశారు. పురస్కారంతో పాటు లక్ష రూపాయలు నగదు బహుమతిగా ఇచ్చారు.

జ.   అమ్మా! నేను సీనియర్ లెక్చరర్ గా రిటైర్ అయ్యాను. నా కుటుంబం గడవడానికి ఆ పెన్షన్ సరిపోతుంది. ఈ నగదు బహుమతి నాకు సమాజం ద్వారా వచ్చింది. కాబట్టి సమాజానికే ఉపయోగించాలి అనుకున్నాను. 1972 నుండి 1984 వరకు నేను అనేక ప్రాంతాలు పర్యటించి ఆధ్యాత్మిక, సాహిత్య రంగాల్లో కృషి చేశాను. 1984 నుండి నా కృషిని గుర్తించి భారతదేశం మొత్తంలో నన్ను అందరూ పిలవడం ప్రారంభించారు. ఇప్పుడు ఇంత గొప్ప పురస్కారాన్ని, నగదు బహుమానాన్ని అందుకున్నాను. అందువల్ల ఇది సమాజానికే చెందాలి అనిపించింది. ఆ బహుమతిని నేను నాలుగు భాగాలు చేశాను. ఒక భాగం పాతికవేలు నేను చదువుకున్న సీతారాం బాగ్ సంస్కృత కాలేజీకి ఇచ్చాను. అది కూడా పోటీలో విజేతలకే. నాకు అంత్యాక్షరి శ్లోకాల పోటీ చాలా ఇష్టం. 1972 లో ఆ పోటీలో నేను రాష్ట్రస్థాయిలో ప్రథమ విజేతను. దాంట్లో చాలా నియమాలు ఉంటాయి. సుప్రభాత శ్లోకాలు చెప్పకూడదు. అనుష్టుప్ లు ఉండకూడదు. వృత్తాలు మాత్రమే తీసుకోవాలి. ఎన్నో శ్లోకాలు కంఠతా వస్తే తప్ప నెగ్గడం కష్టం. ఆ పోటీ నాకు చాలా ఇష్టం. నేను ఈ పాతిక వేల రూపాయలను FD చేయమని చెప్పాను. ప్రతీ ఏడాది పెట్టే ఈ అంత్యాక్షరి పోటీలో విజేత అయిన విద్యార్థికి ఆ వచ్చిన డబ్బును బహుమతిగా ఇవ్వమని చెప్పాను. ఇదే తరహాలో ఇంకో పాతిక వేల రూపాయలను నాకు అవార్డు ఇచ్చిన తిరుపతి జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయానికి ఇచ్చాను. మరో పాతికవేలు నేను పుట్టిన ఊరికి సంబంధించి కొన్ని సౌకర్యాల నిమిత్తం ఇచ్చాను. ఇంకో పాతిక వేలు మా ఊళ్లోని రంగనాయక స్వామి దేవాలయానికి ఇచ్చాను. ఈ స్ఫూర్తితో నా శిష్యురాళ్ళు స్వరూపరాణి, శివాని పాతికవేల చొప్పున ఇవ్వగా శ్రీదేవి అనే శిష్యురాలు వాళ్ళ అమ్మగారి పేరు మీద యాబైవేలు, విజయ గారని మరొకరు ఇరవై ఐదు వేలు, నాతో పాటు పురస్కారం పొందిన మరో పండితుడు పాతికవేలు మొత్తంగా లక్షా యాబైవేల రూపాయలను తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి ఇవ్వడం జరిగింది. ప్రతీ ఏటా జరిగే టాలెంట్ ఫెస్టివల్ లో విజేతలైన ఆరుగురు విద్యార్థులకు అందజేయమని చెప్పాం. నేను చేసిన పని ఇంకొంతమందికి ప్రేరణ కావడం ఎంతో సంతోషంగా అనిపించింది.

జ:-  నూజివీడు జమీందార్లు శ్రీరంగపురం గుదిమెళ్ళ వారికి ఇచ్చిన అగ్రహారం. భగవద్రామానుజాచార్యుల వారు వైష్ణవ మత వ్యాప్తి కోసం 74 పీఠాలు పెట్టారు. అందులో తిరుమల పీఠం ఒకటి. అది మా గుదిమెళ్ళ వారిది. అట్లా తిరుమల అని కూడా కలిసింది. మా ఊరుకు దక్షిణంగా ఆంధ్రమహావిష్ణువు, తూర్పున మొవ్వ, ఉత్తరంగా కూచిపూడి ఈ మూడింటి మధ్య మా ఊరు. మా పూర్వీకులలో ఒకాయన పాల్వంచకు వెళ్లి అక్కడ అగ్రహారాన్ని సంపాదించి దాదాపు నలభై ఏళ్లు ఉన్నాడు. ఆయన కుమారుడు వెంకటాచార్యులు ఉయ్యాలలో ఉండగా పులి ఎత్తుకుపోతుంటే గ్రామస్థులు తరిమి పిల్లవాణ్ణి కాపాడారట. అప్పటినుండీ ఆయన పులి వెంకటాచార్యులు అయినాడు. ఆ తరువాతి కాలంలో వెంకటాచార్యులు ఆ అగ్రహారాన్ని వదిలేసి మొవ్వ దగ్గర పిచుకల పాడు అనే అగ్రహారాన్ని సంపాదించుకున్నారు. పాలవంచ నుండి వచ్చినవారు కాబట్టి పాలవంచ వారు అని పిలవడంతో పిచుకల పాడు అగ్రహారం కాస్తా పాలవంచ అగ్రహారమయింది. అక్కడి నుండి మళ్ళీ కొంతమంది శ్రీరంగపురం వచ్చారు. ఇదంతా కలిసి పాలవంచ తిరుమల గుదిమెళ్ళ ఇంటి పేరు అయింది.

జ. మాది కృష్ణాజిల్లా, శ్రీ రంగపుర అగ్రహారం. నూజివీడు జమీందార్లు గుదిమెళ్ళ వాళ్లకు ఇచ్చిన అగ్రహారం. నేను జూన్ 23, 1952లో శ్రీరంగపురంలో జన్మించాను. మా నాన్నగారి పేరు సత్యనారాయణాచార్య గారు. మా అమ్మగారు లక్ష్మీ నరసమ్మ గారు. మా నాన్నగారు ఏమీ చదువుకోలేదు. కానీ సంస్కృత మహా పండితుడు. చిట్టి గూడూరులో పాఠశాలలో చేర్పిస్తే వాళ్ళ నానమ్మ గారు చదువెందుకని పట్టుకొచ్చారట. ఇంట్లోనే కూర్చుని చదువుకున్నారు. అద్భుతమైన పాండిత్యం ఆయనది. పురాణాలు, భారత, భాగవతాలు చెప్పేవారు. కంచుకంఠంతో ఆయన చెబుతుంటే మైకు లేకుండా మైలు దూరం వినిపించేది. మా చిన్నాన్నగారు గోపాల కృష్ణమాచార్యులు గారు. శాస్త్రం చదువుకున్నవారు. ఆయన కూడా మహా పండితుడు. ఆశుకవి. నా అదృష్టం కొద్దీ చిన్నతనంలో మా నాన్నగారు తనతో పాటు నన్నూ తీసుకెళ్లేవారు. నన్ను పురాణం చదువుమని చెప్పి ఆయన వ్యాఖ్యానం చేసేవారు. తొమ్మిదిమంది సంతానంలో నేను చివరి వాడిని. నలుగురు అన్నయ్యలు, నలుగురు అక్కయ్యలు. ఒక అన్నయ్య చనిపోయాడు. మా పెద్దన్నయ్య గొప్ప పండితుడు. వైష్ణవ సంప్రదాయంలో ఉన్న తమిళ గ్రంథాలన్నింటికీ తెలుగులో వ్యాఖ్య రాశాడు. ‘నాలాయిర’ మని నాలుగువేల శ్లోకాలతో కూడిన దివ్య ప్రబంధాన్ని రాశాడు. అంతేకాదు. అక్కడక్కడా ఊళ్ళల్లో గోష్ఠులు నిర్వహించి పదకొండు రోజుల్లో తెలుగు అర్థంతో సహా వాటిని నేర్పేవాడు. మా రెండో అన్నయ్య తెలుగు పండితుడు. ఆయన పధ్నాలుగేళ్ళు కష్టపడి మా వంశవృక్షం రాశాడు. మా ఊళ్ళో ‘భాష్యకార’ ప్రభుత్వ పాఠశాలలో నేను అయిదవ 5వ తరగతి వరకు చదువుకున్నాను. మచిలీపట్నం వచ్చి ఓరియెంటల్ హైస్కూల్లో 6వ తరగతి నుండి ఎస్ ఎస్ ఎల్ సి వరకు చదువుకున్నాను. వేదాల నరసింహాచారిగారు, గుదిమెళ్ళ రామానుజాచార్యులు గారు, మల్లంపల్లి దుర్గాప్రసాద్ గారు ఇట్లాంటి మహా పండితులు పాఠాలు చెప్పడం వల్ల సాహిత్యం పట్ల అభిరుచి కలిగింది. మా రెండో అన్నయ్య నాకు మూడవ తరగతి నుండి మొదలుపెట్టి అయిదవ తరగతి వచ్చేవరకు అమరకోశం, తెలుగులో ఆంధ్ర నామ సంగ్రహం, శతకాలు, శబ్దాలు, ధాతువులు, సమాసాలు ఇవన్నీ నేర్పించడం వలన గట్టి పునాది పడింది. అందువల్ల సంస్కృతం నేర్చుకోవాలనే కోరిక బలీయంగా కలిగింది.

రంగాచార్య గారితో అరుణ ధూళిపాళ

జ:-   సీతారాం బాగ్ లో మా అక్కయ్య గారుండేవారు. మా బావగారు అక్కడ అర్చకులు. 1967 లో బందరులో నా ఎస్ ఎస్ ఎల్ సి పూర్తయింది. సెలవుల్లో మా అక్కయ్య వాళ్ళింటికి వచ్చాను. పక్కనే కాలేజీ ప్రాకారం పెద్దగా ఉండేది. సాయంత్రం అయ్యేసరికి పిల్లలంతా బయటకు వచ్చి సంస్కృతంలో మాట్లాడుకుంటుంటే నేను ముందే అమరకోశం వంటివి నేర్చుకొని ఉండడం వల్ల వాళ్ళతో మాట్లాడేవాడిని. వాళ్ళందరినీ చూసి నాకూ ఇక్కడే చదువుకోవాలనిపించింది. అదే విషయం ఇంట్లో చెప్పి ఇక్కడ కాలేజీలో చేరాను. ‘శ్రీ వేంకటేశ్వర వేదాంత వర్ధిని’ సంస్కృత కళాశాలనే సీతారాం బాగ్ కాలేజీ అంటారు. మరింగంటి శ్రీరంగాచార్య గారు, బంగీపురం రామాచార్యులు గారు, సముద్రాల శ్రీనివాస శర్మ గారు, వర్ఖేడ్ గారు వంటి మహామహులు బోధించిన జ్ఞానంలో లేశమాత్రమైనా అబ్బింది. భారతదేశంలో ముఖ్యంగా మన ఉభయరాష్ట్రాల్లో గొప్ప వ్యవస్థ అది. అట్లా హైదరాబాద్ కు చేరుకున్న నాకు ఇక్కడ ఎంతోమంది మిత్రులు ఏర్పడ్డారు. ఆ కళాశాలలో చదువుకోవడం నా అదృష్టంగా భావిస్తాను. అందుకే నాకు వచ్చిన నగదు బహుమతిలో కొంత ఆ కళాశాలకు ఇచ్చాను.

జ:-  శ్రీ గాయత్రీ రామాయణాలు రెండు ఉన్నాయమ్మా. మనకు ఒకటి మాత్రమే తెలుసు. 24 శ్లోకాలతో ఒకటి ఉంటుంది. దాని క్రింద వ్యాఖ్యానంలో ఇంకో 24 శ్లోకాలను చూపించారు. నేనూ అవీ ఇవీ రెండూ రాసి దానికీ దీనికీ ఉన్న భేదమేమిటి? ముందు శ్లోకాలు, వెనుక శ్లోకాలు వాటి భావాలు తీసుకొని ఒక్కో బీజాక్షరాన్ని అది బీజాక్షరం ఎందుకైందో వివరిస్తూ విజయనగరంలో ఉన్నప్పుడు రాశాను. మా గురువుగారు మహనీయమూర్తి కృష్ణయాజి గారు. రాయడం పూర్తి చేసి “ఇవాళ గురువు గారి దగ్గరకు వెళ్లి ఇది చూపించి ఇరవై నాలుగు బీజాక్షరాలకు సంబంధిత దేవతా చిత్రాలతో ముఖచిత్రం వేస్తే బాగుంటుందని అడగాలి” అనుకొని వెళ్ళాను. నమస్కారం చేసి నేను కూర్చోగానే ఒక అట్ట తీసి ఇచ్చి చూడమన్నారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే మీరు నమ్మరు. నేను ఏది అనుకొని వెళ్ళానో అదే చిత్రం అట్ట పైన ఉంది. “ఇదే కదా! నువ్వు అనుకున్నది!” అన్నారు నవ్వుతూ. అంతటి మహానుభావులు ఆయన. ఈ మధ్య ఎవరో ప్రముఖుడు ఒక ఇంటర్వ్యూలో భారతదేశంలోని గొప్పవాళ్ళలో ఒకరిగా కృష్ణయాజి గారిని పేర్కొనడం విశేషం. ఆయనకు నేను శిష్యుడిని కావడం, ఆయన అనుగ్రహాశీర్వాదాలను అందుకోవడం నా సుకృతం.

జ:-  నా రచనలన్నీ ఒక ప్రత్యేకతతో కూడుకొని ఉంటాయి. ఇందులో కాళిదాసు శ్లోకాలను వివరించాను. అది ఎట్లాగంటే ఒక వ్యక్తిని పాత్రగా ‘సందేహి’ అనే పేరు పెట్టాను. అతనికి కొన్ని సందేహాలు వచ్చినట్టు, అతనికి కాళిదాసు ఎదురై తన కావ్యాలలోని శ్లోకాలతోనే సందేహాలు తీర్చినట్టు చెప్పాను. ఉదా:- సందేహి:- “మా బంధువు ఒకాయన ఉన్నాడండీ. అతనికి దుర్లక్షణాలు ఉన్నాయి. అతడిని దగ్గరకు తీయాలా? దూరంగా ఉంచాలా?” అని అడుగుతాడు. అప్పుడు
కాళిదాసు:- “నాయనా! నేను రాసిన ‘రఘువంశం’ లో “ద్వేష్యోఽపి సమ్మతః శిష్టః తస్యార్తస్య యథౌషధం త్యాజ్యో దుష్టః ప్రియోఽప్యాసీదంగుళీ వోరగక్షతా” అనే శ్లోకం ఉంది కదా! అది చదువు. పాము మన కాలి వేలును కాటేస్తే అది మనదేనని విషాన్ని భరిస్తామా? వేలును తెగ్గొట్టేస్తాం కదా! అట్లాగే దుష్టుడైతే నీవాడైనా వదిలేయ్. శత్రువు మంచివాడైతే గౌరవించు. అని శ్లోకాన్ని ఉదాహరణగా చెబుతూ అటు శ్లోకం, ఇటు భావం, సందేహ నివృత్తి అన్నీ వచ్చేటట్లు రాశాను. ఆ విధంగా నక్షత్రాలు ఇరవై ఏడు కాబట్టి, ఇరవై ఏడు సందేహాలు, వాటికి కాళిదాసు కావ్యాలలో ఆ సందర్భానికి తగిన శ్లోకాన్ని ఉటంకిస్తూ పరిష్కార మార్గాన్ని సూచిస్తూ రాశాను. అది చిన్న పుస్తకమే అయినా రెండు ప్రింట్లు పూర్తి చేసుకోవడమే కాక సంస్కృతంలో కూడా తయారవుతోంది. హిందీలో కూడా ఒకాయన రాశారు.

జ:-  విజయనగరం, మహారాజ ప్రభుత్వ సంస్కృత కళాశాలలో కావ్యప్రకాశం, రస గంగాధరం, ధ్వన్యాలోకం, దశరూపకం పాఠాలు చెబుతుంటే అసలు కావ్యం, రసం, నాటకం గురించి సమగ్రమైన వివరణలతో తెలుగులో ఒక గ్రంథం ఉంటే బాగుండుననిపించింది. దేశికోత్తములు బ్రహ్మశ్రీ ఆచార్య వేదుల సుబ్రహ్మణ్యం గారు నన్నే ఆ పనికి  పూనుకొనమని మార్గాన్ని సూచించారు. ఇందులో నవరసాలు వాటి గొప్పతనమే కాకుండా మనకు ‘దశరూపకాలు’ ఉన్నాయి కదా! వాటికి ఉదాహరణలుగా ఏ పుస్తకాలున్నాయో సేకరించాను. వాటి గురించిన వివరాలన్నీ అందులో చేర్చాను. ‘సమవాకార’ రూపకం గురించి రెండేళ్లు తిరిగాను. మైసూరు లైబ్రరీలో ఉందని తెలిసి అక్కడకు వెళ్లి ఆ పుస్తకాన్ని చూసి విషయమంతా రాసుకున్నాను. మా గురువు గారు కృష్ణయాజి గారు దానికి పేరు పెట్టడమే కాక ముఖచిత్రంలో భరత మహర్షి చిత్రాన్ని ఆయనే స్వయంగా చిత్రించారు. కావ్యమంటే ఏమిటి? కావ్య లక్షణాలు, దశరూపక లక్షణాలు, నాటకం గురించిన వివరాలు, నాటకంలో వేదికకు ఉండాల్సిన కొలతలు, నటుల వస్త్రాలు, ఆభరణాలు ఎట్లా ఉండాలి? ఆరభటీ మొదలగు వృత్తులు, వాటి ఉత్పత్తి మున్నగు అనేక విషయాలను వివరించాను. సంస్కృతం చదువుకునే వారందరికీ తేలికగా అర్థమయ్యే రీతిలో ఉంటుంది.

జ:-  అవును. సంస్కృతంలో రఘువంశము, కుమారసంభవము, కిరాతార్జునీయము, శిశుపాలవధ, నైషదీయ చరితము పంచమహాకావ్యాలు. కొందరు నైషదీయ చరితకు బదులు మేఘసందేశం అని చెవుతారు కానీ అది సరి కాదు. అలాగే తెలుగులో  మనుచరిత్ర, వసుచరిత్ర, ఆముక్తమాల్యద, పాండురంగ మాహాత్మ్యము, శృంగారనైషధము పంచమహాకావ్యాలు. శృంగారనైషధము స్థానంలో పారిజాతాపహరణం చెప్తారు. కానీ విశ్వనాథ సత్యనారాయణ గారి భావనలో శృంగారనైషధము తీసుకోబడింది. ఈ పది మహాకావ్యాల గురించి విద్యార్థి లోకానికి కనీసం పరిచయమైనా చేయాలనుకున్నాను. నా మిత్రులైన పదిమంది పండితుల చేత సంస్కృత పంచ మహాకావ్యాలు అయిదు, తెలుగులోని పంచ మహాకావ్యాలు ఐదింటిని గురించి రాయించాను. మొదటి పేజీలో వారందరి బయోడేటాలు, ఫోటోలు వేయించాను. తెలుగులో ఉప పంచ కావ్యాలుగా  ప్రభావతీ ప్రద్యుమ్నము, విజయ విలాసము, పారిజాతాపహరణము, హరవిలాసము, కాళహస్తీశ్వర మాహాత్మ్యము ప్రచారంలో ఉన్నాయి. దీంట్లోనే అనుబంధంగా ఉప పంచ కావ్యాలను గురించి సంక్షిప్తంగా స్వయంగా నేనే రాసి అచ్చు వేయించాను. మూడువందల పేజీలు వచ్చింది.

జ:-  ‘నవ్య శతావధానం’ అనేది నేను కొత్తగా ఏర్పాటు చేశాను. ఇప్పటిదాకా ఇటువంటిది ఎవరూ చేయలేదు. శతావధానాలున్నాయి కానీ ఇందులో నేను ఒక ప్రత్యేకతను తయారుచేశాను. ఇప్పుడు అవధానాల్లో మీరు గమనిస్తే పద్యం, శ్లోకం చెప్పడం, దాన్ని ధారణ చేయడం. అసలు అవధాని అంటే అర్థం అది కాదు. ఋగ్వేదావధాని, యజుర్వేదావధాని అంటాం. అంటే వాళ్ళు కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు కదా! ఉన్నదాన్నే ధారణ చేసి చెప్పడం. కానీ నేను చేసింది వేరు. మహాకవి కాళిదాసు గారి కావ్యాల్లో వంద శ్లోకాలు తీసుకొని ప్రశ్న వేస్తుంటే అవధాన రూపంలో సమాధానం చెప్పడం. కేవలం దానికి సమాధానం చెప్పడమే కాదు. ఆ ప్రశ్నకు కాళిదాసు ఈ సందర్భంలో ఈ కావ్యంలో, ఈ విషయాన్ని ఈ శ్లోకంలో ఇట్లా చెప్పారని వివరించడం. దాని భావంతో సహా తెలుగులోనూ, సంస్కృతంలోనూ చెప్పడం. అడిగే వాళ్లకు ఈ పద్ధతిలో ప్రశ్నలు ఏ విధంగా అడగాలో తెలియదు కాబట్టి నేను ఒక పద్ధతి ప్రకారంగా అవధానం లాగానే దత్తపది, వర్ణన, సమస్య…ఇట్లా పది విభాగాలు చేశాను. ఉదా:- కాళిదాసు రచించిన ఏదైనా ఒక కావ్యంలోని ఏదైనా శ్లోకం లోని నాలుగు పదాలు ఇచ్చి ఈ నాలుగు పదాలు కాళిదాసు ఏ శ్లోకంలో చెప్పాడు అని అడిగితే ఆ శ్లోకాన్ని, దాని భావాన్ని, అది కూడా సంస్కృతంలో చెప్పడం..ఈ విధంగా ఆదికవి వాల్మీకి, వేదవ్యాసుడు, మనువు, భవభూతి, కాళిదాసు, మాఘుడు, భారవి, ఆది శంకరాచార్యులు మొదలగు కవుల కావ్యాలనుండి ఆణి ముత్యాల వంటి నూరు శ్లోకాలను తీసుకొని చేశాను. అందువల్ల నాకు ‘సంస్కృత నవ్య శతావధాని’ అనే బిరుదు ఇచ్చారు. ఇది కొంతమందికి ఆగ్రహం కూడా తెప్పించింది (నవ్వుతూ). దీన్ని ‘సంస్కృత నవ్య శతావధాన సందర్శినీ’ అనే పేరుతో పుస్తకం వేశాను.

జ:- అవునమ్మా! వీటిలో కూడా అందరిలాగా కాకుండా కొంత కొత్తదనాన్ని పాటించాను. నేను రాసిన మొట్టమొదటి సుప్రభాతం శ్రీ కూర్మనాథ సుప్రభాతం. శ్రీ ధర్మ శాస్త్ర సుప్రభాతం, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు సుప్రభాతం, శ్రీ సూర్యదేవ సుప్రభాతం, శ్రీరంగనాయక సుప్రభాతం మొదలగు ఏడు సుప్రభాతాలను రాశాను. సుప్రభాతాలను నేను రాసిన పద్ధతి వేరు. సాధారణంగా అన్ని సుప్రభాతాలలో ఆయా భగవంతుని ఉద్దేశించి, దేవతలందరూ వచ్చారని, పక్షుల కిలకిలరావాలను, భక్తగణ నాట్యాలను, వారి ఆనందాన్ని ఇట్లా వివరించుకుంటూ రాస్తారు. కానీ నేను రాసే దాంట్లో చారిత్రక విషయాలు ఉంటాయి. ఆ ప్రాంతంలో స్థానికంగా ఉన్నటువంటి, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న దేవతల గురించి రాస్తాను. ఉదా:- మా ఊరికి దగ్గర ‘మొవ్వ’ ఉంది. మొవ్వ వేణు గోపాల స్వామి గురించి, అలాగే కూచిపూడి, శ్రీకాకుళం ఉన్నాయి వాటి గురించి రాస్తాను. ఏ సుప్రభాతం రాసినా వాటి గురించే కాకుండా వాటి చారిత్రక నేపథ్యం కూడా వివరిస్తాను. భగవంతుడు గొప్పవాడని చెప్పడమే కాక ప్రజలకు చారిత్రక విషయాలు కూడా తెలియాలని నా ఉద్దేశ్యం. ఏదైనా సమాజానికి ఉపయోగపడాలని నా తాపత్రయం.

జ:- మా గురువు గారు కృష్ణయాజి గారు విజయనగరం జిల్లాలోని గరివిడి గ్రామంలో శ్రీ సూర్య సదనంలో లోక కళ్యాణార్థం సత్రయాగాన్ని తలపెట్టారు. ఆ యాగానికి శ్రీ అవధూత దత్తపీఠాధిపతులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారిని ఆహ్వానించేందుకు సూర్యసదన ఆస్థాన పండితుడినైన నన్ను నియమించారు. అక్కడ నేను శ్రీ ఎన్. కాంతారావు గారితో కిష్కింధావనాన్ని దర్శించిన సమయంలో స్వామివారు స్వయంగా ఉద్యానవన విశేషాలు వివరించి వీటి గురించి శ్లోకాలు రాయండి అన్నారు. ఎంతో సంతోషంగా ‘వృక్ష విలాపః’ అనే శీర్షికతో పధ్నాలుగు శ్లోకాలను రాసి శ్రీ కృష్ణయాజి గారికి వినిపించాను. ఆయన దాన్ని ‘వృక్షోపదేశః’ అని మార్చమని సూచించారు. వృక్షాల వల్ల ప్రయోజనాలు, వాటిని నష్ట పరచుకోవడం వల్ల మానవజాతికి కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ రాశాను. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో శ్లోకాలకు తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ భావాలను కూడా ఇవ్వడం జరిగింది.

జ:-  నేను ఇప్పటివరకు సంస్కృతం, తెలుగులలో ముప్ఫయి పైగా రచనలు చేశాను. ఇంకా అముద్రితాలు కొన్ని ఉన్నాయి. నా ఊపిరి ఉన్నంతవరకు సమాజానికి ఉపయోగపడే రచనలు చేస్తూనే ఉంటాను. మీరు అడిగిన పుస్తకాలతో పాటు అష్టవిధ ప్రక్రియాః , నవరత్నములు, నవ వ్యాకరణములు, ద్వాదశ మణి మంజూషా, ద్వాదశ మహాయోగినః, వాజపేయి కవితాః (సంస్కృత, ఆంధ్రానువాదౌ), అష్టోత్తర శత ధర్మ సూక్ష్మములు, మహాకవి కాళిదాస కావ్య శతావధాన సంస్పర్శినీ, చమత్కార శతమ్, నిత్యసత్యాలు వంటి రచనలు చేశాను. నా పి హెచ్ డి ‘పురాణేషు వైజ్ఞానిక విశేషాః’ అనే అంశంపై చేశాను. పురాణాలలో ఉండే వైజ్ఞానిక పరమైన విశేషాలు ఇందులో ఉంటాయి. రాసిన ప్రతీ పుస్తకంలో సామాజిక ఉపయోగమే నా ముఖ్య ఉద్దేశ్యం.

రంగాచార్యగారి రచనలు

జ:- ఇది విద్యార్థులకు మాత్రమే కాదు. సంస్కృతం నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నవారందరికీ ఉపయోగపడుతుంది. ఇందులో నాలుగు భాగాలు ఉంటాయి. ప్రథమ భాగంలో సంస్కృత వర్ణమాల నుండి మొదలుకొని మనం నిత్య వ్యవహారంలో ఉపయోగించే వస్తువుల పేర్లన్నీ తెలుపబడ్డాయి. ద్వితీయ భాగంలో తిఙన్తాలు, ఉపయోగపడే ధాతువులు, పరస్మై ఆత్మనే పదులు, అవ్యయాలు, వాక్య పరివర్తనలు మొదలగు అంశాలు ఉంటాయి. తృతీయ భాగంలో వాక్యరచన, సుబంతాలు, సంధి, సమాసాలుంటాయి. చతుర్థ భాగంలో సంస్కృత వాఙ్మయమ్ గురించి, ఇంకా అనేక విషయాలుంటాయి. నా యాభై ఐదేళ్ళ బోధనానుభవాలతో దీన్ని రాశాను. ఇప్పటివరకు మూడు ముద్రణలు పూర్తయినాయంటే దీనికి ఎంత ఆదరణ లభించిందో అర్థమవుతుంది. అందువల్ల నా లక్ష్యం నెరవేరినట్టుగా నేను భావిస్తున్నాను. నేను మహాపండితుల పుస్తకాలకు అభిప్రాయాలు రాశాను. ఉత్తరభారత దేశంలో కూడా అక్కడి పండితులు మన వాళ్ళను ఒప్పుకున్నట్లుగా వాళ్ళ అభిప్రాయాలు రాశారు. నా చేత వాళ్ళ గురించి అభిప్రాయాలు రాయించుకున్నారు. పద్మశ్రీ రమాకాంత్ శుక్లా గారని ఢిల్లీ పండితుడు. …”భాతిమే భారతం..” వంటి ఆయన రచించిన ఎన్నో పాటలు రేడియోలో వచ్చేవి. ఆయన తన రచనలు నాకిచ్చి పాద నమస్కారం చేశారు. నా గొప్పతనం చెప్పడానికి ఇది చెప్పడం లేదు. వాళ్ళు కూడా మనలను అంగీకరించారని చెప్తున్నా. శశిధర్ అని పంజాబ్ కు చెందిన పండితుడు నా చేత ఆయన పుస్తకానికి అభిప్రాయం రాయించుకున్నాడు.

జ:-  విద్యార్థుల ఉపయోగం కోసం తర్క సంగ్రహము, వ్యాకరణం, ఇంటర్, బి ఏ వాళ్ళకు కావలసిన రీతిలో తయారుచేశాను. వాటికి కూడా ప్రశ్నలు తయారుచేసి అవి ఏ గ్రంథంలో ఉన్నాయో చెబుతూ వాటి భావాలను కూడా వివరించాను. సంస్కృతంలో ‘ఖవ్వాలి’ ప్రక్రియను కూడా ప్రవేశపెట్టి పిల్లల చేత వేయించాను. సంస్కృతంలో హరికథలు, బుర్ర కథలు రాయడమే కాక నేనే చెప్పాను కూడా. “జజ్జనకరి జనారే జనకు జనా జనారే” అనే పాట ఉంది కదా! అదే మాదిరిలో అదే పల్లవితో సంస్కృతంలో పాట రాశాను. సంస్కృత ఉత్సవాల్లో ఢిల్లీ మొదలైన చోట పాడేవాడిని. అందరితో పాడించేవాడిని. “పురాతనేతు కాలేషు అస్మాకం భారతే రాజ భాష రూపేణా సంస్కృతమాసీత్ పశ్య, ఇదానీం తు తస్యాః పరిస్థితి చింతనీయా, జజ్జనకరి జనారే జనకు జనా జనారే, గీత, నృత్య వాద్యాదికమ్ సంస్కృతే కుర్వంతి …….ఆగచ్ఛతి రే బాలా, ధైర్యం మా త్యజ బాలా” (ఉత్సాహంగా పాడుతూ) అని చెప్పి పాడుతుంటే నా చుట్టూ అందరూ మూగి పాడుతుండేవారు. ఈ విధంగా ప్రజలకు ఆకర్షణీయంగా ఉండేలా చేసి మన భాషను కాపాడుకోవాలని తాపత్రయం. సంస్కృతంలో ధ్వన్యాలోకం, రస గంగాధరం, కావ్యప్రకాశం, ప్రతాపరుద్రీయం, అమరకోశం, అలంకారాలు, ఛందస్సు, జయదేవుని చంద్రాలోకం వీటన్నిటినీ ఆన్ లైన్ లో పాఠాలుగా చెబుతున్నాను. అమరకోశం మూడు కాండలు ఏడు నెలలు వరుసగా చెప్పాను. నేపాల్ లోని ఖాట్మండు సంస్కృత విశ్వవిద్యాలయంలో కూడా శిక్షణ ఇచ్చాను. ఆకాశవాణి, దూరదర్శన్ లలో అనేక వ్యాఖ్యానాలు, హరికథలు, బుర్రకథలు, నాటికలు మొదలైన ప్రక్రియలు నిర్వహించాను. నేను నటుడినే కాక కొన్ని నాటకాలకు దర్శకత్వం కూడా వహించాను.

జ:- అవునమ్మా! “నేర్చుకుందామా సంస్కృతమ్” అనే పేరుతో వాట్సప్ గ్రూపు ఒకటి పెట్టాను. దాదాపు 260 మంది సభ్యులున్నారు. నేను ప్రతీరోజు ఆయా రోజుల ప్రత్యేకతను, ఒక శ్లోకాన్ని, దాని భావాన్ని వివరిస్తాను. నాకు వీలైనప్పుడు ఆ గ్రూపులో పెడతాను. సభ్యులు వారి వారి వీలును బట్టి నేర్చుకుంటారు. అందరికీ ఒకే సమయం కుదరదు కాబట్టి ఈ వెసులుబాటు కల్పించాను. గమ్మత్తైన విషయం ఒకటి చెప్తాను. దాని ద్వారా శ్లోకాలు నేర్చుకున్న నా శిష్యులు వాళ్ళు వాళ్ళ మిత్రులకు ఇట్లా పంపుతుండగా, ఒకాయన తాను నేర్చుకున్నవి వీడియో తీసి నాకు పంపి “మీ ద్వారా ఇట్లా శ్లోకాలు నేర్చుకున్నాం గురువుగారూ!” అని అనడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తినీ ఇచ్చింది. మనం చేసే పని పదిమందికి ఉపయోగపడడమే కదా కావలసింది. అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది? అవన్నీ కలిపి ఒక పుస్తకం కూడా వేయాలనే ఆలోచన కూడా ఉంది.

చాలా సంతోషం సార్! మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి సాహిత్యరంగంలో మీ నిర్విరామకృషిని మా పాఠకులకు తెలియజేసినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున శతకోటి ధన్యవాదాలు
సెలవు.

You may also like

4 comments

Lydia1268 October 17, 2025 - 10:52 am Reply
Collin2762 October 20, 2025 - 11:22 pm Reply
Alexa123 October 21, 2025 - 4:25 pm Reply
Ashley1097 November 20, 2025 - 3:11 pm Reply

Leave a Reply to Collin2762 Cancel Reply