డాక్టర్ కొండపల్లి శేషగిరి రావు శతాబ్ది అవలోకనం
డాక్టర్ కొండపల్లి శేషగిరి రావు గారు బహుముఖ ప్రతిభాశాలియైన చిత్రకారులు. జనవరి 2024 నుండి జనవరి 2025 వరకు జరుగుతున్న వారి శతాబ్ది వేడుకల సమయంలో శేషగిరిరావు గారి జీవితాన్నీ, వారు కొనసాగించిన చిత్రకళావారసత్వాన్నీ మరొకసారి స్మరించుకుందాం. పురాణగాథల సాంప్రదాయక చిత్రకారులుగా శేషగిరిరావు గారు ప్రసిద్ధులు. కానీ విభిన్న కళారూపాల గురించీ, చిత్రకళాశిక్షణ గురించీ, సాంస్కృతిక పరిరక్షణ గురించీ, చిత్రకళాచరిత్ర గురించీ వారు చేసిన విశిష్టమైన కృషి మరింత ప్రాచుర్యం లోకి రావలసి ఉంది. తెలుగు తోపాటు ఆంగ్లం లోనూ వ్యాసరచన చేపట్టి ఉంటే శేషగిరిరావు గారి కీర్తి మరింత ఇనుమడించి ఉండేది. చిత్రమయి స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లో ప్రదర్శింపబడుతున్న వారి అరుదైన స్కెచ్‌లు, ఆయిల్ పెయింటింగ్స్, ఆక్వాటెక్స్చర్ పెయింటింగ్స్, చిత్రకళపై వారు రాసిన వ్యాసాలూ, పుస్తకాలూ ద్వారా శేషగిరిరావు గారి సమగ్రరూపం ఆవిష్కృతమవుతుందని ఆశించవచ్చు.
1924 జనవరి 27న తెలంగాణలోని మహబూబాబాదు జిల్లా పెనుగొండలో జన్మించిన కొండపల్లి శేషగిరి రావు గారు వరంగల్ లోని రామప్ప, వేయిస్తంభాల గుడి మొదలైన దేవాలయాల శిల్పకళా దర్శనం ద్వారా బాల్యదశ లోనే ప్రేరణ పొందారు. ఈ సంక్లిష్టమైన శిల్పాలు వారిలో కళాభిరుచిని మేల్కొలిపి, దక్షిణ భారత సాంస్కృతిక సంపదను పరిరక్షించటమే జీవితలక్ష్యమయ్యేలా పురిగొల్పాయి. అడవి బాపిరాజు, అంత్యాకుల పైడిరాజు, హెచ్.వి. రామగోపాల్ వంటి చిత్రకారులు లేపాక్షి మొదలైన శిల్పాల్లో దేశీయమూలాలను అన్వేషించుకుంటున్న సమయంలో శేషగిరిరావు గారు తెలంగాణ ప్రాచీన శిల్పకళాసంపదలోని కొత్త కోణాలను దర్శించటంలో నిమగ్నమయ్యారు.
కాకతీయ శిల్పకళాదృష్టినీ, తన సహజశైలినీ సమ్మిశ్రమం చేసుకుంటూ శేషగిరిరావు గారు ఒక విభిన్నమైన, ప్రాచీనతా సంకేతమైన, తనదైన చిత్రకళారీతిని ఏర్పరచుకున్నారు. మహాకవుల కలాల నుండి వారి కవితానుడికారం ప్రవహించినట్లే, శేషగిరిరావు గారి కుంచె నుండి ‘శేషగిరీయం’ వారి చిత్రరచనా నుడికారంగా జాలువారింది. మరుగునపడ్డ స్థానిక సంస్కృతిని వెలికితీయటంలో వారికి ఉత్తేజం; ఆ సంసృతిలో దృశ్యమానమయ్యే వైశిష్ట్యాన్ని కనుగొనటం వారికి ఆనందం. ఆయన చిత్రాలలోని భంగిమలు, హావభావాలు కాకతీయశిల్పం గురించి వారికి గల లోతైన అవగాహనను ప్రతిఫలిస్తాయి. శిల్పానుగుణమైన వారి చిత్రాల్లో ప్రాచ్యమైన తాత్వికతా, ఆధ్యాత్మికతా కలగలిసిన ఏవో అతీతభావనలు కనిపిస్తాయి.
ఆయన రచించిన “రూపరుచి” పుస్తకం భారతీయ కళా తత్త్వాలను వివరిస్తూ, ఉత్తర, దక్షిణ భిత్తి చిత్రాలను పోల్చి విశ్లేషిస్తుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర చారిత్రకస్థలాల్లోని హంపీ, లేపాక్షి, కాకతీయ శిల్పకళావైభవం శేషగిరిరావు గారి సురేఖ – I, సురేఖ – II గ్రంథాల్లో ప్రతింబింబిస్తుంది. ఈ గ్రంథాలు చరిత్రను నిక్షిప్తం చేయటమే కాకుండా సంప్రదాయాన్ని ఆధునికకోణం నుండి చూపిస్తాయి కూడా.
నకాషీ పటచిత్రకళను (Nakashi Scroll Painting) పునరావిష్కరించడంలో శేషగిరిరావు గారి కృషి చారిత్రాత్మకమైనది. తెలంగాణకు ప్రత్యేకమైన కుల పురాణ ప్రదర్శనా పరంపరతో ముడివడి ఉన్న కళ నకాషీ. ఆయన చేసిన పరిశోధన వలనా, ప్రచారం వలనా కనుమరుగవుతున్న ఈ కళారూపం పునరుజ్జీవితమైంది. తద్వారా ఆయనకు సాంస్కృతిక పరిరక్షకుడిగా గుర్తింపు వచ్చింది.
జానపదకళలను సంరక్షించడంలో శేషగిరిరావు గారు చేసిన ఇటువంటి తొలి ప్రయత్నాలే తెలంగాణ కళా వారసత్వంపై వారి భవిష్యత్ అధ్యయనాలకు పునాదిరాళ్ళయ్యాయి. పరిశోధనపై లోతైన ఆసక్తితో వారు చేసిన అనేక రచనల ద్వారా ఆంధ్ర, తెలంగాణా చారిత్రక పరిణామాలెన్నో వెలుగులోకి వచ్చాయి. ఈ రచనలు కొన్ని మాత్రమే ఆంగ్లంలో లభ్యమవుతూ, ప్రధానంగా తెలుగు భాషలోనే ఉండటం వలన, ఇతర భాషల పాఠకులకూ పండితులకూ చేరువ కాలేకపోయాయి.
పాఠశాల స్థాయిలో దీన్‌దయాళ్ నాయుడు గారూ, తరువాత సెంట్రల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, హైదరాబాద్ లో సుకుమార్ దేవ్‌స్కర్ గారూ శేషగిరిరావు గారికి తొలిగురువులూ, మార్గదర్శకులూ. తదుపరి మెహదీ నవాబ్ జంగ్ బహదూర్ గారి ఆశ్రయంలో, పర్యవేక్షణలో తన కళను తీర్చిదిద్దుకున్నారు. హైదరాబాద్‌లో మొహమ్మద్ జలాలుద్దీన్ గారి ఆధ్వర్యంలో వాష్ పెయింటింగ్ సాంకేతికతలు నేర్చుకున్న ఆయన, తరువాత శాంతినికేతన్‌లో నందలాల్ బోస్ వద్ద శిక్షణ పొందారు. ఇందరి శిష్యరికంలో ఆయన చిత్రకళలో పరిపూర్ణత సాధించారు. ప్రాచ్య తత్వశాస్త్రాలు పునాదులైన వారి బోధనలు శేషగిరిరావు గారి కళాప్రస్థానాన్ని అతిగాఢంగా ప్రభావితం చేశాయి. ప్రాదేశిక అస్తిత్వమూ, లోకప్రియత్వమూ ఒక ప్రత్యేకమైన మిశ్రణంగా రూపొంది వారి కళాత్మక హృదయంలో ఇంకిపోయింది. ఈ మిశ్రణ కారణంగానే శేషగిరిరావు గారి కొన్ని లాండ్‌స్కేప్స్ లో అతిప్రాచ్య శైలి కనిపిస్తే. మరికొన్ని కాన్వాస్‌లపై జాతీయ, ప్రాంతీయ నిర్బంధనలేవీ లేని సహజత్వం ప్రతిబింబిస్తుంది. ఈ రెండవ శైలి దేవీప్రసాద్ రాయ్ చౌదరి గారి ప్రభావం కావచ్చు.
చిత్రకళా కౌశలాన్ని పెంపొందించటం పట్ల ఉన్న అభిరుచి వలన శేషగిరిరావు గారు సుదీర్ఘకాలంగా జేఎన్‌టీయూ కళాశాలలో ఆర్ట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. వర్థమాన కళాకారులైన విద్యార్థులకు సంప్రదాయాన్నీ, సృజనాత్మకతనూ బోధించి రెండిటినీ స్వీకరించేలా ప్రోత్సహించారు. శేషగిరిరావు గారి చిత్రకళా వైదుష్యం తరగతి గదులకే పరిమితం కాలేదు. కళా, సౌందర్యశాస్త్రాల గురించి వారు చేసిన రచనలు అనేక పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. ప్రాచ్యమైన శైలీ, ప్రాంతీయమైన ప్రజాజీవితమూ శేషగిరిరావు గారి కుంచె నుండి కలగలిసి ప్రవహించి ఆయిల్ పెయింటింగ్స్ గానూ, వాల్ మూరల్స్ గానూ, ఆక్వా టెక్స్చర్ పెయింటింగ్స్ గానూ అందమైన చిత్రాలుగా ఘనీభవించాయి.
చిత్రకళా ప్రపంచంలో ప్రోగ్రెసివ్ వాదులు రివైవలిస్టు కళనూ, ఫార్మలిజం రూపంలో పాశ్చాత్య ఆధునిక చిత్రకళారూపాలు భారతీయ కళనూ కబళించటం గమనించారు శేషగిరిరావు గారు. అయితే నిజమైన ఆధునికతనూ, జాతీయతనూ ఈ నూతన కళారీతులు సమర్థవంతంగా ప్రతిబింబించలేకపోయాయని అభిప్రాయపడుతూ అదే విషయాన్ని తన వ్యాసాల్లో ప్రకటించారు. బహుశా ఇటువంటి భావనల వల్లనేమో ఆయన ఆనాటి నూతన విచారధారకూ, సౌందర్యదృక్పథానికీ దూరంగా ఉండిపోయినట్లు కనిపిస్తారు. అయితే, ఆయన వ్యాసాలు ఆ కాలంలోని సామాజిక పరిస్థితులనూ, హైదరాబాద్ స్కూల్ చరిత్రనూ, కళాకారుల జీవితాలనూ, పూటగడవని వారి జీవన పోరాటాలనూ వివరిస్తాయి.
పరిశోధనాత్మకమైన శేషగిరిరావుగారికి నాటి ప్రసిద్ధ కవులైన వానమామలై వరదాచార్యులు, దాశరథి, డా. సి. నారాయణ రెడ్డి మొదలైనవారితోనూ, వట్టికోట ఆళ్వార్ స్వామి వంటి సామ్యవాదులతోనూ సాన్నిహిత్యం ఏర్పడింది. వారి భావజాలాలూ, ఆదర్శాలూ శేషగిరిరావు గారి చిత్రాల్లో, రచనల్లో, జీవనశైలిలో ప్రస్ఫుటంగానే ప్రతిబింబించాయి. శేషగిరిరావు గారి ‘హరిజనోద్యమం’ పెయింటింగ్ ఇటువంటి ఆదర్శాల ప్రభావంతో సృష్టించబడిందే. ఆనాటి అమానుషమైన సామాజిక కట్టుబాట్లకు వ్యతిరేకంగా సున్నితమనస్కుడైన ఒక కళాకారుడి బలమైన ప్రకటనగా ఈ చిత్రం నిలుస్తుంది.
తనదైన శైలిలో పరిశోధనలు చేస్తూ, కళాభ్యాసం కొనసాగిస్తూ ప్రాచీనతలో నూతనకోణాలు దర్శించిన శేషగిరిరావు రావు గారు తన సంక్లిష్ట దృశ్య నిఘంటువు ద్వారా సామాజిక ప్రయోజనాలను సంకేతిస్తూ ఉధృతమైన చిత్రరచనలు చేశారు. రాజకీయంగా తనకు ప్రీతిపాత్రమైన జాతీయ కాంగ్రెస్ ద్వారా దేశస్వాతంత్య్రం కోసం కృషిచేశారు. ఎందరో ఆత్మీయ సహచరులు గల కమ్యూనిస్టు పార్టీ ద్వారా రజాకార్ల క్రూరత్వాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణా విముక్తి లోనూ తన వంతు పాత్ర పోషించారు.
తాను రాసిన నోట్సూ వ్యాసాల ద్వారానూ, జాతీయ, ప్రాంతీయ సాంస్కృతికతను పాన్-ఏషియన్ విశాలతతో సమ్మిళితం చేస్తూ ఒక ప్రత్యేక దృశ్య భాషను అభివృద్ధి చేయడం ద్వారానూ స్వదేశీ చైతన్య స్ఫూర్తిని రగిలించే ప్రయత్నం చేశారు డాక్టర్ కొండపల్లి శేషగిరి రావు గారు. ఈ విధంగా ప్రాంతీయకూ జాతీయతకూ పెద్దపీట వేస్తూ సాగించిన శేషగిరిరావు గారి కళాభివ్యక్తి వారినొక దార్శనికుడిగా, ఆలోచనాశీలిగా నిలబెట్టింది.
చిత్రకారుడిగా విశేష ఖ్యాతిని సంపాదించుకున్న శేషగిరిరావు గారు తన దీర్ఘకాలిక వృత్తిలో పౌరాణిక చారిత్రక సంఘటనలతో, దైనందిన జీవిత ఘట్టాలతో వెయ్యికి పైగా ‘మాస్టర్ పీసెస్’ సృష్టించారు. ఆయన చిత్రాలు ప్రపంచవ్యాప్తమైన, ప్రతిష్ఠాత్మక సంస్థల్లో, ప్రదేశాల్లో చోటు సంపాదించుకున్నాయి. హైదరాబాద్‌లోని సాలార్ జంగ్ మ్యూజియం, మైత్రీ వనం, భారతీయ విద్యాభవన్, అలాగే వాషింగ్టన్ డీసీ లోని భారత రాయబార కార్యాలయం, పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్ శ్రీ వెంకటేశ్వర ఆలయం కొన్ని ఉదాహరణలు.
JNAFAU కాలేజ్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ వారూ, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వారూ, శేషగిరిరావు గారి కుటుంబసభ్యులూ సంయుక్తంగా కొండపల్లి వారి చిత్రప్రదర్శన నిర్వహిస్తున్నారు. కళావిమర్శకుల, చరిత్రకారుల ప్యానెల్ చర్చలు ఈ ప్రదర్శనలో భాగంగా ఉండబోతున్నాయి. కాలేజ్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు వాష్ పెయింటింగ్ వర్క్ షాప్, చిత్రకళపై పత్రసమర్పణలూ నిర్వహిస్తారు. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ చిత్రకళారంగంలో శేషగిరిరావు గారి పాత్రనూ, స్వదేశీ ఆధునికతలో వారి ప్రాధాన్యతనూ స్మరించుకోవడానికి ఈ కార్యక్రమాలు వేదికగా నిలుస్తాయి.
ఈ శతజయంతి సందర్భంగా, డాక్టర్ కొండపల్లి శేషగిరి రావు గారి చిత్రకళా ప్రస్థానాన్నీ, సంస్కృతీపరిరక్షణనూ, సృజనాత్మకతనూ, సామాజిక సంస్కరణల పట్ల వారి నిబద్ధతనూ అక్షరీకరించటంలో భాగస్వాములం కావడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాము. శేషగిరిరావు గారి చిత్రాల ప్రదర్శన ఒక అసాధారణ కళాకారుడికి నివాళి మాత్రమే కాదు. చిత్రకళా చరిత్రలో ఆయన ప్రాముఖ్యతను మరోసారి స్మరించుకునే అవకాశం కూడా

17 comments
https://shorturl.fm/CWJ4t
https://shorturl.fm/23SSz
https://shorturl.fm/89uK8
https://shorturl.fm/msqzZ
https://shorturl.fm/QzbVb
https://shorturl.fm/mjVpk
https://shorturl.fm/sD0Uj
https://shorturl.fm/89w7P
https://shorturl.fm/nVclP
https://shorturl.fm/HYHcl
https://shorturl.fm/SJpCJ
https://shorturl.fm/3DoxB
https://shorturl.fm/Yc9QK
https://shorturl.fm/3Yplh
https://shorturl.fm/CgkSV
https://shorturl.fm/igyOq
https://shorturl.fm/pRX7y