– అక్కిరాజు సుందర రామకృష్ణ
కవితా గాండీవి, నాట్య శ్రీనాథ, పద్యవిద్యామణి మొదలగు బిరుదులు పొందిన ప్రముఖ నటులు, గాయకులు, కవి, రచయిత అక్కిరాజు సుందర రామకృష్ణ గారితో మయూఖ ముఖాముఖి… – అరుణ ధూళిపాళ
వివిధ రంగాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతను సాధించి ఆయా ప్రముఖుల ప్రశంసలు పొందిన అక్కిరాజు సుందర రామకృష్ణ గారి జీవిత విశేషాలను వారి మాటల్లో తెలుసుకుందాం.
నమస్కారం సార్🙏
1. మొట్టమొదటగా మీరు పుట్టి పెరిగిన ఊరు, తల్లిదండ్రులు మొదలగు విషయాలు చెప్పండి.
జ: అమ్మా! నమస్కారం. దేశంలో ‘ఋషి’ శబ్దం చాలా గొప్పది. విశ్వనాథ వారు రెండవ వాల్మీకి అని ఒక పద్యంలో చెప్పినట్టు మా నాన్నగారు కవి పండితుడు కాదు గానీ ఋషి. మంచి శిష్టాచార కుటుంబం. నాకు ఇద్దరక్కయ్యలు, నలుగురు అన్నయ్యలు, నాతో కలిపి మొత్తం ఏడుగురం. ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగం లేకుండా ఇంట్లో పిల్లలకు ట్యూషన్లు చెప్పి మమ్మల్ని ఇంత యోగ్యులను చేసాడంటే ఆయన ఋషి. మా నాన్నగారి పేరు అక్కిరాజు రామయ్య పంతులు, మా అమ్మగారి పేరు అన్నపూర్ణమ్మ. నేను1949 ఏప్రిల్ 23 చైత్ర బహుళ ఏకాదశి, శనివారం నాడు జన్మించాను. మేష లగ్నం కావడం వల్లనో ఏమో మొదటి నుంచీ మాట పడేవాడిని కాదు.
మాది గుంటూరు జిల్లా నరసరావుపేట. అది మహాకవులకు, జాతీయ వాదులకు నెలవు. 1930 ప్రాంతంలో మా నాన్నగారు అక్కడికి వచ్చారు. ఆయన తన మంచితనం, గొప్పదనంతో అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు. గొప్ప గాయత్రీ ఉపాసకుడు. అదే నాకు కూడా కొంచెం అబ్బింది. ఆయన సుందర కాండ పారాయణం చేసేవారు. తత్ఫలితంగా నేను పుట్టానని సుందర రామకృష్ణ అని పేరు పెట్టారు. మా రెండో అన్నయ్య అక్కిరాజు రమాకాంతరావు గారు. ప్రసిద్ధ రచయిత. మీ అందరికీ తెలిసినదే.
2. నరసరావు పేటలో మీ బాల్యం, విద్యాభ్యాసం ఎలా గడిచింది?
జ: నాకు పది, పదిహేనేళ్ళు వచ్చేసరికి మన హైదరాబాద్ భాషలో చెప్పాలంటే ‘ఆవారా’. అందులో కూడా అగ్రశ్రేణి ‘ఆవారా’ ( నవ్వుతూ ). చిలిపి పనులు ఎన్నో చేసేవాడిని. “ఆర్తజన గేయ పాతూరి ఆంజనేయ” అనే మకుటంతో నేను రాసిన ‘ఆంజనేయస్వామి శతకం’ లో నా బాల్య చేష్టలను రాసుకున్నాను. నేను అందరికంటే చిన్నవాడిని కావడం వలన మా అమ్మగారు బాగా గారాబం చేసేది. మా ఊరివాళ్ళు ఎకసెక్కాలు చేసేవారు. పదోతరగతి కూడా పాసవుతానని ఎవరూ అనుకోలేదు. నరసరావుపేట హైస్కూలులో లంకా సీతారామ శాస్త్రిగారు సంస్కృత పండితులు. మాకు గురువు. ఆయన రాజ్ భవన్ కి వెళ్లి సంస్కృతం నేర్పేవారు. ఆయన కూడా ఒకసారి మా నాన్నగారితో “మీ చివరి వాడు ఎందుకూ పనికిరాడయ్యా రామయ్య పంతులూ” అన్నాడట. అలా ఉండేవాడిని. స్కూల్ ఎడ్యుకేషన్ లో మూడుసార్లు తప్పాను. మా నాన్నగారు ఆంధ్రా మెట్రిక్యులేషన్ కట్టిస్తే అదీ తప్పాను.
ఆ సమయంలో మా మూడో అన్నయ్య ప్రభాకర్ గారు మెహదీపట్నంలో ఉంటుండేవారు. ఆయన నాకు పద్యాలను బట్టీ కొట్టించినట్లు, లెక్కలు బట్టీ కొట్టించి పరీక్ష రాయించారు. అప్పుడు అత్తెసరు మార్కులతో పాసయ్యాను. నరసరావుపేటలో ఉంటే నాలో మార్పు రాదని 1966 లో హైద్రాబాదుకు తీసుకువచ్చి, న్యూ సైన్సు కాలేజీలో పియుసి లో చేర్పించారు. అక్కడ కూడా నాలో మార్పు రాలేదు. బైపిసి అంటే అది కాస్త బుర్ర ఉన్న వాళ్ళకని నా అభిప్రాయం. అందుకేనేమో బాటనీ లెక్చరర్ భార్యగా లభించింది (నవ్వుతూ). ఆ తరువాత 1967, 68లో వెనక్కి వెళ్లి హిస్టరీ, పొలిటికల్ సైన్సు, స్పెషల్ తెలుగుతో కాలేజీలో చేరాను. చాలా పెద్ద మార్పు వచ్చింది. హిస్టరీలో కాలేజీ ఫస్ట్ వచ్చాను. అంత మార్పును ఎవరూ ఊహించలేదు. అప్పటి నుంచి వెను తిరిగి చూసుకోలేదు.
3. రంగస్థలంపై మీ అరంగేట్రం ఎలా జరిగింది?
జ: ఇంటిలో ఉన్న వాతావరణం నాకు తెలుగు మీద అభిమానాన్ని కలుగజేసింది. నాకు తెలుగు బోధించిన గురువుల వల్ల తెలుగు భాషా గొప్పదనం అర్థమై, తెలుగు భాషలో పరిణతి సాధించి, తెలుగు మాష్టారిని కావాలని ఒక కోరిక కలిగింది. అప్పుడప్పుడు కళాశాలలో పాడుతుండడం వల్ల గురువులు, తోటివాళ్ళు బాగా పాడతావని ప్రోత్సహించారు. 1968 లో బి.ఏ లో వారణాసి వెంకటేశ్వర్లు గారు మాకు తెలుగు గురువు. ఆ కాలేజీలో ఆయనతో పాటు మదనపల్లి సత్యనారాయణ గారు, జొన్నభట్ల వీరభద్రయ్య గారు భాషలో నిష్ణాతులు. వారణాసి వెంకటేశ్వర్లు గారు నాకోసం ఒక నాటకం రాసారు. శివాజీ పాత్రకు సరిగ్గా నేను సరిపోతానని శివాజీ వేషం వేయించారు. అది మొదలు 1968, 69, 70 మూడేళ్లు నేను కాలేజీలో బెస్ట్ యాక్టర్ ని. అదృష్టవశాత్తు నాలో ఘంటసాల గారి గాత్రధర్మం ఉండడం వల్ల చిన్నప్పటినుండే స్కూల్లో ‘అహో ఆంధ్ర భోజ’, ‘నీల గగన ఘన శ్యామ’, ‘మోహనరూప గోపాలా’ లాంటి పాటలను అప్రయత్నంగానే అందరూ మెచ్చుకునేలా పాడేవాడిని. అయితే కొరిటాల వెంకట కోదండ రామారావు గారు నేను బాగా పాడుతుండడం చూసి ఒక సాంఘిక నాటకంలో సందర్భాన్ని సృష్టించి ‘వీరాభిమన్యు’ సినిమాలో కృష్ణుడిని బెదిరిస్తూ ” బానిసలంచు పాండవుల ప్రాణముతో విడ సంతసింపక ఔరా ! నను భాగమిమ్మనెదరా, బెదిరింతురా ఏయ్…” (పాడుతూ ) పౌరాణిక రంగస్థల అరంగేట్రానికి ఇది నాంది. దీని తర్వాత పద్య పరంపర మొదలైంది.
4. ఆకాశవాణిలో ఉద్యోగం ఎలా సంపాదించగలిగారు?
జ: నేను నరసరావుపేటలో డిగ్రీ మూడేళ్లు పూర్తి చేసుకొని హైదరాబాద్ కు వచ్చాను. ఇక్కడ ఎమ్. ఏ. నిజాం కళాశాలలో చేరాను. ఎన్. వి. రాజగోపాల్ అని ప్రిన్సిపాల్. కోవూరు గోపాల కృష్ణగారు, కులశేఖరరావు గారు, జి. వి. సుబ్రహ్మణ్యంగారు, రవ్వా శ్రీహరి గారు, తంగిరాల నారాయణ శర్మగారు, అమరేశ్వరం రాజేందర్ గారు.. ఇలాంటి హేమాహేమీలు అందరూ ఉండేవారు. అది సాయంకాలం కాలేజీ కాబట్టి డ్రామాలు వేయడానికి కుదిరేది కాదు. నా డ్రామాల తృప్తిని ‘AIR’ లో తీర్చుకున్నాను. రేడియోలో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని కోరికగా ఉండేది. దానికి కావాల్సిన ఎన్నో సర్టిఫికెట్లు నా దగ్గర ఉన్నాయి. ఉత్తమ గాయకుడు, ఉత్తమ నటుడు, తెలుగు ఎమ్.ఏ, వ్యాఖ్యాత ఇవన్నీ ఉన్నాయి. “సిఫార్సు లేనిదే స్మశానమందు దొరకదు రవంత చోటు”, “పేరుకు ప్రజలదె రాజ్యం, పెత్తందార్లదే భోజ్యం” (ఆరుద్ర ) అప్పటికీ, ఇప్పటికీ ఎలాంటి మార్పులు లేవు.
రేడియోలో అడిషన్స్ కి వెళ్ళాను. పెద్ద అద్దం, దానికో కర్టెన్ కడతారు. నేను అప్లికేషనులో పౌరాణికంలో ప్రవేశం ఉందని రాశాను. ముందు ఒక డైలాగ్ చెప్పి, పౌరాణికంలో ఒక డైలాగ్ చెప్పి, పద్యం గానీ, పాట గానీ పాడమన్నారు. మూడవది రేడియోలో బాగా ప్రయత్నం చేశానన్నావు కదా! వార్తలు ఎలా చదవాలో చెప్పుమన్నారు.
రెండు రౌండ్లు అయ్యాక “బానిసలంచు…..” అనే పద్యం పాడటం మొదలుపెట్టాను. వెంటనే కర్టెన్ తొలగించి ‘వీడెవడు’ అన్న కుతూహలంతో నా వైపు చూశారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగదని నా అభిప్రాయం. ఎంతో గర్వకారణంగా అనిపించింది. తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఎంతగానో ప్రశంసించారు. అలా రేడియోలో స్థానం సంపాదించాను.
5. రేడియో ఆర్టిస్టుగా మీ సహ ఆర్టిస్టులు, వారితో మీ అనుభవాలను చెప్పండి.
జ : నేను శారదా శ్రీనివాసన్, మద్దూరు విజయలక్ష్మి, మల్లాది విజయలక్ష్మి , మీరా కుమారి మొదలైన ‘ఎ’ గ్రేడ్ ఆర్టిస్టులందరితో నాటకాల్లో వేశాను. సంగీత రూపకాలన్నింటికీ నన్ను పిలిచేవారు. గాయకుడు చిత్తరంజన్ గారు కూడా నామీద ఎంతో అభిమానం చూపించేవారు. రెండు, మూడేళ్లు కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. పాలగుమ్మి విశ్వనాథం గారు, కొండా బలరామశర్మ గారు ( పుట్టు గుడ్డి అతను )..ఇలాంటి గొప్ప ఆర్టిస్టులుండేవారు. రేడియోలో వచ్చే కార్మికుల కార్యక్రమం నిర్వహించే ఆర్టిస్టులు ఏకాంబరం ( వట్టెం సత్యనారాయణ ), చిన్నక్క ( రతన్ ప్రసాద్ )లకు నేనంటే ఎంతో అభిమానం. ఒక్కొక్కప్పుడు వాళ్ళ రికార్డింగులు కూడా పక్కన బెట్టి మా రికార్డింగు వినడానికి వచ్చేవారు. నన్ను ఒక గాయకునిగా, పద్య నటునిగా, ఇండివిజువాలిటీ ఉన్న వ్యక్తిగా ఆకాశవాణి నిలబెట్టింది. హైద్రాబాద్ ఆకాశవాణి ద్వారానే లోకానికి నేను పరిచయమయ్యాను. ఇప్పటికీ కూడా యామినీ పూర్ణ తిలక, బద్దెన సేనాని, వెంకటేశ్వర మాహాత్మ్యం, నరకాసురవధ నాటకాలు రేడియోలో వస్తుంటాయి.
6. రంగస్థలంపై మీ నాటకాలకు లభించిన ప్రోత్సాహం గురించి ఏవైనా రెండు విషయాలు చెప్పండి.
జ: 1980 లో నాకు పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాతే రంగస్థలం వైపు ఎక్కువ దృష్టి పెట్టాను. ‘యోగివేమన’ నాటకం మార్నింగ్ షో జరిగింది. జె.ఎస్.ఎన్. శాస్త్రి గారని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ లో పనిచేసేవారు. ఆ నాటకంలో ఆయన వేమన. నేను అభిరాముడు. బ్రహ్మాండంగా నాటకం సాగింది. నేను గ్రీన్ రూమ్ లోకి వచ్చి మేకప్ తీసేసుకుంటుండగా వేలూరి సహజానందగారు వచ్చి ఆలింగనం చేసుకొని రేడియోలో ఎంత గొప్పగా పాడావో, స్టేజీ మీద అంతకన్నా గొప్పగా పాడావు నాయనా అని అన్నారు. అది ఎప్పటికీ మర్చిపోలేను. ఇన్స్పెక్టర్ జనరల్, కీర్తిశేషులు, భజంత్రీలు, మనస్తత్వాలు ఇలా ఎన్నో నాటకాల్లో నటించాను. భమిడిపాటి రాధాకృష్ణ, ఆరుద్ర, కొరపాటి గంగాధరరావు మొదలైన వాళ్ళు రాసిన నాటకాల్లో వేసేవాడిని. హైదరాబాద్ లో నాటకాల్లో నన్ను బాగా ప్రోత్సహించిన వ్యక్తి ఎర్రమనేని చంద్రమౌళి గారు. నాకు గురువు ఆయన. ఇక ఆకాశవాణిలో పనిచేసే మద్దూరు విజయలక్ష్మి, ఆమె భర్త సోమేశ్వరరావు గారు ఫోటోగ్రాఫర్. వాళ్ళు ఖైరతాబాద్ లో ఉండేవాళ్ళు. వాళ్లకు నేనంటే చాలా ఇష్టం. నేను పిల్లవాడినని, చక్కగా ఉంటానని, అవకాశం వస్తే స్టేజీమీదికి ఎక్కించాలని బాగా ప్రోత్సహించేవాళ్ళు. అయ్యదేవర పురుషోత్తమ రావు స్థాపించిన సి.ఎస్.ఆర్.కళామందిర్ అని ఉండేది. దాంట్లో పురుషోత్తమరావు కృష్ణుడి పాత్ర వేసి, అర్జునునిగా నాతో వేయించాడు. అది బాగా రక్తి కట్టింది. కొన్ని వందలసార్లు అర్జునుని పాత్ర వేశాను. అర్జునుడంటే అక్కిరాజు, అక్కిరాజు అంటే అర్జునుడు అనే పేరు తెచ్చుకున్నాను.
7. అటు ఆకాశవాణిలోను, ఇటు నాటకరంగంలోను పూర్తిగా నిమగ్నమైన మీకు వేంకటపార్వతీశ కవుల పైన పిహెచ్ డి చేయడానికి ప్రోత్సహించిందెవరు?
జ: మంచిప్రశ్న. 1985 – 86 కాలంలో ఉధృతంగా నాటకాలు వేస్తున్నాను. ఇరివెంటి కృష్ణమూర్తి గారు విద్యానగర్ లో ఉండేవారు. ఆయన, నేను ఆటోలో వస్తున్నాం. అప్పుడాయన “అరేయ్! ఈ నాటకాలు ఇవన్నీ ఎప్పుడూ ఉండేవి. ఇవి నీకు భగవంతుడు ఇచ్చిన వరం. పి హెచ్ డి చెయ్యరా తొందరగా” అన్నాడు మహానుభావుడు. నేను పట్టించుకొనలేదు. అప్పటికే కాలేజీలో 150 రూపాయలకు ఉద్యోగంలో చేరి కష్టపడుతూ ఉన్నాను. పరాయతనం కృష్ణమూర్తి గారని ఓరియెంటల్ కాలేజీలో చేస్తున్నారు. ఆయన తిలక్ రోడ్ లో ఉండేవారు. “అబ్బాయ్! నీవు అటూ ఇటూ పిల్లిలాగా తిరగకు. అదే కాలేజీలో ఉండు” అన్నారు. జలగం వెంగళరావు గారి పుణ్యమా అని ఎయిడెడ్ కాలేజీలో వచ్చింది. ప్రభుత్వ కాలేజీలతో సమానంగా జీతం ఉండేది. ముందు ఎంఫిల్ చేశాను. నందిని సిధారెడ్డి, అనంతలక్ష్మి, పరిమళ, మృణాళిని వీళ్లంతా నా క్లాస్ మేట్స్. “వేంకటపార్వతీశ కవుల ఏకాంతసేవ” నా ఎంఫిల్ టాపిక్. అది మధురభక్తికి సంబంధించినది. దాన్ని రామరాజుగారు సూచించారు. ఇక్కడ ఒక గమ్మత్తు అయిన విషయం చెప్పాలి. నేను పరీక్ష రాస్తుండగా రవ్వా శ్రీహరిగారు వచ్చి పేపర్లు తీసుకొని పట్టుకొని ఊపారు కాపీ కొడుతున్నానేమోనని. కొంతమంది ముఖాలను చూస్తే అలా అనిపిస్తుందేమో ( పగలబడి నవ్వుతూ ). మొత్తానికి ఎంఫిల్ అయిపోయింది. పి హెచ్ డి కి అప్లికేషను పెట్టుకున్నాను. అప్పుడు బిరుదురాజు రామరాజుగారు
“వేంకటపార్వతీశం కవుల ఏకాంతసేవ” గురించి చేశావు కదా! వారి పద్య రామాయణం, ఇతర కావ్యాల మీద పిహెచ్ డి చేయి” అన్నారు. పక్కనే ఉన్న నారాయణరెడ్డి గారు రంగస్థల నటుల్లో ఇంత మంచి స్వరం ఎవరికీ లేదు అన్నారు. వారి నుండి ఆ మెప్పు పొందడం చాలా సంతోషాన్ని కలిగించింది. నారాయణరెడ్డి గారి పలుకుతీరు చాలా గొప్పది. మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఇరివెంటి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో “వేంకట పార్వతీశ కవులు – రామాయణ పద్య కృతులు” అన్న అంశంపై డాక్టరేట్ పొందాను. పరాయతనం కృష్ణమూర్తి చెప్పినట్లు ఠాగూర్ హామ్ కాలేజీ అని నేను చేసిన కాలేజీ 1974 నుండి 2007 వరకు అదే కాలేజీలో ఏకచ్ఛత్రాధిపత్యంగా అక్కడే ఉన్నాను.
8. మీకు నచ్చిన, మీరు బాగా అభిమానించే నటులు ఎవరు?
జ: అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నా అభిమాన నటుడు ఎన్టీరామారావుగారే. ఆయనను బాగా ఇమిటేట్ చేసేవాడిని. ఒకసారి “మామా! కురు సార్వభౌమా! పాండవ దూతనై నీ యొద్దకు” అని మొదలుపెట్టాను. ఆయనకు నామీద కోపం వచ్చింది. పద్యం పాడడం ఘంటసాల వలె. యాక్షన్ ఎన్టీఆర్ లాగా. అయితే ఒక స్థాయిలో ఉన్నవాడు, దేవాలయం కట్టించుకునేంత స్థాయికి ఎదిగినవాడు, గొప్ప నటుడు, కారణజన్ముడు, కలియుగ కృష్ణుడు అని బిరుదు పొందినవాడు బాగా చేస్తున్నావని ప్రోత్సహిస్తే బాగుండేది. కానీ ఆయన సహించకపోవడం బాధ కలిగించింది. ఎవరు నమ్మినా, నమ్మకపోయినా ఇది ఫాక్ట్. అందుకే కవినైనాను. నండూరి రామకృష్ణాచార్యులు “You are more than NT Ramarao” అన్నారు. ఘంటసాల గారు లేకపోతే ఎన్టీరామారావు గారికి గాత్రం లేదు కదా! అది ఉండడం నాకు ప్లస్ పాయింట్. ఇప్పటికీ నేను చెప్పేది ఎన్ టి ఆర్ తో నేను ఎప్పుడూ సమానం కాలేను. ఎందుకంటే నేను గాయకుడిని కావచ్చు, విద్యాధికుడిని కావచ్చు, కానీ ఎన్టీఆర్ పర్సనాలిటీ ఎవరికీ రాదమ్మా!
ఇప్పుడు యాదగిరిగుట్ట స్పెషల్ ఆఫీసరుగా ఉన్న కిషన్ రావు గారికి నేనంటే వల్లమాలిన ప్రేమ. నాతో ఎన్టీరామారావు గారి ముందు కృష్ణుడి వేషం వేయించాలని ఆయన కోరిక. ఢిల్లీలో నాటకం వేస్తున్నాం.
ఎన్ టి ఆర్ గారు “కిషన్ రావు గారూ! ఇటు రండి” అని పిలిచి ఆడనీయకుండా కర్టెన్ వేయించారు. గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయన చేతనే నాకు సన్మానం చేయించారు కిషన్ రావు గారు. ఆ సమయంలో ఆయన నన్ను చూసిన చూపు మరచిపోలేనిది. ఆ వేదికపై పివి నరసింహరావుగారు, కుముద్ బెన్ జోషిగారు కూడా ఉన్నారు. అంటే ఒక మనిషిలో మనకు కనపడని మరొక వ్యక్తి కూడా ఉంటాడన్న మాట. అది మనం గ్రహించాల్సింది. ఇది చెప్పడానికే ఈ విషయం చెప్పాను కానీ ఎవరినీ తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఎన్.టి.ఆర్ లాంటి రూపము, అకుంఠిత దీక్ష, అతడు తినేలాంటి భోజనం, ఇవన్నీ చూస్తే అతని లాంటి వాడు ఎవరూ ఉండరు. అతడొక విచిత్రమైన కారణం జన్ముడమ్మా! నాగేశ్వరరావు గారితో కూడా చేశాను. అతను పెద్దగా చదువుకోకపోయినా విప్రనారాయణ, జయభేరి, కాళిదాసు లాంటి పాత్రలు వేసి మెప్పించాడు. నేను రంగారావు, ముక్కామల, సూర్యకాంతం వంటి వాళ్ళతో తప్ప మిగిలిన వాళ్ళందరితో చేశాను. దాదాపు 25 సంవత్సరాల అనుభవం ఉంది. ఇంత అనుభవంలో నా అభిమాన నటుడు ఎన్టీరామారావు అనే చెప్తాను. అందుకే ఆయన మీద రెండు శతకాలు రాశాను.
9. జమున గారితో ఎన్నో కృష్ణుని పాత్రలు వేశారని విన్నాం. ఆమెతో మీ నాటకరంగ ప్రస్థానం ఎలా మొదలయ్యింది?
జ : జమునగారు ఒకసారి నన్ను త్యాగరాయ గానసభలో నారద పాత్రలో నన్ను చూసి “నువ్వు నారదుడివి కావు. కృష్ణుడి పాత్రలు వేయాలి” అన్నారు. అంతే. అక్కడినుండి ఒక పదేళ్ల పాటు దేశమంతటా ఎన్నో ప్రాంతాలు తిరిగి ప్రదర్శనలిచ్చాం. గేట్ల ముకుందరెడ్డి (ఎమ్మెల్యే ) ఆధ్వర్యంలో పెద్దపల్లిలో పెద్ద సన్మానం జరిగింది. కడప, షోలాపూర్, సింధలూరు, కర్ణాటక, మహారాష్ట్ర …ఇలా అనేక ప్రాంతాల్లో నాటకాలు వేశాము. ఎన్నో ప్రశంసలందుకున్నాము. శ్రీకృష్ణ తులాభారం సినిమాలో జమున గారి పక్కన ఎన్టీఆర్ కృష్ణుడిగా వేస్తే, రంగస్థలంపై ఆమె పక్కన నేను కృష్ణుడిగా వేశాను. అయితే ఎన్టీరామారావు గారు నాతో “టీవీలో నీ తులాభారం చూశాను బ్రదర్” అన్నారు. కానీ ఎట్లున్నది చెప్పలేదు (నవ్వుతూ ).
10. జమున గారితో ఉన్న అభిమానంతోనే ‘జమునా రమణా’ పంచ పద్య శతతి రాశారా?
జ: రకరకాల వ్యక్తులు, రకరకాల శక్తులు, రకరకాల యుక్తులు. జమున గారు గొప్ప నటి. అందులో సందేహం లేదు. సత్యభామ పాత్రకు ఆమెను మించిన వారు లేరు. సత్యభామ అంటే ఆమే అన్నంతగా ఉండేది.
“సత్యాపతి పాత్రకు
సత్యము మన యన్టియారె సరియౌ కాదో?
సత్యగ మాత్రము భళిరా
సత్యము నీ సాటి నీవె జమునా రమణా!”
సినిమా రంగంలో ఉండే కుట్రలు, కుతంత్రాలు, చదువులు, సంధ్యలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు వీటన్నిటిని గురించి ఐదు వందల పద్యాలు రాశాను. సినిమా యాక్టర్ అయిన ప్రదీప్ వాళ్ళ తండ్రి వెంకటేశ్వర్లు గారికి, నాతోపాటు అర్జునుడి పాత్ర వేసే అయ్యదేవర పురుషోత్తమ రావు గార్లకు ఈ పుస్తకం అంకితం ఇచ్చాను. జమున గారికి ఇచ్చి చదవమన్నాను. చదివారా అని పదే పదే అడిగి గుర్తు చేసాను. ఆమె కనీసం పట్టించుకొనలేదు. చివరకు ఏదీ చెప్పకుండానే స్వర్గస్తురాలయింది. అసూయ ద్వేషాలతోనో, కోపంతోనో చెప్పడం లేదు. బాధతో చెప్తున్నా. ఇంతగా ఆమె గురించి రాసిన నేను ఆమె నుండి ఏమీ ఆశించలేదు. కానీ ఆమె కనీసం గుర్తించకపోవడం బాధ కలిగించింది. నాతో పదేళ్లు సత్యభామగా నటించిన వ్యక్తి మా కృష్ణుడు, మా అక్కిరాజు ఇలా నా మీద పద్యాలు రాశాడని చెప్పకపోవడం చాలా బాధాకరం.
11. సాహిత్యరంగంలో మీ మొదటి కావ్యం ‘అమ్మతోడు’ గురించి చెప్పండి.
జ: 2000 సంవత్సరం నుండి నేను రాయడం మొదలుపెట్టాను. మొట్టమొదటి కావ్యం ‘అమ్మతోడు’. దానికి జ్వాలాముఖి మంచి పీఠిక రాశారు. రాళ్లబండి కవితా ప్రసాద్, ఆచార్య తిరుమల నన్ను ఆశీర్వదించారు. అప్పటినుండీ పరంపరగా సంవత్సరానికి రెండు చొప్పున పుస్తకాలు వేస్తున్నాను. ఇందులో భాష సరిగ్గా రాక ఇష్టం వచ్చినట్లు రాసి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడి స్టేజీల మీద గజమాలలు వేసుకునేవారిని ఎండగడుతూ రాశాను. నేనంత సంస్కృత పండితుడిని కాను, తెలుగు భాషా పండితుడినని గర్వంగా చెప్పుకోను. కానీ ఏమీ రాని వారు సత్కారాలు పొందడం చూసి తట్టుకోలేక రాశాను. తీవ్ర సంచలనం రేగింది.
మా ఊళ్ళో భీమలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. స్వామికి ఇరువైపులా వీరభద్రుడు, భద్రకాళి ఉంటారు. ఆ అమ్మవారు అత్యంత సౌందర్యవంతంగా ఉంటుంది. నా 75 ఏళ్ళ వయస్సులో అంత సౌందర్యం ఎక్కడా చూడలేదు నేను. హనుమంతుని గుండెను చీలిస్తే రాముడు కనిపించినట్లు, నా హృదయాన్ని చీలిస్తే ఆ అమ్మవారు ఉంటుంది. ఆమె అంటే అంతటి భక్తి నాకు. ఆమె అనుగ్రహంతోనే నేను ఇవన్నీ రాయగలుగుతున్నాను. ఛందో సంబంధమైన వ్యాకరణాంశాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. ఏదో ప్రయోజనం ఆశించి నేను రాయలేదు. ఒక హృదయావేదన నుండి రాసింది. ఆ పుస్తకాన్ని వట్టికోట ఆళ్వారు స్వామికి, దాశరథికి అంకితమిచ్చాను. ఏ పుస్తకాన్నయినా ఇద్దరికి అంకితం ఇవ్వడం నాకలవాటు. వట్టికోట ఆళ్వారు స్వామి, దాశరథి ప్రజల కోసం ఎన్ని కష్టాలు పడ్డారు? నిజానికి రజాకార్ల కాలంలో చచ్చిపోయేవాళ్ళు. ఉద్యమాల్లో వెలుగులోకి రాకుండా ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా! కానీ తెర మీదకు ఎవరినో తీసుకువస్తారు. ఇదిగో ఇలాంటి అంశాలనే ‘అమ్మతోడు’ లో రాశాను. రాజకీయ నాయకులైతేనేమి? అవకాశ వాదులైతేనేమి? ఇలాంటివారు ప్రతీ రంగంలో ఉంటారు. వాళ్ళను గురించి రాశాను. కవి ఎప్పుడూ అవకాశవాది కారాదనేది నా ఉద్దేశ్యం. అలా సాహిత్యరంగంలో ‘అమ్మతోడు’ తో అడుగుపెట్టాను. ఇప్పటికి 54 పుస్తకాలు రాశాను.
12. ఇంతటి సాహిత్య రచన చేసిన మీరు అభిమానించే కవి ఎవరు?
జ: నా అభిమాన కవి దాశరథి. “తెలగాణ కవుల లోపల తలచగ దాశరథి యొకడె” అన్నాను నేను. “మిగతావాళ్ళు కాదా?” అని ప్రశ్నిస్తారు. కాదనడం లేదు. కానీ వ్యక్తిత్వ పరంగా కాదని నా అభిప్రాయం. దాశరథి తన 18 ఏండ్ల వయస్సులో కొడుతుంటే తప్పించుకుంటూ, పొలాల వెంబడి పరుగులెత్తి, బురద గుంటలో పడి, సిమెంటు కలిపిన అన్నం తిని, నోట్లో మూత్రం పోసినా పోయించుకొని భరించాడు. ఇదంతా ఆయనకు ఏమవసరమమ్మా? జాతికోసం భరించాడు. అందుకే నేను “దాశరథీ సత్కవితాశరథీ” అని ఒక పుస్తకం రాశాను. అందులో జ్వాలాముఖి పీఠిక రాశారు. బిరుదురాజు రామరాజు గారు కూడా “బాబూ! ఎవరూ చేయలేని పని నువ్వు చేశావు” అన్నారు. అంటే నేనేదో మహా పండితుడినని కాదు. “అంత నిష్పక్షపాతంగా, నిర్మొహమాటంగా దాశరథి వ్యక్తిత్వాన్ని కళ్ళముందు దృశ్య సాక్షాత్కారంగా చేసింది నువ్వే”. అని ఉత్తరం రాశారు. ఇప్పటికీ ఆ ఉత్తరం ఉంది నా దగ్గర. నాకు దాశరథి గారితో పరిచయం ఏర్పడ్డ తరువాత ఆయన నన్ను చాలా అభిమానించారు. ‘ఒరే అబ్బాయ్!’ అనేవారు. ఒకసారి బమ్మెరలో కవిసమ్మేళనం జరిగినప్పుడు నన్ను తీసుకొని పోయి పద్యాలు పాడించారు. అప్పుడు నేను వాళ్ళకంటే చాలా చిన్నవాడిని. అదీ హృదయమంటే.
13. ‘అధిక్షేప కవితారత్న’ బిరుదు పొందడానికి మీ రచనల్లోని అంశాలు కారణమా? ఎలా?
జ: నాటక రంగంలో చూస్తే అభినవ కృష్ణుడు, అభినవ ఘంటసాల, నాట్య శ్రీనాథ అన్నారు. కానీ సాహిత్యంలో అధిక్షేపకవి అని పేరు పొందాను. ఇప్పటికాలంలో నా దృష్టిలో సాహిత్యానికి, సమాజానికి ఏ విధమైన పక్షపాతం లేకుండా నిష్పక్షపాత ధోరణిలో సేవ చేస్తున్నవారు కె. వి. రమణాచారి గారు. ఆయన గురించి ‘కెవి రమణా’ అనే మకుటంతో శతకం రాశాను కందపద్యాల్లో. అది కూడా అధిక్షేపమే. మీరంటుండవచ్చు. ఇలా రాసి మీరేం సాధించారని? నాతో ఒకాయన అన్నారు. ” నువ్వు ఇలా రాయకుండా ఉంటే ఎన్నో అవకాశాలు వచ్చేవి. అవన్నీ పోగొట్టుకున్నావు” అని. కోవెల సంపత్కుమారాచార్య గారు నాకు ఒక ఉత్తరం రాశారు. ఇన్ లాండ్ లెటర్ అది. ఇప్పటికీ దాచుకున్నాను. “నాయనా! చిన్నవాడవు. చాలా బాహాటంగా పెద్దలైన వ్యక్తుల్ని నీ ధోరణిలో విమర్శిస్తున్నావు. ఉడుకు రక్తం. అది మంచి పద్ధతి కాదు. పైకి రావాల్సినవాడివి”. ఇట్లు…నీ శ్రేయోభిలాషి, కోవెల సంపత్కుమారాచార్య. అని రాశారు. నేను దాశరథి, అలిశెట్టి లాంటి ఆవేశపరుడిని కాను. ప్రశ్నించే తత్వం నాది. ఊరకే ఉండడం నాకు చేతకాదు.
కొండపల్లి శేషగిరిరావు గారు గొప్ప చిత్రకారులు. ఆ కాలంలోనే వారికి ‘పద్మశ్రీ’ రావాలి. ఆయన నన్ను ఎంతో అభిమానించేవారు. కానీ వచ్చిన వారికే మళ్లీ పురస్కారాలు వస్తున్నాయి. అందుకే నా బాధ. అన్ని పుస్తకాలు అధిక్షేపంగా రాశానని కాదు. కానీ అధిక్షేపం లేకుండా రాయను. కీర్తి కోసం రాయడం లేదు. సమాజంలో నచ్చని అంశాన్ని ప్రశ్నిస్తున్నాను.
14. మీ రచనల్లో అధికశాతం శతకాలై ఉండడానికి కారణం వివరిస్తారా?
జ: మకుటం ఉంటుంది కాబట్టి దాన్ని శతకం అనాలే తప్ప శతక లక్షణం ఒక్కటీ ఉండదు. ఉన్న విషయాన్ని సూటిగా సత్యప్రకటన చేయడం నాకలవాటు. చదివిన వారు వాళ్లను గురించే అనుకుంటే నేనేమీ చేయలేను. “సత్యానికి గెలుపన్నది తథ్యమురా మానవుడా” అన్న దాశరథి చివర్లో ఎన్ని కష్టాలు పడ్డదీ అందరికీ తెలుసు. ఆస్థాన కవి పదవి నుండి పక్కకు రావడానికి ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలుసు. ఇవన్నీ నన్ను బాధిస్తాయి “ఎప్పటి కయ్యెడు ప్రస్తుతమప్పటికా మాటలాడి…..తప్పించుకు తిరుగువాడు ధన్యుడు” అన్న సుమతీ శతకకారుని ఒప్పుకోను నేను. తప్పించుకు తిరిగేవాడు సమాజానికి ఎలాంటి మేలు చేస్తాడు? ఇలాంటి గమ్మత్తైన విషయాలు తీసుకొని సినిమా యాక్టరును అయి ఉండి కూడా సినిమా రంగం గురించి రాశాను. సినిమా రంగం, సాహిత్య రంగం, ఆకాశవాణి అన్నీ చూశాను. ఎన్నో సమస్యలు ఎదుర్కున్నాను. అయినా తట్టుకొని నిలబడ్డాను. ఆ అనుభవాలను, సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని రాసినవే ఈ శతకాలు. శతకాలే ఎక్కువ రాయడానికి ప్రత్యేక కారణాలేవీ లేవు.
15. మీ ‘రంగ రంగ’ కావ్యం గురించిన విశేషాలు చెప్పండి.
జ : నన్ను హేతువాది అని, నాస్తికుడని అంటారు. కాదు కాదు. నేను మానవతావాదిని. వెంకటేశ్వర స్వామిని గురించి ‘రంగ రంగ!’ అనే మకుటంతో రెండు వందల సీస పద్యాలు రాశాను. నాలాగా ఎవడూ రాయడేమో! ( నవ్వుతూ ) “నీతో ఎవడైనా పెట్టుకుంటే హెలికాఫ్టర్ ఎక్కిస్తావు” అన్నాను. ఇంతింత ఆదాయం వస్తుంటే ఏం చేస్తున్నావని, తిరుమలలో జరుగుతున్న అన్యాయాలు, వాటన్నిటినీ ఎందుకు పట్టించుకోవని నిలదీసినట్టు రాశాను. కలియుగ దైవమంటారు. మరి నిన్ను చూసీ చూడగానే తోసేస్తారు. ఇదంతా ఏమిటని అడుగుతూ నువ్వొచ్చి ఒక్కసారి క్యూలో నిలబడితే నీకు మా బాధ అర్థమవుతుంది అన్నాను. చమత్కారం జోడించి వ్యంగ్యంగా రాసిన పద్యాలివి. ఇందులో సరళ గ్రాంథికం, వ్యావహారికం, తెలంగాణ మాండలికం కూడా కలిసి ఉంటాయి. హాస్యం, వ్యంగ్యం, చమత్కారం, అధిక్షేపం అన్నీ కలబోసి ఉంటాయి. దీన్ని ‘బాపు-రమణ,’ లకు, వాళ్ళను అత్యధికంగా అభిమానించే డా. సముద్రాల బాబూరావు, డా. టి.ఎన్. చౌదరి, డా. ప్రసాద్ దుగ్గిరాలకు అంకితం ఇచ్చాను.
16. ‘శంకర నారాయణ శతకం’ దేనిని గురించి తెలుపుతుంది?
జ : ‘శంకర నారాయణీయం’ రాశానని తెలిసి హాస్యబ్రహ్మ తురుమెళ్ళ శంకర నారాయణ “అన్నయ్యా నా మీద ఏమైనా రాశావా” అన్నాడు. కాదురా! శంకరుని గురించి వంద పద్యాలు, నారాయణుని గురించి వంద పద్యాలు రాశాను అన్నాను. “హమ్మయ్య హార్ట్ అటాక్ వచ్చినంత పని చేసినావు” అన్నాడు. దాంట్లో కూడా చిత్ర విచిత్రంగా ఉంటుంది. వేదాంతం, సామాజిక స్పృహ, నీతి, ధర్మం అన్నీ ఉంటాయి. నిజానికి సమాజం మంచిగా ఉంటే ధూర్జటి, శేషప్ప లాంటి కవులు ఎందుకు అంతగా మొత్తుకున్నారమ్మా! “అధిక విద్యావంతులు అప్రయోజకులై, పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి” అని శేషప్ప అన్నాడు కదా! ఇప్పుడంతటా అదే కదమ్మా జరుగుతున్నది. ఒకడికి పదవి ఉంటే చుట్టూ తనవాళ్లే ఉంటారు. ఎన్నో చిత్ర విచిత్రమైన భావనలు, గమ్మత్తు అయిన శైలి ఇందులో ఉంటుంది. ‘శంకర నారాయణా!’ అనేది మకుటం కూడా కాదు.
“పళ్ళ బిగింపు పోయి పలు బాధలు నోటికి రాకముందె అల్లుళ్లు, పుత్రికా మణుల రూల్సుకు బానిస కాకముందె మోకాళ్లకు నీరు చేరి నరకమ్మును జూపక ముందె కిడ్నిలో రాళ్ళవి రాకముందె గిరిరాజ సుతాధవ నన్ను బ్రోవరా!” ఇలా ఉంటాయి అందులో పద్యాలు.
17. ఎవరూ దృష్టి కూడా సారించని శనీశ్వరునిపై శతకం రాయాలని ఎందుకనిపించింది?
జ: అమ్మా! నాకిప్పుడు 75 ఏళ్ళ వయస్సు. నేనేదో బ్రహ్మాండమైన సుఖజీవిని కాదు. చాలా చికాకులు ఎదుర్కున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఇంత శని నాకెందుకు పట్టింది? అనిపించింది. వరుసగా అనేక ఇబ్బందులు క్రమంగా పెరగడం మొదలైంది. దీనితో ‘శనీశ్వర శతకం’ రాస్తే పీడా విరగడయి పోతుందనుకున్నాను ( గట్టిగా నవ్వుతూ ). ‘శ్రీ శనీశ్వరా!’ అని మకుటం పెట్టాను. ‘శనైశ్చరా’ అనాలి అన్నారు. నేనలాగే అంటాను అన్నాను. అందుకే నీకు శని పట్టిందన్నారు. అయినా పరవాలేదని మార్చలేదు. దాంట్లో కూడా సమాజం, కుటుంబ వ్యవస్థ, రాజకీయం, సినిమాలు, తాగుడు వీటన్నిటి గురించి 127 పద్యాలు రాశాను. నిజానికి శని దేవుని పైన పది, పదిహేను పద్యాలు తప్ప అంతకుమించి రాసినవాళ్ళు లేరు. తిరుపతి వేంకటకవుల యొక్క వేంకట శాస్త్రి గారి కుమారుడు రోగ గ్రస్తుడై మంచం పట్టినప్పుడు ఆయన ‘శనిగ్రహమా!’ అనే పేరుతో నా కొడుకును ఇట్లా ఎందుకు చేశావని ఓ పదిహేను పద్యాలు రాశాడట.
ఇందులో నేను ధూర్జటిని అనుసరించి,
“దంతములూడి సాంతమవి దౌడలు చిత్ర విచిత్రరీతి,బల్
వింతగ గాకముందె, తన పిల్లలె మాసము కొక్కయింటిలో
వంతుల వారి చూచుకొను భాగ్యము గల్గక ముందె దేవ; నా
తంతు ముగింప వేడెదను; తప్పును బట్టకు శ్రీ శనీశ్వరా!
అంటూ రాశాను. ఈ రోజుల్లో వంతులు వేసుకొని తల్లిదండ్రులను చూసే పిల్లలు మనకు అంతటా కనబడుతున్నారు. ఇలాగే సమాజంలో ఉన్న ఎన్నింటినో సహించక రాస్తూ పోయాను.
18. మీ రచనల్లో మణి ప్రవాళ శైలి ఉండడానికి కారణం ఏమైనా ఉందా?
జ: కారణమంటూ ప్రత్యేకంగా లేదు. నేను 55 ఏళ్లుగా హైదరాబాదులో ఉన్నాను. వరంగల్లు అమ్మాయితో నా వివాహం జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉండడం మూలంగా ప్రజలు మాట్లాడే భాష పట్ల అవగాహన ఉంది. నా రచనలు ఏ పండితులనో ఉద్దేశించి రాసినవి కావు. సమాజంలో జరుగుతున్న విషయాలను నిక్కచ్చిగా తెలపడమే నా ఉద్దేశ్యం. అందుకే అందరికీ అవగాహన కోసం తెలుగు, సంస్కృతం, ఆంగ్లం కలిపి కొత్తగా రాయడం మొదలుపెట్టాను. తెలంగాణ అల్లుడిని కూడా కావడం వల్ల మూడు భాషలు కలిపి రాస్తుంటాను. మధ్య మధ్య ఉర్దూ పదాలు కూడా వాడుతూ ఉండడం అలవాటయింది.
19. ఇప్పటికీ నటిస్తున్నారా? మీకింకా చేయాలని మిగిలిన కోరిక ఏదైనా ఉందా?
జ: నాటకరంగంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు, బిల్వమంగళుడు, భరతుడు ఇలాంటి ఎన్నో పాత్రలు వేశాను. కానీ బిల్వమంగళుని పాత్ర మీద అభిమానం ఎక్కువ. ఇప్పటికే 50 పర్యాయాలు ఆ పాత్ర వేశాను. వంద పర్యాయాలు వేయాలని సంకల్పం. వేస్తాను కూడా. ‘చింతామణి’ అనగానే ఒక వేశ్య పాత్ర అందరి దృష్టిలో మెదులుతుంది. ఒక ఉన్నతకుటుంబంలో జన్మించినవాడు పక్కదారి తొక్కి, ఆచార భ్రష్టుడై సర్వ రంగాలలో అందరిచేత హీనుడు, పనికిరానివాడు అనిపించుకున్నవాడు ఈ ఇద్దరినీ కృష్ణతత్వాన్ని ప్రపంచానికి తెలియచెప్పడానికి ఆ శ్రీకృష్ణపరమాత్మ నియోగించుకోవడం ఎంతటి మహద్భాగ్యం? అదే లీలాశుకుడు రాసిన ‘కృష్ణ కర్ణామృతం’. కాలమహిమ ఎంతటి వారినైనా ఏ స్థాయికైనా దిగజారుస్తుంది. అనే విషయంతో పాటు ఎటువంటివారైనా భగవంతుని కృపకు పాత్రులే అన్న విషయం ఇందులో నిరూపించబడింది.
20. ప్రస్తుత నటనా రంగం గురించి మీ అభిప్రాయం ఏమిటి?
జ: నటన అనేది ఒక కళ అనేది అందరికీ తెలిసిందే. మనం ఒక పాత్రను ధరించినప్పుడు ఆ పాత్రలో పరకాయప్రవేశం చేయాల్సి ఉంటుంది. అక్కడ నటుడు కనిపించకూడదు. కేవలం పాత్ర మాత్రమే కనిపించాలి. ఆ పాత్ర లక్షణాలు మొత్తం నటునిలో ఇమిడిపోవాలి. అందుకే ఆ కాలం వాళ్ళను ఇప్పటికీ గుర్తుకు తెచ్చుకుంటున్నాం. రోజుకొకరు పుట్టుకొచ్చే ఈ రోజుల్లో డబ్బు సంపాదించే వ్యామోహం తప్ప, ఒక నిబద్ధత కనిపించదు. నాలుగు రోజులకే ఆ నటుడిని మర్చిపోతున్నాం అంటే ఎటువంటి నటులున్నారో చెప్పనవసరం లేదు. కొంతమంది మాత్రమే దానిని సాధ్యం చేసుకుంటున్నారు. ఏ రంగంలోనైనా సమాజహితవు కోరిక ఉంటేనే సత్ఫలితాలు పొందగలుగుతాం. దేనికైనా అంకితభావం ముఖ్యం. ఈ రోజుల్లో కావలసిన సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి. ఏవీ లేని రోజుల్లోనే తెలుగు సినిమా రంగం ప్రపంచానికి తన ఉనికిని చాటింది. కాబట్టి తీసేవాళ్ళు, వేసేవాళ్ళు అందరూ మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను పాటించే విధంగా నడచుకున్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది. కనబడుతున్నది అభివృద్ధి అని మురిసిపోవడం కాదు. ఎంత ప్రయోజనం చేకూరిందన్నదే ముఖ్యం.
21. కవిగా,రచయితగా నేటి సమాజానికి మీరిచ్చే సందేశం ఏది?
జ: అమ్మా! నాకస్సలు నచ్చని విషయం సముఖంలో పొగడ్త, వెనుకకు వెళ్లి తిట్టడం. నేను ఏదైనా ముఖం ముందే చెప్పేస్తాను. నేనేదో కావాలని, ఎవరినో ఏదో అనాలని చెప్పడం లేదు. సమాజంలో ఉన్న వ్యవస్థనంతా ఒకేసారి మార్చాలని కంకణం కట్టుకోలేదు. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే ధోరణిలో నేను రాశాను. నేను రాసిన కొన్ని శతకాలలో భక్తి కనిపించే మకుటం ఉంటుంది. కానీ సమాజ వ్యవస్థ నా కవితావస్తువు. నాలో బాధ కాస్త కవిత్వంగా మారి కలం నుండి వెలువడింది. కవులు, రచయితలు సమాజాన్ని మార్చగలరు. ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించగలరు అని చరిత్ర చెబుతున్నది. ఆ శక్తి ఆ కలానికి ఉన్నప్పుడు సమాజంలో జరిగే అన్యాయాలను ఎదుర్కొనే రచనలు వస్తే బాగుంటుంది. నేనేదో నా మటుకు నేను రాస్తూ పోతాను అనుకోవడం సరి కాదు. నా రచన ఒక మనసునైనా కదిలిస్తే చాలు అనుకొని రాస్తే పరిణామం వేరుగా ఉంటుంది. కలం, గళం రెండూ నేటి వ్యవస్థకు అవసరం.
ధన్యవాదాలు సార్🙏 అడిగిన వెంటనే ప్రతిస్పందించి, మీ జీవిత విశేషాలను తెలిపినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున కృతజ్ఞతలు. నమస్కారాలు. బిల్వమంగళ పాత్రను వంద పర్యాయాలు ప్రదర్శించాలనుకున్న మీ సంకల్పం తప్పక నెరవేరాలని, దానికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు సదా మిమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటూ సెలవు.