Home వ్యాసాలు అలుపెరుగని జీవనం

అలుపెరుగని జీవనం

by Kondapally Neeharini

ఆనాటి సామాజిక వ్యవస్థలోని కుళ్ళు వ్యవస్థ అయిన అంటరానితనాన్ని ఎండగడ్తూ హరిజనులను ఇంట్లోకి తీసుకురావడం వారితో సహపంక్తి భోజనాలు చేయడం, దేవాలయ ప్రవేశంచేయడం, హరిజన స్త్రీలతో బతుకమ్మ ఆడించడం వంటివన్నీ రాఘవరావు ఎంతో దృఢ నిశ్చయంతో చేశారు. జాతీయోద్యమాలను అనుసరిస్తూ అత్యంత ప్రభావం చూపిన ఆర్య సమాజంలో, చేరడం సత్యాగ్రహోద్యమం, గ్రంథాలయోద్యమం, రైతు కూలీ పక్షాన నిలబడడం ఈ పోరాటాలలో అతని ప్రాణాలు తీయాలన్న ప్రయత్నాల నెదుర్కోవడం అన్నీ రాఘవరావు జీవితంలో ప్రముఖ ఘట్టాలే!కాంగ్రెస్‌ సత్యాగ్రాహిగా ఉండి జైలు జీవితాన్ని అనుభవించడం రాఘవరావులో అణగారి ఉన్న విప్లవవాదికి కొత్త భావాలు తోడైనవి. కమ్యూనిస్టు కార్యకర్తగా కాలక్రమంగా నాయకునిగా ఎదిగి ప్రజారాజ్యాన్ని చూడాలని సాయుధ వీరుడయ్యాడు.అజ్ఞాత జీవితంలో అనేక సంఘటనలు చవి చూశాడు. రజాకార్ల నెదుర్కొంటూ పోలీస్‌ ఆక్షన్‌ సమయంలో వీరోచిత పోరాటం చేశాడు. జాతీయ రాజకీయాలకు తోడు నిజాం గద్దె దిగడం, ఎన్నికలు రావడం, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాసేవ చేయాలనుకోవడం అన్ని పరిస్థితులననుసరించే జరిగినవి. పి.డి.ఎఫ్‌ ద్వారా ఎన్నికల్లో పాల్గొన్న విషయాలు ప్రజలు ఎంతో ఉత్సాహంగా చెప్పిన విషయాలెన్నో! ఆయన ఉపన్యాస ధోరణిని, వాక్కుపటిమనీ, కథలు కథలుగా చెప్పుకునేవారు ప్రజలు. ప్రత్యక్షంగా ఎన్నో తడవలు విన్న అనుభవాలు ఆ రోజుల్లో రికార్డు చేసుకోలేని పరిస్థితి. కాలం వేగంగా పరుగిస్తూ ఎన్నో సత్యాలను తనతో తీసుకెళ్ళింది.”అవి ఎమర్జన్సీ చీకటి రోజులు, రాజ్యమేలుతున్న కాలం. మహాసభానంతరం జనగామ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో రావి నారాయణ రెడ్డి గారి ప్రసంగం తరువాత రాఘవరావుగారి ఉపన్యాసం వింటూ కాళోజీ ఏడుస్తూ చెట్టు క్రింద రాయిపై కూర్చున్నాడు. తర్వాత కాళోజీని ప్రసంగించమంటే ”రాఘవరావు ప్రసంగం తర్వాత నేను ఉపన్యసించడం అనవసరమని” కన్నీటితో జవాబు చెప్పి, వేదికపైకి రానే లేదు. స్వాతంత్రోద్యమ ఘట్టాలను ఆనాటి ప్రజల కడగండ్లను చెప్పుతుంటే సభికులు అచ్చెరువొందారు. రాఘవరావు గారి ప్రసంగం ఆ స్థాయిలో ఉండేదని చెప్పడానికే ఇది రాశాను. ఆ ఉపన్యాసం కొన్ని పత్రికలలో ప్రముఖంగానే వచ్చింది చాలా వాటితో పాటు అదికూడా మీకు లభ్యం కాలేదు.” అంటూ జనగామ నుండి కె. మాధవ రెడ్డిగారు వ్రాసిన ఉత్తరంలో ఉంది. 2007లో రాఘవరావుగారి 20వ వర్ధంతి సందర్భంగా ‘నా ప్రజాజీవితం’ పుస్తకావిష్కరణ చేసిన తర్వాత అందిన ఉత్తరం. రాఘవరావుగారు వ్రాసుకున్న అనుభవాలు కొన్ని, పెద్దల అభిప్రాయాలు కొన్ని ఉన్న ఆ పుస్తకాన్ని చదివి, ఆ పుస్తకం అసమగ్రంగా వుంది అంటూ ఎన్నో విషయాలను ఉటంకిస్తూ 18 పేజీల ఉత్తరం ఒకటి, 9 పేజీల ఉత్తరం మరొకటి వ్రాశారు. మాదవరెడ్డిగారు కొంతకాలం జిల్లా పార్టీ కమిటీ కార్యాలయ కార్యదర్శిగా పనిచేసి, రాఘవరావుగారిని దగ్గరినుండి చూసిన, పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న అనుభవాలు ఆ ఉత్తరాలలో ప్రతి అక్షరంలోనూ కనిపిస్తున్నవి.ఎంతో శ్రమకోర్చి పుస్తకాన్ని అచ్చువేయిస్తే, తర్వాత చాలా విషయాలు తెలిశాయి. అది సమగ్రమైందికాదని తెలిసీ, అసలు విషయాలెన్నో వెలుగులోకి రాలేదనీ ఇంకా ఏదైనా చేయాలనీ సంకల్పం ధృవపడింది. వీలున్నపడల్లా రాఘవరావుగారి గురించి సమాచారం సేకరించి సిద్ధం చేసుకున్న విషయలనూ, రాఘవరావుగారి మేనకోడలు దయామతిగారు చెప్పిన విషయాలనూ ఆధారం చేసుకొని కొంత వ్రాసి పెట్టుకోవడం జరిగింది. వీరిది రాయపర్తిగ్రామం, ఈమె పరమ పండితోత్తమురాలు. రామాయణ భారత, భాగవతాలను కక్షుణ్ణంగా చదివి, పద్యాలనూ, శ్లోకాలనూ అనర్గళంగా చవగలుగోవారిమె. ఇప్పటికీ చదువుతున్నారామె. 2007లోనే ఆమె దగ్గరికి వెళ్ళి ఇంటర్వూ తీసుకున్నాను. చిన్నపెండ్యాల ఊళ్ళన్నీ చుట్టు ప్రక్కల తిరిగి సమాచారం సేకరించి ‘నా ప్రజా జీవితం’ ప్రచురించినప్పుడు దయామతిగారి దగ్గర సేకరించలేదు. ఆ పుస్తకం చదవగానే ఆమె నన్ను దగ్గరకు పిలిపించుకుని ఎన్నో విషయాలు చెప్పారు. తర్వాత కొత్తపల్లి భగవానుగారు 30 పేజీల పోరాటాల చరిత్రను వ్రాసి పంపారు. అందులో ప్రతి, సాయుధ పోరాటంలోనూ రాఘవరావే వున్నాడు. ఆ ఉదంతాలన్నీ ఈ రచనకు ప్రేరణ.’వీర తెలంగాణా సాయుధ సమరం’ కందిమళ్ళ ప్రతారెడ్డిగారి పుస్తకం, వాసిరెడ్డి నవీన్‌ గారి ‘తెలంగాణ విముక్తి పోరాట కథలు’ పుస్తకం, తెలంగాణా విమోచనోద్యమం-తెలుగు నవల’ వరవరరావు గారి పుస్తకం, పోరాటాల బాటలో అనుభవాలు జ్ఞాపకాలు’ యస్‌.వి.కె.ప్రసాద్‌ గారి పుస్తకము, సంగ్రహాంధ్ర విజ్ఞానకోశము, విజ్ఞాన సర్వస్వం వంటి ఎన్నో పుస్తకాలు చదివి ఒక ప్రణాళికను ఏర్పరచుకున్నాను. 2008లో అఫ్జల్‌ గంజ్‌ లో వున్న లైబ్రరీకి చాలారోజులు పోయిసేకరించిన పాత పత్రికలూ నాకు రచనలకు తోడ్పడ్డవే. రాఘవరావు వ్రాసిన ”నా ప్రజాజీవితం” ఆధారంగా పై పుస్తకాల నుండి సేకరించిన సమాచారంతోనూ, మా జ్ఞాపకాల ఆధారంగాను ఈ పుస్తకాన్ని వ్రాశాను.”స్వాతంత్య్ర పోరాటంలో వరంగల్‌ తాలూకా’ అనే వ్యాసం కొయ్యడ రాజయ్య, పెండ్యాల రాఘవరావుగార్లు వరంగల్‌ జిల్లా స్వాతంత్య్ర యోధుల ద్వితీయ మహాసభ సందర్భంలో, సావనీర్‌ వెలువరించిన సందర్భంలో వచ్చిందై వుంటుంది. ఆ వ్యాసం చదివితే చాలు రాఘవరావుగారి వ్యక్తిత్వం అర్థమౌతుంది. అంత పెద్ద వ్యాసంలో తన విషయానికి ఏమాత్రం ప్రాధాన్యమివ్వలేదు. వరంగల్‌ జిల్లా అంతా, ఊళ్ళన్నీ తిరిగిన వీరు ఏ ఒక్క పంక్తిలోనూ ఈ వ్యాసంలో కనిపించరు. అదీ! అదివారి నిస్వార్థసేవాభావం, ప్రతిఫలం ఆశించని మనస్తత్వం.ఈ పుస్తక రచనకు పూనుకొన్నప్పుడు యస్‌.వి.కె. ప్రసాద్‌ గారి పుస్తకాన్ని చదివి, రాఘవరావు గారి సందర్భం వచ్చినప్పుడు వీరు వ్రాసిన విషయాల్ని చదివి నేను దిగ్భ్రాంతికి గురయ్యాను.” ‘పెండ్యాల రాఘవరావు, చింతల రామకృష్ణారెడ్డిగారలకు అప్పగించిన వరంగల్లు పడమటి ప్రాంతములో భూపంపక కార్యక్రమం కొంతవరకైనా అమలు జరుగలేదు. తూర్పు వరంగల్లు ప్రాంతంలో పెద్ద భూస్వాముల వద్దగల భూమి కూడా సకాలంలో పంచబడనందున, రాష్ట్ర కమిటీ నుండి తీవ్రమైన విమర్శలు వచ్చాయి.” అని వారి పుస్తకంలో పేజీ 53లో ఎస్‌.వి.కె గారు వ్రాశారు. 1948 రోజుల్లో జరిగినట్టు వ్రాశారు. అదే పుస్తకంలో 49వ పేజీలో ”గ్రామ రక్షణ దళాలతోపాటు, చైత్రయాత్రా దళాలు వెలిశాయి. ఇచ్చట వాలంటీర్లు చేతులు చాచి కొట్టడానికి అనువుగా తయారుచేసుకున్న పొడవాటి లావు కర్రలను ‘గుత్పలు’ అనేవారు. దీనివల్ల దీనికి ‘గుత్పల సంఘం’ గా పేరొచ్చింది”. అని వ్రాసుకున్నారు వారి పుస్తకంలో., ఇంత అసంబద్ధ అన్యాయమైన విషయాన్ని సభ్యసమాజం ఖండించాలి. ‘గుత్పలు ‘ అంటే ఏమిటో అర్థం చెప్పాల్సిన అవసరం  తెలంగాణ ప్రజలకు అక్కర లేదు.”1947 సెప్టెంబర్‌ 11వ తేదీన కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ విముక్తి కోసం సాయుధపోరాటానికి పిలుపునిచ్చింది. నైజాం సైన్యాలకు, రజాకారు ముఠాలను ప్రజలు సాయుధంగా ప్రతిఘటించడం ప్రారంభించారు. భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకున్న భూమిని, ప్రభుత్వ భూములను ప్రజలకు పంచే కార్యక్రమం, గ్రామరాజ్యాల ఏర్పాటు ప్రారంభమయినవి.” ఇట్లా పై మాటలతో పొంతన లేకుండా వ్రాశారు. వరంగల్‌ ప్రాంతానికి వీరు వచ్చిందే 1948లల్లో ఇట్లా వ్యక్తుల మీద తప్పుడు రిపోర్టులు పంపినారనడానికి ఇంతకన్నా సాక్ష్యమింకేం కావాలి? బహుశా ఆ రోజు, ఆ క్షణంలో వారు ఇచ్చిన ఆదేశాల అమలు జరపలేకపోయి వుంటారు. కానీ వారు ఇక్కడికి వచ్చేవరకే కొన్నిగ్రామాల్లో భూపంపిణీ ఉద్యమాన్ని రాఘవరావు జరిపారు. ప్రజా పోరాటాల భాగం లో తన యవ్వన కాలమంతా అడవులలో గడిపి, ఎన్నో ఉద్యమాలు చేసిన రాఘవరావు ఇట్లాంటి అభియోగాలను ఎదుర్కోవడం లో న్యాయం ఎక్కడున్నది? వాటి పర్యవసానాలను ఏమీ పట్టించుకోని రాఘవరావు నష్టపోయింది చాలానే అని పుస్తకాలు చదివాక తెలిసింది.అయినా సరే, ఇప్పటికి తెలిసిన విషయాలైనా వ్రాయాలని నిర్ణయించుకొని వ్రాసిందే ఈ పుస్తకం! దాదాపు 1932,33ల నుండే ప్రజాపోరాటాల్లో వుండి సాయుధుడై అద్భుత విజయాలు సాధించిన రాఘవరావు క్రిష్ణారెడ్డి గార్లు తాము ఇచ్చిన భూపంపకాల కార్యమాల డ్యూటీని సరిగ్గా నిర్వర్తించలేదని వ్రాయడం ఎంతవరకు సబబు? దాదాపు 15 ఏళ్ళు వీరికంటే ముందే పోరాటాల్లో పాల్గొంటున్నవారి గురించి ఈ విధంగా నిందలు వేశారంటే ఆశ్చర్యం, బాధ కలుగుతుంది.”మావి రికార్డులు ఏమీ లేవు. వున్న రికార్డులను తగులబెట్టడమే మా కార్యక్రమాలాయే ” అని నాతో, నేను తీసుకున్న ఇంటర్వ్యూ లో చెప్పిన బొమ్మగాని ధర్మభిక్షంగారి మాటలు గుర్తుకువచ్చాయి. ”అసలు మేము బ్రతుకుతామనుకున్నామా? రాఘవరావు గారి జీవితం, విశేషాలు అది ఒక మహాసముద్రం. దానికి న్యాయం జరగాలంటే ఒకరిద్దరు మాటలతో అయ్యేదిగాదు” అని చెప్తూ మద్దికాయల ఓంకార్‌ గారు కొన్ని సలహాలు ఇచ్చారు , నేను వారిని ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు. ఇవన్నీ చూస్తుంటే నేను రాఘవరావుగారి జీవిత విశేషాలను సమగ్రంగా తీసుకురావడం సాధ్యమయ్యే పనేనా అని ఆలోచించేలా చేశాయి.  ఎవరు వ్యక్తులను ఎక్కడెక్కడ ఎలా దెబ్బకొట్టాలని ప్రయత్నాలు చేస్తారో కదా!మా బాల్యమంతా రాఘవరావుగారి క్రమశిక్షణలో, శ్రమతత్వపు ఆలోచనలతో పెరిగింది. అబద్ధాలడవద్దు, అన్యాయం చేయవద్దు. తెలివిగా విజ్ఞానదాయకంగా మంచినడవడితో జీవించాలని నేర్పించారు. కమ్యూనిస్టు భావాలతో వున్న పెండ్యాల రాఘవరావు గారి భార్య , మా అమ్మ కౌసల్యాదేవి తమ పిల్లలను రాఘవరావుగారి ఆదర్శాలకనుగుణంగా తీర్చిదిద్దింది. క్రియాశీలక రాజకీయాల్లో నిలువలేకపోవడం వారి అసమర్ధతవల్లగాడు చుట్టూ వున్న వాళ్ళ దుర్మార్గపు ఆలోచనలవల్ల, ఒక ప్రణాళికతో ఆక్రమించే ప్రయత్నాలవల్ల అని అర్థమైంది.నిరంతరం ప్రజాసేవాభిలాషలో జ్వలించిన వారి ఆలోచనలు ఆదర్శవంతమైన జీవితపు వెలుగులు నేటి యువతరానికి, భావిభారతపౌరులకు తెలియజేయాలన్న సంకల్పంతో వ్రాయడం జరిగింది. పెండ్యాల రాఘవరావుగారి కన్న బిడ్డగా గర్వంగా తలెత్తుకొనగలుగుతున్నానని సవినయంగా తెల్పుతూ – నేను ఇందులో వ్రాయనివి, మీకు తెల్సినవి, ఆనాటి పోరాటాల విషయాలైనా, రాఘవరావుగారి వ్యక్తిత్వ విషయాలైనా తెలిసినవి వుంటే మాకు అందించాల్సిందిగా కోరుతున్నాను. ఈ పుస్తకాన్ని హృదయపూర్వకంగా స్వీకరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. _*_(పెండ్యాల రాఘవరావు జీవిత ప్రస్థానం’ అనే జీవిత చరిత్రను నేను తెలుగు అకాడమీకి వ్రాసిచ్చాను. 2014లో అకాడమీ ప్రచురించింది. నేను రాసిన చాలా భాగాలను తొలగించారు. నేను రాసిన ఈ ముందుమాటను కూడా అందులో ప్రచురించలేదు. ఆ జీవిత చరిత్రను ఇంకా పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉన్నదేమో !)( 2017 మార్చ్ నెలలో పెండ్యాల రాఘవరావు గారి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాము మేము . రాఘవరావు గారి సంతానం కొడుకులు కోడళ్లు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరం కలిసి. )

( మార్చ్ 15 పెండ్యాల రాఘవరావు గారి జన్మదిన సందర్భంగా)  

You may also like

Leave a Comment