మగతలో
కీప్యాడ్‌పై చెయ్యి పడింది
అల్లుకున్న
అక్షరాలు కవిత్వమైనై
హ్యాకరైనా
కంప్యూటర్లని చేధించగలడు
కాని
అంతరంగాన్ని కాదు
తిరిగిన దేశాలు
పాస్‌పోర్ట్ చూపింది
దేశానికెంత దూరమో
గుట్టు విప్పింది
హార్డ్‌వేర్ అంటే
పైన ఉండే తొడుగు
సాఫ్ట్‌వేర్ ప్రాణం
దానిదే అసలు అడుగు
హార్డ్‌వేర్ అంటే
కనిపించే దేహం
సాఫ్ట్‌వేర్ అంటే
పనిచేసే మంత్రం
ట్విట్టర్‌లో
పిచ్చికూతలు కనిపెట్టిందేమో
పిచ్చుక
అలిగి వెళ్ళిపోయింది!
కొన్ని పరిచయాలు
దూరమవుతాయి
వాడని
పాస్‌వర్డ్ మరచిపోయినట్టు
కన్నీళ్ళు
కాసేపట్లో ఆరిపోతాయి
జ్ఞాపకాలు
గుండెలో ఆర్కైవ్ అవుతాయి
గుండెల్లో
గుబాళించాలి ప్రేమ
అది గూగుల్లో
దొరకదు సుమా!
లెక్కలకే అయితే
క్యాలిక్యులేటర్ చాలు
ఎకసెక్కానికా
కంప్యూటర్?
లెక్కలు నేర్పింది
క్యాలిక్యులేటర్
లెక్కలేనితనం చూపింది
కంప్యూటర్
ఆశలకు కళ్ళెం
లేని మనిషి
అవుట్ ఆఫ్ మెమొరీ
ప్రోగ్రాం అవుతాడు
గూగుల్‌లో
అన్నీ దొరుకుతాయి
ఆమె దుఃఖానికి
కారణం తప్ప
నానా జంక్‌ను
నింపకు
చెత్తకుండీకి కూడా
సహనముంటుంది
నిన్న పనిజేసింది
నేడు బెడిసికొట్టింది
సాఫ్ట్‌వేర్ కూడా
బంధాల మాదిరే!
యంత్రాలకు
మాటలు నేర్పుతారు
ఇంట్లోవారితో
మౌనవ్రతం
రాసింది ప్రింట్ తీసావా?
ఫాంటు మారకపోతే
అందరి చేతిరాత
ఒకటే
రోజు కూలీకి ఎక్కువ
వెట్టి చాకిరీకి తక్కువ
ఇదండీ
సాఫ్ట్‌వేర్ ప్రపంచం
వర్షం కురిస్తే
పంట నవ్వుతుంది
వర్షన్‌తో సాఫ్ట్‌వేర్
మెరుగవుతుంది
సాఫ్ట్‌వేర్ పరిమళం
ఎంత గొప్పదో!
మొగ్గలు కాదు
అవి బగ్గులు
కుడికాల వంశీధర్
4 comments
Excellent poem
నేను రాసిన “సాఫ్ట్‌వేర్ నానీలు” మయూఖ అంతర్జాల మాస పత్రికలో ప్రచురించిన డా॥ కొండపల్లి నీహారిణి గారికి హృదయపూర్వక ధన్యవాదలు
– కుడికాల వంశీధర్ (సరోజనార్ధన్)
నేను రాసిన “సాఫ్ట్‌వేర్ నానీలు” మయూఖ అంతర్జాల మాస పత్రికలో ప్రచురించిన డా॥ కొండపల్లి నీహారిణి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు
– కుడికాల వంశీధర్ (సరోజనార్ధన్)
ధన్యవాదాలు సంతోష్‌గారు
– కుడికాల వంశీధర్ (సరోజనార్ధన్)