Home కవితలు సరికొత్త పద్యాన్ని కానుకగా ఇస్తా

సరికొత్త పద్యాన్ని కానుకగా ఇస్తా

by Tellapuri Sudheerkumar

అప్పుడప్పుడు నాతో

రాత్రి వేళాకోలమాడాలనుకుంటుంది –

ఎంతకీ నిద్రపట్టనీయకుండా

నన్ను ఆటపట్టించాలనుకుంటుంది –

రెప్పలు మూయనీయకుండా

ఎన్నో తిప్పలు పెట్టాలనుకుంటుంది –

పట్టుబట్టి నన్ను ఓడించాలని

కుట్రలు పన్నుతూనే ఉంటుంది –

పిచ్చిపిచ్చి ఆలోచనలతో నన్ను

ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంటుంది –

కునుకు పట్టకపోతే

అటూఇటూ పక్కదొర్లుతూ

ఆకాశంలోని చుక్కలను

లెక్కిస్తూ ఉంటాననుకుందేమో ?

కాలాన్ని సైతం మరిపించే

కమ్మని కవిత్వంతో కరచాలనం

చేస్తానని దానికి తెలీదు కాబోలు –

పరాజయం పొందినవాడిలా

నిశీధిముందు చేతులు కట్టుకొని

నిర్దయగా లొంగిపోతాననుకుందేమో ?

ఆయుధాన్ని ఎక్కుపెట్టిన సైనికుడిలా

పుస్తకాన్ని చేత పట్టుకొని

కవిత్వపు తీరంవెంట పహారా కాస్తా –

కంటిమీద కునుకు పట్టనీయకుండా

నిశి నాతో తమాషాలాడుతున్నపుడు

అంధకారాన్ని ఉరితీసే వాక్యాల్ని ఆరగిస్తూ

తిమిరాన్ని తరిమేసే కవిత్వాన్ని

తిరగేస్తూ

రేయి చెంప ఛెళ్లుమనిపిస్తా –

సీసాలో దెయ్యాన్ని బంధించినట్టు

విర్రవీగుతున్న నడిరేయి భూతాన్ని

చెలరేగుతున్న కవితా పాదాల నడుమ

ఊపిరాడనివ్వకుండా చేస్తా –

ఆయువు తీరినవాడిని

అట్టడుగు మట్టిపొరల్లో పాతిపెట్టినట్టు

నాతో నాటకాలాడే నిశీధిని

కవన సౌధంక్రింద సమాధి చేసి

నడిరాతిరి నడిబొడ్డున నిలబడి

కవిత్వపు జెండాను ఎగరేస్తా

రేపటి ఉషోదయానికి

సరికొత్త పద్యాన్ని కానుకగా ఇస్తా ..!

 

You may also like

Leave a Comment